ఇదే నా మొదటి ప్రేమలేఖ…

ప్రియ నేస్తమా,

నీవు క్షేమమేనా? ఈ చిన్న వాక్యంలో నా గుండెల్లో నీ క్షేమానికై నా ఆలోచనల తీవ్రత,నా అభిమానం యొక్క ఆర్ధ్రత ఏమాత్రం కనిపించకపోవచ్చు. కానీ ఇంతకంటే గొప్పగా చెప్పటానికి నాకు తెలిసిన భాష చాలటంలేదు. మనసులోని భావాల్ని పూర్తిగా వ్యక్తపరచడానికి మనం తయారుచేసుకున్న భాష చాలదేమో! నా మనస్సులో చెలరేగుతున్న భావాల్ని వ్యక్తీకరించడానికి మాటలు దొరకక మౌనమనే ఉక్కుపాదం క్రింద నలిగి విలవిలలాడుతున్న నా హృదయ వేదన నీకు కాస్తంత ఆసక్తిని కలిగిస్తే ఈ ఉత్తరాన్ని సారీ, నా హృదయాన్ని కాస్తంత అర్ధం చేసుకుంటూ చదువు.

నా గుండె తెరలలో అనుక్షణం చెలరేగుతున్న అలజడి నీతో చెప్పబోయేసరికి అట్టడుగు పొరలను వీడి బయటకు రావటంలేదు. మన్సులోని మాట కళ్ళలో కనిపిస్తుందని అంటారు. నా కళ్ళు చేసే గుస గుసలు, చెప్పే ఊసులు నీ వరకు చేరాయో లేదో నాకు తెలియదు. నేను నీతో గడిపే క్షణాలలో ఓ చిరునవ్వు లేదంటే కాస్త మౌనం తప్ప ఏమీ సాధించలేకపోయాను.నీ స్పందన కోసం అనుక్షణం అన్వేషిస్తున్న నాకు నీ మౌనమనే చీకటి నిరంతరం అంతరాయం కలిగిస్తుంది. ఈ అన్వేషణలో చిత్తుగా ఓడిపోయాను. అందుకే ధైర్యం చేసి ముందడుగు వేసి చెబుతున్నా, లయ బద్దమైన నా హృదయస్పందన విను. నేను…నిన్ను…ప్రేమిస్తున్నా. నాకున్న అంతులేని ప్రేమని ఎంతగా చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఈ మూడు మాటలు తప్ప ఏమీ స్ఫురించటం లేదు. అయినా ఇంకా ఏదో చెప్పాలనే తపన నన్నింకా వ్రాయమని ముందుకు తోస్తుంది. నీవులేని లోకంలో నేను కోరుకునేది ఏదీ లేదు, చావుని తప్ప. నా ఆశలు,ఆశయాలు,ఆకాంక్షలు అన్నీ నీకై వేచి ఉన్నాయి, నీతో ముడిపడి ఉన్నాయి. కళ్ళముందు అనుక్షణం నీ రూపమే కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా  నీ ఆలొచనలే నన్ను వెంటాడుతున్నాయి. ఎవరు పిలిచినా నీవే అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, ఒక మనసుని మరో మనస్సు ఇంతలా వెంటడుతుందా? వూపిరితీయనీకుండా వుక్కిరిబిక్కిరి చేస్తుందా? నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పగలరు నీవు తప్ప.అందుకే నీ సానుకూల స్పందన కోరుకుంటూ మరొక్కసారి చెబుతున్నా. I LOVE YOU. ఈ మాటలన్నీ ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పి మాములు మాటలయిపోయాయి. కానీ ప్రతి మనిషి జీవితం విలువయినదే, ప్రతి మనిషి ప్రేమ, అనుభూతులు అమూల్యమైనవే. Every life and everybody’s feelings are special. ఇంకా ఏదో చెప్పాలని వున్నా తరువాత ఉత్తరానికై వాటిని నా హృదయంలో భద్రంగా పొందుపరిచాను. కానీ ఈసారి సంభోదన నేస్తమా అనికాక, ప్రియతమా అని వ్రాయగలిగే అవకాశం కోరుకుంటూ..

నీ పలకరింపుకే పులకరించి,
నీ శ్వాసనిశ్వాసాలని సప్త స్వరాలుగా మార్చడానికి
వేచి ఉన్న నీ

మురళీ.

