మెలకువలో కల

అప్పుడే తెల్లవారుతున్నట్టుంది. బాల్కనీ నుండి మంద్రంగా వచ్చే సాగర ఘోష నెమ్మదించి, వాహనాల చప్పుడు మొదలయ్యింది. మగత నిద్రలో ఉన్న నాకు కాస్త కాస్తగా మెలకువ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే బాల్కనిలో గోడ మీద కూర్చుని తేజ బీచ్ వైపు చూస్తున్నాడు. వీడికి ఇదేం పిచ్చో ఎప్పుడూ ఆ సముద్రాన్నే చూస్తూ ఉంటాడు అనుకుంటూ లేచాను. కళ్ళు నులుపుకుంటూ, తలుపు తీసుకుని బాల్కనీలోకి వచ్చి”ఏరా తేజా, కాస్త కాఫీ అయినా కలుపుకున్నావా? పొద్దున్నే మొదలెట్టావా” అని అడిగాను. ఏదో పరధ్యానంలో ఉన్నాడో ఏమో అలా నేను హఠాత్తుగా వచ్చి అడిగేసరికి తుళ్ళిపడి గోడ మీద నుండి తూలాడు. కళ్ళల్లో ఏదో కంగారు, బెదురు కనిపిస్తున్నాయి. గోడ మీద నుండి తూలిన వాడు పడిపోతాడేమోనని ఒక్క దూకులో వాడిని అందుకోబోయాను. కానీ పట్టు దొరకలేదు. నా చేతి నుండి ఏదో పొగ జారిపొయినట్టుగా జారిపోయాడు. అయోమయంగా వాడి వైపు చూసాను. వాడు గోడ మీదే ఉన్నాడు స్థిరంగా. నా వైపు వింతగా చూసాడు. నేను నా చేతి వైపు చూసుకుంటూ ఉండగానే సూది గుచ్చినప్పుడు చురుక్కుమనే మంటలా, చప్పున నాకు మూడురోజుల క్రితం జరిగినవి గుర్తొచ్చాయి. నిద్ర మత్తు పూర్తిగా వదిలి తెలివొచ్చింది.

గుండెలు దడదడా కొట్టుకోవటం మొదలయ్యింది. చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు తడారిపోయింది. కళ్ళు నాకు తెలియకుండానే భయంతో పెద్దవిగా అయిపోయాయి. వాడింకా అలానే వింతగా నా వైపు చూస్తున్నాడు. ఇప్పుడు స్పష్టంగా తేజ శరీరమంతా ఒక తేజస్సులా కనిపిస్తుంది. మనిషి వెలిగిపోతున్నాడు. నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం చనిపోయిన తేజ ఇలా బాల్కనీలో ఎలా కనిపిస్తున్నాడు? భయంతో గట్టిగా అరవాలనిపిస్తుంది, పిచ్చిగా పరిగెట్టాలనిపిస్తుంది కానీ నా శరీరంలో ఏ అవయవం సహకరించటం లేదు. నాలో కలిగిన అలజడి వాడికి అర్ధమయినట్టుంది. బాధపడుతూ తలదించుకున్నాడు.

వెంటనే బాల్కనీ తలుపు దడేల్‌మని వేసేసి పారిపోదామనిపించింది. కానీ వాడి మొహంలో విచారం చూసి అలా పారిపోతే ఏమనుకుంటాడో అని మనసు పీకుతుంది. ఏమన్నా అనుకోని వాడిప్పుడు బ్రతికిలేడు ఆ విషయం మొదట బుర్రకెక్కించుకో అని నా లోపల ఎవరో అరుస్తున్నట్టుగా ఉంది. వాడు తల ఎత్తి నా వైపు చూసాడు. నా కళ్ళల్లోకి సూటిగా చూసాడు. వాడి చూపు తీక్షణత నా మనసుని తాకగానే నా గుండెకొట్టుకోవటం ఆగింది.

