2040 కార్తీకమాసం ఏదోరోజు ఉదయం 4 గంటలు, పూజగదిలో నుండి గంట వినబడుతుంది. నేను ఉలిక్కిపడి లేచాను. అమ్మా ఎంత భయంకరమైన పీడకల మా ఇంట్లో ఏంటి గంట వినిపించటం ఏంటి? మా అవిడ మ్యాడీకి(మధు మధుమతి) పెళ్ళయిన కొత్తలో ఒకసారి వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకుని వెళ్ళి గోవిందా అనమని గుసగుసగా చెప్పాను. అది పాపం దానికొచ్చిన భాషలో దేవుడ్ని పిలిచింది. గుడిలో అయ్యవారు నన్ను పక్కకు పిలిచి గుడిలో ఏమిటా మాటలు అని చీవాట్లేసారు. ఆ రోజు వదిలేసిన నీళ్ళే ఈ రోజుకి ఒక పూజలేదు, గుడికి తీసుకుని వెళ్ళనూలేదు.నాకు నిద్ర నుండిలేచినా మంత్రాలినిపిస్తున్నాయే. నా చెవిని జి.పి.ఎస్.గా వాడి మంత్రాలొచ్చిన వైపే చెవిని పెట్టి వెళ్ళాను. పురాతనకాలంలో మూసివేయబడ్డ ఒక గది తలుపులు తెరిచి కనబడ్డాయి. ఆ గదిని నేను 2011 కాలంలో దేవుడిగది అనిపిలిచేవాడ్ని. పరాకున నేను పూజ చెయ్యటం లేదని దేవుళ్ళు వచ్చి వాళ్ళ పూజలు వాళ్ళే చేసుకుంటున్నారా అని అనుమానం కలిగి తలుపుతోసి చూసాను.గుండె గుభేలుమని ఆ షాక్‌లో కిందపడ్డా.మా మ్యాడి, మా అబ్బాయి కవిష్యంత్(అంటే ఏమో?) పూజ చేస్తూ కనిపించారు.మంత్రాల కోసం యూట్యూబ్ తెరిచి, అందులో చెప్పే పూజా విధానంలో పూజ చేస్తున్నారు.నేను పరిగెట్టి వెళ్ళి మా ఫ్యామిలీ డాక్టర్, నా ఆప్తమితృడు గోపికి పోన్ చేసా. ఇంట్లో పనమ్మాయి ఫోను తీసి అయ్యగారు పూజలో ఉన్నారండి అంది.ఏమిటీ గోపి గాడు పూజా? 2012 లో అంతరాయం వచ్చి ఆగిపోయిన యుగాంతం ఇప్పుడు దాపురించిందా ఏమిటి? నేను రోజూ పేపరు చూస్తునే ఉన్నానే. పిచ్చితో నేను పిల్లి మొగ్గలు వెయ్యటం మొదలుపెట్టాను.
కాసేపటికి పూజ ముగించుకుని మా అబ్బాయి వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. నా పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ రోజే నా ఆఖరిరోజని తేలిపోయింది. నేను పరిగెట్టెళ్ళి బీరువాలో ఉన్నా వీలునామా తీసి వాడి చేతిలో పెట్టా. అందులో ఎప్పటికయినా కొనకపోతానా మా అబ్బాయికి ఇవ్వకపోతానా అని ముందుగానే చార్మినార్,తాజ్‌మహల్ కూడా రాసిపెట్టాను. పాపం పిచ్చి తండ్రి ఎలా బ్రతుకుతాడొ ఏంటో అని బెంగగా అనిపించింది.
“ఏంటో అందరూ లేచినా పడుకోవటం ఇలా లేచాక గెంతులు వెయ్యటం?” అని ఇంకా ఏదో అంటుంది మ్యాడి.
“ఎవర్నీ తిడుతున్నావ్?” అని అడిగా.
“పక్కింటాయన్ని”
“పాపమే వాళ్ళావిడ తిట్టేవి చాలదా? నువ్వు కూడా ఎందుకు?”
