సిన్నారావు గారు

పొద్దుటినిండి గేటు కాడే నిలబడిపోయేను నేను. సినమాయ్యొచ్చి పెద్దోళొస్తన్నారు బయటెవ్వరునేరు ఎళ్ళిసూడమంటె వచ్చుండిపోయాను. కాన్మెంటు నాని, మూర్తిమేష్టారాలొచ్చేరు. నన్ను చూసి “ఓరి నువ్వు అమ్రికాలోనున్నావన్నారు? నువ్వెప్పుడొచ్చేవు?” అని అడిగి లోపలికెళ్ళేరు. తెలిసినోళ్ళందరొస్తన్నారు.

బయటున్నాను కాని తెలిసిన ముఖాలొచ్చినప్పుడు వేణు చినాన్న ఏడుపు ఇనిపిస్తంది. “ఎలిపోయేడు నాయినా, మారాజు ఎలిపోయేడు, మా అక్కకి అన్యాయం సేసి ఎలిపోయేడు. సూడండి మళ్ళ కనిపిస్తాదేటి ముఖమూ సూడండి నాయినా” అని శోకాలు తీస్తన్నాడు వేణు చినాన్న. చినాన్న అంటావు కానీ అమ్మమ్మకి తమ్ముడు, తాతవుతాడు. పక్కనే కూర్సున్న పరిమిశెట్టోల పెద్దోడు “ఓరొల్లకోరా ఏణు, ఆడోల్లందరు ఇప్పుడే అగినారు నువ్వు మళ్ళీ మొదలెట్టిసేవు” అని ఆపినా ఆగలేదు. ఈధిలో ఏ ఇంటిలో ఏదొచ్చినా పరిమిశెట్టోల పెద్దోడొచ్చి సేతిలో పనిలాగీసుకుని నేసేత్తాలేరా అని దూరిపోతాడు. ఆనక సాయిం సేసేడు కదా అని ఒక యాభై ఇస్తే ఎళ్ళి నాలుగు సుక్కలేసుకొచ్చేత్తాడు. పెదమాయ్యొచ్చి “నువ్వింక ఆపుతావా లేదా? పిల్లలు బయపడిపోతన్నారు” అని వేణు చిన్నాన్నని కసిరీసేడు. “ఆపిస్తానులే నాయిన ఆపిస్తానులే. మళ్ళరేపీయాలకొచ్చి ఏడుస్తానా? ఆపిస్తానులే” అని మూలుగుతున్నాడు.

“ఏనాడయిన ఒక్క మాటన్నోరేనా? ఇళ్లల్లో ఇంతమంది పెళ్ళాలిని తిట్టీవోళ్ళని సూసాం కాని ఏనాడయిన మహానుభావుడు నోరు జారేరా? పోని జరుగుబాటుకి ఏదైన లోటు సేసేరా? చివర్లో నేనిసిగిపోయి అనీసేను కాని. ఇంటిలోన ఈ ఒంటేలేటి మనిషికి తెలివి లేకుండా. ఈ రొచ్చులో నన్నుండమన్నారా? చావమన్నారా? అనిస్తే నవ్వీసి పొనలాగే నీ అన్నదమ్ముల దగ్గిరికెళిపోతావేటి అనీవోరు కాని తగువేసుకునీవోరు కాదు” అని పంతులమ్మగోరితో అమ్మమ్మ సెబుతుంటే, పంతులమ్మగోరు అమ్మమ్మ సెయ్యి పట్టుకుని గుమ్మం దగ్గర కూర్సుండిపోయారు.

“నువ్వనీస్తవమ్మా. ఎందుకనీవు? నోరులేని మనిషిని పట్టుకుని అనీస్తవుగాని. నీ అన్నదమ్ముల్ని కాని, నీ పిల్లల్ని కాని అనీమను. ఏటున్నదని అనీటానికి? ఏలు పెట్టి సూపించే మనిషేటి? మాయమ్మ నొరు నీకొచ్చి నువ్వందరినీ అనీస్తవు.” అని వేణు చిన్నాన్న శోకాలు పెడుతూనే ఉన్నాడు.

ఊరిలో రాజికీయం సేసివోళ్ళొచ్చారు. నాన్న సప్లియర్సోలకి ఫోన్ చేసి తెప్పించేయించిన కుర్సీల్లో బడిపిల్లల్లాగ సేతులు కట్టీసుకుని కూర్సున్నారు. “నాగిస్సర్రావుగారూ, మీ మాయ్యగారని సెప్పుకోటమే కాని మనిషి ముఖం తెలియదండి. అదిగో ఆ రోడ్డంటెప్పుడయినా కోవటిపల్లెలుతుంటే పొలం దగ్గర నూర్పులు సేస్తుంటే సూసివోళ్లమంతే” అనీసి సెబుతున్నారు. నాన్న టీకొట్టు రవణని పిలిసి అందరికీ టీలిచ్చీమన్నారు. “బయిటికొచ్చీ మనిషి కాదండి. ఇంటికాడె కనిపెట్టుకునుండీవోరు. సిన్నపిల్లలందరికీ గొప్ప సేరిక. అదిగో మా పాప, మా బాబు దగ్గిరనుండి మా మరదలిగారి పిల్లలదాక అందరినీ ఆయినే ఆడించీవోరు.” అని సెబుతూ ఏదొ గుర్తొచ్చినట్టు “ఒరేయ్ భారతమ్మ పిల్లలు యాడదొకొచ్చేరు పోను కొట్టండి” అని కేకేసేరు. “పెద్దోడి కారులో వొస్తన్నారట కదా. రాజమండ్రి దాటీసేరంట” పెదనాన్న సెప్పేరు.

