ముంగిలి » కథలు » హతవిధీ!

హతవిధీ!

గమనిక: ఈ కధ నేను స్కుల్ చదివే రోజుల్లో ఈనాడు ఆదివారం పత్రిక లో వచ్చినది. నాకు చాలా ఇష్టమైనది.పూర్తిగా గుర్తులేకపోవటం తో నా పైత్యం కొంత జోడించా. అసలు కధ లో ఉన్న హాస్యం స్థాయి ని అందుకోలేకపోయినా, ఆ కధని అందరికి అందించాలన్న తాపత్రయం తో వ్రాసాను.

కోటేశ్వర్రావు ఒక చిన్న గవర్నమెంటు ఆఫీస్ లో ఓ సన్నకారు (ఇలా అనొచ్చో లేదో తెలియదు. అయినా అనేసానుగా అంతే.) గుమస్తా. పేరులో తప్ప ఇంటిలో దాచుకోవటానికి గాని, వంటి మీద వేసుకోవటనికి గాని కోట్లు లేవు.అతని జీవితం లో ఈ రోజు చాలా ఆనందించాల్సిన రోజు. ఎందుకంటే తన జీవితాశయం ఈ రోజు నెరవేరబోతుంది. అందుకే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయ్యాలని ప్రొద్దునే ఆఫీస్ కి వచ్చి తన పని త్వరగా ముగించటం మొదలు పెట్టాడు. మొదటపని బాస్ గదిలో సంతకం పెట్టడం అయిపోయింది. రెండో పని చూడాల్సిన ఫైళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం. ఈ రోజు సహ గుమస్తా సుబ్రమణ్యం గారు రాలేదు. కాబట్టి మూడో పని అంటే అతని తో వ్యాపార,రాజకీయ,విద్యా,సినిమా,అంతర్జాతీయ విషయాల పై చర్చ లేనట్టే. కాబట్టీ ప్రొద్దుట ఆఫీస్ లో చెయ్యాల్సిన పని లేదు, కాస్తంత కునుకు తీస్తే తియ్యాలి. కానీ కోటేశ్వర్రావు చాలా నిజాయితీ పరుడు. ఆఫీస్ లో నిద్రవస్తే ఇంటికి వెళ్ళి పడుకుంటాడే తప్ప ఆఫీస్ లో పడుకోడు. కాబట్టి తీరిగ్గా ఆ రోజు సాయంత్రం తను ఏమిచెయ్యాలి అనేది ఒకసారి మననం చేసుకుంటున్నాడు.

ఇప్పుడు కోటేశ్వర్రావు గారి ఊహల్లో ఉన్నారుగా ఇక కధ ఆయనే చెబుతారు.

అసలు ఎప్పటి కోరికని, ఎన్నాళ్ళు ఎదురు చూసానని. వాసుగాడిలా పిల్ల కోసం గాని, సత్తి గాడి లా పెళ్ళి కోసం గాని,సూరిగాడిలా జాబు కోసం గాని,బావగారి లాగా ఓ బాబు కోసం గానీ ఎప్పుడూ ఎదురుచూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు మా ఎదురింటిలో ఉండే బబ్లుగాడు వాళ్ళ మావయ్యతో వెళ్ళాడు 5స్టార్ హోటల్ కి. మరుసటి రోజు నుంచి ఒక 5 రోజులు బాత్రూం లో ఆ నక్షత్రాలు గుర్తుచేసుకున్నాడు. అయినాసరే స్కూల్ కి వచ్చిన దగ్గర్నించి వర్ణిస్తూనే ఉన్నాడు. వాడి చుట్టూ మా లాంటి వాళ్ళం కూర్చుని ఓ James Bond cinema ఊహించుకొనేవాళ్ళం.ఏదైనాసరే అబ్బాయి మీ జీవితం లో ఓ సారైనా అప్పుచేసైనా 5స్టార్ హోటల్లో తినాలి మరి అని ఎక్కడ లేని పెద్దరికం తెచ్చేసుకొని చెఫ్ఫాడు. కొన్ని రోజులకి బబ్లువాళ్ళు వేరే ఊరువెళ్ళిపోయారు. అయినా నా మనసులో వాడు చెప్పినమాటలు నిలిచిపోయాయి. నాన్ననడిగితే తాట తీస్తాడు. పైగా నీ చదువు కి ఇంట్లో తిండిపెట్టడమే ఎక్కువ, ఇంకా హోటల్లా? అని వారం రోజులు తిండిపెట్టకపోతే కడుపుమాడి చస్తా. ఆఖరికి పెళ్ళి చేసుకున్న కొత్తలో మా ఆవిడతో వెళ్దామని కలగన్నా. మా ఆవిడ నా కోరిక వినగానే అప్పడాల కర్రతోనో, అట్లకర్రతోనో సరిగా గుర్తులేదు గానీ నా డిప్ప మీద కొడితే మాడు పగిలి సరిగ్గా 5 కుట్లు వేయించుకున్నా. ఈ 5 నంబరు నాతో బాగానే ఆడుకుంటుంది అనుకొన్నా డాక్టరికి 5 వందలు ఇస్తూ. అప్పటినించి నా కోరికని నాలోనే దాచుకున్నా. ఎప్పటికైనా నే ఒక్కడినైనా వెళ్ళాలని గట్టి నిర్ణయం తీసుకున్నా. నాలుగయిదు నెలలు గా డబ్బులు దాచుకుంటే మా ఆవిడ వాళ్ళ పుట్టింటి కి అవసరమని ఇచ్చేసింది. నిన్న తీసుకున్న బోనస్ డబ్బులు మాత్రం మా ఆవిడకి తెలియకుండా దాచేసాను, అవే ఈ సారి నా పెట్టుబడి.

