పునరపి

సాయంత్రం అయిదు గంటలవుతుంది. వేడి కాఫీ బాల్కనీ రెయిలింగ్ మీద పెట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నా. పైన నల్లని మేఘం ఆకాశం మొత్తం కమ్మేస్తుంది. ఆదివారం కావటంతో రోడ్డు మీద జనాలు పెద్దగా లేరు. ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. చిన్నగా జల్లు మొదలయ్యింది. పిల్లల అమ్మలనుకుంటా అందరినీ లోపలికి రమ్మని అరుస్తున్నారు. నేను కూడా లోపలికి వెళ్దామని వెనక్కి తిరిగా. కానీ ఒక దృశ్యం నన్ను ఆకర్షించి అక్కడే నిల్చుని చూస్తున్నాను.

పిల్లలంతా ఇంట్లోకి పారిపోతున్నా ఒక పాప మాత్రం ఆగిపోయింది. ఆకాశం వైపు చూస్తూ క్రింద పడుతున్న చినుకుల్ని తన చిట్టి చిట్టి చేతులతో కొడుతూ ఆడుతుంది. ఆ పాపని చూస్తూ ఒక బాబొచ్చాడు. పాప ఆనందంలో గెంతుతూ ఉంటే చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆ పాప గెంతటం ఆపి వాడి దగ్గరకి వెళ్ళి బుగ్గమీద ఒక ముద్దిచ్చింది. వాడి మొహంలో చెప్పలేని సంబరం. అక్కడున్న పిల్లలు, వాళ్ళ అమ్మలు అందరూ ఒకేసారి గట్టిగా నవ్వారు. ఇప్పుడు ఇద్దరూ చేతులు పట్టుకుని గెంతుతున్నారు. ఎంతో ఆనందం ఉత్సాహం ఉంది వారిలో. ఆ పాప వాళ్ళ అమ్మనుకుంటా వచ్చి పాపని, బాబు వాళ్ళమ్మ బాబుని తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా లోపలికి వచ్చేసా.

చల్లారిన కాఫీతో సహా కప్పుని సింక్‌లో పడేసా. వర్షంలో నిలబడటంతో బట్టలు తడిచాయి. మార్చుకుని వచ్చి తల తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నా. ఒంటరిగా ఆ నిశ్శబ్దంలో కూర్చోవటం చాలా బోర్‌గా ఉంది. టి.వి. చూసే అలవాటు లేకపోయినా ఒకసారి ఆన్ చేసా. చానెళ్ళన్నీ తిప్పినా ఏదీ నచ్చక ఆఫ్ చేసి పడేసా. కూర్చుని కిటికీలో నుండి వర్షం చూస్తుంటే ఇందాకటి పిల్లలు గుర్తొచ్చారు. వెంటనే ఎందుకో నాకు నా టైమ్‌మెషీన్ తియ్యాలనిపించింది. నా భార్య మధుకి మాత్రం అది టంకుపెట్టె. విలువైన సామాన్లు ఉండే ఇంటిలో ఏ విలువాలేని ఈ పెట్టెకి చోటులేదని మూలనెక్కడో అటక మీద పడేసింది.

పెట్టెని తీసే ప్రయత్నంలో అన్నీ చిందరవందర చేసాను. ఊరునుండి వచ్చాక ఇవన్నీ చూసిందంటే ఉరిమి ఉరిమి చూస్తుంది. కానీ ఆత్రం నన్ను ఆగనివ్వటంలేదు. మొత్తానికి పెట్టి పట్టుకుని హాలులోకి వచ్చి కింద కూర్చున్నాను. ఒక గుడ్డ పట్టుకుని శ్రద్ధగా బూజు మొత్తం దులిపాను. ఈసారి ఏ అనుభూతి దొరుకుతుందో అనే ఆత్రం నా కళ్ళలో, నాకే తెలుస్తుంది. మేజిక్ బాక్స్ వైపే ఆత్రంగా చూస్తున్న చిన్నపిల్లాడి బొమ్మ గోడ మీద. పెట్టె మూత సగం వరకూ తెరిచి కళ్ళు మూసుకుని చెయ్యి లోపలికి పెట్టాను. ఏదో కాగితంలా తగిలింది. ఏ స్పోర్ట్స్‌లోనో, వ్యాసరచనలోనో వచ్చిన సర్టిఫికేట్ అనుకుని ఆత్రంగా బయటకి తీసాను.

