ఇదేదో ఎర్రబస్సెక్కిన వెర్రి ప్రొడ్యూసర్, సినిమా దురద తీర్చుకోవటానికి తీసిన దురదగుండాకు సినిమా టైటిల్ అనుకొనేరు. అబ్బే కాదండీ. నా గురించి మా మమ్మీ(ఈ పదానికి మితృలు నన్ను క్షమించాలి, చిన్నప్పటి నుండి అమ్మమ్మ ని అమ్మ అనటం మా అమ్మగారిని మమ్మీ అనటం అలవాటు. ఇది కాకుండా డాడీ కూడా చిన్నప్పుడే అలవాటు. అభిమానం పిలుపులో కంటే మనసులో ఉంటుందని నమ్ముతాను నేను. కొందరి మితృలని ఏరా రారా పోరా అన్నా సరే వారి మీద మనసులో చాల గౌరవం ఉంటుంది అంతేగా..) స్నేహితులు నా కిచ్చే కితాబు. ఇంక డాడీ స్నేహితులంతా మీ కేంటి రత్నాల్లాంటి పిల్లలు అంటారు. ఇలాంటి మాటలు విని అల్లరి చెయ్యాలనే మన ఆశ ఆవిరయిపోతుంది. కానీ మనసు మరీ మన కంట్రోల్లో లేక పోతే ఏం చేస్తాం ఏదో ఇలా చిన్న చిన్న పనులు చేస్తాం.
ఇంటర్ లో కిషోర్ అని ఒక క్లాస్ మేట్ ఉండేవాడు. వాడు కోవై సరళ లా కొంచెం అతి చేస్తాడు. వాడికి వినబడేలా శ్రీహరి క్లాస్ లో కిటికి అద్దం పగలగొట్టాడు అని చెప్పాం. మనోడు ప్రిన్సిపల్ దగ్గర మంచి కోసం వెంటనే వెల్లి ఈ విషయం చెప్పేసాడు. ప్రిన్సిపల్ క్లాస్ లో అందర్ని పిలిచి అందరి ముందు శ్రీహరిగాడిని తిట్టడం మొదలు పెట్టారు. వాడు నాకే పాపం తెలియదు మొర్రోమనిగోల. సరే ప్రిన్సిపల్ కిషోర్ గాడ్ని పిలిచి అసలు నువ్వు చూసావా అని అడిగారు. లేదండి మురళీ వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా అన్నాడు. మేమా మేమెప్పుడు మాట్లాడుకున్నాం అన్నాడు మా అనిల్ గాడు. నేనయితే చేతులు కట్టేసుకొని, అమాయకంగా ముఖం పెట్టి అది మొదటి నుంచి అలానే ఉంది కదా సార్ అని అన్నాను. అంతే మరుక్షణం లో కిషోర్ గాడి చెంప ఎర్రగా కందిపోయింది. అయినా మావోడు అతి చేయటం మానలేదు. మనోడికి పద్మ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. స్టడీ అవర్ లో పద్మ క్లాస్ పక్కనే ఉన్న ఖాళీస్థలం లో ఎవరూ ఉండరు అక్కడ చదువుకునేది. మనోడు కొంచెం దూరం లో ఆ అమ్మాయి కనపడేలా కూర్చొనేవాడు.రోజూ ఇదేతంతు. ఒకరోజు అక్కడ ఉన్న మావిడి ఆకు తో ఆ అమ్మాయి ఆడుకుంటూ పెన్నుతో గీతలు పెడుతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే కిషోర్ కి కనిపించకుండా నేను వెళ్ళి ఆ ఆకు మీద “ఐ లవ్ యు” అని రాసి వచ్చేసా.
