ఈ ఉగాదికి ఏంచేద్దాం?

ఈ ఉగాదికి ఏంచేద్దాం? ఎప్పటిలాగా ఉగాది పచ్చడి తిని, పంచాంగం విని పడుకుందామా? లేదా కొత్తసంవత్సరం ఏదయినా కొత్త పనితో మొదలు పెడదామా? నేను నా కొత్తసంవత్సరాన్ని ఖచ్చితంగా కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నా. ఒక సమావేశంలో కత్తి మహేష్ గారు చెప్పారు “తెలుగును కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పి అందర్ని ఒప్పించాలి. అప్పటికీ తెలుగుని బ్రతికించుకోగలమా అంటే ఎమో చెప్పలేం. తెలుగుతనాన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తెలుగు ఖచ్చితంగా బ్రతుకుతుంది”. అక్షరలక్షలు చేసేమాట. కానీ ఎలా? ప్లేకార్డ్లు పట్టుకుని రోడ్డు మీద తిరగాలి, ఫ్లెక్స్ పెట్టాలి విస్తృత ప్రచారం చెయ్యాలి. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ చేయనక్కరలేదు.

స్వాతంత్ర్యం ఎలా అయినా సంపాదించుకోవాలి అని ఆవేశంలో ఊగిపోతున్న భరతజాతికి ఆయుధంలా మారి అందరిని ఒక్కతాటి పైన నడిపించింది ఒకచిన్నమాట కాదు ఒక మహామంత్రం “వందేమాతరం”. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని ఒక్కటి చేసేది, చూడగానే తెలుగువాడిగా గుర్తింపునిచ్చేది ఏదయినా ఉందా? ఉంది మన కట్టూ,బొట్టూ. మన కట్టూ,బొట్టూ కార్పొరేట్ కంపేనీల్లో సాంప్రదాయ వస్త్రధారణ ఉత్సవాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచం మందిగా గుర్తించిన, గౌరవిస్తున్న మన వస్త్రధారణతోనే తెలుగుతనాన్ని చాటిచెబుదాం. ఆంధ్రులు ఆరంభశూరులని ఉన్న అపవాదుని చెరిపేసుకుందాం. మన కార్యక్రమాలకి ఇది కొనసాగింపేకానీ అదనపు భారంకాదని భావిస్తున్నా.

చేయాలనుకుంటున్న కార్యక్రమాలు :

1.ఉగాది రోజు అందరం తెలుగు సంప్రదాయ వస్త్రధారణని పాటిద్దాం. 10కె రన్, బత్తీబంద్‌లకి మద్దతునిచ్చిన ప్రసార మాధ్యమాలు, కార్పొరేట్ కంపెనీలు దీనికి కూడా మద్దతునిస్తాయని బలంగా నమ్ముతున్నా. ఇప్పట్నుండీ మీ కంపేనీల్లో సంభందిత వ్యక్తుల్ని సంప్రదించండి. ప్రతి ఉగాదికి చేసేదే కదా ఇందులో ఎముంది గొప్ప అనుకుంటున్నారా? ఇలానే ప్రతినెలలో ఒకరోజు పాటిద్దాం. శ్రీలంకలో ప్రతీ పౌర్ణమికి మా కంపెనీ సెలవిస్తుంది. కారణం ఆ రోజు వారికి సంప్రదాయదినం. గుడికి వెళ్ళటం ప్రార్ధనలు చెయ్యటం వంటివి చేస్తారంట. మనం అలానే ప్రతీనెలలో ఒకరోజు సంప్రదాయ దుస్తులని ధరిద్దాం. రాష్ట్రం మొత్తం ఒక్కరోజు మన సంప్రదాయ దుస్తుల్లో, లంగావోణీల్లో అమ్మాయిలు, పంచె కట్టులోనో లేదా కుర్తాల్లో అబ్బాయిలు అహా చూడాటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో

2.దీనికోసం మనం ప్రముఖ ప్రసారమాధ్యమాల మద్దతు లభిస్తుందేమో ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని భావిస్తున్నా.

3.”నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.” అనే బ్యాడ్జి ధరిద్దాం. ఇవన్నీ తెలుగువారి జీవితంలో ఒకభాగం అయ్యేంతవరకు మనం ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత తెలుగే మనల్ని నడిపిస్తుంది.

