అర్దరాత్రి ఎనిమిది గంటలయ్యింది. అందులోనూ ఆదివారమో ఏమో నేను మంచి శవాసనం లో ఉన్నా. సెల్లుఫోను నిద్రలేచి గోల చేస్తుంది. మా ఇంటిలో వాళ్ళు నిశాచరుల్లా అప్పుడే 6 గంటలకి లేచి పనులు చేసుకుంటున్నారు. సెల్లుగోల నా చెవిన పడితే నా నిద్ర పోతుందని మా మమ్మీ వంట చేస్తున్నది కాస్త పరుగున వచ్చి అందుకుంది. ఫోను ఎత్తిన 2 నిమిషాలకి కెవ్వుమని కేక వేసి అమ్మా ఇలా రా అంటూ మా అమ్మమ్మ ని పిలిచింది. ఆ దెబ్బకి నేనే కాదు ప్రక్కవీధిలో అప్పుడే పోయిన పంతులుగారు కూడా ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు. ఎమయ్యిందో అర్దమయ్యేలోపే మరో కెవ్వు. మా అమ్మమ్మ ఈ సారి నాకు గూబలు అదిరిపోయి దిండు తో చెవులు మూసుకున్నా. పంతులు గారు ఈ సారి జడుసుకొని పడి ‘పోయారు ‘. ఇంకో కెవ్వు పంతులు గారి కుటుంబ సభ్యులు. ఇన్ని కెవ్వులతో లేచాను ఈ రోజు ఎదో మూడింది అనుకున్నా. తాపీగా కాఫీ త్రాగుతూ అడిగా ఈ కెవ్వులకి మూలం ఏంటని. మరలా మా అమ్మమ్మ ఎదో అరిచేదానిలా హావభావాలు పెట్టింది. నేను దడుచుకొని మూల దాక్కున్నా. మా మమ్మీ కాస్త స్థిమిత పరిచి విషయం చెప్పింది బందరు మామయ్య వస్తున్నాడు రా. అమ్మమ్మ చేసే బందరు లడ్డూ తప్ప బందరు మామయ్య ఎవరో తెలియదు నాకు. మా మమ్మీ ప్రోద్భలంతో నా కళ్ళ ముందు రింగులు తిరుగుతున్నాయి, సీలింగు మీద ఫ్యానులా.
నేను పుట్టక మునుపు 30 ఏళ్ళ క్రితం, అంటే బ్లాక్ & వైట్ కాలం రింగులు తిప్పుకుంటున్నారా? అలా అనుకున్న వాళ్ళంతా పప్పులో కాలేసినట్టే. అప్పుడు కూడా చెట్లు పచ్చరంగులోనే ఉండేవిట, మనుషులు రంగుల బట్టలే వేసుకుండే వారు ‘ట ‘ . కాబట్టి మీకు పూర్తి రంగుల ప్రపంచం ఊహించే అవకాశం ఉంది రెచ్చిపొండి. మా అమ్మకి పెద్దన్నయ్య ప్రకాశం మంచి చురుకైన కుర్రాడు. ఊరిలో అందరి సమస్య లని పట్టించుకొనేవాడు (దూరేవాడు.). అందుకే తనని అందరూ అభిమానం తో బలదూర్ అని పిలిచేవారు. అప్పటిలోనే అభ్యుదయ భావాలతో పక్కవారి పొలం లో చెరుకులు, తోటల్లో మామిడి కాయలు కోసుకొచ్చి తన బ్యాచ్ కి ఇచ్చేవాడంట. ఒకసారి బెల్లం చేస్తుంటే తేవటానికి వెల్లి కంగారు లో ఏదో తన్నేస్తే గుడిసె మొత్తం తగలబడిపోయిందంట. దానితో అటునించటే ఊరొదిలి పారిపోయాడంట. పోయి బందరులో ఉన్న ఇద్దరుపెళ్ళాల షావుకారు దగ్గర పనికి కుదిరాడు. అలా బందరులోనే ఉండిపోయి బందరు మామయ్య అయ్యాడు. మామయ్య చేరిన కొన్ని రోజులకే షావుకారు గారి మొదటి పెళ్ళం పోయింది అవిడే వండిన ఉప్మా తిని. రెండో పెళ్ళాం తప్పిపోయింది (పాలవాడితోనో? పూలకొట్టు వాడితోనో?) ఇద్దరికీ పిల్లలు లేరు షావుకారు గారుకూడా మూడో పెళ్ళి కోసం పెళ్ళి చూపులకి వెళ్తూ కారు కి అడ్డంగా గేదెలు రావటంతో రోడ్డు ప్రక్కన చెట్టుని గుద్ది పోయారు.వారసులు లేని ఇంటికి వాసాలుపట్టుకొని వేలాడినందుకు మా మామ్మయ్య పంట పిచ్చిగడ్డి పండినట్టు పండింది. అయినా ఇంకా బందరు చూరు పట్టుకొనే వేలాడుతున్నాడు. మధ్య లో ఒకటి రెండుసార్లు పెళ్ళిలకి,పేరంటాలకి వచ్చేవాడంట. ఒక్కగానొక్క కూతురున్న తిక్కశంకరయ్య కూతుర్ని పెళ్ళి చేసుకొని తన అంతస్థు పెంచుకున్నాడు. పెళ్ళి తరువాత పూర్తిగా రావటమే మానేసిన మామయ్య ఇన్నాళ్ళకి వస్తున్నాడు. అది కెవ్వుల కధ.