నేనిప్పుడు విజేతను కాను

నేను ప్రారంభించాను ప్రపంచజైత్రయాత్ర,
నాకు ఆదర్శంగా నిలిచింది నెపోలియన్ చరిత్ర.
నాకు న్యాయమనిపిస్తే, నన్ను గెలిపిస్తే,
ప్రక్కవాడ్ని భాదించయినా చేసేస్తా.
నేను శిఖరం చేరడానికి తోడ్పడమంటూ శాసిస్తా,
కాదంటే, అడ్డంవుంటే ప్రక్కకు తోసేస్తా.

ఈవిధంగా అందరిని తొక్కుకుంటూ, తోసుకుంటూ
నా లక్ష్యం వైపు పరిగెడుతున్నా.
పీడిత జన అశృప్రవాహం ఉప్పెనల్లే ఎగసినా,
స్వార్ధమనే మరబోటు లో పడుకున్న నాకు,
రంగుల ఊహా ప్రపంచంలో విహరిస్తున్న నాకు,
నేలపై ఇంకుతున్న కంటి చెమ్మ కనబడలేదు.

ఇంత చేసి, ఇన్ని చేసి సాధించా విజయం.
కొంత కొతగా చేధించా నా లక్ష్యం.
విజయగర్వంతో చుట్టూ చూసాను.
నేనెక్కడున్నాను?
జలజల ప్రవహించే రక్తపుటేరు వొడ్డున,
ఎముకల గూడులు నిండిన గుడారాలతో,
శిధిలమైన జగత్తులో పదిలంగా.
ప్రేతాలు విడుస్తున్న తుదిశ్వాసల మలయమారుతంలో,
భూతాలు సంచరిస్తున్న రుధ్రభూమిలో,
ఒంటరి గా నిల్చున్నా.

నేనిప్పుడు విజేతను కాను,
నేనొక అభాగ్యుడ్ని, అనాధను.
ప్రేమించడానికి, పరిపాలించడానికి మనసులు, మనుషులు లేని,
భూతాల రాజ్యానికి ఏకైక చక్రవర్తిని.

పిచ్చి రాతలు

పగిలిన గాజు ముక్కల్లో నిన్నటి నిజాన్ని వెతుకుతున్నా,
కానీ పగిలింది అద్దం కాదు నేను నమ్మిన నిజమే.

* * *   * * *   * * *

నేను నిన్నే చూస్తున్నా,
నువ్వప్పుడు వెన్నెలని చూస్తున్నావు.

* * *   * * *   * * *

కలల అలలు నిజమనే తీరాన్ని తాకితే,
మనలో మరో కలాం పుడతాడు.

* * *   * * *   * * *

నీ కనుకొనల మొనలు తాకి
నా మనస్సుకయ్యిందో గాయం.
దాని భాద నాకో జీవిత కాలం.

* * *   * * *   * * *

అనంతమైన చీకటి లో ఓ చిరు దివ్వెను వెలిగించాను.
చూడాలి గెలుపు చీకటిదో? చిరు దివ్వెదో?

* * *   * * *   * * *

నీటి లోని చేప ఎరవైపే వెలుతుంది.
మనిషి చీకటి లోకి వెలుతున్నట్టే.

కౄర మృగం

ఆ మధ్య మన నైమిషారణ్యం లో సాధుపుంగవులంతా పూజలు,పునస్కారాలు చేసుకొని,భోజనం కూడా పూర్తి అయిన తరువాత పిచ్చాపాఠి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఉరుములు లేని వానలా అఖిల ప్రపంచ దేవతలంతా తమ తమ వాహనాల్లో దిగారు. ఋషిపత్నులు స్త్రీ దేవతలనందరినీ లోపలకి సాదరంగా ఆహ్వానించారు. “దేవుడు”లంతా బయట జరుగుతున్న పంచాయితీ లో కూర్చున్నారు. లోపల ఆడవాళ్ళ కి మాటల పండగ మొదలయ్యింది. మా వారికి ప్రపంచం నలుమూలల ఉన్న గుళ్ళు గోపురాలనుంచి ఏడాదికి వచ్చే ఆదాయం ఇంత అని ఒకరంటే, ఆ.. మా ఆయనకి భక్తులు ఇచ్చే బొచ్చే ఆ విలువ ఛేస్తుందని రాగాలు తీసేది ఒకరు. ఈ మధ్య కాలంలో పెరిగిన NRI భక్తుల గురించి,విదేశాలలో వెలసిన తమ ఆలయాలు వాటి ఆస్తులు,ఆదాయాలు మొదలు కొని ఆంధ్రప్రదేశ్ లో కబ్జా కి గురైన తమ ఆస్తుల వరకు అన్నింటినీ ఏకరువుపెడుతున్నారు.

