వేణుతో నేను

2008 నాటికి తెలుగుబ్లాగుల్లో అడుగుపెట్టిన వారికి ఇక్కడ చాలా మంచి స్నేహాలు దొరికాయి. కాలక్రమంలో బ్లాగులు మూల పడినా ఆ స్నేహాలు అలాగే కొనసాగుతున్నాయి. వర్చువల్ స్నేహాలంటే భయపడే ఈ రోజుల్లో ఫలానా స్నేహితుడు నాకు ఆన్‌లైన్ ద్వారా పరిచయం అని చాలా నిశ్చింతగా చెప్పగలిగే అదృష్టం మనది.

బ్లాగుల్లో చాలా స్నేహాల్లానే వేణుతో ఎప్పుడు పరిచయం మొదలయ్యిందో చెప్పటం కష్టం. నేను వేణు పోస్ట్ చదవటంతోనో, నా పోస్ట్ వేణు చదవటంతోనో మొదలయ్యుండొచ్చు. కానీ బజ్జు నాటికి ఇద్దరం ఒకరికొకరం తెలుసు. బజ్జులో ఉండే ఇన్‌స్టంట్ రెస్పాన్స్ కారణంగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ, షేర్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడేంత చనువు వచ్చేసింది. అయినా కూడా తను నాకు మొదటిసారి మెయిల్ పెట్టినప్పుడు


“మురళిగారు,
చనువు తీసుకుని మెయిల్ చేస్తున్నందుకు అన్యధా భావించరని తలుస్తాను”

అని మొదలుపెట్టాడు. ప్రైవసీ విలువ తెలిసిన మనిషి. పైగా ఆ రోజు మెయిల్ పెట్టినది నా పోస్ట్‌లో వాడిన ఒక ఎక్స్‌ప్రెషన్ సరైనది కాదేమో అని తన అభిప్రాయం చెప్పటానికి. కామెంట్‌లోనే చెప్పుండొచ్చు. కానీ పబ్లిక్‌లో చెప్తే నేను నొచ్చుకుంటానేమో అని మెయిల్ ద్వారా పర్సనల్‌గా చెప్పాడు. అందుకే అతను వివాదరహితుడు, అజాతశత్రువు.

2011 బజ్ ఉదృతంగా నడుస్తున్న రోజులు. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నంత విరివిగా బ్లాగ్ ఫ్రెండ్స్ బజ్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఎంత అల్లరి చేసాం బజ్జుల్లో. పుట్టినరోజుల పోస్టులు, పెళ్ళి పోస్టులు, పేరడీలు, దెయ్యాల కథలు. ఆ దెయ్యాల కథలన్ని వేణు ఓపిగ్గా కలెక్ట్ చేసి ఒక పి.డి.ఎఫ్. చేసాడు. అది ఇప్పటికీ మా ఫ్రెండ్స్‌కి చదవమని పంపిస్తూ ఉంటా. నేను మనదేశంలో లేకపోవటం వల్ల టైమ్‌జోన్ ఇబ్బందులు ఉండేవి. వేణు ఇండియా టైమ్ తెల్లవారి 3 వరకూ పనిచేస్తూ ఆన్‌లైన్‌లో ఉండేవాడు. అందువల్ల ఆ టైమ్‌లో ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం మాకు దొరికింది. మొదటిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నది కూడా అప్పుడే అనుకుంటా.

తనతో చాలా ఎక్కువసేపు, చాలా పర్సనల్‌గా మాట్లాడిన సందర్భం ఒక్కటే. ఆ రోజు తన బ్లాగులో వ్రాసిన అమ్మ పోస్టులు చదవమన్నాడు. అవి చదివాకా చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. ఇద్దరి జీవితాల్లో మదర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసారో చెప్పుకుంటూ సమయం మర్చిపోయాం. అంతా అయ్యాక ఎప్పుడూ అమ్మ మనసు నొప్పించకు, ఏదైనా సందర్భంలో అమ్మ వద్దంటే మెల్లగా నచ్చజెప్పు తప్ప బాధపెట్టకు అని చెప్పాడు. అమ్మంటే తనకి అంత ఇష్టం, ప్రపంచంలో ఏ అమ్మా బాధపడకూడదనుకుంటాడు.

నేను జాబ్ రిజైన్ చేసి సినిమా ఫీల్డ్‌కి వెళ్తున్నా అని చెప్పినప్పుడు మెయిల్ చేసాడు.

వావ్ అవునా.. మంచి నిర్ణయం మురళీ ఆల్ ద వెరీ బెస్ట్.. అలా నచ్చిన పని చేయగలగడానికి చాలా అదృష్టం కావాలి. విష్ యూ లోడ్స్ ఆఫ్ గుడ్ లక్..

చాలా సిన్సియర్‌గా అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. తన కష్టాలు మాత్రం ఎవరికీ చెప్పేవాడు కాదు. గుంభనంగా ఉండే మనస్తత్వం. నేను మూవి తీసిన రోజు వేణూ ఒక మంచి రివ్యూ వ్రాస్తాడని ఎప్పుడూ అనుకునే వాడిని. బాలుగారి పాటలానే, వేణు రివ్యూ నాకింక అందని అదృష్టం.

తన విషయంలో నాకు చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఒక్కసారి కూడా తనని కలవలేకపోవటం. గుంటూరు వచ్చి కలుస్తా అని చాలాసార్లు తనకి చెప్పాను గానీ ఎప్పుడూ వెళ్ళలేకపోయాను. రాజ్‌కుమార్ పెళ్ళిలో మొదటిసారి వేణు అందరినీ కలిసిన సందర్భంలో నేను ఇండియాలో లేను. శంకర్‌గారి చివరి చూపులకి వేణు హైదరాబాద్ వచ్చేప్పటికి ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ రావటంతో నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. అలా కొద్దిలో మిస్ అయ్యాం.

రెండవది గతకొన్నేళ్ళలో ఎక్కువగా తనతో మాట్లాడలేకపోవటం.ఫేస్‌బుక్ పోస్టుల్లో కామెంట్స్ రూపంలోనే ఎక్కువగా పలకరింపులు. ఫోన్ చేసి మాట్లాడుకునే చనువుండి కూడా మాట్లాడుకోలేదు. ఎందుకూ అంటే ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్ఛర్యంగానూ, రిగ్రెట్‌ఫుల్‌గానూ ఉంది.

ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయినా అకాలమరణమనే అంటాం. కానీ నిజంగానే అకాలంగా, అకారణంగా వెళ్ళిపోయాడు. తను హాస్పిటల్‌లో చేరిన మరునాడు వాట్సాప్లో “వేణూ, ఎలా ఉంది?” అని మెసేజ్ పెట్టాను. అదే క్షణంలో నేను తనకి వాట్సాప్‌లో పెట్టిన మొదటి మెసేజ్ అదే అని రియలైజ్ అయ్యాను. తను ఆ మెసేజ్ చూడలేదు, రిప్లై చెయ్యలేదు. ఇంక ఎప్పటికీ రిప్లై రాదు కూడా.

ఎంతకీ రిప్లై రాకపోవటంతో కాస్త భయం వేసింది. పడుకునే ముందు నా మనసు ఏం చెబుతుంది అని నా కాన్షియస్‌ని క్వశ్ఛన్ చేసుకున్నా. ఎందుకో ఏం కాదనే అనిపించింది. దానితో ధైర్యంగా పడుకున్నా. కానీ నిజానికి అప్పటికే వేణు మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు. నిజానికి ఒకరి కాన్షియస్‌నెస్‌కి రెస్పాండ్ అయ్యే అవకాశం తనకి ఉన్నా నెగెటివ్ వైబ్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే తను వేణు కాబట్టి.

ఒక మనిషి జీవితంలో పన్నెండేళ్ళ పరిచయం అంటే తక్కువేం కాదు. అందులోనూ జీవితంలో అతి ముఖ్యమైన దశలో మొదలైన స్నేహం కాబట్టి ఇది జీవితకాల స్నేహం. అలాంటి స్నేహాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్ళిపోయావ్ వేణు. ఈ వాక్యూమ్ ఎప్పటికీ ఫిల్ కాదు. ఎన్నో ఏళ్ళ తర్వాతైనా సరే ఎవరికైనా బ్లాగు స్నేహాల గురించి చెప్పాల్సి వస్తే అప్పుడు కూడా నీ గురించి ఇలానే చెప్పుకుంటాం.

ఇన్నేళ్ళ మన పరిచయంలో నువ్వెప్పుడూ నన్ను నొప్పించలేదు. నేను ఎప్పుడైనా నొప్పించి ఉంటే మన్నించు వేణు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా, శాంతిగా ఉండాలి, నీ ముఖంపై ఎప్పుడూ నీ మార్కు చిరునవ్వు అలానే ఉండాలి. యు డిజర్వ్ ఆల్ ది పీస్

పోయిరా నేస్తమా, పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావు..

అల్విదా వేణూ.

నరహంతక

నైనం ఛిందంతి శస్త్రాణి

గీత 2-23

గ్రామ తాంత్రిక్ నెత్తి మీద మండుతున్న మట్టి కుంపటి పట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ అన్ని వీధులూ తిరుగుతూ ఉన్నాడు. నోటితో విచిత్రమైన శబ్ధం చేస్తూ, మంత్రాలు చదువుతున్నాడు. అతని అరుపు వీధి చివరలో వినగానే ఆడవాళ్ళు, తమ పిల్లల్ని తీసుకుని ఇంటిలోకి పరిగెడుతున్నారు.

నెలరోజుల క్రితం మశూచి సోకిన యశ్‌పాల్ వాల్మీకిని గ్రామం నుండి వెళ్ళగొట్టారు.

“నాకు బ్రతకాలని ఉంది. నన్ను చావు వైపు నెట్టొద్దు, వైద్యం చేయించండి”

అని వాడు ఏడుస్తున్నా గ్రామం మొత్తం మశూచికి బలవుతుందనే భయంతో యశ్‌పాల్‌ని అడవిలోకి వెళ్ళగొట్టారు.

ఆ యశ్‌పాల్ ఆత్మ అడవిలో తిరుగుతుందని, దానిని తరిమేందుకు రాత్రి గ్రామంలో పహరా కాస్తానని తాంత్రిక్ ముందే చెప్పాడు. ఆ సమయంలో ఎవరూ ఇంటి గడప దాటి బయటకు రాకూడదని, తలుపులు మూసుకోమని హెచ్చరించాడు. ఎవరైనా బయటకి వస్తే యశ్‌పాల్ ఆత్మ వాళ్ళని అడవిలోకి లాక్కుని పోతుందని చెప్పాడు.

fire

తాంత్రిక్ వీధిలో నడుస్తుంటే అందరూ తలుపులు మూసుకుని భయపడుతూ ఉన్నారు. ఒక ఇంటిలో కిటికీని కొద్దిగా తెరిచి ఒక పిల్లవాడు బయటకి చూస్తున్నాడు. వేగంగా నడుస్తున్న తాంత్రిక్ వచ్చి ఆ తెరిచిన కిటికీ దగ్గర ఆగి ఆ పిల్లాడి వైపు కోపంగా చూసాడు. వాడు బయపడి తలుపు వేసాడు. తాంత్రిక్ తిరిగి శబ్ధం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ పిల్లాడు ఇంటిలోకి వెళ్ళి “అమ్మా లక్ష్మి ఇంటికి రాలేదు” అని బాధపడుతూ చెప్పాడు.

“నాన్న లక్ష్మిని తీసుకురావటానికే బయటకి వెళ్ళాడు.” ఆమె గొంతు వణికింది.

లక్ష్మిని వెతుక్కుంటూ లాంతరుతో అడవిలోకి వెళ్ళిన పిల్లాడి తండ్రి ప్రమోద్‌కి గంట చప్పుడు వినిపించింది. లేగదూడ లక్ష్మి అడవిలో తప్పిపోయి, అరుస్తూ తిరుగుతోంది. ప్రమోద్ లక్ష్మి గంటల చప్పుడు విని అటు వైపు నడుస్తున్నాడు.

గ్రామంలో నడుస్తున్న తాంత్రిక్ ముందు నుండి సుడిగాలి సర్ర్ర్ర్ మని దూసుకుంటూ అడవి వైపు వెళ్ళింది. తాంత్రిక్ అడుగు ఆగిపోయింది. ముడిపడిన భృకుటితో అడవి దిక్కు తీక్షణంగా చూసాడు. వీధిలో ఉన్న కుక్కలన్నీ ఆకాశంలోకి చూస్తూ ఏడుపు మొదలెట్టాయి. తాంత్రిక్ తలపైన దేదీప్యమానంగా వెలుగుతున్న కుంపటి ఫట్ మని ఒకేసారి ఆరిపోయింది.

ప్రమోద్ చేతిలోని లాంతర్ కిందపడింది. ప్రమోద్ అరుపు వినిపిస్తూ ఉంది, ప్రమోద్‌ని గుబురైన ముళ్ళపొదల గుండా ఏదో లాక్కునిపోయింది.

శైలేంద్ర ప్రతాప్ సింగ్ తను చదువుతున్న బుక్ “ది డెవిల్ ఆఫ్ చంపావత్” మూసి తన ముఖానికి పట్టిన చమటలు తుడుచుకున్నాడు. చంపావత్ వెళ్ళే దారిలో ఒక ట్రావెలర్ బంగ్లాలో అతను విశ్రాంతి కోసం ఆగాడు. వరండాలో నాగ్‌నాథ్ యాత్రకి వెళ్ళే సన్యాసి ఒకడు ఎర్రని కళ్ళతో చరస్ పీలుస్తూ మత్తులో తూగుతూ ఉన్నాడు. శైలేంద్ర చేతిలోని ఆ పుస్తకం చూసి “సైతాన్ హై వో, ఉస్కా నామ్ భీ మత్ లేనా” అని గంభీరంగా చెప్పి, తూగుతూ బంగ్లా దాటి చీకటిలోకి వెళ్ళిపోయాడు. ట్రావెలర్ బంగ్లాలో తాతతో పాటు ఉన్న పదేళ్ళ కిషోర్ ఆ సన్యాసి మాటలు విని ఆ బుక్ వైపు ఆసక్తిగా చూసాడు. అందరూ నిద్రపోయాక మెల్లగా లేచి ఆ బుక్ తీసి చదవటం మొదలు పెట్టాడు.

చంపావత్ ఊరు చాలా హడావుడిగా ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన చంపావత్ సంత రెండు రోజుల్లో మొదలవబోతుంది. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ ప్రధాన్ కోసం రచ్చబండ దగ్గర అందరూ ఎదురు చూస్తున్నారు.

ariel

ప్రధాన్ అల్లుడు టౌన్‌కి వెళ్ళి స్వీట్ దుకాణం పెట్టుకుందామని అనుకుంటున్నాడు. కూతురిని అంత దూరం పంపించటం ఇష్టంలేని ప్రధాన్ అతడిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ మశూచితో మూడు నెలల క్రితం ఆ గ్రామం లో చాలామందితో పాటు ఆ అల్లుడు కూడా ఇబ్బందిపడ్డాడు. చావు వరకూ వెళ్ళినవాడు టౌన్‌కి వెళ్ళి వైద్యం చేయించుకుని బ్రతికాడు. ఇప్పుడు గర్భవతి అయిన తన భార్యకి టౌన్‌లో అయితే మంచి వైద్యం అందుతుందని టౌన్ లోనే కాపరం పెట్టాలని నిర్ణయించుకున్నాడు.  ప్రధాన్ అడ్డుపడటంతో నెలరోజులలో వచ్చి భార్యని తీసుకుని వెళ్తా అని చెప్పి అల్లుడు టౌన్‌కి వెళ్ళిపోయాడు.

రచ్చబండ దగ్గర సంత సుంకం వసూలు చేసే ఠాకూర్ వచ్చి సంత ఏర్పాట్లు గురించి మాట్లాడుతూ యాలకులు తెచ్చే మూగవాడు ఇంకా రాలేదా అని అడుగుతుంటే, మూగవాడి బండి వచ్చి సంతలో వాడు ఎప్పుడూ దుకాణం పెట్టే చోట ఆగింది. బండిలో ఎవరూ లేరు. మూగవాడి కోసం చూసారు కనిపించలేదు. ఠాకూర్ కంగారు పడ్డాడు. ఫారెస్ట్ గార్డ్ భద్ర తో పాటు కొందరు యువకులు అతడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు.

రచ్చబండ దగ్గర కూర్చున్న ప్రధాన్ ట్రావెలర్ బంగ్లా దగ్గర దీపాలు వెలిగించే కుముద ని పిలిపించాడు. ఆమెకు సంతలో కూడా లాంతర్లు పెట్టమని అవసరమైన డబ్బులు ఇస్తా అని చెప్పాడు. ఠాకూర్ ఊరిలో కొందరు యువకులని పిలిచి జట్లుగా ఊరిలో తిరగండి, వచ్చిన వ్యాపారులకు ఏ భయం లేకుండా చూసుకోమని చెప్పాడు.

అడవిలోకి వెళ్ళిన భద్ర మౌనంగా తిరిగొచ్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతని ముఖంలో ఆందోళనని ఠాకూర్ గమనించాడు. కుండలో నీళ్ళు మట్టి ముంతతో తీసి అతని చేతికి అందించాడు. భద్ర ముంత ఎత్తి ఒకేసారి నీళ్ళు గొంతులో ఒంపుకోవటంతో, అతని మొహమంతా నీళ్ళతో ఒక్క క్షణం తడించింది. మెడలో ఎప్పుడూ ఉండే తుండుతో మొహాన్ని తుడుచుకుంటూ రచ్చబండ మీద కూలబడ్డాడు. ఠాకూర్ అతడినే చూస్తూ ఉన్నాడు. భద్ర నేల చూపులు చూస్తూ పదిరోజులుగా చుట్టు పక్కల గ్రామాల నుండి అడవిలోకి వచ్చిన యువకులు కనిపించకుండా పోతున్నారని చెప్పుకుంటున్నారు అని తటపటాయిస్తూ చెప్పాడు.

ఠాకూర్ వొళ్ళు ఒక్కసారిగా ఝళ్ళుమంది. అతని మనస్సులో ప్రమాదఘంటిక మ్రోగింది. ఠాకూర్ ఒక బోర్డ్ తెప్పించి పెట్టాడు. రోజూ ఏ గ్రామంలో ఎవరు కనిపించకుండా పోయినా ఆ బోర్డ్ మీద రాయించమని చెప్పాడు. మనుషుల్ని పెట్టి వెతికించే బాధ్యత భద్రకి అప్పగించాడు.

రోజులు గడుస్తున్నాయి బోర్డులో అంకెలు పెరుగుతున్నాయి. చంపావత్ మ్యాప్‌లో చుట్టూ ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న ఒక్క గ్రామం కూడా మిగల్లేదు.

ఒక రోజు ఉదయాన్నే సంతకి వచ్చిన ఠాకూర్‌కి బోర్డ్ మీద ఒక రెండు రోజుల పాటు సున్నాలు కనిపించాయి. అతనికి కాస్త ప్రశాంతంగా అనిపించింది.

“నిన్నటి లెక్క రాయలేదేం, ఆ లెక్కలు వ్రాసే కుర్రాడిని పిలవండి” అని రచ్చబండ దగ్గర ఉన్న వాళ్లతో చెప్పాడు. అందరూ మౌనంగా దిగులు మొహాలతో ఠాకూర్ వైపు చూసారు. ఠాకూర్ కుర్చీలో కూలబడిపోయాడు.

“ఈ ఊరిలో లెక్కలంటే భయం లేనివాడు వాడొక్కడే. కానీ రోజూ ఈ లెక్కలు వ్రాసే ముందు మాత్రం వాడి చెయ్యి వణకటం నేను చూసాను. ఇప్పుడు వాడే ఆ లెక్కల్లో చేరిపోయాడు” అని ఠాకూర్‌కి చెప్తూ ఒక గ్రామస్థుడు కుంగిపోయాడు.

తనకే లేని ధైర్యాన్ని గుంపుకి మాత్రం చెప్పి, అడవిలోకి ఒంటరిగా ఎవరూ వెళ్ళొద్దని సంతలో అందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి ఠాకూర్ గ్రామం వైపు నడిచాడు.

Spices for sale at the Anjuna Flea Market, Goa, India

దేశం నలుమూలల నుండీ వచ్చిన వ్యాపారస్థులకి చంపావత్ గ్రామస్థులు తమ శక్తిమేర గౌరవంతో ఆతిధ్యం అందిస్తారు. భోజన సదుపాయాలు చేస్తారు. రాత్రి పడుకునేందుకు తమ అరుగుల మీదో, వాకిట్లోనో పక్క ఏర్పాటు చేస్తారు. రాత్రి చీకట్లో ఇబ్బంది పడకుండా, వ్యాపారులు గుంపులుగా పడుకునే చోట కుముద లాంతర్లు వెలిగిస్తుంది. ఆ వెలుగుకి విషపురుగులేవి ఆ వైపుగా రావు.

