జాజు – ఒక కాకి కధ

భద్రాచలం కొండల మధ్యలో ఓ కాకులు దూరే కారడవి. జాజు అనే ఒక కాకి పిల్ల మరి కొన్ని కాకులతో కలిసి ఆ అడవిలో ఉంటుంది. కొన్నేళ్ళ క్రితం ఈ కాకులన్నీ గోదావరి నది ఒడ్డున మైదాన ప్రాంతంలో ఉండేవి. ఒకసారి వచ్చిన పెనుతుఫానులో అన్ని చెల్లాచెదురయ్యి ఇక్కడకి వచ్చి తలదాచుకొన్నాయి. సమూహంలో చాలా కాకులు తమ ఆప్తులని కోల్పోయాయి. జాజు కూడా తన వాళ్ళందరినీ కోల్పోయి ఇక్కడ తలదాచుకుంది. సమూహం లోని కాకులన్నీ రొజూ పగలంతా తిండి వేటలో కష్టపడి చీకటి పడే వేళకి సమావేశమై తాగి,తిని సందడి చేస్తాయి

జాజు ఎప్పుడూ సమూహానికి దూరంగా ఒంటరిగా గడిపేది. ఎప్పుడూ తనవాళ్ళగురించి ఆలోచిస్తూ ఉండేది. జాజు కి చిన్నప్పటి నుండీ పాటలు అంటే చాలా ఇష్టం. జాజు తల్లి మంచిగా పాటలు పాడేది. సమూహంలో అందరూ తనపాట విని మెచ్చుకొనేవారు. ఎప్పుడన్నా ఏదన్నా ఉత్సవం జరిగితే జాజు తల్లి పాట ఉండాల్సిందే. జాజు ఎప్పుడూ తన తల్లి జోలపాడీతే గాని పడుకునేది కాదు. తన తల్లిని ఎప్పుడూ అడిగేది “నేను కూడా పెద్దయ్యాక నీ అంత బాగా పాడగలనా?” అని.కాని జాజు గొంతు శ్రావ్యంగా ఉండదు, కాస్త బండగా ఉంటుంది. కాని జాజు బాధపడకూడదని “నాకంటే బాగా పాడగలవు” అని చెప్పేది జాజు తల్లి. జాజు బాల్యం గుర్తుచేసుకుని ఎప్పుడూ భాదపడుతూ ఉండేది. సమూహంలో అందరూ ఉన్నప్పుడు జాజు పాడితే ఎవరూ వినేవారు కాదు. మంచిపాటలు పాడే తల్లి కి నువ్వెలా పుట్టేవ్ అంతేలే పండితపుత్ర పరమ శుంఠః అని ఏడిపించేవారు. ఒక ఉత్సవంలో పాటల పోటీలో పాడబొతే అందరూ గోల చేసి ఆపేసారు. అప్పటి నుండీ జాజు ఉత్సవాలకి వెళ్ళటం మానేసింది. జాజు కి సమూహంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.వాళ్ళే చింకి,డుంబు. వాళ్ళు జాజు తో ” సంగీతమనేది పుట్టకతో రావాలి మనకి ఆ విద్య రాలేదు వదిలెయ్ ” అని చెబుతాయి. సమూహంలో తిరగటం, ఉత్సవాల్లో పాల్గొనటం ఇష్టం ఉన్నాసరే జాజు ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టంలేక చింకి, డుంబు కూడా వెళ్ళటం మానేసారు.

