అందరికీ మొదటి అమ్మ

అమ్మమ్మ

అనురాగలోకంలో అందరికంటే పెద్ద ఆమె.

అమ్మకి పసివాళ్ళ లాలన నేర్పేది ఆమె.

అడ్డాలలో వేసి అందరికీ మొదట లాలపోసేది ఆమె.

నిజానికి అందరికీ మొదటి అమ్మ ఆమె.

ఆమె మన అమ్మనే కన్న అమ్మమ్మ.

ఎలా మరిచిపోయాం మనం. మనకి జన్మనిచ్చిన అమ్మని కీర్తించి మన గుండెల్లో కొలువుంచాం. మరి అమ్మమ్మని ఎలా మరిచిపోయాం మనం. మన అభివృద్ధిలో, కీర్తిలో ఏనాడూ తనవాటా ఏంటో చూసుకోని నిస్వార్ధం, మన ఎదుగుదలని వెనుక ఉండి చూస్తూ ఆనందపడే ప్రేమతత్వం ఆమెకు మాత్రమే సొంతం.
తన కూతురి ప్రసవవేదన చూసి కడుపులో ప్రేగు కదిలి ఒక కంట కన్నీరు, తనవారంటూ ఎవరూలేని ఏదో మిధ్యాలోకం నుండి ఏడుస్తూ ఇక్కడకి వచ్చి పడ్డ తన కూతురి బిడ్డకు అన్నీ తానై అక్కున చేర్చుకుని మరో కంట ఆనందాశృవులు. ఆ పసిబిడ్డని, ఆ పసిబిడ్డని కన్న తన బిడ్డని చంటిపాపల్లానే చూసుకుంటూ తన కనుపాపల్లో పెట్టి కాపాడుకుంటుంది. కూతురిని బిడ్డతో సహా అత్తవారింటికి పంపేదాకా చేసే గొడ్డుచాకిరి మనకి కనిపించినా, తనకి మాత్రం కేవలం కూతురి మీద ఆపేక్షగానే కనిపిస్తుంది. ఆణువంత పుట్టిన మనవడ్ని అల్లరిగడుగ్గాయిలా కేరింతలు కొట్టేదాకా సాకి ఆ పైన కూతురితో పాటు అప్పగింతలు చేయాల్సిందే. ఆడపిల్లని కన్న పాపానికి జీవితంలో అడుగడుగునా అప్పగింతలు తప్పవేమో?

రోజూ స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మమ్మ ఆపేక్ష, కళ్ళల్లో ఆనందం ఒక అందమైన దృశ్యం. పండంటి పసివాడ్ని మెరిసిపోయేలా చేయటమే కాదు నూనె పెట్టేప్పుడు కాళ్ళు చేతులు సాగతీస్తూ ఒక ఆజానుబాహుడ్ని చెయ్యాలని పరితపిస్తుంది. స్నానం చేయించి తుడుస్తున్నప్పుడు జలుబుకి తుమ్మితే చిరంజీవ చిరంజీవ అంటూ చిరాయువునిస్తుంది. తలకి పెట్టే సాంబ్రాణీ, నుదుటిమీద పెట్టే కాటుక బొట్టూ ఇలా అడుగడుగునా అమ్మమ్మ ప్రేమని పొందటం ఒక వరం. చీకటి పడుతూనే పాడు కళ్ళు దిష్టి పెట్టాయేమొ అని ఎన్ని రకాలుగా దిష్టి తీస్తుంది.

మనవలు ఎంతమంది ఉన్నా కొడుకు బిడ్డలకంటే కూతురి బిడ్డలంటేనే ఎందుకో ఆపేక్ష. పండగ అనగానే కూతురు,అల్లుడు తన మనవలతో వస్తారని ఎంత సంబరపడుతుందో. మనవలకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి వాళ్ళు వచ్చేలోగా ఎవరినీ తిననివ్వకుండా “హన్నా” అనటం చూడని తెలుగు లోగిలి ఉండదేమో కదా! చదువులో ఎదుగుతూ ఉంటే ఊరంతా చెప్పే గొప్పలు, ఉద్యోగం వచ్చింది అని తెలియగానే ఆంజనేయస్వామికి చేసే అప్పాలదండ ఇలా అమ్మమ్మకి మనవలపైన ఉన్న ప్రేమకి అంతేలేదు. ఇంత చేసినా అడబిడ్డ పిల్లలుగా మనం పెట్టేవి ఏ రోజూ తీసుకోదు. మరి మననుండి తను ఆశించేది ఏంటి? “అమ్మమ్మా” అనే ఒక పిలుపు, ఆప్యాయంగా మనం చిన్నప్పుడు ఇచ్చే బుల్లి బుల్లి ముద్దులు. అమ్మమ్మ ఇల్లంటే అందుకే మనవలందరికీ ఎంతో ఇష్టం. పండగ వచ్చిన, వేసవి సెలవులు వచ్చిన “నాన్న అమ్మమ్మ వాళ్ళింటికి ఎప్పుడు వెళ్తాం?” అనే అడుగుతాం.

లోకం తెలియని నీవు మాకు ఈ లోకం చుపావు.

నువ్వెంత అమాయకురాలివైన మాకు మాత్రం లౌక్యం నేర్పావు.

ముక్కోటి దేవతలకు మొక్కి మాకుచిరాయువునిచ్చావు.

అసలు నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మని నువ్వే ఇచ్చావు.

దేవతలకి దేవుడైనవాడు దేవదేవుడయితే అమ్మకే అమ్మవైన నువ్వు అమ్మమ్మవైనావు.

మా అభివృద్ది వెనుక కష్టం నువ్వు. ఆ దేవుడికి సహితంలేని అదృష్టం నువ్వు.

(గమనిక: గూగుల్లో దొరికిన చిత్రాన్ని ఇక్కడ వాడుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు అనే నమ్మకంతో.)