కావ్య

1998 లో మాట

కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతూ ఉంది. అమ్మ వంటకి ఏదో కావలంటే నేను మార్కెట్ కి బయలు దేరాను. కరెంట్ పోవటంతో ఊరంతా చీకటిగా ఉంది. అప్పటికే చాలా సేపటి నుండీ వర్షం పడుతూ ఉండటంతో రోడ్డంతా బురదగా ఉంది. నేను జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్తున్నా. ఎదురుగా ఎవరో అమ్మాయి సైకిల్ మీద వస్తూ కనిపించింది. సైకిల్ కాస్త దగ్గరగా వచ్చినప్పుడే ఒక మెరుపు మెరిసింది దాని వెంటే పెద్ద శబ్దంతో దూరంగా ఎక్కడో పిడుగు పడింది. తల క్రిందకు దించుకుని సైకిల్ తొక్కుతున్న ఆ అమ్మాయి మెరుపుల శబ్దం విని ఆకాశం వైపు బెదురుగా చూసింది. బెదురుచూపులు చూస్తున్న ఆ అమ్మాయి కళ్ళు, వర్షంలో తడిచి చలికి వణుకుతున్న పెదవులు. నలుపు,ఎరుపు రంగుల్లో ఉండి లైట్ లో మెరుస్తున్న చుడిదార్, ఆ దృశ్యం అలా ఫ్రీజయిపోయింది.

పరిగెడుతున్న కాలం ఒక్క క్షణం అలా ఆగి నిలిచిపోయి మరలా సాగినట్టనిపించింది. రోడ్డు మీద అలానే నిల్చుని ఆ క్షణాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటు తన్మయత్వంలో ఉండిపోయాను. ఒక్కసారిగా నాకు ఎదో జరిగిన అనుభూతి, మనసులో ఒక తెలియని ఉద్వేగం. తేరుకుని తిరిగి చూసేసరికి తను దూరంగా వెళ్ళిపోయింది. సమయానికి వెనుక వెళ్ళటానికి నా చేతిలో సైకిల్ లేనందుకు చాలా కోపం వచ్చింది. ఆ అద్భుత క్షణాన్ని అలా తలుచుకుంటూ చాలారోజులు గడిపేసాను. తనెవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. తనని చూసిన అదే సమయానికి రోజూ వెళ్ళి ఎదురు చూసేవాడ్ని. కానీ తను మరలా కనిపించలేదు.

2000 లో

డిగ్రీ కాలేజీలో నా మొదటిరోజు. నాతో పాటూ ఇంటర్ చదివిన నేస్తాలతో వచ్చి చివరి బెంచ్లో కూర్చున్నా. కొత్త అనే దానికుండే సహజ లక్షణం వలన కాస్తంత భయంగా, కాస్తంత ఎక్సైటింగ్గా ఉంది. క్లాసులో అందరి మొహాలూ చూస్తూ నాలో నేనే వారి మీద ఒక అభిప్రాయాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నా. ముగ్గురు అమ్మాయిలు క్లాసులోకి వస్తూ కనిపించారు. నేను అప్పటికే చేస్తున్న పనిలో భాగంగా వారి వైపు చూసాను. మధ్యలో అమ్మాయిని చూసేసరికి ఒక మెరుపు మెరిసింది. ఆరోజు రాత్రి వర్షంలో నేను చూసింది ఆ అమ్మాయినే. ఆ రోజు నుండీ క్లాసు నాకు మరింత ఆసక్తిగా ఎక్సైటింగ్గా మారిపోయింది. తన పేరు కావ్య. చాలా చలాకీగా అందరితోనూ కలిసిపోయే అమ్మాయి. అందరికీ సహాయం చేస్తూ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా బాధపడి కళ్ళ నీళ్ళు పెట్టుకునేది.

కంప్యూటర్ ల్యాబ్‌లో ఇద్దరికీ ఒకటే సిస్టమ్ షేరింగ్‌కి ఇచ్చారు. అప్పటి నుండీ మా మధ్య పరిచయం, సాన్నిహిత్యం పెరిగి మంచి స్నేహితులమయిపోయాం. ఊరిలో మా ఇద్దరినీ ఎవరు చూసినా కాబోయే మొగుడూ,పెళ్ళాలు అనేవారు. నేను కంగారుగా తన వైపు చూసేవాడ్ని. తను మాత్రం నవ్వి ఊరుకొనేది. అలాంటి సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అది తన అంగీకారమో లేక వాదన అనవసరమనే భావనో తెలిసేది కాదు. తన అంతరంగం ఎప్పుడూ నాకు అర్ధమయ్యేది కాదు. కాలేజ్‌లో అమ్మాయిల్ని ఏడిపించేవారిని చూస్తే నేను కోపంతో ఊగిపోయి తెగ తిట్టేవాడ్ని. తను మాత్రం నిర్లిప్తంగా, మౌనంగా ఉండేది.

రోజులు గడుస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి నాకు కావ్య ఇంటి నుండి వాళ్ళమ్మగారు ఫోన్ చేసారు. కావ్యా వాళ్ళ నాన్నగారికి గుండె నొప్పి వచ్చి పడిపోయారని. నేను వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి ఫోన్ చేసి ఆంబులెన్స్‌ని పంపించి, వేగంగా వాళ్ళింటికి చేరుకున్నా. అంబులెన్స్ వచ్చేపాటికే ఆయన చనిపోయారు. ఇంటిలో అందరూ ఒకటే ఏడుపు. బయట వాళ్ళకి కష్టం వస్తేనే తట్టుకోలేని కావ్య బ్రతుకుతుందా అని భయం వేసింది నాకు. ఇంటిలో జరగాల్సిన పనులు చూసే మనుషులు లేరు. నేనే నా క్లాస్‌మేట్స్ అందరినీ పిలిచి తలా ఒకపని అప్పగించాను. అన్ని పనులూ చూస్తూనే కావ్యని గమనిస్తూ ఉన్నా. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. పరిగెట్టి వెళ్ళి తనకి నీళ్ళుపట్టాను. అక్కడ శవం దగ్గర అందరూ జనాలే తనకి గాలి తగిలే అవకాశం లేదు. కాసేపు బలవంతంగా వేరే గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాను. ఏడ్చి ఏడ్చి తలనొప్పి వచ్చి ఉంటుంది అని తలపట్టాను. తన కళ్ళు వర్షించటం ఆపలేదు.

సాయంత్రానికి అంతా అయిపోయింది. అక్కడ మరో మనిషి ఉండేవాడు అనే గుర్తులు జ్ఞాపకాలుగా మారిపోతున్నాయి. అందరూ సెలవు తీసుకుంటున్నారు. నేను కావ్య అమ్మాగారి పక్కనే ఉండి ఆమె చేత బలవంతంగా టీ తాగించే పనిలో ఉన్నాను. కావ్య కోసం చుట్టూ చూశాను. తను మా క్లాస్‌మేట్స్‌తో మాట్లాడుతూ కనిపించింది. పోనిలే కాస్త ఊరటగా ఉంటుంది అనుకున్నాను. తను అందరి సహాయానికి థ్యాంక్స్ చెప్పి అందరితో కాసేపు మాట్లాడి లోపలికి వచ్చింది. నేను సాయంత్రానికి ఇక ఇంటికి వెళ్ళటానికి లేచాను. కావ్య లోపల పడుకుని ఉంది. వాళ్ళమ్మగారు “కావ్యా, అబ్బాయి వెళ్తున్నాడే ఒకసరి ఇలా బయటకి రా” అని పిలిచారు. తనకి వినిపించలేదేమో రాలేదు. లోపలికి వెళ్ళి చూసాను. అలానే పడుకుని నిర్లిప్తంగా చూసింది నా వైపు. “వెళ్తున్నా. రేపు ఉదయం వస్తా” అని చెప్పాను.

తను స్పందించకుండా నా కళ్ళల్లోకే చూస్తూ ఉంది. నా కళ్ళలో ఏదో వెతుకుతున్నట్టుగా అనిపించింది. తను ఏదో చెప్పాలనుకుంటుందేమో అనిపించింది. అలానే తనని చూస్తూ నిల్చున్నా. కాసేపు అలానే చూసి సరే అన్నట్టుగా తల ఊపి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం నేను “ఇంతేనా తను ఏం చెప్పాలనుకోలేదా? లేక తనిప్పుడు ఏం చేప్పే పరిస్థితిలో లేదా?” అని ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయాను. తను మరలా కళ్ళు తెరిచి చూసింది. నేను కాస్త కంగారుగా “సరే అయితే” అని అక్కడ నుండి కదిలాను.

మరుసటిరోజు నుండీ తనని మామూలు మనిషిని చెయ్యటానికి చాలా ప్రయత్నాలు చేసాను. క్లాసులో అందరికీ అదేమాట చెప్పాను. క్లాసులో మా బ్యాచ్‌గా ఎప్పుడూ తిరిగే రమ్య, జగతి, వాణి, రమేష్, క్రిష్ణ అందరూ నాకోసం తనని జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు చాలా ఆనందంగా అనిపించేది.

ఒకరోజు అందరం క్యాంటీన్‌లో కూర్చుని ఉండగా మా దగ్గరకి చందు అనే క్లాస్‌మేట్ వచ్చాడు. కాలేజిలో ఉండే పోకిరి గ్యాంగ్ మెంబర్ వాడు. మందు, సిగరెట్లు, అమ్మాయిలని ఏడిపించటం ఇలా వాళ్ళు చెయ్యని వెదవపని లేదు. వీడిక్కడకి ఎందుకొచ్చాడు అని చిరాకు పడుతుంటే “నేను మంచిగా మారాలనుకుంటున్నా. అన్నీ వదిలేస్తున్నా. మీ బ్యాచ్‌ని చూసాక నాలో మార్పు వచ్చింది” అన్నాడు. వాళ్ళ బ్యాచ్ మొత్తానికీ వీడు కాస్త మంచోడు అనే ఆలోచన అందరిలో ఉంది. అందుకే వెంటనే నవ్వుతూ సరే అన్నారు.

రోజులు సరదాగా గడిచిపోయాయి. పరీక్షలు దగ్గర పడటంతో ప్రిపరేషన్ కోసం సెలవులిచ్చారు. రోజూ సాయంత్రం అందరం ఒకచోట కలిసి చదివింది ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళం. ఒకరోజు నేను రోజంతా కూర్చుని మంచి మెటీరియల్ ప్రిపేర్ చేసాను. దానిని జెరాక్స్ తీసి అందరికీ ఇవ్వటానికి బయలుదేరాను. అప్పుడే బాగా వర్షంపడి ఆగింది. ఆ చల్లని వాతవరణం, ఇంటి చూరు నుండీ జారిపడుతున్న నీళ్ళ శబ్ధాలని ఆస్వాదిస్తూ చందుగాడి రూమ్‌కి వెళ్ళాను. తలుపు కొడితే ఎంతకీ తెరవడు. పడుకున్నాడేమో అని ఇంకా గట్టిగా కొట్టాను. వాడు కిటికీ దగ్గరకి వచ్చి తలుపుతీసి నన్ను చూసి “ఈ రోజు నేను రానురా. నిద్రగా ఉంది. నువ్వెళ్ళు” అని వెంటనే తలుపేసేసాడు.

ఆ క్షణకాలంలో వాడు దాచాలనుకున్న నిజం దాగలేదు. కిటికీలో నుండి వాడి రూమ్‌లో ఉన్న కావ్య సైకిల్, సైకిల్‌కి తగిలించి ఉన్న తన బ్యాగ్ కనిపించింది. నా చేతిలోని మెటీరియల్స్ క్రిందపడి వాననీటిలో కొట్టుకుపోయాయి.

2006 లో

ఒక పేరున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నేను ఆ రోజు ఆఫీసులో ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నాను. మా మేనేజర్ నా డెస్క్‌ఫోన్‌కి కాల్ చేసి తన దగ్గరకి రమ్మని పిలిచారు. పని మధ్యలో ఆపి హడావుడిగా వెళ్ళి ఆయన చాంబర్ తలుపుతీసి లోపలికి చూసాను. ఆయన ఎవరితోనో మీటింగ్‌లో ఉన్నారు. నన్ను చూసి “హా రావోయ్. ఇదిగో ఈమె కొత్తగా జాయిన్ అయ్యింది. పేరు కావ్య. నీ ప్రాజెక్ట్‌లో వేస్తున్నా. అలవాటయ్యేదాకా చూస్కో” అన్నారు. ఆమె వెనక్కి నవ్వుతూ తిరిగి నా వైపు చూసింది. కావ్య, ఎన్నో సంవత్సరాల క్రితం నేను వదిలి వచ్చేసిన ఒక చేదు జ్ఞాపకం. తను కూడా నన్ను ఆశ్చర్యంగా చూస్తూ పలకరించింది.

ఇద్దరం క్యాంటీన్‌కి వెళ్ళి కూర్చున్నాం. ఇద్దరిలో ఇంతకు ముందున్న సాన్నిహిత్యం లేదు కానీ అది ఇంకా అలానే ఉంది అనే భ్రమ కలిగించే ప్రయత్నం ఇద్దరం చేస్తున్నాం. తను ఇంతకు ముందు ఎక్కడ పని చేసింది ఈ కంపెనీకి ఎలా వచ్చిందిలాంటి వివరాలు చెప్పింది. నేను కూడా నా కెరీర్ ఎలా సాగుతుందో క్లుప్తంగా చెప్పాను. మధ్యలో కాలేజీ విషయాలు దొర్లాయి. మాటల మధ్యలో చందు పేరు వచ్చినప్పుడు తను ఇబ్బందిపడుతూ ఉండటం గమనించాను. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా తనకిష్టం లేదు అనే విషయం అర్ధమయ్యి ఊరుకున్నా.

సాయంత్రం తనని నా కారులో ఇంటి వరకూ దించాను. ఇంటి బయటే ఉన్న కావ్య అమ్మగారు నన్ను చూసి లోపలికి రమ్మని బలవంతపెట్టారు. కాఫీ చేసి ఇచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. కావ్య నాన్నగారు చనిపోయినప్పుడు నేను చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ నా చేతిని పట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఇన్నేళ్ళు కనీసం కబురైనా లేకుండా దూరంగా ఉన్నందుకు మందలించారు. ఆమెకు మేము ఎందుకు దూరమయ్యామొ తెలియదు అని అర్ధమయ్యింది.  కావ్య మాత్రం నిర్లిప్తంగా ఎటో చూస్తూ కూర్చుంది. మౌనంగా భారమైన గుండెతో ఇంటికి వచ్చేసాను.

కావ్య ఆఫీసులో చురుగ్గా ఉండేది. తనకి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేవాడిని. త్వరగానే ఆఫీసులో మంచి పేరు తెచ్చుకుంది. ఒకరోజు కావ్య అర్జెంటుగా చెయ్యాల్సిన పని ఒకటి వచ్చింది. కావ్య రాగానే తనకి చెప్పాలి అని ఎదురు చూస్తున్నా. సమయం దాటిపోతుంది తను రాలేదు. ఇంటికి ఫోన్ చేస్తే కావ్య అమ్మగారు “దానికి విపరీతమైన జ్వరం. ఒంటి మీద తెలివి లేదు. వళ్ళంతా కాలిపోతుంది బాబూ” అని బెంగపడుతూ చెప్పారు.

నేను వెంటనే మా మేనేజర్‌కి చెప్పి కావ్య ఇంటికి వెళ్ళాను. మందుల కోసం బయటకి వెళ్తు కావ్య అమ్మగారు కనిపించారు. ఆమెను ఉండమని చెప్పి నేను ఆ చీటీ పట్టుకుని వెళ్ళి మందులు తెచ్చాను. ఇద్దరం కలిపి కావ్యకి కాస్త వేడిపాలు తాగించి మందులు వేయించాము. నేను కావ్య పక్కనే కూర్చుని తనని అడిగి తను పూర్తి చెయ్యాల్సిన పని పూర్తి చేసాను. పని పూర్తయ్యిందని మేనేజర్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఇంతలో మా ప్రాజెక్ట్ టీమ్ అందరూ కావ్య ఇంటికి వచ్చారు. కావ్యని పలకరించి అక్కడే కూర్చున్నారు. కావ్య అమ్మగారు వచ్చినవారితో చిన్నప్పటి నుండీ మా స్నేహం గురించి, మా కాలేజిరోజుల గురించి చెబుతున్నారు. కావ్య వెళ్ళి వాకిట్లో నిల్చుంది. నేను తనకి వెయ్యాల్సిన మాత్రలు పట్టుకుని బయటకి వెళ్ళాను.

బయట కావ్య తో టీమ్ లీడర్ శశాంక్ మాట్లాడుతూ కనిపించాడు. “కావ్యా, వచ్చే నెలలో నేను ప్రోజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నా. నాకు సహాయంగా ఎవరో ఒకరు రావాలి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీకు కూడా కాస్త జీతం పెరుగుతుంది. ఇందులో నా స్వార్ధం కూడా ఉంది. మీ మీద మొదటి నుండీ నాకొక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇలా ఇద్దరం కలిసి పని చేయటం వలన ఒకర్ని ఒకరం అర్ధం చేసుకోవచ్చు. ఏమంటారు?” అని అంటూ కావ్య చెయ్యి పట్టుకున్నాడు శశాంక్.

మరుసటిరోజు మా మేనేజర్ పిలిచి శశాంక్‌తో పాటూ అమెరికా వెళ్ళమని అడిగారు. నాకు వీలు కాదని కావ్యని పంపమని చెప్పి వచ్చేసాను.

2012 లో

కొంతమంది స్నేహితులతో కలిసి వైజాగ్‌లో సొంత కంపెనీ మొదలుపెట్టాం. ఉదయమంతా ప్రారంభోత్సవ పనుల్లో అలిసిపోయిన నేను సాయంత్రానికి కాస్త తీరిక దొరికి సోఫాలో కూలబడ్డాను. ఎవరిదో తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తి మాట్లాడే ఓపిక లేకపోయినా ఎవరో ఏమవసరమో అనుకుని ఎత్తాను. “నేను కావ్యని. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అమ్మకి  సీరియస్‌గా ఉంది. నిన్ను చూడాలంటుంది” అని చెప్పి ఏడుస్తూ పెట్టేసింది.

నేను వెంటనే అందుబాటులో ఉన్న ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాను. ఐ.సి.యు.లోకి నేను వెళ్ళేసరికి కావ్య అమ్మగారు చాలా నీరసంగా ఉన్నారు. సెలైన్స్ ఎక్కిస్తున్నారు. నేను వెళ్ళి ఆమె చేతిని తాకేసరికి కాస్తంత ఓపిక తెచ్చుకుని కళ్ళెత్తి చూసారు. నన్ను చూడగానే ఆమె ముఖంలో ఒక వెలుగు కనిపించింది. కావ్య మంచానికి ఒక వైపు కూర్చుని ఏడుస్తూ ఉంది. కావ్యని దగ్గరికి రమ్మని చేతితో పిలిచారు. కావ్య చేతిని నా చేతిలో పెట్టి “నీకు దీన్ని అప్పగిద్దామనే ఎదురు చూస్తున్నా. ఎప్పుడో పోయే ప్రాణం నీరాక కోసమే కొట్టుకుంటూ మిగిలుంది. దీని సంగతి నీకు తెలియంది కాదు. ఒంటరిగా బ్రతకలేదు. పిచ్చిది ఇక దీని భారం నీది” అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. డాక్టర్ వచ్చి కావ్యని, నన్ను బయటకి పంపించారు. నేను డాక్టర్‌తో మాట్లాడటానికి ఆయన గదికి వెళ్ళాను. డాక్టర్ నాకు ఆమె పరిస్థితి చెబుతూ ఉండగా నర్స్ పరిగెట్టుకుంటూ వచ్చింది. వెళ్ళి చూసేసరికి కావ్య అమ్మ మీద పడి ఏడుస్తూ ఉంది.

రెండురోజులు గడించింది. నాకు వైజాగ్ నుండి కాల్స్ వస్తున్నాయి. ఆ విషయం చెప్పటానికి కావ్య గదికి వెళ్ళాను. కావ్య కిటికీ నుండి శూన్యంలోకి చూస్తూ నిల్చుంది. నేను వచ్చిన అలికిడి తనకి తెలిసింది. ఇంకా కిటికీ వైపే చూస్తూ ఉంది.  తనకంటి నుండి రెండు బొట్లు జారాయి. ఏం మాట్లాడాలో తెలియక నేను తనని చూస్తూ నిలుచున్నాను.

“అలిసిపోయాను రా. పరిగెట్టి పరిగెట్టి అలిసిపోయాను. నా అంచనాలు, నమ్మకాలే నిజమనే భ్రమతో పరిగెట్టి అలిసిపోయాను. నిజాలు చెబితే నీకు కోపం వస్తుందేమో. నన్ను క్షమించలేవేమో కానీ గుండెల్లో నుండి తోసుకొస్తున్న కన్నీళ్ళు ఈ నిజాల్ని ఇక దాగనీయవు. చిన్నప్పటి నుండీ అహంకారమో పిచ్చితనమో కానీ, చేతకాని తనాన్ని దాచిపెట్టే ముసుగే మంచితనమనే నటన అనుకునేదాన్ని. నీ మంచితనాన్ని నీ వ్యక్తిత్వాన్ని నా నమ్మకాలు ఒప్పుకోనిచ్చేవి కావు. అమ్మ నీ వ్యక్తిత్వాన్ని అభిమానిస్తుంటే ఎంత పిచ్చిదో అనుకునేదాన్ని. అలా అని నువ్వు చెడ్డవాడివని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను దక్కించుకోటానికి నువ్వేసుకున్న ముసుగే ఈ మంచితనం అనుకున్నా.

అమ్మాయిల్ని కామెంట్ చేసేవారిని, ఫ్లర్ట్ చేసేవారిని, నేరుగా వచ్చి చేయి పట్టుకుని ప్రేమిస్తున్నా అని చెప్పేవారిని చూసి స్ట్రైట్ ఫార్వర్డ్, డేరింగ్, హానెస్ట్ అనుకునేదాన్ని. వీళ్లంతా నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, నటించటం లేదు అనుకునేదాన్ని. వాళ్ళలో కనిపించే మ్యాన్లీ లుక్ సెన్సిటివ్‌గా ప్రేమిస్తూ అమ్మాయిల్ని కేరింగ్‌గా చూసుకునేవాళ్ళలో నాకు కనిపించేది కాదు.” ఇంకా ఏదో చెప్పబోతూ దుఃఖం గొంతుకి అడ్డుపడటంతో ఆగిపోయి నిస్సహాయంగా నా గుండెల మీద వాలిపోయింది.

కావ్య ముఖానికి, ఆషాడానికని వెళ్తూ తనని పదే పదే గుర్తు చేసుకోవాలని నా మెడలో నా భార్య వేసిన లాకెట్ గుచ్చుకుని దూరంగా జరిగింది.

స్నిగ్ధ

ఒక్కగానొక్క బిడ్డని కన్నులెదుటే పోగొట్టుకున్న తల్లి దుఃఖంలా రెండురోజుల నుండీ అంతనేది లేకుండా వర్షం కురుస్తోంది. ఆకాశం తను పోగొట్టుకున్న బంధాలేవో నేల మీద ఆత్రంగా వెతుక్కోటానికా అన్నట్టు మెరుపులు పదే పదే మెరుస్తున్నాయి. గుండెల్లో వణుకు పుట్టిస్తూ మధ్య మధ్యలో ఉరుములు. ఈదురుగాలుల దాటికి ఎక్కడో కరెంటు తీగలు తెగిపోయాయేమో కరెంటుపోయింది. కిటికీలో నుండి వచ్చిన చల్లనిగాలి ఇల్లంతా ఆక్రమించి వణికిస్తోంది.

రెండ్రోజులుగా వాతావరణం ఇలానే ఉండటంతో మనసంతా ఏదో దిగులు కమ్మేసింది నాకు. దుప్పటి కప్పుకుని వాలు కుర్చీలో కూర్చుని కిటికీ నుండి బయట పడుతున్న వర్షాన్నే చూస్తున్నాను. చూస్తూ ఉండగానే బయటంతా చీకటి కమ్ముకుంది. గోడ మీద వేలాడుతున్న వాచ్ వైపు చూసాను. ఎనిమిది గంటలవుతుంది. టైము తెలియకుండానే గడిచిపోయింది.  గదిలో ఒక మూలగా వెలిగించిన కొవ్వొత్తి వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంది. సగం ఖాళీ అయిన స్కాచ్ బాటిల్ టీపాయ్ మీద కవ్విస్తున్నట్టుగా నిల్చుని ఉంది. కళ్ళు మూసుకుంటే కమ్మేస్తున్న ఒంటరితనం. కళ్ళు తెరిచి చూసినా అదే ఒంటరితనం. పదేళ్ళుగా ఎంత అలవాటు చేసుకోవాలని చూసినా ఇంకా ఈ ఒంటరితనానికి నేను అలవాటు పడలేదు.

చుస్ స్ స్ స్ మంటూ వెనుకనుండి వచ్చిన శబ్ఢానికి ఉలిక్కిపడ్డాను. గుండె ఒక్కసారిగా ఆగినట్టనిపించింది. తేరుకుని కిచెన్‌లోకి వెళ్ళి కుక్కర్ దించేసి వచ్చి మరలా కూర్చోబోతుంటే గేటు తీసిన చప్పుడయ్యింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గేటు వైపు చూసాను. ఎవరో ఒక మనిషి రావటం అస్పష్టంగా కనిపిస్తోంది. కరెంటు లేకపోవటంతో దారిలో లైట్స్ వెలగక ఎవరో తెలియటంలేదు. ఈ సమయంలో నా ఇంటికి వచ్చేదెవరో అర్ధంకాలేదు. ఊరికి కాస్త వెలుపలగా, ప్రధాన రహదారిని అనుకుని రెండెకరాల స్థలంలో ఉన్న ఇల్లు మాది. నాన్న డాక్టరుగా బాగా సంపాదిస్తున్న రోజుల్లో చుట్టూ తోట వేసి మధ్యలో ఈ బంగళా కట్టించారు. ఆయన ఉన్న కాలంలో ఇంటికి రాకపోకలు బాగానే ఉండేవి. అమ్మా,నాన్న పోయాక ఈ ఇంటిని, నన్ను పట్టించుకునే నాధుడే లేకపోయాడు. పగలు పని వాళ్ళు తప్ప సాయంత్రం దాటితే ఈ ఇంటిలో నేను ఏక్‌నిరంజన్. అలాంటిది ఈ సమయంలో ఎవరు వస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా.

మెరుపు వెలుగులో తుళ్ళిపడి బయపడుతున్న ఒక అమ్మాయి, ఆమె పక్కనే నడుస్తూ ఒక చిన్న పాప కనిపించారు. పాపం ఇద్దరూ వర్షానికి బాగా తడిచిపోయి ముద్దయిపోయారు. నేను వెంటనే కొవ్వొత్తి పట్టుకుని తలుపు వరకూ వెళ్ళి తలుపుని సగం తెరిచి “ఎవరండీ మీరు? ఎవరు కావాలి” అని అడిగాను. ఇరవయ్యేళ్ళు ఉండొచ్చు ఆ అమ్మాయికి ఏదో చెప్పింది కానీ చలికి వణుకుతున్న మాటలు నాకు అర్ధం కాలేదు. పాపం ఆ చిన్న పాపయితే చలికి బిగుసుకుపోయింది.

“దీపం ఆరిపోతుందని తలుపు పూర్తిగా తెరవలేదు. మొదట మీరు లోపలికి రండి” అని వారికి దారిచ్చి నేను కొవ్వొత్తి తీసి మరలా బల్ల మీద పెట్టాను. గదిలోకి తొందరగా వెళ్ళి ఒక తువ్వాలు తెచ్చి ఇచ్చాను.

“ఇద్దరూ బాగా తడిచి ఉన్నారు. తుడుచుకోండి.”

ఆ అమ్మాయి కాస్త కూడా మొహమాట పడే పరిస్థితిలో లేదు. వెంటనే అందుకుని పాపని తువ్వాలుతో చుట్టేసి కాసేఫు వెచ్చదనం వచ్చేలా ఉంచి. తరువాత శుభ్రంగా తుడవటం మొదలుపెట్టింది. నేను ఒక కప్పుతో కాచిన పాలు తీసుకొచ్చి ఇచ్చాను. ఆ ఆమ్మాయి కాస్త తెరుకున్నట్టుంది. కప్పు అందుకుంటూ కృతఙ్ఞతగా నవ్వింది. పాలని తన నోటితో ఊదుతూ పాపకి మెల్లగా తాగిస్తుంది. పాప భయపడుతూ చుట్టూ అన్నింటినీ చూస్తూ మెల్లగా తాగుతుంది. నేను పక్కనే నిలబడి చూస్తున్నాను.

బూడిదరంగు షార్ట్ మోడల్ కుర్తాలో ఎంతో అందంగా ఉందా ఆ అమ్మాయి. పలకరింపుగా పెదాలపైన చేరిన ఆమె నవ్వు విచ్చుకున్న గులాబీలా ఉంది. తడిచిన కుర్తాలో నుండి కనిపిస్తున్న ఆమె వంటి రంగు చప్పున పాలరాతి శిల్పాన్ని గుర్తు చేస్తుంది. బాగా తల తడిచిపోవటం వలన ఆమె రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఏంటో తెలియకపోయినా చాలా ఆకర్షణీయంగా మాత్రం అనిపించింది. నేను తననే అలా చూస్తూ ఉండటం గమనించిందో ఏమో ఆమె నావైపు చూసింది.

నేను కాస్త తడబాటుతో చూపుని పాప వైపు మరల్చాను. పాపకి నుదిటి మీద గాయం కనిపించింది. “అరెరె ఏమయ్యింది పాపకి?” అని అరిచాను.

ఆమె కూడా అప్పుడే చూసినట్టుంది “అయ్యో” అంటూ కంగారుపడింది. నేను పరిగెట్టి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చాను. పాపని సోఫాలో కూర్చో బెట్టి చకచకా పాప గాయానికి కట్టు కట్టాను. పాప ఇంకా ఏదో భయంతో వణుకుతూనే ఉంది. ఒక్కమాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. నేను పాపకి కట్టు కడుతున్నంత సేపు తను నా పక్కనే నీళ్ళు నిండిన కళ్ళతో కంగారు పడుతూ నేను అడిగినవి అందిస్తూ నిలుచుంది. నేను నా పని చేస్తూనే ఓరకంట ఆమెను చూస్తూ ఉన్నాను. చందమామ లాంటి ఆమె ముఖంలో దిగులు కూడా అందంగానే ఉంది తప్ప కష్టంలా కనిపించటం లేదు. అడిగినవి అందిస్తున్నప్పుడు తన చేయి తగులుతుంటే ఏదో తెలియని అనుభూతి నన్ను ఆవహిస్తూ ఉంది. క్షణాల్లో సమ్మోహనం చేసే అందాన్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. కావాలనే ప్రతీది తనని అడిగి తన చేతి నుండి తీసుకుంటున్నాను. ఆ స్పర్శ కలిగిస్తున్న అనుభూతిని వదులుకోవాలనిపించటం లేదు. బాగా తడిచి ఉండటం వలనేమొ ఆమె శరీరం ఇంకా చల్లగానే ఉంది. తల నుండి ఇంకా బొట్లుగా నీరు జారుతూ ముత్యాల్లా మెరుస్తుంది. తను అలా నిల్చున్న తీరులోనే ఒక ముచ్చటైన ఒద్దిక స్పష్టంగా తెలుస్తూ ఉంది.

పాప అలానే భయపడుతూ సోఫాలో పడుకుంది. పాపం ఆ అమ్మాయి ఇంకా అలా చలికి ఇబ్బందిపడుతూ నిలబడే ఉంది.

“కూర్చోండి ఇప్పుడే వస్తాను” అని చెప్పి నేను కిచెన్‌లోకి నడిచాను.

వేడి వేడి కాఫీ కప్పులతో నేను బయటకి వచ్చేసరికి ఆ అమ్మాయి చుట్టూ పరిసరాలను పరికించి చూస్తు ఉంది. ఇంత వరకూ పాప పరిస్థితి, వర్షం, వణికిస్తున్న చలివలన మరుగునపడిన స్త్రీత్వం ఇప్పుడు తిరిగి మేల్కొన్నట్టుంది. అన్నింటినీ అనుమానంగా చూస్తూ ఉంది. తనని మరింత అనుమానానికి లోను చెయ్యాలని టేబుల్ మీద స్కాచ్ బాటిల్ అల్లరిచేస్తుంది. నవ్వుకుంటూ నేను దగ్గరగా వెళ్ళి “కాఫీ” అన్నాను.

“థాంక్యూ” అని నవ్వుతూ అందుకుంది. ఒక రెండు సిప్స్ చేసాక తనలో కాస్త రిలీఫ్ కనిపించింది. నేను తన గురించి అడగాలా వద్దా అని ఆలోచిస్తూ తన వైపే చూస్తున్నాను.

నా మనసులో ఎముందో చదివినట్టుగా “నా పేరు స్నిగ్ధ” అని తల ఎత్తకుండానే చెప్పింది. శ్రావ్యమైన తన గొంతు నా చెవులను తాకగానే నా శరీరం మొత్తం ఒక్కసారిగా అలర్టయ్యింది. కళ్ళు మరింత పెద్దవి చేసి తననే చూస్తూ ఉన్నాను. తను తల పైకెత్తి చెప్పటం కొనసాగించింది.

మాది విశాఖపట్నం. ఫ్యామిలీతో శ్రీకూర్మం చూడాలని వెళ్ళి వస్తుండగా కారు చెడిపోయింది. అక్కా, బావా పాపని నా దగ్గర ఉంచి మెకానిక్‌ని తీసుకు రావటానికి వెళ్ళారు. ఇంతలో పాప ఆకలి అంటే ఇలా వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం. అక్కా వాళ్ళు వచ్చేస్తే కంగారు పడతారేమో అని తల ఎత్తి నా వైపు చూసింది.

అప్పటికే తన్మయత్వంగా తనని చూస్తున్న నా కళ్ళు తన చూపుతో కలిసాయి. ఏమనుకుంటుందో అనే స్పృహ కూడా లేకుండా నేను అలా చూస్తూ ఉండిపోయాను. తనే కాస్త కంగారుగా చూపు మరల్చుకుని “మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా?” అని అడిగింది.

నా జీవితం గురించి ఒక మనిషి నాతో మాట్లాడి దాదాపు పదేళ్ళయ్యింది. నా గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న ఒంటరితనాన్ని ఒక మృదువైన చేతితో ఎవరో ఆప్యాయంగా స్పృశించినట్టనిపించింది. సన్నటి నీటితెర కళ్ళను కమ్మేస్తూ ఉంటే కదిలిపోయాను.

“అవును ఈ లంకంత కొంపలో ఒక్కడినే ఉంటాను. నా పేరు గిరీష్. మా నాన్న ఒకప్పుడు ఈ ఊరిలో పేరు మోసిన డాక్టర్. అప్పటిలో బాగా సంపాదించేవారు. మా అమ్మని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళి ఇష్టంలేని బంధువులు మా నాన్నకి దూరం అయ్యారు. మా నాన్న ఊరికి దూరంగా ఈ ఇల్లు కట్టుకుని ఇక్కడికి మారిపోయారు. పదేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో అమ్మా,నాన్న చనిపోయారు. అప్పటి నుండి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నా.” చెబుతుంటే నా గొంతు మెల్లగా పూడుకుపోయింది. నేల వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాను. తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. గది మొత్తం నిశ్శబ్దం అలముకుంది. పాప ప్రశాంతంగా పడుకుంది.

“ఠంగ్ ఠంగ్ ఠంగ్” అంటూ వాల్ క్లాక్ గంటలు మొదలుపెట్టింది. తను ఉలిక్కిపడి అటువైపు చూసింది. పాప నిద్రలో నుండి లేచి భయంగా చుట్టూ చూస్తూ ఉంది. నేను కూడా గోడ మీద వేలాడుతున్న క్లాక్ చూసా. టైం తొమ్మిదవుతుంది.

