నైనం ఛిందంతి శస్త్రాణి
గీత 2-23
గ్రామ తాంత్రిక్ నెత్తి మీద మండుతున్న మట్టి కుంపటి పట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ అన్ని వీధులూ తిరుగుతూ ఉన్నాడు. నోటితో విచిత్రమైన శబ్ధం చేస్తూ, మంత్రాలు చదువుతున్నాడు. అతని అరుపు వీధి చివరలో వినగానే ఆడవాళ్ళు, తమ పిల్లల్ని తీసుకుని ఇంటిలోకి పరిగెడుతున్నారు.
నెలరోజుల క్రితం మశూచి సోకిన యశ్‌పాల్ వాల్మీకిని గ్రామం నుండి వెళ్ళగొట్టారు.
“నాకు బ్రతకాలని ఉంది. నన్ను చావు వైపు నెట్టొద్దు, వైద్యం చేయించండి”
అని వాడు ఏడుస్తున్నా గ్రామం మొత్తం మశూచికి బలవుతుందనే భయంతో యశ్‌పాల్‌ని అడవిలోకి వెళ్ళగొట్టారు.
ఆ యశ్‌పాల్ ఆత్మ అడవిలో తిరుగుతుందని, దానిని తరిమేందుకు రాత్రి గ్రామంలో పహరా కాస్తానని తాంత్రిక్ ముందే చెప్పాడు. ఆ సమయంలో ఎవరూ ఇంటి గడప దాటి బయటకు రాకూడదని, తలుపులు మూసుకోమని హెచ్చరించాడు. ఎవరైనా బయటకి వస్తే యశ్‌పాల్ ఆత్మ వాళ్ళని అడవిలోకి లాక్కుని పోతుందని చెప్పాడు.
తాంత్రిక్ వీధిలో నడుస్తుంటే అందరూ తలుపులు మూసుకుని భయపడుతూ ఉన్నారు. ఒక ఇంటిలో కిటికీని కొద్దిగా తెరిచి ఒక పిల్లవాడు బయటకి చూస్తున్నాడు. వేగంగా నడుస్తున్న తాంత్రిక్ వచ్చి ఆ తెరిచిన కిటికీ దగ్గర ఆగి ఆ పిల్లాడి వైపు కోపంగా చూసాడు. వాడు బయపడి తలుపు వేసాడు. తాంత్రిక్ తిరిగి శబ్ధం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆ పిల్లాడు ఇంటిలోకి వెళ్ళి “అమ్మా లక్ష్మి ఇంటికి రాలేదు” అని బాధపడుతూ చెప్పాడు.
“నాన్న లక్ష్మిని తీసుకురావటానికే బయటకి వెళ్ళాడు.” ఆమె గొంతు వణికింది.
లక్ష్మిని వెతుక్కుంటూ లాంతరుతో అడవిలోకి వెళ్ళిన పిల్లాడి తండ్రి ప్రమోద్‌కి గంట చప్పుడు వినిపించింది. లేగదూడ లక్ష్మి అడవిలో తప్పిపోయి, అరుస్తూ తిరుగుతోంది. ప్రమోద్ లక్ష్మి గంటల చప్పుడు విని అటు వైపు నడుస్తున్నాడు.
గ్రామంలో నడుస్తున్న తాంత్రిక్ ముందు నుండి సుడిగాలి సర్ర్ర్ర్ మని దూసుకుంటూ అడవి వైపు వెళ్ళింది. తాంత్రిక్ అడుగు ఆగిపోయింది. ముడిపడిన భృకుటితో అడవి దిక్కు తీక్షణంగా చూసాడు. వీధిలో ఉన్న కుక్కలన్నీ ఆకాశంలోకి చూస్తూ ఏడుపు మొదలెట్టాయి. తాంత్రిక్ తలపైన దేదీప్యమానంగా వెలుగుతున్న కుంపటి ఫట్ మని ఒకేసారి ఆరిపోయింది.