“జోకులాపండి ఈ రోజునుండే స్వయంవరాల సీజన్ మొదలన్న ఙ్ఞాపకం ఉందా? ఈ సీజన్లో కూడా అబ్బాయి రిజక్ట్ అయితే మా ఇంట్లో వాళ్ల ముందు నా పరువుపోతుంది. మా అక్కని చూడండి క్రితం సీజన్లోనే పెళ్ళి పర్మిట్ సంపాదించి వాళ్ళబ్బాయికి పెళ్ళి చేసేసింది.”
“క్రితం సీజన్లో మన అబ్బాయికి కూడా పర్మిట్ వచ్చేది నీకు ఇంటర్లో మార్కులు తక్కువ రావటం వలనే పోయింది. మర్చిపోయావా?”
“ఈసారి అలా జరగకూడదనే అబ్బాయి చేత కార్తీకమాసం నోము చేయిస్తున్నా. మా అమ్మే చెప్పింది ఇలా చేయించమని. మా అక్క కూడా చేయించిందట వాళ్ళ అబ్బాయి చేత. మీ గోపీ వాళ్ళు కూడా చేస్తున్నారట నోము.”
“సర్సరే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?”
“వెళ్ళి ఒక లక్ష పడేసి నా ఇంటర్ మార్కులు మార్పించి ఒక ఫేకు సర్టిఫికేటు పట్రండి. అలానే మార్కెట్లో స్వయంవరం కేటలాగ్ కూడా.”
నేను ఫేకు సర్టిఫికేటుకోసం వెళ్ళా. అక్కడ పెద్ద క్యూ ఉంది. గోపిగాడు కనిపించాడు.వాళ్ళావిడకి కూడా ఫేకు కావాలంట.ఒక బ్రోకర్ని పట్టుకున్నాడు. క్యూ లేకుండా పని జరిగేలా. కాకపోతే ఖర్చు ఎక్కువ రెండు లకారాలు. కాదూ కూడదని క్యూలో వెళితే వచ్చేసీజన్ దాకా ఫేకు రాదంట. చేసేదిలేక డబ్బులు కట్టి రసీదు తీసుకున్నా. పదిరోజుల్లో పోస్టులో వస్తుంది అని చెప్పాడు.రసీదు నెంబరుతో పోస్టు ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడ ఉందంట.స్వయంవరాల క్యాటలాగ్ కోసం వెళ్ళాం గోపిగాడు, నేనూ. అక్కడ నో స్టాకు బోర్డు. బ్లాకులో కొనుక్కుని ఇంటికి చేరాం.మా ఆవిడ పసుపురాసి,బొట్టు పెట్టి క్యాటలాగ్ తెరిచింది. ఇన్నాళ్ళకి మా మ్యాడీని ఇలా చూడగలిగినందుకు నాకు సంతోషం కలిగింది.
“మ్యాడి నిన్నొక్కసారి మధు అని పిలుస్తానే” అని ముద్దుగా అడిగా.
