చిరుఆశ అనే ఒక టపాతో చిరంజీవి రాజకీయప్రవేశం గురించి కాస్త పదాల అల్లికతో ఏదేదో వ్రాసి ఒకటపాగా వేసి బ్లాగు అనగానేమి అనే ప్రశ్న వెంట మొదలయిన నా ప్రయాణంలో మూడేళ్ళు నిండాయి. అసలు నేను వ్రాస్తే ఎవరన్నా చదువుతారా? స్పందిస్తారా? అభినందిస్తారా అనే అనుమానాలతో. ఆరాటలతో మొదలయిన నా బ్లాగు ప్రయాణంలో గుర్తుచేసుకోదగ్గ స్మృతులు ఎన్నో.ఈ మూడేళ్ళ నా ప్రయాణాన్ని కాస్త అవలోకనం చేసుకోవలనిపించింది. ఏముంది పెద్ద గొప్ప? అని ఎవరన్నా అంటే నా సమాధానం ఏ వ్యక్తీ గొప్పపనులు చెయ్యడు. కొందరు వ్యక్తులు చేసిన పనుల్ని సమాజం మాత్రం గొప్పగా భావిస్తుంది. నా దృష్టిలో గొప్పతనం సాధించేది కాదు కేవలం ఆపాదించబడేది. అందుకే ఈ టపా గొప్పతనాన్ని మాత్రమే సహించే గొప్పవాళ్ళ కోసం కాదు. ఇది నాలాంటి ఒక మాములు మేంగో మేన్ తన ఆలోచనలతో వ్రాసుకున్న బ్లాగు మరియు బ్లాగు ప్రయాణం పై ఒక విహంగ వీక్షణం.
మూడేళ్ళ క్రితం ల్యాప్‌టాప్ కొన్న కొత్తలో అంతర్జాలంలో చాటింగ్,మెయిలింగ్ తప్ప వేరే ఏమీ తెలియవు నాకు. తెలుగులో అందరూ పెట్టే మెసేజ్‌లు, స్టేటస్లు ఎలా వస్తున్నాయో తెలుసుకుందామనే ప్రయత్నంలో గూగులమ్మని ఆశ్రయించా. పేదరాసి పెద్దమ్మని కదిపితే కధలకి లోటా? అనగనగా ఒక వీవెన్ అనే రాజు తన రాజ్యంలో జనాలంతా పరభాషా వ్యామోహంలో కొట్టుకు పోతుంటే ఇలా అయితే మన గత కీర్తికి ఏం కాను అని భయపడినవాడై “దేశ భాషలందు తెలుగు లెస్స. కోడు భాషలందు యునీకోడ్ లెస్స” అని పలికి, వారికోసం “శ్రీ రాజీవ్ లేఖిని” (క్షమించాలి అలవాటులో పొరపాటు) లేఖిని అనే పధకాన్ని ప్రవేశపెట్టాడని తెలిసింది. మచ్చుకు కొన్ని బ్లాగుల్ని చూపించి వదిలింది.
దొరికిన బ్లాగుల్ని పట్టుకుని వాటి వెంట పరిగెట్టి, అందులో కామెంటిన వారి బ్లాగుల్లోకి జంపింగులు చేస్తూ ఏకబిగిన పదమూడు పగల్లు, పదమూడు రాత్రులు గడిపాను. అఫీసులో అప్పటికే అఫ్లికేషన్ కంటే వికీ ఎక్కువ వాడతానని అపవాదు ఉంది. దానికి బ్లాగులు తోడయ్యాయి. దీనితో మన అప్రైజల్ కాస్త గోవిందా కొట్టింది. కానీ కొత్త దొంగోడు వేకువ ఎరుగడని (బాగా చెప్పానా? :)) నేను మాత్రం నా పంథా మార్చుకోలేదు. చదవగా చదవగా నిత్యరోగికి హాస్పిటల్ పెట్టేయాలని దురదపుట్టినట్టు నాకు కూడా ఒక బ్లాగు తెరవంగ మనంబున మిక్కిలి దురదపుట్టెన్.
