జీవితంలో మనం ఎప్పుటికీ మరచిపోలేని రోజులు, క్షణాలు అందరికీ ఉంటాయి, ఉండాలి. నిన్నటి రోజు నా జీవితం లో ఒక మధురమయిన రోజు. నా చెవులకి పరిచయమున్న ఒక పాటని నా కళ్ళకి పరిచయం చేద్దాం అని వెళ్ళి, ఆ మకరంద స్రవంతిని నా హృదయం నిండా నింపుకున్నా. కానీ తన్మయత్వంలో నా హృదయాన్ని అక్కడే వదిలేసి వచ్చా. మరలా వెళ్ళి తెచ్చుకుందామంటే ఈ సారి ఆత్మనో, అస్థిత్వాన్నో వదిలేసి వస్తానేమోనన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నా. మీలో ఎవరయినా గజల్ శ్రీనివాస్‌ని ఎరిగుంటే దయచేసి కాస్త నా హృదయాన్ని తెచ్చిపెట్టండి.

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్
గజల్ శ్రీనివాస్ నిజానికి ఒక వేటగాడు. నిజం నమ్మరా? ఒక్కసారి అతన్ని కలిసి మాట్లాడండి మీకే తెలుస్తుంది. వెంటాడి, వెంటాడి భందిచేవాడ్ని వేటగాడు అనికాక పాటగాడని ఎలా అనుకోమంటారు? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో, గజల్‌తో వెంటాడుతారు. అందుకేనేమో ఆయనే అన్నారు “నా గజల్‌కి కత్తికున్నంత పదునుంది కాదంటారా” అని. ఎలా అంటామండీ ఆయన గజల్‌కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే. ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే. కాదు కాదు నాకు క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, పదే పదే మీ వద్దకు రాలేనుగా అన్నా. పదే పదే వెళ్ళలేకపోయినా కాశీ వెళ్తే మాత్రం గంగలో ఒక మునక వేస్తాం. అదే ఇంటిముందు పారితే గుడ్డలుతుకుతాం కాదంటారా అన్నారు. ఏమంటాం నవ్వాపుకోవటానికి, ఆ మాటల్లో లోతైన భావాలను అర్ధంచేసుకుని తేరుకోవటానికే చాలా టైం పట్టింది. ఆయన మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు. కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు. తన గజల్‌లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు. ఆపైన ఆరగించని వాడు, అరిగించుకోని వాడు శుద్ద వెధవాయి అని నే వేరేగా చెప్పాలా?
ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు ఏది మాటో ఏది పాటో తెలియలేదు. ఎందుకంటే ఆయన మాటలు, పాటలు మమేకమయిపోయి ఆ గాత్రం లో ఏంవిన్నా మాకు శ్రావ్యంగానే ఉంది. పైగా బొత్తిగా సంగీత ఙ్ఞానం లేదాయే. నావరకు చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే ఆయన మాటయినా, పాటయినా. పైగా పాట అంటే స్వరాలు, అనుస్వరాలు, సంగతులు కాదు. సాహిత్యాన్ని స్పష్టంగా శృతిలో శ్రావ్యంగా సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి అంటారాయన. ఆయన చెప్పేది ఒక్కటే తాన్‌సేన్‌లా రాగాలాపన చేయండి, లేదా వాగ్గేయకారుల్లా కీర్తనలు పాడండి. అంతేగానీ మహానుభావుల సంకీర్తనలను రాగాలతో కలిపి ముక్కలు చేసి, సాగదీసి హింసిచవద్దు. బొత్తిగా స్వర ఙ్ఞానం, సంగీత ఙ్ఞానంలేని నాకు కూడా ఆయన భావం అర్ధమయ్యింది, తిరిగి వ్రాయగలుగుతున్నా. అది ఆయన మాటల్లో వివరణలో ఉన్న శక్తి, సామాన్యుని హృదయానికి సహితం పట్టుకుంటుంది. అందుకేనేమో ఆయన అంటారు పిల్లల్ని ప్రతి తల్లిడండ్రులు బుర్రతో చదవమంటారు కానీ దయచేసి ఇకనుండి హృదయంతో చదవమని చెప్పండి అని. పిల్లలు అంటే ఆయనకి ఎంత ప్రేమో