ప్రమోద్ చేతిలోని లాంతర్ కిందపడింది. ప్రమోద్ అరుపు వినిపిస్తూ ఉంది, ప్రమోద్‌ని గుబురైన ముళ్ళపొదల గుండా ఏదో లాక్కునిపోయింది.
శైలేంద్ర ప్రతాప్ సింగ్ తను చదువుతున్న బుక్ “ది డెవిల్ ఆఫ్ చంపావత్” మూసి తన ముఖానికి పట్టిన చమటలు తుడుచుకున్నాడు. చంపావత్ వెళ్ళే దారిలో ఒక ట్రావెలర్ బంగ్లాలో అతను విశ్రాంతి కోసం ఆగాడు. వరండాలో నాగ్‌నాథ్ యాత్రకి వెళ్ళే సన్యాసి ఒకడు ఎర్రని కళ్ళతో చరస్ పీలుస్తూ మత్తులో తూగుతూ ఉన్నాడు. శైలేంద్ర చేతిలోని ఆ పుస్తకం చూసి “సైతాన్ హై వో, ఉస్కా నామ్ భీ మత్ లేనా” అని గంభీరంగా చెప్పి, తూగుతూ బంగ్లా దాటి చీకటిలోకి వెళ్ళిపోయాడు. ట్రావెలర్ బంగ్లాలో తాతతో పాటు ఉన్న పదేళ్ళ కిషోర్ ఆ సన్యాసి మాటలు విని ఆ బుక్ వైపు ఆసక్తిగా చూసాడు. అందరూ నిద్రపోయాక మెల్లగా లేచి ఆ బుక్ తీసి చదవటం మొదలు పెట్టాడు.
చంపావత్ ఊరు చాలా హడావుడిగా ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన చంపావత్ సంత రెండు రోజుల్లో మొదలవబోతుంది. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ ప్రధాన్ కోసం రచ్చబండ దగ్గర అందరూ ఎదురు చూస్తున్నారు.
ప్రధాన్ అల్లుడు టౌన్‌కి వెళ్ళి స్వీట్ దుకాణం పెట్టుకుందామని అనుకుంటున్నాడు. కూతురిని అంత దూరం పంపించటం ఇష్టంలేని ప్రధాన్ అతడిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ మశూచితో మూడు నెలల క్రితం ఆ గ్రామం లో చాలామందితో పాటు ఆ అల్లుడు కూడా ఇబ్బందిపడ్డాడు. చావు వరకూ వెళ్ళినవాడు టౌన్‌కి వెళ్ళి వైద్యం చేయించుకుని బ్రతికాడు. ఇప్పుడు గర్భవతి అయిన తన భార్యకి టౌన్‌లో అయితే మంచి వైద్యం అందుతుందని టౌన్ లోనే కాపరం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రధాన్ అడ్డుపడటంతో నెలరోజులలో వచ్చి భార్యని తీసుకుని వెళ్తా అని చెప్పి అల్లుడు టౌన్‌కి వెళ్ళిపోయాడు.
రచ్చబండ దగ్గర సంత సుంకం వసూలు చేసే ఠాకూర్ వచ్చి సంత ఏర్పాట్లు గురించి మాట్లాడుతూ యాలకులు తెచ్చే మూగవాడు ఇంకా రాలేదా అని అడుగుతుంటే, మూగవాడి బండి వచ్చి సంతలో వాడు ఎప్పుడూ దుకాణం పెట్టే చోట ఆగింది. బండిలో ఎవరూ లేరు. మూగవాడి కోసం చూసారు కనిపించలేదు. ఠాకూర్ కంగారు పడ్డాడు. ఫారెస్ట్ గార్డ్ భద్ర తో పాటు కొందరు యువకులు అతడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు.