పాపం బయట ఉన్న మన మగవాళ్ళు మాత్రం మంద్రం గా నవ్వుతూ, చూపుల తో పలకరిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ నిశ్శబ్ద వాతావరణానికి చికాకు పడ్డ ఒక కుర్ర ఋషి చివాలున లేచాడు. ఈయన గారు మొన్నటి వరకు మన అమీర్ పేట్ లో అద్దె హాస్టల్ లో ఉండి సాఫ్ట్ వేరు ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయాడు. ఇక తపస్సు చేసి వెలగబెడదామని ఇక్కడకి వచ్చాడు. అసలే గ్రూప్ డిస్కషన్ కి కమ్యూనికేషన్ కి అలవాటు పడ్డ ప్రాణం నిశ్శబ్దాన్ని భరించలేడు.

“స్వామి నా కో సందేహం”

“మానవ దేహమే అంత.అన్నీ సందేహాలే. కానివ్వు నాయన”

“తమరు అన్నీ సాధు జంతువులనే సృష్ఠించ వచ్చు కదా. అలా కాక కొన్ని కూర జంతువలని,కొన్ని కౄర జంతువలని ఎందుకు సృష్ఠించారు? సృష్ఠి ధర్మమని చెప్పకండి. ఒకరి  ఆహారం కోసం మరొకరు అని చెప్పకండి. ఆహార నియమాలు పెట్టింది మీరే కదా. అలాకాకుండా..   ”

“నాయనా కొంచెం గ్యాప్ ఇవ్వు నాయన. గ్రూప్ డిస్కసన్ లో పాల్గొన్నట్టు ప్రశ్న జవాబు రెండూ నువ్వే చెబితే ఎలా? ఇంతకి కౄర జంతువు అంటే ఎమిటి?”

“పెద్దపులి” అన్నారు ఎవరో.
అంతే పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కనకదుర్గమ్మ వాహనానికి వీసా ఇంటర్వ్యూ రోజే పాస్పోర్ట్ ఎవడో కొట్టేసినంత కోపం, అమెరికా లో అడుగు పెట్టిన వెంటనే డాలర్ విలువ పడిపొయినంత భాద వచ్చాయి.

పక్కనే ఇంత భయంకరమైన సింహం ఉండగా నేనేం చేసాను. నా మీద పడ్డారు అని గొడవ మొదలు పెట్టింది.
అంతే మృగరాజు గారికి పేట్రోల్ రేట్ మండినంత మండింది. “పాములు,కొండ చిలువలు, అనకొండలు ఇన్ని ఉండగా నేనే తేర గా దొరికాన? అని పెద్దపులి మీద పడింది.”
కార్నర్ లో పార్క్ చేసిన విష్ణువాహనం అంతా విని “అన్నింటి రుచి చూసాను గాని ఈ అనకొండ ఎక్కడ దొరకలేదు. బాస్ ఫారిన్ టూర్ పెట్టుకుంటె బాగున్ను”అని మనసులోనే అనుకున్నాడు.

జురాసిక్ పార్క్ అర్దంకాక పది సార్లు చూసిన మన సాఫ్ట్‌వేర్ ఋషి “మరి డైనోసారో?” అని దీర్ఘం తీసాడు.
అలా ఒక్కొక్కరూ ఒక్కో పేరు చెబుతూ పోయారు. దేవతల వాహనాలన్ని అసెంబ్లి హాల్లో ఎమెల్యే ల్లా కొట్టుకోవడం మొదలు పెట్టాయి.
నారదుని కంటే ప్రమాదం సుమీ ఈ సాఫ్ట్‌వేరోడు అనుకున్నారు దేవతలు. అంతా కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక నిజనిర్ధారణ కమిటీ వేసారు. అందులో నారదుడు, సాఫ్ట్‌వేర్  ఋషి తో పాటుగా పులిని సింహాన్ని కూడా చేర్చారు. అంతా కలిపి అప్పటి కప్పుడే  భూలోకయాత్రకు బయలు దేరారు.