నిన్న ఆయన్ని చూసాక అర్ధమయ్యింది. మాతో మాట్లాడుతూనే, మధ్యలో వచ్చిన వాళ్ళ పాపని ముద్దు చేస్తున్నారు. తన వారసురాలింక ఆ పాపే, పేరు సంస్కృతి. నేటి ఆధునిక సమాజంలో పెద్దలు పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారో ఆలోచించుకోండి అని సూటిగా ప్రశ్నిస్తారాయన. రోజులో పిల్లలతో మాట్లాడేది కేవలం గంట సమయమే అయితే 16-20 ఏళ్ళల్లో ఎన్ని గంటలు గడపగలం? అటువంటప్పుడు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అంటారు. బయటకి వచ్చి మాకు వీడ్కోలు పలికి తిరిగి వెళ్తూ అక్కడ ఏడుస్తున్న ఎవరో చంటి పాపని బుజ్జగించి ఇంటిలోకి వెళ్ళరాయన. అదిచూసి అనిపించింది మాటల్లో ఏం చెబుతారో అది ఆచరించే వ్యక్తి అని.
మాటల్లోనే కాదు పాటల్లో ఏం చెబుతారో అదికూడా ఆచరిస్తారు. ఎప్పుడో జనాభా నియంత్రణ గురించి పాట పాడిన ఆయన అది తనజీవితంలో విధిగా ఆచరించి చూపించారు. అందుకే ఒక్క సంతానానికే పరిమితమయ్యారు. ఆయన అమ్మ గజల్‌తో, అమ్మ ని అమ్మగా ప్రతీ ఆంధృనికీ పరిచయం చేసేదాక నిదుర పోలేదు. నాన్న గజల్‌తో, తెలుగునాట ప్రతి తండ్రీ పూజింపబడేలా చేసారు. తెలుగు గడ్డని వదిలి వెళ్ళిన తెలుగు వాడ్ని “ఓనమాలు దిద్దిన బడి శిధిలమవుతూ, నిన్ను సెలవడిగింది” గజల్ తో పిలిచి, ఆ రాముని గుడి, నీవు నడిచిన వీధిరోడ్డు నీ క్షేమం అడిగాయని కలవరపరచి ప్రవాసాంధ్రులను ఇంటికి రప్పించారు. జీవనసమరంలో పట్టణాలకు వలసపోయిన నాలాంటి వారిని కూడా విడిచి పెట్టలేదు “ఒక్క సారి ఊరుపోయి రా” అన్న గజల్‌తో తెలియని అలజడి కలిగించారు. తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్లో,జీవన విధానంలో ఆయన గజల్ స్పందించని అంశాలు గానీ, స్పృశించని పార్శ్వాలు గానీ లేవేమో? ఎంత చిన్న విషయమైనా కూడా వదిలిపెట్టలేదు. ఎలా అంటే “ఇల్లు ఇల్లు లానే లేదు, తను ఊరినుండి ఇంకా రానేలేదు” అన్న గజల్లో భార్య ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేలా వినిపిస్తారు. తెలుగు సంకీర్తనల కోసమే వెంకన్న అన్నమయ్యని పుట్టిస్తే, తెలుగు సంగీత, సాహిత్యాలు సామాన్యుని ఆర్తిని,జీవన శైలిని పూర్తిగా తమలో ఇముడ్చుకోలేకపోతున్నాయని సాక్షాత్తు శారదాదేవే ఈ సరస్వతీపుతృన్ని మన తెలుగునాట పుట్టించిందేమో? పాట గొంతుతో కాదు ఆత్మతో పాడాలంటాడు ఆ గానగంధర్వుడు. సామాన్యుని జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆవిష్కరించలేకపోయానని ఆయన చెబుతున్నప్పుడు శూన్యంలోకి చూస్తున్న ఆయన కళ్ళలో ఒక నిరంతర శోధన కనిపిస్తుంది మనకి. సామాన్యుని ఆర్తి,భక్తి మన తిరుపతి వెంకన్నని కదిలించిందో లేదో గాని శ్రీనివాస్‌ని కరిగించింది. అందుకే ఆయన ఆర్తితో, ఆత్మనివేదనతో శ్రీ శ్రీనివాసం క్యాసెట్ రూపొందించారు. “పొడగంటి మయ్యా మిము పురుషోత్తమా..” అనలేని సామాన్యుని కోసం “ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి స్వామీ. వేడి వేడి అన్నంలో వెన్నపూస వేసిస్తా, ఆవకాయతో కలిపి గోరుముద్ద తినిపిస్తా” అని పాడి సామాన్యుడి ప్రార్ధన ఇలానే ఉంటుంది. కేవలం అన్నమయ్యదే ఆత్మనివేదనకాదు ఎందరో సామాన్యులదీ ఆత్మనివేదనే వారి భావాలు కూడా స్వామి వింటాడు అని చెబుతారు.