నేను పైన చెప్పిన పనులు చాలా చిన్నవి, సులువైనవి అని భావిస్తున్నా. నేను గతంలో గాని ఇప్పుడూ గాని ప్రతిపాదించినవి ఆచరణ సాధ్యమైనవి. మనకి మరింత బలాన్నిచ్చేవి. బ్లాగర్స్ డే చేసుకుంటే ఒక కొత్త ఉత్సాహం ఉంటుందని నా బ్లాగులో రాసినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈ రోజున ఈ-తెలుగు కార్యక్రమాలకి ఉత్సాహం మొదలయినది అక్కడే అని అందరికి తెలుసు. చివరిగా వీవెన్ గారు చెప్పినట్టు, “ఎవరికోసం ఎదురు చూడకు నువ్వు చేయాలనుకున్నది చేసెయ్”. అవును అందుకే నేను ఇది చెయ్యబోతున్నా. సోదరుడు సతీష్‌కుమార్ యనమండ్ర నాతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. ఆయన తన కంపెనీ లోని ఉద్యోగస్తులకి ఆచరించమని కోరుతానన్నారు. ఇంక మీ సమాధానం మిగిలుంది. రండి కలిసి నడుద్దాం. తెలుగు విప్లవంలో పాలుపంచుకుందాం.

సంకురాతిరొచ్చింది మా పల్లెకి…

మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. పోస్ట్-మ్యాన్ రామయ్య తన పాత సైకిల్ పై చెమటలు కక్కుతూ వస్తున్నాడు. అసలే పండగ సమయం ఎవరయినా ఏవయినా మామూలు ఇస్తారేమో అని ఆలస్యం కాకుండా ఉత్తరాలన్నీ ఇచ్చేస్తున్నాడు. రామయ్య పదవీవిరమణ చేసినా సరే ఆ ఊరికి వేరే పోస్ట్-మ్యాన్ రాకపోవటంతో అతన్నే ప్రభుత్వం ఆ పనిలో కొనసాగిస్తోంది. రామయ్యకి కూడా ఆ ఉద్యోగం తప్పని సరి కాబట్టి చేస్తున్నాడు. రామయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆ విషయం రామయ్య చెబితే గాని మనబోటి వాళ్ళకి తెలియదు. మనకే కాదు రామయ్య ఇక్కడున్న సంగతి అసలు ఆ కొడుకుకే తెలియదు. ఎందుకంటే “ఇంజనీరింగ్ చదివించటానికే చాలా ఖర్చు ఆయ్యింది, ఇప్పుడు నిన్ను పై చదువులకోసం అమెరికా పంపించలేను, అసలే చెల్లి పెళ్ళి కూడా చేయాలి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకో” అన్నాడు రామయ్య. కానీ “నేను నిన్ను పంపిస్తా నాకూతుర్ని పెళ్ళి చేసుకుంటే” అన్నమాట తో రామయ్య కొడుకుని ఎగరేసుకుపోయాడు దగ్గర రా’బంధువొకడు ‘. పెరట్లో ప్రేమగా పెంచిన చెట్టు తుఫానుకి నేలకొరిగితే ఎలా ఉంటుందో గానీ, చెట్టంత ఎదిగిన కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతే. రామయ్య భార్య చాలా బాధపడింది, అలిగింది, ఏడ్చింది, శాపనార్ధాలు పెట్టింది కానీ అవేవి అమెరికా లో ఉన్న కొడుకుని చేరలేదు. అవును మరి అమెరికా చేరేంత ఖరీదయినవి కాదుగా మన ఏడుపులు. మనకే లేదు స్థోమత ఇంక మన తిట్లకి ఎలా వస్తుంది. అందరి సందేశాలు బట్వాడా చేసే పోస్ట్-మ్యాన్ బాధలు మాత్రం ఎవరూ అమెరికా లోనికొడుక్కి బట్వాడా చేయలేకపోయారు. రామయ్య మాత్రం “నేను తండ్రినయ్యా, వ్యాపారిని కాను పెట్టుబడి పెట్టి లాభం లేదనుకోటానికి. రెక్కలొచ్చిన పక్షులు తలో దిక్కు చూసుకుంటాయి, అంతే గాని ఇంకా ఈ దిక్కుమాలిన బ్రతుకుని కోరుకుంటాయా? రేపు పెళ్ళయ్యాక ఈ ఆడపిల్ల కూడా వెళ్ళిపోతుందే గాని ఈ చూరు పట్టుకుని వేలాడతుందా మన పిచ్చి గాని” అని నిర్వేదంగా నవ్వేస్తాడు. ఆ నవ్వుని భద్రపరిచే సాధనం లేదేమో మానవ మేధస్సులో. ఉంటే చాలా ఖరీదే చేస్తుంది. అతని గుండె నిబ్బరం అపోలో వాళ్ళు తెలుసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తల్లితండ్రుల గుండె నొప్పులకి మందు తయారు చెయ్యొచ్చు.

