సంపంగి నూనె

తెరచిన గుమ్మం తలుపుల నుండి ఉదయకాంతి, లోపలికి రావచ్చో లేదో అని తటపటాయిస్తూ ఉంది. సప్తపది సినిమా పాటలు పెట్టి కాఫీ గ్లాసుతో గడప దగ్గర కూర్చున్నా. రాత్రి కమ్ముకున్న పొగమంచు ఇంకా పూర్తిగా తొలగలేదు. వీధిలోకి చూస్తే అంతా మసకమసకగా కనిపిస్తుంది. ఎదురింటిలో పంతులమ్మగారి మనవరాలు పొందిగ్గా కూర్చుని ముగ్గులేస్తుంది. రోజూ పొద్దున్నే ఇంటిలో ఎవరూ లేవక ముందే కాసేపు ఇలా గుమ్మంలో కూర్చుని గడిపే గంట మాత్రమే నాది. మా ఆయన మిస్టర్ లేజీ, నా కూతురు రాకాసి రాజీ నిద్ర లేచారా నా పరుగు మొదలవుతుంది. ఇక రాత్రి నిద్రపోయే దాకా ఇల్లు అలికే ఈగలా నా పేరేంటో కూడా గుర్తు రాదు.

“ముందు తెలెసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా మంధమతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో” అంటూ నా ఫోను పాటందుకుంది. ఆ గోలకి లోపల ఎవరూ లేవకుండా ఒక్క పరుగున లోపలికి వెళ్ళి ఫోనందుకున్నా.

“హలో, ఏవే యమున, బాగున్నావా? నేనే లతని. ఎక్కడుంటున్నావ్? పెళ్ళయ్యాక అసలు పత్తా లేకుండా పోయేవు. ఉద్యోగం వచ్చినా మానేసావంటగా? పిల్లలెందరూ? ఏంటే మాట్లాడవ్?” నాకు కాసేఫు ఊపిరందక ఉక్కిరిబిక్కిరయిపోయాను.
“ఏవే లత నువ్వింకా మారలేదా? తెలుగు పద్యాలు భట్టీ వేసినట్టు ఏంటే ఆ తొందర? నన్ను కాస్త కుదురుగా నీ ప్రశ్నాపత్రానికి సమాధానాలు చెప్పనిస్తావా?” అని కాస్త విసుగు నటించాను.

“ఎవరిక్కావాలే నీ బోడి సమాధానాలు. పెద్ద ఐయెయెస్‌కి మల్లే. ఆ మాత్రం తెలుసుకున్నాకే ఫోన్ చేసాను” అని అల్లరిగా నవ్వింది.నేను కూడా పెద్దగా నవ్వేసా. కాసేపు ఇలానే బోళాగా మాట్లాడుకున్నాం. చిన్ననాటి స్నేహాల్లో గొప్పతనమిదే. ఏ అరమరికలూ ఉండవు, లౌక్యం తెలియక ముందే మొదలయిన స్నేహాలు కావటం వల్లనేమో ఒకరి జీవితం ఒకరికి తెరిచిన పుస్తకమల్లే అనిపిస్తుంది.
“ఇక చాల్లే వెతుక్కుని ఫోన్ చేస్తే తెగ మాట్లాడేస్తున్నావ్ కానీ, అసలు విషయం చెబుతా విను. వచ్చే శనివారం పనులన్నీ పక్కనపెట్టి తీరుబడి చేసుకో, కుదరకపోతే మీ ఆయనకి, పిల్లలకి విడాకులిచ్చి పుట్టింటికొచ్చెయ్.” అని వెక్కిరింతగా నవ్వింది.