మామయ్య కి ఒక్కగానొక్క కూతురు తన పెళ్ళి విషయం మాట్లడటానికి వస్తున్నాడంట.
“మనూర్లో ఎవరున్నారే “అన్నా.
“నువ్వేరా బడుద్దాయి” అంది అమ్మమ్మ.
అంత డబ్బున్నవాడు నాకెందుకు పిల్లనిస్తాడు అని నాకు అనుమానం. తెగిన బంధుత్వం కలుపుకోటానికి అని వచ్చింది సమాధానం.
నాకు ఇప్పుడు కొంచెం సిగ్గు మొదలయ్యింది. “పేరేమిటో?” నేను సిగ్గుపడుతుంటే నాకే ఏదోలా ఉంది.
“గజాల” చెప్పింది అమ్మమ్మ.
హ.. పేరు గజాలాన. సూపర్. ఆ రోజు రాత్రి కలలో “నన్ను ప్రేమించే మగవాడి వి నువ్వే అని, చేయి కలిపే ఆ మొనగాడివి నువ్వే అని”
మంచం మీద డిస్కోడాన్స్ చేయటం మొదలుపెట్టా. గజాల ఐస్ క్రీం తిందువు రా అంటే తీసుకోబోయా. దబ్ కళ్ళు బైర్లు కమ్మాయి మంచం క్రింద అమ్మమ్మ మీద పడ్డా. అమ్మమ్మ ఒక మొట్టికాయ వేసింది. లేచి మంచం మీద పడుకున్నా.
మరలా గజాల “అప్పుడే ఏం పడుకుంటావ్ లే మరో పాట వేసుకుందాం అని పిలిచింది.”
“నేను ఊహూ..అమ్మమ్మ” అన్నా. తనుమాత్రం “నో. అని ఆకాశం తనరెక్కలతో నను నిద్దురలేపి..”‘ అని నాకు నిద్ర లేకుండా చేసింది.
తెల్లారే సరికి అమ్మమ్మ 10 కేజిల సున్నిపిండి తెప్పించింది. ఏవన్నా పిండి వంటలు చేస్తున్నారేమొ మామయ్యకోసం అనుకున్నా. కానీ నా కాళ్ళు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి మమ్మీ,అమ్మమ్మ, మా పనోడు అందరు కలిసి ఉదయాన్నెప్పుడో మొదలుపెట్టి లంచ్ టైం లో వాళ్ళకి ఆకలివేసే దాక తోలూడీపోయినా ఆపకుండా తోమారు. నేను అప్పటికి చాలా సేపటి క్రితమే అపస్మారక స్థితిలోకి పోయా. వాళ్ళు వదిలేసాక హమ్మయ్య అనుకున్నా. నా కట్లు విప్పితే ఒక్కొక్కర్ని కండలూడేలా కరిసి చంపేద్దామని సిద్దంగా ఉన్నా. వాళ్ళకి అనుమానం రాకుండా పడుకున్నట్టే నటించా. అయినా వైయస్ ముందా ఇందిరమ్మ భజన. మా అమ్మమ్మ నా కుతంత్రం పోల్చేసి, కట్లు విప్పకుండా రకరకాల ఆయుర్వేదిక మూలికలు కలిపి చేసిన ఏదో పధార్దాన్ని భోజనం పేరు తొ నా నోట్లో కుక్కేరు. అప్పటికి నీరసంగా ఉన్నా వద్దంటే పోతా అని కళ్ళు మూసుకొని మింగేసా. అలా కట్లతోనే పడుకున్నా. కాసేపయ్యాక కళ్ళు తెరిస్తే రాంగోపాల్ వర్మ సినిమా లో కెమెరా ముందే ముఖాలు పెట్టుకు కూర్చున్నా దెయ్యాల్లా ముగ్గురూ మరో 5 కేజీల సున్నిపిండి తో. రాత్రికి క్షురకర్మ కూడా పూర్తిచేసాక నా కట్లు విప్పారు. అంతే శివపుత్రుడు లో విక్రం లా మీదపడ్డా. అమ్మమ్మ గజాలా వద్దా నీకు అని బెదిరించింది. “ఒకే ఒక క్షణం చాలుగా .. ప్రతీ కలా నిజం చేయగా” అంటూ గజాల నా ఊహల్లో. చేసేది లేక అరవటానికి ఓపిక లేక మూలపడుకున్నా. అటూఇటూ కదలినా నొప్పి గా వుంది అందుకే ముడుచుకొని మంచం మీదకాకుండా ఓ మూల పడుకున్నా.
