బ్లాగర్ల ఆత్మీయ సమావేశం

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో తెలుగు వ్రాయటం లేక చదవటం ఇప్పుడు అత్యంత సాదారణమైన విషయం. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వాడగలిగేంత సరళమైన ప్రక్రియ. కానీ 10 ఏళ్ళ క్రితం టెక్నాలజీలో పని చేసే వాళ్ళకు కూడా తెలుగుని ఇంత విరివిగా కంప్యూటర్‌లో వాడుకోవచ్చనే అవగాహన లేదు. అసలు ఇంత విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు.

కానీ ఈ మార్పులు ఒక్క రాత్రిలో వచ్చేయలేదు. తెలుగు టైపింగ్ అంటే డిటిపి చేసే వాళ్ళకి ఇవ్వాలి, సాఫ్ట్‌వేర్లు కొనుక్కోవాలి అనే రోజుల నుండి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో సునాయాసంగా తెలుగు టైప్ చేసే రోజులకు వచ్చేసాం. దీని వెనుక ఎందరో ఔత్సాహికుల కృషి ఉంది.

IMG_0113

గూగుల్‌లో వెతికితే తెలుగు సమాచారం ఏమీ దొరకని రోజుల్లో అందరినీ తెలుగు వాడేలా ప్రోత్సాహించి, అవగాహన సదస్సులు నిర్వహించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిన e-తెలుగు గూర్చి ఈ రోజున తెలుగు టైప్ చేస్తున్న వారిలో ఎందరికి తెలుసు?

IMG_1571

కంప్యూటర్‌లో తెలుగు ఉంది చూడండి అని ప్రచారం చేసి, చేయిపట్టి అక్షరాలు దిద్దించినట్టుగా యూనికోడ్‌లో తెలుగు టైపింగ్ నేర్పించి, అవసరమైన సాఫ్ట్‌వేర్లను సిడిల్లో ఎక్కించి ఉచితంగా పంచిపెట్టి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఎంతో కృషి చేసిన సంస్థ e-తెలుగు. సంస్థ సభ్యులు తమ సొంత డబ్బులు పెట్టుకుని ఏ లాభాపేక్షలేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. వీళ్ళందరీనీ నడిపించిన చైతన్యం ఒకటే భాష మీదున్న అభిమానం.

ప్రతి ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్‌ని నిర్వహించి తెలుగులో బ్లాగుల వ్యాప్తికి ప్రోత్సహించటమే కాకుండా మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే ఒక బ్లాగు క్రియేట్ చేసి, దాని నిర్వహణ మీద అవగహాన కల్పించేవారు. కేవలం బ్లాగులే కాదు, తెలుగు వికీపీడియా వ్యాసాల అభివృద్దిలో కూడా పాలుపంచుకోమని ప్రచారం చేసేవారు. ప్రొపరైటరీ ఫాంట్స్ వాడే తెలుగు వార్తాపత్రికలకు, వెబ్‌సైట్స్‌కి యూనీకోడ్ వల్ల లాభాలు వివరించి, యూనికోడ్‌కి మారేలా ప్రోత్సహించారు. ఈ స్టాల్ నిర్వహణ కోసం సభ్యులు ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ వచ్చేవారు. ఈ కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు పని చేసానని చెప్పడానికి గర్వపడతున్నా.

ఈ విషయాలన్నీ తెలుగు బ్లాగుల్లో పాతపోస్టుల్లో ఎక్కడో మరుగునపడిపోయాయి. ఒక సౌకర్యవంతమైన నేటి వెనుక ఎందరిదో ఎన్నో రోజుల కృషి ఉంటుంది. అప్పుడప్పు ఇలా గుర్తు చేసుకోకపోతే, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే లావైపోతాం.

ఎన్నోరోజుల తర్వాత ఆనాటి బ్లాగర్లు, e-తెలుగు సభ్యులు ఈ ఆదివారం (05-01-2020) కృష్ణకాంత్ పార్కులో సమావేశమయ్యారు. మళ్ళీ e-తెలుగు ని చైతన్యవంతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరో ఉద్యమానికి ఇది నాంది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

blogmeet

ఐ హేట్ యు రా

 ద్వేషించే శక్తి నాకివ్వు భగవాన్!!

ద్వేషించే శక్తి నాకివ్వు భగవాన్!!

ప్రియమైన నీకు,

ఇప్పుడిలా పిలవటం నీకు నచ్చదేమో? కానీ అప్రియమైన అనేంత సంస్కారం నాకులేదుగా. అయినా ఇదేగా చివరిసారి నేను పిలవటానికైనా, నువ్వు వినటానికైనా. నీకొక విషయం చెప్పాలి. కానీ ఎదుటపడి చెప్పే దైర్యంలేక ఇలా వ్రాస్తున్నా.కొన్ని భావాలు దాచుకోలేనివి.నీకు వినే ఆసక్తి లేదని తెలుసు కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నా.నిన్ను ఇబ్బందిపెట్టే ఇలాంటి పని చెయ్యకూడదు అనుకున్నా కానీ చేయకుండా ఉండలేకపోతున్నా.

“ఐ హేట్ యు రా!” అవును మనస్పూర్తిగా చెబుతున్నా.

ప్రపంచంలో ఎక్కడున్నా నా నోటి వెంట ఈ మాట ఏదో ఒకరోజు వింటే చాలన్నావుగా. నిన్ను ద్వేషిస్తూ అయినా నేను ఆనందంగా ఉండటమే కావలన్నావుగా. అందుకేనేమో ఇప్పుడు నిన్ను ద్వేషించటంలో ఆనందం పొందుతున్నా. ఆమాత్రానికి ఉత్తరం అవసరమా అనకు. ప్రేమయినా,ద్వేషమయినా నా మనసులో కలిగిన అనుభూతులే. ప్రేమించినప్పుడు ఎంత అందంగా చెప్పానో ద్వేషించినప్పుడు అంతే బలంగా చెప్పాలిగా. అయినా చెప్పకపోతే నీకుమాత్రం తెలిసేదెలా? ఎంత నువ్వే కాదనుకుని వెళ్ళినా ” ఐ హేట్ యు” అంటే మనసులో కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా! అయినా వదిలివెళ్ళిపోయేప్పుడు మనుషులు రాక్షసుల్లా ఉండాలంటావుగా, అలానే ఉండి ఉంటావులే. అందుకే ఈ మాట పెద్దగా నీకు ఇబ్బంది పెట్టదు.

హమ్మయ్య మనసులో మాట చెప్పేసాగా ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. ఎప్పటికయినా నేను ఇలా ఆనందంగా ఉండాలని మనసులో కోరుకుంటున్నా అన్నావుగా. దేవుడు నీ మాట విన్నాడేమో. నా గురించి ఇంతలా ఆలోచించే నీకు ఏమి చెప్పాలి. థాంక్యూ. అయినా నీ పిచ్చిగానీ ద్వేషించకుండా ఎలా ఉండగలను?