“చీ నోర్ముయ్. ఏంటామాటలు? ఇంతకీ అసలు విషయమేంటో చెప్పేడు.” అన్నాను కోపంగా.
“ఆ ఏడుద్దామనే. కాకపోతే ఒంటరిగా కాదు. సామూహికంగా. అర్ధం కాలేదా? మన పదవతరగతి బ్యాచ్ అంతా కలుద్దాం అని నిర్ణయించుకున్నాం. ఆ మధ్య ఊరెళితే మన తొర్రిపళ్ళ రమేష్ మార్కెట్లో కనిపించాడు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక అందరం ఇలా కలిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనే పట్టుబట్టి అందరి అడ్రస్సులు, ఫోన్ నంబర్లు సంపాదించాడు. అబ్బాయిలందరికీ తను ఆహ్వానిస్తున్నాడు. అమ్మాయిల పని నాకు అప్పగించాడు. నువ్వూ వచ్చి ఏడిస్తే అక్కడ అందరం ఎవరి జీవితాల కష్టాలు వాళ్ళు చెప్పుకుని ఏడుద్దాం. వీలయితే ఒకర్నొకరు ఓదార్చుకుందాం.” తన దోరణిలో వీలయినంత వ్యంగ్యం కలిపి చెప్పింది.

“ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలేంటే నీ మొహం. మనం పదవతరగతి చదివి ఇరవయ్యేళ్ళయ్యింది తెలుసా?” అన్నా ఒకపక్క లెక్కెడుతూనే హాశ్చర్యపోయి.
“అయితే మాత్రం ఆ తొర్రిపళ్ళ రమేష్‌గాడ్ని, చీకేసిన మావిడ టెంక జుత్తోడు రవిగాడ్ని వీళ్ళందరినీ అబ్బాయిలూ అనికాక ఆయన అతడు అని గౌరవంగా పిలుస్తామా ఏంటి?” అంటూ గలగలా నవ్వేసింది.
“రాక తప్పదంటావా?” అని అడిగాను లక్ష ఆలోచనలు రివ్వుమని చుట్టేస్తుండగా.
“రానంటే చెప్పు ఇప్పుడే వచ్చి నిన్ను చంపి పారేస్తాను. సరే ఆయనొచ్చారు నాకు పనుంది తర్వాత ఫోన్ చేస్తాను” అని పెట్టేసింది రాక్షసి.

ఇలా ఇరవైయేళ్ళ తర్వాత కలుస్తున్నామని చెప్పగానే మా ఆయన, కూతురు నా వైపు ఎలా చూస్తారో, ఏం ఆటపట్టిస్తారో అని ఆలోచనలో, తర్వాత పనిలో పడ్డాను.

టివిలో ఫేవరెట్ పాట చూస్తూ ఈలవేస్తున్న ఆయన చేతిలో మాంచి కాఫీ పెట్టి విషయం చెప్పాను. సిప్ చేసిన కాఫీ మింగకుండా కళ్ళు పెద్దవి చేసి అలానే ఉండిపోయారు. నోరు కాలిందో ఏమో గబుక్కున మింగేసి ఊఫ్ఫు ఉఫ్ఫు అంటూ గోల. నా కూతురుకి కూడా విషయం చెబితే జూలో వింత జంతువును చూసినట్టు చూసింది నావైపు. పైగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకోవటం ఒకటి. అంతే నాకు రోషం వచ్చేసింది.
“ఆయ్ ఆఫీసు అవుటింగులని మీరు, కాలేజ్ టూర్ అని చెప్పి అది వెళ్తే లేదేం? నేను వెళ్తున్నా అంతే” అని డిక్లేర్ చేసేసి చాటుకొచ్చి నా తెలివితేటలకి నేనే పొంగిపోయాను.

ఎవరెవరొస్తారో, ఎవరెవరు ఏ స్థాయిలో వస్తారో, ఇంతకు ముందల్లే ఉంటారో లేదో అని రోజూ పనులు చేసుకుంటున్నంత సేపూ అదే ధ్యాస. నా ఆలోచనా ప్రవాహంలో నేను కొట్టుకుపొతుండగానే రావాల్సిన శనివారం వచ్చేసింది.

పొద్దున్నే లేచి తలకి స్నానం చేసుకున్నాను. మా ఆయన బ్రష్ చేస్తూ నా వైపు అదోలా చూసారు. నేను ఆయన్ని చూడనట్టే నటించి వెంటనే “గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా” అని పాడుకుంటూ దేవుడి గదిలోకి వెళ్ళిపోయాను. మా డిటెక్టివ్‌గారు మాత్రం వంగి ఇంకా అనుమానంగా చూస్తూనే ఉన్నారు.