“మధునా? మీ బొందలా ఉంది. ఇప్పటికే ఒక స్టైలు పాడు లేని పేరు పెట్టారని మా అమ్మని,నాన్నని రోజూ తిట్టుకుంటున్నా.ఇంకా ఇదొకటా? మ్యాడి అనే అగోరించండి”
కేటలాగ్‌లో ఉన్న వివరాలు చదివింది.స్త్రీ,పురుషుల నిష్పత్తి గణనీయంగా పెరిగి 1000:800 కు చేరుకోవటం చేత అమ్మాయిల డిమాండు కాస్త తగ్గి ఈ సీజన్లో పరీక్షలు కాస్త సరళతరం చేసారంట. మా ఆవిడ మొహం వెలిగిపోవటం మొదలయ్యింది.మొత్తం పరీక్షలు ఇరవై. అందులో అయిదు అబ్బాయి తండ్రికి, అయిదు అబ్బాయి తల్లికి, పది అబ్బాయికి.ఒకే కులం ఒకే మతం అమ్మాయి కావలంటే పరీక్షల్లో ఎనభై శాతం రావాలంట. బాగాచదువుకున్న అమ్మాయి అయితే ఎనభై అయిదుశాతం, అందంగా ఉన్న అమ్మాయి అయితే తొంబై శాతం, జాతకాలు కలిసేలా కావాలంటే తొంబై అయిదు శాతం, ఉద్యోగం చేసే అమ్మాయి అయితే వందశాతం రావాలి.కేటలాగ్ చివర్లో కోచింగ్ సెంటర్ల వివరాలు కూడా ఉన్నాయి.అందులో మాకు దగ్గరగా ఉన్న కోచింగుసెంటరుకి అప్పుడే ఫోను చేసి సీట్లు రిజర్వు చేసుకున్నాం. మా ఇంటిల్లపాది అందరం ఆఫీసులకి నెలరోజులు సెలవులుపెట్టాం.మా ఆవిడ గోడకి ఒక టైం టేబుల్ అంటించింది. పొద్దునే నాలుగు గంటలకి పూజ, అయిదింటికి కోచింగ్ మెటీరియల్ చదవటం, ఏడింటికి కోచింగ్‌సెంటర్లో ఇచ్చిన హోమ్ వర్క్ చెయ్యటం అటుపైన కొచింగ్‌సెంటర్‌కి వెళ్ళి క్లాసులు.కోచింగ్‌సెంటర్ వాడికి ఈ రంగంలో ఎంతో అనుభవం ఉంది. అందులోనూ స్వయంవరాలు నిర్వహించే కమిటీలో భందువులు కూడా ఉన్నారు. మా కుటుంబ ఏకాగ్రతకి ముచ్చటపడిన కోచింగ్‌సెంటర్ వాడు మాకు అప్పాయింట్‌మెంట్ త్వరగా వచ్చేలా చేసాడు.
పరీక్షరోజు రానే వచ్చేసింది. ఉదయం ఎనిమిదింటికి మా అప్పాయింట్మెంట్. అరగంట ముందు రిపోర్టింగ్ చెయ్యాలి.పొద్దున్నే నాలుగింటికి పూజ చేసుకుని అందరం బయల్దేరి వచ్చి లైన్లో నిలబడ్డాం. మాకంటే ముందుగా ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి. అమ్మయ్య త్వరగా రావటం మంచిదయ్యింది అనుకున్నాం. అక్కడ పరీక్షలు జరిగే ప్రాంగణంలో క్యూలైనంతా నీడ ఉండేలా పైకప్పులేసి ఉంచారు. మధ్య మధ్యలో ఏదో స్వచ్చంధ సంస్థవారు మంచినీళ్ళపొట్లాలు పంచుతున్నారు. మొత్తానికి క్యూలైను కదిలి మా వంతు వచ్చింది.అఫ్లికేషన్ నింపి ఇచ్చాము. అప్లికేషన్ పుచ్చుకునేవాడు అప్లికేషన్ చూసి ఏదొ అనుమానం వచ్చి పక్కనే ఉన్న మరో సభ్యుడిని ఏదో అడిగాడు.వాడు కూడా అనుమానంగా మొహం పెట్టి నా దగ్గరకి వచ్చి “మీ పేరెంటి?” అని అడిగాడు.
“మురళీధర్” అన్నాను.