అందుకే ఆయన్ని డాక్టరేట్లే కాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వరించాయి. వీటి గురించి చెప్పటం నా వల్లకాదు. ఎందుకంటే ఆ చిట్టా ఆంజనేయుని తోకంత అవుతుంది. ఆయనకే ఇంటిలో పెట్టుకునే స్థలం లేక అటకెక్కించిన సత్కార, పురస్కార పత్రాలు, ఙ్ఞాపికలు ఎన్నో మాకు చూపించారు. భాదపడ్డారు, వీటికి మా ఇంటిలో అవమానం జరుగుతుందండీ అని. ప్రస్తుతం గాంధీ తత్వాన్ని ప్రపంచానికి పంచే పనిలో ఉన్నారు. ఇటీవలే 150 భాషల్లో పాడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగుని, తెలుగు సాంప్రదాయాన్ని ఆయన ఎంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే ఆయన ఇంటిని చూస్తే చాలు ఇట్టే తెలిసిపోతుంది. ముగ్గువేసి మధ్యలో రాగిపాత్రలో పువ్వులతో అతిధులని ఆహ్వానించే ముంగిలి. ఇంటినిండా తెలుగుదనాన్ని నింపుకున్న మట్టి బొమ్మలు, గోడలమీద ఏ చిత్రకారుడో తన కుంచెని తెలుగుదనంలో రంగరించి రంగుల్లో ఆవిష్కరించిన తైలవర్ణచిత్రాలు. ఆ ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. ఎ-తెలుగు కి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆయనకి భగవంతుడు చిరాయువునివ్వాలని, ఆయన సంకల్పించిన ప్రతి పనిలోని భగవంతుని దీవెన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను తమతో తీసుకు వెళ్ళిన సతీష్ యనమండ్ర గారికి, జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్ గారికి నా కృతఙ్ఞతలు.

ఒక మధుర ఙ్ఞాపకం
జీవితంలో కొన్ని ఙ్ఞాపకాలు పాత పుస్తకాల్లోని గులాబీ రేకుల్లా, నెమలీకలా దాగి ఉంటాయి. కానీ ఈ ఙ్ఞాపకాలు వాటిలా జీవం కోల్పోవు. ఎప్పుడు తరచి చూసిన ఆ పరిమళం మన హృదయాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తునే ఉంటుంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ సెలవు….
గమనిక: గజల్ శ్రీనివాస్‌ని ఆయన,గారు అని సంభోదించలేదు కారణం “ప్రతి తెలుగువాడి గుండె గడపలో ముగ్గులేసి తెలుగు మీద ప్రేమని నింపుతా. ఏం చేయలేమంటారా? ” అన్నారు. ఆ మాటతోనే మాకు ఆప్తుడయిపోయాడు, మా ఇంటిలో ఒకడు అయిపోయాడు. ఇంక ఆయన్ని దూరం చేసుకోవటం నాకిష్టం లేదు.