ఎక్సైట్‌మెంట్‌తో కళ్ళు తెరిచి చూసాను. అది చాలా పాత ఉత్తరం. ఎవరు రాసిందా అనుకుని వెనక్కి తిప్పి చూసా. గుండె ఒక్కసారి ఆగి రెండు మూడు బీట్స్ మిస్సయ్యాక తిరిగి కొట్టుకోవటం మొదలయ్యింది. ఇది.. లహరి రాసిన ఉత్తరం. లహరి రాసిన ఒకే ఒక ఉత్తరం. గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఉత్తరం అందుకున్నప్పుడు అచ్చంగా ఇలానే కొట్టుకున్నట్టు గుర్తు. లహరి.. లహరి.. నా కలల కవితలపై చెరిగిపోని సంతకం, నా మస్తిష్కంలో ఏదో మూలపడి కనుమరుగైపోయిన జ్ఞాపకం. నిజమే కదా లహరి నాతో లేదనే సత్యాన్ని ఈ కాలం ఎంత లౌక్యంగా నాచేత ఒప్పించేసిందీ! కొన్ని కోట్లమంది నిత్యం పుట్టి చనిపోతున్న ఈ భూమి మీద ఎన్ని కోట్ల ప్రేమకధలు పుట్టాయో ఎన్నింటిని కాలం తన కాళనాలుకతో మింగేసిందో?

బయట గాలికనుకుంటా ఉత్తరం చెయ్యి జారి ఎగిరి నా గుండెని హత్తుకుంది. నేను కావాలని అక్కున చేర్చుకోలేదు, గాలికే చెయ్యి జారింది. గాలి వేగం పెరుగుతుంటే మరింత గట్టిగా హత్తుకుంటూ, నా హృదయంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం. తిరిగి చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఒక దీర్ఘనిట్టూర్పు తర్వాత ఉత్తరం తెరిచాను. విచిత్రం అక్షరాల ఆనవాలు కళ్ళు పసిగట్టగానే నా శ్వాస తన శరీర సుగంధాన్ని ఫీలవుతుంది. అవును అదే సువాసన కొన్నేళ్ళ క్రితం రోజూ నన్ను పలకరించి, తను వస్తోందన్న రాయభారాన్ని మోసిన సువాసన. ప్రేయసి సహజ పరిమళాన్ని మించిన సుగంధాలు లేవని నాకు నిరూపించిన సువాసన.నా పెదాలు వణుకుతున్నాయి. తను నా దగ్గరకి వస్తుందంటే ఎప్పుడూ నాలో కలిగే భావస్పందన. కళ్ళు మూసుకుని గుండెల నిండా ఆ సువాసనని పీల్చుకున్నా, తనని తాకాలనే ఆవేశాన్ని సంతృప్తి పరిచటానికి నేను వెతుక్కున్న మార్గం ఇదే.

