తెలుగుబాట – ఆగష్టు 29న హైదరబాద్‌లో

తెలుగుబాట

తెలుగుబాట

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి… అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.