ఈ రోజు సుబ్బయ్య మాష్టరికి ఉత్తరం వచ్చింది. సుబ్బయ్య నిజానికి ఏ స్కూల్ లోనూ పనిచేయలేదు. ట్యూషన్లూ చెప్పలేదు. ఆయన ఒక వంటమాష్టర్ ఊర్లో కధలకి, కార్యాలకి వంట చేస్తాడు. ఆయన బృందం వంటల్లో ఆ జిల్లాలోనే పేరు గడించింది. ఆయన చేతివంట చలవ వలన కార్యం జరిగిన ప్రతి ఇంట్లోనూ శుభమే. అలా ఆయన సుబ్బయ్యమాష్టారుగా స్థిరపడిపోయారు. రామయ్య సైకిల్ చప్పుడు వినగానే ఇంటి బయటకి పరుగున వచ్చినవి, కిటికీలు తీసి ఆశగా గమనించేవి చాలా చూపులు ఆయన్ని తాకాయి. ఆయన గుండె నిబ్బరం మనకి తెలియనిదా అందుకే ఆయన ఆ చూపులకి బేలగా అయిపోలేదు. ముందుకి సాగిపోయాడు. సుబ్బయ్య గారింటికి వచ్చి కూర్చున్నాడు. అంతే ఊరంతా సుబ్బయ్య ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలాంటి కవరు ఉత్తరాలు ఆ ఊరిలో మోతుబరి వీరయ్యకి, రామాలయం పంతులు శాస్త్రికి వారం రోజులు ముందే వచ్చాయి. సుబ్బయ్య మాష్టరి అర్ధాంగి సీతమ్మ రామయ్య ఉత్తరం తో ఇంటి ముందు అడుగుపెట్టేసరికే తొందరగా వంట గదిలోకి పోయి ఒక చేతిలో మజ్జిగ, మరో చేతిలో కజ్జికాయలు, జంతికలు పెట్టిన క్యారేజు తెచ్చి రామయ్యకి ఇచ్చింది. ఉత్తరం అందుకొని సుబ్బయ్య గారికోసం చూస్తే ఆయన కనబడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతుంది “వదినా! ఆయన గానీ అన్నయ్యగారి దగ్గరకి వచ్చారా?” “చెల్లాయ్! బావగారిని గాని చూసావా” అందరూ లేదన్న మాటే ఆమె మాత్రం ఆతృతతో వీధిలో అన్ని గుమ్మాలు తిరిగేస్తుంది.

రామయ్య పండగ మామూలు దొరక్కపోయినా తన భార్యకి పండగకి కజ్జికాయలు పెట్టొచ్చన్న ఆనందాన్ని మిగుల్చుకుని ఇంటికి బయలుదేరాడు. మరలా అవే చూపులు, సాయం సంధ్యలో చీకటిని తరిమే శక్తిలేక దాసోహం అన్న అరుణ సూర్యుని వంటి కళ్ళతో, తనని తాకి పరికిస్తున్నాయి. తాను మాత్రం చూపు మరల్చకుండా సూటిగా చూస్తూ తన ఇంటిదారిపట్టాడు. రామాలయం లో ఉన్న సుబ్బయ్య మాష్టారికి మొత్తానికి విషయం తెలిసి ఇంటికి బయలుదేరాడు. ఇందాక రామయ్యని తాకిన అవే చూపులు సుబ్బయ్యని కూడా వదిలిపెట్టలేదు. కానీ ఆ చూపుల్లో ఇప్పుడు ఆశలేదు. కాస్త అసూయ, కాస్త అభినందన. సుబ్బయ్య మొహంలో ఎప్పుడూ చూడని ఒక వింతకాంతి. పెదవుల్లో దాగని చిరునవ్వు. అంతకంటే అసూయపడటానికి ఇంకేం కావాలి? సుబ్బయ్య ఇంటికి వస్తూనే “ఏమేవ్! కవరు ఎక్కడపెట్టావ్?” అంటూ గుమ్మంలో అడుగు పెట్టారు. ఆయనకి ఉత్తరం అందించి సీతమ్మ తన పొరిగింటి లక్ష్మితో “చూసావా వదినా ఆ ముఖం ఎలా వెలిగిపోతుందో. మా పెళ్ళినాడు కూడా ఇంత ఆనందం నేను చూడలేదు.” అని ఆటపట్టించింది. సుబ్బయ్య సిగ్గుపడుతూ కవరు తో సహా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