సంతకు వచ్చిన వ్యాపారస్థుడు ఒకడు “బ్రహ్మ సువర్చల” అనే మూలిక కోసం పగలంతా సంతలో అందరినీ అడుగుతూ తిరిగాడు. అడవిలోపల ఎక్కడో ప్రమాదకరమైన కొండచరియాల్లో దొరికే బ్రహ్మసువర్చల ఆనుపానులు చంపావత్ గ్రామంలో ఒక్క కుటుంబానికి మాత్రమే తెలుసు. తరతరాలుగా ఆ కుటుంబమే ఆ మూలికను సంతలో అమ్ముతుంది. కానీ అడవిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన ఆ కుటుంబంలో ఎవరూ బ్రహ్మసువర్చలను తెచ్చేందుకు సాహసించలేదు. ఆ కుటుంబం పెద్ద వ్యాపారిని చూసి ఈసారికి బ్రహ్మసువర్చలని మర్చిపొండి అని నిరాశగా చేప్పేసాడు.

herbs

పూర్తిగా చీకటి పడకముందే ఠాకూర్ వచ్చి అన్ని దుకాణాలను మూయించేసాడు. చీకటి పడ్డాక వ్యాపారులెవరూ గ్రామం దాటి బయట అడుగుపెట్టొద్దని చాటింపు వేయించాడు. వ్యాపారులంతా త్వరగానే భోజనాలు ముగించి పక్కల మీద వాలారు.

Man walking up slope with a flare in snowy winter landscape

బ్రహ్మ సువర్చల లేకుంటే ఇంత దూరం సంతకు వచ్చి ఏం లాభమనే పంతంతో ఆ వ్యాపారస్థుడు ఎవరికీ చెప్పకుండా చీకటి పడుతుండగా అడవిలో అడుగు పెట్టాడు.  అడవిలో పక్షుల కూతలు సద్దుమణిగి, కీచురాళ్ళు జోరందుకున్నాయి. దూరంగా నక్కల ఊళలు వినిపించాయి. చేతిలో ఉన్న బాణాకర్రను కాస్త బిగించి పట్టుకుని అతను గుబురు పొదలను దాటి ముందుకి వెళ్ళాడు. అతని చుట్టూ ఉన్న పొదలు ఒక్కసారిగా కదిలాయి.

పెద్దగా శబ్ధం రావటంతో చదువుతున్న బుక్ మూసి కంగారుగా ఎక్కడ తీసాడో అక్కడ పెట్టడానికి పరిగెట్టి వెళ్ళిన కిషోర్‌కి మంచం మీద శైలేంద్ర కనిపించలేదు. అక్కడ ఆ గదంతా చిందర వందరగా పడి ఉంది. ఆ పిల్లాడు భయపడుతూ గాలికి ఊగుతున్న తలుపు మెల్లగా తెరిచాడు. భయంతో కళ్ళు పెద్దవి చేసి నిలబడిపోయాడు.

To be continued..

Image Courtesy : Google image search

బ్లాగర్ల ఆత్మీయ సమావేశం

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో తెలుగు వ్రాయటం లేక చదవటం ఇప్పుడు అత్యంత సాదారణమైన విషయం. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వాడగలిగేంత సరళమైన ప్రక్రియ. కానీ 10 ఏళ్ళ క్రితం టెక్నాలజీలో పని చేసే వాళ్ళకు కూడా తెలుగుని ఇంత విరివిగా కంప్యూటర్‌లో వాడుకోవచ్చనే అవగాహన లేదు. అసలు ఇంత విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు.

కానీ ఈ మార్పులు ఒక్క రాత్రిలో వచ్చేయలేదు. తెలుగు టైపింగ్ అంటే డిటిపి చేసే వాళ్ళకి ఇవ్వాలి, సాఫ్ట్‌వేర్లు కొనుక్కోవాలి అనే రోజుల నుండి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో సునాయాసంగా తెలుగు టైప్ చేసే రోజులకు వచ్చేసాం. దీని వెనుక ఎందరో ఔత్సాహికుల కృషి ఉంది.

IMG_0113

గూగుల్‌లో వెతికితే తెలుగు సమాచారం ఏమీ దొరకని రోజుల్లో అందరినీ తెలుగు వాడేలా ప్రోత్సాహించి, అవగాహన సదస్సులు నిర్వహించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిన e-తెలుగు గూర్చి ఈ రోజున తెలుగు టైప్ చేస్తున్న వారిలో ఎందరికి తెలుసు?

IMG_1571

కంప్యూటర్‌లో తెలుగు ఉంది చూడండి అని ప్రచారం చేసి, చేయిపట్టి అక్షరాలు దిద్దించినట్టుగా యూనికోడ్‌లో తెలుగు టైపింగ్ నేర్పించి, అవసరమైన సాఫ్ట్‌వేర్లను సిడిల్లో ఎక్కించి ఉచితంగా పంచిపెట్టి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఎంతో కృషి చేసిన సంస్థ e-తెలుగు. సంస్థ సభ్యులు తమ సొంత డబ్బులు పెట్టుకుని ఏ లాభాపేక్షలేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. వీళ్ళందరీనీ నడిపించిన చైతన్యం ఒకటే భాష మీదున్న అభిమానం.

ప్రతి ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్‌ని నిర్వహించి తెలుగులో బ్లాగుల వ్యాప్తికి ప్రోత్సహించటమే కాకుండా మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే ఒక బ్లాగు క్రియేట్ చేసి, దాని నిర్వహణ మీద అవగహాన కల్పించేవారు. కేవలం బ్లాగులే కాదు, తెలుగు వికీపీడియా వ్యాసాల అభివృద్దిలో కూడా పాలుపంచుకోమని ప్రచారం చేసేవారు. ప్రొపరైటరీ ఫాంట్స్ వాడే తెలుగు వార్తాపత్రికలకు, వెబ్‌సైట్స్‌కి యూనీకోడ్ వల్ల లాభాలు వివరించి, యూనికోడ్‌కి మారేలా ప్రోత్సహించారు. ఈ స్టాల్ నిర్వహణ కోసం సభ్యులు ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ వచ్చేవారు. ఈ కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు పని చేసానని చెప్పడానికి గర్వపడతున్నా.

ఈ విషయాలన్నీ తెలుగు బ్లాగుల్లో పాతపోస్టుల్లో ఎక్కడో మరుగునపడిపోయాయి. ఒక సౌకర్యవంతమైన నేటి వెనుక ఎందరిదో ఎన్నో రోజుల కృషి ఉంటుంది. అప్పుడప్పు ఇలా గుర్తు చేసుకోకపోతే, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే లావైపోతాం.

ఎన్నోరోజుల తర్వాత ఆనాటి బ్లాగర్లు, e-తెలుగు సభ్యులు ఈ ఆదివారం (05-01-2020) కృష్ణకాంత్ పార్కులో సమావేశమయ్యారు. మళ్ళీ e-తెలుగు ని చైతన్యవంతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరో ఉద్యమానికి ఇది నాంది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

blogmeet

హేజెల్ కళ్ళు

hazel eyes

ఆ రోజేం ఆకాశం ఉరమ లేదు. జడివాన, తొలకరి లాంటివేం లేవు. వొంటిని తడిమేసే చిరుచలికి అదేం శీతాకాలం కాదు. ఏకాంతం ఆసరాగా చేసుకుని నా ఒంటరి తనాన్ని బాధించే పౌర్ణమి రాత్రులూ కావు. పక్కింటిలోనో, పొరుగింటిలోనో పరవశంలో ఉన్న జంటలని చూసి పనిగట్టుకుని పులకరింపులు వెతుక్కునే ఓపికా నాకు లేదు. కానీ తను గుర్తొచ్చింది. ఉదయాన్నే లేచి టీ తాగినంత అలవాటుగా. సిగరెట్, మందు కంటే బలమైన వ్యసనాలున్నాయి, మనసుకి.

తన ఆలోచన కదిలిందంటే ముందుగా గుర్తొచ్చేది తన కళ్ళే. హేజెల్  కళ్ళు. చిన్నప్పుడు బొమ్మల షాపుల్లో చూసిన బొమ్మకళ్ళవి. మొదటిసారి చూసినప్పుడు అవి నిజమైన కళ్ళని నమ్మలేక పోయాను. పదే పదే చూస్తుంటే ఆ కళ్ళల్లో తొంగిచూసిన చిరాకు, చెంప మీద చరిచినట్టుగా అనిపించింది. చూపు పక్కకి తిప్పుకున్నా. అలా దొంగలా దొరికిపోవటమేం మొదటిసారి కాకపోయినా, ఈ హేజెల్  కళ్ళకి అలా దొరికిపోవటం ఇబ్బందిగా అనిపించింది. తిరిగి చూద్దాం అంటే ఆ కళ్ళ దృష్టిలో మరింత దిగజారిపోతాననే భయం పట్టి ఆపింది.

ఆ రోజంతా ఆ కళ్ళ గురించే ఆలోచన. క్లాసులో కూర్చుని నోట్‌బుక్ వెనుక పేజ్‌లో ఎవేవో కళ్ళు పెన్‌తో గీస్తున్నా. క్లాస్ అయ్యేపాటికి ఆ పేజ్ అంతా కళ్ళే, కానీ ఏ కళ్ళలోనూ ఆ హేజెల్  కళ్ళు కనిపించలేదు. పుస్తకం ఊపుకుంటూ వచ్చి బస్‌స్టాప్‌లో నిలబడ్డాను. మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తే బావుండనిపించింది. కానీ ఎలా? ఇంత పెద్ద హైదరాబాద్ లో, నిత్యం వేల మంది ఇదే అమీర్‌పేట్ బస్‌స్టాప్‌లో దిగుతారు. బస్ ఎక్కడ ఎక్కిందో కూడా తెలియదు. లెన్స్ పెట్టుకుంటే ఏ రంగు కావాలంటే ఆ రంగు కళ్ళు దొరుకుతాయి అని పక్కనే అప్పట్లో ఉన్న ఫ్రెండ్ ఎవడో అన్నాడు.

ప్లాస్టిక్ తో అందమైన పూలు చెయ్యగలవోయ్ పిల్లోడ, కానీ మకరందం?” అని ప్రశ్నించే తూనీగ వాడి చెవిలో ఝుమ్మని ఎప్పుడంటుందో.

మరుసటి రోజు కూకట్‌పల్లి బస్‌స్టాప్‌లో నాలుగు బస్‌లు వదిలేసా, హేజెల్  కళ్ళు లేవని. బస్‌లే కాదు, వారం రోజులు కూడా అలా సజెషన్‌లో నన్ను నిలబెట్టి పాస్ అవుతూ వెళ్ళిపోయాయి. ఇలాంటివేం కొత్త కాదు కదా అని నన్ను నేను సరిపెట్టుకున్నా.

నాకు పదేళ్ళు ఉన్నప్పుడు తిరుపతిలో ఒకసారి గుండు చేయించుకుంటూ, పక్కన ఏడుస్తున్న సాటి గుండును చూసాను. వాళ్ళ అమ్మ “ఏం కాదమ్మా, మళ్ళీ నీ జుత్తు నీకు వచ్చేస్తుందే” అని నవ్వుతూ బుజ్జగిస్తోంది. ఆ గుండు పిల్ల ఎంత ముద్దుగా ఉందో. దర్శనానికి వెళ్ళినప్పుడు పట్టు లంగా, జాకెట్టు వేసుకుని క్యూలో కనిపించింది. దేవుడిని చూడటానికి వస్తే, ఆయనే నాకు ఈ పిల్లని చూపించాడని బలంగా అనిపించింది. మా ఊరొచ్చేసాక, ఆ పిల్ల మా స్కూల్లో వచ్చి జాయిన్ అయినట్టు రోజూ కలలు కనే వాడిని. నా స్కూల్ అయిపోయింది కానీ ఆమె వచ్చి జాయిన్ కాలేదు. కాబట్టి ఇవన్నీ మామూలే. కొన్ని రోజుల్లో మరిచిపోయి ముందుకి వెళ్ళిపోతాం.

కానీ ఆ గుండుపిల్ల వదిలేసినంత తేలికగా ఈ హేజెల్  కళ్ళు నన్ను వదలలేదు. మళ్ళీ కనిపించింది బస్‌లో. నేనే కాదు తనూ గుర్తుపట్టింది. పక్కనే ఉన్న అద్దంలో నా మొహం నేను చూసుకున్నా. తన కళ్ళలా నాలో ఏముంది గుర్తుంచుకునేంతలా అని. ఈసారి బస్ దిగి ఆ పిచ్చి జావా క్లాస్‌కి పోలేదు. ఆమె వెంటే నడుచుకుంటూ వెళ్ళాను. మరో ఇద్దరమ్మాయిలతో కలిసి ఒక టెస్టింగ్ ఇనిస్టిట్యూట్‌లోకి వెళ్ళింది. ఆమె బయటకి వచ్చేంత వరకూ అక్కడే తిరుగుతూ గడిపాను. ఆమె బయటకి వస్తూనే నన్నే చూసింది. నవ్వింది. కళ్ళతోనే కాదు, ఆమె పెదాల పైన కూడా కనిపించేలా. బస్‌స్టాప్ వరకూ తన వెనుకే వెళ్ళాను. పక్కనున్న అమ్మాయిలతో మాట్లాడుతూ మధ్యలో చూస్తునే ఉంది. తను ఎక్కిన బస్సే ఎక్కాను. ఈసారి ఆమె చూసినప్పుడు, నా నోట్‌బుక్‌లో దాక్కున్న ఆ వేల కళ్ళకి ఆమెని చూపించాను, ఆమెకి వాటిని కూడా. ఆమెకి చప్పున అర్ధం కాక, అటూ ఇటూ చూస్తున్నట్టుగా రెండు మూడు సార్లు చూసింది. అర్ధమయ్యాక ఎవరికీ అర్ధంకాకుండా దాచుకుంటూ తనలో తనే నవ్వుకుంది.

నేను ఎప్పటిలా కూకట్‌పల్లిలో దిగిపోయాను. తను కిటికీలో నుండి చూసింది. నేను ఎక్కడ దిగానో తెలుసుకుంటూ, ఆ విషయాన్ని నాకు తెలియజేస్తూ.

తన ఇనిస్టిట్యూట్, క్లాస్ టైమింగ్స్ తెలిసాక ఏ బస్ లో ఉంటుందో వెతుక్కోవాల్సిన పని పడలేదు. ఆ రోజు నుండి క్లాస్ అయ్యాక తను నేరుగా వెళ్ళిపోకుండా, పక్కనే ఉన్న బేకరీలో కాసేపు ఫ్రెండ్స్‌తో గడిపేది. నాకు కాస్త సమయం ఇవ్వటానికే తప్ప బేకరీ మీద అభిమానం కాదు. ఒకరోజు ఆర్డర్ కోసం కౌంటర్ దగ్గరకి వెళ్తూ బ్యాగ్స్, బుక్స్ ఒక టేబుల్ మీద వదిలేసారు. ఆమె బుక్ తీసి తన పేరు చూద్దామని వెళ్ళాను. వెళ్తున్నంత సేపూ “సునేత్రి.. సునయన” అని ఏవో గెస్ చేస్తూ వెళ్ళాను. వాళ్ళ నాన్నకి అంత టేస్ట్ లేదనుకుంటా అక్కడ “వైశాలి” అని కనిపించింది. నేను ఆ బుక్ చూడటం ఆ హేజెల్  కళ్ళ వైశాలి గమనించింది. “బావుందా” అన్నట్టు సైగ చేసింది. “ఓకె ఓకె” అన్నట్టు రెస్పాన్స్ ఇచ్చాను. సీరియస్ లుక్కిచ్చింది. నాకు నవ్వొచ్చింది. ఆ రోజు బస్ దిగేంత వరకూ తన కళ్ళలో కోపం, నాకేమో తెరలు తెరలుగా నవ్వు.

బుక్ అనే ఒక కమ్యూనికేషన్ డివైజ్ దొరికాక, ఆ బేకరీ సెషన్స్ మరింత ఎక్సైటింగ్‌గా అనిపించేవి. “నీ గొప్ప పేరేంటో ఇంతకీ?” అని వ్రాసి ఆర్డర్ చెయ్యటానికి కౌంటర్ దగ్గరకి వెళ్ళింది. “నీ గొప్ప ఫోన్ నంబర్ చెబితే, ఒక గొప్ప మెసేజ్‌లో పంపిస్తా” అని వ్రాసి వచ్చేసా. తను ఏదో వ్రాసి వాటర్ తెచ్చుకునే వంకతో పక్కకి వెళ్ళింది. నేను ఆశగా మొబైల్ ఓపెన్ చేసి నంబర్ డయల్ చేసేందుకు సిద్దపడుతూ వెళ్ళాను. “స్పీడ్ థ్రిల్స్. బట్ కిల్స్ – కొండాపూర్ ఆర్.టి.ఏ” అని వ్రాసి ఉంది. ఈసారి బస్‌లో నా మోహంలో కోపం, తనకేమో ఆగని నవ్వు. ఐరనీ ఏంటంటే నా పేరు చెప్పలేదు ఇప్పటి వరకూ, ఆమె తన ఫోన్ నంబర్ కూడా.

“ఐ బిలీవ్ ఇన్ క్లాక్. నాట్ ది టైమ్” అన్న మాటలు పలకరించాయి ఆ రోజు ఆమె బుక్‌లో. నన్ను రోజూ కవ్వించే కొంటెపిల్ల కాదు ఆమె ఆ రోజు. ఇంత స్పష్టమైన షార్ప్  మాటలు తను వ్రాసిందా అంటే, ఆమెకి తెలిసిన భాషలో ఇంతే సూటిగా. “నీ ఫోన్ నంబర్ వద్దు. నా ఆఫర్ లెటర్‌లో నీకు నా పేరు చూపిస్తా” అని వ్రాసాను. ఆ రోజు బస్‌లో ఇద్దరి మొహాల్లో భారంగా దిగులు. ఆ కాస్త ప్రయాణానికి ఎన్ని యుగాలు పట్టిందో. ఇప్పుడు ఆ క్షణాలని థర్డ్ పర్సన్ వ్యూలో మాత్రమే చూడగలనని తెలుసు. అయినా ఎక్కడో చిన్న బాధ తెలుస్తూనే ఉంది. కాసేపు ఆరనిస్తే బట్టలు ఆరిపోతాయి, కానీ తడిగా ఉన్నప్పటి వాటి భారం, మోసిన ఆ తాడుకి ఎంతో కొంత గుర్తుంటుంది.

కోర్స్ మధ్యలో సంక్రాంతికి బ్రేక్ వచ్చింది. ఊరు వెళ్ళే ముందే తనని కలవాలనుకున్నా. కానీ ఆ రోజు ఎందుకో తను క్లాస్‌కి రాలేదు. ఊరు వెళ్ళాక అనుకోకుండా బంధువుల్లో ఒకరు చనిపోవటంతో రెండు వారాల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాను. వైశాలి కనిపించలేదు. బస్‌స్టాపులో, బేకరీలో, ఆ ఇనిస్టిట్యూట్ ముందు ఎన్ని రోజులు పడిగాపులు పడినా ఆ హేజెల్  కళ్ళ వైశాలి కనిపించలేదు.

నాకు ఆఫర్ లెటరే కాదు, దాని తర్వాత ఒక నాలుగైదు హైక్ లెటర్స్ కూడా వచ్చాయి. కొన్ని జతల కళ్ళు నా జీవితంలోకి వచ్చి వెళ్ళాయి కూడా. కానీ ఇప్పటికీ మీటింగ్ రూమ్స్‌లో, కాన్ఫరెన్స్ కాల్స్‌లో నా చేతిలోని పెన్ను ఫేషియల్ టిష్యూ మీద, స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ మీద ఆ హేజెల్ కళ్ళనే వెతుకుతోంది.

నాది పిచ్చి అనని వాళ్ళెవరూ  నా సర్కిల్స్‌లో, వాట్సాప్ గ్రూపుల్లోనూ, నాజీవితంలోనూ లేరు. అయినా ఆ అందమైన హేజెల్ కళ్ళు వీడు నావాడు అని ప్రకటించి, నా గుండెలపై వాలితే వచ్చే గర్వం, ఆనందం వీళ్ళకి ఎలా అర్ధమవుతుంది. పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి, పిల్లలు పుడితే అన్నీ అవీ సర్దుకుంటాయి అనే థియరీకీ వ్రేలాడే కొమ్మలే అన్నీ. ఏదో కావాలని వెతకటం, ఇదే కావాలని పరితపించటం చేస్తే ఈ లోకం నీ పిచ్చితనానికి, చేతకానితనానికి, అమాయకత్వానికి, తెలివితక్కువతనానికి ఎంత జాలిపడుతుందో తెలుసా?