నేను దేవుడి ముందే కూర్చుని కళ్ళుమూసుకుని “ఛీ ఛీ ఆ దొంగమొహంది లత ఈ గోలెందుకు తెచ్చిపెట్టింది నాకు. అది చెప్పినప్పటి నుండీ చిన్నపిల్లలా నా సరదా ఏంటో, ఇంట్లో వాళ్ళంతా నన్ను దొంగమల్లే చూడటమేంటో భగవంతుడా అని” నిష్టూరంగా నాలో నేనే తిట్టుకుంటూ కూర్చున్నా.

“ఏమేవ్ చేసిన పూజ చాలు వచ్చి టిఫిన్ పెట్టు” అని కేకేసారు మావారు. పూజ అనే పదాన్ని కాస్త ఒత్తి పలకటంలో వ్యంగ్యమర్ధమయ్యి మూతి ముడుచుకున్నాను.

తండ్రి, కూతురు ఇద్దరూ టిఫిన్లు చేస్తున్నంత సేపూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఒకటే నవ్వటం. నాకు ఒళ్ళుమండిపోతుంది. టిఫిన్లు చేసి ఎంత త్వరగా బయటపడతారా అని చూస్తూ కూర్చున్నా.

నా కూతురైతే వెళ్తూ,వెళ్తూ “అమ్మా ఏం చీర కట్టుకుంటున్నావే?” అని వెటకారం.
“చీరా! పదవ తరగతి స్నేహితులు కదమ్మా గుర్తుపట్టడానికి ఏ పట్టు పావడానో వేసుకుంటుందిలే” అని ఈయన వంతపాడి ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళారు.

నాకు ఉక్రోషంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఇక వెళ్ళకూడదని అనేసుకుని మంచం మీద పడి అలానే ఆలోచిస్తూ కూర్చున్నా. ఇంతలో లత ఫోన్ చేసి “నేను మీ ఇంటికే వస్తున్నా. త్వరగా రెడీ అయ్యి ఉండు” అని చెప్పింది. దాని సంగతి నాకు బాగా తెలుసు, ఇక తప్పదు. లేచి రెడీ అయ్యాను. కారేసుకుని ఒక్కర్తే వచ్చేసింది. నన్ను చూస్తూనే ఒకటే అరుపులూ, గెంతులూనూ. దీనికసలు వయసే రాలేదా అనిపించింది.  మనిషి కూడా అసలు వయస్సు కంటే కనీసం అయిదేళ్ళు చిన్నదిలా అనిపించింది.

ఇద్దరం ఒక అరగంటలో మా స్కూల్‌కి చేరుకున్నాం. అప్పటికే అక్కడ వచ్చి ఉన్న సరళ, రోజా మమ్మల్ని చూస్తూనే తెగ సంబరపడి పరిగెత్తుకొచ్చారు. అందరం గోల గోలగా మాట్లాడుకుంటూ స్కూలంతా కలియతిరుగటం మొదలుపెట్టాం. ఆ గోడలు, బ్లాక్ బోర్డులు చూస్తుంటే ఏన్నెన్నో జ్ఞాపకాలు. మధుర కావ్యాలు కొన్ని, మరపురాని చిత్రాలు కొన్ని. నూనూగు మీసాల వయస్సులో కవులు వ్రాసిన మొదటి కవితలకి కాగితాలు ఈ గోడలే. సుద్దముక్కనే కుంచెగా చేసుకున్న చిత్రకారుల రమణీయ చిత్రకళకు కేన్వాసులు ఈ బ్లాక్ బోర్డులే. కాలం వెనక్కి పరిగెడుతూ పోతోంది. అందరం చిన్నపిల్లలమయిపోయాం.

దూరంగా తొర్రిపళ్ళ రమేష్, రవి, గెద్దముక్కు ఆంజనేయులు అందరూ కనిపించారు. అందరినీ పలకరిద్దామని అటే కదిలాను. కానీ నా కాళ్ళు హఠాత్తుగా ఆగిపోయాయి. కళ్ళు మాత్రం వాళ్ళ వైపే చూస్తున్నాయి.

“ఏమేవ్ లత, ఆ పొడుగ్గా ఉన్నది ఎవరే కార్తికా?” అని అడిగాను. నాకు తెలుసు తను కార్తికే అని.

“ఆహా బానే గుర్తు పట్టావే” అని అందరూ ఒక్కసారిగా నవ్వారు.

“చీ చీ ఏంటే ఆ మాటలు” అన్నాను కోపంగా.
“అబ్బో నువ్వు చూస్తే లేదు కానీ మేము అంటే వచ్చిందేం” అని మళ్ళీ నవ్వు మొదలుపెట్టారు. వీళ్ళని ఆపటం కష్టమని నాకు తెలుసు. అందుకే నీళ్ళు తాగొస్తా అని చెప్పి పక్కకి వచ్చేసాను.

తనొస్తాడని నేను ముందే ఎందుకు ఊహించలేదు? అసలా ఆలోచనే ఎందుకు రాలేదు? నన్ను నేనే తిట్టుకుంటూ ఒంటరిగా గ్రౌండ్ వైపు నడిచాను.

సరిగ్గా ఇక్కడే గ్రౌండ్‌లోనే మొదటిసారి కార్తీక్‌ని చూసాను. సిమెంట్ బెంచ్ పైన స్నేహితులతో కూర్చుని ఉంటే అడపిల్లని కన్నెత్తి చూడని ప్రవరాఖ్యుడల్లే తలదించుకుని సైకిల్ మీద మా ముందు నుండి వెళ్ళిపోతుంటే అమ్మాయిలంతా పుస్తకాల సందుల్లో నుండి తననే చూస్తుండటం గమనించాను. సాయంత్రం తను లైబ్రరీకి వెళ్తే తనకంటే వయస్సులో చిన్నా పెద్దా తేడా లేకుండా కనీసం రెండు టేబుళ్ళకు సరిపడా అమ్మాయిలు లైబ్రరీలోనే గడిపేస్తారని స్కూలంతా చెప్పుకుంటారు. నిగనిగలాడే జుత్తు, పాలమీగడంటి రంగు, సన్నగా పొడుగ్గా ఉండే తనరూపం అమ్మాయిలనిట్టే ఆకర్షిస్తుంది. ఎంతోమంది అమ్మాయిలు తనకి ప్రేమలేఖలు వ్రాస్తే “అయ్యో అలాంటివేం వద్దండి” అని నవ్వేసి వెళ్ళిపోయేవాడు.

క్లాసులో అందమైన అమ్మాయిని, బాగా చదువుతానన్న పేరుంది. నన్ను కూడా కనీసం ఒక్కసారైనా చూడడేంటి అని నేనెప్పుడూ అనుకునేదాన్ని. కానీ ఈవిషయం బయటకి తెలిస్తే అందరి దగ్గరా  అందగత్తెనని నాకున్న గొప్ప పేరు పోతుందని బయపడి ఎప్పుడూ బయటపడలేదు.

ఒకరోజు మా స్కూల్ మొత్తానికి మోడ్రన్ ఫ్యామిలీ అని చెప్పుకునే సునంద, కార్తీక్‌కి ప్రేమలేఖ వ్రాసింది. తను అందరికీ ఎప్పుడూ చెప్పే సమాధానమే చెప్పి ఉత్తరం అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం అప్పుడే అటుగా వస్తున్న మా కంట పడింది. వెంటనే మా కోతి బ్యాచ్ గట్టిగా నవ్వింది. ఆ నవ్వులకి అవమానంతో ఇగో హర్టయిన సునంద నాతో “ఈ బ్యాచంతటికీ నువ్వేగా లీడరు. అందగత్తెవని వీళ్ళ చేత పొగిడించుకోవటం కాదు. చేతనైతే మన పదవతరగతి పూర్తయ్యేలోపు వాడు నీవైపు చూసేలా చేసుకో. అప్పుడు నవ్వితే బావుంటుంది. ఇప్పుడెందుకు పెద్ద ఫోజు” అని చాలెంజ్ చేసినట్టుగా అని వెళ్ళిపోయింది.