ఒక రోజు ఆ అడవికి ఒక కోకిల దారితప్పి వచ్చింది. దాని పేరు టింకు. టింకు ఒక చెట్టు మీద కూర్చుని మావిచిగురు తిని పాట పాడింది. దాని పాట విని అడవిలో కాకులన్నీ వచ్చి దాన్ని భందిచాయి.రాత్రి సమావేశం లో అన్నీ తప్ప తాగి ఉన్నాయి. సమూహం పెద్ద సాహి గంభీరంగా గద్దెమీద ఉన్నాడు. ఉత్సవాల్లో ఎప్పుడూ పాటలు పాడే కేతు ఆవేశంగా “టింకు జాతి వల్ల కాకి పాటలని అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆ జాతి మీద తరతరాలుగా మనం చేస్తున్న యుద్దం ఇంకా ఆగలేదు. కేవలం మన గుట్టు తెలుసుకోవటానికి వచ్చిన గూఢచారి టింకు. దాన్ని చంపెయ్యాలి ” అని అరిచిగోల చేసింది.సమూహంలో కాకులన్నీ “అవును అవును” అన్నాయి. చేసేదిలేక సాహి కూడా అంగీకరించాడు. కానీ జాజుకి టింకుని చంపాలన్న సమూహం నిర్ణయం నచ్చలేదు. కానీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సమూహం నుంచి వెలివేస్తారు లేదా కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు. అందుకే అందరిముందు ఏమి అనకుండా ఊరుకుంది. చింకి,డుంబులని పిలిచి ఎలాగైనా టింకు ని కాపాడాలని చెప్పింది. చింకి,డుంబు పెద్దలని కాదంటే ఏమవుతుందో అని మొదట భయపడ్డారు. కానీ ప్రాణస్నేహితుడి మాటను కాదనలేక ఒప్పుకున్నారు.

రాత్రి అందరూ తాగి మత్తుగా పడుకున్నారు. తెల్లవారితే టింకుని చంపేస్తారు. చీకటిలో ఎవరూ చూడకుండా జాజు మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న టింకు కట్లు విప్పి బయటకి తీసుకువచ్చింది. చింకి, డుంబు బయట కాపలాగా ఉన్నాయి. అందరూ రాత్రి ఎవరూ చూడకుండా తప్పించుకుని చాలా దూరం ఎగిరి వచ్చేసాయి. టింకు వాళ్ళకి తన ధన్యవాదాలు తెలిపింది. “ఇక సెలవు మిత్రమా, నీ వాళ్ళ దగ్గరకి నీవు హాయిగా వెళ్ళవచ్చు ” అని టింకుని వదిలి వెనక్కు రావాలని అనుకున్నారు స్నేహితులు. “నా వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు ఇక జన్మ లో నేను వాళ్ళని కలవలేనేమొ. ఇక్కడ దగ్గరలో ఏదో మామిడి తోపు చూపించండి అక్కడే ఉండిపోతా.” అంది టింకు. అప్పటికే తెల్లవారింది. తమ సమూహంలో అప్పటికే విషయం తెలిసిపోయుంటుంది ఇక వెనకకు వెళ్ళటం ఆపదకొనితెచ్చుకోవటమే అని మితృలు గ్రహించారు. ఇక అందరూ కలిసే ఉందామని నిర్ణయించుకున్నారు. మానవసంచారానికి దగ్గరలో ఉన్న ఒక చిట్టడవిలో నివాసం ఏర్పరుచుకొన్నారు.

అందరూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి తిండి సంపాదించుకొనేవారు. వచ్చే దారిలో ఒక విద్వాంసుడు తన శిష్యులకి సంగీతం నేర్పేవాడు. జాజు అక్కడే చెట్టుమీద కూర్చుని రోజూ ఆ పాటలు విని మనుషులు చాలా అదృష్టవంతులు అనుకునేది. అలాంటప్పుడు ఎప్పుడన్నా టింకు పాడితే గురువు ఆహా కోకిలది ఎంతకమ్మని గొంతు అనేవాడు. చాలా సార్లు అలావిన్న జాజు ఒక రాత్రి “మిత్రమా! నీకు ఇంత కమ్మని గొంతు ఎలా వచ్చింది” అని అడిగింది. “మావిచిగురు తినటంవలనే మా జాతికి ఇంత కమ్మని గొంతు వచ్చింది నేస్తం” అని టింకు చెప్పి పడుకుంది. ఆ రోజు రాత్రంతా జాజు కి నిద్రపట్టలేదు. తన తల్లి గుర్తు వచ్చింది.

మధ్య రాత్రి లో ఏదో శబ్దం వినిపించి టింకు లేచి చూసింది. జాజు మామిడి చెట్టు మీద కూర్చుని చిగురు తిని తిని పాడుతూ ఉంది. దానితో గొంతు కి మామిడి చిగురు అడ్డుపడి మూర్చపోయింది. చింకి, డుంబు వెంటనే లేచి వెళ్ళి పట్టుకున్నారు. టింకు ఒక చిన్న ఆకు తో నీరు తెచ్చింది. నీరు త్రాగిన జాజు కాసేపటికి మొత్తం మామిడి చిగురు కక్కేసింది. రాత్రంతా స్నేహితులంతా దానికి సేవలు చేస్తూ ఉన్నారు. తెల్లవారితే జాజుకి తెలివి వచ్చి అందరినీ చూసి తల దించుకొని ఏడుస్తుంది. “నాకు జన్మలో పాటలు రావు. నాకు చాలా సిగ్గుగా ఉంది” అని జాజు భాదపడింది. “నీకు కూడా మంచిగా పాటలు వస్తాయి బాదపడకు” అంటుంది టింకు.