ఆ అచేతనావస్థలో ఉండగా తేరుకున్న మెదడు శరీరానికి ఒక షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వళ్ళంతా ఒక్కసారిగా జలదరించి స్పృహలోకి వచ్చాను. ఒక్క క్షణం అయోమయం ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ తన ఉనికి ఎలా? ఏదో అర్ధమయ్యింది. గతకాలపు దృశ్యాల్లో మనం వదిలేసి వెళ్ళిపోయే అస్థిత్వాలు ఆ జ్ఞాపకాలను అంటిపెట్టుకునే అలానే ఉంటాయేమొ. అదే నిజమయితే ఆ నాడు తను వదిలిన తన ప్రెజెన్స్ ఇప్పుడు ఇక్కడే నాతో ఉంది. చుట్టూ పరికించి చూసాను. బయట హోరు గాలి, ఎడతెరిపిలేని వర్షం, చీకటిపడిపోయింది. లేవటానికి బద్దకంగా అనిపించినా ఉత్తరం అక్కడే పెట్టి లేచి వెళ్ళి లైట్ వేసాను. గది మొత్తం పరుచుకున్న వెలుగులో గాలికి కదులుతూ క్రింద ఉత్తరం.

ఉత్తరం తీసి సోఫాలో కూలబడ్డాను. ఎందుకో అక్షరాల మీద చేతులతో తాకుతూ ఉంటే తన స్పర్శ, నా పక్కనే తను కూర్చున్నప్పుడు అనుకోకుండా కదిలినప్పుడు అలా తాకి తిరిగి దూరమవుతున్న స్పర్శ. ఎప్పుడూ తను వ్రాసే ముత్యాల అక్షరాలు కావవి. రాయాల వద్దా అని క్షణానికో లక్షసార్లు (సూపర్ కంప్యూటర్లకి కూడా అందనంత వేగమేమో) ఆలోచిస్తూ, వ్రాస్తూ వద్దని ఆపేస్తూ, ఎన్నో విరామలతో సాగిన ఆత్మసంఘర్షణ. అందుకేనేమో చేతితో అక్షరాలను తాకుతూ ఉంటే చెయ్యి మెత్తగా జారిపోలేదు, ప్రతి లైనుకి ఎన్నోసార్లు చెయ్యి కదలలేదు. అక్కడ అక్కడ అక్షరాలు నీరు పడి చెరిగినట్టుగా తెలుస్తుంది. కన్నీళ్ళ గుర్తులు భద్రంగా దాచే మార్గం నాకిప్పుడే తెలిసింది. వ్రాసేప్పుడు తీవ్ర ప్రకంపానికి లోను చేసిన పదాల దగ్గరనుకుంటా అక్షరాల్లో వణుకు కనిపిస్తుంది.

అనుభూతులతో కడుపు నిండక అక్షరాలను ఏరుకోవటం మొదలుపెట్టాయి కళ్ళు. “కన్నయ్యా!” ఆ పిలుపు నేను చదివానా? లేక తనే పిలిచిందా? తన ప్రేమ మొత్తాన్ని తెలిపేందుకా అన్నట్టు శ్రావ్యమైన తన గొంతులో సహజంగా ఒదిగిపోయిన లాలిత్యంతో పిలిచే ఆ పిలుపు నా చెవులను తాకుతోంది. ఆ పిలుపుకున్న శక్తి తనకి తెలియదేమో కానీ. నాకు తెలుసు. యుగాలనాడు పోగొట్టుకున్న ఒక రాగం హృదయాన్ని పట్టి లాగినట్టుగా ఉంటుంది. ఆవలి తీరంలో ఎవరో నన్ను ఆశగా,ఆర్తిగా పిలిచినట్టుంటుంది. మనసులో ఓర్చుకోలేని బాధని పంటి బిగువున అణుచుకుంటున్నట్టుగా ఒక అలజడి మొదలయ్యింది. కళ్ళను కమ్మేస్తూ ఒక్క సన్నని నీటి పొర.