రచ్చబండ దగ్గర కూర్చున్న ప్రధాన్ ట్రావెలర్ బంగ్లా దగ్గర దీపాలు వెలిగించే కుముద ని పిలిపించాడు. ఆమెకు సంతలో కూడా లాంతర్లు పెట్టమని అవసరమైన డబ్బులు ఇస్తా అని చెప్పాడు. ఠాకూర్ ఊరిలో కొందరు యువకులని పిలిచి జట్లుగా ఊరిలో తిరగండి, వచ్చిన వ్యాపారులకు ఏ భయం లేకుండా చూసుకోమని చెప్పాడు.
అడవిలోకి వెళ్ళిన భద్ర మౌనంగా తిరిగొచ్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతని ముఖంలో ఆందోళనని ఠాకూర్ గమనించాడు. కుండలో నీళ్ళు మట్టి ముంతతో తీసి అతని చేతికి అందించాడు. భద్ర ముంత ఎత్తి ఒకేసారి నీళ్ళు గొంతులో ఒంపుకోవటంతో, అతని మొహమంతా నీళ్ళతో ఒక్క క్షణం తడించింది. మెడలో ఎప్పుడూ ఉండే తుండుతో మొహాన్ని తుడుచుకుంటూ రచ్చబండ మీద కూలబడ్డాడు. ఠాకూర్ అతడినే చూస్తూ ఉన్నాడు. భద్ర నేల చూపులు చూస్తూ పదిరోజులుగా చుట్టు పక్కల గ్రామాల నుండి అడవిలోకి వచ్చిన యువకులు కనిపించకుండా పోతున్నారని చెప్పుకుంటున్నారు అని తటపటాయిస్తూ చెప్పాడు.
ఠాకూర్ వొళ్ళు ఒక్కసారిగా ఝళ్ళుమంది. అతని మనస్సులో ప్రమాదఘంటిక మ్రోగింది. ఠాకూర్ ఒక బోర్డ్ తెప్పించి పెట్టాడు. రోజూ ఏ గ్రామంలో ఎవరు కనిపించకుండా పోయినా ఆ బోర్డ్ మీద రాయించమని చెప్పాడు. మనుషుల్ని పెట్టి వెతికించే బాధ్యత భద్రకి అప్పగించాడు.
రోజులు గడుస్తున్నాయి బోర్డులో అంకెలు పెరుగుతున్నాయి. చంపావత్ మ్యాప్‌లో చుట్టూ ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న ఒక్క గ్రామం కూడా మిగల్లేదు.
ఒక రోజు ఉదయాన్నే సంతకి వచ్చిన ఠాకూర్‌కి బోర్డ్ మీద ఒక రెండు రోజుల పాటు సున్నాలు కనిపించాయి. అతనికి కాస్త ప్రశాంతంగా అనిపించింది.
“నిన్నటి లెక్క రాయలేదేం, ఆ లెక్కలు వ్రాసే కుర్రాడిని పిలవండి” అని రచ్చబండ దగ్గర ఉన్న వాళ్లతో చెప్పాడు. అందరూ మౌనంగా దిగులు మొహాలతో ఠాకూర్ వైపు చూసారు. ఠాకూర్ కుర్చీలో కూలబడిపోయాడు.
“ఈ ఊరిలో లెక్కలంటే భయం లేనివాడు వాడొక్కడే. కానీ రోజూ ఈ లెక్కలు వ్రాసే ముందు మాత్రం వాడి చెయ్యి వణకటం నేను చూసాను. ఇప్పుడు వాడే ఆ లెక్కల్లో చేరిపోయాడు” అని ఠాకూర్‌కి చెప్తూ ఒక గ్రామస్థుడు కుంగిపోయాడు.
తనకే లేని ధైర్యాన్ని గుంపుకి మాత్రం చెప్పి, అడవిలోకి ఒంటరిగా ఎవరూ వెళ్ళొద్దని సంతలో అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి ఠాకూర్ గ్రామం వైపు నడిచాడు.