ఇప్పుడు నేను వచ్చేసాను అదేనండి మీ మురళీ ని.

సరిగ్గా 5 గంటలకి బాస్ పిచ్చేశ్వర్రావు ఆఫీస్ కి వచ్చాడు. వస్తూనే కోటేశ్వర్రావు ని పిలిచి అర్జంటుగా ఒక ఫైలు ని పూర్తి చెయ్యమని ఇచ్చాడు. కోటేశ్వర్రావు నీరుగారిపోయాడు. గడియారం 5 గంటలు కొడుతూ ఉంటే 5 నంబరు ని తిట్టుకున్నాడు. జీవితం లొ 10 వ తరగతి పాసవ్వడానికి కష్ట పడ్డట్టు కష్ట పడితే 6.30 కి పని పూర్తి అయ్యింది. మరుక్షణం లో బాస్ కి కనిపించకుండా కిటికీ లోంచి దూకి ఇంటికి పారిపోయాడు. ఇంటికి వెళ్ళగానే సుబ్బు గాడి చెల్లి పెళ్ళిచూపులంట నే త్వరగా వెళ్ళాలి అని తన భార్య ఆండాళ్ళు కి చెప్పి బాత్రూం లోకి వెళ్ళాడు.అత్తవారు పండగకి పెట్టిన కొత్తబట్టలు వేసుకొని భార్యకి అనుమానం వచ్చేలోగా బయట పడ్డాడు.

హాయిగా రోడ్డు మీద నడుచుకుంటూ హోటల్ కి చేరుకున్నాడు. లోపలకి నడవాలంటే కొంచెంకంగారుగా ఉన్న బయటపడకుండా లోపలికి ప్రవేశించాడు. గేటు దగ్గర ఒకడు “సలీం-అనార్కలి” లో మొఘల్ చక్రవర్తిలా వేషం వేసుకొని ఉన్నాడు. రాగానే నమస్కారం పెట్టాడు. కోటేశ్వర్రావు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఆఫీస్ లో ప్యూన్ గాని, కట్టుకొన్న పెళ్ళాం గానీ ఎప్పుడూ జీవితం లో తనకి ఇలా చేసిన పాపాన పోలేదు. గేటువాడు నవ్వుకున్నాడు. “ఓర్ని! మొహం చూస్తేనే తెలుస్తుంది మొదటసారని.” అనుకున్నాడు.

లోపలికి దర్జాగా వెళ్ళిన కోటేశ్వర్రావు  ఎదురుగా కనిపిస్తున్న గది తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. అప్పుడు అర్ధమయ్యింది అది వాష్ రూం అని ఎవరూ చూడక ముందే ఒక్క గెంతు లో బయటకి వచ్చాడు. “ఇంకా నయం ఆడవాళ్ళది కాదు” అనుకుంటూ. కొంచెం ముందుకి నడిచాక అద్దాల నుండి చూస్తే అందరూ భోజనం చేస్తూ కనిపించారు. హమ్మయ్యా అనుకుంటూ ఆ గది లోకి వెళ్ళాడు. ఖాళీ గా ఉన్న ఒక టేబుల్ చూసి కూర్చున్నాడు. ఇంతలో ఒక సూటోడు (సూటు వేసుకున్న వాడు) వచ్చి ఈ టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు సర్. మీకు మరో టేబుల్ చూపిస్తా అన్నాడు. వాడు ఇంగ్లీష్ లో చెప్పినది అర్ధం కాక పోయినా వాడి హావభావాలు చూస్తే “ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు రా బడుద్దాయి” అని అర్ధమయ్యింది. మరి కాసేపు 8 వ తరగతి లో చదువుకున్న English poem చదివి వినిపించాడు. బీచ్ వ్యూ, సిటీ వ్యూ అనే పదాలు మాత్రమే అర్ధమయ్యాయి. వాడి పాడిన poem లో.బీచ్ అని అనగానే ఒక టేబుల్ చూపించి వెళ్ళిపోయాడు.