ఎవరో అప్పుడే దభ్ దభ్‌మని తలుపు కొట్టారు. బయట మరోమనిషి ఉనికి నా ఊహకు అందేసరికి నా గుండె తిరిగి కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇదే అదనుగా నేను అక్కడనుండి పరిగెట్టుకుంటూ వచ్చేసి కంగారుగా తలుపుతీసాను. ఎప్పుడూ ఏ పనీలేకపోయినా వచ్చి విసిగించే ఎదురింటి ప్రియ మొదటిసారిగా ఈరోజు నాకు నచ్చింది. లోపలికి రమ్మన్నట్టుగా నేను తనకి దారిచ్చాను. కానీ నా చూపింకా బాల్కనీ వైపే ఉంది. భయంతో నిలువెల్లా తడిచిపోయి, వగరుస్తున్న నన్ను చూసి “ఏమయ్యింది? ఏం చేస్తున్నావ్? ఎందుకలా తడిచిపోయావ్? జిమ్ చేస్తున్నావా?” అంటూ ప్రియ ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంది. నేను కాదన్నట్టు తల అడ్డంగా ఊపటం తప్ప మాట్లాడలేకపోతున్నా.

తను ఏమనుకుందో ఏమో “సరే అయితే నేను తర్వాత వస్తాను” అని లేవబోయింది. “వద్దు” అంటూ చప్పున లేచి ప్రాధేయపూర్వకంగా తన చేతులు పట్టుకున్నాను. ఎప్పుడు తనొచ్చినా విసుక్కునే నేను ఇలా ప్లీజింగ్‌గా ఉండమనటమేంటో అర్ధంకానట్టు మొహంపెట్టి నా వైపే చూస్తూ కూర్చుంది. తన ఆలోచనలు అర్ధమయ్యి, నేను కాస్త తేరుకుని మామూలుగా ఉండే ప్రయత్నం చేసాను. ప్రియ కూడా మామూలయ్యి ఏవో తన కాలేజ్ కబుర్లు చెబుతూ ఉంది.నా చెవికి ఏం ఎక్కటం లేదు. నా చూపు, ఆలోచనలు ఇంకా బాల్కనీ దగ్గరే ఉన్నాయి. తేజ నాకే కనిపిస్తున్నాడా? లేక ప్రియకి కూడా కనిపిస్తాడా? లేదా ఇదంతా నా భ్రమ? నేనసలు నిద్ర నుండి లేచానా లేదా? ఏం అర్ధం కాని అయోమయంలో ఉన్నాను.

బాల్కనీ నుండి వాడు లోపలికి రాలేదు. నేను వంగి చూసాను. ఆ గోడ మీద తేజ లేడు. కంగారు కొంత కొంతగా తగ్గి ఇదంతా భ్రమేమో అని నా మనస్సుకి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతలో నా బెడ్ రూమ్‌లో ఎవరో మసలుతున్నట్టుగా స్పష్టంగా నాకు తెలుస్తుంది. కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో చెవులు రిక్కించి ప్రతి చిన్న శబ్దంవింటున్నాను. నాకు బాగా పరిచయమున్న అడుగులే అవి తెలుస్తున్నాయి. ఇది నిజమే అని నాకు బాగా అర్ధమయిపోయింది.

ప్రియ లేచి “మూర్తీ నాకు బోర్‌గా ఉంది బయటకు వెళ్దామా?” అని అడిగింది. తను గతంలో ఎన్నోసార్లు ఇలా అడిగింది. కానీ ఇదే మొదటసారి నేను సరే అనటం, అది కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని లేచాను.
“చీ ఇలానేనా వెళ్ళేది?” అంది ప్రియ.
నా వైపు నేను చూసుకున్నాను. బట్టలు మాసి ఉన్నాయి. కనీసం మొహం కడగలేదు.
“వెళ్ళి కాస్త రెడీ అవ్వు” అని తోసింది ప్రియ.

నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాత్రూమ్‌లోకి వచ్చాను. నిజానికిప్పుడు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండటానికి ధైర్యం సరిపోవటం లేదు. అలాంటిది బాత్రూంలో తలుపులు బిగించి ఒక్కడినే, నాకు తిరిగి కంగారు, భయం మొదలయ్యాయి. మొహం పై నీళ్ళు చల్లుకునే ఒక్క క్షణం కూడా కళ్ళు మూసుకోవాలంటే భయంగా ఉంది. మూసుకున్న కళ్ళు తెరిచే ప్రతిసారి ఏం కనపడుతుందో అని కంగారుగా ఉంది. మొత్తానికి బెరుకుగానే చుట్టూ చూసుకుంటూ రెడీ అయ్యి బయటకి వచ్చాను. వస్తూనే ప్రియ చెయ్యందుకుని పరుగులాంటి నడకతో ఇంటి బయటపడ్డాను.

సాయంత్రం వరకూ ఇంటికి రాకుండా ఊరంతా తిరిగి వచ్చాం. ఎక్కడ తిరుగుతున్నా నా మనసంతా ఒకటే ధ్యాస “ఇదెలా సాధ్యం? దెయ్యాలున్నాయా? ఉంటే ఇంతకుముందెప్పుడూ ఎందుకు కనిపించలేదు? అయినా తేజకి నా మీద పగో,ప్రతికారమో ఉండే అవకాశం లేదు. మరలాంటప్పుడు నేనెదుకు భయపడటం? అయితేమాత్రం దెయ్యాలకి ఈ విచక్షణ ఉంటుందా?” అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను.

ఇంటికి వస్తుంటే కాంపౌండ్ వాల్ మీద కూర్చుని బీచ్ వైపే చూస్తూ తేజ. నా కాళ్ళక్కడే ఆగిపోయాయి. ప్రియ నా వైపు చూసి, నా చూపు ఆ గోడమీద ఆగిపోవటం గమనించి గోడ వైపు చూసింది. “ఏమయ్యింది మూర్తీ? అక్కడేం చూస్తున్నావ్?” అని అడిగింది. అంటే ప్రియకి ఏం కనిపించలేదు, నాకు మాత్రమే తేజ కనిపిస్తున్నాడు. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక ప్రియని ఇంటికి వెళ్ళమని చెప్పి నేను బీచ్ వైపు నడిచాను. తేజ నన్ను గమనించలేదు.

తేజ నేను గొప్ప స్నేహితులమేమీ కాదు. రూమ్ షేరింగ్ కోసం నేను నా ఫ్రెండ్స్ ద్వారా వస్తే, తనకు పరిచయమున్న వాళ్ళతో తేజ వచ్చాడు. అందరూ ఉద్యోగాలొచ్చి తలో దిక్కు ఎగిరిపోతే మా ఇద్దరం రూమ్మేట్స్ గా మిగిలాం. తన గురించి నాకు తెలిసింది కూడా తక్కువే. తనకి ఎవరూ లేరని, చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే ఊర్లో వాళ్ళ సహాయంతో పెరిగి డిగ్రీ వరకూ చదువుకున్నా అని ఒకసారెప్పుడో చెప్పాడు. నేను ఉదయాన్నే ఆఫీసుకి వెళ్ళిపోతే తను ఇంట్లోనే ఉండేవాడు. పత్రికలకి ఏవో రచనలు పంపేవాడు. ఆ వచ్చే పారితోషకమే అతని జీతం. ఆ కాస్త డబ్బులతో ఎలా బ్రతుకుతాడో అనుకునేవాడ్ని. కానీ అద్దె డబ్బులకి ఏనాడు ఆలశ్యం చేయలేదు. అలసి ఏ రాత్రికో నేను ఇంటికొస్తే నా చేతికి తాళాలిచ్చి తను వెళ్ళి బీచ్‌లో కూర్చునేవాడు. ఎప్పుడొచ్చి పడుకునేవాడో తెలిసేదే కాదు. చాలా విచిత్రమైన వ్యక్తి.