ఎవులో వొచ్చి “బాబు నీకేటవుతారేటి సిన్నారావు గారు?” అని అడిగారు. “మా తాతగారండి” అని సెప్పేను. “శామలమ్మ కొడుకువా? నువ్వల్లకడెక్కడో అమ్రికాలో ఉన్నావన్నారు. అందవనీసేరు.వొచ్చీసేవా” అన్నారు. “అందరూ వొచ్చీసేరు నాయినా, అందరినీ రప్పించీసుకున్నాడు రాజు. అందరు మనవళ్ళు కొడుకులతోటి జరిపించీసుకుంటున్నాడు. భోగమంటే నీదే నాయినా” అని వేణు చిన్నాన్న మళ్ళీ అందుకున్నాడు.

గంగులీధి కావెస్సర్రావొచ్చాడు. కావెస్సర్రావుకి తాతగారంటే గొప్ప ఇది. “ఇంటిలో సిన్నోడని సిన్నరావనిస్తారు కాని రాజారావండి మా మాయ్య పేరు” అని ఎవురితోనో మాట కలిపేడు కామెస్సర్రావు. గంగులీధి నుండి శంకర్రావు కొడుకు కబురు తెచ్చాడు. గంగులీదావిడ వద్దావనుకుంటుందంట రిక్షా పంపిస్తే వస్తానని కబురెట్టింది. కానయితే ఆవిడకి సేసే తంతంతా నాకూ సెయ్యాలని కండీషనెట్టిందట. ఆవిడంటే మా అమ్మమ్మ అనీసి. శంకర్రావు మా తాతగారికి అన్నియ్య కొడుకు. మాకు పెదనాన్న వరస. శంకర్రావు కొడుకు ప్రెసాదంటే నాకంటె రెండేళ్లు సిన్నోడే కాని గంగులీధిలో మనిషి పెద్దతరహా అనీసి, సదువుకున్నోడు అనీసి ఇలాంటి కబుర్లు సక్కబెట్టడానికి ఆడికే సెప్తారట.

ప్రెసాదు మా పెదమాయ్యని, సినమాయ్యని పిలిసి “మనిషి పోయినకాడ పట్టింపేటి సిన్నాన్న రిక్షా పంపించిస్తే ఆవిడ కూడా సూస్తది కదా” అని కర్ర ఇరక్కుండ సెప్పాననుకున్నాడు. “ఓరెనువ్వు ఆ ఈత్తరుపునొచ్చేవా, తాతని సూడ్డానికొచ్చేవా? ఏటిరా ఆయమ్మ గొప్ప? మనిషి పోయి మేమేడుస్తుంటే రిక్షా అంపాలా?” అని అందరూ తగిలీసుకున్నారు. పెదమాయ్యకసలే సెడకోపం “ఏటి బుర్రగాని తిరుగుతున్నాదేటిరా ముసిల్దానికి? మా అమ్మకి సేసినట్టు దానికి సెయ్యాలా?” అని ఎగిరిపోతుంటే ప్రెసాదుగాడు బిక్కయిపోయాడు. సినమాయ్యొచ్చి ప్రెసాదుగాడిని పక్కకి తీసుకెళ్ళి “ఒరేయ్ అమ్మతో మాట్టాడినాను. ఆయమ్మొచ్చి సూస్తే మాకేటి అబ్బింతరం లేదు. మావేటి అడ్డు సెప్పం. కాని రిక్షాలంపడాలాటివేట్నేవు.” అని కరాఖండిగా సెప్పిసేడు. ప్రెసాదుగాడు సైకిల్ స్టేండు తీసి గమ్మునెళ్ళిపోయేడు.

“ఇంకేటి మిగిలిందావిడతోటి? మనిషికి సుస్తీ సేసిందని తెలిసిన్నాడు కూడా ఆస్థి ఎలాగమ్మీసుకుందామని సూసినావిడతోటి మాటలేటి? మీకు బుర్రలుగాని పోనాయ” అని వేణు చిన్నాన అందరిని కసిరిసేడు. గంగులీధినుండొచ్చిన కావెస్సర్రావు వీధావిడమీద నోరు జారితే వీధిలో ఏరయిపోతామని కామయిపోయేడు.

ఏటి జరుగుతుందో అర్ధంకాని ఎదురింటి రామరాజుగారొచ్చి “ఏటండి భోగట్టా? ఎవరాలు?” అని కామేశ్శర్రావునడిగాడు. దగ్గరలోని మా మావయ్యలు గానున్నారేమోనని సూసుకుని సిన్నగొంతుతో “ఏటినేదండి మా సిన్నారావు మాయ్య సంగతి మీకు తెలియందా, అసలే ఒకీధిలో ఉన్నోళ్ళు. మనిషి నిఖార్సయిన మనిషి. మప్పితం లేదు. టపీమని మొహమ్మీద సెపుతాడు కాని, ఇచ్ఛికాల కోసం బొంకడం తెలీదు. మరయితే మా మావయ్యకయితే ఆ రోజుల్లో ఒక పెళ్ళయిన మాట నిజం. ఎవురికీ తెలీదనుకోండి. ఇప్పుడయితే మీ ఈదిలో ఇల్లు కట్టీసుకున్నాడు కాని, మా గంగులీధిలో ఇప్పుడికీ మా మాయ్యకి ఇల్లుంది. మా ఈది పిల్లనే ఇచ్చి పెళ్ళి చేసిసేరు. కానయితే పెళ్ళయి నెల్లాళ్ళయిన పిల్ల కాపురానికొచ్చింది కాదు. సూసేరు సూసేరు ఇక వల్ల కాదనీసుకుని పెద్దోళ్లందరిని పిలిచీసి ఏటీ పేచి? పెళ్ళి చేసీసుకున్నాక కాపరానికి రాకపోడాలేటి. ఇక నాకీ పిల్లొద్దని సెప్పీసేడు మాయ్య.