అభిమానంతో చాచిన చేతులు అఘాదంలోకి తోసేసావు

భావలను మోసుకొచ్చిన లేఖల్ని చింపి గాలిపటాలుగా ఎగరేసావు

పంచుకుని పెంచుకున్న కలల్ని కలలే అని తేల్చేసావు

కింద పడి ముక్కలుగా మిగిలిన బహుమానాలు, గాజు బొమ్మలు ఇంకా ఎవేవో

మధ్యలో ఎక్కడో నా మనస్సు కూడా

అయినా ఎదురుగా ఉన్న మనిషినే కాదనుకున్నాక, కనబడని మనసుకు మాత్రం విలువిస్తావా? రాజులకు వేట నీకు ఈ ఆట వినోదమనుకుంటా.

గుండెలవిసేల భాదతో నేలమీద కొట్టుకుంటున్న ప్రాణం నాది కాదు అన్నప్పుడు ఆమాత్రం వినోదముంటుందిలే. అయినా ఇన్నిమాటలెందుకులే అందలేదన్న దుగ్దతో చేసిన ఆరోపణలకు లోకం ఏమాత్రం విలువిస్తుందో నాకు తెలుసు. ఒక్కమాట చెప్పటం మరిచాను,నేను కూడా నిన్ను ద్వేషించనా అని అడుగుతావేమో? ఆ హక్కు నీకు లేదు. ఎవరినయినా ప్రేమించటానికి,అభిమానించటానికి హక్కుందే గానీ, ద్వేషించటానికి లేదు. అంతః శుద్దిగా ప్రేమించినవారికి మాత్రమే కోపాన్ని గాని, ద్వేషాన్ని గాని చూపించే హక్కు ఉంటుంది. దేవుడికి, అమ్మకి, ఓ ప్రేమికుడికి.

నాకు తెలుసు నువ్విప్పుడు నవ్వుకుంటావ్

నన్ను నువ్వు గెలిచావనో?

నేను నిన్ను గెలవలేదనో?

ఇద్దరుగా మొదలయిన ప్రయాణంలో నువ్వు మాత్రం ఒడ్డుకు చేరుకున్నావన్న సంతోషంతో

తప్పయినా సరే తప్పక చేస్తున్నా అని చెప్పి, తప్పించుకున్న ఆనందంతో

నాకై నేనే పేర్చుకున్న చితిలో తగలబడిపోతున్న నా వెర్రితనాన్ని చూసి

నవ్వుకుంటావ్ నవ్వుకుంటావ్ నేనెవరో మర్చిపోతావ్.

ఒకర్ని భాదపెడుతున్నాం అనే స్పృహలేకుండా నవ్వటం కూడా ఒక వరమే కాదా.

ఆ నవ్వుని జయించలేనేమో అని భయంవేసింది, భాదనిపించింది.

ముఖం చాటేసి తప్పుకుతిరిగా

అనందాన్నిచ్చే ప్రతిది ఆశ్రయించా

అప్పుడూ కూడా అదే నవ్వు

నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా

ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా

అక్కడ కూడా అదే నవ్వు. కలలో కూడా అదే నవ్వు.

ఆ నవ్వే మెల్ల మెల్లగా నన్ను కమ్మేసింది

ఆ నవ్వే నాలో ఆవేశాన్నో కసినో పెంచింది

చివరకి అదే నిన్ను ద్వేషించేలా చేసింది.

కానీ ఇప్పుడు నన్ను నిర్వీర్యం చేయలేకపోయిన నీ నవ్వుని చూసి నేను నవ్వుకుంటున్నా. మానసికంగా బలంగా మారుతున్న ప్రతి నిమిషం నవ్వుకుంటున్నా

నాలో ఆత్మవిశ్వాసం పెరిగేంతలా,

నాలో పరిణతి కలిగేంతలా,

నన్ను నేను తిరిగి కనుగొంటూ నవ్వుకుంటున్నా.

ఇప్పుడు మరలా నేను నేనయ్యాను.

హమ్మయ్య నన్ను నేను ఎవరికీ కోల్పో లేదు.

ఇప్పుడు మరింత గర్వంగా,నమ్మకంగా,బలంగా చెబుతున్నా “ఐ హేట్ యు అండ్ ఐ మీన్ ఇట్”

నీకు అప్రియమైన

నేను.

లోవెల్ ప్రాంతంలో బ్లాగు మితృలు ఉన్నారా?

నేను ప్రాజెక్ట్ పని మీద ఒక 6 నెలల పాటు ఉండటం కోసం నిన్ననే లోవెల్, మసా చూసెట్స్ వచ్చాను. ఈ ప్రాంతంలో బ్లాగు మితృలు ఉన్నారా?

వినాయక చవితి శుభాకాంక్షలు (మూషికవ్రతం మరిచిపోకండి) :)

బ్లాగు మితృలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ పరమాత్ముడు మీ సర్వకార్యములలో విఘ్నాలను తొలగించి అన్ని రకముల శుభములను, విజయాలను అందిచాలని కోరుకుంటూ
మీ
మురళీ.

నేటికి నెరవేరిన మూషికవరం వృత్తాంతం చదివి,విని,అందరికి చెప్పి సుఖశాంతులు పొందుదురు గాక.

)

బ్లాగ్విషయం నివేదిక

ఈ సారి బ్లాగ్విషయం “అల్లరే అల్లరి” లేదా “బకరా” నివేదిక ని తయారుచేసే భాద్యతని జ్యోతక్క నాకప్పగించారు. మీ అందరి సహకారంతో ఈ నివేదిక ని అందిస్తున్నా. అసలు నిజానికి మన బ్లాగర్లలో అబ్బాయిలంతా రాముడు మంచి బాలుడు, సుశీల నెమ్మదస్తురాలు అనే టైపు అనుకుంటా. అసలు ఈ అల్లరి అంటే ఏంటో ఆంగ్ల నిఘంటువుల్లో వెతికారేమోనని నా ఉద్దేశ్యం. అయినా నా పని చాలా సులువు చేసారు. మొత్తం గా పది టపాలు కూడా లేవు.

నివేదిక:

పాపం పసివాడి ని ఆటాడించిన జ్యోతి గారి అల్లరి కబుర్లు.

అల్లరా.. నేనా?? అంటూ తన ఊహలన్నీ ఊసులు గా మార్చి మనకి అందించిన పూర్ణిమ గారి అల్లరి ఙ్ఞాపకాలు.

నవ్వుల పువ్వులు పూచే బ్లాగువనం లో నేను స్కూలుకెందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే……..! అంటూ చెబుతున్న స్కూల్ దొంగ శ్రీ విద్య.

నేను చెప్పేది ఏమిటంటే… అసలు అల్లరే అల్లరి .. అని తన స్నేహితుడి ని ఆటపట్టించిన నిరంజన్ గారి 3 అల్లర్లు, 6 గొడవల కధ.

అల్లరా? అంత అదృష్టం కూడానా! అని తన మనసులో మాట చెప్పిన సుజాత గారు.