సరిగ్గా మూడురోజుల క్రితం ఏ తెల్లవారు జామునో బీచ్ నుండి తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు దాటుతుండగా పాలవ్యాన్ గుద్దేసిపోయింది. జాగింగ్ కోసం వచ్చిన జనాలు 108 కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి పంపారు. కానీ అప్పటికే చనిపోయాడు. తన వారెవరూ లేకపోవటంతో అంతిమ సంస్కారాలు నేనే పూర్తిచేసాను. తనుండగా ఇద్దరికీ పెద్ద అనుబంధం ఏం లేకపోయినా, తనుపోయాక నాకు కాస్త ఒంటరితనం తెలిసొచ్చింది.

ఈ ఆలోచనల్లో ఉండగా “మూర్తీ..” అనే ఎవరో గుసగుసగా పిలిచినట్టు గాలిలో తేలుతూ వచ్చింది. నేను కాస్త తుళ్ళిపడ్డాను. అది తేజ గొంతు అవును అతనిదే. ఎంతో ఎక్స్ ప్రెసివ్‌గా ఉండే గొంతు.

“భయపడకు మూర్తీ. నేను నిన్నేం చేస్తాను? అంతా అనుకోకుండా అయిపోయింది. తీరా చనిపోయాక స్వర్గానికో, నరకానికో తీసుకుని వెళ్ళటానికి ఎవరైనా వస్తారేమో అని చూసా. ఎవరూ రాలేదు. నువ్వు నా అంతిమ సంస్కారాలు చేసే వరకూ నా శరీరం వెనుకే తిరిగా. నేనే రెండుగా విడిపోయి, నన్నే నేను ఎదురుగా చూసుకోవటం అర్ధంకాని వింత అనుభవం.

అది ముగిసినప్పటి నుండి ఈ సముద్రం ఒడ్డునే గడిపా. ఇంకా ఎన్నిరోజులు ఇలా గడపాలో తెలియదు. తర్వాత ఏమవుతానో అసలే తెలియదు. ఎవరినైనా అడగాలంటే నాలానే ఈ సముద్రం ఒడ్డున, ఆ బస్‌స్టాప్‌లో, హాస్పిటల్లో చాలామంది దేనికోసమో ఎదురు చూస్తూ దిగులు మొహాలతో కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరకి వెళితే మౌనంగా చూస్తారే తప్ప ఏం మాట్లాడరు. మన చుట్టూ మనకి తెలియకుండా ఇంతమంది అదృశ్య వ్యక్తులున్నారని, వాళ్ళు మనల్ని చూస్తారని బ్రతికుండగా అసలెప్పుడూ ఊహించలేదు.

వాళ్ళందరి మొహాలు చూసి చూసి ఏ సమాధానం దొరక్క విసిగి మన గదికొస్తే, నువ్వు నాతో మాట్లాడావ్. నాకు ఆశ్చర్యం వేసింది. నా ఉనికిని నువ్వు గుర్తిస్తుంటే ఆసక్తి కలిగింది. అందుకే నీవెంట వచ్చా. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను రానులే” నాకు కనబడకుండా నేను కూర్చున్న రాళ్ళ వెనుక ఎక్కడో ఉండి చెబుతున్నాడు తేజ.

ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. కానీ భయం తగ్గింది. లేచి మౌనంగా నడుచుకుంటూ గదికి వచ్చేసా. నా మౌనాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడో తేజ నన్ను అనుసరించలేదు. కానీ రోడ్డు మీద నడుస్తుంటే తేజ చెప్పిన ఆత్మలు ఇక్కడే ఎక్కడొ ఉండొచ్చు, నన్ను గమనిస్తూ ఉండొచ్చు అనే ఆలోచన కాస్త కలవరపెడుతుంది. ఒళ్ళంతా జలదరిస్తున్న ఫీలింగ్.

పడుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర రాలేదు. లేచి తేజ పుస్తకాలు పెట్టుకునే గదిలోకి వెళ్ళాను. తను వస్తాడేమొ అని మనసులో కంగారు ఉన్నా ధైర్యం చేసి తన డైరీ తీసాను. బ్రతికుండగా తనేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. తన రచనలు కూడా ఎప్పుడూ చదవలేదు. తను కూడా ఎప్పుడూ చదవమని చెప్పలేదు. ఈరోజెందుకో తెలుసుకోవాలనే కోరిక కలిగింది.