“సార్ మీ మంచికోసమే చెబుతున్నా. ఇలాంటి ముతక పేర్లని కమిటీ తిరస్కరిస్తుంది. కనీసం ముద్దు పేరు ఏదైనా కొత్తగా ఉండేది ఉంటే అది వ్రాయండి” అని చెప్పాడు. మా ఆవిడ డొక్కలో ఒక్కపోటు పొడిచి, నా అప్లికేషన్ లాక్కుని పేరు దగ్గర “మూర్” అని వ్రాసింది.అప్లికేషన్ పుచ్చుకునేవాడు అప్లికేషన్ వెనుకున్న మా మార్కుల జెరాక్సులు చూసి మా ఆవిడ ఫేకు మార్కులు మెచ్చుకుని, నన్ను ఈసడించుకున్నాడు.”ఈ రోజుల్లో ఎనబైలేంటి సార్? మేడమ్‌లాగా తొంబైలుదాటి ఉండాలి.మీ రోజుల్లో స్వయంవరాలు లేవు కాబట్టి ఇలాంటి మేడమ్ దొరికారు” అని పిచ్చి తిట్లు తిట్టాడు.కోచింగు సెంటరులో మొదటిపాఠం పరీక్ష సమయంలో ఎవరిమీద అరిచినా, కోపగించుకున్నా అప్లికేషన్ డిస్క్వాలిఫై అవుతుంది. అందుకే నవ్వుతూ తలదించుకున్నా. వాడి తిట్లపురాణం అయ్యాక లోపలికి పంపారు. మొదట పరీక్ష నాకే. మా ఆవిడ నాకు బొట్టుపెట్టి పంపింది.మొదటిది వ్రాతపరీక్ష. పేపరు ఇచ్చారు. ముప్పై నిమిషాల్లో ముప్పై ప్రశ్నలు వ్రాయాలి.
మొదటిప్రశ్న: మీ భార్యకి, మీ కోడలికి ఏ సీరియల్ చూడాలో అనే విషయంలో గొడవ జరిగినప్పుడు ఏం చేస్తావ్?
ఎ)మీ భార్యని తిట్టి రిమోట్ కోడలికి ఇస్తావ్
బి)మీ భార్యని కొట్టీ రిమోట్ కోడలికి ఇస్తావ్
సి)మీ భార్యని,అబ్బాయిని తిట్టి కొట్టి రిమోట్ కోడలికి ఇస్తావ్
డి)కొత్త టీ.వి. కొని రిమోట్ కోడలికి ఇస్తావ్
రెండవప్రశ్న: మీ అబ్బాయికి, మీ కోడలికి కారు ఎవరు తీసుకుని వెళ్ళాలి అనే విషయంలో గొడవ జరిగినప్పుడు ఏం చేస్తావ్?
ఎ)మీ అబ్బాయిని తిట్టి కారు తాళాలు కోడలికి ఇస్తావ్
బి)మీ అబ్బాయిని కొట్టీ కారు తాళాలు కోడలికి ఇస్తావ్
సి)మీ అబ్బాయిని,భార్యని తిట్టి కొట్టి కారు తాళాలు కోడలికి ఇస్తావ్
డి)కొత్త కారు కొని కారు తాళాలు కోడలికి ఇస్తావ్
ఈ సీజన్లోనే అత్యంత కఠినమైన పేపర్ ఇదే అంట. నాకు భయంతో చేతులు వణుకుతున్నాయి. నేను కొన్నింటికి ఏ అని కొన్నింటికి డి అని పెట్టాను. ఇంతలో “ఏ ఊరయ్యా నీది మా సెంటర్ పరువు తీసేలా ఉన్నావ్” అని ఎవరో అన్నారు. చూస్తే మా కోచింగ్‌సెంటర్ ట్యూటర్. ఆయన డబ్బులిచ్చి మేనేజ్ చేసి ఇన్విజిలేషన్‌కి వచ్చాడంట. అన్నింటికీ సి అని పెట్టమని చెప్పాడు. పెట్టేసి పేపరు ఇచ్చి వచ్చేసా.తర్వాత 100 మీటర్ల పరుగుపందెం. నేను ఫ్యాంటు తీసి గోచీ బిగించి చిన్నప్పుడు స్కూలొదిలేసాక ఇంటికి పరిగెట్టినట్టు పరిగెట్టా. అయినా పరిగెట్టినవారిలో అయిదవస్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.తర్వాత వెయిట్‌లిఫ్టింగ్ దీని సిగతరగా 300 కేజీలు ఎత్తేసా. ఈలోగా ఎవడో బక్కపీనుగ వచ్చి 400 కేజీలు ఎత్తేసాడు. ఒరిడి అమ్మకడుపుకాలా బక్కోడిలా ఉన్నాడు ఎలా ఎత్తాడు అని వెళ్ళి వివరాలడిగా. మాకిది నాలుగో సీజన్ సార్ అని ఏడుపుమొహంపెట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత 100 కేజీల మూటనెత్తుకుని 100 మీటర్లు పరిగెట్టాలి. తర్వాత లాంగు జంపు, హై జంపు. అన్నీ పుర్తయ్యాయి.
