పితృదేవోభవ

పితృదేవోభవ

పితృదేవోభవ

హిమాలయం కరగటం చూసా
కరిగి వాకిట్లో సెలయేరుగా పారటం చూసా
మౌనం వీడి కేరింతలు కొట్టడం చూసా
నాతో కలిపి నట్టింట్లో కుప్పిగంతులు వెయ్యటం చూసా

నిలువెత్తుగా నిలబడ్డ గాంభీర్యం చూసా
తొణకని వ్యక్తిత్వం చూసా
చుక్కలనంటే ఆశయాన్ని చూసా
ఆదుకుంటా అనే అభయం చూసా

శిఖరం వరకూ మలచిన దారిని చూసా
దారి పక్కన ముళ్ళ పై రక్తపు మరకలు చూసా
కొండెక్కిన వెన్నెల చూసా
ఇవన్నీ నాకే అన్న సంఙ్ఞని చూసా

నాన్నా నువ్వే నా తొలిగురువు
నువ్వే నా మలిగురువు
నీ మౌనం,జీవనం ఒక పాఠం
నువ్వు నడిచే ఙ్ఞానం

ఎందరు వేలు పట్టి దిద్దించినా
ఎన్ని వేల పుస్తకాలు చదివినా
బ్రతకటం నేర్పేది మాత్రం
నీ వేలు పట్టి నడిచిన దారే.

ఈ దేహం నీది
ఈ రక్తం నీది
ఈ జీవితం నీది
నేను కేవలం నీ నీడని.

అడ్రసులేని ఉత్తరం

హాయ్ రా,
నేను కూడా నీలానే పిలిచా. ముందెప్పుడూ ఇలా పిలవలేదు కదా. నిజానికి ఎలా పిలవాలో తేల్చుకోలేక. నాకు ఇదో పెద్ద కన్‌ఫ్యూజన్. ఎవరినయినా పిలిచేప్పుడు,పలకరించేప్పుడు మన మనసులో ఏం ఫీల్ అవుతున్నామో అది exact గా పిలవగలిగితే మన మనసులో కాస్త తృప్తిగా ఉంటుంది. అవును ఇదే నేను అనుకుంటున్నది సరిగ్గా అనిపిస్తుంది. If your salutation reflects what you exactly feel about the other person, you could feel like some transmission of an unknown feel b/w two hearts. Of course the relation between those two may be any damn thing. Did you ever feel it? అందుకే నేను ఒక్కోసారి ఒక్కోలా పిలుస్తా. ఎప్పుడు ఏది నచ్చుతుందో మనకే తెలియదుగా. Anyways off the context.

ఏంటీ బ్లాగులో ఎప్పుడూ “ఐ హేట్ యూ”, “పార్టింగ్ నోట్” అని వ్రాస్తున్నా అని కోపమా? బ్లాగులో వ్రాసేవన్నీ నా ఫీలింగ్స్, నా experiences. అందులో కొన్నిసార్లు నీ గురించి వ్రాయొచ్చు కొన్నిసార్లు వేరే వాళ్ళ గురించి కావొచ్చు. కానీ అవేవి వ్యక్తిగతంగా మీ మీద కోపంతో కాదు. My mind is a dark room. అక్కడ నాతో నేనే గొడవపడుతూ ఉంటా. నాతో నేనే వాదించుకుంటూ ఉంటా. అక్కడ ఎవరి మీద కోపంతోనో ద్వేషంతోనో అరవను. నాలో జరిగే struggle severity బట్టి content ఉంటుంది. కోపం అంతా నా ఫీలింగ్స్ మీద లేకపోతే నా fate మీద ఇలా అన్నీ నాతో నేనే.

Forget about the departing. Few things in this world are out of our control and we can’t change those things. Thinking of them is solving a puzzle which has no answer. One thing I always tell you. Probably this is 10 millionth time. మనిద్దరం మాట్లాడుకోవటం మానేసిన తర్వాత నిజానికి ఈ ప్రపంచంలో నా existence నీకు, నువ్వాన్నవని నాకు తెలియకుండా ఎన్నో ఏళ్ళు గడిపుండొచ్చు. ఆ టైంలో అసలు నేను నీకు గుర్తు వచ్చి ఉండకపోవచ్చు. నిజానికి గుర్తుచేసుకునే అవకాశం కూడా లేదులే. కానీ నాకు ఏకాంతంలోనూ,ఒంటరితనంలోనూ ఇంకా correct గా చెప్పాలంటే whenever I try to walk back into roots of my life I always observe you smiling beside me like a water mark. It may be my child hood or student life whatever I used to feel like you were there always observing me. You name it as madness or any damn thing but I swear it is true. You know while typing these lines also I felt the same feelings and my eyes filled with tears. These emotions suck. I should quote a few lines from my story photon here.

“అందుకే అందరూ బయటకి వెళితే నేను రూంలో కూర్చుని నెట్ మీదపడ్డా. ఏవో ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటే ఒక ఫోటో కనిపించింది. మొదట కొంచెం కంగారుగా అనిపించింది. ఎదో అలజడి ఇంక ఇలానే ఉంటే ఎవో ఙ్ఞాపకాలు వెంటాడుతాయని భయంవేసింది. ఎవో పాటలు పెట్టి ల్యాప్పీ ని వదిలి పక్క రూమ్‌లోకి వచ్చా. ఎవరూ లేరు అంతా బయటకి వెళ్ళారు. రాత్రి వరకు ఎవరూ రారు. బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నా. చిన్నపిల్లలు ఆడుతూ కనిపించారు. అవే ఙ్ఞాపకాలు స్కూలు, ఆటలు, స్నేహితులు. ఏ ఙ్ఞాపకాలు మనం పదిలంగా దాచుకుంటామో, ఏ ఙ్ఞాపకాలు మన తర్వాతి జీవితంలో తీపి గుర్తులంటామో అవే నా పాలిట శాపంగా మారాయి. ఎవరికయిన చిన్నప్పటి రోజులు గుర్తొస్తే తలుచుకుని నవ్వుకుంటారు. అందరికి చెప్పుకుంటారు. కానీ నేను మాత్రమే ఎందుకిలా? కారణం ఒకటే ఆ గతంలోకి మరలా వెళ్ళిపోతే బాగుందనిపిస్తుంది. గతం తిరిగి వర్తమానంగా మారిపోతే బాగుంటుందనిపిస్తుంది. బాగుందనిపిస్తే సమస్య కాదు అలా జరగనందుకు ఏడుపొస్తుంది, పిచ్చిలేస్తుంది.”

నిజానికి ఈ paragraph వ్రాసేప్పుడు అంతలా నేను analyze చెయ్యలేదు. ఇప్పుడు ఇక్కడ అవే lines paste చేసినప్పుడు instant గా అనిపించింది నీకు చెబుతున్నా. ప్రస్తుతంలో బ్రతకటం అంటే నువ్వు లేవనే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఈ జీవితమంతా బ్రతకాలి అదే గతంలోకి తిరిగి వెళ్ళిపోతే కనీసం illusion లో అయినా హాయిగా రోజూ నిన్ను చూస్తూ, మాట్లాడుతూ గడిపెయ్యొచ్చు. నిజానికి అప్పుడు అలానే బ్రతికేవాడ్ని కదా. Let me end this mad session. I met more beautiful girls, closer friends and sincerely girls better than you in many aspects. But I never felt like what I had felt for you. Still I am struggling to find a reason, why it happened with you only.

ఇంత ఆవేదన మనసులో ఉంది కాబట్టి నా డార్క్ రూమ్ కొన్నిసార్లు వార్ రూమ్‌లా మారి నిన్ను ద్వేషించమని శాసిస్తుంది. అప్పుడు కసిగా ద్వేషిస్తా. కొన్నిసార్లు నిన్నలో దాచుకున్న అందమైన ఙ్ఞాపకాల సుగంధాలు తాకి అంతులోని భావుకత్వం నన్నావహిస్తుంది. ఇవన్నీ నా మనసులో పొంగే భావ తరంగాలే తప్ప వ్యక్తిగతంగా నీ మీద కోపం పెంచుకోవటం వల్ల కాదు. ఏప్పటిలానే “ఏదయినా ఏం లాభంరా మనమిక జన్మలో కలవలేం కదరా అంటావా?”

వెన్నెల్లో నువ్వాడుకుంటూ ఉంటే రాలేనేమో
కానీ రావాలనే ఉంటుంది.
ఇసుకలో నీ చేతులు గుడిని కడుతుంటే నా చేతులు తోడుకాలేవేమో
కానీ ఆ అవకాశంపోయినందుకు భాదగా ఉంటుంది.
మంచుకురుస్తున్నప్పుడో, వానలో తడుస్తున్నప్పుడో నీ పక్కనే నేను లేకపోవచ్చు
కానీ ఎవరయినా చూసి చెబితే అదే ఊహించుకుంటూ ఉంటా.
నీకు అవసరమయి పిలిచిన ప్రతిసారీ నేను రాలేకపోవచ్చు
కానీ ప్రతీక్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటా.
పొరపాటునా ఏరోజైనా నీ కంటినుండి నీళ్ళు వస్తే మాత్రం
నువ్వు వద్దన్నా వస్తా నీతోనే ఉంటా…

అందరూ నీతో ఉన్నప్పుడు నా ప్రేమ నీకవసరంలేని ఆటబొమ్మలా కనిపించొచ్చు, కానీ ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు, దిగులు చీకట్లు కమ్ముకున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ కన్నీటి చుక్క నేల రాలనివ్వనంత దూరంలో నా ప్రేమ నీ తోడుగా ఉంటుంది.

Just
Murali

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు
సక్కగా తిక్క శంకరయ్య పక్కజేరినవ్ లే.

ముగ్గురమ్మల పుణ్యమంటవ్
మూడు కళ్ళోడి పూజలంటవ్
కయిత్వాల్ రాస్తవ్
తత్వాల్ పాడతవ్

ఎండికొండోడు ఏమిచ్చిండొ ఏమో
కవులకు కనకాభిషేకాలన్నవ్
నీ కతల్, కయితల్ సల్లగుండ
నీ ఇస్టోరీ నే డిసైడ్‌జేసినా సూడు

రైలుబండోలింట పుట్టినవ్
ఏడు బోగిలతో చుకుచుకాడినవ్
తరగతిలా నాటకాలాడినవ్
మధ్యతరగతిలా బ్రతుకుల్ సదివినవ్

కధల్లేవ్ తెరదించాలంటే
సిరాలో కాయితాల్ ముంచినవ్
జంతువులచేత అండాలు పెట్టించినవ్
జనాలచేత దండాలు పెట్టించినవ్

ఏదికలెక్కుడు ఇసుగుపుట్టింద ఎమో
ఎండితెర ఎంటపడ్డవ్
ఆడోళ్ళకి కుట్టేటోడికి కధల్ కట్టినవ్
రాములోరి శివునికి వంతపాడినవ్

తోటరాముడూ అని కృష్ణుడు పిలిస్తే
పాన్ తీసి పెన్ మూసినవ్
ఆమె అన్నవ్ అతడన్నవ్
తిట్టించుకున్నవ్ భుజాల్ తట్టించుకున్నవ్

పాతికేళ్ళు నిండిపోయినయ్
కొత్త కళలు పుట్టుకొచ్చినయ్
నాడు గోగ్రహాణాల్ నేడు గ్రహణాల్
ఎండితెర మీద జర ఇంకుజల్లినవ్

ఆడ యాడో కొండ ఇరిగితే
ఈడ నీ గుండె పగిలినాది
కండ్లల్లా నీళ్ళు కురిసినయ్
కాయితాల్లా  తత్వాల్ ఎలిసినయ్

అన్నిట్లా ఉండేటోడ్ని
అందరికీ సూపినవ్
నువ్వు ఆయన గుడులెంటపడితే
ఆయన నీ గుండెల్లో పండిండు

బాంచెన్ నీ కాల్మొక్కతా శంకరయ్య
యాడున్న మా భరణిని సక్కగా డిసైడ్ జెయ్.

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

చిరుఆశ అనే ఒక టపాతో చిరంజీవి రాజకీయప్రవేశం గురించి కాస్త పదాల అల్లికతో ఏదేదో వ్రాసి ఒకటపాగా వేసి బ్లాగు అనగానేమి అనే ప్రశ్న వెంట మొదలయిన నా ప్రయాణంలో మూడేళ్ళు నిండాయి. అసలు నేను వ్రాస్తే ఎవరన్నా చదువుతారా? స్పందిస్తారా? అభినందిస్తారా అనే అనుమానాలతో. ఆరాటలతో మొదలయిన నా బ్లాగు ప్రయాణంలో గుర్తుచేసుకోదగ్గ స్మృతులు ఎన్నో.ఈ మూడేళ్ళ నా ప్రయాణాన్ని కాస్త అవలోకనం చేసుకోవలనిపించింది. ఏముంది పెద్ద గొప్ప? అని ఎవరన్నా అంటే నా సమాధానం ఏ వ్యక్తీ గొప్పపనులు చెయ్యడు. కొందరు వ్యక్తులు చేసిన పనుల్ని సమాజం మాత్రం గొప్పగా భావిస్తుంది. నా దృష్టిలో గొప్పతనం సాధించేది కాదు కేవలం ఆపాదించబడేది. అందుకే ఈ టపా గొప్పతనాన్ని మాత్రమే సహించే గొప్పవాళ్ళ కోసం కాదు. ఇది నాలాంటి ఒక మాములు మేంగో మేన్ తన ఆలోచనలతో వ్రాసుకున్న బ్లాగు మరియు బ్లాగు ప్రయాణం పై ఒక విహంగ వీక్షణం.

మూడేళ్ళ క్రితం ల్యాప్‌టాప్ కొన్న కొత్తలో అంతర్జాలంలో చాటింగ్,మెయిలింగ్ తప్ప వేరే ఏమీ తెలియవు నాకు. తెలుగులో అందరూ పెట్టే మెసేజ్లు, స్టేటస్లు ఎలా వస్తున్నాయో తెలుసుకుందామనే ప్రయత్నంలో గూగులమ్మని ఆశ్రయించా. పేదరాసి పెద్దమ్మని కదిపితే కధలకి లోటా? అనగనగా ఒక వీవెన్ అనే రాజు తన రాజ్యంలో జనాలంతా పరభాషా వ్యామోహంలో కొట్టుకు పోతుంటే ఇలా అయితే మన గత కీర్తికి ఏం కాను అని భయపడినవాడై “దేశ భాషలందు తెలుగు లెస్స. కోడు భాషలందు యునీకోడ్ లెస్స” అని పలికి, వారికోసం “శ్రీ రాజీవ్ లేఖిని” (క్షమించాలి అలవాటులో పొరపాటు) లేఖిని అనే పధకాన్ని ప్రవేశపెట్టాడని తెలిసింది. మచ్చుకు కొన్ని బ్లాగుల్ని చూపించి వదిలింది.

దొరికిన బ్లాగుల్ని పట్టుకుని వాటి వెంట పరిగెట్టి, అందులో కామెంటిన వారి బ్లాగుల్లోకి జంపింగులు చేస్తూ ఏకబిగిన పదమూడు పగల్లు, పదమూడు రాత్రులు గడిపాను. అఫీసులో అప్పటికే అఫ్లికేషన్ కంటే వికీ ఎక్కువ వాడతానని అపవాదు ఉంది. దానికి బ్లాగులు తోడయ్యాయి. దీనితో మన అప్రైజల్ కాస్త గోవిందా కొట్టింది. కానీ కొత్త దొంగోడు వేకువ ఎరుగడని (బాగా చెప్పానా? :)) నేను మాత్రం నా పంథా మార్చుకోలేదు. చదవగా చదవగా నిత్యరోగికి హాస్పిటల్ పెట్టేయాలని దురదపుట్టినట్టు నాకు కూడా ఒక బ్లాగు తెరవంగ మనంబున మిక్కిలి దురదపుట్టెన్.

ఏం వ్రాయాలో తెలియదు. ఏం వ్రాస్తే అందరూ చదువుతారో తెలియదు. అందర్నీ ఆకట్టు కోవటానికి ఆంధ్రలో అందరూ వాడే ఫార్ములా దొరికింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిందంతే అన్నటైపులో వ్రాసాను. వ్రాసి పోస్టు వేసి “వస్తాడు నారాజు ఈ రోజు” అని పాడుకుంటూ కామెంట్లకోసం ఎదురుచూసా. “రేయిగడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే” అని పాడి పాడి అలిసి సొలసి పడిపోయాకా అబ్రకదబ్రగారు డింగ్ మని ప్రత్య్క్షమయ్యారు. గూగుల్లో చూసి ఇటొచ్చా నాయన ఏంటీ వెర్రి రాతలు? సరే ఏదో ఒకటి ఏడు కానీ అమెరికా వెళ్ళాలనుకునేవాడివి శంషాబాద్ వెళ్ళాలి కానీ ఇలా అమీర్‌పేట్ చౌరస్తాలో దారి తప్పోయినోడిలా అయోమయంగా ఎదురుచూస్తే ఎట్టా అన్నారు. అంతా విని మూసినది పుష్కరాల్లో దారితప్పోయినోడిలా మొహం పెట్టి ఇంతకీ ఎటు వెళ్ళాలి అని అడిగా. “పార్ధాయ ప్రతిభోదితాం భగవత నారాయణీనస్వయం” అని చిరునవ్వు నవ్వి “పార్ధా, కనిపించే ఈ మూడు చౌరస్తాలు అమీర్‌పేట, కూకట్‌పల్లి, మూసపేట చౌరస్తాలయితే కనిపించని ఆ నాల్గవ చౌరస్తానే కూడలి.. కూడలి.. కూడలి” అని చెప్పి డింగుమన్నారు.ఆయనకి మొదటిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను.

కూడలిలో క్రూరమృగం నా మొదటి టపా. అప్పటికే బ్లాగులోకంలో సీనియర్లు సుజాతగారు, చావాగారు, కత్తి మహేష్‌గారు, బొల్లోజు బాబాగారు అభినందిస్తూ కమెంట్లుపెట్టారు. అటుపైన నా బ్లాగు కాస్త అందరి దృష్టిలో పడింది. చదివినవాళ్ళు సూచనలు, అభినందనలు ఇచ్చారు. “హ హా హాసిని, నేటికి నెరవేరిన మూషికవరం, బందరు మామయ్య – బంగారు బాతు, హాసిని కి పెళ్ళి చూపులోచ్…, జాజు – ఒక కాకి కధ, జావా జావా కన్నీరు” లాంటి సూపర్‌హిట్టు టపాలు వ్రాసాక బ్లాగులోకంలో నా బ్లాగు కూడా అందరికీ తెలిసింది..ఇందులో అత్యధిక టపాలకు కధావస్తువుగా నిలిచిన నా స్నేహితురాలు హాసినికి నా కృతఙ్ఞతలు. “భయంగా ఉంది నాన్న…, e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక” వంటి టపాలకు అందరి ప్రశంసలు అందుకున్నా.

చదివినవారందరూ గుర్తుంచుకోకపోయినా చాట్లోనో, కాల్ చేసో కొన్ని వాక్యాలు ఉటంకించి బాగున్నాయి అని చెప్పినప్పుడూ ఆనందపడ్డా. సవరణలు, టైపాట్లు చెప్పినప్పుడు సర్దుకున్నా. నా వరకు నాకు సంతృప్తినిచ్చి మరలా మరలా చదువుకునే టపాలు, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పటికీ చాలాసార్లు నా టపాలు నేనే చదువుకుంటా. కాకిపిల్ల కాకి ముద్దు అని నవ్వి పోదురుగాక. కానీ భాదలో ఉన్నప్పుడు నా టపాలే నాకు కొన్నిసార్లు స్వాంతననిచ్చాయి, నిరాశలో ఉన్నప్పుడు ఉత్సాహాన్నిచ్చాయి. కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఇంత గొప్ప భావం నాకేలా తట్టిందబ్బా అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. బోస్టన్‌లో ఉండగా ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నా టపాలు బాగున్నాయి అని చెప్పిన అనుభవాలూ ఉన్నాయి. భయంగా ఉంది నాన్న చదివినప్పుడు అమ్మమ్మ,ఇంకొంతమంది భందువులు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఫోన్ చేసిన చేదు స్మృతులూ ఉన్నాయి. క్రమం తప్పకుండా మమ్మీ ఇప్పుడు నా బ్లాగు చదువుతుంది. బోస్టన్‌లో ఉండగా మా క్లైంట్ మేనేజర్ శంకర్ నా వ్రాతల కారణంగా ఇప్పటికీ నన్ను గుర్తుంచుకున్నారు. నా బజ్జులో క్రమం తప్పకుండా కామెంట్లు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. భరణిగారు, దర్శకులు వంశీగారు వంటి కొందరు ప్రముఖులను కలిసే అవకాశం కూడా బ్లాగు వలనే కలిగింది నాకు. ఇంకా చెప్పాలంటే చాలా ఙ్ఞాపకాలు ఉన్నాయి. ఒకప్పుడు నా డైరీ అని పొదవిపట్టుకునేవారట. ఇది నా బ్లాగు మురళీగానం, అడవి లోని వెదురు పలికే స్వరాలు.

ఈ బ్లాగుతో అసలేం సాధించానని? తెలుగు సాహిత్యమనే సముద్రంలో చిన్న నీటిబొట్టుని కూడా కాలేను. కానీ ఎంత గొప్ప సాహితీవేత్తయినా “నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో! పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ” అన్న నా చిరుకవితను విని “అర్భకా! ఈ భావం బాగుందిరా” అని అనకపోతారా? పైగా పప్పు,నిప్పు,ఉప్పు,తుప్పు అని ప్రాసలో పదాలు కూర్చటమే కవిత్వం, అనే అఙ్ఞానంలోనే ఉండిపోకుండా నాది అనే స్వరం కోసం అన్వేషణ సాగిస్తున్నా. అసలెప్పటికీ నా ఐడెంటిటీ సాధించలేకపోయినా ఈ అన్వేషణ చాలు నాకు తృప్తినివ్వటానికి. నన్ను ప్రపంచం తెలుసుకోవటానికి, నేను ప్రపంచాన్ని తెలుసుకోవాటానికి, అసలు నన్ను నేనే తెలుసుకోవటానికి బ్లాగులోకం ఉపయోగపడింది. నా ఆలోచనలు ఒక నిర్దిష్టతను సంతరించుకోవటంలోనూ, వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాలు, వృత్తులు, ప్రవృత్తులు, భావజాలాలు, భేషజాలు, విపరీత భావాలు, మనస్తత్వాలు తెలుసుకొని ఒక అవగాహన ఏర్పరుచుకోవటంలో బ్లాగులోకంలో నా ప్రయాణం ఎంతో ఉపయోగపడింది. నా చేతల్లోనూ, వ్రాతల్లోనూ ఒక పరిణతికి ఉపయోగపడింది.

ఈ మూడేళ్ళలో బ్లాగులోకంలో ఎంతో మార్పు వచ్చింది.చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉండేది ఒకప్పుడు. బ్లాగర్లంతా చాలా ఆత్మీయంగా ఒకే కుటుంబంలా ఉండేవారు. నేను వచ్చిన కొత్తలో నా చేయి పట్టుకు నడిపించారు. ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తూ సహాయ సహకారలందిస్తూ స్నేహంగా ఉండేవారు. బ్లాగులోకం విస్తరించిన కొద్దీ ఎన్నో బిగ్ బాంగ్‌లు సంభవించాయి. విడి విడిగా పాలపుంతలు ఏర్పడ్డాయి వేటి స్వయం ప్రతిపత్తి వాటిది, వేటి మనుగడ వాటిది. ఏ వ్యవస్థలోనయినా మార్పు నియంత్రించలేనిది, అనివార్యమైనది.

నిన్నటిది నేటికి పాతబడుతున్న ప్రపంచంలో బ్లాగు పోయి, బజ్జు వచ్చే డాం డాం డాం అని మారుతున్న రోజుల్లో బ్లాగులు ఉంటాయో ఊడతాయో తెలియదు కానీ బ్లాగులోకంలో కొందరు సన్నిహితులు మాత్రం ఎప్పటికీ నా మనసులో అలానే ఉంటారు. కొందర్ని చూసినప్పుడు వీళ్ళు మురళీగాడి బ్లాగు ఫ్రెండ్స్‌రా అని నా స్నేహితులు అంటారు. అలా ఒక ప్రత్యేకమైన స్నేహవర్గం నాకు దొరికింది. మొదట్లో కామెడీ పోస్టుల ద్వారా దోస్తీ కట్టిన శ్రీవిద్య, మీనాక్షి, ఆశ్విన్ తో మొదలు, కవితలతో దోబూచులాడే క్రాంతి వరకూ అందరూ ఆప్తులే. తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచే సతీష్ అన్నయ్య, శ్రీనివాస్ కుమారన్నయ్య, నా ఫీజులేని డాక్టర్ కౌటిల్య, ఇప్పుడు అవినేని అన్నయ్య, టపాలు చదివి అభినందించటమే కాక కొన్ని మంచి మంచి చర్చలు చేసే విశాలగారు అందరూ అభిమానం చూపించినవారే.

e-తెలుగు సభ్యుడిగా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో నా ఉడుత సహాయం అందించాను. సమయంలేక ఇప్పుడు సంస్థ కార్యక్రమాల్లో హాజరుకాకపోయినా నన్ను ఏనాడు నిందించని కార్యవర్గానికి ఏ రూపంలో కృతఙ్ఞత చూపించాలో? సంస్థలో చురుకుగా పాల్గొనటం వలన చదువరిగారు, వీవెన్‌గారు, కశ్యప్‌గారు ఇలా నిర్ధిష్ట అభిప్రాయాలున్న వ్యక్తుల సాహచర్యం దొరికింది. వ్యక్తిగా వీరి వద్దనుండి నేర్చుకున్నది ఎంతో ఉంది. లాభాపేక్షలేని సంస్థకి తమ సమయాన్ని కేటాయిస్తూ, పదవులు, హోదాలు కూడా ఉత్సాహవంతులకు కట్టబెట్టి తాము మాత్రం కాడి భుజానికిఎత్తుకొంటారు. సి.బి.రావుగారు, శ్రీనివాసరాజు దాట్ల, చక్రవర్తిగారు, రవిచంద్ర ఇలా గత ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, e-తెలుగు కార్యక్రమాలకి తమ వంతు సహకారం ఎప్పుడూ అందించే కొందరు బ్లాగర్లు వీరందరి నుండి “స్వంత లాభం కొంత మానుకు” అనేదానికి అర్ధం నేర్చుకున్నాను. విఫలమై ప్రజలు గుర్తించని కొన్ని కార్యక్రమాలకు కూడా ముందు వెనుక వీరు చేసిన కృషి సభ్యుడిగా నాకు తెలుసు. ఏం ఉద్దరిస్తారు తెలుగుని నిలబెట్టి? అని ఎవరన్నా అంటే సొంత తల్లిని తిట్టినట్టే భావించే వీరి సంస్కారం నాకు ఆదర్శాలను ఎంత త్రికరణ శుద్దిగా నమ్మాలో తెలియజెప్పింది.

రేపు ఈ బ్లాగులు,బజ్జులు అన్నీ పోవచ్చు. కానీ వీరంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నా జీవనప్రయాణంలో భాగంగా ఉంటారు. నా బ్లాగు ప్రయాణంలో నాకు ఎంతో ఇచ్చిన మీ అందరికీ కృతఙ్ఞతలతో…

మీ
మురళీ

నాకు నచ్చిన గుర్తుచేసుకోదగిన టపాలు కొన్నిక్రింద ఇస్తున్నా.

హాస్య టపాలు:
1.కౄర మృగం
2.హ హా హాసిని
3.నేటికి నెరవేరిన మూషికవరం
4.బందరు మామయ్య – బంగారు బాతు
5.హాసిని కి పెళ్ళి చూపులోచ్…
6.జావా జావా కన్నీరు
కవితలు:
1.పిచ్చి రాతలు
2.లాలీ జో.. లాలీ జో..
3.నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.
4.నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..
5.ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.
నివేదికలు:
1.e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక
2.ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…
3.శంకరా’భరణం’
ఇతరములు:
1.ఇదే నా మొదటి ప్రేమలేఖ…
2.జాజు – ఒక కాకి కధ
3.>భయంగా ఉంది నాన్న…
4.పెళ్ళి-ఒక దృక్కోణం
గుర్తింపుకి నోచుకోని నాకు నచ్చిన టపాలు:
1.కాకి దిద్దిన కాఫురం (!?!)
2.పార్టింగ్ నోట్
3.ఐ హేట్ యు రా
4.సరికొత్తచీర ఊహించినాను..