గదిలో మంచం మీద తీరుబడిగా కూర్చుని తన పాత కళ్ళద్దాలతో కాసేపు కుస్తీ పట్టి, కవరు చించి పదిసార్లు చూసుకుని, హాయిగా పడుకున్నాడు. మంచినీళ్ళ గ్లాసుతో లోనికి వచ్చిన సీతమ్మ సుబ్బయ్య పడుకోవటం చూసి, వంట గదిలోకి వచ్చేసింది. ఇంక తన ఏర్పాట్లు తాను చేసుకుంటుంది. కజ్జికాయలు, సున్నుండలు, అరిసెలు అన్నీ స్టీల్ క్యాన్లలో పెట్టింది. జంతికలు పెట్టడానికి సామాన్లు ఏవీ ఖాళీ లేవు. పక్కింటి వాళ్ళని అడిగి ఒక క్యాన్ తెచ్చి కట్టింది. రాత్రి వరకు ఇవే పనులతో సీతమ్మకి సరిపోయింది. సుబ్బయ్య సాయంత్రం ఊరిలోకి వెళ్ళి స్నేహితుల్ని కలిసి స్పేర్ తాళాలు పనోడు కిట్టిగాడికి ఇచ్చి వచ్చారు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరూ ఏవో ఆలోచనలతో గడిపారు. ఇద్దరికి నిద్దుర లేదు. సీతమ్మ పొద్దునే లేచి తయారయ్యింది. కాఫీ పెట్టి సుబ్బయ్యని లేపింది. నిద్ర లేకపోవటంతో నీరసంగా ఉన్న సుబ్బయ్య కష్టంగా లేచి కాఫీ అందుకున్నాడు. సీతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. గ్లాసు కిందపడేసిన చప్పుడుతో ఇవతలికి వచ్చిన సీతమ్మ సుబ్బయ్య కింద పడి ఉండటం చూసి గావుకేక పెట్టింది. వీధిలో అందరూ వచ్చారు. ఎవరో పోయి కంపౌండర్ శ్రీనుని తీసుకువచ్చారు. శ్రీను నాడిని చూసి, బి.పి. చూసి “అసలే ఈయన గుండె అంత గట్టిదేం కాదు ఈ సమయంలో ఎక్కడికీ కదిలించటం మంచిది కాదు” అని చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. సుబ్బయ్య నీరసంగా చూసి సీతమ్మతో “పోనీ నీవయినా” అని కవరు తీసి ఇచ్చాడు. అందులో హైదరాబాద్ కి టికెట్లు ఉన్నాయి. సీతమ్మ పరుగున కరణంగారి అబ్బాయి కోటి దగ్గరకి వెళ్ళి “బాబు నీ దగ్గర మా సత్తిపండు నంబరు ఉందికదా. వాళ్ళ నాన్నకి బాగుండలేదని వాళ్ళనే ఇక్కడకి రమ్మని చెప్పు” అని అడిగింది. సుబ్బయ్య కొడుకు సత్తిపండు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సత్తిపండు, కోటి చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. సత్తిపండుకి ఫోన్ చేసి మాట్లాడమని సీతమ్మకిచ్చాడు కోటి. సీతమ్మ జరిగినదంతా చెప్పింది అటువైపు నుండి చాలాసేపటి వరకు సమాధానం లేదు. ఫోన్ కట్టయ్యింది. ఒక 10 నిమిషాలలో మరల పోన్ వచ్చింది.

“సరే అమ్మ నాన్నకి ఇప్పుడు బాగానే ఉందిగా. మరీ అంత ఇంటి దగ్గర ఎవరయినా ఉండాలంటే పొరుగూరిలో ఉన్న అత్తయ్యకి కబురుపెట్టు. నువ్వు మాత్రం ఈ రోజు బయలుదేరి వచ్చేయ్. పిల్లలు, కోడలు నిన్ను చూడాలంటున్నారు. అసలే 1000 అయ్యింది టికెట్లకి. పండగ లో టికెట్ల ధర చాల ఎక్కువ. సరే నాకు ఆఫీస్ కి టైం అయ్యింది ఉంటా.” సీతమ్మ ఉన్నచోటే కూలిపోయింది. అందరూ జాలిగా చుస్తున్నారు. “ఉత్తరం రాగానే పాపం ఎంత సంబరపడ్డారో ” అనిమాటలాడుకుంటున్నారు.