అమ్మో అల్లరా? ఈ మాట వింటే మా అమ్మ చీపురు తిరగేస్తుంది అంటూనే ఆడహనుమంతుల కిష్కింధకాండ ని సృష్టించిన కలగారు.

చివరిగా మీ అబ్బాయి చాలా మంచోడు అని నా గురించి అపోహపడ్డ మా అమ్మగారి స్నేహితులు.

ఇవండి అల్లరి కబుర్లు చదవని వారు చదవండి. చదివిన వాళ్ళు మరొక్కసారి చదివి ఆనందించండి.

ఈ సారి బ్లాగ్విషయం నన్ను సూచించమన్నారు. ప్రతిసారిలా హాస్యాన్ని కాక కాస్తంత సీరియన్ గా వుండాలని చెప్పారు. అందుకే మనందరికి ఇష్టమైన విషయం “తెలుగుతనం”.
తెలుగంటే పట్టుపరికిణీ వేసుకున్న 16 అణాల పడుచుపిల్ల.
తెలుగంటే గుబురుమామిడి తోటలో కోయిలమ్మ.
తెలుగంటే ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు.
తెలుగంటే నోరూరే గోంగూర పచ్చడి.
తెలుగంటే… అన్ని నేనే నా మీరూ చెబుతారా?

అవును పాశ్చాత్య సంస్కృతి లో కొట్టుకు చస్తున్న మన యువత కి తెలుగు అందాన్ని తెలియ జేసేలా మీ ఊహలు, అనుభవాలు, కోరికలు ఏవైనా. వాలుజడ మరదలి గురించి కావచ్చు, చిలకట్టు కట్టిన బావల గురించి కావచ్చు, సరదాల సంక్రాంతి కావొచ్చు, షడృచుల ఉగాది కావొచ్చు ఏదైనా తెలుగుతనం ఉట్టి పడే టపాల తోరణాలు అల్లండి. లేదా కాంక్రీటు వనాల లో కోయిలమ్మలా, ఈ సంకర సంస్కృతి తో ఇబ్బందిపడుతున్న మీకు  ముద్దపప్పులో వెన్నపూసలా ఆనందాన్నిచ్చి, నేను తెలుగు వాడిననే గర్వాన్ని కలిగించిన అనుభావలెదురయ్యాయా? అయితే ఇంకేం మొదలు పెట్టండి.
ఇక సెలవు మరి. మీ టపాలకై ఎదురు చూస్తా.

మీ
మురళీ.

గమనిక: అల్లరి మీద వ్రాసిన టపాలు ఎవైనా ఈ నివేదిక లో లేకపోతే భవదీయుడ్ని క్షమించి వివరాలు ఇవ్వవలసినది గా మనవి.

తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం

మన తెలుగుబ్లాగర్లందరి తో నా ఆలోచన పంచుకోవాలని ఈ టపా పెడుతున్నాను. నా ఆలోచన వెనక రెండు విషయాలు ఉన్నాయి.
1.ఈ మధ్య కొందరు బ్లాగర్లు కనుమరుగవుతున్న తెలుగు భాష గురించి ఆవేదనగా టపాలు వ్రాసారు. అందరం కూడా చదివి నిజమే కదా అనుకున్నాం.
2.ఇక్కడ బ్లాగులలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి హిపోక్రసీ కి దూరం గా వ్రాయగలిగే ప్రతి ఒక్కరిని రచయితలుగా, విశ్లేషణాత్మక వ్యాఖ్యలు వ్రాసే మిత్రులను విమర్శకులు గా గుర్తిస్తున్నాం.
ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే మన ప్రపంచం లో మన ఆవేదన,ఆక్రోశం మనలోనే ఉండిపోతుంది తప్ప మన ఆంధ్రరాష్ట్రం లో మిగిలిన వారికి చేరటం లేదు.మనలో మనమే భాధపడటం అలానే మనలో మనమే ఓదార్చుకోవటం వలన ఏమిజరగదు.
కానీ మనం ఏమి చేయగలం?
మనం పూర్తిగా ప్రజల్ని మార్చ లేకపోవచ్చు. కానీ ఒక ముందడుగు వేసితెలుగు భాష మీద కాస్త గౌరవాన్ని పెంచగలమని నా భావన. పెద్ద పనులేమీ చేయనక్కరలేదు. పెను చీకటి ని పారద్రోలటానికి ఒక చిన్న దీపం చాలు. అలానే మనమున్న చీకటిని పోగొట్టటానికి ప్రతీ మనసులో ని చిన్న సంకల్పం చాలు.
మన బ్లాగు లోకం తరపున “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” గా ఒకరోజుని గుర్తించి ఆ రోజున తెలుగు వారి గౌరవాన్ని పెంచే చిన్న పనులు చేయవచ్చు. అవి ఎలాంటివి అనేది బ్లాగులోకం లో పెద్దలు నిర్ణయిస్తే బ్లాగు లోకం లో రచయితలుగా, విమర్శకులు గా ఉన్న పిన్నలూ,పెద్దలూ భుజానికెత్తుకోవడమే. విస్తృతంగా వ్యాపించిన మీడియా(టి.వి.9,ఎఫ్.ఎం., వార్తాపత్రికలు)  సహాయం తీసుకొని ప్రజల లోకి తీసుకుపోవచ్చు. బత్తిబంద్ కి ఇచ్చినట్టే దీనికి కూడా పిలుపునివ్వవచ్చు.
నా చిన్ని మెదడు కి తట్టిన ఆలోచన.
ఆ రోజు ఒక బ్యాడ్జి ధరించవచ్చు “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని. ఇలాంటి చిన్న చిన్న పనులను ఒక ఉద్యమంలా తీసుకొని ఆ రోజున మనం చేసి పదిమంది చేత చేయించవచ్చు. ఇది తెలుగు బ్లాగుప్రపంచం తెలుగుభాషకి చేసే చిన్న సేవ.
ఇది ఆచరణయోగ్యం కాదు, ఆమోదం కాదు అంటే వదిలి పెట్టండి.
జై తెలుగు తల్లి.

హ హా హాసిని

కొన్నేళ్ళ క్రితం శంకరాభరణం సినిమా వచ్చిన కొత్తలో వయస్సు మళ్ళిన తాతగార్లంతా “స రీఈఈఈఈఈఈ గాఆఆఆఆఆఆఆఆ మాఆఆఆఆఆ” అంటూ బ్యాటరీ అయిపోయిన రేడియోలా రోడ్లమీద ‘ఖూనీ’రాగాలు తీస్తూ హీరోల్లా ఫోజులు కొట్టారంటా. (నాకు తెలియదులెండి నేనప్పటికి పుట్టి చావలే.ఎవరో చెప్పగా విన్నా.) ఆ తరువాత సోగ్గాడు శోభన్ బాబులు, దసరా బుల్లోల్లు, సకల వాహన చోదకులు (ఆటో డ్రైవర్,లారీ డ్రైవర్ తదితరులు), గూండాలు,రౌడీలు అంతెందుకు నిన్న కాక మొన్న జె.డి.చక్రవర్తి ని చూసి గెడ్డం గాల్లు, నిన్నటికి నిన్న ఆర్య సినిమా చూసి ఒకవైపు ప్రేమికులు అందరూ సినిమాలు చూసి తమని తాము సినిమాలో హీరో గా గుర్తించేసుకొని, ఫోజు కొట్టిన వారే. ఇప్పుడింక మరొకరు తయారయ్యారు. వాళ్ళే హ హ హాసిని లు. బొమ్మరిల్లు,JOB WE MET సినిమాల పుణ్యమా అని లొడ లొడ వాగే వాగుడుకాయలు, పిచ్చి పనులు చేసే టింగరి బుచ్చిలు, మనుషుల పరిమాణం పెరిగినా మెదడులో పరిఙ్ఞానం లేని చవట దద్దమ్మలు ఫోజులు కొట్టేకాలం దాపురించింది. ఇంక అరుదుగా దొరికే ఈ జాతి అమ్మాయిలని తమ ఆడస్నేహితుల జాబితా లో చేర్చుకుంటే ఉన్న పళంగా తాము కూడా సిద్దు అనిపించుకోవచ్చని ఆరాట పడే చవట సన్నాసులంతా అమీర్ పేటలో ఐసుబండ్ల దగ్గర, టాంక్ బండ్ పైన పీసు మిఠాయి కొట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మన హాసినీలు మాత్రం every dog has it’s day. టైం వచినప్పుడే ఫోజు కొట్టాలన్న సూత్రం సిన్సియర్ గా ఆచరిస్తూ తమ చీముడి ముక్కులు ఎగబీలుస్తూ, షోడా బుడ్డీ కళ్ళ జోళ్ళు సవరిస్తూ ఫ్యాషన్ షో చూపిస్తున్నారు. మన సన్నాసులు ఆ మెల్ల కళ్ళలో అందాన్ని పొగుడుతూ, ఆ జడ్డి నవ్వు కై పడి చస్తున్నారు. (అరెరే అరెరే మనసే జారే…, ఎటో వెళ్ళిపోయింది మనసు…)
హు.. ఈ మధ్య నాకో హాసినితో పరిచయం పొందే మహద్భాగ్యం (?) దక్కింది. (కాకపోతే నేను సిద్దు ని కాను. కాదు కూడదు అనుకుంటే భాస్కర్ గా గుర్తించ ప్రార్ధన.) ఈవిడగారెమన్నా తక్కువతిన్నారా? సినిమాలో హాసిని కంటే నాలుగు నాలుగులు పదహారాకులు ఎక్కువ చదివింది. అర్ధరాత్రి టాంక్ బండ్ పైన షికారని వెళ్ళటం, తరువాత భయపడి స్నేహితులని పిలవటం, రైల్లోనో, బస్సులోనో పరిచయమయిన అడ్డమయిన వాళ్ళకి పూర్తి బయొడేటా, మొబైల్ నెంబరు తో కలిపి ఇవ్వటం, తర్వాత తంతు షరామాములే వచ్చే కాల్స్ మాట్లాడలేక నెంబరు మార్చటం, రాత్రి 9 గంటలకి అనగా భోజనానికి 10 నిమిషాల ముందు దుకాణం మొత్తం కట్టేసి వెళ్ళిపోతున్న టీకొట్టువాన్ని పారిపోకుండా పట్టుకొని ఆపి టీ నో కాఫీ నో త్రాగటం ఇంకా.. ఒక్క క్షణం దాహంగా వుంది మంచి నీళ్ళు త్రాగి వస్తా. హమ్మయ్య..ఇంకా ఆటో అంకుల్లు, ఆఫీసులో సెక్యూరిటీ గార్డు ఫ్రెండులు, అప్పుడప్పుడూ చూడటానికి వచ్చి వెళ్ళే  తుమ్మ మొద్దులాంటి పెళ్ళికొడుకులు ఇవన్నీ కలిపితే మా సదరు అప్పలమ్మ గారి వైభోగం లో సగం కూడా కాదు. అందుకనే మొదలుగునవి అని చివర్లో మీరే పెట్టేసుకొని నన్ను క్షమించేసుకోవలసినది గా ప్రార్ధన.
ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని ఆ మనిషి మా వూరే అని తెలిసి మాట్లాడా. మొదట్లో ఆఫీసుకి వెళ్లే తొందరలో టిఫిన్ తినే వాడిలా అరకొరగా మాట్లాడేది. అమ్మాయి నెమ్మదస్తురాలేమో అనుకున్నా. ఒకరోజు అత్యవసరం ఉండి ఫోన్ చేసా. కాసేపటికి మొహమాటం అనే బూజు వదిలిపోయి తన జూలు విదిల్చింది. రాత్రి 10.30 కి మొదలయ్యి తెల్లవారి 3 గంటల వరకూ కొనసాగిన ఏకపక్ష చర్చల్లో (చర్చలు అని ఎందుకన్నా అంటే ఊ.. కొట్టడం, కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పటం నా క్రియాశీలక ప్రాతినిధ్యం గా గుర్తించాలి మీరు. ) నాగురించి అన్ని విషయాలు తెలుసుకొని, తన గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పి వాళ్ళ హాస్టల్ లో మరుసటి రోజు కూర వండటానికి తెచ్చిన కోడి కూసేసిందని పడుకోవాలని తొందరపడి ఫోన్ పెట్టేసింది. తరువాత కొన్ని రోజుల పాటు యధాలాపంగా అంతే సమయం జరిగిన ప్రసంగాల్లో (నా క్రియాశీలక ప్రాతినిధ్యం పూర్తిగా అణిచివేయబడిందని ఈ పాటికి గుర్తించే ఉంటారు.) తన గురించి ఒక మాదిరి అవగాహన ఏర్పడింది. అలా రోజులు ఇడ్లి(మా హాస్టల్ ఎల్లారావు వండే సగం ఉడికిన తెల్ల పిండి ముద్దలు) లో సాంబారులా త్వరగా అయిపోయాయి.