ఆకలి తొందరపెడుతూ ఉంటే ఆ హేజెల్ కళ్ళ జ్ఞాపకాల స్క్రోలింగ్ ఆపి, స్విగ్గీ స్క్రోలింగ్ మొదలుపెట్టా. “ఈ బస్‌స్టాపులో ప్రేమలు, పుస్తకాల్లో రాయబారాలు అయితే మీ అమ్మకి కూడా ఉన్నాయి తెలుసా” అంటూ ఫోన్‌లో అమ్మ పలకరించింది. పక్కనే నాన్న ఉన్నారా? ఉంటే కోపంగా చూస్తారా అని ఆలోచిస్తున్నా నేను.

“మొన్నెప్పుడో వైజాగ్ షాపింగ్ మాల్‌లో ఒకాయన కనిపించాడురా. నన్ను చూసి పలకరించాడు. పేరు రాంబాబో, రామకృష్ణో చెప్పాడు. కాలేజ్ రోజుల్లో మేముండే వీధిలో గది తీసుకుని ఉండే వాడంట. నన్ను ఫాలో అయ్యే వాడంట. నా ఊహకి అందలేదు. ఎందుకంటే నాకు సరిగా గుర్తులేదో లేక తప్పుగా గుర్తు పెట్టుకున్నానో. తెల్లగా ఆరడుగుల మనిషి మంచి మీసకట్టు, తలకట్టు రూపంలా మసక మసకగా గుర్తు. ఈయనేమో ఆ రూపానికి సరితూగేలా లేడు.” అమ్మ కథలల్లుతుందో లేక నిజం చెబుతుందో తెలియదు. కానీ నాకెందుకు చెబుతుందో మాత్రం అర్ధమయ్యింది. రెండురోజుల్లో పెళ్ళి చూపుల కోసం ఊరెళ్ళాలి.

అమ్మాయితో మాట్లాడమని నాకు బాల్కనీలో కుర్చీ వేసారు. పెద్దవాళ్లంతా హాల్‌లో కూర్చుని ఉన్నారు. నేను కాఫీ తాగుతూ ఉంటే అమ్మాయి వచ్చింది. హేజెల్ కళ్ళు. ఆశ్చర్యం నాకే కాదు తనకి కూడా.

“హాయ్ నా పేరు శ్రావణి.” అంది. హేజెల్ కళ్ళ శ్రావణి, హేజెల్ కళ్ళ వైశాలి కాదు.

“నా పేరు..” అని చెప్పబోతుంటే “నాకు తెలుసు. గౌతమ్ కదా మీ పేరు. ఈ మ్యాచ్‌కి ముందే నాకు మీరు తెలుసు” అంది. నేను “ఎలా?” అన్నట్టు చూసా.

“మా ఆఫీస్ వాట్సాప్ గ్రూపులో ఒక కవిత ట్రెండ్ అయ్యింది. వ్రాసింది ఎవరు అని అడిగితే మీ ఫేస్‌బుక్ లింక్ ఇచ్చారెవరో. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టలేదు కానీ మీ పబ్లిక్ పోస్టులన్నీ చదువుతూ ఉంటా. ఐ రియల్లీ లవ్ దెమ్.” అని తన ఫోన్‌లో స్క్రీన్‌షాట్స్ తీసి ఉన్న నా పోస్ట్స్ చూపించింది.

నా అక్షరాల వెనుక తను వెతుక్కున్న అర్ధాలు చెప్పింది. తనకి మూడ్ బాలేనప్పుడు గుర్తుచేసుకునే లైన్స్ గురించి చెబుతూ, ఆ స్క్రీన్ షాట్స్‌లో ఆత్రంగా వెదుకుతూ వాటిని నాకు చూపించింది. నా అక్షరాలను నా అంతలా ప్రేమించే మనిషి ఇన్నాళ్ళకి ఎదురయ్యింది. పెద్దవాళ్ళు వచ్చి పిలిచే వరకూ మాట్లాడుతూనే ఉంది ఆ హేజెల్ కళ్ళ శ్రావణి.

ఇంటికి వచ్చేసాక కూడా ఎవరూ నన్నేం అడగలేదు. నాకు భయంగా అనిపించింది.

కాసేపటికి నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. “ధైర్యం చేసి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. యెస్ అయితే యాక్సెప్ట్ చెయ్యండి. నో అయితే ఇకపైన కూడా మీ పోస్ట్స్ పబ్లిక్ లోనే ఉంచండి.” నా గుండె వేగం పెరిగింది.

హైదరాబాద్ వెళ్ళటానికి వైజాగ్ రైల్వే స్టేషన్‌కి వచ్చాను. పదే పదే ఫోన్‌నే చూస్తున్నాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మరో మెసేజ్ కూడా.

“పగలు, రాత్రి, నేను

వాచ్ చుట్టూనే తిరుగుతున్నాం.

టైమ్ ని ఎక్కడో పోగొట్టుకున్నాం”

ఇది నేనే ఎప్పుడో ఫేస్‌బుక్‌లో వ్రాసినట్టు గుర్తు. ఎందుకు పంపించిందో అర్ధం కాలేదు. మళ్ళీ మెసేజ్.

“పగలు, రాత్రి, వాచ్ టైమ్‌ని కొలవటానికే

నువ్వూ, నేనూ కాలాన్ని బంధిద్దామా?”

సచిన్ 99 రన్స్ దగ్గర ఉన్నప్పుడు టివి ముందు నుండి లేచి పక్క గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పటి నా గుండెదడ స్పష్టంగా గుర్తుకొస్తోంది. ఈ హేజెల్ కళ్ళ అమ్మాయిలంతే అంత తేలిగ్గా వదలరు. బ్యాగ్ పడేసి ఫ్లాట్‌ఫామ్ మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అవతలి ఫ్లాట్‌ఫామ్ పైన మళ్ళీ హేజెల్ కళ్ళు.

శ్రావణి కాదు. హేజెల్ కళ్ళ వైశాలి.

ఒక్కసారిగా పరుగు తీసాను. ఆ వేగంలో ఆ ఇనుప ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద పడితే ఆనవాలుకి కూడా ముక్కూ, మొహం మిగలవు. అయినా పిచ్చి పట్టినవాడికి ఆ స్పృహ ఎలా ఉంటుంది. పరిగెట్టుకుంటూ వెళ్తున్నా.

వైశాలి చేతిలో స్టిక్‌తో ఎవరో సాయంతో నడుస్తూ ట్రైన్ ఎక్కుతోంది.

“కుందనపుబొమ్మలా ఉందమ్మా కళ్ళు లేవా పాపం” అని ఎవరో అడిగారు.

“రెండేళ్ళ క్రితం షిర్డీ వెళ్తుంటే బస్‌కి యాక్సిడెంట్ అయ్యింది. చాలామంది పోయారు. మా అదృష్టం కళ్ళుపోయినా పిల్ల దక్కింది” అని చెప్పింది ఆమె. నా పరుగు ఆగిపోయింది, కాసేపు కాలం కూడా.

ఎవరూ గమనించకుండా కాస్త దూరంలో తనకి ఎదురుగా నిల్చున్నా. నావైపే చూస్తున్నట్టున్నాయి ఆ వైశాలి హేజెల్ కళ్ళు. కానీ ఏ శూన్యాన్ని చూస్తున్నాయో. తనకి నేను గుర్తున్నానా? లేకపోతే ఏమని గుర్తుచెయ్యాలి. ఈమె కూడా రాంబాబుని చూసిన అమ్మలా ప్రవర్తిస్తే?

అమ్మ ఫోన్ చేసింది. “అమ్మాయికి నువ్వూ, వాళ్ళ ఫ్యామిలికీ మేమూ నచ్చేసాం. ఇంక నువ్వే చెప్పాలి” అంది.

నన్ను చూడలేని, గుర్తించలేని హేజెల్ కళ్ళ వైశాలి ఒకవైపు. నన్ను సంపూర్ణం చెయ్యటానికి సిద్ధంగా ఉన్న హేజెల్ కళ్ళ శ్రావణి ఒకవైపు. చెప్పానుగా ఆ హేజెల్ కళ్ళు అంత తేలిగ్గా వదలవు.

“నాకు కొంచెం టైమ్ కావాలమ్మా.” అని చెప్పి ఫోన్ కట్ చేసాను.

మహానగరం e-బుక్

 

బ్లాగులో వ్రాయటం మొదలుపెట్టిన మహానగరం కథను, అనేక కారాణాల వల్ల మధ్యలోనే ఆపేసాను. తర్వాత పార్ట్ ఎప్పుడు వస్తుంది అని కామెంట్స్‌లో మిత్రులు అడుగుతూనే ఉన్నారు. కానీ పనుల ఒత్తిడిలో కొనసాగించలేకపోయాను.
ఇప్పటికి సమయం చిక్కి ఈ మహానగరాన్ని పూర్తి చెయ్యగలిగాను. మంచిపుస్తకం పబ్లిషర్స్ ఈ కథను పుస్తకంగా విడుదల చేసారు. పుస్తకంగా పబ్లిష్ చేసిన కారణంగా బ్లాగులో కథను కొనసాగించలేకపోతున్నాను. ఈ విషయంలో ఎవరినైనా డిజప్పాయింట్ చేసుంటే క్షమించాలి. మహానగరాన్ని మొదటి నుండి ఫాలో అయ్యి ప్రోత్సహించిన అందరికీ నా కృతజ్ఞతలు.

ఆసక్తి కలిగినవారు మహానగరం ప్రింట్ పుస్తకాన్ని ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు.

కినిగె లో ఇప్పుడు e-బుక్‌గా అందుబాటులో ఉంది. e-బుక్ ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు.

సిన్నారావు గారు

పొద్దుటినిండి గేటు కాడే నిలబడిపోయేను నేను. సినమాయ్యొచ్చి పెద్దోళొస్తన్నారు బయటెవ్వరునేరు ఎళ్ళిసూడమంటె వచ్చుండిపోయాను. కాన్మెంటు నాని, మూర్తిమేష్టారాలొచ్చేరు. నన్ను చూసి “ఓరి నువ్వు అమ్రికాలోనున్నావన్నారు? నువ్వెప్పుడొచ్చేవు?” అని అడిగి లోపలికెళ్ళేరు. తెలిసినోళ్ళందరొస్తన్నారు.

బయటున్నాను కాని తెలిసిన ముఖాలొచ్చినప్పుడు వేణు చినాన్న ఏడుపు ఇనిపిస్తంది. “ఎలిపోయేడు నాయినా, మారాజు ఎలిపోయేడు, మా అక్కకి అన్యాయం సేసి ఎలిపోయేడు. సూడండి మళ్ళ కనిపిస్తాదేటి ముఖమూ సూడండి నాయినా” అని శోకాలు తీస్తన్నాడు వేణు చినాన్న. చినాన్న అంటావు కానీ అమ్మమ్మకి తమ్ముడు, తాతవుతాడు. పక్కనే కూర్సున్న పరిమిశెట్టోల పెద్దోడు “ఓరొల్లకోరా ఏణు, ఆడోల్లందరు ఇప్పుడే అగినారు నువ్వు మళ్ళీ మొదలెట్టిసేవు” అని ఆపినా ఆగలేదు. ఈధిలో ఏ ఇంటిలో ఏదొచ్చినా పరిమిశెట్టోల పెద్దోడొచ్చి సేతిలో పనిలాగీసుకుని నేసేత్తాలేరా అని దూరిపోతాడు. ఆనక సాయిం సేసేడు కదా అని ఒక యాభై ఇస్తే ఎళ్ళి నాలుగు సుక్కలేసుకొచ్చేత్తాడు. పెదమాయ్యొచ్చి “నువ్వింక ఆపుతావా లేదా? పిల్లలు బయపడిపోతన్నారు” అని వేణు చిన్నాన్నని కసిరీసేడు. “ఆపిస్తానులే నాయిన ఆపిస్తానులే. మళ్ళరేపీయాలకొచ్చి ఏడుస్తానా? ఆపిస్తానులే” అని మూలుగుతున్నాడు.

“ఏనాడయిన ఒక్క మాటన్నోరేనా? ఇళ్లల్లో ఇంతమంది పెళ్ళాలిని తిట్టీవోళ్ళని సూసాం కాని ఏనాడయిన మహానుభావుడు నోరు జారేరా? పోని జరుగుబాటుకి ఏదైన లోటు సేసేరా? చివర్లో నేనిసిగిపోయి అనీసేను కాని. ఇంటిలోన ఈ ఒంటేలేటి మనిషికి తెలివి లేకుండా. ఈ రొచ్చులో నన్నుండమన్నారా? చావమన్నారా? అనిస్తే నవ్వీసి పొనలాగే నీ అన్నదమ్ముల దగ్గిరికెళిపోతావేటి అనీవోరు కాని తగువేసుకునీవోరు కాదు” అని పంతులమ్మగోరితో అమ్మమ్మ సెబుతుంటే, పంతులమ్మగోరు అమ్మమ్మ సెయ్యి పట్టుకుని గుమ్మం దగ్గర కూర్సుండిపోయారు.

“నువ్వనీస్తవమ్మా. ఎందుకనీవు? నోరులేని మనిషిని పట్టుకుని అనీస్తవుగాని. నీ అన్నదమ్ముల్ని కాని, నీ పిల్లల్ని కాని అనీమను. ఏటున్నదని అనీటానికి? ఏలు పెట్టి సూపించే మనిషేటి? మాయమ్మ నొరు నీకొచ్చి నువ్వందరినీ అనీస్తవు.” అని వేణు చిన్నాన్న శోకాలు పెడుతూనే ఉన్నాడు.

ఊరిలో రాజికీయం సేసివోళ్ళొచ్చారు. నాన్న సప్లియర్సోలకి ఫోన్ చేసి తెప్పించేయించిన కుర్సీల్లో బడిపిల్లల్లాగ సేతులు కట్టీసుకుని కూర్సున్నారు. “నాగిస్సర్రావుగారూ, మీ మాయ్యగారని సెప్పుకోటమే కాని మనిషి ముఖం తెలియదండి. అదిగో ఆ రోడ్డంటెప్పుడయినా కోవటిపల్లెలుతుంటే పొలం దగ్గర నూర్పులు సేస్తుంటే సూసివోళ్లమంతే” అనీసి సెబుతున్నారు. నాన్న టీకొట్టు రవణని పిలిసి అందరికీ టీలిచ్చీమన్నారు. “బయిటికొచ్చీ మనిషి కాదండి. ఇంటికాడె కనిపెట్టుకునుండీవోరు. సిన్నపిల్లలందరికీ గొప్ప సేరిక. అదిగో మా పాప, మా బాబు దగ్గిరనుండి మా మరదలిగారి పిల్లలదాక అందరినీ ఆయినే ఆడించీవోరు.” అని సెబుతూ ఏదొ గుర్తొచ్చినట్టు “ఒరేయ్ భారతమ్మ పిల్లలు యాడదొకొచ్చేరు పోను కొట్టండి” అని కేకేసేరు. “పెద్దోడి కారులో వొస్తన్నారట కదా. రాజమండ్రి దాటీసేరంట” పెదనాన్న సెప్పేరు.

ఎవులో వొచ్చి “బాబు నీకేటవుతారేటి సిన్నారావు గారు?” అని అడిగారు. “మా తాతగారండి” అని సెప్పేను. “శామలమ్మ కొడుకువా? నువ్వల్లకడెక్కడో అమ్రికాలో ఉన్నావన్నారు. అందవనీసేరు.వొచ్చీసేవా” అన్నారు. “అందరూ వొచ్చీసేరు నాయినా, అందరినీ రప్పించీసుకున్నాడు రాజు. అందరు మనవళ్ళు కొడుకులతోటి జరిపించీసుకుంటున్నాడు. భోగమంటే నీదే నాయినా” అని వేణు చిన్నాన్న మళ్ళీ అందుకున్నాడు.

గంగులీధి కావెస్సర్రావొచ్చాడు. కావెస్సర్రావుకి తాతగారంటే గొప్ప ఇది. “ఇంటిలో సిన్నోడని సిన్నరావనిస్తారు కాని రాజారావండి మా మాయ్య పేరు” అని ఎవురితోనో మాట కలిపేడు కామెస్సర్రావు. గంగులీధి నుండి శంకర్రావు కొడుకు కబురు తెచ్చాడు. గంగులీదావిడ వద్దావనుకుంటుందంట రిక్షా పంపిస్తే వస్తానని కబురెట్టింది. కానయితే ఆవిడకి సేసే తంతంతా నాకూ సెయ్యాలని కండీషనెట్టిందట. ఆవిడంటే మా అమ్మమ్మ అనీసి. శంకర్రావు మా తాతగారికి అన్నియ్య కొడుకు. మాకు పెదనాన్న వరస. శంకర్రావు కొడుకు ప్రెసాదంటే నాకంటె రెండేళ్లు సిన్నోడే కాని గంగులీధిలో మనిషి పెద్దతరహా అనీసి, సదువుకున్నోడు అనీసి ఇలాంటి కబుర్లు సక్కబెట్టడానికి ఆడికే సెప్తారట.

ప్రెసాదు మా పెదమాయ్యని, సినమాయ్యని పిలిసి “మనిషి పోయినకాడ పట్టింపేటి సిన్నాన్న రిక్షా పంపించిస్తే ఆవిడ కూడా సూస్తది కదా” అని కర్ర ఇరక్కుండ సెప్పాననుకున్నాడు. “ఓరెనువ్వు ఆ ఈత్తరుపునొచ్చేవా, తాతని సూడ్డానికొచ్చేవా? ఏటిరా ఆయమ్మ గొప్ప? మనిషి పోయి మేమేడుస్తుంటే రిక్షా అంపాలా?” అని అందరూ తగిలీసుకున్నారు. పెదమాయ్యకసలే సెడకోపం “ఏటి బుర్రగాని తిరుగుతున్నాదేటిరా ముసిల్దానికి? మా అమ్మకి సేసినట్టు దానికి సెయ్యాలా?” అని ఎగిరిపోతుంటే ప్రెసాదుగాడు బిక్కయిపోయాడు. సినమాయ్యొచ్చి ప్రెసాదుగాడిని పక్కకి తీసుకెళ్ళి “ఒరేయ్ అమ్మతో మాట్టాడినాను. ఆయమ్మొచ్చి సూస్తే మాకేటి అబ్బింతరం లేదు. మావేటి అడ్డు సెప్పం. కాని రిక్షాలంపడాలాటివేట్నేవు.” అని కరాఖండిగా సెప్పిసేడు. ప్రెసాదుగాడు సైకిల్ స్టేండు తీసి గమ్మునెళ్ళిపోయేడు.

“ఇంకేటి మిగిలిందావిడతోటి? మనిషికి సుస్తీ సేసిందని తెలిసిన్నాడు కూడా ఆస్థి ఎలాగమ్మీసుకుందామని సూసినావిడతోటి మాటలేటి? మీకు బుర్రలుగాని పోనాయ” అని వేణు చిన్నాన అందరిని కసిరిసేడు. గంగులీధినుండొచ్చిన కావెస్సర్రావు వీధావిడమీద నోరు జారితే వీధిలో ఏరయిపోతామని కామయిపోయేడు.

ఏటి జరుగుతుందో అర్ధంకాని ఎదురింటి రామరాజుగారొచ్చి “ఏటండి భోగట్టా? ఎవరాలు?” అని కామేశ్శర్రావునడిగాడు. దగ్గరలోని మా మావయ్యలు గానున్నారేమోనని సూసుకుని సిన్నగొంతుతో “ఏటినేదండి మా సిన్నారావు మాయ్య సంగతి మీకు తెలియందా, అసలే ఒకీధిలో ఉన్నోళ్ళు. మనిషి నిఖార్సయిన మనిషి. మప్పితం లేదు. టపీమని మొహమ్మీద సెపుతాడు కాని, ఇచ్ఛికాల కోసం బొంకడం తెలీదు. మరయితే మా మావయ్యకయితే ఆ రోజుల్లో ఒక పెళ్ళయిన మాట నిజం. ఎవురికీ తెలీదనుకోండి. ఇప్పుడయితే మీ ఈదిలో ఇల్లు కట్టీసుకున్నాడు కాని, మా గంగులీధిలో ఇప్పుడికీ మా మాయ్యకి ఇల్లుంది. మా ఈది పిల్లనే ఇచ్చి పెళ్ళి చేసిసేరు. కానయితే పెళ్ళయి నెల్లాళ్ళయిన పిల్ల కాపురానికొచ్చింది కాదు. సూసేరు సూసేరు ఇక వల్ల కాదనీసుకుని పెద్దోళ్లందరిని పిలిచీసి ఏటీ పేచి? పెళ్ళి చేసీసుకున్నాక కాపరానికి రాకపోడాలేటి. ఇక నాకీ పిల్లొద్దని సెప్పీసేడు మాయ్య.