నా పరీక్షల తర్వాత ఫలితాలిచ్చారు. ఫలితాల ప్రకారం తొంబైశాతం కేటాయించారు. మా అబ్బాయి ఆనందంతో ఎగిరి గంతేసి నన్ను గాలిలో ఎత్తి గిరగిరా తిప్పి ముద్దులుపెట్టేసాడు. నేను మాత్రం వ్రాతపరీక్షలో సహాయం చేసిన ట్యూటర్ కి థ్యాంక్స్ చెప్పుకున్నా. మా ఆవిడ పరీక్షకి వెళ్ళింది. మొదటగా కాళ్ళు పట్టడం, తర్వాత జడ వెయ్యటం,నైల్‌పాలిష్ పెట్టడం ఇలా అమ్మాయిలని ముస్తాబు చేసే అయిదుపోటీలు పెట్టారు. బాగా ప్రాక్టీసు చేసి ఉందేమో మా ఆవిడ కొంగు నడుముకి దోపి బెబ్బులి మీద పడ్డట్టు కనిపించిన వారి మీదపడి పరీక్షలు ఉన్నవాళ్ళకి, ఇన్విజిలేటర్లకి ఇలా జుత్తున్న ప్రతీ ఒక్కడికి జడలు వేసింది. కనిపించిన ప్రతివాడి కాల్ళు పట్టుకుని లాగి పడేసి కళ్ళూ నొక్కటం చూపించింది. ఇలా తనకొచ్చిన విద్యలన్నింటిలోనూ పాండిత్యం ప్రదర్శించింది.పాపం మా ఆవిడ ఎంత రమ్ము తాగిన రామబంటులా గెంతినా, ఫలితాలు ఎనబై అయిదుకు పడిపోయాయి. మా ఆవిడ దిగాలుపడిపోయింది. మా అబ్బాయి నేను చూసుకుంటా అని ధైర్యంగా ముందుకి వెళ్ళాడు.
అబ్బాయికి మొదట రంగు టెస్టు, తర్వాత ఎత్తు,బరువు టెస్టు జరిగాయి. ఫలితాలు నిరాశా జనకంగా ఉన్నాయి. తర్వాత “పెళ్ళాం బెల్లం-అమ్మ అల్లం” అనే టాపిక్ మీద గ్రూపు డిస్కషన్ అయ్యింది. మా వాడు తిడుతున్నది వాళ్ళమ్మనే అనే సంగతి మరిచిపోయి కోచింగు సెంటర్లో నేర్పినవన్నీ తిట్టాడు. మా ఆవిడ కన్నీరు. నేను వెళ్ళి ఓదార్చి “భాదపడకు మ్యాడీ ఇదంతా ఉత్తుత్తినే” అన్నాను. “ఇవి కన్నీరు కాదండీ ఆనందభాష్పాలు. కొడుకు పరీక్షలో నెగ్గాడని ఆనంద కన్నీరు”అని చెప్పి కొడుకుకి హారతి ఇచ్చింది.
తర్వాత అన్నింటికంటే పెద్ద పరీక్ష వంట చెయ్యటం. మావాడు తలకి కండువా చుట్టి, పంచె కట్టుకుని అప్పడాలు, వడియాలు పెట్టేసాడు. ఆవకాయ,మాగాయ,ఊరగాయ, నిమ్మకాయ,ఉసిరికాయ,టమాట పచ్చడ్లు పెట్టేసాడు.చల్ల మిరపకాయలు వేయించేసాడు. చారు, మజ్జిగచారు, పచ్చిపులుసు,సాంబారు వండేసాడు.అన్నం,పులిహోర,పలావు,చికెన్ బిర్యానీ,ఫ్రైడ్ రైస్ చేసేసాడు.ఈలోగా కిచెన్‌లో నుండి అరుపులు పెడబొబ్బలు వినిపించాయి. పరిగెట్టి వెళ్ళి చూసా. అక్కడున్న సభ్యులు ఆపండి బాబోయ్ ఈ కుర్రాడ్ని ఆపండి అని ఒకటే అరుపులు. “ఏమయ్యింది బాబు మావాడు బాగా చెయ్యలేదా” అని అడిగా.