ఏం వ్రాయాలో తెలియదు. ఏం వ్రాస్తే అందరూ చదువుతారో తెలియదు. అందర్నీ ఆకట్టు కోవటానికి ఆంధ్రలో అందరూ వాడే ఫార్ములా దొరికింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిందంతే అన్నటైపులో వ్రాసాను. వ్రాసి పోస్టు వేసి “వస్తాడు నారాజు ఈ రోజు” అని పాడుకుంటూ కామెంట్లకోసం ఎదురుచూసా. “రేయిగడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే” అని పాడి పాడి అలిసి సొలసి పడిపోయాకా అబ్రకదబ్రగారు డింగ్ మని ప్రత్య్క్షమయ్యారు. గూగుల్‌లో చూసి ఇటొచ్చా నాయన ఏంటీ వెర్రి రాతలు? సరే ఏదో ఒకటి ఏడు కానీ అమెరికా వెళ్ళాలనుకునేవాడివి శంషాబాద్ వెళ్ళాలి కానీ ఇలా అమీర్‌పేట్ చౌరస్తాలో దారి తప్పోయినోడిలా అయోమయంగా ఎదురుచూస్తే ఎట్టా అన్నారు. అంతా విని మూసినది పుష్కరాల్లో దారితప్పోయినోడిలా మొహం పెట్టి ఇంతకీ ఎటు వెళ్ళాలి అని అడిగా. “పార్ధాయ ప్రతిభోదితాం భగవత నారాయణీనస్వయం” అని చిరునవ్వు నవ్వి “పార్ధా, కనిపించే ఈ మూడు చౌరస్తాలు అమీర్‌పేట, కూకట్పల్లి, మూసపేట చౌరస్తాలయితే కనిపించని ఆ నాల్గవ చౌరస్తానే కూడలి.. కూడలి.. కూడలి” అని చెప్పి డింగుమన్నారు.ఆయనకి మొదటిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను.
కూడలిలో క్రూరమృగం నా మొదటి టపా. అప్పటికే బ్లాగులోకంలో సీనియర్లు సుజాతగారు, చావాగారు, కత్తి మహేష్‌గారు, బొల్లోజు బాబాగారు అభినందిస్తూ కమెంట్లుపెట్టారు. అటుపైన నా బ్లాగు కాస్త అందరి దృష్టిలో పడింది. చదివినవాళ్ళు సూచనలు, అభినందనలు ఇచ్చారు. “హ హా హాసిని, నేటికి నెరవేరిన మూషికవరం, బందరు మామయ్య – బంగారు బాతు, హాసిని కి పెళ్ళి చూపులోచ్…, జాజు – ఒక కాకి కధ, జావా జావా కన్నీరు” లాంటి సూపర్‌హిట్టు టపాలు వ్రాసాక బ్లాగులోకంలో నా బ్లాగు కూడా అందరికీ తెలిసింది..ఇందులో అత్యధిక టపాలకు కధావస్తువుగా నిలిచిన నా స్నేహితురాలు హాసినికి నా కృతఙ్ఞతలు. “భయంగా ఉంది నాన్న…, e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక” వంటి టపాలకు అందరి ప్రశంసలు అందుకున్నా.
చదివినవారందరూ గుర్తుంచుకోకపోయినా చాట్లోనో, కాల్ చేసో కొన్ని వాక్యాలు ఉటంకించి బాగున్నాయి అని చెప్పినప్పుడూ ఆనందపడ్డా. సవరణలు, టైపాట్లు చెప్పినప్పుడు సర్దుకున్నా. నా వరకు నాకు సంతృప్తినిచ్చి మరలా మరలా చదువుకునే టపాలు, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పటికీ చాలాసార్లు నా టపాలు నేనే చదువుకుంటా. కాకిపిల్ల కాకి ముద్దు అని నవ్వి పోదురుగాక. కానీ భాదలో ఉన్నప్పుడు నా టపాలే నాకు కొన్నిసార్లు స్వాంతననిచ్చాయి, నిరాశలో ఉన్నప్పుడు ఉత్సాహాన్నిచ్చాయి. కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఇంత గొప్ప భావం నాకేలా తట్టిందబ్బా అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. బోస్టన్‌లో ఉండగా ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నా టపాలు బాగున్నాయి అని చెప్పిన అనుభవాలూ ఉన్నాయి. భయంగా ఉంది నాన్న చదివినప్పుడు అమ్మమ్మ,ఇంకొంతమంది భందువులు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఫోన్ చేసిన చేదు స్మృతులూ ఉన్నాయి. క్రమం తప్పకుండా మమ్మీ ఇప్పుడు నా బ్లాగు చదువుతుంది. బోస్టన్‌లో ఉండగా మా క్లైంట్ మేనేజర్ శంకర్ నా వ్రాతల కారణంగా ఇప్పటికీ నన్ను గుర్తుంచుకున్నారు. నా బజ్జులో క్రమం తప్పకుండా కామెంట్లు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. భరణిగారు, దర్శకులు వంశీగారు వంటి కొందరు ప్రముఖులను కలిసే అవకాశం కూడా బ్లాగు వలనే కలిగింది నాకు. ఇంకా చెప్పాలంటే చాలా ఙ్ఞాపకాలు ఉన్నాయి. ఒకప్పుడు నా డైరీ అని పొదవిపట్టుకునేవారట. ఇది నా బ్లాగు మురళీగానం, అడవి లోని వెదురు పలికే స్వరాలు.