ఈదంత ఒక్కటయిపోయి పిల్లనొగ్గీడవేటి? ఇదేవన్నా పెళ్ళనుకున్నావా? బొమ్మలాటనుకున్నావా? అని మా మాయ్య మీదకొచ్చీసేరు. గంగులీధంటే అందరూ సుట్టాలే. అన్నీ మా కుటుంబాలే. ఎవ్వరినీ వదులుకునే మనిషి కాదు మా సిన్నారావు మాయ్య. మనిషికి గొప్ప మమకారం, ఆపేక్ష. అలాంటి మనిషి మీదకి గొడవకొచ్చీసేరు. “సుట్టాలు సుట్టాలనుకుంటే ఈదంత ఒక్కటయిపోతారా? ఏం ఆ పిల్లే మీ రక్తమా? నేను మీ రక్తం కాదా? దాని బ్రతుకే గాని నాది బ్రతుకు కాదా?” అని అందరిని నిలేసి నేను ఈ ఈదిలోనే ఉండనని పంతం పట్టీసేడు. మనసిరిగిపోతె మా మాయ్య మనిషి కాడు.

ఈదిలో పెద్దలు మనిషి ఎళ్ళిపోత నన్నాడన్న బాధ కూడా నేకుండా, అమ్మాయి సంగతేటన్నారు. ఆ ముక్కతో ఆ ఈది మీద, ఆ మనుషుల మీదున్న ప్రేమ సచ్చిపోయి అప్పుడుకప్పుడు సిన్నారావు మాయ్య నోటరీ సభాపతిగోరిని పిలిసీసి మా నాన్న నాకిచ్చిన పొలాలు, ఇల్లు ఆవిడ బ్రతికున్నదాక అనుభవించాడినికిన్నీ, అవిడ తదనంతరవూ అవి నా వారసులకి సెందాలని వ్రాసీసిచ్చిమని సెప్పి ఆ పూటే కట్టుబట్టలతో వీధి వదిలీసి వచ్చీసేడు.” అని కావెస్సర్రావు సెబుతుంటే జనాలు గుమిగూడీసి ఇంటన్నారు. ఎనకాలె ఉన్న సువ్వాడ గోపాలం “మాకు తెలీకపోవడమేటి బాబు, సిన్నరావుగారి పొలాలన్నీ మేవే సూసివోళ్ళం. గంగులీదావిడకి బాబొదిలిసిన పొలాలు మావే సేత్తన్నాం.” అని అందుకున్నాడు.

సువ్వాడ గోపాలం పక్కనే సువ్వాడ కిష్ణ, గౌరునాయుడు నిలబడి సూత్తన్నారు. గౌరునాయుడొచ్చి “ఎప్పుడొచ్చేరు బాబు? నాన్నో” అని అడిగాడు. నేను నాన్నని సూపించేను. నన్ను దాటుకుని గుమ్మంలోకెళ్ళి నిమ్మళంగ పడుకున్న తాతగారిని సూసి కాసేపలాగ నిలబడిపోయేడు. మా పొలాలన్నీ గౌరునాయుడే సూసివోడు.

కాపోతే గౌరినాయుడికి సిన్న దొంగబుద్దుందని తాతగారు సివర్లో మానిపించీసేరు. గౌరినాయుడి పెళ్ళాం లష్మి కోతలప్పుడు, నూర్పులప్పుడు వొచ్చి మిగిలిపోయిన పరకలేరుకున్న నెపాన మోపులోని పరకలు లాగీడం తాతగారు సూసి గెట్టిగ కేకలేస్సేరు. “ఓసిదేటి బాబూ, మిగిలిపోయిన పరకలేరుకోరా” అనుకుంట ఆ అమ్మి ఎళ్ళిపోయింది. రాతిరి కాపలాకి పోయి ఇంత కునుకు తీస్తే మోపులు మాయం సేస్సీవోరు. సూసి సూసి ఇసిగిపోయి “ఏవోయ్ గౌరినాయుడు రైతన్నోడు సెయ్యాల్సిన పనేనా? నమ్మి పొలాలు సెయ్యమని పిలిస్తే మాకే మట్టి కొడతారా? ఇక మనకి కుదర్దు గాని సాయంకాలం ఇంటికొచ్చి నీకు రావాల్సినవి తీసీసుకో. ఇంక నా మడిలోకి రాకు” అనీసేరు. “ఒసేటి బాబు, ఏనాటి నుండి సేత్తన్నారు వ్యవసాయము, ఈమాతరం గింజలు తియ్యని రైతెవుడీవూర్లో? దీనికే మడిలోకి రావుద్దనిసేరు” అని అడిగేడు కాని మా తాతగారయితే మళ్ళ గౌరినాయుడిని పిలిసింది కాని, సూసింది కాని లేదు.

పిన్ని పిల్లలు ఇంకా రానేదు. ఆల్లొచ్చి సూసీదాక ఏం నేదని అందరికీ చెప్పిసిందమ్మమ్మ. వచ్చినోలు టీలు తాగుతా సప్లియర్స్ కుర్సీల్లో కూకుండిపోయారు. వేణు సిన్నాన్న ఎళ్లి కావేస్సర్రావు పక్కనే కూర్సొని “కావెస్సర్రావు ఆవిడ పద్దతేటి? మా బావకి బాలేదని తెలిసిన్నాటి నుండి సూత్తన్నాం. అనుభవించమని ఒగ్గీసిన ఆస్థిని పడీసుకుని అన్నదమ్ముల పిల్లలికిచ్చిద్దమని తాపత్రయిమేటి? మా బావ బాగున్న రోజుల్లోనే ఎంతమందో సెప్పారు, ఆవిడకి ఎంతోకొంతిచ్చీసి ఆ పొలాలు, ఇల్లు తీసీసుకోమని. మాబావ దేవుడు మాట తప్పుతాడా? ఆ పొలాల మీద ఎంతొస్తుందో, ఆ ఇళ్ళు ఏటవుతుందో ఒక్కనాడైనా అడిగాడా? అలాంటి మారాజు సొమ్ము పడీసుకోటానికి అప్పుడే మధ్యవర్తులతో మాట్టాడీసిందంట.

లోకంలో ధర్మమేటి లేదనుకుందేటాయమ్మ. కట్టుబట్టలతో అన్నీ వొగ్గీసి వచ్చీసేడుగావల. ఆ బాబు కష్టం సేసి టాటా, జెంషేడుపూరు అని ఊర్లు ఊర్లు తిరిగి వ్యాపారం సేసి ఏదో సంపాదించి కాణీ దాసేడు కనకగాని లేకపోతె ఈ పిల్లల్ని ఎలా పెంచీవోడు? పిల్లలకింత దాసిపెట్టాలని పొలంలోనూ, సామిల్లులోనూ పనోళ్ళతోటి పనోడిలాగ మూటలెత్తీసి ఒక కష్టం పడ్డాడా? అలాటి బాబు దగ్గరా లాగీసుకుందామని సూస్తన్నారు?” అని దులిపేత్తుంటే ఊ కొడతన్నాడే కాని మారు మాట్టాడలేదు కావెస్సర్రావు.

పిన్నికొడుకులు వచ్చీసేరు. తాతగారిని ఎరిగినోళ్ళంతా వచ్చి పోటీపడి భుజాలకి ఎత్తుకున్నారు. పుట్టినాటి నుండి మాతోటే ఉన్న తాతగారు కళ్ళ ముందే కలలాగా కరిగిపోయేరు. కాలుతున్న కట్టెలు సూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగేయి కాదు. కానీ మరలా రేపు సూస్తామా? ముట్టుకుంటామా? గోడమీద పటంలో సూసుకోటానికి ముక్కూమొహం తెలియని దేవుడా? మమ్మల్ని ఎత్తుకునాడించిన తాతగారు.

పరిమిశెట్టోల పెద్దోడొచ్చి “ఇక కదలండిరా మీరందరూ. ఇంటికాడ చెయ్యాల్సిన పనులుంటాయి ఎళ్ళి సూడండి. ఈ సాకలోడు కిరసనాయిలికి కక్కుర్తిపడి సరిగ్గా కాలుస్తాడో లేదో, నేనిక్కడే ఉంటాను” అని సెప్పి పెదమాయ్య వైపు సణుగుతూ సూసేడు. వేణు చినాన్న పెదమాయ్యతోటి ఒక వొందిప్పించేడు. సాకలి రాము కూడా “మీరెళ్ళండి బాబు నేను సూసుకుంటాను” అని చెప్పి అందరిని పంపీసేడు.

తిరిగొచ్చిస్తుంటే గౌరినాయుడు కనిపించాడు. కాస్త దూరంలో నిలుసుని ఎగిరిపడుతున్న మంటల్ని సూస్తన్నాడు. “ఏమిరా గౌరినాయుడు ఇక్కడ నిలబడిపోయేవేమి?” అని అడిగాడు పరిమిశెట్టోల పెద్దోడు. మనిషికి మాటలేదు. ఎన్నేళ్ళు పనిసేసేడు మరి. ఏ జ్ఞాపకాలు కదిలాయో ఏటో.

పరిమిశెట్టోల పెద్దోడు ఆ రావిచెట్టు కింద కూర్సుని “ఓరి గౌరినాయుడు మనిషి సచ్చిపోయినంత మాత్రాన పంతం సచ్చిపోద్దా? ఆ గంగులీదావిడ సూడు మనిషి సచ్చిపోయిన కాడ కూడా నాకు పిలుపు రావాలి, రిక్షా రావాలి అన్నాది. సిన్నరావు గారితోటి పంతమా? పేనంలేని ఆయన శరీరం కూడా ఆమెను సూడకుండానే వెళ్ళిపోయింది సూసావా?

మనిషి మిగులున్న నాడే కాస్త మంచి మిగుల్సుకోవాలిరా. మనిషి పోయేక ఎన్ననుకుని ఏటి నాభం. నీ తప్పులు నా తప్పులు లెక్కలెయ్యటానికి దేవుడొస్తాడనుకున్నావేటిరా. ఇదిగో ఇలాటి మహానుభావులే వొచ్చి ఒరేయ్ ఇది తప్పురా అని సెప్పీసెళ్ళిపోతారు” అని సణుక్కుంటూ సీసా మూత తీసేడు

ఆటోబయోగ్రఫీ లో ఆఖరుపేజి

ఆ రోజు ఎందుకో ఉదయాన్నే గుండె బరువుగా ఉంటే మగతనిద్రలో నుండి మెలుకువ వచ్చి లేచి కూర్చున్నా. అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు, కిటికి వైపు చూస్తే పెద్దగా వెలుగేమీ లేదు. బయటగాలి వస్తుందని రాత్రి తెరిచి ఉంచిన బాల్కనీ తలుపు అలానే వదిలేసినట్టున్నా. లేచి వెళ్ళి బాల్కనీలో నిల్చుంటే వీధిలో సైకిళ్ళు మీద తిరుగుతున్న పాలబ్బాయి, పేపరువాడు కనిపించారు. రామభజన పక్కన ఉండే టీకొట్టు రవణ టీ కాయటం మొదలెట్టేసాడు. చల్లగాలికి శరీరం తేలికబడింది. ఇంక పడుకున్నా నిద్ర వచ్చేట్టు లేదు. ఏదైనా పుస్తకం తిరగేద్దామని లోపలికి నడిచాను. లైటు వేస్తే, మా ఆవిడ రజని లేస్తుందేమో అని మంచం వైపు చూసాను. రజని మంచి నిద్రలో ఉంది, పక్కనే నేను కూడా.

ఉలిక్కిపడి మరలా చూసాను నేనే. అప్పుడెప్పుడో చదివిన సూక్ష్మశరీరంతో సంచరించటం నాకొచ్చేసిందా అనిపించింది. కంగారు, గుండెదడ మొదలయ్యింది. కాసేపటికి ఆ స్థితి అలవాటుపడి నిశ్చలంగా ఉండిపోయాను. నేను చనిపోయాననే విషయం నాకే అర్ధంకావటం లేదు. మిగిలిన వారికెలా అర్ధమవుతుందో ఏంటో బొత్తిగా తెలియటం లేదు. నేను ఆత్మనో దెయ్యాన్నో, నాకిప్పుడేవైనా మానవాతీత శక్తులు వస్తాయా? వచ్చాయని నాకెలా తెలుస్తుంది? అని ఆలోచిస్తూ గోడలగుండా తలుపులగుండా నడుస్తూ ఆలోచిస్తున్నా.

వ్రాయాలనుకున్నవి వ్రాయలేకపోయానని, చేయాలనుకున్నవి చేయలేకపోయానని ఒక చిన్న బాధ ఏదో మూల. అంతా మిధ్య ఏది శాశ్వతం, ఇన్నేళ్ళు బ్రతికినందుకు ఏం మిగిలింది, చెయ్యలేకపోయినవి చేస్తే మాత్రం చచ్చిన నా శరీరం బంగారమవుతుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటున్నా. మంచం మీద పడి ఉన్న నా శరీరాన్ని చూస్తే ఇది నేనేనా అనిపిస్తుంది, ఇరవైయేళ్ళ కుర్రాడిగా ఉన్నప్పటి నా రూపం మాత్రమే నేనుగా గుర్తుండటంవల్లనుకుంటా. నా అందమైన ఉంగరాల జుత్తు, కళ్ళల్లో మెరుపు, శరీరంలో చురుకు ఎప్పుడుపోయాయో కూడా తెలియకుండా పోయాయి. అప్పుడప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం ఒక నిట్టూర్పు విడిచేవాడ్ని.

ఇప్పుడు మా ఆవిడ నేను పోయానని తెలియగానే ఏమవుతుంది? అమె ఎలా స్పందిస్తుందో అని కాస్త ఆసక్తి, అంతకంటే ఎక్కువ ఆందోళన. ఎవరైనా వచ్చి ఘంటసాలవారి భగవద్గీత వేస్తే బావుండు కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది.

కాస్త తెల్లారి, వెలుగు గదిలోకి వచ్చాక రజని లేచింది. లేచి నా వైపు ఒకసారి చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాస్త ఉత్కంఠత నాలో రేగి చల్లారింది. పెళ్ళిచూపుల్లో తనని చూసేందుకు వెళ్ళినప్పుడు కూడా నా పరిస్థితి ఇదే. మంచమ్మాయని వాళ్ళన్నారు, మంచబ్బాయి అని మావాళ్ళూ అన్నారు. మంచి మంచి రాసుకుంటే మంచే రాలుతుందని అందరూ అన్నారు. అయినా నాన్న చెప్పినమాట విన్నప్పుడు మంచోడ్ని, అమ్మ చేసిన కూర బాలేదని తినకపోతే చెడ్డోడ్ని. మంచి చెడు రెండూ నేనే. అందుకే మంచి అమ్మాయి కావాలని అనుకోలేదు. అలా అని ఎలాంటి అమ్మాయి కావాలో కూడా తెలియలేదు.

మూగకోయిలనై రోధిస్తున్నవేళ
ముంతమామిడి చివురు తెచ్చే నెచ్చెలి ఆమె

గుండెల నిండా చీకటి పీల్చిన అమావాస్యరాత్రి
నాకోసం క్షణమైనా వెలిగి రాలిపోయే తార ఆమె

హారివిల్లు విరిసి మెరిపోతున్న వేళ
మదిలో చీకటిచారను చూడగల కాటుక కన్నులు ఆమె

అలసినవేళ సాయంగా, తలచినవేళల హాయిగా
బాధల్లో ఛాయలా, బ్రతుకంతా ఓ మాయలా
వలచి వలపింపబడి సృజించి సృజించబడు
నా బ్రతుకు కావ్యం ఆమె

అమ్మాయిని తెచ్చి ఎదురుగా కూర్చండబెట్టారు. నిర్మలంగా వర్షంలో తడిచిన నందివర్ధనం పువ్వల్లే ఉంది. నచ్చిందనేందుకు నమ్మకం కుదరలేదు, కాదనేందుకు కారణం దొరకలేదు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను టీగ్లాసు పుచ్చుకున్ని వాకిట్లోకొచ్చి నిలబడ్డాను. రెండురూపాయలకి ఒకటి అని బోర్డు పెట్టి రంగు రంగుల కోడిపిల్లలు అమ్ముతున్నాడెవడో. కొన్ని కోడిపిల్లలు గంపదాటి పోతుంటే వాటిని లాగి లోపల పడేస్తున్నాడు.

వంటగదిలోకి వెళ్ళిన రజని టీగ్లాసు తో వచ్చింది. ” ఏవండీ లేస్తారా? టీ చల్లారిపోతుంది” రెండు మూడుసార్లు పిలిచింది. “సరే ఇక్కడ పెడుతున్నా లేచి త్రాగండి” అని అక్కడే టేబుల్ మీద వేడి వేడి టీ పెట్టి వెళ్ళిపోయింది. తట్టిలేపితేనేగా వచ్చిపడిన చల్లదనం తెలిసేది.

పెద్దవాళ్ళు పెళ్ళి నిశ్చయం చేసి ముహుర్తాలు పెట్టి కబురుపెట్టారు. పెళ్ళికి వారం రోజులు ముందుగా సెలవు పెట్టి వచ్చాను. “పిల్లను ఒకసారి కలిసి రాకూడదూ” అన్నారు నాన్న. ఆటపట్టించటానికో, నిజమో తెలియదు ఇంట్లో అందరూ అదేమాట. ఎదురింటి చంటి బండి మీద రజని ఇంటి దగ్గర దించి వెళ్ళాడు. ఇంట్లో పెళ్ళిసందడి కనిపిస్తుంది. చుట్టాలు అప్పటికే వచ్చారు. తన ఈడు ఆడపిల్లలు ఇలా నేను రావటం గూర్చి తనని ఆటపట్టిస్తున్నారు. పెరట్లో జామచెట్టు నీడన నాకు కూర్చీ వేసి, తినటానికి జంతికలు, పెళ్ళికని చేసిన లడ్డూలు పెట్టి వెళ్ళారు.

కాస్త ఆలస్యంగా రజని వచ్చి అక్కడే ఉన్న సిమెంటు గట్టు మీద కూర్చుంది. ముస్తాబయి రావటంవల్ల ఆలస్యమయ్యిందని అర్ధమయ్యింది. రెండురోజులుగా షాపింగ్‌కి, టైలర్ మెజర్మెంట్స్‌కి ఎండల్లో తిరుగుతున్నా కాస్త రంగు తగ్గాను అని చెప్పింది. నేను నవ్వి ఉరుకున్నా. నాకు ఆ తేడా తెలియలేదు. అయినా పెళ్ళి సమయానికి సమస్య లేదులెండి. మా పిన్ని కూతురు వస్తుంది పెళ్ళికి. తనకి ఊర్లో బ్యూటీపార్లర్ ఉంది. తనే నాకు పెళ్ళికూతురు ముస్తాబు చేస్తుంది అని గలగలా చెప్పింది. నేను ముభావంగా చూడటం గమనించి ఫోటోల్లో అందంగా పడాలిగా అని నా వైపు సమాధానం కోసం చూసింది. అవును అని చెప్పి ఊరుకున్నా.

మీరేమీ మాట్లాడటం లేదు అని అడిగింది. నేను నవ్వాను. ఆమె పక్కనే ఉన్న మొక్కలు చూస్తూ ఆ గులాబి బావుంది అన్నాను. అమె ఆ పువ్వును తెంపి తలలో పెట్టుకుని సిగ్గుపడింది. వర్షం వచ్చేలా ఉంది అని మేఘాలను తనకి చూపించి, చలిని స్వీకరిస్తూ చేతులు కట్టుకున్నాను. అవును నిజమే అని ఆమె పరుగున వెళ్ళి తీగ మీద ఆరేసిన బట్టలు ఇంటిలో పెట్టేసి వచ్చింది. నేను మౌనంగా ఉన్నాను. మీరు బొత్తిగా నెమ్మది. నేను వచ్చాక కుదరదు సుమా అని గట్టిగా నవ్వి తను పెళ్ళికి కొనుకున్న జూకాల గురించి చెప్పింది. అవి చూసి అసూయపడుతున్న తన స్నేహితుల గురించి, ఇంకా ఏవో చాలా చెప్పింది. వర్షం మొదలవక ముందే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి నేను వచ్చేసాను.

“నాన్న ఇంకా లేవలేదు. ఈ రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్ళినట్టు లేదు” రజని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మా అబ్బాయి ఉదయ్‌తో అనుకుంటా. చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చింది. దూరమైనా కెరీర్ బావుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడతాడు. ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే వాళ్ళమ్మ దగ్గర ఫోన్ తీసుకుని ఎలా ఉన్నావు అని అడుగుతాను. అంతకంటే ఏం మాట్లాడాలో ఎంత కూడబలుక్కున్నా నాకు మాటలు రావు. ఇదిగో అమ్మకిస్తున్నా అని తిరిగి ఫోన్ ఇచ్చేస్తాను. ఇప్పటికీ తెలియదు వాళ్ళిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకుంటారో. రజని ఫోను మాట్లాడూతూ పువ్వులు ఏరుకునేందుకు పెరట్లోకి వెళ్ళింది.