అంతా తిరిగి అన్నీ తిరిగి చీకటి పడిందిగాని కమిటీ ఏ విషయం లోనూ ఏకాభిప్రాయానికి రాలేదు. ఇంకో రోజు ఉందామంటే విజిటింగ్ వీసా రద్దు అయిపోతుంది. అలవెన్సులు ఇస్తారో ఇవ్వరో తెలియదు. దిగులుతో మన టాంక్ బండ్ వేమన గారి విగ్రహం దగ్గర కూలబడ్డారు.

అటుగా చెత్త ఏరుకోవటానికి వచ్చిన ఒక చిన్న పోరగాడు వచ్చి ఏంటి దిగులు గా ఉన్నారు అని అడిగాడు.మొదట దైవ రహస్యం చెప్పకూడదు అనుకున్న చిన్నపిల్లలు దేవతలతో సమానం కదా అని మొత్తం విషయం చెప్పారు. వాడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి అటు గా పోతున్న ఒక ముసలి యాచకుడ్ని చూపించాడు.

అందరూ అటు చూసారు. చేతి లో కర్రతో చూపు మందగించటం వల్ల ఇబ్బంది పడుతూ నడుస్తున్నాడు.
“ఆయన ఒకప్పుడు పది షాపులకి యజమాని. ఒక్కగానొక్క కూతురికి లక్షలు పోసి పెళ్ళి చేసారు. ఆవిడ చిన్న వయస్సు లోనే మనవరాల్ని ఇచ్చి చనిపోయింది. తల్లి లేని పిల్లని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆస్థి మొత్తం ఆమె పేరు మీద రాసాడు. ఒక కుర్రాడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఈయన్ని రోడ్డు మీదకి తోసేసింది.”
“ఏ జంతువు కూడా తన తల్లిని, చెల్లిని, కావల్సిన వాళ్ళని చంపదు. కాని మనిషి మాత్రం డబ్బు కోసం,పైశాచిక ఆనందం కోసం దారుణం గా నమ్మిన వాళ్ళని మోసం చేసి హింస పెట్టి చంపగలడు. అలాంటి మనిషి ని మించిన కౄరమృగం ఇంకేమిటి?”

చిన్న కుర్రాడి మాటల్లో నిజం ఎదురుగా ఉన్న ముసలి వాడి సాక్ష్యం కాదనలేక పోయింది నిజనిర్ధారణ కమిటీ. ఇంతలో సాకీ ఉదంతం గుర్తు వచ్చిందో ఎమిటో పెద్దపులి అరణ్యం వైపు పరుగు తీసింది. మిగిలిన వాళ్ళు కూడా పోరగాడికి టాటా చెప్పి రిపోర్ట్ సమర్పించడానికి బయలుదేరారు.

స్క్రీన్ ప్లే  మొత్తం ముందే తెలిసిన విష్ణుమూర్తి మాత్రం నవ్వుతున్నాడు చిద్విలాసంగా.

పల్లీ-బఠాణి

అవి నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజులు. మాకు ఒక పెద్ద రూం లో ట్రైనింగ్ క్లాసులు జరిగేవి. ఖాళీ గా ఉన్నప్పుడు అందరం సరదాగ తెలుగు పాటలు పాడుకొనేవాల్లం. లేదా కొందరు ఔత్సాహికులు కవితలు రాస్తే చదివి పండగ చేసుకునేవాల్లం. ఓ రోజు ఉన్నట్టుండి మా కుర్రాళ్ళకి ఆవేశం వచ్చింది. అందరూ కలిసి గుంపుగా సామూహిక సాహిత్య ద్రోహానికి పూనుకున్నారు. గుండెకి గుబులు పుట్టేలా, బండలు బ్రద్దలయ్యేలా కలాల తో కలకలం సృష్టించారు. ఆ కవితా సునామీ మీ కోసం.

హెచ్చరిక: ఈ కవితలు చదివిన తరువాత పాటకులకు కలిగే అవస్థలకు నేను భాద్యుడ్ని కాను.

డబ్బాలొ….

డబ్బాలో రాళ్ళు గల గలా…
నువ్వు మట్లాడుతుంటె నాతో అలా అలా….
నాకనిపిస్తోంది రెంటి మద్య తేడా లెనట్టులా…

నేనిలా నువ్వలా….

నువ్వులేక నేను ఎలా…
కొట్టుకు చస్తున్నా గిల గిలా …
ఒడ్డున పడ్డ ఒక చేపలా….