“నా గొంతు బాగుండదు కదా మరి నేను ఎలా మంచిగా పాడగలను” అని అడిగింది జాజు. “పాడటానికి శ్రావ్యమైన గొంతు తప్పనిసరి కాదు గొంతులో మంచి శృతి,లయ ఉంటే చాలు” అంది టింకు. కానీ జాజు ఆ మాటలు నమ్మదు. ఒక రోజు వీళ్ళు ఉండె అడవికి కొంతమంది మనుషులు పిక్నిక్ వచ్చారు. వాళ్ళు పగలంతా నీట్లో ఆడుకొని రాత్రికి మంట పెట్టి దాని చుట్టూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ గొంతు ఊరిలోని విద్వాంసుడి గొంతులా గొప్పగా లేదు. బండ గా ఉంది. అయినా వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. టింకు వాళ్ళని చూపించి “చూసావా సంగీతానికి గొంతు కాదు శృతి లయ ముఖ్యం” అని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఒక వారం రోజులు పాటు దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి ప్రజలు వినేవి, పాడుకునేవి పాటలన్నీ విన్నారు. అందులో జాస్సిగిఫ్ట్ తో మొదలెట్టి హిమేష్ వరకు ఉన్నాయి. “అ అంటే అమలాపురం” నుండి “ఆకలేస్తే అన్నంపెడతా” వరకు ఉన్నాయి. అప్పుడు టింకు చెప్పింది నిజమే అని జాజు నమ్మింది. ఆ రోజు నుండి టింకునే జాజు కి సంగీత గురువు. జాజు కష్టపడి రాత్రి పగలు పాడుతూనే ఉంటుంది. చింకి, డుంబు జాజు తిండి అవసరాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సంగీతం మీద ఇష్టం పెరిగి జాజు పాడూతూ ఉంటే పక్కన ఎండిన ఆకులను తొక్కుతూ, ముక్కులతో కొమ్మలను కొడుతూ శబ్దం చేస్తూ ఉంటారు. ఒక రోజు చింకి కొన్ని చిన్న చిన్న గిన్నెలు చెంచాలు ఎత్తుకొచ్చి వాటిని కొట్టటం మొదలు పెట్టింది. డుంబు ఊరిలోకి పోయి ఒక బూరలమ్మే వాడి బుట్టలో ఉన్న ఏక్తారా ఎత్తుకొచ్చేసి ముక్కుతోను, గోళ్ళతోను వాయించటం మొదలు పెట్టింది. జాజు తెలివిగా తన బండ గొంతుని, టింకు మంచి గొంతుని సరైన పద్దతిలో కలిపి చక్కని బాణీలు కట్టి పాడింది. వాళ్ళు అలా పాడుతూ ఉంటే ఆ చిట్టడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి. ఇంకేముంది తాము “4 నోట్స్” అనే ఒక రాక్ బ్యాండ్ గా ప్రకటించుకున్నాయి.