ఆ ఊరిలో ఇలాంటి కధలు కొత్తేం కాదు. ఊరిలో చాలా గడపల కధ ఇంతే. అందరి పిల్లలు పట్నాలలో ఉన్నారు. పండగలొస్తే ఎవరూ ఇక్కడకి రారు. టికెట్లు వస్తాయి. పట్నాలలో ఇళ్ళు ఇరుకుగా ఉంటాయి. వంట కుదరదని వాళ్ళకి నచ్చిన వంటకాలు ఉత్తరంలో రాస్తే వండి తీసుకుని వెళతారు. రోజంతా మా అబ్బాయి ఫలానా కంపెనీ, ఇంతజీతం, మా మనవలు ఇంగ్లీష్ మీడియం తెలుగు అసలు రాదు అని గొప్పలు చెప్పుకోవటం. టి.వి. లో ప్రకటనలు వచ్చినప్పుడు మా అబ్బాయి కారు అదే, ఇది మా అబ్బాయి ఇంటిలో ఉంది అని చెప్పుకుంటారు. రామాలయం లోకూర్చుని ఈ సంవత్సరం మా అబ్బాయి స్థలం కొన్నాడు, ఫ్లాట్ కొన్నాడు అని రాత్రి అయ్యేవరకు మాట్లాడుకుని రాత్రికి ఇల్లు చేరుతారు. రోజులు అలా గడిచిపోతాయి. పిల్లలు వస్తారనే ఎదురు చూపులు ఎప్పుడో మానేసారు. అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం వస్తాయి. పండగలో మాత్రం టికెట్లు పంపేది తల్లి ఇంటిపనులకి, తండ్రి బయట పనులకి సాయం ఉంటారని. మనవలకి సెలవులు కాబట్టి అల్లరి చేయకుండా ఆడించేందుకు అంతే. పనివాళ్ళు పండగల్లో రారు వచ్చినా పని ఎక్కువయితే డబ్బులెక్కువడుగుతారు పైగా గొడవ చేస్తారు. 

సీతమ్మ ఇంకేం చేయగలదు లేచింది. ఇంటికి వెళ్తుంటే రామయ్యని, సుబ్బయ్యని తడిమిన చూపులు జాలితో అమెని స్పృశించాయి. వెళ్ళి ముందురోజు వచ్చిన కవరు అందుకుంది, సత్తిపండు చిన్నప్పటి ఫోటోలు, చిన్ననాటి బట్టలు, తన చేతులతో అల్లిన స్వెటర్ అన్నీ ఒక బ్యాగులో పెట్టింది. సుబ్బయ్య కనీసం భార్యయిన వెళ్తున్నందుకు ఆనందంగానే ఉన్నాడు. కానీ మనవడ్ని చూడలేకపోతున్నా అనే భాద. వెధవ రోగం ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటున్నాడు. వీధిలోకి వచ్చిన సీతమ్మ ఆ బ్యాగు విసిరి అగ్గిపుల్ల గీసి పడేసింది. లోపలికి ఆవేశంగా వెళ్ళి గది గది గాలించి ఏ ఒక్క ఙ్ఞాపకం మిగలకుండా అన్నీ ఏరుకొచ్చి ఆమంటలో పడేసింది. చివరగా రైల్ టికెట్లున్న కవరు కూడా. వీధి లో అందరూ సీతమ్మకి పిచ్చి పట్టిందనుకున్నారు. సుబ్బయ్య నోరు వెళ్ళబెట్టాడు. కాసేపట్లోనే ప్రతీ ఇంటినుండీ ఒక్కొక్కరుగా వచ్చి మంటల్లో ఇన్నేళ్ళ తమ నిరాశని బాధని కాల్చి బూడిద చేసారు. ఆ రోజే ఆ పల్లెకి భోగి వచ్చింది. మరుసటి రోజు సీతమ్మ తను వండిన వంటకాలు ఇంటింటికి తిరిగి పంచింది. ఆ రోజు నిజమయిన సంక్రాంతి పండగ చేసుకున్నారు ఆ ఊరిలో. రామాలయంలో పెద్ద ఎత్తున పూజలు చేసారు. రామయ్య మరలా ఎప్పుడూ అలాంటి కవర్లు ఎవరికీ ఇవ్వలేదు. వచ్చినవి వచ్చినట్టే తన ఇంటిలో పొయ్యలో పడేసాడు.