“అంతా మీ వల్లే జరిగింది” అని మా కోతులందరినీ చెడామడా తిట్టేసా. కానీ అందరి ఆలోచన ఆ ఛాలెంజ్ మీదే ఉండిపోయింది.
“ఏమేవ్ యమునా నీక్కూడా పడడంటావా?”
“అది చెప్పిన మాట నిజమేనే. ఎంత అందగత్తెనయినా వాడు కన్నెత్తి చూడడు” అని ఒక్కోళ్ళు ఒక్కో రకంగా మాట్లాడారు. అందరిని తిట్టేసి ఇంటికి వచ్చేసా.

ఇంటికి వచ్చేనే కానీ నా ఆలోచనలు కూడా ఆ చాలెంజ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఏదో ఒకటి చేసి వాడు నా చుట్టూ తిరిగేలా చేసుకోవాలి అనిపించింది. కానీ అంతలోనే ఇదంతా తప్పు అనిపించి ఆ ఆలోచన పక్కన పెట్టేసా.

మరుసటిరోజు సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చేస్తుంటే నా చున్నీ సైకిల్ చెయిన్‌లో ఇరుక్కుని కిందపడిపోయాను. మోకాలికి దెబ్బ తగిలి రక్తం రావటం మొదలయ్యింది. నొప్పి బాధకు చాలదన్నట్టు, చున్నీ ఎంతకూ చెయిన్ నుండి రాలేదు. ఇంతలో అటు వైపే వచ్చిన కార్తీక్ దిగి నా వైపు చూసాడు. నేనప్పటికే నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్నాను.

కార్తీక్ వచ్చి “అయ్యో పెద్ద దెబ్బే తగిలినట్టుందే. ఈ చున్నీ వదులు నేను తీస్తా” అని అందుకుని చున్నీ తీసి నాకిచ్చాడు. “సైకిల్ తొక్కు కుని వెళ్ళగలవా మరి?” అని అడిగాడు.
“మెల్లగా నడిపిస్తా” అని నేను నడుస్తూ ఉంటే. తను కూడా నాతోనే నడుస్తూ వచ్చాడు. నడుస్తున్నంతసేపూ పుస్తకాలు, పరీక్షలు, అయిపోయిన సిలబస్, పెండింగ్ ఉన్న నోట్స్ ఇలా బోలెడన్ని చెప్పుకొచ్చాడు. ఇంతలో మా ఇళ్ళు వచ్చేసింది.
“చూసావా మాటల్లో పెట్టి నీకు నొప్పి తెలియనివ్వలేదు” అని నవ్వేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఆ నవ్వులో ఏదో స్వచ్ఛత. ఇప్పటివరకూ మరలా అలాంటి స్వచ్ఛత ఎవరి దగ్గరా చూడలేదు.

అప్పటి నుండీ రోజు స్కూల్ అయిపోయాక ఇద్దరం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మొదట్లో కాలునొప్పి కాబట్టి నేను నడుస్తూ ఉంటే తోడుగా వచ్చేవాడు. తర్వాత అదొక అలవాటయ్యింది. మాట్లాడుకునే మాటలు చదువులు దాటి ఆటలు, అలవాట్ల వైపు నడిచాయి.
“నువ్వెప్పుడూ సంపంగి పూలే పెట్టుకుంటావెందుకూ?” అని అడిగాడొకసారి. తను అంతలా నన్ను చూస్తున్నాడన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. కాస్తంత గర్వంగా, బిడియంగా కూడా అనిపించింది.
“సంపెంగలంటే నాకు చాలా ఇష్టం కార్తీక్. ఆ సువాసన నన్నెప్పుడు తాకినా నాకే సొంతమైన ఏదో లోకంలొ ఉన్నట్టనిపిస్తుంది” అని ఏదేదో చెప్పుకుంటూ పోయాను. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా నన్నే చూస్తూ, నా మాటలు శ్రద్ధగా విన్నాడు.