వదిలించు కోవడమెలా..
ఓ పిల్లా…….
సరదగా నీపై వేసాను వల…
నువ్వు తగిలావు ఒక చేపలా…
పట్టుకున్నావు నన్ను ఒక  జలగ లా..
నిన్నిప్పుడు వదిలించుకొవడం ఎలా.. ఎలా..

ఓ కన్నా…
ఓ కన్నా …….
తాగొద్దని అన్నా….
తాగాలన్న నీ తపన చూసి చెపుతున్నా ….
రెండు పెగ్గులేసి పడుకో చటుక్కునా….
ఇంకొక్క పెగ్గన్నావంటె నిన్ను నరకనా….

కచ్చగా కవిత
కచ్చగా రాసా నేనొక కవిత
అది కసి గా తీసుకొచ్చి చదువుతా
వినకపొతే మీ అందర్ని నరుకుతా
అది విని బతికితె మళ్ళీ చదువుతా..
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..

నా మీద కోపగించక పోతే మళ్ళీ కలుద్దాం.

పరుగు

ఎండమావి లో నీటికై వెతికి
గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా కోల్పోయిన వెర్రివాడ్ని నేను.
నిశీధి లో కాంతిని పంచుతానంటూ
గమ్యాన్ని వెతుకుతానంటూ గగ్గోలు పెట్టి
వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను

ఉన్నత శిఖరాలు అధిరోహించాలాంటూ
ఆరాటం తో ఆశతో అడుగులు వేస్తూ
అలసిపోయి అదుపు తప్పి అధఃపాతాలానికి
పడిపోయిన ఆరొహకుడ్ని నేను

అయినా పరిగెడుతున్నా, ప్రయాణిస్తున్నా
ప్రయత్నిస్తున్నా, ప్రయాస పడుతున్నా
నా దృష్టి దాష్ఠికాన్ని చూడలేని దూరాలకు పోతుంది.
నా అడుగు ఆవేశం తో అనంత దూరాలకు సాగిపోతుంది.

ఎందుకంటే,
నేను శరీరం క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
కాని, మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య కాదు. 

చిరు ఆశ

“చిరు”ఆశ అంటే కొన్ని కోట్ల అభిమానుల ఆశ.
 
ఎవరో వస్తారని ఏదొ చేస్తారని ఎదురు చూసి మోసపోయిన ఆంధ్ర ప్రజలకు చిరు రాజకీయ రంగ ప్రవేశం నిజంగా ఓ అల్లాదిన్ అద్బుత దీపమే. ఈ చిరు ఆశ వెనుక ఎన్నో మెగా ఆశలు ఉన్నాయి. మన అంజనీ పుత్రుడు సినిమాల్లొ హిమాలయాల నుండి సంజీవని, ఆకాశం నుండి గంగని తెచ్చాడు. అలాగే ఈ జగదేక వీరుడు మనకి ఎదో తెస్తాడని ప్రజల ఆశ. ముఠామేస్త్రి గా ఉన్నప్పుడే ప్రజలకి అవసరమైతే వస్తా అని చూచాయ గా చెప్పిన చిరు ఇంద్ర, ఠాగోర్, స్టాలిన్ ల తో ప్లాట్ ఫార్మ్ ఖాయం చేసాడు.ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులలో అందరూ దోచుకొనే వారే తరాల కొద్ది దాచు కొనే వారే.అత్త సొమ్ము అల్లుడి దానం అని ప్రజల సొమ్ము బంధువులకి బామ్మరుదులకి ధార పోసే వారే. పనికి ఆహారం తో మొత్తం కైంకర్యం చేసారని రాజన్న అంటే, జలయగ్నం ధన యగ్నమని చంద్రన్న అంటాడు.మొత్తానికి లెక్కల మాస్టారి మొట్టికాయల తర్వాత తెలుగు మాస్టారి లెంపకయల్లా వుంది అంధ్ర పరిస్థితి. ఇప్పుడు క్లీన్ కాండక్ట్  సర్టిఫికేట్ తో ఛిరు వస్తా అంటే మేము వద్దంటామా ? అని ప్రజలు       
‘శంకర్ దాదా జిందాబాద్ హూ హా హూ హా’ అంటూ జేజేలు కొడతారు. ఇన్నేళ్ళు గా తమ వోట్లన్ని నోట్లకి, క్వార్టర్లకి వేసిన జనం ఈ మొగల్తూర్ మగ మహారాజు కి వేసి నీరాజనాలు పలుకుతారు.