e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక

నివేదిక ముందుగానే వ్రాయాల్సి ఉన్నా ప్రయాణ బడలిక, పని ఒత్తిడి వలన కాస్త ఆలస్యమయ్యింది. అయినా ఎదురుచూపులో ఉన్న హాయి మీకు తెలియనిదా? అసలు ఈ రెండు రోజుల్లో మేము విజయవాడనుండి మోసుకొచ్చిన అనుభూతులని మీతో పంచుకొని మరింతగా ఆస్వాదించాలని ప్రతీక్షణం అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. అనుకున్న ప్రకారమే చదువరిగారు, చావా కిరణ్‌గారు కూకట్‌పల్లి నుండి ఇన్నోవా లో బయలుదేరారు. మార్గంలో శ్రీనివాసరాజు దాట్ల, నేను, సతీష్‌కుమార్ యనమండ్ర గారు, అరుణ పప్పు గారు వారిని కలిసాం. అందరం మంచి చాయ్ ఒకటి కొట్టి ప్రయాణం మొదలు పెట్టాం. మొదటి విడతలో ఆంధ్ర రాజకీయాలు, తెలుగు సినిమాల గురించి చర్చతో ప్రయాణం సాగించాం. అల్పాహారం తీసుకున్నాక చర్చని కాస్త మార్చి e-తెలుగు తదుపరి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మన మితృలలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా ఎలా వినియోగించుకోవాలి? గత కొద్దిరోజులలో తాబేలు నడకను వీడీ కుందేలులా దూకుతున్న మనప్రగతి నిర్లక్ష్యం లేదా నైరాశ్యంతో కుంటుపడకుండా ఈ స్పూర్తిని ఇదేస్థాయిలో కొనసాగించటానికి తీసుకోవాల్సిన నిర్ణయాల పై చర్చ జరిగింది. ఏకపక్షంగా కాక భిన్న వాదనల మధ్య కొనసాగిన చర్చ చివరికి ఏమార్గం లో నైనా అందరం కలిసే నడుద్దాం అన్న నిర్ణయం తో ముగిసింది. ఆ చర్చ వివరాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. చర్చ ముగిసేంతలోనే విజయవాడ దగ్గరగా వచ్చేసాం. శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఎక్కడకురావాలో వివరాలు తీసుకుని అక్కడకు చేరుకున్నాం. ఒక 5 నిమిషాల్లో శ్రీకాంత్‌గారు వచ్చేసారు. ఆయన రూపం బ్లాగులోని ఫోటోకి కాస్త భిన్నంగా ఉంది. ఫోటో చూసి యువకులేమో అనుకున్నాం కానీ మధ్యవయస్కులు (శ్రీకాంత్‌గారు మీకు కోపం రాదుకదా? 🙂 ). శ్రీకాంత్‌గారు తమ ఇంటికి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. అద్భుతమయిన పాతడాబా ఇల్లు, పెద్దగా ఎత్తుగా ఉన్న ద్వారాలు, చెక్కమంచం, బీరువా నిండా పుస్తకాలు, ఇంటివెనక విరగ కాసిన ఉసిరిచెట్టు భలే అనిపించింది. నేను,చావాగారు ఎంతో ప్రయత్నం మీద నాలుగో ఐదో ఉసిరికాయలు తెంపాం. శ్రీకాంత్‌గారి ఇద్దరి పిల్లలూ ఎంతో ఒద్దికతో మమ్మల్ని వచ్చి పలకరించారు. శ్రీకాంత్‌గారి సతీమణి అన్నపూర్ణ గారు మాకు చల్లని మంచినీళ్ళతో ఆహ్వానం పలికారు. కాసేపు శ్రీకాంత్‌గారితో ముచ్చటించి, అందరం కాస్త సేదతీరాక భోజనాలు అవికానిచ్చి విజయవాడ ఆకాశవాణి కి చేరుకున్నాం.  

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

పద్మకళగారు వచ్చి అందర్ని ఆకాశవాణి లోకి తీసుకొని వెళ్ళారు. పేరు చూసి నడివయస్కులేమో అనుకున్నాం కానీ మళ్ళీ దెబ్బతిన్నాం. ఎన్నో ఏళ్ళ చరిత్రకలిగిన ఆకాశవాణిలో అడుగుపెడుతుంటే అందరిమనస్సుల్లో ఒక గొప్ప అనుభూతి కెరటంలా వెల్లువెత్తింది. “ఇప్పుడు సమయం 2 గంటలా 30 నిమిషాలు కావస్తుంది”, “మీరు వింటున్న ఈ పాట సాలూరు రాజేశ్వర్రావు స్వరసారధ్యంలో “,”ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ” ఇలా కొన్ని చిన్నప్పటి ఙ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. ఎందరో గొప్ప సాహితీ వేత్తలు, కవులు, గాయకులు, రంగస్థలనటులు, కళాకరులని మనకి అందించిన ఆకాశవాణిలో మేము మాట్లాడటం రవ్వంత గర్వాన్ని కలిగించింది. ఈ ఘనత e-తెలుగు చరిత్ర లో ఒక మైలురాయి. ముందుగా ప్రణాళిక లేక పోవటం చేత పద్మకళగారితో అప్పటికప్పుడు చర్చించి కార్యక్రమం మొదలు పెట్టాం. చదువరిగారు e-తెలుగు లక్ష్యాలు,సాదించిన విజయాల్ని గణాంకాలతో సహా వివరించారు. e-తెలుగు భవిష్యత్తు ప్రణాలికలు చెప్పారు. చావా కిరణ్‌గారు తెలుగు వికిపీడియా గురించి, బ్లాగుల గురించి చక్కగా వివరించారు. బ్లాగుల వలన గృహిణులకి,విధ్యార్దులకి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కావల్సిన ఎన్నో సలహాలు సూచనలిచ్చే బ్లాగులు తెలుగులో మనకు ఉన్నాయని,ముఖ్యంగా కనుమరుగయిపోతున్న ఆరోగ్యకరమయిన హాస్యాన్ని అందిచే బ్లాగులు ఎన్నో ఉన్నాయని చావాగారు వివరించారు. నేనుకూడా ఉడతసహాయంచేసాను. ఆవిధంగా అనుకున్నదానికంటే కూడా మంచిగా ఆ కార్యక్రమం ముగిసినది.  