తెల్లవారగానే కొత్తబట్టలు కొనుక్కోమని ఒకటేగోల మొదలుపెట్టారు. సరే అని ఏ.టి.ఎం కి వెళ్తే అది పనిచేయటం లేదు. మా ఊరిలో క్రెడిట్ కార్డ్ కి పేకముక్క కి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు. ప్రక్క ఊరిలో ఉన్న ఏ.టి.ఎం కి వెళ్దామని నా పంచకల్యాణి రెండేళ్ళ క్రితం కొన్న బైక్ తీసి “మేరా సప్నోంకి రాణీ కబ్ ఆయోగి తు..” అని పాడుకుంటూ బయలుదేరాను. నేను బైక్ మీద వెళ్తున్న సంగతి ముందే తెలిసిన నా పాత స్నేహితుడు నా కన్నా ముందే కారు లో వెళ్ళి దారిలో నాకోసం చూస్తూ కూర్చున్నాడు. వాడి పేరు శనిగాడు. సరిగ్గా రెండు ఊరులకి మధ్యన అంటే ఎటువైపు బండి నడుపించుకుని పోవాలన్న మా తాతమ్మగారో జేజమ్మగారో పైలోకం నించి వచ్చి నన్ను పలకరించి ప్రోత్సహించాలి అని పూర్తిదా రూఢి చేసుకున్నాక పరిగెడుతున్న నా పంచకల్యాణి పెద్దగా సకిలించి ఆగిచచ్చింది. నా పాట్లు చూసి త్రివిక్రం సినిమా చూసినంత హాయిగా నవ్వుకొని నా మితృడు నా లాంటి మరొ దరిదృడిని కలవాటనికనుకుంటా ప్రత్యేకమైనా విమానం లో బయలుదేరి వెళ్ళిపోయాడు. షరా మాములే నేను బండిని తోసుకుంటూ “కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని” అని పాడుకుంటూ వెళ్ళిపోయా. వెళ్ళి నా కార్డులో డబ్బులుకాక, క్రెడిట్ కార్డులో డబ్బులు కూడా మొత్తం గీకేసి తెస్తే బట్టలు, జోళ్ళు, కళ్ళ జోళ్ళు, నిశ్చితార్ధానికి ఉంగరం, స్వీట్లు,మన్ను,మషానం అన్ని కొనిపించారు.
మామయ్య వచ్చేరోజు వచ్చింది. అప్పటికే ఆఫీసుకి సెలవుపెట్టి వారం రోజులు పూర్తయ్యింది. మా వాళ్ళు తోమిన తోముడికి గేదె కూడా ఆవులా అవ్వాల్సిందే. ఇక ఆయుర్వేదిక మందులతో కూడిన తిండి, ఆకు కూరలు, పళ్ళు తినిపించి ఉపవాసం మహాయోగం అనిపించేలా తయారు చేసారు. ఇదికాక రోజు రాత్రి పడుకొనే ముందు మామయ్య కూతురు నిన్నుగాని చేసుకుంటే నీ జీవితం పుల్లరెడ్డి నేతిమిఠాయి గంపలో పడ్డట్టే అని చెవిలో అపార్ట్ మెంట్లు కట్టుకొని మరీ పోరారు. ఇప్పటికి నాకు అర్ధమయ్యింది మాత్రం గజాల నా బంగారు బాతు. మామయ్య వస్తాడని ముందే లేచి వెంకటేశ్వరస్వామి కోవెలకి వెళ్ళి పూజచేసి, చెవిలో పువ్వు పెట్టుకొని వచ్చా. మమ్మీ,అమ్మమ్మ అయితే ఆ రోజంతా ఉపవాసం ముందే అనుకున్నారు. ఇవికాక పెళ్ళి కుదిరితే మా ఇంటిల్లపాది సాముహికంగా గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నారు. నా గుండెళ్ళో రైళ్ళు పరిగెట్టడం మొదలయ్యింది. ఈపాటికి గోదావరి వైజాగ్ వచ్చే ఉంటది అనుకున్నా. ఇంతలో ఫోను వైజాగ్ లో దిగాం టాక్సీ లో వస్తున్నాం అని. టాక్సీ మా ఊరికి రావటానికి 3 గంటలు పడుతుంది. కృతయుగం, త్రేతాయుగం,ద్వాపరయుగం అన్నమాట సరే. టి.వి. పెడితే దానిమీద మనసుపోవటం లేదు. పల్నాటి బ్రహ్మన్నాయుడు సినిమా చూస్తున్నా నాకు కామెడీగా లేదు. పేపరు చదువుతున్నాసరే గోడమీద వాచీనే కనబడుతుంది. అలా ఇంటిల్లా పాది ఒకేసారి అమ్మవారి గుడి ముందు నిప్పులు తొక్కినట్టు అటూఇటూ తిరుగుతూ కారుకోసం చూస్తున్నాం. నా జీవితంలో జాబ్ కోసం కూడా ఇంతలా ఎదురుచూడలేదు.
బయట హారన్ వినిపిస్తే పరిగెట్టి వెళ్ళి చూసా ఎదురింటికి ఎవరో వచ్చారు. అలా రెండుసార్లు హారన్లు వెక్కిరించాక ఇకబయటకి పోవటం మానేసా. ఇంకో హారన్ వినిపిస్తే మెల్లగా వంగుని చూసా ఎదురుగా కారు పరిగెట్టి వెళ్ళా “సుబ్బారావు ఇల్లేక్కడండీ ” అని అడిగాడు డ్రైవర్. “వాడు ఇల్లెక్కడు తాటిచెట్లెక్కుతాడు తాగుబోతు వెదవ” అని తిట్టిపంపించేసా. ఇక నాకు ఓపిక లేక వాకిట్లోనే కూలబడ్డా. పెద్ద శబ్దం చూస్తే పూలకుండి పగిలిపోయింది ఎవరిదో కారు గుద్ది. అమ్మమ్మ తిట్లు మొదలెట్టి పరుగున బయటకి వచ్చింది. కారు లోంచి సూటేసుకొని గుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొన్న ఎలుగుబంటి దిగింది.
“ఏరా పెద్దోడా వచ్చేసావా?” అన్న అమ్మమ్మ పొలికేకకి ఇంటిల్లపాది రోడ్డున పడ్డారు అనగా బయటకి వచ్చారు. నా దృష్టంతా వెనుక డోరు వైపే ఉంది. ఇంతలో పరాయిదేశం లో పని ముగించుకొని విమానం లో సరాసరి ఇక్కడే ల్యాండయిపోతున్నాడు నా మితృడు. ఈ ఒక్కసారికి వదిలెయిరా కావాలంటే మరలా రేపు బైక్ మీద వెళ్ళేప్పుడు కలుసుకుందాం అని ప్రాదేయపడుతున్నా. ఇంతలో తలుపు తీసుకొని కాలు కిందపెట్టింది. మా వాడు పైనుంచి నవ్వాడు. జన్మ లో ఎప్పుడూ లేనిది జపాన్ లో వచ్చినట్టు భూకంపం. రేయ్ ఈ రోజు నా చేతిలో నువ్వయిపోతవ్ రోయ్ అన్నా. వాడు మాత్రం నవ్వటం ఆపలేదు. ఇంతలో కారులోంచి ఎవరొ దిగి కారు తలుపువేసిన శబ్దం చూస్తే ఎదురుగా చీకటి కారుమాత్రం కనిపించటం లేదు. తలుపేసిన చప్పుడుకో ఏమిటో మా మమ్మీ, అమ్మమ్మ కిందపడిపోయారు. కళ్ళు తడుముకుని చూసా ఎదురుగా 70 ఎం ఎం లో నల్ల డ్రెస్సువేసుకున్న గున్న ఏనుగుపిల్ల. కెవ్వుమని అరిచి ఎగిరిపడ్డా. బావా ఐ లవ్ యూ అంది గజలక్ష్మి (ముద్దుగా గజాల).ఈ దెబ్బకి ఏకంగా మూర్ఛపోయాను. పక్కింటోల్ల బాతు దారిలో అడ్డంగా ఉన్న నా నెత్తి మీద దూకి ఒకటి,రెండు చేసి “క్వాక్..క్వాక్..” అని వెక్కిరించి వెల్లిపోయింది. పైన విమానం లో ఆ వెధవ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.