బీచ్ ని చూస్తూ ఉంటే ఎప్పుడూ అందంగా కనిపించేది, ఈ రోజు మాత్రం చాలా ఖరీదు గా అనిపిస్తుంది అతనికి. మరో సూటోడు వచ్చాడు. 10 వ తరగతి లో ఇంగ్లీష్ పరీక్ష లో అడిగినట్టు ఒక ప్రశ్న అడిగాడు. తనా గుమస్తా తెలివితేటలు అది ఒక ప్రశ్న అని అర్ధం చేసుకోవటనికి పనికి వఛ్ఛాయి గాని, సమాధానం ఏమి చెప్పాలో పాలు పోలేదు. సరే ఏమి చెయ్యాలో తెలీక “మీల్స్” అన్నాడు. “”వ్వాట్” అని పిచ్చ మొహం పెట్టాడు సర్వర్. “బాబూ! మీల్స్” అన్న కోటేశ్వర్రావు పిలుపు తో తెలివి లోకి వచ్చిన సర్వర్ కి మనోడి సంగతి అర్ధమయ్యింది. కానీ వృత్తిధర్మం కాదనలేక ప్రపంచ పటం లో ఉన్నదేశాలు పేర్లన్ని చదివి వినిపించాడు. విషయం సగం అర్ధమయ్యి సగం అర్ధం కాని కోటేశ్వర్రావు దేశాభిమానం తో ఇండియన్ అన్నాడూ. తరువాత మన సర్వర్ గారు హాలివుడ్ లో కొత్తగా రిలీజ్ అయిన సినిమాల పేర్లు చదువుతూ పోయాడు. కోటేస్వర్రావు కి ముచ్చెమటలు పోసాయి. తనకి కావాల్సిన గుత్తి వంకాయ కూర, పెరుగు గారి, నాటు కోడి వేపుడు, పాయసం వాడికి ఎలా చెప్పాలో తెలియక తల పట్టుకున్నాడు. మన సర్వర్ గారు మాత్రం ఇంకా పేర్లు చదవటం ఆపలేదు. మనవాడికి గొంతు తడారిపోయి దాహాం తో వాటర్ అని అరిచినంత పని చేసాడు, “ఓ.కే. సర్ చిల్డ్ వాటర్, ప్లైన్ వాటర్,మినరల్ వాటర్ …………” ఇంకాసేపు ఈ లిస్టు కొనసాగుతునే వుంది. కోటేశ్వర్రావు కి నీరసమొచ్చి ఏమి చెయ్యాలో పాలుపోక బొటన్ వేలు చూపించి నోటి దగ్గర చూపించాడు. భాష కన్నా ఆంగికాన్ని అర్ధం చేసుకొని వాడు అక్కడినించి వెళ్ళిపోయాడు.