ఈదంత ఒక్కటయిపోయి పిల్లనొగ్గీడవేటి? ఇదేవన్నా పెళ్ళనుకున్నావా? బొమ్మలాటనుకున్నావా? అని మా మాయ్య మీదకొచ్చీసేరు. గంగులీధంటే అందరూ సుట్టాలే. అన్నీ మా కుటుంబాలే. ఎవ్వరినీ వదులుకునే మనిషి కాదు మా సిన్నారావు మాయ్య. మనిషికి గొప్ప మమకారం, ఆపేక్ష. అలాంటి మనిషి మీదకి గొడవకొచ్చీసేరు. “సుట్టాలు సుట్టాలనుకుంటే ఈదంత ఒక్కటయిపోతారా? ఏం ఆ పిల్లే మీ రక్తమా? నేను మీ రక్తం కాదా? దాని బ్రతుకే గాని నాది బ్రతుకు కాదా?” అని అందరిని నిలేసి నేను ఈ ఈదిలోనే ఉండనని పంతం పట్టీసేడు. మనసిరిగిపోతె మా మాయ్య మనిషి కాడు.

ఈదిలో పెద్దలు మనిషి ఎళ్ళిపోత నన్నాడన్న బాధ కూడా నేకుండా, అమ్మాయి సంగతేటన్నారు. ఆ ముక్కతో ఆ ఈది మీద, ఆ మనుషుల మీదున్న ప్రేమ సచ్చిపోయి అప్పుడుకప్పుడు సిన్నారావు మాయ్య నోటరీ సభాపతిగోరిని పిలిసీసి మా నాన్న నాకిచ్చిన పొలాలు, ఇల్లు ఆవిడ బ్రతికున్నదాక అనుభవించాడినికిన్నీ, అవిడ తదనంతరవూ అవి నా వారసులకి సెందాలని వ్రాసీసిచ్చిమని సెప్పి ఆ పూటే కట్టుబట్టలతో వీధి వదిలీసి వచ్చీసేడు.” అని కావెస్సర్రావు సెబుతుంటే జనాలు గుమిగూడీసి ఇంటన్నారు. ఎనకాలె ఉన్న సువ్వాడ గోపాలం “మాకు తెలీకపోవడమేటి బాబు, సిన్నరావుగారి పొలాలన్నీ మేవే సూసివోళ్ళం. గంగులీదావిడకి బాబొదిలిసిన పొలాలు మావే సేత్తన్నాం.” అని అందుకున్నాడు.

సువ్వాడ గోపాలం పక్కనే సువ్వాడ కిష్ణ, గౌరునాయుడు నిలబడి సూత్తన్నారు. గౌరునాయుడొచ్చి “ఎప్పుడొచ్చేరు బాబు? నాన్నో” అని అడిగాడు. నేను నాన్నని సూపించేను. నన్ను దాటుకుని గుమ్మంలోకెళ్ళి నిమ్మళంగ పడుకున్న తాతగారిని సూసి కాసేపలాగ నిలబడిపోయేడు. మా పొలాలన్నీ గౌరునాయుడే సూసివోడు.

కాపోతే గౌరినాయుడికి సిన్న దొంగబుద్దుందని తాతగారు సివర్లో మానిపించీసేరు. గౌరినాయుడి పెళ్ళాం లష్మి కోతలప్పుడు, నూర్పులప్పుడు వొచ్చి మిగిలిపోయిన పరకలేరుకున్న నెపాన మోపులోని పరకలు లాగీడం తాతగారు సూసి గెట్టిగ కేకలేస్సేరు. “ఓసిదేటి బాబూ, మిగిలిపోయిన పరకలేరుకోరా” అనుకుంట ఆ అమ్మి ఎళ్ళిపోయింది. రాతిరి కాపలాకి పోయి ఇంత కునుకు తీస్తే మోపులు మాయం సేస్సీవోరు. సూసి సూసి ఇసిగిపోయి “ఏవోయ్ గౌరినాయుడు రైతన్నోడు సెయ్యాల్సిన పనేనా? నమ్మి పొలాలు సెయ్యమని పిలిస్తే మాకే మట్టి కొడతారా? ఇక మనకి కుదర్దు గాని సాయంకాలం ఇంటికొచ్చి నీకు రావాల్సినవి తీసీసుకో. ఇంక నా మడిలోకి రాకు” అనీసేరు. “ఒసేటి బాబు, ఏనాటి నుండి సేత్తన్నారు వ్యవసాయము, ఈమాతరం గింజలు తియ్యని రైతెవుడీవూర్లో? దీనికే మడిలోకి రావుద్దనిసేరు” అని అడిగేడు కాని మా తాతగారయితే మళ్ళ గౌరినాయుడిని పిలిసింది కాని, సూసింది కాని లేదు.

పిన్ని పిల్లలు ఇంకా రానేదు. ఆల్లొచ్చి సూసీదాక ఏం నేదని అందరికీ చెప్పిసిందమ్మమ్మ. వచ్చినోలు టీలు తాగుతా సప్లియర్స్ కుర్సీల్లో కూకుండిపోయారు. వేణు సిన్నాన్న ఎళ్లి కావేస్సర్రావు పక్కనే కూర్సొని “కావెస్సర్రావు ఆవిడ పద్దతేటి? మా బావకి బాలేదని తెలిసిన్నాటి నుండి సూత్తన్నాం. అనుభవించమని ఒగ్గీసిన ఆస్థిని పడీసుకుని అన్నదమ్ముల పిల్లలికిచ్చిద్దమని తాపత్రయిమేటి? మా బావ బాగున్న రోజుల్లోనే ఎంతమందో సెప్పారు, ఆవిడకి ఎంతోకొంతిచ్చీసి ఆ పొలాలు, ఇల్లు తీసీసుకోమని. మాబావ దేవుడు మాట తప్పుతాడా? ఆ పొలాల మీద ఎంతొస్తుందో, ఆ ఇళ్ళు ఏటవుతుందో ఒక్కనాడైనా అడిగాడా? అలాంటి మారాజు సొమ్ము పడీసుకోటానికి అప్పుడే మధ్యవర్తులతో మాట్టాడీసిందంట.

లోకంలో ధర్మమేటి లేదనుకుందేటాయమ్మ. కట్టుబట్టలతో అన్నీ వొగ్గీసి వచ్చీసేడుగావల. ఆ బాబు కష్టం సేసి టాటా, జెంషేడుపూరు అని ఊర్లు ఊర్లు తిరిగి వ్యాపారం సేసి ఏదో సంపాదించి కాణీ దాసేడు కనకగాని లేకపోతె ఈ పిల్లల్ని ఎలా పెంచీవోడు? పిల్లలకింత దాసిపెట్టాలని పొలంలోనూ, సామిల్లులోనూ పనోళ్ళతోటి పనోడిలాగ మూటలెత్తీసి ఒక కష్టం పడ్డాడా? అలాటి బాబు దగ్గరా లాగీసుకుందామని సూస్తన్నారు?” అని దులిపేత్తుంటే ఊ కొడతన్నాడే కాని మారు మాట్టాడలేదు కావెస్సర్రావు.

పిన్నికొడుకులు వచ్చీసేరు. తాతగారిని ఎరిగినోళ్ళంతా వచ్చి పోటీపడి భుజాలకి ఎత్తుకున్నారు. పుట్టినాటి నుండి మాతోటే ఉన్న తాతగారు కళ్ళ ముందే కలలాగా కరిగిపోయేరు. కాలుతున్న కట్టెలు సూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగేయి కాదు. కానీ మరలా రేపు సూస్తామా? ముట్టుకుంటామా? గోడమీద పటంలో సూసుకోటానికి ముక్కూమొహం తెలియని దేవుడా? మమ్మల్ని ఎత్తుకునాడించిన తాతగారు.

పరిమిశెట్టోల పెద్దోడొచ్చి “ఇక కదలండిరా మీరందరూ. ఇంటికాడ చెయ్యాల్సిన పనులుంటాయి ఎళ్ళి సూడండి. ఈ సాకలోడు కిరసనాయిలికి కక్కుర్తిపడి సరిగ్గా కాలుస్తాడో లేదో, నేనిక్కడే ఉంటాను” అని సెప్పి పెదమాయ్య వైపు సణుగుతూ సూసేడు. వేణు చినాన్న పెదమాయ్యతోటి ఒక వొందిప్పించేడు. సాకలి రాము కూడా “మీరెళ్ళండి బాబు నేను సూసుకుంటాను” అని చెప్పి అందరిని పంపీసేడు.

తిరిగొచ్చిస్తుంటే గౌరినాయుడు కనిపించాడు. కాస్త దూరంలో నిలుసుని ఎగిరిపడుతున్న మంటల్ని సూస్తన్నాడు. “ఏమిరా గౌరినాయుడు ఇక్కడ నిలబడిపోయేవేమి?” అని అడిగాడు పరిమిశెట్టోల పెద్దోడు. మనిషికి మాటలేదు. ఎన్నేళ్ళు పనిసేసేడు మరి. ఏ జ్ఞాపకాలు కదిలాయో ఏటో.

పరిమిశెట్టోల పెద్దోడు ఆ రావిచెట్టు కింద కూర్సుని “ఓరి గౌరినాయుడు మనిషి సచ్చిపోయినంత మాత్రాన పంతం సచ్చిపోద్దా? ఆ గంగులీదావిడ సూడు మనిషి సచ్చిపోయిన కాడ కూడా నాకు పిలుపు రావాలి, రిక్షా రావాలి అన్నాది. సిన్నరావు గారితోటి పంతమా? పేనంలేని ఆయన శరీరం కూడా ఆమెను సూడకుండానే వెళ్ళిపోయింది సూసావా?

మనిషి మిగులున్న నాడే కాస్త మంచి మిగుల్సుకోవాలిరా. మనిషి పోయేక ఎన్ననుకుని ఏటి నాభం. నీ తప్పులు నా తప్పులు లెక్కలెయ్యటానికి దేవుడొస్తాడనుకున్నావేటిరా. ఇదిగో ఇలాటి మహానుభావులే వొచ్చి ఒరేయ్ ఇది తప్పురా అని సెప్పీసెళ్ళిపోతారు” అని సణుక్కుంటూ సీసా మూత తీసేడు

ఆనంద్‌వర్మ

రంగు రంగుల పానీయాలు అందమైన గాజు గ్లాసుల్లో హొయలొలికిస్తున్న ఆ పార్టీలో రంగు రంగుల మనస్తత్వాలను గమనిస్తూ కూర్చుంది తన్మయ. ఆ ఆనందాల వెనక, కేరింతల వెనక, చిందుల వెనక మరుగునపడిన మర్మాలేవో చదువుతున్నట్టుగా శ్రద్ధగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా చిన్న వయసులో తనకి అలవడిన ఈ పరిశీలన చివరికి తనని సైకియాట్రీ చదివేదాక ఒదిలిపెట్టలేదు. సిటీలో కొత్తగా ప్రాక్టిస్ కూడా మొదలుపెట్టినా తనకి పెద్దగా జాబ్ సాటిసిఫేక్షన్ లేదు. తన దగ్గరకొచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా కార్పొరేట్ అఫీసుల్లో ఒత్తిడులు తట్టుకోలేక వచ్చేవాళ్ళును. అప్పటికీ కార్పొరేట్ స్కూల్స్‌లో, కాలేజుల్లో అవగాహన సదస్సుల పేరిట సంతృప్తి వెదుక్కుంటున్నా ఇంకా ఏదో వెలితి. మనుషుల ఆలోచనలకు మూలమైన మనసులను చదవాలని, వ్యక్తిత్వాల పుట్టుక రహస్యాలు తెలుసుకోవాలని తపన.

పార్టీలో చిన్న అలజడి మొదలయ్యేసరికి ఏమిటన్నట్టు ఆసక్తిగా చూసింది. ఒక కొత్త వ్యక్తిని తీసుకుని రాజేష్ పార్టీలో అడుగుపెట్టాడు. ఆ కొత్త వ్యక్తికి ముప్పై రెండేళ్ళు ఉంటాయేమో. బంగారు రంగు చాయతో, ఎత్తుగా బలంగా ఉన్నాడు. కళ్ళు మత్రం బేలగా ఫిష్ ట్యాంకులో గోల్డ్‌ఫిష్‌లా పదే పడే అటు ఇటూ కదులుతున్నాయి. రూపానికి తగ్గ ఆత్మ విశ్వాసం లేదు అనుకుంది తన్మయ. అతని బట్టలు, అలంకరణలు చూసి ఒంటరిగా ఉండే తత్వం అని పసిగట్టింది. తల ఎత్తి ఎవరిని చూడకుండా రాజేష్‌నే అనుసరిస్తున్న పద్దతిని గమనించి ఆత్మన్యూనత కూడా ఉంది అనుకుంది. ఒకే కమ్యూనిటీలో చిన్నప్పటి నుండి ఆటలాడుకుంటూ, చదువుకుంటూ వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులంతా ఏడాదికోమారు ఇలా కలిసి పార్టీ చేసుకోవటం అలవాటు. ఈ పార్టీల్లో ఒక్కోసారి కొందరు తమ పరిచయస్థులని తీసుకుని వస్తూ ఉంటారు. అందుకే తన్మయ పెద్ద ఆసక్తి కనబరచ లేదు.

రాజేష్ ఆ మనిషిని కాస్త దూరంలో కూర్చుండబెట్టి తన్మయ దగ్గరకి వచ్చాడు. ఆ వ్యక్తిని చూపించి తన పేరు ఆనంద్ వర్మ అని తన స్నేహితుడని చెప్పాడు. తన్మయ సహజంగా పరిచయం చేస్తున్నాడేమో అన్నట్టు చూసి ఊరుకుంది. “తనని ఇక్కడికి తీసుకు వచ్చింది నీకు పరిచయం చేద్దామనే” అన్నాడు రాజేష్.

“చిన్నప్పటి నుండి చాలా తెలివైన వాడు. కాలేజ్ చదువు చదవకపోయినా. చాలా చదివాడు. ఇంటిలో పేద్ద లైబ్రరీ ఉంది. ప్రపంచంలోని రాచరికాలు, ప్రపంచ విప్లవాలు, సాహిత్యం దేని గురించైనా అనర్ఘలంగా మాట్లాడగలడు. ఇంత నాలెడ్జ్ ఉండీ దానిని వినియోగించుకోడు” అని తన్మయ వైపు చూసాడు.
“ఉపయోగించకపోవటం అంటే?” అని అడిగింది తన్మయ. ఇది సాదారణ సమస్యే అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలు ప్రతి మనిషి పరిగెట్టేది ఏదో నేర్చుకోవాలని లేదా ఏదో సాధించెయ్యాలని. నిజమైన జ్ఞానాన్ని సంపాదించిన మనిషికి కొత్తగా నేర్చుకోవటానికి ఏమీ ఉండదు, ఏదో సాధించేద్దామనే ఆసక్తి ఉండదు.

రాజేష్ చెప్పటం కొనసాగించాడు. “సరిగ్గా తనకి పదేళ్ళున్నప్పుడు తన తల్లిదండ్రులు కారుప్రమాదంలో చనిపోయారు. బంధువులు ఆనంద్‌ని హాస్టల్‌లో జాయిన్ చెయ్యాలనుకున్నారు. కానీ ఆనంద్ అందుకు ఒప్పుకోలేదు. ఆ వయస్సు నుండి తను ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. తనే వంట చేసుకునేవాడు. తనే ఇంటి పనులన్నీ చేసుకునేవాడు. బంధువులు మొదట్లో కంగారుపడినా తర్వాత అలవాటు పడిపోయారు. తోటివారితో పెద్దగా కలిసేవాడు కాదు. నాతో బానే ఉంటాడు, కానీ కొత్తవారితో తొందరగా కలవడు. ఇల్లు దాటి బయటకు రావటానికి ఇష్టపడడు. తన ఇంటికి ఎవరిని ఆహ్వానించడు. కాస్త స్థితిమంతుడవ్వటంతో ఇంతవరకూ ఏ ఇబ్బంది కలగలేదు. ఇకనైనా మారకపోతే ముందు ముందు బ్రతుకు గడవటం కష్టం. అది వాడికి తెలియటం లేదు. ఏదో మానసిక సమస్యే అయ్యుంటుందని నా అనుమానం. డాక్టర్ అంటే రాడని ఇలా పార్టీకి తీసుకు వచ్చాను.”