తమ సమూహం లో తన పాటల ప్రతిభ చూపించాలని తన తల్లి పేరు నిలబెట్టాలని జాజు స్నేహితులతో తిరిగి పాత అడవికి బయలుదేరింది. వీరిని చూడగానే కేతు తన బృందంతో దాడి చేసి భందించింది. సాహి ముందు హాజరు పరిచింది. వాళ్ళు చేసిన దాడి లో జాజుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. సాహి మీరు సమూహం నిర్ణయాన్ని ఎదిరించారు మీకు మరణశిక్ష తప్పదు. కానీ పారిపోయిన మీరు ఎందుకు తిరిగి వచ్చారు చెప్పండి అని అడిగింది. జరిగిన విషయం మొత్తం జాజు చెప్పింది. అంతా విన్న సాహి ఆలోచనలో పడింది. కేతు గర్వంతో పాటలో నన్ను ఓడిస్తే నీకు శిక్ష లేకుండా వదిలేస్తాం అని అంది. అందరూ ఒప్పుకున్నారు. చావు ఎలాగు తప్పదు కాబట్టి చివరి అవకాశంగా జాజు కూడా ఒప్పుకుంది. కానీ పోటిలో ఓడితే తనని మాత్రమే చంపాలని మిగిలిన వాళ్ళని క్షమించాలని ఇదే తన చివరికోరికని చెప్పింది. కేతు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎక్కడివి? దొంగతనం గా ఎత్తుకు వచ్చినవిలా ఉన్నాయి వీటిని వాడటానికి వీళ్ళేదంది. కేతూ బృందం మాత్రం పాట మొదలు పెట్టి అద్బుతంగా పాడారు. కాకులన్నీ ఆనందంతో చిత్తుగా తాగి ఊగి రెచ్చిపోయి గెంతాయి. ఇప్పుడిక జాజు బృందం పాడాలి. వాద్యాలు లేవు. జాజు దిగులుగా వేదిక మధ్యలో నిలబడింది. డుంబు కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తనతోకలో ఒక ఈక పీకి బాణంలా వంచి దానికి చిన్న చిన్న తీగలు కట్టింది. “ట్రంగ్” మని గట్టిగా శబ్దం చేసింది. చింకి కొన్ని కొబ్బరి చిప్పలు తెచ్చి తిరగేసి వాటి మీద ముక్కు తో కాంగో కొట్టటం మొదలుపెట్టింది. టింకు “హే హే లలల లా హే హే లలల లా” అని చిన్న ఆలాపన చేసింది. అప్పుడు జాజు కి ఉత్సాహం వచ్చింది. మితృలందరూ చావుకి సిద్దపడే ఉన్నారు. జీవితంలో చివరిసారి పాడుతున్నాము అనే స్పృహలో ఉన్నారు. తమకిష్టమైన సంగీతం కోసం చావుకి సిద్దపడ్డారు. సంగీతంలో మునిగి చనిపోవాలన్న కాంక్షతో తన్మయత్వం లో ఉన్నారు. వారి ఆత్మలీనమైన ఆ పాట అద్బుతంగా ఉంది. జాజుకి తగిలిన దెబ్బలనుండి రక్తం కారుతూనే ఉంది. కేతు కూడా పాటలో లీనమైపోయాడు.

“నా తల్లి లాలిపాటలో,

నామితృలు పంచిన ప్రేమలో,

కమ్మదనమే నా పాట.

ఈ వరాలన్నీ నాతో ఉంటాయి ప్రతిపూట.

ఈ పూట తో నా ఊపిరి పోయినా,

ఓ పాటగా నే బ్రతికే ఉంటా.

ఆ కొండలో ఆ కోనలో, ఈ చెట్టులో ఈ పుట్టలో,

ప్రతి సవ్వడిలో ఓ పాటగా నే బ్రతికే ఉంటా.”

ఆత్మ ని మిలితంచేసి పాటలోనే కలిసిపోయి పాడూతూ జాజు వేదికపైన ఒక్కసారి కుప్పకూలి పడిపోయింది.   

మరి జాజు తిరిగిలేచిందా? సమూహం వారి గొప్పతనాన్ని ఒప్పుకుందా? వాళ్ళ పాటకి అడవితల్లి జేజేలు పలికిందా? లేక సమాజం ఎప్పటిలానే తన కాఠిన్యం చాటుకుందా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి నాది అనే ఒక ముగింపు ఇవ్వటం నాకిష్టంలేదు. “విఙ్ఞులయిన పాఠకులారా మీకు నచ్చిన ముగింపుతో మీరే కధని చదవటం పూర్తిచేయండి.”

నిప్పా? కంప్యూటరా?

నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక విచిత్రమైన చర్చ జరుగుతుంది. నేనుకూడా వాదిస్తున్నా. ఎవరితో వాదించానో గుర్తులేదు. చర్చావిషయం ఏంటంటే  “మొత్తం మానవ విఙ్ఞాన ప్రయాణంలో  నిప్పుని ఆవిష్కరించటం గొప్పదా? కంప్యూటర్ ఆవిష్కరించటం గొప్పదా? ”

నేనేం వాదించానో స్పష్టంగా గుర్తు లేదు. బ్లాగుమితృలని అడుగుదాం అనుకున్నా. మీరేమనుకుంటున్నారు?

