ఒక పోస్టు చెయ్యని ఉత్తరం

sorry

sorry

ప్రియమైన మురళికి,
ఏంటో నువ్వు చెప్పిన పని చేయలేకపోతున్నా. అలా అని చేయాలనే మనసులేక కాదు. నీకు తెలుసుగా నువ్వే నా సర్వస్వం అని. అసలు నువ్వు చెప్పావనే కాదు, ఆకర్షణీయంగా ఆకట్టుకునే అమ్మాయిని చూస్తే నాకు మాత్రం ఆసక్తి కలగదా? అయినా ఇది కేవలం నా నిస్సహాయతే గానీ నిర్లక్ష్యం మాత్రం కాదు. నిజానికి ఇప్పుడు తనని చూడకుండా, తన గురించి ఆలోచించకుండా నేను కూడా ఉండలేని స్థితికి చేరుకున్నా. నీ తరపున వెళ్ళి నేనిలా మాట్లాడటం, మారిపోవటం నీకు కోపం తెప్పిస్తుందేమో కదా! కానీ ఒకటి నువ్వు అర్ధం చేసుకో నాలో ఈ మార్పుకి కారణం నువ్వు ఇష్టపడిన అమ్మాయిలోని గొప్పతనమో లేదా ఆకర్షణో తప్ప నీకు నే చేసిన ద్రోహం కాదు. నీకు ద్రోహం చేసి నేను మాత్రం ఏం బావుకుంటాను చెప్పు. నువ్వే ఎఫ్ఫుడూ అంటావ్ కదరా ఆమెలో ఏదో ఉంది అందరిని కట్టిపడేస్తుందని. అదే జరిగింది అక్షరాల నన్ను కట్టి పడేసింది. అయినా ఇదే జరిగింది అని నేను చెప్పలేను అంతా ఒక మాయలా ఉంది.

ఆమె నాకు అర్ధం కాలేదు. కొన్ని లక్షల భావాలను పలికే ఆ కళ్ళ లో దూకి చివరి అంచును తాకాలని ఎంతగా ప్రయత్నించానో. క్షణానికెన్నో స్పందనలు చూపే గుండెలో భావల్ని అంచనా వేయాలని ఎంతగా పరిశీలించానో. నాచేత కాలేదు నిజానికి ఆమె నాకు అర్ధం కాలేదు. ఎన్ని భావాలు ఎన్ని స్పందనలు ప్రేమ, జాలి, చిరుకోపం, దరహాసం, అందమైన కంటి చెమ్మ, ఆవేశం, ఆశ్చర్యం,ఆనందం.  ఆకలి లాంటి అవసరాలే లేకపోతే ఆమె కళ్ళలో ఈ భావాలను చూస్తూ తుదిశ్వాస వరకూ బ్రతికేద్దును తెలుసా!

ఆమె నన్ను ప్రేమించాలంటే ఏం చెయ్యాలో చెప్పవా ప్లీజ్. ఆమె చిరుకోపం నాపైనే చూపించేంత చనువు రావాలంటే నేనేం చెయ్యాలి? ఒక్క మాట చెప్పనా చిరుకోపం తో ఆమె చూసే చూపు ఒక్క క్షణం తళుక్కుమని మెరిసి మాయమయ్యే అరుదైన అందమైన దృశ్యం. ఆ అందం చూడటం కోసం కొన్నివేల సంవత్సరాలు వేచి ఉండొచ్చు.ఆమె నన్ను చిన్నపిల్లాడిలా చేసి “అలాకాదురా మొద్దు” అని ముద్దుచేయాలంటే ఏం చెయ్యాలి. చెప్పరా ప్లీజ్ తను నాతో నువ్వు తప్ప లోకంలో ఇంకెవరూ వద్దు అనాలంటే నేనేం చెయ్యాలి?

తనతో గడిపే క్షణాల్లో మౌనం భాషవుతుంది. చలనమే లేకుండా తన పక్కన కూర్చున్న అతిసాదారణ దృశ్యం కూడా మధుర క్షణాల్లో చేరిపోతుంది. నేను ఎందుకు తననే చూస్తున్నానా అని తను ఒక్క క్షణం చూసే చూపులో ఎంత వెన్నెల దాక్కుందో తెలుసా? చంటిపిల్లలా తను పడుకుని ఉంటే తన ముఖం లోని స్వచ్చతని,అందాన్ని చూస్తూ ఈ లోకానికి ఇక ఉదయమే ఉండకూడదని ఎంత తపించానో తెలుసా? కానీ వెలుగొచ్చాకే తెలిసింది తను నిద్రనుండి లేస్తూ నవ్వే చిరునవ్వు కోసమే సూర్యూడు రోజూ ఆరాటంతో పరుగులు తీస్తాడని. క్షణాలను సిరా చుక్కలుగా మార్చి రాస్తూపోతే నేను ప్రపంచాన్ని మొత్తాన్ని కమ్మేసేన్ని కావ్యాలు వ్రాసేస్తానేమో?
నీ ముందే నేను ఇలా మాట్లాడుతున్నందుకు నీకు చాలా కోపం వచ్చింది కదా! నువ్వు కేవలం తన గురించి తెలుసుకు రమ్మన్నావ్. కానీ నేను తనతో పీకల్లోతు ప్రేమలో పడ్డాను. నేను చేసిన తప్పుకి నువ్వు ఏమన్నా చెయ్యు భరిస్తా. కానీ తనని ప్రేమించొద్దని మాత్రం చెప్పకు. తనని చూడనంతవరకూ నేను ఎందుకు పుట్టనా అనే ఆలోచన ఉండేది? ఇప్పుడు తనులేకుంటే నా జీవితానికే అర్ధం లేదని తెలిసింది
క్షమించు మిత్రమా! అందాన్ని,అమాయకత్వాన్ని,బేలతనాన్ని,స్వచ్చతని,ప్రేమని,చలాకీతనన్ని,తెలుగుదనాన్ని ఆరాధించటమే నేను చేసిన ద్రోహం అనుకుంతే నన్ను క్షమించు.

నీ మీద ఏమాత్రం అభిమానం, ప్రేమా తగ్గని,

నీ మనసు.

చిరునామా: నువ్వే.