రాజేష్ మాటలు వింటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన షాక్‌లో తనకి ఇలాంటి సమస్య వచ్చుంటుందని అనుకుంది తన్మయ. రాజేష్ వెంట నడిచింది.రాజేష్ స్నేహితులని పరిచయం చేస్తున్నట్టుగా తన్మయను పరిచయం చేసాడు. అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. మాటల మధ్యలో చరిత్ర, జ్యోతిష్యం తనకిష్టమైన విషయాలని చెప్పాడుఆనంద్. జ్యోతిష్యం ఒక ట్రాష్ అని మనుషుల నమ్మకాలు, బలహీనతల్ని సొమ్ము చేసుకునే వ్యాపారమని తన్మయ కొట్టి పారేసింది.

“బౌతికంగా చూపించలేని ఒక మనస్సనే వస్తువును సృష్టించి, శాస్త్రీయంగా నిరూపించలేని సమస్యలని దానికి ఆపాదించి, కేవలం అంచనాలతో, స్వంత అవగాహనలతో మీరు చేసే వైద్యం శాస్త్రీయమని మీరు నమ్ముతున్నప్పుడు, ఖచ్చితమైన లెక్కలతో గణించే శాస్త్రాన్ని నేను నమ్మటం లో తప్పేంటి” అని సూటిగా తన్మయను చుస్తూ అడిగాడు ఆనంద్. తను అతని కళ్ళలోకి చూసేసరికి అతని కళ్ళు తిరిగి మీనాలయ్యాయి. ఇంత బేలగా కనిపిస్తున్న వ్యక్తి మాటల్లో అంత పరిశీలన అని ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది తన్మయ. తన ఆశ్చర్యాన్ని గమనిస్తూ “వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కేవలం అంచనాలు. ఆలోచనలు మాత్రమే నిర్దుష్టమైనవి, ఎవరూ తెలుసుకోలేనివి” అని నవ్వాడు. ఈసారి తన్మయకు కళ్ళు బైర్లు కమ్మాయి. అతను తన మనస్సు చదివేసాడు. తన్మయకొక క్షణం భయం, ఆందోళన కలిగాయి. ఇన్నేళ్ళ తన చదువుకి లొంగని దృడమైన ఆలోచనలేవో అతని వద్దున్నాయి అనిపించింది. తన్మయ స్నేహితులు కొందరు అటుగా వచ్చేసరికి ఆనంద్ తిరిగి బేలగా మారాడు. పార్టీ ముగిసి ఆందరూ వెళ్ళిపోయారు. తన్మయ రాజేష్‌తో తర్వాత మాత్లాడతా అని చెప్పి వచ్చేసింది.

ఇంటికొచ్చినా తన్మయ ఆలోచనలు ఆనంద్ చుట్టూనే తిరుగుతున్నాయి. మర్నాడు క్లినిక్ వెళ్ళకుండా రాజేష్‌ని అడిగి ఆనంద్ అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది. చుట్టూ పెద్ద తోట మధ్యలో రాజ్‌మహల్లా ఉంది ఆ ఇల్లు. పనివాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. ఇంత పెద్ద బంగళాని పనివాళ్ళు లేకుండా ఒంటరిగా నెట్టుకొస్తున్నాడా అని ఆశ్చర్యపడింది తన్మయ. తోట దాటి బంగళా లోకి వచ్చి తలుపుకొట్టింది. తలుపుకొట్టిన చాలాసేపటికి ఆనంద్ వచ్చి తలుపుతీసాడు. ఒకింత ఆశ్చర్యంగా తనవైపు చూసాడు.
“ఈరోజు క్లినిక్‌కి వెళ్ళాలనిపించలేదు. కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాను. మీకభ్యంతరం లేకపోతేనే” అని అడిగుతూ అతని కళ్ళల్లోకి చూసింది తన్మయ. అతను కళ్ళు పక్కకు తిప్పుకుని దారి వదిలాడు. తన్మయ లోపల అడుగుపెట్టి అతడిని అనుసరించింది.

ఇల్లంతా పురాతన రాజప్రసాదంలా ఉంది. చెక్కతో చేసిన సోఫాలు, కుర్చీలు, పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్‌లు అంతా ఏదో మ్యూజియంలా ఉంది. నా ఆలోచనలు పసిగట్టిన ఆనంద్ తమది రాజవంశమని, తమ వంశ పెద్దలు విజయనగర ప్రభువుల దగ్గర దివానులుగా పని చేసేవారని చెప్పాడు. ఆశ్చర్యంగా ఇల్లంతా కలియతిరిగింది తన్మయ. పెద్ద పేద్ద  డైనింగ్ టేబుల్లు, పెద్ద లైబ్రరీ అన్నింటిని చిన్నపిల్లలా సంబ్రమంగా చూస్తున్న తన్మయను చూసి ఆనంద్ నవ్వుకున్నాడు. అతనికి తన్మయ దగ్గర బెరుకుపోయింది. అలా చూస్తూ పూజగది దగ్గరకు వెళ్ళిన తన్మయను ఆపేసి వెనక్కు తీసుకు వచ్చేసాడు ఆనంద్.