ఈ బ్లాగుతో అసలేం సాధించానని? తెలుగు సాహిత్యమనే సముద్రంలో చిన్న నీటిబొట్టుని కూడా కాలేను. కానీ ఎంత గొప్ప సాహితీవేత్తయినా “నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో! పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ” అన్న నా చిరుకవితను విని “అర్భకా! ఈ భావం బాగుందిరా” అని అనకపోతారా? పైగా పప్పు,నిప్పు,ఉప్పు,తుప్పు అని ప్రాసలో పదాలు కూర్చటమే కవిత్వం, అనే అఙ్ఞానంలోనే ఉండిపోకుండా నాది అనే స్వరం కోసం అన్వేషణ సాగిస్తున్నా. అసలెప్పటికీ నా ఐడెంటిటీ సాధించలేకపోయినా ఈ అన్వేషణ చాలు నాకు తృప్తినివ్వటానికి. నన్ను ప్రపంచం తెలుసుకోవటానికి, నేను ప్రపంచాన్ని తెలుసుకోవాటానికి, అసలు నన్ను నేనే తెలుసుకోవటానికి బ్లాగులోకం ఉపయోగపడింది. నా ఆలోచనలు ఒక నిర్దిష్టతను సంతరించుకోవటంలోనూ, వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాలు, వృత్తులు, ప్రవృత్తులు, భావజాలాలు, భేషజాలు, విపరీత భావాలు, మనస్తత్వాలు తెలుసుకొని ఒక అవగాహన ఏర్పరుచుకోవటంలో బ్లాగులోకంలో నా ప్రయాణం ఎంతో ఉపయోగపడింది. నా చేతల్లోనూ, వ్రాతల్లోనూ ఒక పరిణతికి ఉపయోగపడింది.
ఈ మూడేళ్ళలో బ్లాగులోకంలో ఎంతో మార్పు వచ్చింది.చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉండేది ఒకప్పుడు. బ్లాగర్లంతా చాలా ఆత్మీయంగా ఒకే కుటుంబంలా ఉండేవారు. నేను వచ్చిన కొత్తలో నా చేయి పట్టుకు నడిపించారు. ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తూ సహాయ సహకారలందిస్తూ స్నేహంగా ఉండేవారు. బ్లాగులోకం విస్తరించిన కొద్దీ ఎన్నో బిగ్ బాంగ్లు సంభవించాయి. విడి విడిగా పాలపుంతలు ఏర్పడ్డాయి వేటి స్వయం ప్రతిపత్తి వాటిది, వేటి మనుగడ వాటిది. ఏ వ్యవస్థలోనయినా మార్పు నియంత్రించలేనిది, అనివార్యమైనది.