“బాగా వండలేదా అని అడిగారా? కిందటి జన్మలో నలుడా భీముడా ఇప్పటికే నాలుగు లారీల రేషన్ వాడేసాడు. లారీడు సిలండర్లు అవ్వగొట్టేసాడు. మీవాడు వండింది తినటం కాదు అమ్ముకోవాలన్న హైదరాబాద్‌లో ఉన్న అన్నీ రెస్టారెంట్లు కలిపి వారం పాటు అమ్మాలి.తీసుకెళ్ళండి బాబోయ్ తీసుకెళ్ళండి” అని ఇంకా కూరలో మసాల వెయ్యటానికి ఉరుకుతున్నా మా అబ్బాయిని పట్టుకుని గోనె సంచిలో కుక్కి బయటపడేసారు.మా వాడు అదే ఆవేశంలో బట్టలుతికి, ఇస్త్రీ చేసే పరీక్షలో వాడికిచ్చిన బట్టలు పదినిమిషాల్లో ఉతికేసి, కనిపించిన జనాలందరికి వంటి మీదే వారి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసాడు. అలా పది పరీక్షలు పూర్తి చేసాడు. పదిరోజుల్లో ఫలితాలు మొత్తం ప్రకటిస్తాం ఇంటికి వెళ్ళమన్నారు.
ఈ పదిరోజులూ మా ఆవిడ మాచేత పూజలు చేయిస్తూనే ఉంది. పరీక్ష రిజల్టు వచ్చేరోజున మా ఇంట్లో గణపతి హోమం, రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్యారాధన, లలితా సహస్రనామ పారాయణం చేసాము. రిజల్టు కవరు పోస్టులో వచ్చింది. మా ఆవిడ కవరుకి హారతిచ్చి, బొట్టుపెట్టి నా చేతిలో పెట్టింది. నేను వణుకుతున్న చేతులతో కవరు ఓపెన్ చేసా. మా అబ్బాయి టెన్షన్‌తో గోళ్ళు,చేతులు కొరికేసుకుంటున్నాడు. మొత్తానికి ఎలానో తెరిచి చూసా.
“మీ కుటుంబం చూపిన చొరవకి, ఉత్సాహానికి ఎంతో సంతోషిస్తున్నాం. కానీ కొన్ని నెగటివ్ మార్కుల కారణంగా మీ అబ్బాయిని రిజెక్టు చేస్తున్నాం” అని ఉంది. మా అబ్బాయి పరిగెట్టి వెళ్ళి వాడి గదిలో తలుపేసుకున్నాడు. ఏ అఘాయిత్యం చేసుకుంటాడో అని భయపడ్డా. కానీ వెళ్ళి మంచం మీద పడి తలగడలో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు. గోపి వచ్చాడు. వాడికి ఇలానే జరిగిందంట. కొడుకుని ఈ పరిస్థితులలో చూసి కడుపు రగిలిపోయి రిజల్ట్సు మీద కోర్టుకు వెళ్ళాలని నిశ్చయించాం. మా ఆవిడ హారతిచ్చి,బొట్టుపెట్టి పంపింది. హైకోర్టుకు వెళ్ళి రిజల్ట్సు మీద స్టే తీసుకుని వచ్చాము. సిట్టింగ్ జడ్జ్ చేత రిజల్ట్సులోని పారదర్శకతను పరిశిలించే వరకు పెళ్ళులన్నీ ఆగిపోయాయి.
మంచివార్త వినాలని మేమింకా ఎదురుచూస్తూనే ఉన్నాం. మీరుకూడా మా అబ్బాయి కవిష్యంత్‌కి రిజల్ట్స్ అనుకూలంగా రావాలని ప్రార్ధించండి.