ఆరోజు నుండీ రోజూ తన్మయ ఏదో ఒక సమయంలో ఆనంద్ ఇంటికి వెళ్ళేది అతడితో కబుర్లు చెప్పేది. ఒకరోజు లైబ్రరీలో ఝాన్సీ లక్ష్మీభాయ్ చరిత్ర పుస్తకాన్ని చూసి “ధీరవనిత, తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు కదా” అంది తన్మయ. ఆనంద్ ఏటో చూస్తూ “ఆరోజు జరిగిన విప్లవానికి ప్రధాన కారణం మత విశ్వాసాలు, రాజ్య సింహాసన రక్షణ. కానీ విచిత్రంగా చరిత్రలో మొదటి స్వాతంత్ర్యసమరంగా వక్రీకరించబడింది. ప్రజాస్వామయయుత స్వాతంత్ర్యాన్ని నిజానికి ఏ రాచరికం కోరుకోలేదు” అని చెప్పాడు.

అతనితో జరిపే సంభాషణలు ఆమెకు కొత్త పాఠాలు నేర్పేవి. చరిత్రను పుస్తకాల్లో వ్రాయబడ్డ కథల్లా కాక వాస్తవిక దృష్టితో చూడటం నేర్పేవి. అందుకే తన్మయ వీలు చిక్కినప్పుడల్లా ఆనంద్‌ని కలిసేది. అంత చనువులోనూ ఆనంద్ తన ఇంటిలో కొన్ని గదుల్లోనికి తన్మయను రానిచ్చేవాడు కాదు. ఏదో రహస్యం దాస్తున్నాడని ఆమెకు అనిపించేది. ఒకరోజు ఆనంద్ తోటపనిలో ఉండగా తన్మయ నేరుగా ఇంటిలోకి వచ్చింది. లైబ్రరీలో పుస్తకాల కోసం చూస్తున్న తన్మయకు ఒక పాత డైరీ కనిపించింది. లోపల చూస్తే చిన్నపిల్లల చేతివ్రాతతో డైరీ వ్రాయబడి ఉంది. తన్మయ ఆ డైరీని తన బ్యాగ్‌లో వేసుకుని ఆనంద్ కంటపడకుండా వచ్చేసింది.

ఆ డైరీ ఆనంద్ తల్లిదండ్రులు చనిపోక ముందు వ్రాసుకున్నది. పుట్టినరోజుకి తండ్రి తనకు డైరీ బహుమతిగా ఇచ్చాడని, ప్రతిరోజు వ్రాయమని చెప్పాడని అందులో వ్రాసుకున్నాడు ఆనంద్. పేజీలు తిప్పుతూ ఉంటే ఆనంద్‌కి తనతండ్రి చెప్పిన రాజులకధలు ఉన్నాయి. కోట నుండీ రహస్య మార్గాలు, సొరంగ మార్గాల్లో నిధినిక్షేపాలు, కోట ముట్టడి జరిగినప్పుడు వారసులని రహస్యంగా కోటదాటవేయడాలు ఇలాంటి విషయాలు తన తండ్రి దగ్గర విని ఎంతో ఆసక్తిగా వ్రాసుకున్నట్టు తన్మయకు అర్ధమయ్యింది. విజయనగర ప్రభువులు దగ్గర ఆనంద్ వంశ పెద్దలు దీవానులుగా చూపిన తెగువ, యుద్ధంలో ప్రభువు రక్షణ కోసం ప్రాణాలర్పించిన త్యాగాలు, శత్రువుల చేత చిక్కినప్పుడు రహస్యాలు బయటపెట్టకుండా చేసిన ఆత్మత్యాగాలు ఎంతో గర్వంగా వ్రాసుకున్నాడు.

అన్నీ ఆసక్తిగా చదువుతున్న తన్మయకు ఒక పేజి ఎర్ర సిరాతో కనిపించింది. “నాన్న ఈరోజు నాకొక రహస్యం చెప్పారు. విజయనగర ప్రభువుల రహస్యమొకటి మా దేవుడిగదిలో భద్రంగా దాచబడిందని, దాని రక్షణ మా కుటుంబ కర్తవ్యమని చెప్పారు. ఆ రహస్యం తెలుసుకోవటానికి గూఢచారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మా ఇంటి పనివాళ్ళలో కూడా శతృ గూఢచారులుండొచ్చని నాన్న అనుమానం. నాన్న తరువాత ఆ బాధ్యత నాదేనంట” అని వ్రాసి ఉంది.

తన్మయకు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగాయి. అందుకే ఆనంద్ నన్నెప్పుడూ దేవుడి గది వైపు వెళ్ళనీయలేదు అనుకుంది. తరువత పేజి తిప్పి చూసింది “ఈ రోజు నాన్న, అమ్మ వెళ్తున్న కారుని శత్రువులు లారీతో గుద్దేసారు. ప్రభువుల కోసం ప్రాణత్యాగం చేసిన నాన్న మా వంశకీర్తిని కాపాడాడు. ఇక పైన భాద్యతలన్నీ నావే” అని వ్రాసుకున్నాడు ఆనంద్. అదే చివరిపేజి.

తన్మయ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తనకు పరిచయం లేని ఏదో వింతలోకంలోకి వచ్చిపడ్డట్టుగా అనిపించింది ఆమెకు. వెంటనే రాజేష్‌కి ఫోన్ చేసి “ఆనంద్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారని” అడిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పాడు రాజేష్. “ఆ రోడ్డు ప్రమాదం వెనుక మిస్టరీ ఉంది” అని చెప్పింది తన్మయ. “నీకెలా తెలుసు” అని అడిగాడు రాజేష్. తన్మయ తను చదివిన విషయాలన్నీ చెప్పింది రాజేష్‌కి. రాజేష్ నమ్మలేనట్టుగా మాట్లాడేసరికి ఫోన్ పెట్టేసింది.

