నువ్వు నేను ఓ ప్రేమ కాని ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

నువ్వేంటో నాకు ఎప్పుడూ అర్ధం కావు
నేను నీకు కూడా.

అవునంటావ్ కాదంటావ్.
నువ్వు అవునన్నా నాకు అనుమానం
కాదంటే ఆవేదన.

నేను నిన్ను నమ్ముతాను కానీ కొన్నిసార్లే.
నిలదీస్తే వదిలేస్తావేమో అని భయంతో నమ్మకం
నిజమా కాదా అనే అనుమానం.

నువ్వు సీతాకోకచిలుకనంటావ్
గువ్వనంటావ్
పావురాయినంటావ్.
నేను మాత్రం నీటిలో కొంగని
ఒంటికాలి పై నిలబడి
దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ.

అడక్కుండానే మనసులోకి చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?

నీకు నేను కావాలి
కానీ నాతో ఉండవు.
నువ్వులేకపోయినా నేను ఉండగలను
కానీ వదలలేను.

ప్రియా పాహిమాం పాహిమాం పాహిమాం

ఇంటిలో ఉన్న పాత పుస్తకాలన్నీ దులుపుతుంటే నేను కవితలు వ్రాసుకునే పుస్తకం కనిపించింది. పదేళ్ళక్రితం ఇంటర్ లో వ్రాసుకున్న కవితలు చాలావరకూ ఇమ్మెట్యూర్ అనిపించాయి. నాకు కాస్త గమ్మత్తుగా అనిపించిన ప్రేయసి దండకం ఇది. కొత్త కొత్త ప్రయోగాలు,కనీవినీ ఎరుగని పదాలు కనిపిస్తే కంగారు పడకండి.

విశ్వసౌందర్యానికి దాసోహం

విశ్వసౌందర్యానికి దాసోహం

ఓ ప్రియా,

మందారముఖి కమలాక్షి
కరుణామయి దయార్ద్రహృదయి
మదీయమానసచోర కోమలాంగి
నాదు హృదయగర్వభంగి
పాహిమాం పాహిమాం పాహిమాం

ననుభందించు నీకురులనుండి
బుసలుకొట్టు నీదు భృకుటీద్వయం నుండి
చురకత్తుల చూపులనుండి
నిట్టూర్పుల వడగాల్పులనుండి
పాహిమాం పాహిమాం పాహిమాం

మైమరపించు చిరునవ్వుల నుండి
ఆకర్షించు చెక్కిళ్ళ నుండి
తేనెలూరు పలుకుల నుండి
నీదువయ్యారపు నడకల నుండి
మంచువంటి మనసు నుండి
పాహిమాం పాహిమాం పాహిమాం

నీసోయగంబు వర్ణించ నేనెంతవాడినే
నీగుణగణంబుల్నెంచ నాకేమితెలుయునే
నీదు దాసుడన్,నిను సేవించు భక్తుడన్
నాయందు కరుణించి చీత్కారముల్ విడచి
కటాక్షవీక్షణముల్ ప్రసరించు

నాపై నీప్రేమామృతము కురిపించు
దేవి కారుణ్య హృదయి
పాహిమాం పాహిమాం పాహిమాం