ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.

Heart_Broken_by_Blackmago

She Broke My heart

ఆమె ఎప్పటిలానే నన్ను వదిలి వెళ్ళిపోయింది.

వీధి దీపాల్లో నేను వ్రాసే పిచ్చిరాతల్లో జీవితం లేదని వెళ్ళిపోయింది.

కళ్ళలో కోటి ఆశలు, ఏన్నో ఊహలు,కలలు

వీటిలో ప్రాక్టికాలిటీ లేదని వెళ్ళిపోయింది.

దూరంగా ఆకాశం, నేల కలిసిపోతుంటే

అనందంతో గంతులు వేస్తున్న నన్ను చూసి

వీడింతే లోకం తెలియని వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.

సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను

సంభ్రమంగా చూస్తున్న నన్ను చూసి

వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో అని తేల్చేసి వెళ్ళిపోయింది.

తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు

తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు

పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.

తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో.

నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో .

ఈ ఊరికి ఆ ఊరు,ఆ ఊరికి ఈ ఊరు ఒకే దూరంలో లేవెందుకో?

ఆమె,నేను,కొన్ని ఊహలు..

nuvvu nenu vennela

నువ్వు నేను వెన్నెల

1.నువ్వు లేకుండా ఒక్కసారయినా వెన్నెలలో గోదావరి ఒడ్డున నడవాలనుకున్నా. గోదారమ్మ పున్నమినంతా కలిపి నీలా మార్చేసింది.
నాకు కోపం వచ్చి “ఏం తనులేకుండా నేను బ్రతకలేనా? ఒక్కరోజు తను లేని ఏకాంతం కావలని అన్నా గా. ఎందుకిలా చేసావ్?” కోపంగానే అడిగా గోదారమ్మని.
గోదారమ్మ నవ్వి “ఏకాంతం అంటే తను నీ పక్కనలేకపోవటం కాదు. నీ మనసు నుండి పక్కన పెట్టి చూడు” అని వెళ్ళిపోయింది.

2.దేవుడు నాకు ఒక పరీక్షపెడతా అన్నాడు.
ఒక పెద్ద మైదానంలో కోటి తారలని,అప్సరసలని,ప్రపంచ సుందరీమణులని,రాకుమారిలని తెచ్చి కూర్చోబెట్టి.
ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు.నువ్వు ఎక్కడున్నావో కనుక్కోమని.
నేను కళ్ళు మూసుకుని “నువ్వు లేకుండా ఒక్క క్షణమయినా బ్రతకలేనని తెలుసు కదరా. ఎక్కడున్నావు?” అని మనసులో అనుకున్నా.
మైదానం మధ్యలో ఒక స్పందన కనిపించింది. నువ్వు లేచి నిలబడ్డావు
దేవుడు నవ్వి “తను నీతో ఉండగా నిన్ను ఓడించటం నా వల్ల కాదు” అని వెళ్ళిపోయాడు.

3.చిన్నప్పుడు అమ్మ చందమామ రావో జాబిల్లి రావో అని అందమయిన అబద్దం చెప్పింది. అది నిజంకాదని తెలిసాక చాలా ఏడుపొచ్చింది.
చాలాసేపు కూర్చుని ఏడ్చాను. దేవుడొచ్చి ఏడవకయ్యా. నీకోసం ఒక చందమామ ఉందిలేవయ్యా అని తన చేతిలో నిన్ను చూపించాడు. అప్పటినుండి వెతికితే ఇప్పటికి కనిపించావు.

4.నా కళ్ళు మూయాలని నా వెనుకగా నువ్వు వస్తూ ఉంటే నీ పాదాల కదలికలకి నీ మువ్వలు చేసే సవ్వడి, ఆ అలికిడికి నేను వెనుకకు తిరిగితే దొరికిపొయానని నువ్వుపెట్టే బుంగమూతి.అలా నిన్ను హత్తుకోబోతే సిగ్గుతో దాచుకునే నీ మోము. నా భుజం పైన తల వాల్చేప్పుడు నీ మౌనం. ఇవి చాలు వేల సంవత్సరాలు దాచుకోవటానికి.

5.ఓటమిలో ఓ ఓడిలో చేరి ఏడ్వాలని వాలిపోతున్న నా తలని నిమిరే చేయి, గెలుపులో నా అనందాన్ని పదింతలు చేసే నీ కౌగిలి, తెల్లవారే ఉత్సాహాన్నిచ్చే నీ తొలిముద్దు, సాయంత్రం అలసి ఇంటికి వస్తే నన్ను సేదతీర్చే నీ చిరుముద్దు ఇంతకంటే ఏం కావాలి నువ్వు నాకోసమే పుట్టావని నమ్మటానికి. బదులుగా నేనేమివ్వను రా? మోకాళ్ళ పై వంగి నా సమస్తాన్ని నీ పాదాక్రాంతం చేసి నీకు దాసోహం అంటున్నా.