హాసిని కి పెళ్ళి చూపులోచ్…

(గమనిక: హాసిని పాత్ర పూర్వాపరాలు తెలుసుకోవాలనుకుంటే హ హా హాసిని చదవండి. చదవకపోయినా ఈ టపాని చదవటానికి ఇబ్బందిలేదు. )

“ఏంటి మురళీ ఏం చేస్తున్నావ్ ? అలా బయటకి పోయివద్దాం రాకూడదూ” అంటూ వచ్చారు శ్రీ శని గారు. అసలే ఆయన నా చిరకాల మితృడు, తరతరాలుగా మా కుటుంబానికి ఆప్తుడు.
“అయ్యా! తమకేంటి ఇంత ప్రొద్దునే నా మీద ఇంత అభిమానం” అన్నాను.
“ఎన్ని సార్లు చెప్పానయ్యా నిద్రలేస్తూనే అద్దంలో ముఖం చూసుకోవద్దని. వింటావా? వినవు. నేను రాక తప్పింది కాదు” అన్నారు శనిగారు.
“ఏంటో ఎన్నిసార్లు మానుకుందామన్నా ఈ వెధవ అలవాటు మారటం లేదు. ప్రొద్దునే లేస్తూనే ముఖం ఎలావుంది, జుత్తి రేగిందా అని చూసుకోవటం అలవాటయ్యింది” అంటూ మనసులో కాదు బయటకే తిట్టుకున్నా. మనసులో అనుకున్నా ఆయనకి ఎలాగు తెలిసిపోతుందిగా.
“ఎంతవరకూ?” అన్నాను.
“భూమి మీద ఇంకా నీ నూకలు చెల్లిపోలేదులే. అదుగో నీకోసం అన్నపూర్ణా వాడు ఆట్టా, మైసూర్ సేండిల్ వాడు సబ్బులు, రోగాలకి రాన్ బ్యాక్సీ వాడు మందులు …. అన్ని ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి లే. బయపడకు పదా” అన్నారు శనిగారు శూన్యంలోకి చూస్తూ.
”ఆమాత్రం హామీ ఇచ్చారు చాలు. పదండి. గురువుగారు నాకో మంచి స్నేహితురాలుంది తనని మీకు పరిచయం చేస్తా నన్నొదిలి తనతో దోస్తీ చెయ్యకూడదూ ?” అడిగాను ఆశగా.
“మొదట పరిచయం చెయ్యు తర్వాత ఆలోచిస్తాను.” ఆయన నవ్వులో ఏదో చిద్విలాసం. ”హమ్మయ్యా ఇది బాగుంది పదండి” మానవడు ఆశాజీవి.

అలా ఆయన్ని ఒక కాఫీషాపు కి తీసుకొని వెళ్ళా. ఎదురుగా ద గ్రేట్ హాసిని. ఇక ఈ రోజుతో దీని పని కట్టు. శనిగారు దీని తో స్నేహం చేస్తే దీని నోరు పడిపోతుంది. మాట్లాడకుండా ఇది ఎలాగూ బ్రతకలేదు కాబట్టి నరసింహా లో రమ్యకృష్ణలా ఒక చీకటి గదిలోకి పోతుంది.నన్ను ట్రైనులో పెట్టిన హింసకి ఇదే సరైన ప్రతీకారం. ఒక వేళ కర్మకాలి శనిగారి ప్రభావం చూపించలేకపోతే  ఈ వాగుడుకాయ ఎలాగూ ఈయన టెంకి పీకి  లోపలున్న గుజ్జంతా నంజుకుతినేస్తది. ఆయన జన్మలో ఎవరి జోలికి రాడు, రాలేడు. కాబట్టీ ఏవిధంగా చూసిన నాకే లాభం అనుకుని సంబరపడుతున్నా.
“హాయ్ శనిగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య అసలు కనిపించటం మానేసారు?” అని 32 పళ్ళలో 30 కనబడేలా నవ్వుతూ అడిగింది హాసిని. నాకు కళ్ళు బైర్లుకమ్మి ఆ మెరుపులో మా జేజమ్మవాళ్ళ అమ్మమ్మ కనిపించింది. పాపం బాగా చిక్కిపోయింది 😦

“ఏం లేదు రా కన్నా ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ మెదడుకి మేత పనులేగా. శుభకార్యాలేవీ చేయటం లేదు నాకు మరి పనిపడటం లేదు” ఈయనగారు చెబుతున్నారు ఎక్కడలేని ప్రేమా ఒలకపోస్తూ. (గమనిక: మెదడుకి మేత అనగా మేకలాగ మెదడు మేసేయ్యటం.)
నేను ఏడుపులాంటి నవ్వు తో అక్కడ నిలబడ్డాను. నా ఏడుపు మునుపు డోలు శబ్ధంలా ఉండేది, ఇప్పుడు మద్దెల లా ఉంది ఎందుకో మరి.