అనిల్ గాడు వెళ్ళి ఇంతవరకు ఆ అమ్మాయి ఆడుకున్న ఆకు తీసి దాచుకో రేపు పెళ్ళయ్యాక తనకి చూపిస్తే ఎంత ఆనందపడుతుంది అని చెప్పాడు. చెప్పాగా మనోడు అసలే అతి రెచ్చిపోయి వెళ్ళి ఆకు తెచ్చేసుకొన్నాడు. దానిమీద వున్నది చదివి మనోడి ఆనందానికి అవధులు లేవు. కాలేజి అయిపోగానే అందర్ని పిలిచి పండగ చేసి పార్టీ ఇచ్చేసాడు. “నన్నే చూస్తూ రాసింది.” అనే గుడ్డి నమ్మకం వాడిది. మరసటి రోజు పద్మ ఒంటరి గా కాలేజి నుంచి ఇంటికి వెళ్ళే దారి లో కలిసి, “నువ్వు మన జీవితం గురించి అస్సలు టెన్షన్లు పెట్టుకోకు. మా నాన్నగారు త్వరలో వాలంటరీ రిటైర్ అయిపోతారు జాబ్ నాకు వచ్చేస్తుంది. మనం హాయిగా ఉండొచ్చు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా నేనే మాట్లాడతా” అని చెప్పేసి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాడు. పాపం పద్మకి జార్జిబుష్ తెలంగాణా యాస లో తెలుగుపాట పాడినట్టు ఏమీ అర్ధం కాలేదు. అర్ధమయ్యేటప్పటికి న్యూటన్ కి చెట్టు ఎక్కకుండానే ఆపిల్ దొరికినట్టు, పద్మకి మంచి అవకాశం “రాఖీ పౌర్ణమి” రూపం లో దొరికింది. రాఖీ పౌర్ణమి రోజున పద్మ రాఖీ తొ రక్తసంభందం లో సావిత్రి లా వచ్చేసింది. సునామీ విషయం ముందేతెలిసిన వాతావరణ కేంద్రం డైరెక్టర్ అనౌన్స్ కూడా చేయకుండా వాడే ముందు పారిపోయినట్టు, విషయం ముందే పసిగట్టిన కిషోర్ గాడు చెప్పాపెట్టకుండా పారిపోయాడు. మేము వదులుతామా వెళ్ళి ప్రిన్సిపల్ ని ఆడిగితే M.P.C నుంచి Bi.P.C కి మారిపోయాడు అని చెఫ్ఫారు. అంతే వాడి వెనక మేము, మా వెనక పద్మ సినిమాల్లో చూపించిన రేంజ్ లో చేజింగు. వాడి ఖర్మకి వాడు మేడపైకి పరిగెట్టాడు. పైకి వెళ్ళిన తరువాత పారిపోవటనికి లేదు. అప్పుడు వాడికి ఉన్నవి రెండు అవకాశాలు ఒకటి దిగివచ్చి రాఖీ కట్టించుకోవాలి లేదా దూకి చావాలి. మొదటి దే బెటర్ అని వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. ఎలాగు రాఖీ కట్టేసింది కదా నేను మరలా MPC కి వెళ్ళిపోతా అని ప్రిన్సిపల్ అని అడిగాడు. ఈ సారి చెంపలు బొబ్బట్లయ్యాయి. ఆవిధంగా కిషోర్ గాడు మా చేతిలో ఎన్నోసార్లు బకరా అయ్యాడు. అన్నట్టు చెప్పటం మరిచాను మా మాట విని ఒకసారి పద్మ దగ్గరకి వెళ్ళి “పద్మావతి పద్మావతి నీ ఎర్రనిమూతి చూడగానే పోయింది నా మతి నామనస్సు అయ్యింది కోతి” “క్లాసులో నువ్వంటే అందరికీ మంట ఎందుకు వారి తో తంటా నేనుంటాగా నీ వెంట.”(ఈ కట్టింగు అక్షరాలా మందే) ఇలాంటి కవితలు చెప్పి అడ్డమైన తిట్లు తిన్నాడు.
గమనిక: నా గత టపా “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” ఫీడ్ లో ఉన్న సమస్య వలన కూడలిలో సరిగా రాలేదు.మితృలు ఇప్పుడు ఆ టపా చూసి మీ ఆలోచనలు కూడా తెలియజేస్తే మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు.