త్రేతాయుగంలోనిదో,ద్వాపరంలోనిదో ఈ కధ. రాముడో,కృష్ణుడో గోళీలు ఆడుకుంటూ ఉండిఉండొచ్చు. ఆ కాలంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఇంటి నిండా డబ్బు, ఇంటిలో ఉన్నవారి వంటి నిండా బంగారం. గారంగా పెరుగుతున్న ఒక్కగానొక్క కూతురు. చంద్రుడే వచ్చి ఆమె చెక్కిళ్ళలో తన నీడని చూసి మురిసిపోయేంత అందం.
ఆమె అందం ఆనోట ఈనోట పాకి దేశదేశాల రాజులే ఆమెను పెళ్ళి చేసుకోవటానికి పోటీపడేవారు. అదే ఊరిలో ఉంటున్న ఒక పేదరైతు కొడుకు కూడా ఆమె అందం గురించి విని తనని ప్రేమించాడు. కేవలం తాను విన్న గుర్తులను బట్టి ఒక చిత్రం గీసి రోజూ దానిని చూస్తూ గడిపేవాడు. ఆమె తండ్రి ఈ పెళ్ళికొడుకుల తాకిడి తట్టుకోలేక స్వయంవరం ప్రకటించాడు. తన కూతురికి అత్యంత విలువైన బహుమానం తెచ్చినవాడికి తన కూతురినిచ్చి వివాహం చేస్తా అని ప్రకటించాడు. రాజులంతా మేనాలతో, ఏనుగులతో, ఒంటెలతో బహుమానాలు మోసుకొచ్చారు. పేదరైతు కొడుకు ఏంచెయ్యాలో పాలుపోక గుడికి వెళ్ళి లక్ష్మిదేవిని పూజించి వేడుకున్నాడు. దేవి వచ్చి అంతవిలువకానిది ఒక పొడవైన వస్త్రం ఇచ్చింది. ఆమెని తన నగలన్నీ తీసి ఈ వస్త్రం వేసుకోమని చెప్పు అని దేవి మాయమైంది.
రైతుకొడుకు స్వయంవరం కి వెళ్ళాడు. రాజుల బహుమానాలన్నీ ఆమె తృణీకరించింది. చివరగా రైతు కొడుకు ఇబ్బంది పడుతూ దేవి ఇచ్చిన వస్త్రాన్ని, దానిని ఎలా ధరించాలో ఒక చిత్రాన్ని ఆమెకిచ్చాడు. వింతగా ఉందే అనుకుని ఆమె తన నగలన్నీ తీసి ఆ వస్త్రాన్ని రైతుకొడుకు చెప్పిన విదంగా ధరించి అద్దం ముందు నిలబడింది. ఆశ్చర్యం!! నగల వెలుగుల్లో ఇన్నాళ్ళూ గుర్తింపు నోచుకోని ఆమె ముఖ సౌందర్యం, మేని ఛాయ స్పష్టంగా కనిపించాయి. ఆమె తన సౌందర్యానికి తానే ముగ్దురాలయ్యింది. ఆమె తండ్రి కూడా తన కూతురి సహజ సౌందర్యాన్ని తెలియచెప్పిన రైతుకొడుకుకి ఆమె నిచ్చి వివాహం చేసాడు. వారు పది కాలలపాటు హాయిగా జీవించారు.ఆ రోజు దేవి ఇచ్చిన ఆ ఆరుగజాల వస్త్రమే స్త్రీలంతా ఇష్టపడే చీరయ్యింది.
జెస్సీ చీరకట్టు చూసి ఊగిపోతున్న యువతను చూసి చీరలో ఏముందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే కలిగిన ఊహలతో అల్లుకున్న టపా ఇది.
ఆమ్మ చీరలో ఊయలూగిన పసితనం
అమ్మ చెంగుతో నడక నేర్చుకున్న బాల్యం
అమ్మ చీర చించి కట్టు కట్టిన గాయం
మధ్య తరగతి మగువలే కాదు, మధ్యతరగతి జీవితాలన్నీ తమని తాము చీరలో చుట్టేసుకున్నాయి. గొప్పవారింట పోతపోసిన బంగారాలు, మణులు, మాణిక్యాలు, సుగంధాలు ఇన్ని కావాలి అందాన్నివ్వటానికి. ఇన్ని కలిపి వంటింటిలో పనుల మధ్య అల్లిబిల్లిగా అల్లుకున్న ముతకచీర అందాన్ని తేగలవా? మధ్యతరగతి సామ్రాజ్యాల్లో మహరాణులకు మకుటాల్లేవు కానీ మెరిసిపోయే చీరలున్నాయి. మరి మగమహారాజులకయితే అలిగిన దేవేరికి ఇవ్వటానికి అగ్రహారాల్లేవు కానీ బోనస్ జీతంతో ఓ కొత్త చీర దొరుకుతుందిగా. చీర అనగానే ఆడవాళ్ళ కళ్ళలో మెరుపులు, ఊహల్లో అంగడిలో రాశులుగా పోసిన చీరలు, మగాళ్ళకు మాత్రం బడ్జెట్టు, కరువు భత్యం. ఎంత ఖర్చయినా మన కుచేలమహరాజులంగారు మాట్లాడలేరు “నేను కొత్త చీర కట్టుకుని అందంగా ఉండేది మీ కోసం కాదూ!” అనే ముద్దుమాటలకి “కాదూ” అని చెప్పగలిగే ధీశాలి భూమ్మీద ఇంతవరకు పుట్టలేదు.
చీర ముత్తాతలనాటి ముక్కిపోయిన సంప్రదాయం కాదు అది మన సంపద. కొన్ని సంపదల విలువ కాలం గడిచిన కొద్దీ పెరుగుతునే ఉంటుంది. మన జీవితాల్లో భందాలు అనుభందాలు చీరతో పెనవేసుకుపోయాయి. మగ్గాలలో పుట్టి మన ముంగిళ్ళలో మెట్టిన చీరని కేవలం ఒక చిన్న వస్తువుగా మాత్రం తీసిపారేయలేం. పట్టు చీర, సిల్కు చీర, కాటన్ చీర అని ఎంతమంది చెప్పుకుంటారో నాకు తెలియదుగానీ అన్నయ్య పెట్టిన చీర, మరదలి పెళ్ళికి పెట్టిన చీర, పెళ్ళిరోజుకి శ్రీవారు కొన్నచీర అని గుర్తుపెట్టుకునేవాళ్ళే అందరూ. అందుకే చీర ఒక వస్తువు కాదు మధుర ఙ్ఞాపకం. అమ్మ పెళ్ళికి కట్టుకున్న చీర నాకు కావాలి, గుడిలో అమ్మవారి చీర కావాల్ని పోటిపడే అడపిల్లలు ఎందరో. అందుకే చీర ఒక వస్తువు కాదు ఒక ఆశీర్వాదం.
మన ఇంటి మహాలక్ష్మికి పెళ్ళిలో ఎన్ని నగలుకొన్నా మనం పెట్టిన పట్టుచీరే అన్నింటికంటే గొప్పది.అత్తవారింట అడుగుపెట్టే కొత్త పెళ్ళికూతురికిచ్చే ముచ్చటైన కానుక చీరే. అత్తమనసు, కోడలి కొత్త కాపురం ఆ చీరతోనే తెలిసిపోతుంది. అన్నయ్యలు అభిమానంగా నిజానికి ఆలికి కూడా తెలియకుండా చెల్లెలికి మురిపెంగా ఇచ్చే బహుమతి చీర. చీర ధర ఇంట్లో తగ్గించి చెప్పే అన్నయ్యలు తెలుసు మరి నాకు. మన ఇంటి శుభాలకి ముత్తైదువులకిచ్చే కానుక చీర. చీర ఒక చిన్న వస్తువు కాదు మన ఇంటి సంప్రదాయం, గౌరవం.
అమ్మ కొంగుపట్టుకు తిరిగే పసితనం పోయి అమ్మాయి కొంగు పట్టుకోవాలని ఆరాటపడే కొంటెతనం లో అబ్బాయిలకి చీర ఊహల్లో రెపరెపలాడే ఒక ఇంధ్రధనస్సు. చుడీదార్లు, పట్టు పరికిణీలే కాకుండా అడపదడపా చీరకట్టులో మెరిసిపోయే కన్నెపిల్లలకి చీర ఒక మంత్రదండం. ఎంత మాయగాడైనా ఆ మాయలో పడకుండా ఉండలేడు. తన ప్రేయసి మొదటిసారిగా చీర కట్టుకుని ఏ గుడికో వెళ్ళింది అని తెలిసిన వెంటనే ఆత్రంగా,ఆశగా పరిగెట్టుకుని వెళ్ళి పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ చూసే నూనూగు మీసాల కుర్రాడ్నే అడగాలి చీరలోని అందం. “సరికొత్త చీర ఊహించినాను.. సరదాల సరిగంచు నేయించినాను” అయినా చూస్తే చీరంతే ఉంటుందిగానీ చెప్పుకుంటూ పోతే ఊరంతవుతుంది.
కావ్యాలు వ్రాయటానికి కవితలల్లటానికి కవులే కానక్కర్లేదు, మనసైన మగువ చీరచెంగు చెప్పే మౌనసందేశాలు తెలుసుకునే తెలివి ఉంటే చాలు. నడుమొంపున చేరిన చెంగు, చెదిరిన చీర పనిలో తల మునకలయినా అందాన్ని చెబితే, పెద్ద పట్టు అంచుతో నిలువెల్లా మెరిసిపోతున్న పట్టు చీర దర్పాన్ని చెబుతుంది. అలసి ఇంటికొచ్చిన శ్రీవారి ముఖాన్ని తుడిచే వేల ప్రేమని చెప్పే అదే చీర చెంగు, అల్లరివేళ గాలిలో గిరికీలు కొడుతూ ఊరిస్తుంది. సిగ్గుపడుతుండగా చూపుడువేలుకి చుట్టుకుపోతూ ప్రేయసి అందాన్ని చూపించే అదే చీరచెంగు, నడుమొంపునుండి తీసి విసిరి కొట్టి విసవిసా నడిచి వెళ్ళిపోతుంటే సునామీ హెచ్చరికే.ఈ చివరిది ఇంట్లో రామయ్యలకి నిత్య పేరంటం, పెళ్ళి కలలు కంటున్న బ్రహ్మచారులకు ముందున్న ముచ్చట్ల (ముసళ్ళ?) పండగ. అసలు మనసైన ప్రేయసి చీర కట్టులో వైభవం చెప్పాలంటే, నడకలో వయ్యారానికి అటూ ఇటూ ఊగే చీర కొంగులో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇది చాలదన్నట్టు గాజుల గలగలలు, జడగంటలు, మువ్వలు పక్కవాయిద్యాలుగా చేరి అబ్బాయిల మనసులు దోచి కళ్ళని తరింపజేస్తాయి.
చీరలోన దిగివచ్చిన కాంతలకోసం కావ్యాలు వ్రాయలేమేమో గానీ,
కళ్ళలో మీరు రచించిన దృశ్యకావ్యాలు పదిలంగా దాచుకుంటాం.
ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే మా మమ్మీ నాకు అర్జెంటుగా పెళ్ళి చేసేస్తుందనే భయంతో ఇక్కడికి ముగిస్తున్నా….