దేశం నలుమూలల నుండీ వచ్చిన వ్యాపారస్థులకి చంపావత్ గ్రామస్థులు తమ శక్తిమేర గౌరవంతో ఆతిధ్యం అందిస్తారు. భోజన సదుపాయాలు చేస్తారు. రాత్రి పడుకునేందుకు తమ అరుగుల మీదో, వాకిట్లోనో పక్క ఏర్పాటు చేస్తారు. రాత్రి చీకట్లో ఇబ్బంది పడకుండా, వ్యాపారులు గుంపులుగా పడుకునే చోట కుముద లాంతర్లు వెలిగిస్తుంది. ఆ వెలుగుకి విషపురుగులేవి ఆ వైపుగా రావు.
సంతకు వచ్చిన వ్యాపారస్థుడు ఒకడు “బ్రహ్మ సువర్చల” అనే మూలిక కోసం పగలంతా సంతలో అందరినీ అడుగుతూ తిరిగాడు. అడవిలోపల ఎక్కడో ప్రమాదకరమైన కొండచరియాల్లో దొరికే బ్రహ్మసువర్చల ఆనుపానులు చంపావత్ గ్రామంలో ఒక్క కుటుంబానికి మాత్రమే తెలుసు. తరతరాలుగా ఆ కుటుంబమే ఆ మూలికను సంతలో అమ్ముతుంది. కానీ అడవిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన ఆ కుటుంబంలో ఎవరూ బ్రహ్మసువర్చలను తెచ్చేందుకు సాహసించలేదు. ఆ కుటుంబం పెద్ద వ్యాపారిని చూసి ఈసారికి బ్రహ్మసువర్చలని మర్చిపొండి అని నిరాశగా చేప్పేసాడు.
పూర్తిగా చీకటి పడకముందే ఠాకూర్ వచ్చి అన్ని దుకాణాలను మూయించేసాడు. చీకటి పడ్డాక వ్యాపారులెవరూ గ్రామం దాటి బయట అడుగుపెట్టొద్దని చాటింపు వేయించాడు. వ్యాపారులంతా త్వరగానే భోజనాలు ముగించి పక్కల మీద వాలారు.
బ్రహ్మ సువర్చల లేకుంటే ఇంత దూరం సంతకు వచ్చి ఏం లాభమనే పంతంతో ఆ వ్యాపారస్థుడు ఎవరికీ చెప్పకుండా చీకటి పడుతుండగా అడవిలో అడుగు పెట్టాడు. అడవిలో పక్షుల కూతలు సద్దుమణిగి, కీచురాళ్ళు జోరందుకున్నాయి. దూరంగా నక్కల ఊళలు వినిపించాయి. చేతిలో ఉన్న బాణాకర్రను కాస్త బిగించి పట్టుకుని అతను గుబురు పొదలను దాటి ముందుకి వెళ్ళాడు. అతని చుట్టూ ఉన్న పొదలు ఒక్కసారిగా కదిలాయి.
పెద్దగా శబ్ధం రావటంతో చదువుతున్న బుక్ మూసి కంగారుగా ఎక్కడ తీసాడో అక్కడ పెట్టడానికి పరిగెట్టి వెళ్ళిన కిషోర్‌కి మంచం మీద శైలేంద్ర కనిపించలేదు. అక్కడ ఆ గదంతా చిందర వందరగా పడి ఉంది. ఆ పిల్లాడు భయపడుతూ గాలికి ఊగుతున్న తలుపు మెల్లగా తెరిచాడు. భయంతో కళ్ళు పెద్దవి చేసి నిలబడిపోయాడు.
To be continued..
Image Courtesy : Google image search
అదీ లెక్క.. మొదట హారర్ కామెడీ అనుకున్నాను.
తర్వాత ట్రాక్ పై పరిగెట్టించింది కథ.
తరువాత భాగం కోసం వేచి చూస్తూ…
ముగింపు కోసం ఎదురు చూస్తున్నాను. ……… మహా
తరువాత భాగం కోసం waiting andi,,,,,