కన్నయ్యా,
జీవితంలో మరలా నిన్ను చూస్తానో లేదో తెలియదు. చివరగా నీతో చెప్పాలనుకున్న మాటలు చెబుతున్నారా. హడావుడిగా ఇప్పటికిప్పుడు వ్రాస్తున్నా. మరో పదిరోజులు దాటాక నేను వ్రాసినా మరొకరి భార్య వ్రాసిన ఉత్తరమయిపోతుంది. అప్పుడు నువ్వు కనీసం తెరవకుండానే చించేస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటావా? వర్షంలో తడుచుకుంటూ వెళ్దామని ఎన్నోసార్లు నన్ను అడిగిన నువ్వు, నా పెళ్ళి కుదిరిన రోజు సాయంత్రం నీ పక్కనే వర్షంలో తడుస్తుంటే కనీసం నా మొహం కూడా చూడలేదు. చూడకూడదనే సంస్కారాన్ని నీ కళ్ళు ప్రదర్శించిన క్షణమే నీకెంత దూరమయ్యానో అర్ధమయిపోయింది. ఆ క్షణం రోడ్డు మీదున్నా అనే స్పృహేలేకుంటే అక్కడే కూలబడి చచ్చేదాక ఏడ్చేదాన్ని. నాన్నగారు నువ్వు ఎందుకు వద్దో నాకు చెప్పాలని, నిన్ను వంద రకాలుగా తక్కువ చేస్తుంటే, నీ వ్యక్తిత్వంతో నువ్వు లక్షరెట్లు ఎదిగి నువ్వు మాత్రమే కరెక్టని నిరూపించుకున్నావురా. కానీ ఏం చెయ్యనురా ఆడపిల్లను. చేతకాని సమాధానం కదా. అవును చేతకానీ నాకు ఇంకేమీ చెప్పే అర్హత లేదు. కానీ ఒక్కటి అడగాలనుకుంటున్నారా.

నువ్వెప్పుడూ వచ్చే జన్మ వద్దంటుంటావ్. నువ్వు కోరుకున్నట్టుగా వచ్చే జన్మలేకుంటే ఏమో కానీ, అలా కాకుండా మరలా పుడితే, మరలా నాకు ఈ అవకాశం ఇవ్వరా ప్లీజ్. ఈసారి ప్రాణాలైనా వదులుకుంటా, నిన్ను మాత్రం వదులుకోను. జీవితగమ్యాన్ని కోల్పోతున్న దురదృష్టవంతురాలినిరా వీలయితే నా మీద జాలిపడు, కోపగించకు….

…బై కన్నయ్య.

ఈ చివరి ముక్క బై కన్నయ్య వ్రాసేప్పుడు భూకంపంగానీ వచ్చిందా అని అనుమానం కలిగించేంతలా అక్షరాల్లో వణుకు. ఉత్తరం చదవటం పూర్తవ్వగానే కరెంటుపోయింది. కరెంటువాడికి నా మీద ఇంత జాలి ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. తన జీవితంలో చివరిసారిగా చెబుతున్న బై అని తెలిసినప్పుడు తను ఎంత క్షోభ పడి ఉంటుందో, వ్రాసాక మూర్చ వచ్చేలా క్రింద పడి ఎంత ఏడ్చి ఉంటుందో నాకు తెలియజెప్పటానికేమో నా కళ్ళు ధారలు కడుతున్నాయి. నా కడుపులో నుండి మొదలయ్యిన దుఃఖం వెక్కిళ్ళుగా మారింది. ఆ చీకట్లో సోఫాలో అలానే పడి ఏడుస్తూ ఉన్నాను.

ఎంత సేఫు ఏడ్చానో నాకే గుర్తులేదు. కరెంటు వచ్చి మొహం పైన ఒక్కసారిగా కాంతి పడటంతో కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యి లేచాను. సెల్‌ఫోన్ చూస్తే మధు మిస్డ్‌కాల్స్ నాలుగున్నాయి. ఉత్తరం మూసి పెట్టెలో పెట్టేసాను. ఆ గదిలో అంతవరకూ ఉన్నా ఆ సువాసన లేదు, నా మనసుకి అంత వరకు తెలుస్తున్న లహరి ప్రెజెన్స్ అక్కడ లేదు. లహరి మరోసారి మరోసారి నన్నొదిలి వెళ్ళిపోయింది. మధు భర్త సంస్కారం ఆపేయాలనుకుంటున్న మనసు మాటలు నా చెవులను తాకాయి “ఇలా ఎన్నిసార్లు లహరి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవటం?”