కాలచక్రం గిర్రున తిరిగి ఉగాది కి ఇంటికి బయలు దేరాను. మా హాసిని కూడా ఊర్లో పనుందని బయలు దేరింది. ఆప్రకారంగా నేను తనకూడా ప్రయాణం చేసే దుస్సాహసం చెయ్యాల్సి వచ్చింది. సాహసవంతుడు మొండి గా ముందు కి వెళ్తాడు. కానీ నేను ఒక మోస్తరు గడుసువాడ్నే. అందుకే నా స్నేహితుడ్ని తోడుగా తీసుకువచ్చా. అప్పటికే టిక్కెట్ నా దగ్గర ఉంచుకొని చివరి నిమిషంలో రన్నింగ్ లో రైలు ఎక్కినందుకు, నేను రాకముందే మొదలు పెట్టిన తిట్లదండకం కొనసాగించింది. చుట్టూ కూర్చున్న జనాలు తన వాక్ప్రవాహాన్ని గమనించి, అప్పుడే మొదలయిన కొత్త సినిమాని చూస్తున్నంత ఆసక్తి గా చూడటం మొదలు పెట్టారు. కాసేపటికి అర్ధంకాని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్టు మొహాలు మారాయి. రైలు గుంటూరు చేరే సరికి జనాల గుండె దైర్యం సడలింది. విజయవాడ వచ్చేసరికి దూరదర్శన్ లో బలవంతంగా బదిరులకి వార్తలు చూపిస్తున్నట్టుగా జనాల్లో కొంచెం కలకలం. వాళ్ళ ధైర్యం పరీక్షించటానికా అన్నట్టూ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపేసాడు. విజయవాడ లో దిగాల్సిన జనాలు తమ సామాన్లతో అప్పటికే తలుపు దగ్గర కాచుకొని ఉన్నారు. ఆ అవకాశాన్ని దూరం చేస్తూ  ట్రైన్ మరోసారి ఆపేసాడు. అంతే ఒకరిద్దరు కృష్ణ లో దూకటానికి సిద్దపడ్డారు కానీ ఆ కనకదుర్గమ్మ దయవల్ల అప్పటికే ఆకలి అంటున్న మా హాసిని కాస్త విరామం ప్రకటించింది. ట్రైన్ స్టేషన్ కి చేరుకోగానే గబాలున దూకేసిన ఒక కుర్రాడికి గాయమైనా సరే ప్రాణాలు మిగిలినందుకు ఆనందపడ్డాడు. అందరూ ట్రైన్ వైపు ఒకసారి  దుర్గమ్మ గుడి వైపు ఒకసారి చూసి దండాలు పెట్టుకొని బ్రతుకు జీవుడా అని బయట పడ్డారు. మా పక్కనే కూర్చున్నాయన మాత్రం దిగినవారి అదృష్టం మెచ్చుకొని తన దౌర్భాగ్యానికి తిట్టుకొని నిద్ర కి ఉపక్రమించాడు. విజయవాడ వరకు మా హాసిని వేరే స్నేహితునితో మాట్లాడింది. నేను మహాసముద్రం నవల చదువుతూ గడిపేసా. అప్పుడిక నా తో మాటలు మొదలు పెట్టింది. మా ప్రక్కాయన పాపం మధ్యతరగతి లా వుంది. పీనుగులాంటి భర్త, ఒక మోస్తరు ఏనుగు లాంటి భార్య, ముద్దుగా బొద్దుగా కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక మాదిరి కూతురు. పాపం ఆ కుటుంబం మొత్తం ఎవో బరువు భాద్యతలు మోస్తున్నట్టుగా భారంగా ఉన్నారు. ఆ పాప ట్రైన్లో కూడా క్లాస్ నోట్సులు చదువుకుంటుంది. అలాంటి వారికి ఒకేసారి హాసిని లాంటి వారు తగిలితే ఎలా వుంటుంది. కుటుంబ భవిష్యత్తు పై బెంగ పడిన అంకులు శివాలెత్తి తనకొచ్చిన ఆంగ్లభాష లో అర్ధగంట ఉపన్యసించి మా హాసినిని మందలించి పడుకొనేదాక ఊరుకోలేదు. వాడి దెబ్బకి పడుకున్న మా మేడం గారు ఉదయం వరకు లేస్తే ఒట్టు.

ఇంక మేము తెల్లవారే విజయనగరంలో దిగాము. టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాము. మా దౌర్భాగ్యానికి అక్కడ ఒక ముసలాయన ఈవిడ్ని పలకరించి ఊరు,పేరు అడిగాడు. అంతే మాటలు మొదలు. సమయం సబ్బులా కరిగిపోతున్నా చలనం లేదు. మాతో వచ్చిన స్నేహితునికి ఈ వైపరీత్యం చూసిన తరువాత కళ్ళు తిరిగిపడబోయి కాస్త తమాయించుకొన్నాడు. నేనసలే ఢక్కమొక్కీలు తిన్నవాడ్ని కాబట్టి నాకేం కాలేదు. ఇంతలో పాస్ పోర్ట్  ఆఫీస్ కి వెళ్ళాము. ఆ రోజు ఆఫీస్ కి సెలవు. అప్పటికే కాళ్ళు పీకి అక్కడే కూలబడ్డాం. కూర్చోగానే ఓపికొచ్చి మరలా ఎదో ఒకటి మాటలు మొదలు పెట్టింది. మా వాడు దణ్ణం పెట్టి ఒక చెట్టు కిందకెల్లి పడుకొన్నాడు. పాపం ఒక సాఫ్ట్ వేర్  ఇంజినీర్ అలా చెట్టు కింద పడుకుంటే చాలా జాలేసింది నాకు. మా అమ్మాయిగారు కాస్తా తిరిగి వస్తా అని వెల్లింది. కాసేపటికి  ఒక చోట గుంపుగా తయారయ్యింది. ఈవిడగారు ఎదో చేసిందని భయపడ్డా. కానీ అక్కడున్న పోలిసు అంకుల్లతోనూ, అన్నయ్యల తోనూ కబుర్లు మొదలు పెట్టింది. సదరు గుంపు లో ఒక అన్నయ్యకి తన మొబైల్ ఇచ్చి చార్జింగ్ పెట్టమంది. మా వాడి కి ఈ విషయం తెలిస్తే కింద పడే వాడే కాని పడుకొని వుండటం వల్ల తెలియలేదు. నేను అబ్బే ఇలాంటి విషయాలకి జడిసే రకం కాదు. మా వాడు లేచాడు ఈవిడగారు కూడా సమావేశం ముగించి వచ్చింది. ఇంతలో ఒక పోలిసంకులు వచ్చి “నాన్నా ఈ రోజు సెలవు కదా రేపు వస్తే నీ పాస్ పోర్ట్ పని నేను చేయిస్తా. సరే రా ఎస్.పి. గారి తో పనుంది నేను ఉంటా” అని చెప్పి వెళ్ళిపోయాడు. మా వాడికి లీలగా ఏం జరిగిందో అర్ధమవుతూ ఉండగానే ధబ్ మనే శబ్ధంతో కిందపడ్డాడు. మరలా గుండె దిటవు చేసుకొని లేచాడు. ఇంతలో ఒక పోలిసు అన్నయ్య “నీకు ఫోన్ వచ్చింది రా..” మరలా ధబ్. ఇక నావల్ల కాదని బస్ స్టేషన్ కి లాక్కొచ్చా ఇద్దర్నీ. ఇచ్చట రిజర్వేషన్ చేయబడును అనే బోర్డు బస్ స్టేషన్ లో చూసి మేడం గారు  గోదావరికి రిజర్వేషన్ అడిగారు. లౌడ్ స్పీకర్ లో ధబ్. పాపం ఆ టికెట్ కౌంటర్ వాడు కింద పడ్డాడు. వాడి వెదవ జీవితం లో ఊహించి ఉండడు బస్ స్టేషన్ లో ట్రైన్ టికెట్ అడుగుతారని. నేను మాత్రం మా వూరి మధ్యలో ఉన్న తాండ్రపాపారాయుడి విగ్రహంలా ధైర్యంగా ఉన్నా. బొబ్బిలి బస్ వచ్చింది ఎక్కాం. ఖాళీ లేక మధ్యలో నిలబడ్డాం.  మేడంగారు ఇంజను పైన కూర్చున్నారు. ఈ లోగా మరో ధబ్. మా వాడే ముచ్చటగా మూడోసారి పడ్డాడు. ఎమయ్యిందబ్బా అని చూస్తే ఈవిడగారు డ్రైవరుతో మాటలు మొదలు పెట్టింది. ఈ గ్యాప్ లో డ్రైవర్ గారు చిన్న ప్రమాదాన్ని తృటిలో తప్పించారు. బస్సులో ఉన్న అంత మంది ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మేడం ని నాలుగు తిట్టి, చీవాట్లు పెట్టి నోరుమూసుకొని వుండమని గట్టిగా చెప్పి ఒక సీటు ఖాళీ అయితే అందులో పడేసాం. హమ్మయ్యా అని నేను,నా ఫ్రెండు ఊపిరి పీల్చుకున్నాం. ఇంతలో ఎవరివో మాటలు వినబడి అటు చూసా ఇంకేముంది ఈవిడే నిలబడి ఉన్న ఒకమ్మాయి కి చోటిచ్చి మాటలు మొదలు పెట్టింది. ధబ్ నా ఫ్రెండ్. ధబ్ ధబేల్ ధబ్ ఇంకెవరు నేనే.