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

అరుణ పప్పు, చావా కిరణ్

అరుణ పప్పు, చావా కిరణ్

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

పుస్తకప్రదర్శన ప్రాంగణం

పుస్తకప్రదర్శన ప్రాంగణం

ఆకాశవాణి లో చర్చ ముగిసినవెంటనే “వాక్ ఫర్ బుక్స్” ర్యాలీకి చేరుకొని, అప్పటికే మొదలయిన ర్యాలీ లో మధ్యలో దూరి e-తెలుగు బ్యానర్ ని ప్రదర్శిస్తూ నడక సాగించాం. అరుణగారు,చావాగారు ఒక జట్టుగా సతీష్‌గారు, శ్రీనివాస్ ఒక జట్టుగా బ్యానర్ పట్టుకొని కాస్త చొరవ తీసుకుని ర్యాలీ లో ముందుకు దూసుకుపోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాలీ పుస్తక ప్రదర్శనకి చేరుకున్నాక అరుణగారు మనకోసం ఒక చిన్న స్టాలులా బల్లలతో ఏర్పాటు చేసారు. బ్యానర్ కట్టినప్పటినుండి మన కార్యక్రమం మొదలు పెట్టేంతవరకు వచ్చిన జనమంతా అడిగిమరీ కరపత్రాలు తీసుకొని, తమ సందేహాలను సహితం తీర్చుకొని వెళ్ళారు. కార్యక్రమం సమయం కంటే కాస్త ముందుగానే స్టాలు ని ముగించి “ప్రతిభ వేదిక” వద్దకి చేరుకున్నాం. మన కార్యక్రమానికి తగ్గ పేరుగల వేదిక చూసారా? శ్రీకాంత్‌గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుర్చీలు వేయించటం, ప్రొజెక్టర్ ఏర్పాటులాంటివి చకచకా జరిగిపోయాయి. పద్మకళగారు మీడియా మితృలని పిలవటం, మన గురించి చెప్పటం, పరిచయం చేయటం వంటి పనులతో తీరికలేకుండా గడిపారు. కళగారి సహాయంతో 93.5 FM వారు, జీ న్యూస్ వారు మంచి కవరేజినిచ్చారు. ఉరుముల్లేని పిడుగులా జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్‌గారు వచ్చారు. వస్తూనే ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయిపోయారు. జీ న్యూస్ వారికి e-తెలుగు గురించి వివరించారు. చావా గారు, సతీష్ గారు 93.5 FM కి వివరాలు అందించారు.  