నిన్నటిది నేటికి పాతబడుతున్న ప్రపంచంలో బ్లాగు పోయి, బజ్జు వచ్చే డాం డాం డాం అని మారుతున్న రోజుల్లో బ్లాగులు ఉంటాయో ఊడతాయో తెలియదు కానీ బ్లాగులోకంలో కొందరు సన్నిహితులు మాత్రం ఎప్పటికీ నా మనసులో అలానే ఉంటారు. కొందర్ని చూసినప్పుడు వీళ్ళు మురళీగాడి బ్లాగు ఫ్రెండ్స్‌రా అని నా స్నేహితులు అంటారు. అలా ఒక ప్రత్యేకమైన స్నేహవర్గం నాకు దొరికింది. మొదట్లో కామెడీ పోస్టుల ద్వారా దోస్తీ కట్టిన శ్రీవిద్య, మీనాక్షి, ఆశ్విన్ తో మొదలు, కవితలతో దోబూచులాడే క్రాంతి వరకూ అందరూ ఆప్తులే. తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచే సతీష్ అన్నయ్య, శ్రీనివాస్ కుమారన్నయ్య, నా ఫీజులేని డాక్టర్ కౌటిల్య, ఇప్పుడు అవినేని అన్నయ్య, టపాలు చదివి అభినందించటమే కాక కొన్ని మంచి మంచి చర్చలు చేసే విశాలగారు అందరూ అభిమానం చూపించినవారే.
e-తెలుగు సభ్యుడిగా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో నా ఉడుత సహాయం అందించాను. సమయంలేక ఇప్పుడు సంస్థ కార్యక్రమాల్లో హాజరుకాకపోయినా నన్ను ఏనాడు నిందించని కార్యవర్గానికి ఏ రూపంలో కృతఙ్ఞత చూపించాలో? సంస్థలో చురుకుగా పాల్గొనటం వలన చదువరిగారు, వీవెన్గారు, కశ్యప్‌గారు ఇలా నిర్ధిష్ట అభిప్రాయాలున్న వ్యక్తుల సాహచర్యం దొరికింది. వ్యక్తిగా వీరి వద్దనుండి నేర్చుకున్నది ఎంతో ఉంది. లాభాపేక్షలేని సంస్థకి తమ సమయాన్ని కేటాయిస్తూ, పదవులు, హోదాలు కూడా ఉత్సాహవంతులకు కట్టబెట్టి తాము మాత్రం కాడి భుజానికిఎత్తుకొంటారు. సి.బి.రావుగారు, శ్రీనివాసరాజు దాట్ల, చక్రవర్తిగారు, రవిచంద్ర ఇలా గత ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, e-తెలుగు కార్యక్రమాలకి తమ వంతు సహకారం ఎప్పుడూ అందించే కొందరు బ్లాగర్లు వీరందరి నుండి “స్వంత లాభం కొంత మానుకు” అనేదానికి అర్ధం నేర్చుకున్నాను. విఫలమై ప్రజలు గుర్తించని కొన్ని కార్యక్రమాలకు కూడా ముందు వెనుక వీరు చేసిన కృషి సభ్యుడిగా నాకు తెలుసు. ఏం ఉద్దరిస్తారు తెలుగుని నిలబెట్టి? అని ఎవరన్నా అంటే సొంత తల్లిని తిట్టినట్టే భావించే వీరి సంస్కారం నాకు ఆదర్శాలను ఎంత త్రికరణ శుద్దిగా నమ్మాలో తెలియజెప్పింది.
రేపు ఈ బ్లాగులు,బజ్జులు అన్నీ పోవచ్చు. కానీ వీరంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నా జీవనప్రయాణంలో భాగంగా ఉంటారు. నా బ్లాగు ప్రయాణంలో నాకు ఎంతో ఇచ్చిన మీ అందరికీ కృతఙ్ఞతలతో…
మీ
మురళీ
నాకు నచ్చిన గుర్తుచేసుకోదగిన టపాలు కొన్నిక్రింద ఇస్తున్నా.
హాస్య టపాలు:
1.కౄర మృగం
2.హ హా హాసిని
3.నేటికి నెరవేరిన మూషికవరం
4.బందరు మామయ్య – బంగారు బాతు
5.హాసిని కి పెళ్ళి చూపులోచ్…
6.జావా జావా కన్నీరు
కవితలు:
1.పిచ్చి రాతలు
2.లాలీ జో.. లాలీ జో..
3.నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.
4.నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..
5.ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.