ఎంతనుకున్నా సరే ఇలాంటి గమ్మతైన స్నేహితులు, స్మృతులు లేకపోతే నిత్యం సంఘర్షణతో సాగే జీవితం మరీ ఉప్పూ,కారం లేని వంట (మంట, పెంట కూడా) అయిపోదూ. అందుకే అందుకోండి హ హా హాసినీ లు జోహార్లు.

హ్యపీడేస్

నేను B.Sc. చదివే రోజుల్లో హ్యాపిడేస్ సినిమా లానే ఒక గ్యాంగ్ లా వుండేవాల్లం. దావుద్ D లాగా మేము కూడా మొదటి అక్షరాలతో MTS అని గ్యాంగ్ పేరు పెట్టుకున్నాం. ఏం చేసినా,ఎంత అల్లరి చేసినా? ఎవరికి దొరికేవాల్లం కాదు. మేము ప్రతిసారి పేపర్ లీక్ చేస్తున్నామని (PUBLIC exams కాదండొయ్) మా ప్రిన్సిపల్ దగ్గర నుండి, ప్యూన్ రమణ వరకు అందరికి మా మీద అనుమానం. మా క్లాస్మేట్స్ కైతే ఎలా అయినా మమ్మల్ని పట్టించాలని, మమ్మల్ని పొగిడే సార్స్ చేత తిట్టించాలని వాళ్ళ జీవితాశయం. అబ్బో అప్పట్లో మా ఇంటి చుట్టూ నిఘాలు, గూఢచారులు చాలా చేసారు. మేము చదువుతూ ఉండగా, ముఖ్యమంత్రి ఆఖస్మిక తనికీ కి వచినట్టు వచ్చి మా పుస్తకాలు పరిశీలించటం, అందులో పెన్నుతో మేము నక్షత్రం గుర్తులు పెట్టిన ప్రశ్నలు రాసుకొని వెల్లటం ఎన్ని చేసినా ఊహూ.. ప్రయోజనం లేదు. సూత్రధారిని నేనే అయినా పాత్రధారుల ఆచరణ అమోఘం. ముఖ్యంగా మా శ్రీనుగాడు. వాడి నట చాతుర్యానికి ఆస్కారులు, పురస్కారాలు ఎన్ని అయినా తక్కువే.

ఒకసారి ఎలా అయినా మా గుట్టు బయటపెట్టాలని ఒక మిత్రుడు, శ్రీనుగాడి ఇంటికి సాముహిక విద్యాభ్యాసం కోసం వచ్చి కూర్చున్నాడు. అప్పటికే పేపరు తెచ్చుకొని ఇక చదవటం మొదలు పెడదాం అనుకొన్న శ్రీనుగాడికి, శని షేక్ హ్యాండు ఇచ్చినట్టు, గొంతులో పచ్చి పనసకాయ పడ్డట్టూ అయ్యింది. నువ్వు చదువుతూ ఉండు నేనిప్పుడే వస్తా అంటే లేదు నేనూ వస్తా అంటాడు. పోని కాసేపు ఆగి రా రా, నాకు ఇప్ప్పుడు చదివే ఉద్దేశ్యం లేదంటె, ఏం పర్వాలేదు ఇక్కడే ఉంటా కాసేపు ఆగి చదువుదాం అంటాడు. ఆఖరికి బాత్రూం అని చెప్పి కిందకి వచ్చి నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను వస్తే మొత్తం సీను అర్దమవుతుంది నువ్వే ఎదో చెయ్యి అన్నాను.

రాత్రి వరకు ఓపికగా ఉన్న శ్రీనుగాడికి, కోపం వచ్చి ఏం చెయ్యాలో తెలియక ఏడ్చి పడుకున్నాడు. వచ్చిన మిత్రుడు చక్కగా అర్ధరాత్రి వరకు చదువుకొని పడుకున్నాడు. అంతే అంత వరకూ పడుకున్నట్టు కలరిచ్చిన మా శ్రీనుగాడు చక్కగా లేచి పేపరు లో ఉన్న ప్రశ్నలు చదివి పడుకున్నాడు. ఎప్పటిలానే మాకే మంచి మార్కులు వచ్చాయి. మా మిత్రుడి ఆపరేషను ఆవిధంగా ముగిసింది, ఇరాక్ పై అమెరికా యుద్దం లా.

అసలు వీళ్ళందరికి ఒక విషయం అర్ధం కాదండి. పేపరు లీక్ చేసి చదవటం కంటే బుద్దిగా నోట్సులు చదువుకోవటం వీజీ అని. కాదంటే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిందే. పేపరు లీక్ చెయ్యడానికి పేపరు తయారు చేసే సార్ దగ్గర్నుండి, వాటిని ప్రింట్ చేసే ప్యూన్ వరకూ నిఘా పెట్టాల్సిందే. ఆ రోజుల్లో వాళ్ళ పూర్తి టైం టేబుల్ మనకి తెలియాలి. పరిస్థితుల బట్టి, చిత్తు కాగితాలు తుడిచే ఈశ్వరమ్మని కుడా ఇందిరా గాంధీ అంత గొప్పదానివని పొగడాలి. క్రిస్మస్ పండగకి కూడా దసరా మాములివ్వాలి. అర్ధరాత్రి టార్చిలైట్లు పట్టుకొని కాలేజి గోడలు దూకాలి. మచ్చుకి ఒక ఎపిసోడ్ చెబుతా.