ఒకరోజు సాయంత్రం ఎప్పటిలానే స్కూల్ నుండి వచ్చేస్తుంటే తనదగ్గర సంపెంగ పూల వాసనొచ్చింది. స్కూల్ బ్యాగ్ నుండి ఒక కవర్‌లో దాచిన సంపంగిపూలు తీసి ఇచ్చాడు. కానీ ఆ సువాసన ఆ పూలది కాదు. తన జుత్తుకి రాసుకున్న సంపంగి నూనెది. ఆ రోజు ఇంటికొచ్చి కూర్చుంటే గాలిలో తేలుతున్నట్టూ, మబ్బుల్లో విహరిస్తున్నట్టు ఏదో అనుభూతి. అప్పటి నుండీ వీలయినప్పుడల్లా తను సంపంగిపూలు తెచ్చేవాడు. పూలు తెచ్చినా, తేకున్నా తలకి మాత్రం సంపంగి నూనె రాసుకునేవాడు.

నాకయితే స్కూల్లో అందరికీ అరిచి చెప్పాలనిపించేది. ముఖ్యంగా ఆ ఉడుకుమోతు సునందకి. కానీ చెప్తే నా గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారని భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదు. కానీ ఒకరోజు సాయంత్రం మేమిద్దరం కాస్త నవ్వుతూ, చనువుగా వెళ్ళటం మా సరళ చూసింది. గట్టిగా అరిచి సునందకి మా ఇద్దరినీ చూపించింది. సునంద ఉక్రోషంగా మా వైపు చూస్తూ వెళ్ళిపోయింది. నాకయితే దాని చూపుచూసి గుండె ఝళ్ళుమంది.

ఇది జరిగిన కొన్నిరోజులకి ఒకసాయంత్రం సైకిల్ స్టాండులో సైకిల్ తీస్తుండుగా వెనక క్యారెజ్‌కి కట్టున్న ఒక కాగితం క్రిందపడింది. దాన్ని అందుకుని తీసేంతలో సునంద దాన్ని అందుకుని విప్పి “అయ్యో” అంటూ గట్టిగా అరిచి. అటుగా వెళ్తున్న ప్రిన్సిపాల్ మేడం చేతిలో ఆ కాగితం పెట్టేసింది. ప్రిన్సిపాల్ వెంటనే కార్తీక్‌ని పిలిపించింది.

“కార్తీక్ ఏంటిది? అమ్మాయిలకి ప్రేమలేఖలు వ్రాస్తున్నావా?” అని గట్టిగా అరిచి నావైపు తిరిగి “ఇందులో నీ ప్రమేయమేమైనా ఉందా?” అని ఉరిమి చూసింది ప్రిన్సిపాల్ మేడం.నాకు గొంతు తడారిపోయింది. కళ్ళల్లో నీళ్ళు ధారలు కట్టాయి. “నాకేం సంభందంలేదు మేడం. మా నాన్నకు తెలిస్తే చంపేస్తారు మేడం.” అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. ప్రిన్సిపాల్ అక్కడ నుండి నన్ను పంపేసింది. అక్కడే ఉన్న సునందని, సరళని తన గదిలోకి పిల్చి మాట్లాడాక ప్రిన్సిపాల్ మేడం కార్తీక్‌ని డీబార్ చేసింది.