వర్షం

వాన వాకిటిలో, గొడుగు ఒడిలో

వాన వాకిటిలో, గొడుగు ఒడిలో

పసిపాపల దగ్గర నుండి పండు ముదుసలి వరకు అందరి మనసుల్ని ఆహ్లాదపరిచే దృశ్యాల్లో ఖచ్చితంగా మొదటి మూడు ఎంపికల్లో ఉండే దృశ్యం, వర్షం. తొలకరి చినుకులు పడటం మొదలవ్వగానే తన్మయత్వంతో ఆకాశం వైపు చూస్తూ, ఆ తడి మట్టివాసన ముక్కుపుటాలకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల నిండా గాలిని పీల్చుకుని ఆ వాసనను అనుభవించని జీవి జీవికాదు వాడి జీవితం జీవితమే కాదు. ఆరోగ్యపరంగా చల్లని వాతావరణం పనికిరాని వారు కూడా ఆ మట్టివాసన తగలగానే అన్ని మరిచిపోయి వానలోకి వచ్చేస్తారు. అందుకు పెద్ద ఉదాహరణ నేనే. జలుబో, జ్వరమో వస్తే రెండు రోజులు పడుకోటానికి సిద్దమే కాని తొలకరి చినుకుల్లో తడిచే అనుభూతిని మాత్రం వదులుకోను.

ఈ వానతో అనుభందం ఏనాటిదో సరిగ్గా చెప్పటం కష్టమే. కానీ వాన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన మొదటి సందర్భం మాత్రం బాగా గుర్తుంది. బడిలో “వానా వానా వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప” నేర్చుకున్నరోజు మొదటిసారిగా అనిపించింది. ఇప్పుడు వానపడితే ఎంచక్కా ప్రయోగ పూర్వకంగా ఈ పాటను ప్రదర్శించొచ్చు కదా అని. చదువుకునే రోజుల్లో వానాకాలం సాయంత్రం బడి అవ్వగానే అక్క,నేను తడకుండా రావాలని ఒక గొడుగు కొనిచ్చారు. వర్షంలో వస్తుంటే గొడుగు నే పట్టుకుంటా అంటే, నేను పట్టుకుంటా అంటూ ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. దానితో రోజుకొకరు పట్టుకోవాలనే నియమం పెట్టుకున్నాం. అవతలి వాళ్ళు పట్టుకున్నరోజు నాకు చోటివ్వవేంటి, సరిగ్గా పట్టుకో చూడు ఇటుపక్క తడిచిపోతున్నా అని గొడవ. ఇదికాక రోడ్డు మీద నీరు పారుతూ ఉంటే గెంతటం భలే సరదా.