ఇంతలో హాసిని ఎవరికో మెదడువాపు తెప్పించాటనికి (తగ్గించటానికి కాదు కేవలం తెప్పించటానికి) పక్కకి వెళ్ళింది. మంచి తరుణం మించిన దొరకదు అని పిచ్చికుక్క తరిమినట్టు పరిగెడుతూ వచ్చి ఇంటి దగ్గర పడ్డాను. నా వెనుకే శనిగారు దారిలో ఉన్న పనులు పూర్తి చేసుకోని వచ్చారు. “ఈవిడ మీకెలా తెలుసు స్వామీ?” అన్నాను.
“అసలు ఆవిడ నీకు పరిచయం  కావటమే నా ప్రభావం వలన. నీకో విషయం చెప్పనా” అని ఒక చిన్న పిట్టకధ చెప్పారు. అదే హాసిని పెళ్ళి చూపుల కధ.

హాసిని ఎప్పటిలాగే ఆఫీస్ కి టైముకి వచ్చేసి సిన్సియర్ గా చాటింగు చేసుకుంటూ ఉంది. ఇంతలో తనని పెళ్ళి చూపులు చూసిన 18 వ పెళ్ళికొడుకు ఉదయ్ కిరణ్ పింగ్ చేసాడు. వాడి బాసుగారి కూతురి స్నేహితురాలయిన రమ్య లేచిపోయి పెళ్ళిచేసుకున్న విషయం చర్చించాక, ఆఫీస్ ప్యూన్ సుబ్బారావు పట్టబుర్ర మీద ఈకలు మొలవక పోవటనికి కారణాం గురించి గొడవ పడుతున్నారు. ఇంతలో 19 వ పెళ్ళికొడుకు రాంచరణ్ “నాకిష్టమయిన పాట మౌనమే నా భాష ఓ మూగ మనసా ” అని మెసేజ్ పెట్టాడు. అప్పుడే రాబోయే పెళ్ళికొడుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు. రింగ్ టోన్ లోనే “మే..మే..” అని మేక అరుపు వినిపించింది. బకరా వాసన కొత్త బకరా వాసన అని హాసిని లోని వాగుడు దెయ్యం ఫోన్ ఎత్తింది.  “ఈ పాటికి మీ ఇంట్లో వాళ్ళు నా గురించి చెప్పే ఉంటారు. రేపు శనివారం సెలవు కదా కలుద్దామా?” అని అడిగాడు.  ఆ విషయం మీద ఒకగంట మాట్లాడిన తరువాత “సరే రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

శనివారం ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు నేను బయలుదేరాను మీరు రెడీ అవ్వండి అని. ఇక తప్పదని హాసిని 9 గంటలకే లేచి తయారవ్వటం మొదలు పెట్టింది. పవన్ మేఘాల్లో తేలిపోతూ,పాట పాడుకుంటూ వస్తున్నాడు. “హహ హా హహ హా హాసిని నీ నవ్వుల్లో ఎవరునట్టూ…. మేరి సఝనా.. మేరి సఝనా..  ధడేల్ ధడేల్ డమాల్”  శనిగారు ఎంట్రీ వలన వచ్చిన శబ్ధం. పవన్ ఆగి ఉన్న ఆటో ని అరవై కిలోమీటర్ల వేగం తో గుద్ది ఎగిరి, అంబులెన్స్ టాపు మీద పడ్డారు. ఆయన బైకు జారుతూ పోయి 108 క్రిందకి దూరింది. హాసిని కాసేపు ఆయన కోసం చూసింది రాలేదు. ఫోన్ చేసింది ఎత్తలేదు. సర్లే అని అన్నపూర్ణా మెస్ కి వెళ్ళి ఆంధ్రా తాలి తెప్పించుకొని దానిలోకి సర్వర్ ని నంజుకొని తినేసింది.