e-తెలుగుస్టాలు

e-తెలుగుస్టాలు

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

img_0185

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

ఆకాశవాణి సంచాలకులు ఆదిత్య ప్రసాద్ గారి వ్యాఖ్యానం తో కార్యక్రమం మొదలయ్యింది. చదువరిగారు ఆహుతలకి అర్దమయ్యేలా అంతర్జాలంలో తెలుగుని ఉపయోగించవచ్చని ఇది సులువైనది ఖర్చులేనిదని వివరించారు. అంతర్జాలంలో తెలుగు ఉపయోగాన్ని పెంచటమే e-తెలుగు లక్ష్యమని చెప్పారు. శ్రీధర్‌గారు రాకున్నా ఆయన వ్యాఖ్యానంతో ఉన్న వీడీయోల సహాయంతో కార్యక్రమం కొనసాగింది. చదువరి గారి సారధ్యం లో నేను కంప్యూటర్లో తెలుగు ఎనెబుల్ చేసుకోవటం, లేఖినిలో తెలుగు వ్రాయటం గురించి వివరించాను. చావాగారు బ్లాగు గురించి, బ్లాగులు ఎలా తయారు చేసుకోవాలి, తెలుగు వికిపీడీయా గురించి ఆసక్తికరంగా వివరించారు. శ్రీధర్‌గారు ఎంతో శ్రమతో తయరుచేసిన వీడీయోలు ప్రేక్షకులు ఆసక్తిగా చూసారు. కొందరు నోట్స్ వ్రాసుకోవటం కూడా కనిపించింది. కార్యక్రమం ముగిసిన వెంటనే అందరూ మా వద్దకి వచ్చి కరపత్రాలు తీసుకొని, అనేక సందేహాలని నివృత్తి చేసుకొని, వారి ఈ-మెయిల్ వ్రాసిచ్చి వెళ్ళారు. కొందరు చావాగార్ని అసలు వదిలిపెట్టనే లేదు. కార్యక్రమం ముగిసిన ఎంతోసేపటి వరకు మాతో మాట్లాడుతునే గడిపారు. ఇది నిజంగా మేమంతా ఆనందించిన విషయం. హైదరాబాద్ లో కంటే ఇక్కడ లభించిన స్పందన మాకు తృప్తిని మిగిల్చింది. అంతదూరం ప్రయాణం చేసి వెళ్ళినందుకు చాలా తృప్తికలిగింది. అక్కడితో అయిపోలేదు అంతవరకు హడావుడిగా సాగిన కార్యక్రమం, బ్లాగు మితృల ముచ్చట్లతో తేలిక పడింది. పుస్తకప్రదర్శన తిలకించటనికి వచ్చిన ఒక వ్యక్తికి e-తెలుగు బ్యానర్ కనపడింది మా వద్దకి వచ్చి పలకరించి తనని తాను పరిచయం చేసుకున్నారు. అప్పుడు తెలిసింది ఆయన మనందరికి చిరపరిచితుడైన గీతాచార్య అని. అందరం పోటో తీసుకుందాం అనుకునేంతలో హలో నేను కూడా బ్లాగర్నే నా బ్లాగు పేరు యువకుడు అంటు ఒక నవయువకుడు వచ్చాడు. అసలు ఊహించ కుండానే అంత మంది బ్లాగర్లు ఒకేసారి కలుసుకోవటం గమ్మత్తుగా అనిపించింది. కార్యక్రమం సాఫీగా జరగటానికి సహాయ పడిన శ్రీనివాస కర గారికి, శివరామ ప్రసాద్‌గారికి ఎంతో ఋణపడి ఉన్నాం. పుస్తక ప్రదర్శనలో అడుగుపెట్టినప్పటినుండి అన్ని పనులు తమ భుజానవేసుకుని నడిపించారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించిన ఒక పెద్దాయన తన పేరు సుబ్బారావు అని తాను కొత్తపాళీ గరి మామ గారినని పరిచయం చేసుకున్నారు. అందరం ఆయన్ని ఆప్యాయంగా పలకరించాం. ఈ వయస్సులో ఇంత చలిలో మనకోసం వచ్చినందుకు ఆయనకి ఏవిధంగా మనం ధన్యవాదాలు చెప్పగలం? కళగారి మితృడు సాయి మన కార్యక్రమ వివరాలు తెలుసుకుని ఆసక్తి తో మనకి ఎంతో సహాయం చేసాడు. కరపత్రాలను పంచి ఓపికగా అందరివద్దకి వెళ్ళి ఈ-మెయిల్ తీసుకుని నింపి కార్యక్రమం ముగిసేవరకూ ఉండి వెళ్ళారు. ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు  

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

ప్రముఖ రచయిత కేశవరెడ్డిగారిని కలిసి నేను,అరుణగారు e-తెలుగు కార్యక్రమాలు వివరించాము. ఆయన మన కృషికి అభినందనలు తెలిపారు. అలాగే చదువరిగారు పలువురు ప్రముఖులను కలిసి e-తెలుగు కార్యక్రమాలు వివరించారు. పుస్తకప్రదర్శనలో కార్యక్రమం ముగించుకొని శ్రీకాంత్‌గారి ఇంటికి చేరుకుని బడలిక తీర్చుకున్నాం. ఆరోజు సంగతులన్నీ ఒక్కసారి స్మరించుకున్నాం. శ్రీకాంత్‌దంపతుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం. శ్రీకాంత్‌గారు మాకూడా బయటకు వచ్చి మేము అల్పాహారం తినే వరకు మాతోనే ఉన్నారు. ఆయనకి కళగారికి మనం ఋణపడిపోయాం. ఆ స్మృతలన్నీ మూటగట్టుకొని హైదరాబాద్ దారిపట్టాం.మొన్న ఎలా జరుగుతుందో అన్న ఊహ, నిన్న నమ్మలేని నిజంగా మాముందు ఆవిష్కరింపబడి నేటికి ఒక మధుర ఙ్ఞాపకంలా అనుభవాల పెట్టెలోకి చేరుకుంది. నివేదికకి చిత్రాలని అందించిన శ్రీనివాసరాజు దాట్లకి ధన్యవాదాలు. నేను మరిచిపోయిన వ్యక్తుల వివరాలు, సంఘటనలు ఏమయినా ఉంటే మితృలు వ్యాఖ్యలరూపంలో అందించండి.