వాన నీటిలో పడవ ప్రయాణం

వాన నీటిలో పడవ ప్రయాణం

ఇంటికొచ్చాక పడవల సరదా. అవసరమైనదో కాదో చూడకుండా పుస్తకాలు చింపేసి గబగబా పడవలు చేసి నీట్లో వదలటం, ఎవరి పడవ దూరం వెళుతుందో పోటీలుపెట్టుకోవటం తలుచుకుంటే మనసు ఇప్పటికీ కేరింతలు కొడుతుంది. పడవలంటే మరలా రోజూ ఒకేలాంటి పడవలంటే బోర్. పడవల్లో చాలా రకాలు ఉంటాయి సాదా పడవ, కత్తి పడవ, మరపడవ, గొడుగు పడవ అని బోలెడు ఉంటాయి. బడిలో ఎవడో ఒకడు మా మావయ్య ఈ రోజు నాకోసం కత్తి పడవ చేసార్రా అని చూపిస్తూ భుజాలు ఎగరేస్తే ఇంటికొచ్చి మాకూ అది చెయ్యటం నేర్పమని పైకెప్పు ఎగిరిపోయేలా ఏడుపు మొదలపెట్టేవాళ్ళం. పాపం మమ్మీ నాకు రాదు మొర్రో అన్నా వినిపించుకునే వాళ్ళం కాదు. స్కూల్ టీచర్‌వి నీకు పడవ చెయ్యటం కూడా రాదా అని ఏడుపు కొనసాగించేవాళ్ళం. మొత్తానికి ఎక్కడో నేర్చుకుని వచ్చి మాకు చెప్పేది. మరుసటిరోజు చూపుల్లోనే ఎక్కడలేని ఫోజు ప్రదర్శిస్తూ రకరకాల పడవల ఎగ్జిబిషన్ పెట్టేవాడ్ని. ఈ పడవల్లో అప్పుడప్పుడు చీమల్ని ఉంచి వాటికి నీటిలో బలవంతపు సాహసయాత్రలు చేయించటం మరో ప్రహసనం. 😛  వడగళ్ళ వాన పడిందంటే సండడే సందడి. వడగళ్ళు క్రిందపడగానే పరిగెట్టి వాకిట్లోకి వెళ్ళి వాటిని ఏరి తెచ్చి ఒక దగ్గర కుప్పగా పోసేవాళ్ళం. ఎవరు ఎక్కువ సేకరిస్తారు, ఎవరు పెద్దది సంపాదిస్తారు అని పోటి.

హైస్కూల్, కాలేజీ రోజుల్లో కావాలనే వర్షంలో తడిచి వచ్చేవాడ్ని. మొత్తం తడిచిపోయి వచ్చాక ఏం పిల్లడోనమ్మా కాస్త ఎక్కడన్నా వర్షం వెళ్ళే దాకా ఆగొచ్చుగా అని తిడుతూ తల తుడిచేది మమ్మీ. వస్తూ ఉంటే సడెన్‌గా పడిపోయింది, ఎలాగూ తడిచిపోయానుగా ఇంకెందుకులే అని వచ్చేసా అని ఎదో కధలు చెప్పేవాడ్ని.  కాలేజ్‌లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్‌కి వెళ్ళే ముందు వర్షం మొదలయితే పండగే. అందరం కావాలనే గొడుగులు ఉన్నా దాచేసి వర్షం తగ్గేదాక ఉండి, ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళి దీనంగా మొహాలుపెట్టి అందరం ఇక్కడే ఉండిపోయాం సార్, ఎవ్వరం భోజనం చేయలేదు మద్యాహ్నం రాలేము అని చెప్పి క్లాసులు క్యాన్సిల్ చేయించే వాళ్ళం 🙂