ఇది జరిగిన నెల రోజులకి పవన్ కోలుకుని పట్టు వదలని పప్పూ మరలా పరీక్షలు రాసినట్టుగా పెళ్ళిచూపులకి మరోసారి సిద్దపడ్డాడు. శనివారం కలిసి రాలేదని ఆదివారం ఫోన్ చేసి బయలుదేరాడు. కూకట్ పల్లి నుండి ఎర్రగడ్డ వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. పిడుగులతో కూడిన వర్షం. వరదగా వచ్చిన నీటిలో పవన్ బైకు కొట్టుకుపోయి ఒక మేన్ హోల్ లొ ఇరుక్కుంది. ఈతరాని పవన్ ని భద్రతాదళాలు కాపాడాయన్న వార్తని బావర్చి లో ఇస్మాయిల్ తో  మాటాడుతూ బిరియాని తింటూ ఉన్న హాసిని కి టి.వి. చూస్తే గాని తెలియలేదు.(అమ్మతోడు సదరు ఇస్మాయిల్ ఎవరో నాకే కాదు హాసినికి కూడా అప్పటి వరకు తెలియదు)

అయినా పవన్ మరలా ఆదివారం రాగానే నేను రెడీ అని పోన్ చేసాడు. ఈ సారి హాసిని హృదయం చలించింది. పెళ్ళిభోజనాల్లో లో ఎంగిలి ఆకు కోసం ఎదురు చూస్తున్న మున్సిపాలిటి కుక్కలా తనకోసం ఎదురు చూస్తున్న పవన్ మీద మంచి అభిప్రాయం కలిగింది.వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి, జేబులో నిమ్మకాయలు పెట్టుకుని బయలుదేరిన పవన్ ఏ ఆటంకాలు లేకుండా వచ్చేసాడు. మేడమీదనుంచి దిగి పవన్ ని చూసిన హాసిని కెవ్వుమన్న కేకతో పడిపోయింది. తుమ్మ మొద్దుకి, తారుడబ్బా కి పుట్టిన సింగరేణి బొగ్గులా ఉన్నాడు. ఐరన్ లెగ్ శాస్త్రిని తలపై సుత్తి దెబ్బలేసి ఎత్తు తగ్గిస్తే  ఎలా ఉంటాడో అదే ఆకారం లో (నిరాకారమేమో?) గుండ్రంగా ఉన్నాడు. కరెంట్ పోతే ఎక్కడున్నాడో పోల్చుకోవటానికి కళ్ళే ఆధారం, ఎందుకంటే పళ్ళు కూడా తెల్లగా లేవు.

పవన్ హాసిని ని ఐ-మాక్స్ కి తీసుకెళ్ళాడు. పవన్ ఉత్సాహం కోసం కాఫీ తాగితే, హాసిని షాక్ నుంచి తేరుకోవటానికి ఐస్ క్రీం తీసుకుంది. అయినా తనకోసం కష్టపడ్డ పవన్ మీద ఏదోమూల మంచి అభిప్రాయం. మొదటిసారిగా హాసిని నోటికి తాళం వేసిన మొనగాడు పవన్ (మాటలు ఆపినవాడే మొనగాడు). ఇద్దరుకాసేపు మాట్లాడాక ఇక వెళ్దాం అనిలేచింది. సరే హాసిని హాస్టల్ దగ్గరలో ఉందనగా ఒక స్నేహితురాలు స్వప్న కనిపించింది. హాసిని గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇతను ఎవరంటే ఏం చెప్పాలి? ఏమని చెప్పగలదు, ఎలా చెప్పగలదు. హమ్మో తన పరువు ప్రతిష్టలు. స్వప్న బాగా దగ్గిరకి వచ్చేసింది. చేయి చాపింది. హాసిని కూడ చేయి చాపింది. కానీ స్వప్న చేయిని పవన్ ముందు అందుకున్నాడు. అయిపోయాను మొత్తం చెప్పేస్తాడు అనుకుంది హాసిని.
“మీరేంటి ఇక్కడ” అని అడిగింది స్వప్న.

“హాసిని ని కలవటానికి వచ్చా అని ” చెప్పాడు పవన్.

హాసిని ని ప్రక్కకి తోసేసి ఇద్దరూ ఆపకుండా పలకరింపులు, కష్టసుఖాలు కొనసాగించేస్తున్నారు. జీవితం లో వాగుడు తో తనకే చెక్ పెట్టిన జంటని మొదటసారి చూస్తుంది హాసిని.
హాసిని షాకు తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం  నడిరోడ్డుమీద కళ్ళు తిరిగి పడబోయింది. ఆకలి వల్లనేమో అని స్వప్న,పవన్ హాసిని ని అన్నపూర్ణా రెస్టారెంటులోకి తీసుకెళ్లారు.
చికెన్ బిరియాని తెప్పించుకొని దుమ్ములురిచుకుంటూ,జోకులేసుకుంటూ హాసిని తింటుందో లేదో కూడా పట్టించుకోకుండా మాట్లాడేసుకుంటున్నారు స్వప్న,పవన్.వారి తిండి చూసిన హాసిని పక్షి జాతి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో అనుకుంది. వాళ్ళు మాత్రం పరుశరాముడు క్షత్రియ జాతిని నిర్మూలించినట్టు, ఆంధ్రప్రదేశ్ లో కోడీజాతిని నిర్మూలించటమే లక్ష్యంగా తింటూనే ఉన్నారు. అప్పటికే అటూ ఇటూ తిరిగిన సర్వరుకి ఆయాసం వచ్చింది. వండుతున్న వంటవాడికి గుండె నొఫ్ఫి వచ్చింది. ఇక ఆగలేక “మా దగ్గర కోళ్ళు లేవు. మేకలు,గొఱ్ఱెలు మీ దాటికి తట్టుకోలేక పారిపోయాయి. ఇక నేనే మిగిలాను నన్ను తినండి” అని టేబులెక్కి ప్లేటులో కూర్చున్నాడు సర్వరు. వాళ్ళకి ఎంత జాలేసిందంటే అంతజాలేసింది. “పచ్చిమాసం ఎలా తింటాం” అంటూ లేచారు.
ఒకగంట తరువాత పవన్ ఇద్దరికి చెప్పి బయల్దేరాడు. హాసిని స్వప్న ని బర బరా ఈడ్చుకొని లాక్కేల్లి అసలు వాడు నీకెలా తెలుసే అని ఆడిగింది. “ఏముందే మొన్న కుటుంబమంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. పైగా పెళ్ళిచూపుల్లో మూడు రోజులు మా మూడు గేదెలు కష్టపడి ఇచ్చిన జున్నుపాలని జున్ను చేస్తే ముప్పై నిమిషాల్లో ముక్క మిగల్చకుండా మింగేసి నాకు జున్నంటే చాలా ఇష్టం. మీరే చేసారా. బాగుంది. అని ఒక పొగడ్త నా మొహాన పారేసి ఏ విషయం ఇంటికి వెళ్ళాక తెలియజేస్తాం అన్నారు. ఆ రోజు వాడి తిండికి జడుసు కున్న మా అక్క కొడుక్కి జ్వరం పట్టుకొని 10 నిమిషాల్లో 13 విరేచనాలయ్యాయి. ఇంకా గ్లూకోజు బాటిల్లు ఎక్కిస్తూనే ఉన్నారు. ఈ రోజు బిల్లు ఎలాగూ వాడిదే కదా అని ఒకపట్టు పట్టా  ” అని చెప్పింది స్వప్న.హమ్మయ్య పొరపాటున తను బిల్లు కట్టడానికి కమిటవ్వలేదు అనుకుంది హాసిని.

పదిరోజుల తరువాత పవన్ కి స్వప్న కి పెళ్ళయిపోయింది. హాసిని తనని చూడటానికి వస్తా అన్న  21 వ పెళ్ళికొడుకు  మహేష్ బాబు ని రావొద్దని చెప్పింది

వినాయక చవితి శుభాకాంక్షలు (మూషికవ్రతం మరిచిపోకండి) :)

బ్లాగు మితృలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ పరమాత్ముడు మీ సర్వకార్యములలో విఘ్నాలను తొలగించి అన్ని రకముల శుభములను, విజయాలను అందిచాలని కోరుకుంటూ
మీ
మురళీ.

నేటికి నెరవేరిన మూషికవరం వృత్తాంతం చదివి,విని,అందరికి చెప్పి సుఖశాంతులు పొందుదురు గాక.

)