BSc లో ఉన్నప్పుడు ఒకసారి Half yearly exams వచ్చాయి.. అందరూ కష్టపడి చదువుతున్నారు. మేము మాత్రం అలవాటు పడ్డ ప్రాణం కదా, చదవకుండా కాలేజి కి ఎదురుగా ఉండే పాత బిల్డింగ్ ఎక్కి కాలేజి మీద అరడజను కల్లేసి వుంచాం. మా మీద అనుమానం ఉన్న ప్యూన్ రమణ పేపరు ప్రింటు తీసి భద్రంగా దాచేసాడు. అన్ని గదులకి తాళాలు వేసారు. మరుసటి రోజు ఆదివారం కాలేజి కి సెలవు. ఎవరూ రారు. పనిమనిషి ఈశ్వరమ్మ కూడా ఆదుకోవటానికి, రాదు ఆదివారం కదా. కళ్ళ ముందు తెల్ల కాగితం కనబడుతుంది. ఇంక ఆశలన్నీ ఆవిరయిపోయాయి. అయినా చావో రెవో తేల్చుకోవాలి. కానీ ఎలా? కాలేజి లో అన్ని గదులకి తాళం వేసి ప్యూన్ వెళ్ళిపోయాడు.మా శ్రీనుగాడి లోని నటవిశ్వరూపం చూపాల్సిన అవసరం వచ్చేసింది. నా లోని దర్శకత్వ ప్రతిభ తోడయ్యి, మంచి ఘట్టం మొదలయ్యింది. శ్రీను గాడు ఆఫీస్ ముందు దిగులుగా ముఖం పెట్టుకొని కూర్చొన్నాడు. ఆ సీన్ మా వాచ్ మేన్ కంటపడాలన్నది మా ప్రయత్నం. వాడి పేరు అభిషేక్ బచ్చన్. ఎందుకంటే వాడి నాన్న కూడా ఒకప్పుడు వాచ్ మేన్, పొడుగ్గా ఉంటాడని అమితాబ్ అని పిలిచే వారు. అతని కొడుకు కావటం చేత, మంచి పొడుగు ఉండటం చేత ఆ పేరు వచ్చింది. వాడు మాత్రం వాడి పనిలో ఉన్నాడు గాని శ్రీనుగాడ్ని చూడలేదు. అప్పుడే అర్ధం అయ్యింది అమ్మాయి దృష్టి లో పడటమే కాదు, అవసరాల్లో వాచ్ మేన్ దృష్టి లో పడటం కూడా కష్టమని. అయినా శ్రీను పట్టువదలని గంగూలీ లా తన ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒకమ్మాయి వచింది. ఖాళీ గా ఉన్న నేను, మా తారకగాడు ఆ అమ్మాయి తో కబుర్లు మొదలుపెట్టాం. కాసేపటి వరకు శ్రీనుగాడు మమ్మల్ని చూడలేదు. చూసిన తరువాత వాడి ముఖం చూడాలి, ఇవతల అమ్మయి తో మేము వాడ్ని పిలవకుండా మాట్లాడుతున్నామన్న భాద, పేపరు భాద. ఏడుపు ముఖం పెట్టాడు. అప్పటికే రెండు రోజులు గా ఇల్లు,తిండి నిద్ర మాని కాలేజి చుట్టూ తిరగటం వల్ల అందరి వాలకాలు రాళ్ళు కొట్టేవాళ్ళ లాగా ఉంది. చీకటి పడే వరకూ శ్రీను అదే ఫోజ్. మొత్తానికి మా మొర ఆలకించిన దేవుడు అప్పటికి వాచ్ మేన్ దృష్టిలో పడేట్టు చేసాడు.

ఇంక మా శ్రీనుగాడు నంది అవార్డ్ వచ్చిన ప్రకాష్ రాజ్ లా విజృంబించాడు. అభిషేక్ వచ్చి ఇంతవరకు ఎందుకున్నారని అడిగాడు.కళ్ళల్లో నీళ్ళు దించి, గుమ్మడిలా పూడుకు పోయిన గొంతుతో నా 10 సర్టిఫికేట్ పోయిందని చెఫ్ఫాడు. అభిషేక్ కనీసం కనికారం లేకుండా సోమవారం రమ్మని చెప్పేసాడు. మా వాడు తక్కువ తిన్నాడా? మనసంతా నువ్వే లో ఉదయ్ కిరణ్ లా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది సర్టిఫికేటు లేకపోతే ఉద్యోగం రాదని చెఫ్ఫాడు. మొత్తానికి కరుణించిన అభిషేక్ క్లర్క్ని తీసుకు వచ్చాడు. ఆఫీస్ రూం తాళం తీసి ఎక్కడన్నా పడిపోయిందేమో వెతుక్కోమని వదిలేసాడు. తలుపులు తీసిన వెంటనే ఆఫ్ఘన్ శరణార్దుల్లా లోపల దూరి మొత్తానికి డస్ట్ బిన్ లో ఉన్న చిత్తుకాగితాలన్నీ జేబులో పెట్టుకొని బయటకి వచ్చి ఆనందంగా దొరకలేదని చెప్పాం. క్లర్క్ పాపం బాగ ఫీలయ్యాడు. ఒక ఉత్తరం రాసి పెట్టాడు మా కోసం. “అయ్యా! నా పదవ తరగతి సర్టిఫికేటు పోయింది. అదిలేకుంటే నాకు ఉద్యోగం రాదు. కావున ఒక డూప్లికేట్ ఇప్పించ ప్రార్ధన.” కానీ మా పని జరిగి పోయిందని వేరే చెప్పాల?

ఒకసారి ప్రింటింగ్ బయట ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చారు. నిఘా వాళ్ళ ఇంటి మీద వేసాం. ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కూతురు ఒకబ్బాయి ని ప్రేమించిన విషయం మా పరిశోధనలో తేలింది. వాడికి ఒక బీరుబాటిల్ బేరం పెట్టి పని చెప్పాం. వాడు ఎంత ప్రయత్నించిన ఏం దొరకలేదు. చిన్న చిత్తు కాగితం ముక్క మాత్రం దొరికింది. అది తెచ్చి ఇచ్చాడు. ఊరికే ఇచ్చాడా? ఒక గొప్ప ఉపాయం చెప్పి మరీ ఇచ్చాడు. అది ఎంత గొప్ప ఐడియా అంటే “న్యూటన్ కి ఆపిల్ పడినప్పుడు వచ్చిన ఐడియా లాంటిది.” తిరగబడి ప్రింట్ అయిన ఆ కాగితాన్ని అద్దం లో చూస్తే మూడు ప్రశ్నలు కనిపించాయి. అదే వరస లో ప్రశ్నలు ఏ టెస్ట్ పేపర్ లో ఉన్నాయో వెతకమన్నాడు. అంతే మొత్తం సమస్య తీరిపోయింది.