ఆమె లేచి పాపని ఎత్తుకుని “ఇక మేము వెళ్తాం. టైమయ్యింది అక్కా, బావా వచ్చేసుంటారు” అంది. అమె కళ్లలో ఏదో కంగారు, ఆందోళన కనిపిస్తుంది.

“వర్షం ఇంకా పడుతుంది. కాసేపు ఇక్కడే ఉంటే మంచిదేమో” అన్నాను తననే చూస్తూ.

“పర్లేదు” అంటూ ఆమె తలుపు వైపు దారితీసింది. ఇంకా అదే కంగారు.

“పోనీ నేనూ వస్తా మీ కారు వరకు. చీకట్లో ఒక్కరే కష్టం కదా” అని కదలబోయాను.

దానికి ఆమె “ప్లీజ్ వద్దు. ఏమీ అనుకోకండి” అని ముందుకు కదిలింది.

నేను మూలన ఉన్న గొడుగు అందించా “ప్లీజ్ ఇది కాదనకండి. వర్షం బాగా పెద్దదిగా ఉంది.”

ఆమె ఒక సెకెండ్ ఆలోచించి గొడుగు అందుకుని వేగంగా నడుచుకుంటూ చీకట్లో కలిసిపోయింది. నేను కిటికీలో నుండి చీకటిని చూస్తూ అలానే నిద్రపోయాను.

పొద్దున్నే నాన్న స్నేహితుడు రంగ మావయ్య తలుపులు బాదుతూ “గిరి గిరి” అని అరుస్తుంటే లేచాను. వర్షం వెలిసి సూర్యుడొచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తీసాను.

“ఏరా ఇప్పుడే లేచావా” అంటూ మావయ్య లోపలికి వచ్చి నా చేతిలో ఒక కవరుపెట్టి “ఉండు ఇద్దరికీ కాఫీ కలుపుతా” అంటూ కిచెన్‌లోకి వెళ్ళారు.

“ఈ కవరేంటి మావయ్యా” అంటూ నేనూ వెనకే వెళ్ళాను.

“పెళ్ళి సంబంధంరా. మీ అత్తయ్య చూసింది. కవర్ తీసి ఫోటో చూడు” అని నవ్వారు మావయ్య.

ఆసక్తి లేకపోయినా మావయ్య కోసం తెరిచి చూసాను.

“స్నిగ్ధ. అవును స్నిగ్ధే” ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా నా మొహంలో తొంగి చూసాయి.

మావయ్య నాకు కాఫీ అందిస్తూ నా ఆనందం చూసి “ఓహో నచ్చిందన్నమాట” అని నవ్వాడు.

వీధిలో ఏదో గొడవగా ఉంటే బయటకి వచ్చాం నేనూ మావయ్య. ఆంబులెన్స్ వచ్చినట్టుంది. ఇద్దరం కంగారుగా రోడ్డు మీదకి వచ్చాం.

“గిరిబాబూ రాతిరి చూడనేదా? ఏడుగంటలేల పేద్ద యాక్సిడెంటయినాది. ఆయేల పోను చేస్తే ఇప్పుడుకొచ్చినారు ఈ ఆసుపత్రోలు.” అని చెప్పాడు పాలేరు కిట్టయ్య.

యాక్సిడెంట్ అయిన కారు నుండి శవాలు బయటకి తీసారు. “స్నిగ్ధ. అవును స్నిగ్ధే” నా గుండె క్షణ కాలంపాటూ అత్యంత వేగంగా కొట్టుకుని పగిలిపోయింది. కళ్ళు తెరుచుకుని ఆ భయంకర వాస్తవాన్ని చూస్తూ నిలుచుండిపోయాను. స్నిగ్ధతో పాటే పాప, ఇంకా ఎవరో ఇద్దరు భార్యా,భర్తల శవాలు.

“అయ్యో భగవంతుడా” రంగ మావయ్య షాక్‌లో ఉన్నారు.

నేను తేరుకుని “కిట్టయ్య యాక్సిడెంట్ ఎన్నింటికయ్యింది” అని అడిగాను.

“ఏడు గంటలప్పుడు బాబూ”

“కాదు తప్పు 7 గంటలకి అయ్యుండదు. నిన్న తొమ్మిదికి మా ఇంటికి వచ్చారు వీళ్ళు” పిచ్చోడిలా అరుస్తున్నాను నేను. రంగ మావయ్య మరింత షాకయ్యి నా వైపు చూస్తున్నారు.

“లేదు సార్. సరిగ్గా ఏడు గంటలకే జరిగింది. నేనే ఫోన్ చేసాను హాస్పిటల్‌కి. అప్పుడే హాస్పిటల్ వాళ్ళకి టైమ్ కూడా చెప్పాను” అని ఖచ్చితంగా చెప్పాడు కిట్టయ్య కొడుకు.

నాకంతా అయోమయంగా ఉంది. కళ్ళు తిరిగి పడబోయాను. కిట్టయ్య, రంగ మావయ్య నన్ను జాగ్రత్తగా పట్టుకుని గోడకు చేర్పుగా కూర్చోబెట్టరు. చుట్టూ కంగారుగా చూస్తున్నాను. అస్పష్టంగా ఏదో గేటు దగ్గర కనిపించి అటు చూసాను. గేటుకు వేలాడుతూ నిన్న నేను స్నిగ్ధకిచ్చిన గొడుగు.