వర్షంతో పెనవేసుకున్న మరో అత్యంత కమ్మని జ్ఞాపకం ఉంది. వానాకాలంలో వర్షంలో ఇంటికి వచ్చేసరికి శెనక్కాయలు కానీ, జొన్నపొత్తులు కానీ ఉడికించి పెట్టేది మమ్మీ. ఇంటిలో అడుగుపెట్టగానే ఆ కమ్మని వాసన తగిలేసరికి కలిగే ఆనందం మరి దేనితోనూ సరిపోల్చలేం సుమా. వంటి నిండా దుప్పటి కప్పుకుని ఉడికించిన వేరు శెనక్కాయలు తింటూ, ఆకాశవాణిలో పాటలు వింటూ, రోడ్డు మీద పడుతున్న వర్షాన్ని,అటు ఇటూ పరుగులుపెడుతున్న జనాల్ని, కొమ్మల్లో దాక్కుని వంటి మీద తడిని దులుపుకుంటున్న పక్షుల్ని చూస్తూ ఉండటం మరలిరాని ఒక మధురానుభూతి. కాస్త పెద్దవాళ్ళమయ్యాక వర్షం పడితే పకోడి బండి దగ్గర చేరి వేడి వేడి టీతో వేడి వేడి పకోడీలు,బజ్జీలు ఆస్వాదిస్తూ తినటం ఇప్పటికీ అప్పుడప్పుదు కొనసాగిస్తున్నామనుకోండి. కానీ అప్పటి ఆకాశవాణిని నేటి ఎఫ్.ఎమ్.లతో పోల్చలేము కదా. ప్రశాంతంగా ఉండే వాతావరణం, చల్లని గాలి, క్రింద పారుతున్న నీటిలో చినుకులు పడుతూ చేసే శబ్ధం, మధ్య మధ్యలో ఉరిమే ఆకాశం, తళుక్కున మెరిసి మాయమయ్యే మెరుపు తీగలు, ఉండుండి గుండెల్లో గాభరా పుట్టించేలా ఢాం మని పడే పిడుగులు, అర్జునా ఫల్గుణా అనే అమ్మమ్మ వాహ్ అక్షరాలు ఆవిష్కరించలేని అనుభూతి.

వర్షం అంటే ఇష్టం కదా అని ఎలాపడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతే ఒప్పుకుంటామేంటి. దానికో టైముండాలి, ఒక రిథమ్ ఉండాలి, ఒక ప్రోసెస్ ఉండాలి. కాస్త సాయంత్రమవుతూ ఉండగా చల్లనిగాలి మొదట శరీరాన్ని తాకాలి. ఆ గాలిలో తేమ మన శరీరాల్ని తాకగానే వళ్ళంతా ఒక జలదరింత కలుగుతుంది. అప్పుడు ఆకాశంలో వెలుగుని తరిమేస్తూ నల్లని మబ్బులు అత్యంత వేగంగా కదలటం కనిపించాలి. అలా కదులుతూ మధ్యలో ఉరుముతూ ఉండాలి. టప్ టప్ మని దూర దూరంగా ఒక్కో చినుకూ పడుతూ శబ్ధం చెయ్యాలి. మేడ మీద ఆరబెట్టిన వడియాలు, బట్టలు తెచ్చుకోవటానికి జనాలు పరుగులు మొదలుపెట్టాలి. రోడ్డు మీద నడుస్తున్నవాళ్ళు, బైకులమీద వెళుతున్న వాళ్ళు షెల్టర్ కోసం తొందరపడుతుండాలి. అప్పుడు ఒక్కపెట్టున ధారగా వర్షం మొదలవ్వాలి. అప్పుడే ఆ వర్షానికి ఒక అందం, మనకి ఆనందం.

వర్షం గురించి ఇన్ని చెప్పును కానీ ఒక్కటి మిగిలిపోయింది. అది రొమాన్స్. మన సినిమాలు చూసుకున్నా, కావ్యాలు, కధలు, కవితలు తీసుకున్నా వర్షంలో ఉండే రొమాన్స్‌ని ఎలుగెత్తిచాటారు. దాదాపుగా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని వానపాటలు హిట్టేనేమో. “చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే చెంతన ఉంటే” ఏంటి అందరూ పాటని హమ్ చేయటం మొదలుపెట్టేసారా? నాకు తెలుసు 🙂 అంత మంచి పాట గుర్తొచ్చాక నేను చెప్పే రొమాన్స్ ఎక్కుతుందో లేదో కానీ నేను చెప్పకుండా మాత్రం ఆపను 🙂

