నిన్న రాతిరి కలలో ఓ మల్లెపువ్వు,
కాదు అందాల చందమామ,
కానే కాదు, నాకు పుట్టబోయే చంటిపాప.
నా చెంప పై తన గులాబిరేకుల పెదాల తడి
ఇదిగో ఇంకా అలానే వుంది.
బదులుగా నేనేమివ్వాలి? ఏదైనా చేస్తా.
నా దగ్గరున్న కరెన్సీ పావురాల్ని పంపి
తను ఏమి కావాలన్నా తెస్తా.
ఇంతకీ తనకేం కావాలో?
ఆశగా తన కళ్ళ లోకి చూసా.
చిన్ని చిన్ని తేనె కళ్ళలో
కోటి చందమామల వెలుగు.
ముద్దు ముద్దు మాటల్లో ముత్యాల మూటలు
జారితే ఏరుకోడానికి సిద్దపడ్డా.
“నాకు ఏం కావాలంటే?..
గున్నమావితోపులో కోయిలమ్మ పాట,
సన్నజాజి పందిరిపై వెన్నెలమ్మ,
కనకాంభరం పూలలోని తేనె,
పేదరాశి పెద్దమ్మ కధలు,
గుడుగుడు గుంచం ఆటలు,
పెరటి లోన పెంచుకున్న జామకాయ,
ఊరి చివర తోపులోని చింతకాయ,
సాయిబుతాత గుఱ్ఱపు సవారి,
చిట్టి పొట్టి పట్టు పరికిణీ.
బంగారు చింత చిగురు పట్టీలు,
రాజ్యం పిన్ని జడగంటలు,
బామ్మ చేతి రవ్వలడ్డు,
తాతయ్య ఏనుగు అంబారీ
ఒక్కటైనా తెచ్చివ్వు” అంది గోముగా.
నిస్సార జీవితం లో నిస్సహాయతండ్రి.
“పిచ్చితల్లీ, ఈ కాంక్రీటు వనాల్లో ఉండేవి
ప్లాస్టిక్ ముఖాలు, ఫైబర్ మనసులు…”
వెంటనే ఆ చిన్ని కళ్ళలో నీటి తడి.
అమ్మో! ఏడవకు తల్లీ.
నా వద్ద ఉన్నదంతా ఇచ్చి,
ఒక్కటైనా తెచ్చిస్తా చిట్టితల్లీ.
బజ్జోనాన్న కన్నా లాలీ జో.
చాలా బా రాసారు మురళి గారు.అసలు ఎలా రాసారు ఇలా.
బావుంది. మీనూకి అనిపించినట్టే నాకూ అనిపించింది 🙂
పాప కోరినవి కాంక్రీటు వనాల్లోనే కాదండి ఇప్పుడు పల్లెసీమల్లో కూడా దొరుకుతాయంటారా ?
మలేమో నాకు చింత చిగురు పట్టీలు.కావాలి…
నాకు కావాలి కావాలి కావాలి అంతే…
పాయింట్ బాగానే ఉంది కానీ పద్యంలా చెప్పటానికి పడ్డ తాపత్రయమే బాలేదు. ఈ మధ్య చాలా మంది బ్లాగర్లు వచనాన్ని వాక్యానికో లైను కింద విడగొట్టి అదే పద్యమనుకో పోండన్నట్లు మా మొహాన కొడుతున్నారు. You too, Murali!?!
పాప కోరిన అవన్నీ ముందు ముందు పుస్తకాలలోనే చదువుకోవాలేమో ననుకుంటే దిగులుగా ఉంది.
అబ్రకదబ్రగారు,
అలా బెదరకొట్టేస్తారేమిటి సారు.
కవితలో కొన్ని అందమైన పదచిత్రాలున్నాయి చూడండి.
గులాబిరేకుల పెదాల తడి
కరెన్సీ పావురాల్ని
ప్లాస్టిక్ ముఖాలు, ఫైబర్ మనసులు…
మొత్తం కవితను ఒక సటైరికల్ పొయం గా భావించుకోవచ్చనుకుంటాను.
బొల్లోజు బాబా
వచనమైతే ఏముందండి చదువుతుంటే బాగుంది అనిపించినప్పుడు.ఒక అందమయిన అనుభూతినో,ఆహ్లాదకర భావనో,ఒక ఆలోచనో…. ఇవే కవితకు గమ్యం అనిపిస్తాయి నావరకు. నాకు మీ కవిత నచ్చిందండి.
అందరికి ధన్యవాదాలు. అబ్రకదబ్రగారి వ్యాఖ్యలు చూసిన తరువాత కొంత సేపు ఆలోచించా. మురళీ నువ్వు కూడానా? అని ఆయన చూపించిన అభిమానానికి ధన్యుడ్ని.నిజానికి ఇందులో నేను వాడిన పదాలు గాని, భావాలు గాని అలా అలవోకగా ఒక ప్రవాహం లా అప్పటికప్పుడు స్పందనగా వచ్చినవే తప్ప నేను తాపత్రయ పడిన పదజాలం గాని విరుపులు గాని లేవు. అసలు నేనొక కవిత రాస్తున్నానో, వచనం రాస్తున్నానో ఆలోచించి రాయలేదు. నా మనసు స్పందనని అక్షరబద్దం చేద్దామనే గాని అది ఏ రూపం లో అనేదాని మీద నాకు ఆంక్షలు లేవు. కేవలం అబ్రకదబ్ర గారేనా మిగిలినవారు కూడా ఇలానే స్పందిస్తారా అన్న సందిగ్ధం లో నేను ఏ వ్యాఖ్య రాయకుండా వేచి చూసా.
బ్లాగుల్లో ప్రముఖులు, పండితులు ఉన్నారు. వారు నా రాతలు చూసి ఇబ్బంది పడితే క్షమించాలి. ఒక్క విషయం నేను చెప్పలి. నాకు నిజానికి భాష మీద పట్టు గాని, పదాల అల్లిక లో ప్రావిణ్యం, సాధికారత గానీ లేవు. కవిత కి, వచనానికి ప్రామాణికత ఏంటి రెంటిని విభజించే లక్షణమేంటి అన్నదాని మీద అవగాహన లేదు. నాకు తెలిసినది ఒక్కటే నా మనసులోని భావాల్ని నాకు చేతనయినంత వరకు అందంగా అక్షరబద్దం చేయటం. అసలు నా బ్లాగు పేరే “మురళీగానం, అడవిలోని వెదురు పలికే స్వరాలు”. స్వరాలు,రాగాలు తెలియని వెదురు లో తుంటరి గాలి దూరి ఎవో అల్లరి స్వరాలని పలికిస్తుంది. అలానే నా మనసు లో కలిగే స్పందనలకి నేనిచ్చే రూపం ఈ టపాలు.
పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం