సత్తెమ్మ

నలుపుతెలుపులు అల్లుకున్న ఆ నాలుగు గోడల మధ్య ప్రపంచంలోని నలుపుని దూరంచేయటంకోసం యుగాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మానవీయ విలువలకోసం కొలమానాలు నిర్వచింపబడుతున్నాయి. కానీ చీకటి పడితే వెర్రితలలేసుకు విరుచుకుపడే రాక్షసత్వం మానవత్వాన్ని వెక్కిరిస్తూనే ఉంది. యుగాలు మత్తుగా మునగదీసుకుని పుస్తకాల్లో చేరి అల్మరాలో పడుకున్నాయి. నీతి లేని ఈ జాతిని, ఈ జుగుప్సని చూడలేక న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకుంది. అమాయకుల ఆర్తనాదాలు ఆమె చెవిన చేరినప్పుడు తను కార్చే కన్నీటిని మాత్రం ఆ గంతలు అడ్డుకోలేక పోతున్నాయి.

జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనసూయమ్మ అలసటగా కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా నలుగుతున్న సత్తెమ్మ కేసు ఈ రోజు వాయిదా ఉంది. అప్పటికే ఉదయం నుండి వాయిదాలు వింటూ వస్తున్న అనసూయమ్మకి సత్తెమ్మ కేసు అంటేనే గుండె దడగా ఉంది. సత్తెమ్మ 20 ఏళ్ళ అమ్మాయి. పేదరికాన్ని, అవిద్యని మూటగట్టిన ఆమె ఆహార్యాన్ని పక్కనబెట్టి చూస్తే అనసూయమ్మకి సత్తెమ్మ తన కూతురిలా అనిపిస్తుంది.  సత్తెమ్మ ఒక ముద్దమందారమయితే, ఉన్నత విద్య కలిగి, విలాసమైన భవంతి లో తిరిగే అనసూయమ్మ కూతురు ఓ గులాబి అంతే తేడా.

సత్తెమ్మ భారంగా నడుచుకుంటూ పంటి బిగువున భాదని దిగమింగి వస్తూ ఉంటే, అనసూయమ్మకి పొత్తు కడుపులో ఎవరో కాలితో తన్నినంత నొప్పిగా అనిపించింది. అధికారం తనని కట్టిపడేయకపోతే తనలోని మమకారం ఆ కోర్టులో ఆక్రోశించేది. సత్తెమ్మ వచ్చి జడ్జి ముందు నిలబడి “దండాలమ్మ” అని నీరసంగా అంది. ఇంతకష్టంలోనూ అమ్మా అని పిలిచి ఈ జాతి సిగ్గుపడేలా చేసింది ఈ చిన్నితల్లి అనుకుంది అనసూయమ్మ మనసులో. “ఆ అమ్మాయికి కుర్చీ వేయండి” అని ఆదేశించింది.ఆ గొంతులో అధికారం మాత్రమే ధ్వనించింది. మమకారం గుండెల్లోనే ఆగిపోయింది.

ప్రాసిక్యూటర్ అనంతలక్ష్మి రోజూ ఎన్నో కేసులు చూస్తూ ఉంటుంది. అందుకే యధాలాపంగా వచ్చి కేసు వివరాలు చెప్పుకుంటూ పోతుంది. అనసూయమ్మ సత్తెమ్మ వాలిపోతున్న కళ్ళ వైపే చూస్తుంది. మధ్య మధ్యలో పళ్ళ బిగువున భాదని ఓర్చుకుంటున్న సత్తెమ్మ కష్టం అనసూయమ్మ తప్ప ఎవరూ గమనించలేదు. సత్తెమ ఇప్పుడు పచ్చిబాలింతరాలు. రెండురోజుల ముందే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులంటే అత్యంత శ్రద్ద చూపించే మన ప్రభుత్వ డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేసారు. పైసా కూడా ఇచ్చుకోలేని రోగి మీద సమయం వెచ్చించటం వృధా అని బియ్యపుసంచి కుట్టినట్టు కుట్టి పడేసారు. ఆ నొప్పితో ఆమె పడుతున్న భాదని ఊహించుకుంటేనే అనసూయమ్మకి కడుపులో ప్రేవుల్ని ఎవరో మెలితిప్పిన భావన కలుగుతుంది. కుర్చీలొ కుదురుగా కూర్చోలేక అసహనంగా కదులుతూ ఉంది.

సత్తెమ్మ ఒక సాదారణ రైతు కూలీ కిట్టయ్య కూతురు. ఊరులో ఉన్న ఒక్క ఎకరా పొలం పండక కూలీలుగా మారి మొత్తం కుటుంబం కష్టపడుతూ ఉండేది. సత్తెమ్మ చూడ చక్కని అమ్మాయి. హైదరాబాదులో ఒక అపార్ట్‌మెంట్లో వ్యాచ్‌మాన్‌గా పనిచేసే వీరిబాబు సత్తెమ్మని పెళ్ళి చేసుకుంటా అని అడిగాడు. దానికి బదులుగా పొలానికి కావాల్సిన విత్తనాలకి మిగిలిన పనుల మదుపుకి 10వేలిస్తాని కిట్టయ్యని వొప్పించి పెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ళు సంసారం సాఫీగానే సాగింది. సత్తెమ్మ ఆ అపార్ట్‌మెంట్లో కొన్ని ఇళ్ళకి పాచి పనులు చేసి ఎంతో కొంత తెచ్చేది. వీరిబాబు కి రోజులు గడుస్తున్న కొద్ది సత్తెమ్మ మీద మోజు తీరిపోయింది. తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే నీ కూతుర్ని ఏలుకోనని కిట్టయ్య కి కబురు పెట్టాడు. కిట్టయ్యకి ఆ సంవత్సరం కూడా కలిసి రాలేదు. అల్లుడిచ్చిన డబ్బు పొలం మీద పెడితే ఇంకా 5వేలు అప్పు మిగిలిందే తప్ప పైసా కూడా లాభం లేదు. తన నిస్సహాయతని పెద్దల ముందు చెప్పాడు. కుల పెద్దలు వీరిబాబుని పిలిచి మందలించి పంపారు.

అది జరిగిన తర్వాత వీరిబాబులో మంచి లక్షణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. తాగి వచ్చి పెళ్ళాన్ని కొట్టడం లాంటివి చేసేవాడు. ఒకరోజు వీరిబాబు లేని సమయంలో సత్తెమ్మకి వాంతులయ్యాయి.డాక్టర్ తల్లివి కాబోతున్నావు అని చెప్పాడు. ఆ మంచివార్త చెబుదామని ఇంటికి వెళ్ళిన సత్తెమ్మకి ఇంట్లో స్నేహితులతో మందు తాగుతూ వీరిబాబు కనిపించాడు. అలా రాత్రి దాకా తాగి వీరిబాబు మత్తుగా పడిపోయాడు. లోపల ఒంటరిగా పడుకున్న సత్తెమ్మని వెనుకనుండి వచ్చి మూతికి గుడ్డకట్టి బలవంతంగా తెల్లారే దాకా అనుభవించి వీరిబాబు స్నేహితులు పారిపోయారు. తెల్లారితే నిజం తెలిసిన వీరిబాబు జరిగిన తప్పుకి తలొంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. పోలిసులకి తెలిస్తే పరువుపోతుందని పిర్యాదు చెయ్యలేదు. మందుషాపు దగ్గర తరుచూ కనిపించి అప్పుడప్పుడు మందుపోయించే ఆ స్నేహితులు మరలా కనిపించలేదు. కానీ సత్తెమ్మని అబార్షన్ చేయించుకోమన్నాడు. తాను కుదరదని తెగేసి చెప్పి ఇంటికి వచ్చేసింది. రేపొద్దున సత్తెమ్మ కడుపులో బిడ్డ నాదంటే నాది అని స్నేహితులు గేలిచేస్తారని, లోకం నవ్వుతుందని భయపడ్డ వీరిబాబు  రాత్రిపూట సత్తెమ్మ గొంతులో బలవంతంగా నాటుమందుపోయటానికి ప్రయత్నిస్తుంటే తప్పించుకోవటానికి సత్తెమ్మ చేతికి దొరికిన కర్రతో వీరిబాబుని కొట్టింది. తగలరానిచోట తగిలిన వీరిబాబు చచ్చిపోయాడు. ఊరునుండి  వచ్చిన వీరిబాబు కుటుంబం సత్తెమ్మని అనుమానించి, వివాహేతర సంభందాన్ని అంటగట్టి పోలీసు కేసు పెట్టారు.

కొన్నాళ్ళు కేసునడిచాక కోర్టులో సత్తెమ్మకి శిక్ష ఖరారు చేసారు. కోర్టు చుట్టూ తిరగటం తప్పిందని అనుకుంటున్న సత్తెమ్మకి నెలలు నిండాయి. ఇప్పుడు బిడ్డని చేరదీసే దిక్కులేకుండా పోయింది. పుట్టింటోల్లు, అత్తింటివాళ్ళు ఎవరూ చేరదీయటానికి ముందుకు రాలేదు. కాదూ కూడదని పంచాయితీ చేస్తే పిల్లని తీసుకు వెళ్ళినట్టే తీసుకెళ్ళి చంపేస్తాం. ఈ పాపాన్ని మోసే శక్తిమాకులేదని ఖరాఖండీగా చెప్పేసారు. పుట్టిన బిడ్డని జైలులో ఉంచటం కుదరదని జైలు అధికారులు తేల్చి చెప్పారు. సత్తెమ్మ తనతో బిడ్డని జైలులో ఉంచమని న్యాయపోరటం మొదలు పెట్టింది. కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండగానే ఒకరోజు నొప్పులుమొదలయ్యాయి. ఆసుపత్రిలో బిడ్డకి జన్మనిచ్చింది. అదిజరిగిన రెండురోజులకే కేసువాయిదా అసుపత్రినుండి కోర్టుకి వచ్చింది.

వాదనలన్నీ విన్నాక అనసూయమ్మ తనబిడ్డని జైలులో ఉంచటం కుదరదని, సత్తెమ్మ విడుదలయ్యేంతవరకు ప్రభుత్వ వసతి గృహంలో ఉంచమని ఆదేశించింది. బిడ్డకి తల్లిపాలు కొన్నాళ్ళ వరకు అవసరం కాబట్టి కొన్నిరోజులు జైలులో ఉంచటానికి అనుమతినిచ్చింది. చట్టం పరిదికి లోబడి తనతీర్పునిచ్చి వెళ్ళిపోతున్న అనసూయమ్మతో “20 ఏళ్ళు వచ్చిన నాకే ఆశ్రయం,రక్షణ దొరకని ఈ లోకంలో ఈ పసిదానికి దిక్కెవరమ్మా? నీ బిడ్డలాంటిదాన్ని కాస్త కరుణించమ్మా” అంటూ మోకాళ్ళ పైబడి సత్తెమ్మ బ్రతిమాలుతూ ఉంది. అంతలోనే నరాలు మెలేసినట్టు గావుకేక పెట్టింది. సిజేరియన్ కుట్లు ఊడి నొప్పితో నేలపైనబడి ఉండచుట్టుకుపోయింది. క్షణం బ్రతకటంకంటే చావే మేలేమో అనే భయంకరమైన నొప్పి. అనసూయమ్మ ఆగలేకపోయింది. పరిగెత్తి వెళ్ళి సత్తెమ్మని చేరుకుని ఒడిలోకి తీసుకుంది. సిబ్బంది సహాయంతో ఆసుపత్రికి పోన్ చేసి ఆంబులెన్స్ తెప్పించింది. తనుకూడా అంబులెన్స్ లో బిడ్డని చేతుల్లో పట్టుకొని ఎక్కింది. సత్తెమ్మ భాదకి “చచ్చిపోతున్నా, ఈ నొప్పి భరించటం నా వళ్ళ కాదు. నన్ను చంపేయమని” ఏడుస్తుంది. మరోపక్క రెండే రోజుల పసిబిడ్డ ఆకలితో పేగులు ఎండి ఏడుపు మొదలుపెట్టింది. అనసూయమ్మకి తన నిస్సాహయతని భరించటం కంటే ఈ క్షణంలో గుండె ఆగిపోతే బావుంటుందనిపించింది. సత్తెమ్మ అంతనొప్పిలోనూ పసిబిడ్డని దగ్గరకి తెమ్మని అడిగి పాలిచ్చింది.

ట్రాఫిక్‌లో అంబులెన్స్ ముందుకు వెళ్ళలేక ఆగింది. సత్తెమ్మ ఏడుపూ, ఊపిరి కూడా. పసిబిడ్డ ఇంకా పాలుత్రాగే ప్రయత్నం చేస్తూనే ఉంది. అనసూయమ్మ అ పసిబిడ్డని అందుకుంది. ఈ వయస్సులో ఒక ఆడపిల్లని పెంచే భాద్యతను భుజాలకెత్తుకుంది.