పెళ్ళైన అయిదవరోజేమో అదే పెరట్లో మీరెందుకు అందరిలా ఉండరు అని అడిగింది రజని. ఆ ప్రశ్న లోతుగా తగిలింది. చిన్ననాటి నుండి అందరిలో పడిపోకుండా ఒక్కో అక్షరం చెక్కుతూ ఒక సంతకం దిద్దుకున్నా. అందరిలా ఉండకపోవటం నా గొప్పనుకున్నానే తప్ప అది తప్పని నాకు తెలియలేదు. నాలా ఉంటే ఏం సమస్యలు వస్తాయో తను చెప్పింది. చాలా నష్టాలు జరిగే అవకాశం ఉన్నట్టుంది. కానీ ఒక్కడినే ఉన్నప్పుడు నాలా ఉండటంలో కష్టాలేవి తెలియలేదేంటి అని ఆలోచించాను.

పెళ్ళి అంటే ఒక పెద్ద బాధ్యత అని చెప్పింది. నిజమే ఇది నేను ఎక్కడో చదివాను. పెళ్ళంటే మీరొక్కరే కాదు మీరు, నేను ఇద్దరం అని కూడా చెప్పింది. కానీ నేను పెళ్ళంటే ఒక్కరే అని చదివాను. తనకి అదే విషయం చెప్పాను. మరయితే ఇద్దరం ఒకేమాట మీద నడవాలి పదండి నాతో అంది. ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. పెరట్లో మొదలయిన వాదనలు మెల్లగా పడకింటికి, అటుపైన నట్టింటికి నడిచొచ్చాయి. అందరూ కూర్చొని ఆరాతీసారు, పంచాయితీ చేసారు. తర్వాత గొడవలే కాదు, మాటలు కూడా తగ్గిపోయాయి.

ఇంటిలోకి వస్తూ టైము చూసిన రజనికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. మంచం దగ్గరకొచ్చి తట్టి లేపబోయింది. శరీరంలో చల్లదనం, కరుకుదనం తెలిసిరాగానే గట్టిగా అరిచి స్థాణువులా నిలిచిపోయింది. నాకు ఎప్పుడు ప్రతిస్పందించటం అలవాటు లేదు, అందుకే తిరిగి పలకలేదు. రజని అరుపుకి పనమ్మాయి కంగారుగా గదిలోకి వచ్చి చూసి వీధిలోకి పరిగెట్టింది.

కాసేపట్లో ఇంట్లోనూ, వీధిలోనూ హడావుడి మొదలయ్యింది. ఎవరెవరో ఎవరెవరికో ఫోనుల్లో నా చావు వార్త గుసగుసగా చెబుతున్నారు. రజని ఫోనులో నంబరు చూసి ఎవరో ఉదయ్‌కి కూడా చెప్పారు. తెలిసినవాళ్ళు, స్నేహితులు వచ్చి వెళుతున్నారు. వచ్చినవాళ్ళు ఇంటి ముందు వేసిన శామియానా కింద కూర్చున్నారు. టీకొట్టు రవణ వచ్చి అందరికీ టీలు పోస్తూ, పోసిన గ్లాసులు లెక్కబెట్టుకుంటున్నాడు. “అబ్బాయి ఎప్పటికి వస్తాడో” అని గడియారాన్ని చూస్తూ కొందరు, “రానివ్వండి తొందరేముంది” అని రిటైర్ అయిన కొందరూ మాట్లాడుకుంటున్నారు.

ఆడవాళ్ళు కొందరు రజని దగ్గరకొచ్చి “అమ్మా అగరొత్తులెలిగించి, తల దగ్గర దీపం పెట్టాలి” అని చెప్పారు. “కుడి వైపా? ఎడమవైపా?” అని అడిగారు ఎవరో. రజని పెద్దవాళ్ళ వైపు చూసింది. “ఎవరేం చెప్పినా వినకు, మన ఇళ్ళల్లో ఇంతే. మీది మాది ఒకటే ఇంటిపేరు. మా ఆయనపోయినప్పుడు..” అని ఒక ముసలామె ఏదో చెబుతుంది. రజని ఆమె వైపు మౌనంగా చూస్తూ కూర్చుంది. “బంగారంలాంటి మనిషి ప్రకాషం, ఇలా చెప్పా పెట్టకుండా పోయాడు” అన్నారెవరో. “ఎక్కడికి మాత్రం చెప్పి వెళ్ళాడాయన” రజని మనసులోని మాటలు నాకు మాత్రమే వినిపించాయి.

అందిన విమానం పుచ్చుకుని ఆగమేఘాల మీద ఇంటికి చేరాడు ఉదయ్. ఘనీభవించిన మౌనం కరిగి ఉప్పెనగా మారి ఉదయ్ మీదపడింది. అందరూ వాడిని పట్టుకుని బావురుమంటున్నారు. తుఫానులో చేజారిన ఆసరా వెదుకుతూ వచ్చినట్టు, జనాల్ని తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు ఉదయ్. బయట మొదలయిన ఆందోళనకే ఉదయ్ వచ్చేసాడని గ్రహించిన రజని, పనమ్మాయికి గ్లాసు నీళ్ళు తెమ్మని చెప్పింది. ప్రయాణంలో తోటి ప్రయాణికుల మధ్య బయటపడలేక బిగదీసుకుపోయిన కొడుకుకి రాగానే నీళ్ళివ్వాలని ఆమె ఆరాటం. చిన్నప్పుడు వాడు గుక్కపెట్టి ఏడుస్తూ ఊపిరాడకపోతే అదే చేసేది.

ఉదయ్ నీళ్ళ గ్లాసు అందుకోలేదు. పూలదండల మధ్య నా శరీరాన్ని వెతుక్కునేందుకు కూలబడ్డాడు. వంగి నా ముఖం వైపే చూస్తున్నాడు, ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నా మనసులో ముద్రపడని దాన్ని పరిశీలనగా చూస్తున్నట్టు. ఎప్పుడు చూసాడు గనక. కాలేజి ఫీజుకో, పుస్తకాలకో డబ్బులడిగినప్పుడు కూడా అటు తిరిగి మాట్లాడేవాడు లేదా వాళ్ళమ్మకు చెప్పేవాడు. ఊరిలో అందరూ వాళ్ళ పిల్లాడు పాసయ్యాడని ఆనందపడినప్పుడో, పరీక్షతప్పాడని బాధపడ్డప్పుడో నేనూ ఉదయ్ గురించి ఏదైనా చెప్పాలని తోచేది కాదు. ఎవరైనా అడిగితే మాత్రం చెప్పేవాడిని. పెళ్ళికి అత్తవారు పెట్టిన ఉంగరంలానే, వాడు కూడా నాకు సొంతమో కాదో ఎప్పుడూ అర్ధంకాలేదు.

రజని గురించో, నా గురించో, ఉదయ్ గురించో ఏదీ ఆగలేదు. “జరగాల్సిన పనులు” అని అందరూ చెప్పే పనులేవో జరుగుతూనే ఉన్నాయి. “అమ్మను లేవదీయాల్సిన వాడివి నువ్వేంట్రా ఇలా” అని ఉదయ్‌ని రెక్కపట్టుకుని లేవదీసారు. రజనికి,ఉదయ్‌కి, నాకు తెలియనివి అర్ధంకానివి సొంతంకానివి ఏవేవో పనులు, ఆచారాలు జనాలు భుజాలకెత్తుకుని జరిపించేస్తుంటే ఎలాగో శ్మశానానికి వచ్చేసాం. చిన్నప్పుడు అక్కడే క్రికెట్ ఆడేవాళ్ళం. దూరంగా శవాలు కాలుస్తుంటే భయంగా చూసేవాళ్ళం.

ఏడదాకోయ్ నీ నడక ఓ ఎర్రికొడుకా
ఏపాటి గొప్పదోయ్ ఇంతోటి పుటక
నీ ఏడి నెత్తురు నీ సోకు అత్తరు
ఎముక తెలియని సేయి ఎనకలెరుగని ఎన్ను
సూడు కాలి కాష్టమయ్యే ఏడుక

నన్ను తగలేసి వెనక్కి వెళ్ళిపోతున్న జనాల్ని చూస్తూ కాటికాపరి పసివాడైన తన కొడుక్కి తత్వాలు నేర్పిస్తున్నాడు.

యాత్ర వీధి దాటగానే ఇళ్ళు కడిగేయాలంటూ ఆడాళ్ళందరూ రజనిని పక్కకి లాగి బక్కెట్లతో ఇళ్ళంతా నీళ్ళు పోసేస్తున్నారు. రజని కళ్ళు మేఘాల్లేని వర్షంలా కురవటం మొదలెట్టాయి. కన్నీరుగా మొదలై, ఎక్కిళ్ళుగా మారి ఆమె ముసురుపట్టిన వేళ సముద్రపుఘోషలా ఏడుస్తుంది. ఏళ్ళుగా ఒకే చూరుక్రింద అపరచిత వ్యక్తితో సాగిస్తున్న కాపురమనే జీవితం ముగిసి, ఇన్నేళ్ళుగా కనబడకుండానే తన స్వేచ్ఛను మింగేసిన గాలిసంకెళ్ళు తెగిపోయి, ఏనాడో పోగొట్టుకున్న తను తనకి దొరికిన కంగారులో దారితప్పి కూడలిలో నిల్చున్న పసివాడిలా దిక్కుతోచక ఏడుస్తుంది. ఆ దుఖం ఆమెను తేలికపరుస్తుంది. అంతకంటే ఎక్కువగా ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇప్పుడు రజనమ్మ సంగతేంటి ఉదయ్‌బాబుతో వెళ్ళిపోతుందా ఎవరో అడిగారు. “లేదు ఇక్కడే ఉంటాను” అంత దుఃఖంలోనూ తనలో తను చెప్పుకుంది. అవును ఇన్నేళ్ళూ తన బ్రతుకు తను బ్రతకలేకపోయిందిగా. సముద్రం మధ్యలో కురిసి కరిగిపోయిన మేఘం గాలివాటానికి చివరిచుక్కలతో తీరం వైపుసాగింది.

కాటికాపరి కొడుకు వాడి కొత్త నోటుబుక్కులో నుండి రెండు తెల్లని అందమైన కాగితాలు చింపి ఏంటో వ్రాసాడు. బరబరా గీతలు గీసి కాసేపు ఆడుకుని అక్కడే నా చితిమంటల్లో వేసాడు. కాగితం కాలి దాని పైన అ పిల్లాడు గీసిన అక్షరాలు కాసేపు మెరిసాయి. గట్టిగా వీచిన సాయంత్రం గాలికి కాలిన ఆ కాగితం బూడిదై ఎగిరింది.

ఉన్నాయో లేదో తెలియని లోకాలను చూపి, జరిగాయో లేదో తెలియని జ్ఞాపకాలతో తడిపి, నన్ను నడిపిన ఆమెను కలవకుండానే అర్ధాంతరంగా ముగిసిన ఆత్మకథలా నేను ఆనంతంలో లీనమయ్యాను.

ఆనంద్‌వర్మ

రంగు రంగుల పానీయాలు అందమైన గాజు గ్లాసుల్లో హొయలొలికిస్తున్న ఆ పార్టీలో రంగు రంగుల మనస్తత్వాలను గమనిస్తూ కూర్చుంది తన్మయ. ఆ ఆనందాల వెనక, కేరింతల వెనక, చిందుల వెనక మరుగునపడిన మర్మాలేవో చదువుతున్నట్టుగా శ్రద్ధగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా చిన్న వయసులో తనకి అలవడిన ఈ పరిశీలన చివరికి తనని సైకియాట్రీ చదివేదాక ఒదిలిపెట్టలేదు. సిటీలో కొత్తగా ప్రాక్టిస్ కూడా మొదలుపెట్టినా తనకి పెద్దగా జాబ్ సాటిసిఫేక్షన్ లేదు. తన దగ్గరకొచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా కార్పొరేట్ అఫీసుల్లో ఒత్తిడులు తట్టుకోలేక వచ్చేవాళ్ళును. అప్పటికీ కార్పొరేట్ స్కూల్స్‌లో, కాలేజుల్లో అవగాహన సదస్సుల పేరిట సంతృప్తి వెదుక్కుంటున్నా ఇంకా ఏదో వెలితి. మనుషుల ఆలోచనలకు మూలమైన మనసులను చదవాలని, వ్యక్తిత్వాల పుట్టుక రహస్యాలు తెలుసుకోవాలని తపన.

పార్టీలో చిన్న అలజడి మొదలయ్యేసరికి ఏమిటన్నట్టు ఆసక్తిగా చూసింది. ఒక కొత్త వ్యక్తిని తీసుకుని రాజేష్ పార్టీలో అడుగుపెట్టాడు. ఆ కొత్త వ్యక్తికి ముప్పై రెండేళ్ళు ఉంటాయేమో. బంగారు రంగు చాయతో, ఎత్తుగా బలంగా ఉన్నాడు. కళ్ళు మత్రం బేలగా ఫిష్ ట్యాంకులో గోల్డ్‌ఫిష్‌లా పదే పడే అటు ఇటూ కదులుతున్నాయి. రూపానికి తగ్గ ఆత్మ విశ్వాసం లేదు అనుకుంది తన్మయ. అతని బట్టలు, అలంకరణలు చూసి ఒంటరిగా ఉండే తత్వం అని పసిగట్టింది. తల ఎత్తి ఎవరిని చూడకుండా రాజేష్‌నే అనుసరిస్తున్న పద్దతిని గమనించి ఆత్మన్యూనత కూడా ఉంది అనుకుంది. ఒకే కమ్యూనిటీలో చిన్నప్పటి నుండి ఆటలాడుకుంటూ, చదువుకుంటూ వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులంతా ఏడాదికోమారు ఇలా కలిసి పార్టీ చేసుకోవటం అలవాటు. ఈ పార్టీల్లో ఒక్కోసారి కొందరు తమ పరిచయస్థులని తీసుకుని వస్తూ ఉంటారు. అందుకే తన్మయ పెద్ద ఆసక్తి కనబరచ లేదు.

రాజేష్ ఆ మనిషిని కాస్త దూరంలో కూర్చుండబెట్టి తన్మయ దగ్గరకి వచ్చాడు. ఆ వ్యక్తిని చూపించి తన పేరు ఆనంద్ వర్మ అని తన స్నేహితుడని చెప్పాడు. తన్మయ సహజంగా పరిచయం చేస్తున్నాడేమో అన్నట్టు చూసి ఊరుకుంది. “తనని ఇక్కడికి తీసుకు వచ్చింది నీకు పరిచయం చేద్దామనే” అన్నాడు రాజేష్.

“చిన్నప్పటి నుండి చాలా తెలివైన వాడు. కాలేజ్ చదువు చదవకపోయినా. చాలా చదివాడు. ఇంటిలో పేద్ద లైబ్రరీ ఉంది. ప్రపంచంలోని రాచరికాలు, ప్రపంచ విప్లవాలు, సాహిత్యం దేని గురించైనా అనర్ఘలంగా మాట్లాడగలడు. ఇంత నాలెడ్జ్ ఉండీ దానిని వినియోగించుకోడు” అని తన్మయ వైపు చూసాడు.
“ఉపయోగించకపోవటం అంటే?” అని అడిగింది తన్మయ. ఇది సాదారణ సమస్యే అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలు ప్రతి మనిషి పరిగెట్టేది ఏదో నేర్చుకోవాలని లేదా ఏదో సాధించెయ్యాలని. నిజమైన జ్ఞానాన్ని సంపాదించిన మనిషికి కొత్తగా నేర్చుకోవటానికి ఏమీ ఉండదు, ఏదో సాధించేద్దామనే ఆసక్తి ఉండదు.

రాజేష్ చెప్పటం కొనసాగించాడు. “సరిగ్గా తనకి పదేళ్ళున్నప్పుడు తన తల్లిదండ్రులు కారుప్రమాదంలో చనిపోయారు. బంధువులు ఆనంద్‌ని హాస్టల్‌లో జాయిన్ చెయ్యాలనుకున్నారు. కానీ ఆనంద్ అందుకు ఒప్పుకోలేదు. ఆ వయస్సు నుండి తను ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. తనే వంట చేసుకునేవాడు. తనే ఇంటి పనులన్నీ చేసుకునేవాడు. బంధువులు మొదట్లో కంగారుపడినా తర్వాత అలవాటు పడిపోయారు. తోటివారితో పెద్దగా కలిసేవాడు కాదు. నాతో బానే ఉంటాడు, కానీ కొత్తవారితో తొందరగా కలవడు. ఇల్లు దాటి బయటకు రావటానికి ఇష్టపడడు. తన ఇంటికి ఎవరిని ఆహ్వానించడు. కాస్త స్థితిమంతుడవ్వటంతో ఇంతవరకూ ఏ ఇబ్బంది కలగలేదు. ఇకనైనా మారకపోతే ముందు ముందు బ్రతుకు గడవటం కష్టం. అది వాడికి తెలియటం లేదు. ఏదో మానసిక సమస్యే అయ్యుంటుందని నా అనుమానం. డాక్టర్ అంటే రాడని ఇలా పార్టీకి తీసుకు వచ్చాను.”

రాజేష్ మాటలు వింటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన షాక్‌లో తనకి ఇలాంటి సమస్య వచ్చుంటుందని అనుకుంది తన్మయ. రాజేష్ వెంట నడిచింది.రాజేష్ స్నేహితులని పరిచయం చేస్తున్నట్టుగా తన్మయను పరిచయం చేసాడు. అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. మాటల మధ్యలో చరిత్ర, జ్యోతిష్యం తనకిష్టమైన విషయాలని చెప్పాడుఆనంద్. జ్యోతిష్యం ఒక ట్రాష్ అని మనుషుల నమ్మకాలు, బలహీనతల్ని సొమ్ము చేసుకునే వ్యాపారమని తన్మయ కొట్టి పారేసింది.

“బౌతికంగా చూపించలేని ఒక మనస్సనే వస్తువును సృష్టించి, శాస్త్రీయంగా నిరూపించలేని సమస్యలని దానికి ఆపాదించి, కేవలం అంచనాలతో, స్వంత అవగాహనలతో మీరు చేసే వైద్యం శాస్త్రీయమని మీరు నమ్ముతున్నప్పుడు, ఖచ్చితమైన లెక్కలతో గణించే శాస్త్రాన్ని నేను నమ్మటం లో తప్పేంటి” అని సూటిగా తన్మయను చుస్తూ అడిగాడు ఆనంద్. తను అతని కళ్ళలోకి చూసేసరికి అతని కళ్ళు తిరిగి మీనాలయ్యాయి. ఇంత బేలగా కనిపిస్తున్న వ్యక్తి మాటల్లో అంత పరిశీలన అని ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది తన్మయ. తన ఆశ్చర్యాన్ని గమనిస్తూ “వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కేవలం అంచనాలు. ఆలోచనలు మాత్రమే నిర్దుష్టమైనవి, ఎవరూ తెలుసుకోలేనివి” అని నవ్వాడు. ఈసారి తన్మయకు కళ్ళు బైర్లు కమ్మాయి. అతను తన మనస్సు చదివేసాడు. తన్మయకొక క్షణం భయం, ఆందోళన కలిగాయి. ఇన్నేళ్ళ తన చదువుకి లొంగని దృడమైన ఆలోచనలేవో అతని వద్దున్నాయి అనిపించింది. తన్మయ స్నేహితులు కొందరు అటుగా వచ్చేసరికి ఆనంద్ తిరిగి బేలగా మారాడు. పార్టీ ముగిసి ఆందరూ వెళ్ళిపోయారు. తన్మయ రాజేష్‌తో తర్వాత మాత్లాడతా అని చెప్పి వచ్చేసింది.

ఇంటికొచ్చినా తన్మయ ఆలోచనలు ఆనంద్ చుట్టూనే తిరుగుతున్నాయి. మర్నాడు క్లినిక్ వెళ్ళకుండా రాజేష్‌ని అడిగి ఆనంద్ అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది. చుట్టూ పెద్ద తోట మధ్యలో రాజ్‌మహల్లా ఉంది ఆ ఇల్లు. పనివాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. ఇంత పెద్ద బంగళాని పనివాళ్ళు లేకుండా ఒంటరిగా నెట్టుకొస్తున్నాడా అని ఆశ్చర్యపడింది తన్మయ. తోట దాటి బంగళా లోకి వచ్చి తలుపుకొట్టింది. తలుపుకొట్టిన చాలాసేపటికి ఆనంద్ వచ్చి తలుపుతీసాడు. ఒకింత ఆశ్చర్యంగా తనవైపు చూసాడు.
“ఈరోజు క్లినిక్‌కి వెళ్ళాలనిపించలేదు. కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాను. మీకభ్యంతరం లేకపోతేనే” అని అడిగుతూ అతని కళ్ళల్లోకి చూసింది తన్మయ. అతను కళ్ళు పక్కకు తిప్పుకుని దారి వదిలాడు. తన్మయ లోపల అడుగుపెట్టి అతడిని అనుసరించింది.