ఆ రోడ్డు ప్రమాదం రహస్యాలు తెలుసుకోవాలని బలంగా అనుకుంది తన్మయ. వృత్తి రిత్యా కొన్ని సందర్భాల్లో పోలీసు కేసుల్లో తన్మయ సహాయం చేసింది. అప్పటి నుండి పోలీస్ కమీషనర్ తన్మయని ఎంతో ఆదరంగా చూస్తాడు. ఆ కమీషనర్ సహాయం తీసుకుంటే రోడ్డుప్రమాదం కేసు తిరిగి తోడచ్చని అనుకుంది. మరుసటిరోజు ఉదయం కమీషనర్ దగ్గరకి వెళ్ళి తను వచ్చిన పని చెప్పింది తన్మయ. కమీషనర్ నవ్వి “నువ్వు చెప్పేదంతా ఏదో చందమామ కథలా ఉందమ్మా” అంటుండగా అతనికి ఫోన్ వచ్చింది. అతను షాక్ గురయినట్టు మొహం పెట్టి “ఎంత యాధృచ్చికమో చూసావా తన్మయ? ఆ ఆనంద్ ఇంటిలో దొంగలుపడ్డారంట, అతనికి కత్తి గాయాలయ్యాయంట. అదే ఫోన్. పదా” అంటూ తన్మయను తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరాడు కమీషనర్. తన్మయ కూడా షాక్‌లో ఉంది ఇన్నేళ్ళుగా ఆనంద్ ఒంటరిగా ఉన్నా ఎప్పుడూ జరగని దొంగలదాడి ఈరోజే ఎందుకు జరిగింది? తను ఈ రహస్యం బయటపెట్టడం వలన ఈ ప్రమాదం జరిగిందా? అవును రాజేష్. రాజేష్ శత్రువుల గూఢచారా? ఆలొచనలతో తన్మయ బుర్ర పగిలిపోతుండగానే హాస్పిటల్ వచ్చింది.

కమీషనర్‌ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చిన పోలీసులు “దొంగలుపడి ఇల్లంతా గాలించినట్టు తెలుస్తుంది సార్. ఏదీ దొరక్క ఆనంద్‌ని గద్దించేసరికి, ఆనంద్ బయపడి తన మెడ తనే కోసుకున్నాడు. పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని” చెప్పారు. తన్మయ పెదాలు ఆప్రయత్నంగా కదిలాయి “ప్రభువులకోసం ఆత్మత్యాగం”

ఐ.సి.యు.లో ఉన్నా అనంద్‌ని చూస్తే తన్మయకు దుఃఖం ఆగటంలేదు. కమీషనర్ తనని సముదాయించి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇంటికి కారులో బయల్దేరిన తన్మయ ఒక్కసారిగా కారు వెనక్కి తిప్పి ఆనంద్ ఇంటికిపోనిచ్చింది. ఇంతమంది ప్రాణాలు తీసిన ఆ రహస్యం ఈరోజు బయటపడాల్సిందే అని పిచ్చికోపంతో ఊగిపోతూ సరాసరి ఆనంద్ పూజగదిలోకి వెళ్ళింది. ఎన్నో రోజులుగా పూజ లేక బూజుపట్టిన ఆ గదిని చిందర వందర చేస్తూ వెతకసాగింది. ఆఖరికి దేవీపీఠం క్రింద ఒక చిన్న పెట్టె దొరికింది. దాని చుట్టూ ఒక తెల్ల గుడ్డ చుట్టి ఉంది. దాని మీద రహస్యం అని వ్రాసి ఉంది. పిచ్చి పట్టినదానిలా ఆ తెల్ల గుడ్డని పీకి పారేసింది తన్మయ. పెట్టె తీయగానే అందులో ఒక వజ్రపుటుంగరం, ఒక ఉత్తరంకనిపించాయి. ఉత్తరం తెరిచింది.

“ఆనంద్ బాబూ, నీకు ఇరవయ్యవ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇన్నేళ్ళుగా రహస్యం అని నీకు చెబుతున్నది ఈ ఉంగరం గురించే. కాకపోతే ఇది విజయనగర ప్రభువుల రహస్యం కాదు. మన ఇంటి రహస్యమే. ఈ ఉంగరం నేను మీ అమ్మకు చదువుకునే రోజుల్లో ఇచ్చిన మొదటి బహుమతి. తరువాత మీ అమ్మ నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం.  అందుకే ఇది మన ఇంటి లక్కీ చార్మ్. ఈరోజుతో నీకు ఇరవై నిండాయి కాబట్టి ఇకపై నీ స్వంత ఆలోచనలు నీకు ఉంటాయి. నీ మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఉంగరం బహుమతిగా ఇవ్వు. ఆ అమ్మాయి తప్పక నిన్ను పెళ్ళి చేసుకుంటుంది. ఈ ఉంగరం మన ఇల్లు దాటి వెళ్ళదు. కేవలం నిన్ను థ్రిల్ చేద్దామనే ఇన్నేళ్ళుగా ప్రభువుల రహస్యం అని కథ చెప్పి నిన్ను నమ్మించా. ఎలా ఉంది ఈ సర్‌ప్రైజ్? వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే”

తన్మయకు తల తిరిగింది, మాటలు ఆలోచనలు ముందుకు సాగటం లేదు. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆమె సెల్‌కి మెసేజ్ వచ్చింది. నంబర్ చూస్తే పోలీస్ కమీషనర్. మెసేజ్ ఒపెన్ చేసింది

“ఆనంద్ ఈజ్ నో మోర్”