ఇలాంటి ఎన్నో అద్భుత ఎపిసోడ్ లతో మొత్తానికి దొరకకుండా నిర్విఘ్నంగా డైలీ సీరియల్ లా మా కాలేజి పూర్తి అయ్యే వరకు కొనసాగించాం. అప్పుడే అసలు ట్విస్టు కొన్ని అనుకోని పరిస్థితులలో మా శ్రీనుగాడు మా కాలేజి లోనే లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాడి పేపర్ లీక్ అయ్యినప్పుడు తెలిసింది వాడికి భాద. మరుసటి పరీక్షకి తేలుకుట్టిన దొంగ లా వాడి పేపర్ ని వాడే ప్రింట్ తీసుకొని వాడి దగ్గరే ఉంచుకొని పరీక్ష టైం కి మాత్రమే తేవడం మొదలుపెట్టాడు. పాపం శ్రీను గాడు.

నేను 1000 దాటేసానోచ్…

హమ్మయ్య మొత్తానికి 1000 మైలురాయి దాటేసా. 8 టపాలు, 26 రోజులు 37 వ్యాఖ్యలతో మొత్తానికి ఏదో ఒకలా మొదటి మెట్టు ఎక్కేసా.
అయినా అంత వీజీగా అయ్యిందనుకుంటున్నారా? అసలు ఎన్ని భాధలు పడ్డానని. అప్పుడెప్పుడో ఈనాడు లో తెలుగు బ్లాగుల గురించి చదివినప్పుడు అనుకున్నా, ఎలా అయినా నేనూ ఒక బ్లాగు మొదలు పెట్టి తీరవలసినదే అని. ఎక్కడిదీ కుదిరి చస్తేనా. ఏదో ఆ మధ్య నేను పనిమాని Internet లో ఊసుపోని విషయాలన్నీ చదువుతున్నా అని నాకో వంక పెట్టి మా కంపెనీ వాళ్ళు నా స్కోర్ కార్డ్  గోవిందా అనిపించిన తరువాత గానీ ఖాళీ సమయం దొరకలేదు. ఒకసారి పార్కు లో పట్టుబడ్డ ప్రేమజంట భయం పోయి కళ్ళముందే తిరిగినట్టు, నేను కూడా ఈ మధ్య భయంపోయి కొంత సమయం దీనికి కేటాయించేసా. ఇంక వ్రాయటం మొదలుపెట్టిన తరువాత, నా చుట్టూ ఉన్నవాళ్ళ లో తెలుగు బ్లాగులు చదివే వాళ్ళు కాగడా పెట్టి వెతికినా దొరికి చావలే.
ఇంక లాభం లేదని దీన్నో ఉద్యమంగా భావించి మా వాళ్ళకి మెయిల్లు పెట్టి, క్లాసు పీకి నానా భాదలు పడ్డా. అసలు డి.ఎస్.సి. కోసం ప్రయత్నిస్తున్న వారి దగ్గర్నుండి, సాఫ్ట్ వేర్ వాళ్ళ దాక తెలుగు లోనా? అని దీర్ఘం తీసేవాళ్ళే. నాకు ఇంగ్లీష్ రాకే తెలుగు లో వ్రాస్తున్నా అని నిర్దారణ కి వచ్చేసారు. ఇంక నేను నా 10, ఇంటర్ లో వచ్చిన ఇంగ్లీష్ మార్కులు చూపించినా నమ్మరే అసలు. కొంత మందయితే ఇంకాస్త ముందుకి వెళ్ళి “సారీ బాస్ ! నాకు తెలుగు మాట్లాడటమే  తప్ప చదవటం రాదు ” అనేసారు.అయ్యో రామ. ఆంధ్రదేశం లో పుట్టి, పెరిగి, చదువు కూడా ఇక్కడే చదివిన మనవాళ్ళకి తెలుగు చదవటం రాకపోవడమేమిటండీ. చోద్యం కాకపోతే. స్కూల్లో మాకు తెలుగు లేదు అనేసారు. అవునులెండి సెలవు ఇవ్వకపోతే, మందుషాపులు మూయించక పోతే, గాంధీ జయంతి ని మరిచి పోయే రోజులు. ఇంక మార్కులకు పనికి రాని తెలుగు ఎందుకు నేర్చుకుంటారు? వీళ్ళ తో వేగటం నావల్ల కాదని, వీలుంటే తెలుగు చదవటం ఎలా అని ఒక బ్లాగు వ్రాస్తానని చెప్పి వచ్చేసా. ఇంక తెలుగు చదవటం వచ్చినవాళ్ళ దగ్గరకి వెళ్ళి నేనే బ్లాగు ఓపెన్ చేసి చదవమని చెబితే, మరీ ఇంత పెద్దపెద్దవి రాస్తే ఎలా అనేసారు. ఇంకొంతమంది పల్లీ-బటాణీ ని పిల్లిబటాణీ అని, ఇంకా వాళ్ళ పరిధి లో కొన్ని భూతులు చదివాక, ఇక తప్పదని వాళ్ళందరిని కూర్చోబెట్టి నేనే చదివి వినిపించాల్సి వచ్చింది. విని ఊరుకున్నారా? అబ్బే
“ఇవి నీ సొంతమా?”(అబ్బే లేదు. నా మొహం నాకంత సీన్ ఎక్కడిది, ఎదో అరవం సినిమా లోనివి.)
“ప్రేమలేఖ అంత బాగా వ్రాసావ్ కొంపదీసి ప్రేమలో పడ్డావా.” (లేదమ్మ మీ దయ వల్ల రోడ్డు మీద పడ్డాను.)
ఇంకా శతకోటి ప్రశ్నలు, జోకులు.

మొదటి 1000 కే ఇన్ని పాట్లు పడ్డాను. ముందు ముందు ఎలా నెగ్గుకు రాగలనో అంతా భగవంతుడి దయ.
నాకు సహకరిస్తున్న, విశ్లేషణలిస్తున్న బ్లాగర్లకి, మిత్రులకి ధన్యవాదాలు. సదా మీ సహకారం కోరుకుంటూ,

మీ
మురళీ.

జయ జయ జయహే

మినార్లు గోపురాలంత ఉన్నతంగా ఉండవు మా ఆలోచనలు.
మహల్లు ఆలయాలంత విశాలంగా ఉండవు మా హృదయాలు.
పువ్వులంత స్వఛ్ఛమైనవి కావు మా నవ్వులు.

బండరాళ్ళలోని అందాలని వెలికి తీస్తాంగానీ,
ప్రక్కవాడి కన్నీరు తుడవలేం.
దేశాలమధ్య దూరాలను చెరిపేస్తాం గానీ,
మనసుల మధ్య గోడల్ని కూల్చలేం.

అవును మాది యూగాలునిండిన చరిత్ర,
ధరిత్రి మెచ్చిన సంస్కృతి.