చిటపట చినుకుల వేళ చేరువలో నేస్తం

చిటపట చినుకుల వేళ చేరువలో నేస్తం

మనసులో ప్రేమ ఇంకా చెప్పుకోని ప్రేమికులు వర్షంలో ఒకే గొడుగులో వెళ్తున్నప్పుడు లేదా,  వర్షంలో తడవకుండా ఏ చెట్టు క్రిందో ఆగినప్పుడు చోటుచేసుకునే గమ్మత్తైన రొమాన్స్ మనతో ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉండిపోయే అనుభూతి. ఇద్దరూ అలా కాస్త సమయాన్ని గడిపే అవకాశం దొరికినందుకు లోలోన ఆనందపడుతున్నా బయటకి ప్రదర్శించరు. ఏంటో ఈ వర్షం కాస్త మనం ఇంటికి వెళ్ళే దాకా ఆగొచ్చుగా, ఎప్పటికి తగ్గుతుందో ఏమో అంటూ ఆకాశం వైపు చూస్తుంటారు కానీ నిజానికి ఇద్దరికీ ఆ వర్షం ఇంకాసేఫు పడాలనే ఉంటుంది. ఇంతలో అనుకోకుండా అమ్మాయి చేయి అబ్బాయికి తగిలిందనుకోండి అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అమ్మాయి కూడా కొత్తగా ఉండే ఆ ఫీలింగ్‌ని ఆస్వాదిస్తున్నా బయటకి మాత్రం “సారీ” అని చెబుతుంది. అబ్బాయి కూడా తన ఫీలింగ్స్ బయటకి కనబడనివ్వకుండా ఇట్స్ ఓకే అంటాడు. ఇద్దరూ కాస్త జరిగి దూరంగా నిలబడతారు.

అబ్బాయి మనసులో కాసేపటికి మరలా తను తాకితే బాగుణ్ణు అనే ఫీలింగ్ చిన్నగా మొదలయ్యి, కాసేపటికి ఏదో ఒకటి చేసి తాకాల్సిందే అనే స్థాయికి చేరుకుంటుంది. అమ్మాయి కదిలితే తగిలేంత దగ్గరగా తను జరుగుతాడు. ఆ జరిగే ప్రక్రియ తాను కావాలనే చేస్తున్నట్టు బయటపడకుండా ఆటూ ఇటూ ఊగుతూ, ఆకాశాన్ని,దిక్కుల్ని చూస్తూ, రకరకాల భంగిమలు, హావభావాలు ప్రదర్శిస్తూ చేస్తాడు. అమ్మాయికి ఇదంతా తెలుస్తూనే ఉంటుంది. పక్కకు తిరిగి లోలోపల ముసిముసిగా నవ్వేసుకుంటుంది. కానీ మొహంలో మాత్రం ఏమీ కనపడనివ్వకుండా వర్షం త్వరగా తగ్గిపోతే బాగుండు అనే ఫాల్స్ ఫీలింగ్‌నే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. వర్షం ఎప్పటికి తగ్గుతుందా అనే చూసే ప్రక్రియలో మరోసారి అమ్మాయి చేయి అబ్బాయికి తగులుతుంది. మరలా సేమ్ పైన జరిగిన ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఈ జరుగుతున్న ప్రహసనమంతా మాకు తప్ప ఇంకెవరికీ అర్ధంకాదు, ప్రపంచం మమ్మల్ని గమనించటంలేదు అనుకుంటారు.  కానీ ఒక మూల నాలాంటోడు ఒకడు ఉండి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అని ఎప్పటికీ తెలుసుకోరు 😉

కరి మబ్బును వీడి,
విరుల ఒడిలో ఒదిగే చినుకుల తడి వర్షం.
ఎదురుగానే ఉంటూ చేరువ కానీ నెచ్చెలి భూమికి,
ఆకాశం పంపే ముద్దుల తడి వర్షం.
దూరాన ఉన్న ప్రియునికోసం,
ప్రియురాలు పంపే తడికన్నుల రాయభారం వర్షం.
ఏకాంతంలో ఉన్న చెలికానికి,
చెలి సాన్నిత్యం గుర్తుచేసే తుంటరి అనుభూతి ఈ నా వర్షం.