వాడొచ్చే లోగా మల్టిపుల్ చాయిస్ కి 10 వ తరగతి లో టిక్కు పెట్టినట్టు కొన్ని ముందే అనేసి వాడూ రాగానే చూపించేసాడు. వాడు ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయాడు. సునామి తన కళ్ళముందు వరకు వచ్చి వెళ్ళిపోయింది అన్నంత ఆనందపడి కాసేపు కునుకు తీసాడు. కొన్ని గంటల తరువాత సర్వర్ ఎవో పదార్ధాల పైన ఆకులు, టమోటాలు వేసి పట్టుకొచ్చాడు. అన్నింటి ని కొంచెం గా వడ్డించాడు. వాడు అలానే చూస్తూ ఉంటే తినటనికి చాల ఇబ్బంది గా వుంది. అసలు అత్తగారింటి దగ్గర కూడా ఎవరూ లేనప్పుడే భోజనం చేసి తన గదిలోకి పోయేవాడు. అందుకే కొంచెం ఇబ్బంది గా తినటం మొదలు పెట్టాడు. ఏ పధార్ధం ఏంటో అర్ధం కావటం లేదు, ఒక్క దానికి రుచి పచి లేదు. అదే అసలు నాయర్ హోటల్లో అయితే. ఒక స్పెషల్ మీల్స్ అనగానే మరో ప్రశ్న అడగకుండా తెచ్చి పడేస్తాడు. రుచి విషయంలో తిరిగే లేదు. ఎదో వేపకాయ చేదు తిన్నమొహం పెట్టి మొత్తానికి భోజనం ముగించాడు. ఇంతలో గిన్ని లో వేడి నీళ్ళు తెఛ్ఛిన సర్వర్ మనోడికి తెలుసో లేదో అనే అనుమానం తో చేతులు ముంచి కడుగుకోమన్నట్టు  సైగ చేసి చూపించాడు. చేతులు ముంచితే లోపలేదో తగిలి బయటకి తీసాడు నిమ్మచెక్క. దీన్నేమి చెయ్యాలి అన్నట్టు సర్వర్ వైపు చూసాడు దీన్ని ముందే ఊహించిన సర్వర్ అక్కడ నుండి పారిపోయాడు. “దొంగ వెధవ చూసుకోకుండా నిమ్మకాయ పడిన నీళ్ళు తెచ్చి దొరికి పోయానని పారిపోయాడు” అనుకున్నాడు. బిల్లు పట్టుకొని వఛ్ఛాడు. బిల్లు 5***/- (5 వేలు) అయ్యింది. మనోడికి అప్పుడు అర్ధమయ్యింది ఇక్కడ చుక్కలు తినే దానిలోకాక బిల్లు లో ఉంటుందని. మేనేజర్ మిమ్మల్ని పిలిచారని ఒక సూటోడు వచ్చి కోటేశ్వర్రావు ని తీసుకొని వెళ్ళాడు. “బిల్లు డబ్బులు లేని మొహం లా కనిపించానా” అనుకుంటూ ఎత్తుగా ఉన్న జేబులు ఒకసారి తడుము కున్నాడు.

లోపలి కి రాగానే ఈ రోజు నా కూతురి పుట్టిన రొజు అందుకే కొంతమంది బిల్లుని తీసుకోవటం లేదు, దయచేసి ఈ చిన్న కాంప్లిమెంటు తీసుకోండని ఒక గిఫ్టు ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు కోటేశ్వర్రావు గాలి లో తేలుకుంటూ ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఆఫీస్ లో అందరికి ఈ విషయం చెప్పాలి. ఫ్రీ భోజనమే కాక మేనేజర్ దగ్గర నుండి గిఫ్టు. ఆఫీస్ లో అందరు కుళ్ళి చావలి అని ఆనందపడుతూ ఇంటి లో అడుగు పెట్టాడు. సోఫా లో సుబ్బు గాడు. “రా రా బాబు నీ కోసమే గంట నుంచి ఎదురూ చూస్తున్నా. మా ఇంటికని వెళ్ళావంట. బోనస్ తీసుకొని సంతకం పెట్టలేదంట కదా! బాస్ పంపించాడు” అని సంతకం తీసుకొని వెళ్ళిపోయాడు. గేటు వేసి లోపలకి వస్తుంటే ఎదో వస్తువు గాల్లో ఎగురు కుంటూ వచ్చి తలకి తగిలింది. అప్పడాల కర్రో? అట్ల కర్రో? హతవిధీ!

6 thoughts on “హతవిధీ!

  1. హ్హా.. హ్హా..
    బావుంది. కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి రాసుంటే ఇంకా చాలా బావుండేది.
    మనలో మన మాట, ఇంతకీ కోటి గారికి తలకి బొప్పి కట్టిందా? లేక ?????

  2. ప్రతాప్ గారు,
    నిజానికి మితృలంతా నన్ను క్షమించాలి. ఈ వారాంతం లో తీవ్రంగా వర్షాలు మీకు తెలియనిది కాదు. ఇంటా బయటా నీరు,బురద చిరాకు గా వుంది. రాయాలనుకున్న ప్రతిసారి కూర్చోవటం ఆలోచనలు ముందుకెల్లక ఆపేయటాం. ఇలా కొనసాగింది అందుకే మంచి సబ్జెక్ట్ ని తీసుకొన్నా సరే సరైన కధనం కూర్చలేక బోర్లా పడ్డా.

    కల గారు, రాధిక గారు, మీనూ,
    కధనం లోపించినా సరే నన్ను నొప్పించక మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s