“సముద్రమెంతటి జ్ఞానో, అందరికీ అన్నీ ఇచ్చీ ఎవ్వరితోనూ ఏ అనుబంధం పెట్టుకోదు” డైరీలో మొదటి వాక్యం. ఇప్పుడిప్పుడే ఒంటరితనమంటే ఏంటో తెలిసొస్తూ ఉండటం వల్లేమో ఈ అక్షరాలు నాకెంతో అర్ధవంతంగా తోచాయి. కలవరపెట్టే ఆ అక్షరాల వెంట నా కళ్ళు పరుగులు తీసాయి.

“ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు, నా తోడు రావు.

నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..”

“చెవులను తాకే ఈ అనంత ఘోష నీదా? నాలోనిదా? నీకెంత ధైర్యమో అలజడంతా పైకే చూపిస్తావ్”

“లక్షలమంది రోజూ పుడుతూ చనిపోతున్న ఈ జనారణ్యంలో ఎవ్వరికీ ఏమీ కాని నేను కూడా సముద్రాన్నే. ఎన్ని జీవాలు లోన ఈదుతున్నా, ఏన్ని నావలు పైన తేలుతున్నా సముద్రానికెవరు సొంతం?”

రాత్రంతా కూర్చుని ఆ డైరీ మొత్తం చదివాను. నా ఒంటరితనాన్ని ఆ అక్షరాలతో బేరీజు వేస్తే తేజ ఏ స్థాయి సంఘర్షణ అనుభవించాడో అర్ధమయ్యింది. తను సంపాదించే ఆ కాస్త జీతం తనకి ఎలా సరిపోయేదో అర్ధమయ్యింది. ఎవరూ లేరు రోజంతా మాట్లాడుకోవటానికి సముద్రం, ఆకలేస్తే నాలుగు మెతుకులు.

పొద్దున్నే లేచి తేజను వెతుక్కుంటూ బీచ్‌లోకి వెళ్ళాను. ఆ రాళ్ళ అంచున కూర్చుని సముద్రాన్నే చూస్తూ ఉన్నాడు.

రోజూ ఆఫీసు నుండి కాస్త ముందే వచ్చి తేజతో కాసేపు ఆ బీచ్‌లో గడపటం అలవాటు చేసుకున్నా. తను ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనకి కవిత్వమెలా అబ్బిందో చెప్పాడు. చంద్రునితో తన స్నేహం గురించి, నక్షత్రాలతో తన ఊసుల గురించి, ఆకాశంతో తనువేసుకున్న గొడవల గురించి. కానీ సముద్రం తో తనకున్న అనుబంధం గురించి చెప్పాల్సొస్తే తనకి మాటలు వచ్చేవి కావు. ఏదో తెలియని ఉద్వేగం కనిపించేది. అందులోనే నేను మాటలు వెతుక్కునేవాడ్ని. నా పక్కనే నాకు కనబడని లోకమొకటుందని అప్పుడే నాకు తెలిసింది.

అప్పటికి తేజ చనిపోయి ఒక పదిరోజులయ్యిందేమో. ఒకరోజు చాలా కంగారుగా గదికి వచ్చాడు. తన బట్టలపెట్టె తియ్యమని చెప్పి తనకెంతో ఇష్టమైన సీబ్లూ కలర్ షర్ట్ చూపించి నన్ను వేసుకోమన్నాడు. మొదట నేను కాస్త మొహమాట పడ్డా వేసుకోక తప్పలేదు. తన డైరీ తీసుకుని రమ్మన్నాడు. ఇద్దరం వెళ్ళి బీచ్‌లో కూర్చున్నాం. తను చెప్పేది నన్ను వ్రాయమన్నాడు. ఆ రోజు పౌర్ణమనుకుంటా నిండు కళలతో చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఆ వెన్నెలకాంతిలో సముద్రం అందానికి ఆవాసంలా కనిపిస్తుంది. తను తదేకంగా సముద్రాన్నే చూస్తున్నాడు. యుద్దానికి వెళ్ళే సైనికుడు తన ప్రియురాలి మోముని కళ్ళలో నింపుకుంటున్నట్టుగా. ఆ ఏకాగ్రతలో తనని చూస్తుంటే మరింత వెలిగిపోతున్నాడు. తన చుట్టూ గతంలో ఎప్పుడూ లేనంత కాంతివంతంగా ఆరా(aura) స్పష్టంగా తెలుస్తుంది.

“ఎందుకలా అలల చేతులతో తాకాలని నా దాకా వచ్చి

అంతలోనే మరలిపోతావ్.

నా పాదాలు తాకగానే నీ ఆత్రం తీరిపోయిందేమో,

మరి నా ముద్దు చెల్లొద్దా?

అంతంలేని మన ప్రణయంలో

అంతరాయానికా ఈ ఆటలు?

నాకు తెలుసు మనిద్దరం శాశ్వతం”

అని చెబుతూ చప్పున ఆగాడు. వ్రాస్తున్న నేను ఆ ప్రవాహం ఆగిపోవటం నచ్చక తన వైపు బాధగా చూసాను. నా చేతుల్లో కాగితం గాలికి ఎగురుతూపోయింది. తేజ ఏవో అక్షరాలకోసం ఇంకా వెతుక్కుంటున్నాడు. నేను ఎగిరిపోయిన కాగితం వెంట పరిగెత్తాను.

ఒక అమ్మాయి ఆ కాగితాన్ని పట్టుకుని నాకు ఎదురొచ్చింది. పలకరింపుగా నవ్వుతూ ఆ కాగితాన్ని నా చేతికిచ్చింది. నేను కాగితం వైపు చూసాను.

“నాకు తెలుసు మనిద్దరం శాశ్వతం

ఈ కాలాలు, రూపాలు కేవలం ఈ ఆటలో తప్పని నియమాలు” అని కవిత పూర్తి చేసి ఉంది. నేను తనవైపు ఆశ్చర్యంగా చూసాను.

“క్షమించండి చొరవచేసి మీ కవితలో చొరబడినందుకు. నచ్చకపోతే మార్చెయ్యండి” అని నవ్వింది.

నేను తేజ కూర్చున్న వైపు చూసాను తేజ లేడు. చుట్టూ చూసాను ఎక్కడా కనిపించలేదు. కంగారుగా ఆ అమ్మాయి వైపు చూసాను. తేజలో ఎప్పుడూ కనిపించే ఆరా(aura) తన చుట్టూ కనిపించింది.

నా కంగారుని తను ఎలా అర్ధం చేసుకుందో “క్షమించండి నా పేరు సాగరిక. నేను చాలాకాలంగా మిమ్మల్ని గమనిస్తున్నా. మిమ్మల్ని దగ్గర నుండి ఎప్పుడూ చూడకపోయినా నాకెంతో ఇష్టమైన ఈ సీబ్లూ కలర్ షర్ట్ లో ఎన్నో సాయంత్రాలు మీరిలా వెన్నెల్లో సముద్రాన్ని ఆస్వాదించటం చూసాను. నాలాగే సముద్రాన్ని ప్రేమించే మరో మనిషున్నాడని అనుకునేదాన్ని. ఈరోజు ఈ కవిత చూసాక అచ్చంగా నా అంతరంగం అనిపించింది. మీతో మాట్లాడి తీరాలనిపించింది. ఇక నుండీ నేను కూడా మీతో వెన్నెల్లో సముద్రాన్ని షేర్ చేసుకోవచ్చా” అని అడిగి ఆశగా నావైపు చూసింది. ఆ అందమైన వెన్నెల్లో సముద్రం ఒడ్డున తన అందమైన కళ్ళను చూస్తూ అలా నిల్చుండిపోయాను.