ఇల్లంతా పురాతన రాజప్రసాదంలా ఉంది. చెక్కతో చేసిన సోఫాలు, కుర్చీలు, పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్‌లు అంతా ఏదో మ్యూజియంలా ఉంది. నా ఆలోచనలు పసిగట్టిన ఆనంద్ తమది రాజవంశమని, తమ వంశ పెద్దలు విజయనగర ప్రభువుల దగ్గర దివానులుగా పని చేసేవారని చెప్పాడు. ఆశ్చర్యంగా ఇల్లంతా కలియతిరిగింది తన్మయ. పెద్ద పేద్ద  డైనింగ్ టేబుల్లు, పెద్ద లైబ్రరీ అన్నింటిని చిన్నపిల్లలా సంబ్రమంగా చూస్తున్న తన్మయను చూసి ఆనంద్ నవ్వుకున్నాడు. అతనికి తన్మయ దగ్గర బెరుకుపోయింది. అలా చూస్తూ పూజగది దగ్గరకు వెళ్ళిన తన్మయను ఆపేసి వెనక్కు తీసుకు వచ్చేసాడు ఆనంద్.

ఆరోజు నుండీ రోజూ తన్మయ ఏదో ఒక సమయంలో ఆనంద్ ఇంటికి వెళ్ళేది అతడితో కబుర్లు చెప్పేది. ఒకరోజు లైబ్రరీలో ఝాన్సీ లక్ష్మీభాయ్ చరిత్ర పుస్తకాన్ని చూసి “ధీరవనిత, తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు కదా” అంది తన్మయ. ఆనంద్ ఏటో చూస్తూ “ఆరోజు జరిగిన విప్లవానికి ప్రధాన కారణం మత విశ్వాసాలు, రాజ్య సింహాసన రక్షణ. కానీ విచిత్రంగా చరిత్రలో మొదటి స్వాతంత్ర్యసమరంగా వక్రీకరించబడింది. ప్రజాస్వామయయుత స్వాతంత్ర్యాన్ని నిజానికి ఏ రాచరికం కోరుకోలేదు” అని చెప్పాడు.

అతనితో జరిపే సంభాషణలు ఆమెకు కొత్త పాఠాలు నేర్పేవి. చరిత్రను పుస్తకాల్లో వ్రాయబడ్డ కథల్లా కాక వాస్తవిక దృష్టితో చూడటం నేర్పేవి. అందుకే తన్మయ వీలు చిక్కినప్పుడల్లా ఆనంద్‌ని కలిసేది. అంత చనువులోనూ ఆనంద్ తన ఇంటిలో కొన్ని గదుల్లోనికి తన్మయను రానిచ్చేవాడు కాదు. ఏదో రహస్యం దాస్తున్నాడని ఆమెకు అనిపించేది. ఒకరోజు ఆనంద్ తోటపనిలో ఉండగా తన్మయ నేరుగా ఇంటిలోకి వచ్చింది. లైబ్రరీలో పుస్తకాల కోసం చూస్తున్న తన్మయకు ఒక పాత డైరీ కనిపించింది. లోపల చూస్తే చిన్నపిల్లల చేతివ్రాతతో డైరీ వ్రాయబడి ఉంది. తన్మయ ఆ డైరీని తన బ్యాగ్‌లో వేసుకుని ఆనంద్ కంటపడకుండా వచ్చేసింది.

ఆ డైరీ ఆనంద్ తల్లిదండ్రులు చనిపోక ముందు వ్రాసుకున్నది. పుట్టినరోజుకి తండ్రి తనకు డైరీ బహుమతిగా ఇచ్చాడని, ప్రతిరోజు వ్రాయమని చెప్పాడని అందులో వ్రాసుకున్నాడు ఆనంద్. పేజీలు తిప్పుతూ ఉంటే ఆనంద్‌కి తనతండ్రి చెప్పిన రాజులకధలు ఉన్నాయి. కోట నుండీ రహస్య మార్గాలు, సొరంగ మార్గాల్లో నిధినిక్షేపాలు, కోట ముట్టడి జరిగినప్పుడు వారసులని రహస్యంగా కోటదాటవేయడాలు ఇలాంటి విషయాలు తన తండ్రి దగ్గర విని ఎంతో ఆసక్తిగా వ్రాసుకున్నట్టు తన్మయకు అర్ధమయ్యింది. విజయనగర ప్రభువులు దగ్గర ఆనంద్ వంశ పెద్దలు దీవానులుగా చూపిన తెగువ, యుద్ధంలో ప్రభువు రక్షణ కోసం ప్రాణాలర్పించిన త్యాగాలు, శత్రువుల చేత చిక్కినప్పుడు రహస్యాలు బయటపెట్టకుండా చేసిన ఆత్మత్యాగాలు ఎంతో గర్వంగా వ్రాసుకున్నాడు.

అన్నీ ఆసక్తిగా చదువుతున్న తన్మయకు ఒక పేజి ఎర్ర సిరాతో కనిపించింది. “నాన్న ఈరోజు నాకొక రహస్యం చెప్పారు. విజయనగర ప్రభువుల రహస్యమొకటి మా దేవుడిగదిలో భద్రంగా దాచబడిందని, దాని రక్షణ మా కుటుంబ కర్తవ్యమని చెప్పారు. ఆ రహస్యం తెలుసుకోవటానికి గూఢచారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మా ఇంటి పనివాళ్ళలో కూడా శతృ గూఢచారులుండొచ్చని నాన్న అనుమానం. నాన్న తరువాత ఆ బాధ్యత నాదేనంట” అని వ్రాసి ఉంది.

తన్మయకు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగాయి. అందుకే ఆనంద్ నన్నెప్పుడూ దేవుడి గది వైపు వెళ్ళనీయలేదు అనుకుంది. తరువత పేజి తిప్పి చూసింది “ఈ రోజు నాన్న, అమ్మ వెళ్తున్న కారుని శత్రువులు లారీతో గుద్దేసారు. ప్రభువుల కోసం ప్రాణత్యాగం చేసిన నాన్న మా వంశకీర్తిని కాపాడాడు. ఇక పైన భాద్యతలన్నీ నావే” అని వ్రాసుకున్నాడు ఆనంద్. అదే చివరిపేజి.

తన్మయ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తనకు పరిచయం లేని ఏదో వింతలోకంలోకి వచ్చిపడ్డట్టుగా అనిపించింది ఆమెకు. వెంటనే రాజేష్‌కి ఫోన్ చేసి “ఆనంద్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారని” అడిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పాడు రాజేష్. “ఆ రోడ్డు ప్రమాదం వెనుక మిస్టరీ ఉంది” అని చెప్పింది తన్మయ. “నీకెలా తెలుసు” అని అడిగాడు రాజేష్. తన్మయ తను చదివిన విషయాలన్నీ చెప్పింది రాజేష్‌కి. రాజేష్ నమ్మలేనట్టుగా మాట్లాడేసరికి ఫోన్ పెట్టేసింది.

ఆ రోడ్డు ప్రమాదం రహస్యాలు తెలుసుకోవాలని బలంగా అనుకుంది తన్మయ. వృత్తి రిత్యా కొన్ని సందర్భాల్లో పోలీసు కేసుల్లో తన్మయ సహాయం చేసింది. అప్పటి నుండి పోలీస్ కమీషనర్ తన్మయని ఎంతో ఆదరంగా చూస్తాడు. ఆ కమీషనర్ సహాయం తీసుకుంటే రోడ్డుప్రమాదం కేసు తిరిగి తోడచ్చని అనుకుంది. మరుసటిరోజు ఉదయం కమీషనర్ దగ్గరకి వెళ్ళి తను వచ్చిన పని చెప్పింది తన్మయ. కమీషనర్ నవ్వి “నువ్వు చెప్పేదంతా ఏదో చందమామ కథలా ఉందమ్మా” అంటుండగా అతనికి ఫోన్ వచ్చింది. అతను షాక్ గురయినట్టు మొహం పెట్టి “ఎంత యాధృచ్చికమో చూసావా తన్మయ? ఆ ఆనంద్ ఇంటిలో దొంగలుపడ్డారంట, అతనికి కత్తి గాయాలయ్యాయంట. అదే ఫోన్. పదా” అంటూ తన్మయను తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరాడు కమీషనర్. తన్మయ కూడా షాక్‌లో ఉంది ఇన్నేళ్ళుగా ఆనంద్ ఒంటరిగా ఉన్నా ఎప్పుడూ జరగని దొంగలదాడి ఈరోజే ఎందుకు జరిగింది? తను ఈ రహస్యం బయటపెట్టడం వలన ఈ ప్రమాదం జరిగిందా? అవును రాజేష్. రాజేష్ శత్రువుల గూఢచారా? ఆలొచనలతో తన్మయ బుర్ర పగిలిపోతుండగానే హాస్పిటల్ వచ్చింది.

కమీషనర్‌ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చిన పోలీసులు “దొంగలుపడి ఇల్లంతా గాలించినట్టు తెలుస్తుంది సార్. ఏదీ దొరక్క ఆనంద్‌ని గద్దించేసరికి, ఆనంద్ బయపడి తన మెడ తనే కోసుకున్నాడు. పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని” చెప్పారు. తన్మయ పెదాలు ఆప్రయత్నంగా కదిలాయి “ప్రభువులకోసం ఆత్మత్యాగం”

ఐ.సి.యు.లో ఉన్నా అనంద్‌ని చూస్తే తన్మయకు దుఃఖం ఆగటంలేదు. కమీషనర్ తనని సముదాయించి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇంటికి కారులో బయల్దేరిన తన్మయ ఒక్కసారిగా కారు వెనక్కి తిప్పి ఆనంద్ ఇంటికిపోనిచ్చింది. ఇంతమంది ప్రాణాలు తీసిన ఆ రహస్యం ఈరోజు బయటపడాల్సిందే అని పిచ్చికోపంతో ఊగిపోతూ సరాసరి ఆనంద్ పూజగదిలోకి వెళ్ళింది. ఎన్నో రోజులుగా పూజ లేక బూజుపట్టిన ఆ గదిని చిందర వందర చేస్తూ వెతకసాగింది. ఆఖరికి దేవీపీఠం క్రింద ఒక చిన్న పెట్టె దొరికింది. దాని చుట్టూ ఒక తెల్ల గుడ్డ చుట్టి ఉంది. దాని మీద రహస్యం అని వ్రాసి ఉంది. పిచ్చి పట్టినదానిలా ఆ తెల్ల గుడ్డని పీకి పారేసింది తన్మయ. పెట్టె తీయగానే అందులో ఒక వజ్రపుటుంగరం, ఒక ఉత్తరంకనిపించాయి. ఉత్తరం తెరిచింది.

“ఆనంద్ బాబూ, నీకు ఇరవయ్యవ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇన్నేళ్ళుగా రహస్యం అని నీకు చెబుతున్నది ఈ ఉంగరం గురించే. కాకపోతే ఇది విజయనగర ప్రభువుల రహస్యం కాదు. మన ఇంటి రహస్యమే. ఈ ఉంగరం నేను మీ అమ్మకు చదువుకునే రోజుల్లో ఇచ్చిన మొదటి బహుమతి. తరువాత మీ అమ్మ నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం.  అందుకే ఇది మన ఇంటి లక్కీ చార్మ్. ఈరోజుతో నీకు ఇరవై నిండాయి కాబట్టి ఇకపై నీ స్వంత ఆలోచనలు నీకు ఉంటాయి. నీ మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఉంగరం బహుమతిగా ఇవ్వు. ఆ అమ్మాయి తప్పక నిన్ను పెళ్ళి చేసుకుంటుంది. ఈ ఉంగరం మన ఇల్లు దాటి వెళ్ళదు. కేవలం నిన్ను థ్రిల్ చేద్దామనే ఇన్నేళ్ళుగా ప్రభువుల రహస్యం అని కథ చెప్పి నిన్ను నమ్మించా. ఎలా ఉంది ఈ సర్‌ప్రైజ్? వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే”

తన్మయకు తల తిరిగింది, మాటలు ఆలోచనలు ముందుకు సాగటం లేదు. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆమె సెల్‌కి మెసేజ్ వచ్చింది. నంబర్ చూస్తే పోలీస్ కమీషనర్. మెసేజ్ ఒపెన్ చేసింది

“ఆనంద్ ఈజ్ నో మోర్”

మెలకువలో కల

అప్పుడే తెల్లవారుతున్నట్టుంది. బాల్కనీ నుండి మంద్రంగా వచ్చే సాగర ఘోష నెమ్మదించి, వాహనాల చప్పుడు మొదలయ్యింది. మగత నిద్రలో ఉన్న నాకు కాస్త కాస్తగా మెలకువ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే బాల్కనిలో గోడ మీద కూర్చుని తేజ బీచ్ వైపు చూస్తున్నాడు. వీడికి ఇదేం పిచ్చో ఎప్పుడూ ఆ సముద్రాన్నే చూస్తూ ఉంటాడు అనుకుంటూ లేచాను. కళ్ళు నులుపుకుంటూ, తలుపు తీసుకుని బాల్కనీలోకి వచ్చి”ఏరా తేజా, కాస్త కాఫీ అయినా కలుపుకున్నావా? పొద్దున్నే మొదలెట్టావా” అని అడిగాను. ఏదో పరధ్యానంలో ఉన్నాడో ఏమో అలా నేను హఠాత్తుగా వచ్చి అడిగేసరికి తుళ్ళిపడి గోడ మీద నుండి తూలాడు. కళ్ళల్లో ఏదో కంగారు, బెదురు కనిపిస్తున్నాయి. గోడ మీద నుండి తూలిన వాడు పడిపోతాడేమోనని ఒక్క దూకులో వాడిని అందుకోబోయాను. కానీ పట్టు దొరకలేదు. నా చేతి నుండి ఏదో పొగ జారిపొయినట్టుగా జారిపోయాడు. అయోమయంగా వాడి వైపు చూసాను. వాడు గోడ మీదే ఉన్నాడు స్థిరంగా. నా వైపు వింతగా చూసాడు. నేను నా చేతి వైపు చూసుకుంటూ ఉండగానే సూది గుచ్చినప్పుడు చురుక్కుమనే మంటలా, చప్పున నాకు మూడురోజుల క్రితం జరిగినవి గుర్తొచ్చాయి. నిద్ర మత్తు పూర్తిగా వదిలి తెలివొచ్చింది.

గుండెలు దడదడా కొట్టుకోవటం మొదలయ్యింది. చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు తడారిపోయింది. కళ్ళు నాకు తెలియకుండానే భయంతో పెద్దవిగా అయిపోయాయి. వాడింకా అలానే వింతగా నా వైపు చూస్తున్నాడు. ఇప్పుడు స్పష్టంగా తేజ శరీరమంతా ఒక తేజస్సులా కనిపిస్తుంది. మనిషి వెలిగిపోతున్నాడు. నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం చనిపోయిన తేజ ఇలా బాల్కనీలో ఎలా కనిపిస్తున్నాడు? భయంతో గట్టిగా అరవాలనిపిస్తుంది, పిచ్చిగా పరిగెట్టాలనిపిస్తుంది కానీ నా శరీరంలో ఏ అవయవం సహకరించటం లేదు. నాలో కలిగిన అలజడి వాడికి అర్ధమయినట్టుంది. బాధపడుతూ తలదించుకున్నాడు.

వెంటనే బాల్కనీ తలుపు దడేల్‌మని వేసేసి పారిపోదామనిపించింది. కానీ వాడి మొహంలో విచారం చూసి అలా పారిపోతే ఏమనుకుంటాడో అని మనసు పీకుతుంది. ఏమన్నా అనుకోని వాడిప్పుడు బ్రతికిలేడు ఆ విషయం మొదట బుర్రకెక్కించుకో అని నా లోపల ఎవరో అరుస్తున్నట్టుగా ఉంది. వాడు తల ఎత్తి నా వైపు చూసాడు. నా కళ్ళల్లోకి సూటిగా చూసాడు. వాడి చూపు తీక్షణత నా మనసుని తాకగానే నా గుండెకొట్టుకోవటం ఆగింది.

ఎవరో అప్పుడే దభ్ దభ్‌మని తలుపు కొట్టారు. బయట మరోమనిషి ఉనికి నా ఊహకు అందేసరికి నా గుండె తిరిగి కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇదే అదనుగా నేను అక్కడనుండి పరిగెట్టుకుంటూ వచ్చేసి కంగారుగా తలుపుతీసాను. ఎప్పుడూ ఏ పనీలేకపోయినా వచ్చి విసిగించే ఎదురింటి ప్రియ మొదటిసారిగా ఈరోజు నాకు నచ్చింది. లోపలికి రమ్మన్నట్టుగా నేను తనకి దారిచ్చాను. కానీ నా చూపింకా బాల్కనీ వైపే ఉంది. భయంతో నిలువెల్లా తడిచిపోయి, వగరుస్తున్న నన్ను చూసి “ఏమయ్యింది? ఏం చేస్తున్నావ్? ఎందుకలా తడిచిపోయావ్? జిమ్ చేస్తున్నావా?” అంటూ ప్రియ ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంది. నేను కాదన్నట్టు తల అడ్డంగా ఊపటం తప్ప మాట్లాడలేకపోతున్నా.

తను ఏమనుకుందో ఏమో “సరే అయితే నేను తర్వాత వస్తాను” అని లేవబోయింది. “వద్దు” అంటూ చప్పున లేచి ప్రాధేయపూర్వకంగా తన చేతులు పట్టుకున్నాను. ఎప్పుడు తనొచ్చినా విసుక్కునే నేను ఇలా ప్లీజింగ్‌గా ఉండమనటమేంటో అర్ధంకానట్టు మొహంపెట్టి నా వైపే చూస్తూ కూర్చుంది. తన ఆలోచనలు అర్ధమయ్యి, నేను కాస్త తేరుకుని మామూలుగా ఉండే ప్రయత్నం చేసాను. ప్రియ కూడా మామూలయ్యి ఏవో తన కాలేజ్ కబుర్లు చెబుతూ ఉంది.నా చెవికి ఏం ఎక్కటం లేదు. నా చూపు, ఆలోచనలు ఇంకా బాల్కనీ దగ్గరే ఉన్నాయి. తేజ నాకే కనిపిస్తున్నాడా? లేక ప్రియకి కూడా కనిపిస్తాడా? లేదా ఇదంతా నా భ్రమ? నేనసలు నిద్ర నుండి లేచానా లేదా? ఏం అర్ధం కాని అయోమయంలో ఉన్నాను.

బాల్కనీ నుండి వాడు లోపలికి రాలేదు. నేను వంగి చూసాను. ఆ గోడ మీద తేజ లేడు. కంగారు కొంత కొంతగా తగ్గి ఇదంతా భ్రమేమో అని నా మనస్సుకి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతలో నా బెడ్ రూమ్‌లో ఎవరో మసలుతున్నట్టుగా స్పష్టంగా నాకు తెలుస్తుంది. కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో చెవులు రిక్కించి ప్రతి చిన్న శబ్దంవింటున్నాను. నాకు బాగా పరిచయమున్న అడుగులే అవి తెలుస్తున్నాయి. ఇది నిజమే అని నాకు బాగా అర్ధమయిపోయింది.

ప్రియ లేచి “మూర్తీ నాకు బోర్‌గా ఉంది బయటకు వెళ్దామా?” అని అడిగింది. తను గతంలో ఎన్నోసార్లు ఇలా అడిగింది. కానీ ఇదే మొదటసారి నేను సరే అనటం, అది కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని లేచాను.
“చీ ఇలానేనా వెళ్ళేది?” అంది ప్రియ.
నా వైపు నేను చూసుకున్నాను. బట్టలు మాసి ఉన్నాయి. కనీసం మొహం కడగలేదు.
“వెళ్ళి కాస్త రెడీ అవ్వు” అని తోసింది ప్రియ.

నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాత్రూమ్‌లోకి వచ్చాను. నిజానికిప్పుడు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండటానికి ధైర్యం సరిపోవటం లేదు. అలాంటిది బాత్రూంలో తలుపులు బిగించి ఒక్కడినే, నాకు తిరిగి కంగారు, భయం మొదలయ్యాయి. మొహం పై నీళ్ళు చల్లుకునే ఒక్క క్షణం కూడా కళ్ళు మూసుకోవాలంటే భయంగా ఉంది. మూసుకున్న కళ్ళు తెరిచే ప్రతిసారి ఏం కనపడుతుందో అని కంగారుగా ఉంది. మొత్తానికి బెరుకుగానే చుట్టూ చూసుకుంటూ రెడీ అయ్యి బయటకి వచ్చాను. వస్తూనే ప్రియ చెయ్యందుకుని పరుగులాంటి నడకతో ఇంటి బయటపడ్డాను.

సాయంత్రం వరకూ ఇంటికి రాకుండా ఊరంతా తిరిగి వచ్చాం. ఎక్కడ తిరుగుతున్నా నా మనసంతా ఒకటే ధ్యాస “ఇదెలా సాధ్యం? దెయ్యాలున్నాయా? ఉంటే ఇంతకుముందెప్పుడూ ఎందుకు కనిపించలేదు? అయినా తేజకి నా మీద పగో,ప్రతికారమో ఉండే అవకాశం లేదు. మరలాంటప్పుడు నేనెదుకు భయపడటం? అయితేమాత్రం దెయ్యాలకి ఈ విచక్షణ ఉంటుందా?” అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను.

ఇంటికి వస్తుంటే కాంపౌండ్ వాల్ మీద కూర్చుని బీచ్ వైపే చూస్తూ తేజ. నా కాళ్ళక్కడే ఆగిపోయాయి. ప్రియ నా వైపు చూసి, నా చూపు ఆ గోడమీద ఆగిపోవటం గమనించి గోడ వైపు చూసింది. “ఏమయ్యింది మూర్తీ? అక్కడేం చూస్తున్నావ్?” అని అడిగింది. అంటే ప్రియకి ఏం కనిపించలేదు, నాకు మాత్రమే తేజ కనిపిస్తున్నాడు. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక ప్రియని ఇంటికి వెళ్ళమని చెప్పి నేను బీచ్ వైపు నడిచాను. తేజ నన్ను గమనించలేదు.

తేజ నేను గొప్ప స్నేహితులమేమీ కాదు. రూమ్ షేరింగ్ కోసం నేను నా ఫ్రెండ్స్ ద్వారా వస్తే, తనకు పరిచయమున్న వాళ్ళతో తేజ వచ్చాడు. అందరూ ఉద్యోగాలొచ్చి తలో దిక్కు ఎగిరిపోతే మా ఇద్దరం రూమ్మేట్స్ గా మిగిలాం. తన గురించి నాకు తెలిసింది కూడా తక్కువే. తనకి ఎవరూ లేరని, చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే ఊర్లో వాళ్ళ సహాయంతో పెరిగి డిగ్రీ వరకూ చదువుకున్నా అని ఒకసారెప్పుడో చెప్పాడు. నేను ఉదయాన్నే ఆఫీసుకి వెళ్ళిపోతే తను ఇంట్లోనే ఉండేవాడు. పత్రికలకి ఏవో రచనలు పంపేవాడు. ఆ వచ్చే పారితోషకమే అతని జీతం. ఆ కాస్త డబ్బులతో ఎలా బ్రతుకుతాడో అనుకునేవాడ్ని. కానీ అద్దె డబ్బులకి ఏనాడు ఆలశ్యం చేయలేదు. అలసి ఏ రాత్రికో నేను ఇంటికొస్తే నా చేతికి తాళాలిచ్చి తను వెళ్ళి బీచ్‌లో కూర్చునేవాడు. ఎప్పుడొచ్చి పడుకునేవాడో తెలిసేదే కాదు. చాలా విచిత్రమైన వ్యక్తి.

సరిగ్గా మూడురోజుల క్రితం ఏ తెల్లవారు జామునో బీచ్ నుండి తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు దాటుతుండగా పాలవ్యాన్ గుద్దేసిపోయింది. జాగింగ్ కోసం వచ్చిన జనాలు 108 కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి పంపారు. కానీ అప్పటికే చనిపోయాడు. తన వారెవరూ లేకపోవటంతో అంతిమ సంస్కారాలు నేనే పూర్తిచేసాను. తనుండగా ఇద్దరికీ పెద్ద అనుబంధం ఏం లేకపోయినా, తనుపోయాక నాకు కాస్త ఒంటరితనం తెలిసొచ్చింది.

ఈ ఆలోచనల్లో ఉండగా “మూర్తీ..” అనే ఎవరో గుసగుసగా పిలిచినట్టు గాలిలో తేలుతూ వచ్చింది. నేను కాస్త తుళ్ళిపడ్డాను. అది తేజ గొంతు అవును అతనిదే. ఎంతో ఎక్స్ ప్రెసివ్‌గా ఉండే గొంతు.

“భయపడకు మూర్తీ. నేను నిన్నేం చేస్తాను? అంతా అనుకోకుండా అయిపోయింది. తీరా చనిపోయాక స్వర్గానికో, నరకానికో తీసుకుని వెళ్ళటానికి ఎవరైనా వస్తారేమో అని చూసా. ఎవరూ రాలేదు. నువ్వు నా అంతిమ సంస్కారాలు చేసే వరకూ నా శరీరం వెనుకే తిరిగా. నేనే రెండుగా విడిపోయి, నన్నే నేను ఎదురుగా చూసుకోవటం అర్ధంకాని వింత అనుభవం.

అది ముగిసినప్పటి నుండి ఈ సముద్రం ఒడ్డునే గడిపా. ఇంకా ఎన్నిరోజులు ఇలా గడపాలో తెలియదు. తర్వాత ఏమవుతానో అసలే తెలియదు. ఎవరినైనా అడగాలంటే నాలానే ఈ సముద్రం ఒడ్డున, ఆ బస్‌స్టాప్‌లో, హాస్పిటల్లో చాలామంది దేనికోసమో ఎదురు చూస్తూ దిగులు మొహాలతో కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరకి వెళితే మౌనంగా చూస్తారే తప్ప ఏం మాట్లాడరు. మన చుట్టూ మనకి తెలియకుండా ఇంతమంది అదృశ్య వ్యక్తులున్నారని, వాళ్ళు మనల్ని చూస్తారని బ్రతికుండగా అసలెప్పుడూ ఊహించలేదు.

వాళ్ళందరి మొహాలు చూసి చూసి ఏ సమాధానం దొరక్క విసిగి మన గదికొస్తే, నువ్వు నాతో మాట్లాడావ్. నాకు ఆశ్చర్యం వేసింది. నా ఉనికిని నువ్వు గుర్తిస్తుంటే ఆసక్తి కలిగింది. అందుకే నీవెంట వచ్చా. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను రానులే” నాకు కనబడకుండా నేను కూర్చున్న రాళ్ళ వెనుక ఎక్కడో ఉండి చెబుతున్నాడు తేజ.

ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. కానీ భయం తగ్గింది. లేచి మౌనంగా నడుచుకుంటూ గదికి వచ్చేసా. నా మౌనాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడో తేజ నన్ను అనుసరించలేదు. కానీ రోడ్డు మీద నడుస్తుంటే తేజ చెప్పిన ఆత్మలు ఇక్కడే ఎక్కడొ ఉండొచ్చు, నన్ను గమనిస్తూ ఉండొచ్చు అనే ఆలోచన కాస్త కలవరపెడుతుంది. ఒళ్ళంతా జలదరిస్తున్న ఫీలింగ్.

పడుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర రాలేదు. లేచి తేజ పుస్తకాలు పెట్టుకునే గదిలోకి వెళ్ళాను. తను వస్తాడేమొ అని మనసులో కంగారు ఉన్నా ధైర్యం చేసి తన డైరీ తీసాను. బ్రతికుండగా తనేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. తన రచనలు కూడా ఎప్పుడూ చదవలేదు. తను కూడా ఎప్పుడూ చదవమని చెప్పలేదు. ఈరోజెందుకో తెలుసుకోవాలనే కోరిక కలిగింది.

“సముద్రమెంతటి జ్ఞానో, అందరికీ అన్నీ ఇచ్చీ ఎవ్వరితోనూ ఏ అనుబంధం పెట్టుకోదు” డైరీలో మొదటి వాక్యం. ఇప్పుడిప్పుడే ఒంటరితనమంటే ఏంటో తెలిసొస్తూ ఉండటం వల్లేమో ఈ అక్షరాలు నాకెంతో అర్ధవంతంగా తోచాయి. కలవరపెట్టే ఆ అక్షరాల వెంట నా కళ్ళు పరుగులు తీసాయి.

“ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు, నా తోడు రావు.

నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..”

“చెవులను తాకే ఈ అనంత ఘోష నీదా? నాలోనిదా? నీకెంత ధైర్యమో అలజడంతా పైకే చూపిస్తావ్”

“లక్షలమంది రోజూ పుడుతూ చనిపోతున్న ఈ జనారణ్యంలో ఎవ్వరికీ ఏమీ కాని నేను కూడా సముద్రాన్నే. ఎన్ని జీవాలు లోన ఈదుతున్నా, ఏన్ని నావలు పైన తేలుతున్నా సముద్రానికెవరు సొంతం?”

రాత్రంతా కూర్చుని ఆ డైరీ మొత్తం చదివాను. నా ఒంటరితనాన్ని ఆ అక్షరాలతో బేరీజు వేస్తే తేజ ఏ స్థాయి సంఘర్షణ అనుభవించాడో అర్ధమయ్యింది. తను సంపాదించే ఆ కాస్త జీతం తనకి ఎలా సరిపోయేదో అర్ధమయ్యింది. ఎవరూ లేరు రోజంతా మాట్లాడుకోవటానికి సముద్రం, ఆకలేస్తే నాలుగు మెతుకులు.

పొద్దున్నే లేచి తేజను వెతుక్కుంటూ బీచ్‌లోకి వెళ్ళాను. ఆ రాళ్ళ అంచున కూర్చుని సముద్రాన్నే చూస్తూ ఉన్నాడు.

రోజూ ఆఫీసు నుండి కాస్త ముందే వచ్చి తేజతో కాసేపు ఆ బీచ్‌లో గడపటం అలవాటు చేసుకున్నా. తను ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనకి కవిత్వమెలా అబ్బిందో చెప్పాడు. చంద్రునితో తన స్నేహం గురించి, నక్షత్రాలతో తన ఊసుల గురించి, ఆకాశంతో తనువేసుకున్న గొడవల గురించి. కానీ సముద్రం తో తనకున్న అనుబంధం గురించి చెప్పాల్సొస్తే తనకి మాటలు వచ్చేవి కావు. ఏదో తెలియని ఉద్వేగం కనిపించేది. అందులోనే నేను మాటలు వెతుక్కునేవాడ్ని. నా పక్కనే నాకు కనబడని లోకమొకటుందని అప్పుడే నాకు తెలిసింది.

అప్పటికి తేజ చనిపోయి ఒక పదిరోజులయ్యిందేమో. ఒకరోజు చాలా కంగారుగా గదికి వచ్చాడు. తన బట్టలపెట్టె తియ్యమని చెప్పి తనకెంతో ఇష్టమైన సీబ్లూ కలర్ షర్ట్ చూపించి నన్ను వేసుకోమన్నాడు. మొదట నేను కాస్త మొహమాట పడ్డా వేసుకోక తప్పలేదు. తన డైరీ తీసుకుని రమ్మన్నాడు. ఇద్దరం వెళ్ళి బీచ్‌లో కూర్చున్నాం. తను చెప్పేది నన్ను వ్రాయమన్నాడు. ఆ రోజు పౌర్ణమనుకుంటా నిండు కళలతో చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఆ వెన్నెలకాంతిలో సముద్రం అందానికి ఆవాసంలా కనిపిస్తుంది. తను తదేకంగా సముద్రాన్నే చూస్తున్నాడు. యుద్దానికి వెళ్ళే సైనికుడు తన ప్రియురాలి మోముని కళ్ళలో నింపుకుంటున్నట్టుగా. ఆ ఏకాగ్రతలో తనని చూస్తుంటే మరింత వెలిగిపోతున్నాడు. తన చుట్టూ గతంలో ఎప్పుడూ లేనంత కాంతివంతంగా ఆరా(aura) స్పష్టంగా తెలుస్తుంది.

“ఎందుకలా అలల చేతులతో తాకాలని నా దాకా వచ్చి

అంతలోనే మరలిపోతావ్.

నా పాదాలు తాకగానే నీ ఆత్రం తీరిపోయిందేమో,

మరి నా ముద్దు చెల్లొద్దా?

అంతంలేని మన ప్రణయంలో

అంతరాయానికా ఈ ఆటలు?

నాకు తెలుసు మనిద్దరం శాశ్వతం”

అని చెబుతూ చప్పున ఆగాడు. వ్రాస్తున్న నేను ఆ ప్రవాహం ఆగిపోవటం నచ్చక తన వైపు బాధగా చూసాను. నా చేతుల్లో కాగితం గాలికి ఎగురుతూపోయింది. తేజ ఏవో అక్షరాలకోసం ఇంకా వెతుక్కుంటున్నాడు. నేను ఎగిరిపోయిన కాగితం వెంట పరిగెత్తాను.

ఒక అమ్మాయి ఆ కాగితాన్ని పట్టుకుని నాకు ఎదురొచ్చింది. పలకరింపుగా నవ్వుతూ ఆ కాగితాన్ని నా చేతికిచ్చింది. నేను కాగితం వైపు చూసాను.

“నాకు తెలుసు మనిద్దరం శాశ్వతం

ఈ కాలాలు, రూపాలు కేవలం ఈ ఆటలో తప్పని నియమాలు” అని కవిత పూర్తి చేసి ఉంది. నేను తనవైపు ఆశ్చర్యంగా చూసాను.

“క్షమించండి చొరవచేసి మీ కవితలో చొరబడినందుకు. నచ్చకపోతే మార్చెయ్యండి” అని నవ్వింది.

నేను తేజ కూర్చున్న వైపు చూసాను తేజ లేడు. చుట్టూ చూసాను ఎక్కడా కనిపించలేదు. కంగారుగా ఆ అమ్మాయి వైపు చూసాను. తేజలో ఎప్పుడూ కనిపించే ఆరా(aura) తన చుట్టూ కనిపించింది.

నా కంగారుని తను ఎలా అర్ధం చేసుకుందో “క్షమించండి నా పేరు సాగరిక. నేను చాలాకాలంగా మిమ్మల్ని గమనిస్తున్నా. మిమ్మల్ని దగ్గర నుండి ఎప్పుడూ చూడకపోయినా నాకెంతో ఇష్టమైన ఈ సీబ్లూ కలర్ షర్ట్ లో ఎన్నో సాయంత్రాలు మీరిలా వెన్నెల్లో సముద్రాన్ని ఆస్వాదించటం చూసాను. నాలాగే సముద్రాన్ని ప్రేమించే మరో మనిషున్నాడని అనుకునేదాన్ని. ఈరోజు ఈ కవిత చూసాక అచ్చంగా నా అంతరంగం అనిపించింది. మీతో మాట్లాడి తీరాలనిపించింది. ఇక నుండీ నేను కూడా మీతో వెన్నెల్లో సముద్రాన్ని షేర్ చేసుకోవచ్చా” అని అడిగి ఆశగా నావైపు చూసింది. ఆ అందమైన వెన్నెల్లో సముద్రం ఒడ్డున తన అందమైన కళ్ళను చూస్తూ అలా నిల్చుండిపోయాను.

సంపంగి నూనె

తెరచిన గుమ్మం తలుపుల నుండి ఉదయకాంతి, లోపలికి రావచ్చో లేదో అని తటపటాయిస్తూ ఉంది. సప్తపది సినిమా పాటలు పెట్టి కాఫీ గ్లాసుతో గడప దగ్గర కూర్చున్నా. రాత్రి కమ్ముకున్న పొగమంచు ఇంకా పూర్తిగా తొలగలేదు. వీధిలోకి చూస్తే అంతా మసకమసకగా కనిపిస్తుంది. ఎదురింటిలో పంతులమ్మగారి మనవరాలు పొందిగ్గా కూర్చుని ముగ్గులేస్తుంది. రోజూ పొద్దున్నే ఇంటిలో ఎవరూ లేవక ముందే కాసేపు ఇలా గుమ్మంలో కూర్చుని గడిపే గంట మాత్రమే నాది. మా ఆయన మిస్టర్ లేజీ, నా కూతురు రాకాసి రాజీ నిద్ర లేచారా నా పరుగు మొదలవుతుంది. ఇక రాత్రి నిద్రపోయే దాకా ఇల్లు అలికే ఈగలా నా పేరేంటో కూడా గుర్తు రాదు.

“ముందు తెలెసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా మంధమతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో” అంటూ నా ఫోను పాటందుకుంది. ఆ గోలకి లోపల ఎవరూ లేవకుండా ఒక్క పరుగున లోపలికి వెళ్ళి ఫోనందుకున్నా.

“హలో, ఏవే యమున, బాగున్నావా? నేనే లతని. ఎక్కడుంటున్నావ్? పెళ్ళయ్యాక అసలు పత్తా లేకుండా పోయేవు. ఉద్యోగం వచ్చినా మానేసావంటగా? పిల్లలెందరూ? ఏంటే మాట్లాడవ్?” నాకు కాసేఫు ఊపిరందక ఉక్కిరిబిక్కిరయిపోయాను.
“ఏవే లత నువ్వింకా మారలేదా? తెలుగు పద్యాలు భట్టీ వేసినట్టు ఏంటే ఆ తొందర? నన్ను కాస్త కుదురుగా నీ ప్రశ్నాపత్రానికి సమాధానాలు చెప్పనిస్తావా?” అని కాస్త విసుగు నటించాను.

“ఎవరిక్కావాలే నీ బోడి సమాధానాలు. పెద్ద ఐయెయెస్‌కి మల్లే. ఆ మాత్రం తెలుసుకున్నాకే ఫోన్ చేసాను” అని అల్లరిగా నవ్వింది.నేను కూడా పెద్దగా నవ్వేసా. కాసేపు ఇలానే బోళాగా మాట్లాడుకున్నాం. చిన్ననాటి స్నేహాల్లో గొప్పతనమిదే. ఏ అరమరికలూ ఉండవు, లౌక్యం తెలియక ముందే మొదలయిన స్నేహాలు కావటం వల్లనేమో ఒకరి జీవితం ఒకరికి తెరిచిన పుస్తకమల్లే అనిపిస్తుంది.
“ఇక చాల్లే వెతుక్కుని ఫోన్ చేస్తే తెగ మాట్లాడేస్తున్నావ్ కానీ, అసలు విషయం చెబుతా విను. వచ్చే శనివారం పనులన్నీ పక్కనపెట్టి తీరుబడి చేసుకో, కుదరకపోతే మీ ఆయనకి, పిల్లలకి విడాకులిచ్చి పుట్టింటికొచ్చెయ్.” అని వెక్కిరింతగా నవ్వింది.

“చీ నోర్ముయ్. ఏంటామాటలు? ఇంతకీ అసలు విషయమేంటో చెప్పేడు.” అన్నాను కోపంగా.
“ఆ ఏడుద్దామనే. కాకపోతే ఒంటరిగా కాదు. సామూహికంగా. అర్ధం కాలేదా? మన పదవతరగతి బ్యాచ్ అంతా కలుద్దాం అని నిర్ణయించుకున్నాం. ఆ మధ్య ఊరెళితే మన తొర్రిపళ్ళ రమేష్ మార్కెట్లో కనిపించాడు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక అందరం ఇలా కలిస్తే బాగుంటుందని అనుకున్నాం. తనే పట్టుబట్టి అందరి అడ్రస్సులు, ఫోన్ నంబర్లు సంపాదించాడు. అబ్బాయిలందరికీ తను ఆహ్వానిస్తున్నాడు. అమ్మాయిల పని నాకు అప్పగించాడు. నువ్వూ వచ్చి ఏడిస్తే అక్కడ అందరం ఎవరి జీవితాల కష్టాలు వాళ్ళు చెప్పుకుని ఏడుద్దాం. వీలయితే ఒకర్నొకరు ఓదార్చుకుందాం.” తన దోరణిలో వీలయినంత వ్యంగ్యం కలిపి చెప్పింది.

“ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలేంటే నీ మొహం. మనం పదవతరగతి చదివి ఇరవయ్యేళ్ళయ్యింది తెలుసా?” అన్నా ఒకపక్క లెక్కెడుతూనే హాశ్చర్యపోయి.
“అయితే మాత్రం ఆ తొర్రిపళ్ళ రమేష్‌గాడ్ని, చీకేసిన మావిడ టెంక జుత్తోడు రవిగాడ్ని వీళ్ళందరినీ అబ్బాయిలూ అనికాక ఆయన అతడు అని గౌరవంగా పిలుస్తామా ఏంటి?” అంటూ గలగలా నవ్వేసింది.
“రాక తప్పదంటావా?” అని అడిగాను లక్ష ఆలోచనలు రివ్వుమని చుట్టేస్తుండగా.
“రానంటే చెప్పు ఇప్పుడే వచ్చి నిన్ను చంపి పారేస్తాను. సరే ఆయనొచ్చారు నాకు పనుంది తర్వాత ఫోన్ చేస్తాను” అని పెట్టేసింది రాక్షసి.

ఇలా ఇరవైయేళ్ళ తర్వాత కలుస్తున్నామని చెప్పగానే మా ఆయన, కూతురు నా వైపు ఎలా చూస్తారో, ఏం ఆటపట్టిస్తారో అని ఆలోచనలో, తర్వాత పనిలో పడ్డాను.

టివిలో ఫేవరెట్ పాట చూస్తూ ఈలవేస్తున్న ఆయన చేతిలో మాంచి కాఫీ పెట్టి విషయం చెప్పాను. సిప్ చేసిన కాఫీ మింగకుండా కళ్ళు పెద్దవి చేసి అలానే ఉండిపోయారు. నోరు కాలిందో ఏమో గబుక్కున మింగేసి ఊఫ్ఫు ఉఫ్ఫు అంటూ గోల. నా కూతురుకి కూడా విషయం చెబితే జూలో వింత జంతువును చూసినట్టు చూసింది నావైపు. పైగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకోవటం ఒకటి. అంతే నాకు రోషం వచ్చేసింది.
“ఆయ్ ఆఫీసు అవుటింగులని మీరు, కాలేజ్ టూర్ అని చెప్పి అది వెళ్తే లేదేం? నేను వెళ్తున్నా అంతే” అని డిక్లేర్ చేసేసి చాటుకొచ్చి నా తెలివితేటలకి నేనే పొంగిపోయాను.

ఎవరెవరొస్తారో, ఎవరెవరు ఏ స్థాయిలో వస్తారో, ఇంతకు ముందల్లే ఉంటారో లేదో అని రోజూ పనులు చేసుకుంటున్నంత సేపూ అదే ధ్యాస. నా ఆలోచనా ప్రవాహంలో నేను కొట్టుకుపొతుండగానే రావాల్సిన శనివారం వచ్చేసింది.

పొద్దున్నే లేచి తలకి స్నానం చేసుకున్నాను. మా ఆయన బ్రష్ చేస్తూ నా వైపు అదోలా చూసారు. నేను ఆయన్ని చూడనట్టే నటించి వెంటనే “గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా” అని పాడుకుంటూ దేవుడి గదిలోకి వెళ్ళిపోయాను. మా డిటెక్టివ్‌గారు మాత్రం వంగి ఇంకా అనుమానంగా చూస్తూనే ఉన్నారు.

నేను దేవుడి ముందే కూర్చుని కళ్ళుమూసుకుని “ఛీ ఛీ ఆ దొంగమొహంది లత ఈ గోలెందుకు తెచ్చిపెట్టింది నాకు. అది చెప్పినప్పటి నుండీ చిన్నపిల్లలా నా సరదా ఏంటో, ఇంట్లో వాళ్ళంతా నన్ను దొంగమల్లే చూడటమేంటో భగవంతుడా అని” నిష్టూరంగా నాలో నేనే తిట్టుకుంటూ కూర్చున్నా.

“ఏమేవ్ చేసిన పూజ చాలు వచ్చి టిఫిన్ పెట్టు” అని కేకేసారు మావారు. పూజ అనే పదాన్ని కాస్త ఒత్తి పలకటంలో వ్యంగ్యమర్ధమయ్యి మూతి ముడుచుకున్నాను.

తండ్రి, కూతురు ఇద్దరూ టిఫిన్లు చేస్తున్నంత సేపూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఒకటే నవ్వటం. నాకు ఒళ్ళుమండిపోతుంది. టిఫిన్లు చేసి ఎంత త్వరగా బయటపడతారా అని చూస్తూ కూర్చున్నా.

నా కూతురైతే వెళ్తూ,వెళ్తూ “అమ్మా ఏం చీర కట్టుకుంటున్నావే?” అని వెటకారం.
“చీరా! పదవ తరగతి స్నేహితులు కదమ్మా గుర్తుపట్టడానికి ఏ పట్టు పావడానో వేసుకుంటుందిలే” అని ఈయన వంతపాడి ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళారు.

నాకు ఉక్రోషంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఇక వెళ్ళకూడదని అనేసుకుని మంచం మీద పడి అలానే ఆలోచిస్తూ కూర్చున్నా. ఇంతలో లత ఫోన్ చేసి “నేను మీ ఇంటికే వస్తున్నా. త్వరగా రెడీ అయ్యి ఉండు” అని చెప్పింది. దాని సంగతి నాకు బాగా తెలుసు, ఇక తప్పదు. లేచి రెడీ అయ్యాను. కారేసుకుని ఒక్కర్తే వచ్చేసింది. నన్ను చూస్తూనే ఒకటే అరుపులూ, గెంతులూనూ. దీనికసలు వయసే రాలేదా అనిపించింది.  మనిషి కూడా అసలు వయస్సు కంటే కనీసం అయిదేళ్ళు చిన్నదిలా అనిపించింది.

ఇద్దరం ఒక అరగంటలో మా స్కూల్‌కి చేరుకున్నాం. అప్పటికే అక్కడ వచ్చి ఉన్న సరళ, రోజా మమ్మల్ని చూస్తూనే తెగ సంబరపడి పరిగెత్తుకొచ్చారు. అందరం గోల గోలగా మాట్లాడుకుంటూ స్కూలంతా కలియతిరుగటం మొదలుపెట్టాం. ఆ గోడలు, బ్లాక్ బోర్డులు చూస్తుంటే ఏన్నెన్నో జ్ఞాపకాలు. మధుర కావ్యాలు కొన్ని, మరపురాని చిత్రాలు కొన్ని. నూనూగు మీసాల వయస్సులో కవులు వ్రాసిన మొదటి కవితలకి కాగితాలు ఈ గోడలే. సుద్దముక్కనే కుంచెగా చేసుకున్న చిత్రకారుల రమణీయ చిత్రకళకు కేన్వాసులు ఈ బ్లాక్ బోర్డులే. కాలం వెనక్కి పరిగెడుతూ పోతోంది. అందరం చిన్నపిల్లలమయిపోయాం.

దూరంగా తొర్రిపళ్ళ రమేష్, రవి, గెద్దముక్కు ఆంజనేయులు అందరూ కనిపించారు. అందరినీ పలకరిద్దామని అటే కదిలాను. కానీ నా కాళ్ళు హఠాత్తుగా ఆగిపోయాయి. కళ్ళు మాత్రం వాళ్ళ వైపే చూస్తున్నాయి.

“ఏమేవ్ లత, ఆ పొడుగ్గా ఉన్నది ఎవరే కార్తికా?” అని అడిగాను. నాకు తెలుసు తను కార్తికే అని.

“ఆహా బానే గుర్తు పట్టావే” అని అందరూ ఒక్కసారిగా నవ్వారు.

“చీ చీ ఏంటే ఆ మాటలు” అన్నాను కోపంగా.
“అబ్బో నువ్వు చూస్తే లేదు కానీ మేము అంటే వచ్చిందేం” అని మళ్ళీ నవ్వు మొదలుపెట్టారు. వీళ్ళని ఆపటం కష్టమని నాకు తెలుసు. అందుకే నీళ్ళు తాగొస్తా అని చెప్పి పక్కకి వచ్చేసాను.

తనొస్తాడని నేను ముందే ఎందుకు ఊహించలేదు? అసలా ఆలోచనే ఎందుకు రాలేదు? నన్ను నేనే తిట్టుకుంటూ ఒంటరిగా గ్రౌండ్ వైపు నడిచాను.

సరిగ్గా ఇక్కడే గ్రౌండ్‌లోనే మొదటిసారి కార్తీక్‌ని చూసాను. సిమెంట్ బెంచ్ పైన స్నేహితులతో కూర్చుని ఉంటే అడపిల్లని కన్నెత్తి చూడని ప్రవరాఖ్యుడల్లే తలదించుకుని సైకిల్ మీద మా ముందు నుండి వెళ్ళిపోతుంటే అమ్మాయిలంతా పుస్తకాల సందుల్లో నుండి తననే చూస్తుండటం గమనించాను. సాయంత్రం తను లైబ్రరీకి వెళ్తే తనకంటే వయస్సులో చిన్నా పెద్దా తేడా లేకుండా కనీసం రెండు టేబుళ్ళకు సరిపడా అమ్మాయిలు లైబ్రరీలోనే గడిపేస్తారని స్కూలంతా చెప్పుకుంటారు. నిగనిగలాడే జుత్తు, పాలమీగడంటి రంగు, సన్నగా పొడుగ్గా ఉండే తనరూపం అమ్మాయిలనిట్టే ఆకర్షిస్తుంది. ఎంతోమంది అమ్మాయిలు తనకి ప్రేమలేఖలు వ్రాస్తే “అయ్యో అలాంటివేం వద్దండి” అని నవ్వేసి వెళ్ళిపోయేవాడు.

క్లాసులో అందమైన అమ్మాయిని, బాగా చదువుతానన్న పేరుంది. నన్ను కూడా కనీసం ఒక్కసారైనా చూడడేంటి అని నేనెప్పుడూ అనుకునేదాన్ని. కానీ ఈవిషయం బయటకి తెలిస్తే అందరి దగ్గరా  అందగత్తెనని నాకున్న గొప్ప పేరు పోతుందని బయపడి ఎప్పుడూ బయటపడలేదు.

ఒకరోజు మా స్కూల్ మొత్తానికి మోడ్రన్ ఫ్యామిలీ అని చెప్పుకునే సునంద, కార్తీక్‌కి ప్రేమలేఖ వ్రాసింది. తను అందరికీ ఎప్పుడూ చెప్పే సమాధానమే చెప్పి ఉత్తరం అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం అప్పుడే అటుగా వస్తున్న మా కంట పడింది. వెంటనే మా కోతి బ్యాచ్ గట్టిగా నవ్వింది. ఆ నవ్వులకి అవమానంతో ఇగో హర్టయిన సునంద నాతో “ఈ బ్యాచంతటికీ నువ్వేగా లీడరు. అందగత్తెవని వీళ్ళ చేత పొగిడించుకోవటం కాదు. చేతనైతే మన పదవతరగతి పూర్తయ్యేలోపు వాడు నీవైపు చూసేలా చేసుకో. అప్పుడు నవ్వితే బావుంటుంది. ఇప్పుడెందుకు పెద్ద ఫోజు” అని చాలెంజ్ చేసినట్టుగా అని వెళ్ళిపోయింది.

“అంతా మీ వల్లే జరిగింది” అని మా కోతులందరినీ చెడామడా తిట్టేసా. కానీ అందరి ఆలోచన ఆ ఛాలెంజ్ మీదే ఉండిపోయింది.
“ఏమేవ్ యమునా నీక్కూడా పడడంటావా?”
“అది చెప్పిన మాట నిజమేనే. ఎంత అందగత్తెనయినా వాడు కన్నెత్తి చూడడు” అని ఒక్కోళ్ళు ఒక్కో రకంగా మాట్లాడారు. అందరిని తిట్టేసి ఇంటికి వచ్చేసా.

ఇంటికి వచ్చేనే కానీ నా ఆలోచనలు కూడా ఆ చాలెంజ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఏదో ఒకటి చేసి వాడు నా చుట్టూ తిరిగేలా చేసుకోవాలి అనిపించింది. కానీ అంతలోనే ఇదంతా తప్పు అనిపించి ఆ ఆలోచన పక్కన పెట్టేసా.

మరుసటిరోజు సైకిల్ తొక్కుకుంటూ ఇంటికొచ్చేస్తుంటే నా చున్నీ సైకిల్ చెయిన్‌లో ఇరుక్కుని కిందపడిపోయాను. మోకాలికి దెబ్బ తగిలి రక్తం రావటం మొదలయ్యింది. నొప్పి బాధకు చాలదన్నట్టు, చున్నీ ఎంతకూ చెయిన్ నుండి రాలేదు. ఇంతలో అటు వైపే వచ్చిన కార్తీక్ దిగి నా వైపు చూసాడు. నేనప్పటికే నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్నాను.

కార్తీక్ వచ్చి “అయ్యో పెద్ద దెబ్బే తగిలినట్టుందే. ఈ చున్నీ వదులు నేను తీస్తా” అని అందుకుని చున్నీ తీసి నాకిచ్చాడు. “సైకిల్ తొక్కు కుని వెళ్ళగలవా మరి?” అని అడిగాడు.
“మెల్లగా నడిపిస్తా” అని నేను నడుస్తూ ఉంటే. తను కూడా నాతోనే నడుస్తూ వచ్చాడు. నడుస్తున్నంతసేపూ పుస్తకాలు, పరీక్షలు, అయిపోయిన సిలబస్, పెండింగ్ ఉన్న నోట్స్ ఇలా బోలెడన్ని చెప్పుకొచ్చాడు. ఇంతలో మా ఇళ్ళు వచ్చేసింది.
“చూసావా మాటల్లో పెట్టి నీకు నొప్పి తెలియనివ్వలేదు” అని నవ్వేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఆ నవ్వులో ఏదో స్వచ్ఛత. ఇప్పటివరకూ మరలా అలాంటి స్వచ్ఛత ఎవరి దగ్గరా చూడలేదు.

అప్పటి నుండీ రోజు స్కూల్ అయిపోయాక ఇద్దరం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మొదట్లో కాలునొప్పి కాబట్టి నేను నడుస్తూ ఉంటే తోడుగా వచ్చేవాడు. తర్వాత అదొక అలవాటయ్యింది. మాట్లాడుకునే మాటలు చదువులు దాటి ఆటలు, అలవాట్ల వైపు నడిచాయి.
“నువ్వెప్పుడూ సంపంగి పూలే పెట్టుకుంటావెందుకూ?” అని అడిగాడొకసారి. తను అంతలా నన్ను చూస్తున్నాడన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. కాస్తంత గర్వంగా, బిడియంగా కూడా అనిపించింది.
“సంపెంగలంటే నాకు చాలా ఇష్టం కార్తీక్. ఆ సువాసన నన్నెప్పుడు తాకినా నాకే సొంతమైన ఏదో లోకంలొ ఉన్నట్టనిపిస్తుంది” అని ఏదేదో చెప్పుకుంటూ పోయాను. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా నన్నే చూస్తూ, నా మాటలు శ్రద్ధగా విన్నాడు.

ఒకరోజు సాయంత్రం ఎప్పటిలానే స్కూల్ నుండి వచ్చేస్తుంటే తనదగ్గర సంపెంగ పూల వాసనొచ్చింది. స్కూల్ బ్యాగ్ నుండి ఒక కవర్‌లో దాచిన సంపంగిపూలు తీసి ఇచ్చాడు. కానీ ఆ సువాసన ఆ పూలది కాదు. తన జుత్తుకి రాసుకున్న సంపంగి నూనెది. ఆ రోజు ఇంటికొచ్చి కూర్చుంటే గాలిలో తేలుతున్నట్టూ, మబ్బుల్లో విహరిస్తున్నట్టు ఏదో అనుభూతి. అప్పటి నుండీ వీలయినప్పుడల్లా తను సంపంగిపూలు తెచ్చేవాడు. పూలు తెచ్చినా, తేకున్నా తలకి మాత్రం సంపంగి నూనె రాసుకునేవాడు.

నాకయితే స్కూల్లో అందరికీ అరిచి చెప్పాలనిపించేది. ముఖ్యంగా ఆ ఉడుకుమోతు సునందకి. కానీ చెప్తే నా గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారని భయపడి ఎవరికీ ఏమీ చెప్పలేదు. కానీ ఒకరోజు సాయంత్రం మేమిద్దరం కాస్త నవ్వుతూ, చనువుగా వెళ్ళటం మా సరళ చూసింది. గట్టిగా అరిచి సునందకి మా ఇద్దరినీ చూపించింది. సునంద ఉక్రోషంగా మా వైపు చూస్తూ వెళ్ళిపోయింది. నాకయితే దాని చూపుచూసి గుండె ఝళ్ళుమంది.

ఇది జరిగిన కొన్నిరోజులకి ఒకసాయంత్రం సైకిల్ స్టాండులో సైకిల్ తీస్తుండుగా వెనక క్యారెజ్‌కి కట్టున్న ఒక కాగితం క్రిందపడింది. దాన్ని అందుకుని తీసేంతలో సునంద దాన్ని అందుకుని విప్పి “అయ్యో” అంటూ గట్టిగా అరిచి. అటుగా వెళ్తున్న ప్రిన్సిపాల్ మేడం చేతిలో ఆ కాగితం పెట్టేసింది. ప్రిన్సిపాల్ వెంటనే కార్తీక్‌ని పిలిపించింది.

“కార్తీక్ ఏంటిది? అమ్మాయిలకి ప్రేమలేఖలు వ్రాస్తున్నావా?” అని గట్టిగా అరిచి నావైపు తిరిగి “ఇందులో నీ ప్రమేయమేమైనా ఉందా?” అని ఉరిమి చూసింది ప్రిన్సిపాల్ మేడం.నాకు గొంతు తడారిపోయింది. కళ్ళల్లో నీళ్ళు ధారలు కట్టాయి. “నాకేం సంభందంలేదు మేడం. మా నాన్నకు తెలిస్తే చంపేస్తారు మేడం.” అంటూ గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. ప్రిన్సిపాల్ అక్కడ నుండి నన్ను పంపేసింది. అక్కడే ఉన్న సునందని, సరళని తన గదిలోకి పిల్చి మాట్లాడాక ప్రిన్సిపాల్ మేడం కార్తీక్‌ని డీబార్ చేసింది.

బయటకు వస్తున్న కార్తీక్‌తో మాట్లాడదామని దగ్గరకు వెళ్తుంటే అక్కడికొచ్చిన సునంద “నన్ను కాదని ఎలాంటి దాన్ని ఇష్టపడ్డావో చూసావా? ఇది నీతో స్నేహం చేసిందనుకున్నావా? నాతో ఛాలెంజ్ చేసి నిన్ను తన చుట్టూ తిప్పుకునేలా చేసింది. కావాలంటే దాని స్నేహితులనడుగు” అని ఎగతాళిగా నవ్వింది. కార్తీక్ ఒక్కసారి నమ్మలేనట్టుగా నన్ను చూసాడు. నేను తనతో మాట్లాడాలనుకునేలోపే ప్రిన్సిపాల్ వస్తుందంటూ నా ఫ్రెండ్స్ నన్ను అక్కడనుండి లాక్కుపోయారు. అదే చివరిసారి కార్తీక్‌ని చూడటం. ఈ ఇరవై ఏళ్ళలో మరలా ఎప్పుడూ తన గురించి ఎలాంటి కబురూ వినలేదు.

అలోచనల్లో మునిగి గ్రౌండ్‌లో కూలబడిపోయాను. ఎంతసేపయ్యిందో తెలియలేదు. అలికిడికి పక్కకి తిరిగి చూస్తే కార్తీక్. “ఏం యమునా బాగున్నారా?” అని నవ్వుతూ పలకరించాడు. అదే స్వచ్ఛమైన నవ్వు. దేవుడు తనకి మాత్రమే ఇచ్చిన వరమనిపించింది.
“బాగున్నా? మీరెలా ఉన్నారు?” అని అడిగాను. అడిగానే కానీ మా మధ్య మీరులెప్పుడొచ్చాయి అని ఆశ్చర్యమేసింది. సంస్కారం ఎంత చెడ్డది అని ఆ క్షణం అనిపించింది.

కాసేపు అలా నవ్వుతూనే క్షేమ సమాచారాలడిగాడు. మనిషిలో ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. ఆ విషయం గుర్తించగానే అప్రయత్నంగా నేను నా జుట్టు సవరించుకున్నా, నా మొహం ఎలా ఉందో అని ఒక్క క్షణం అనిపించింది. అతను తన గురించి, తన జీవితం గురించి ఏవో చెబుతూనే ఉన్నాడు. నా మనసుకి అవేం ఎక్కటం లేదు. తనకంటే నేను ఏజ్డ్ గా అయిపోయానేమొ, ఒకప్పుడు క్లాస్ బ్యూటీని అని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఇతను స్కూల్ మొత్తమ్మీదా నాతోనే స్నేహం చేసేవాడంటే నమ్ముతారా? ఇలా నా ఆలోచనల్లో పడికొట్టుకుపోతున్నా.

తను మాటలు ఆపి “ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు?” అని అడిగాడు.
“అది అది కార్తీక్ ఆ రోజు” అని ఏదో చెప్పబోయాను. ఏ రోజా? అన్నట్టు నావైపు సాలోచనగా చూసి, ఏదో స్పురించిన వాడల్లే గట్టిగా నవ్వుతూ “హ హ అయ్యో యమునా మీరింకా అవి గుర్తుంచుకున్నారా? అందులో మీ తప్పేం లేదని నాకు అప్పుడే తెలిసింది. నిజానికి ఆ ఉత్తరం వ్రాసింది కూడా ఆ అమ్మాయెవరూ సునందేనంట. మీకు ఈ విషయం తెలిసే ఉంటుందేమో తర్వాత. నా తప్పు కూడా ఏమీ లేదండోయ్” అని ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇంతలో అబ్బాయిలు కొందరొచ్చి ఇక్కడేం చేస్తున్నారు మీరు? పదండి లోపలికి అని లాక్కుపోయారు. కాసేపు ఆటపాటలతో ఏదో కాలక్షేపం చేసాక ఎవరి ఇంటికి వాళ్ళు బయల్దేరాం. కార్తీక్ వెళ్ళేప్పుడు వచ్చి చెప్పి వెళ్ళాడు.

ఇంటికొచ్చి సోఫాలో కూర్చుంటే చాలా రిలీఫ్‌గా అనిపించింది. కానీ మనస్సులో చిన్నగా కలవరపెడుతున్న విషయం ఒకటే. అది వెళ్ళొస్తా అని చెప్పి వెళ్తున్న కార్తీక్ దగ్గరనుండి గుప్పుమంటు వచ్చి నన్ను తాకిన సంపంగినూనె సువాసన.