బయటకు వస్తున్న కార్తీక్‌తో మాట్లాడదామని దగ్గరకు వెళ్తుంటే అక్కడికొచ్చిన సునంద “నన్ను కాదని ఎలాంటి దాన్ని ఇష్టపడ్డావో చూసావా? ఇది నీతో స్నేహం చేసిందనుకున్నావా? నాతో ఛాలెంజ్ చేసి నిన్ను తన చుట్టూ తిప్పుకునేలా చేసింది. కావాలంటే దాని స్నేహితులనడుగు” అని ఎగతాళిగా నవ్వింది. కార్తీక్ ఒక్కసారి నమ్మలేనట్టుగా నన్ను చూసాడు. నేను తనతో మాట్లాడాలనుకునేలోపే ప్రిన్సిపాల్ వస్తుందంటూ నా ఫ్రెండ్స్ నన్ను అక్కడనుండి లాక్కుపోయారు. అదే చివరిసారి కార్తీక్‌ని చూడటం. ఈ ఇరవై ఏళ్ళలో మరలా ఎప్పుడూ తన గురించి ఎలాంటి కబురూ వినలేదు.

అలోచనల్లో మునిగి గ్రౌండ్‌లో కూలబడిపోయాను. ఎంతసేపయ్యిందో తెలియలేదు. అలికిడికి పక్కకి తిరిగి చూస్తే కార్తీక్. “ఏం యమునా బాగున్నారా?” అని నవ్వుతూ పలకరించాడు. అదే స్వచ్ఛమైన నవ్వు. దేవుడు తనకి మాత్రమే ఇచ్చిన వరమనిపించింది.
“బాగున్నా? మీరెలా ఉన్నారు?” అని అడిగాను. అడిగానే కానీ మా మధ్య మీరులెప్పుడొచ్చాయి అని ఆశ్చర్యమేసింది. సంస్కారం ఎంత చెడ్డది అని ఆ క్షణం అనిపించింది.

కాసేపు అలా నవ్వుతూనే క్షేమ సమాచారాలడిగాడు. మనిషిలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ఆ విషయం గుర్తించగానే అప్రయత్నంగా నేను నా జుట్టు సవరించుకున్నా, నా మొహం ఎలా ఉందో అని ఒక్క క్షణం అనిపించింది. అతను తన గురించి, తన జీవితం గురించి ఏవో చెబుతూనే ఉన్నాడు. నా మనసుకి అవేం ఎక్కటం లేదు. తనకంటే నేను ఏజ్డ్ గా అయిపోయానేమొ, ఒకప్పుడు క్లాస్ బ్యూటీని అని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఇతను స్కూల్ మొత్తమ్మీదా నాతోనే స్నేహం చేసేవాడంటే నమ్ముతారా? ఇలా నా ఆలోచనల్లో పడికొట్టుకుపోతున్నా.

తను మాటలు ఆపి “ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు?” అని అడిగాడు.
“అది అది కార్తీక్ ఆ రోజు” అని ఏదో చెప్పబోయాను. ఏ రోజా? అన్నట్టు నావైపు సాలోచనగా చూసి, ఏదో స్పురించిన వాడల్లే గట్టిగా నవ్వుతూ “హ హ అయ్యో యమునా మీరింకా అవి గుర్తుంచుకున్నారా? అందులో మీ తప్పేం లేదని నాకు అప్పుడే తెలిసింది. నిజానికి ఆ ఉత్తరం వ్రాసింది కూడా ఆ అమ్మాయెవరూ సునందేనంట. మీకు ఈ విషయం తెలిసే ఉంటుందేమో తర్వాత. నా తప్పు కూడా ఏమీ లేదండోయ్” అని ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇంతలో అబ్బాయిలు కొందరొచ్చి ఇక్కడేం చేస్తున్నారు మీరు? పదండి లోపలికి అని లాక్కుపోయారు. కాసేపు ఆటపాటలతో ఏదో కాలక్షేపం చేసాక ఎవరి ఇంటికి వాళ్ళు బయల్దేరాం. కార్తీక్ వెళ్ళేప్పుడు వచ్చి చెప్పి వెళ్ళాడు.

ఇంటికొచ్చి సోఫాలో కూర్చుంటే చాలా రిలీఫ్‌గా అనిపించింది. కానీ మనస్సులో చిన్నగా కలవరపెడుతున్న విషయం ఒకటే. అది వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తున్న కార్తీక్ దగ్గరనుండి గుప్పుమంటు వచ్చి నన్ను తాకిన సంపంగినూనె సువాసన.