నివేదికలు:
1.e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక
2.ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…
3.శంకరా’భరణం’
ఇతరములు:
1.ఇదే నా మొదటి ప్రేమలేఖ…
2.జాజు – ఒక కాకి కధ
3.>భయంగా ఉంది నాన్న…
4.పెళ్ళి-ఒక దృక్కోణం
గుర్తింపుకి నోచుకోని నాకు నచ్చిన టపాలు:
1.కాకి దిద్దిన కాఫురం (!?!)
2.పార్టింగ్ నోట్
3.ఐ హేట్ యు రా
4.సరికొత్తచీర ఊహించినాను..
Congratulations
and all the best
చాలా బాగా రాసావు మురళీ.నీ దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఇదే, ఏదైనా విషయాన్ని చిన్నగా కవితలాను చెప్పగలవు,పెద్దగా వ్యాసంలానూ రాయగలవు.కానీ నేను నీ కవితలకే కొంచం ఎక్కువ ఫ్యాన్‌ని.;-)
జీవిత ప్రయాణంలో ఈ ప్రయాణం చిన్నదే అయినా,ఈ బ్లాగులకి కేటాయించే సమయం తక్కువే అయినా.ఈ బ్లాగ్ అనేది నాకిచ్చిన స్నేహితులు కానీ,ఆత్మసంతృప్తి కానీ వెలకట్టలేనిది.ఇంతకు మునుపు వరకూ నేను రాసే పిచ్చి గీతలన్నీ ఎక్కడ పోయేవో కూడా తెలిసేవి కావు.ఇప్పుడు నా ప్రతీ అక్షరం నేను మళ్ళీ చదువుకోగలుగుతున్నాను,నలుగురి చేత చదవబడుతున్నాను.ఎప్పుడూ నాలాంటి ఆలోచనలు ఉండే వాళ్ళానీ,కవితలు,తెలుగు అంటే ఇష్టపడే వ్యక్తులని ప్రతీ పరిచయంలో వెతుక్కునే వాడిని.కానీ బ్లాగ్ మొదలెట్టాక ఆ అవసరమే లేకుండా పోయింది.ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుగుని ప్రేమించే వారే.దాదాపు అందరూ నేను రాసిన పదాల్లోని భావం చదవగలిగిన వారే, ముఖ పరిచయంలేకుండా పరిచయమయ్యి కూడా ఆత్మీయులుగా మిగిలిన వారే.నీ టపా మూలంగా అందరినీ ఒక సారి మరలా గుర్తు చేసుకో గలిగినందుకు ఆనందంగాఉంది.
congratulations murali garu.
madhuri.
నీకు నా అభినందనలు మురళి.
మీ బ్లాగ్ ప్రయాణం విజయవంతం.. మురళి గారు.. మీకు హృదయ పూర్వక అభినందనలు..మీ..బ్లాగ్ పూర్తిగా చూడలేదు.. చూసే పని మొదలెట్టాను.. సునిశిత దృష్టి తో.. మరిన్ని.. విషయాలు.. వ్రాయాలని.. కోరుకుంటూ.. మీలో..
మంచి కవిని.. కధకుడిని.. వ్యాసకర్తని, విమర్శకుడుని చూసాను. అభినందనలు. …
🙂 🙂 🙂
3 years! It has been happening kadaa! Undoubtedly, you are one of those well composed blog personalities. Would like to see more from you. Keep going..
మీ బ్లాగ్ ప్రయాణం విజయవంతం.. మురళి గారు.. మీకు హృదయ పూర్వక అభినందనలు.
Murali,Congratulations!
I may repeat this again, you are the most creative talent that came across in my journey and I wish you have great success and many more in life
God Bless u!
Congrats.
Simply super…. ur BLOG.
Congrats murali garu inkaa enno tapaalu raayaalani …..good luck
Congrats Dear Murali .Hope meerinkaa aneka dasaabdaalu vela tapaalato mammalni alaristaarani aasistunnaamu.. abhinandanalu Sreyobhilaashi …Nutakki Raghavendra Rao.
congratulations..keep blogging 🙂
ముచ్చటగా మూడేళ్ళు పూర్తిచేసినందుకు అభినందనలండి .
కాస్త ఆలస్యంగా ..అభినందనలు..:))
భలే రాసారు..:)
శ్రీ రాజీవ్ లేఖిని.. katti
Nice murali you completed 3 years
pai comment raasindi nEnE aswin ni some mistake