ముంగిలి » కథలు » జాజు – ఒక కాకి కధ

జాజు – ఒక కాకి కధ

భద్రాచలం కొండల మధ్యలో ఓ కాకులు దూరే కారడవి. జాజు అనే ఒక కాకి పిల్ల మరి కొన్ని కాకులతో కలిసి ఆ అడవిలో ఉంటుంది. కొన్నేళ్ళ క్రితం ఈ కాకులన్నీ గోదావరి నది ఒడ్డున మైదాన ప్రాంతంలో ఉండేవి. ఒకసారి వచ్చిన పెనుతుఫానులో అన్ని చెల్లాచెదురయ్యి ఇక్కడకి వచ్చి తలదాచుకొన్నాయి. సమూహంలో చాలా కాకులు తమ ఆప్తులని కోల్పోయాయి. జాజు కూడా తన వాళ్ళందరినీ కోల్పోయి ఇక్కడ తలదాచుకుంది. సమూహం లోని కాకులన్నీ రొజూ పగలంతా తిండి వేటలో కష్టపడి చీకటి పడే వేళకి సమావేశమై తాగి,తిని సందడి చేస్తాయి

జాజు ఎప్పుడూ సమూహానికి దూరంగా ఒంటరిగా గడిపేది. ఎప్పుడూ తనవాళ్ళగురించి ఆలోచిస్తూ ఉండేది. జాజు కి చిన్నప్పటి నుండీ పాటలు అంటే చాలా ఇష్టం. జాజు తల్లి మంచిగా పాటలు పాడేది. సమూహంలో అందరూ తనపాట విని మెచ్చుకొనేవారు. ఎప్పుడన్నా ఏదన్నా ఉత్సవం జరిగితే జాజు తల్లి పాట ఉండాల్సిందే. జాజు ఎప్పుడూ తన తల్లి జోలపాడీతే గాని పడుకునేది కాదు. తన తల్లిని ఎప్పుడూ అడిగేది “నేను కూడా పెద్దయ్యాక నీ అంత బాగా పాడగలనా?” అని.కాని జాజు గొంతు శ్రావ్యంగా ఉండదు, కాస్త బండగా ఉంటుంది. కాని జాజు బాధపడకూడదని “నాకంటే బాగా పాడగలవు” అని చెప్పేది జాజు తల్లి. జాజు బాల్యం గుర్తుచేసుకుని ఎప్పుడూ భాదపడుతూ ఉండేది. సమూహంలో అందరూ ఉన్నప్పుడు జాజు పాడితే ఎవరూ వినేవారు కాదు. మంచిపాటలు పాడే తల్లి కి నువ్వెలా పుట్టేవ్ అంతేలే పండితపుత్ర పరమ శుంఠః అని ఏడిపించేవారు. ఒక ఉత్సవంలో పాటల పోటీలో పాడబొతే అందరూ గోల చేసి ఆపేసారు. అప్పటి నుండీ జాజు ఉత్సవాలకి వెళ్ళటం మానేసింది. జాజు కి సమూహంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.వాళ్ళే చింకి,డుంబు. వాళ్ళు జాజు తో ” సంగీతమనేది పుట్టకతో రావాలి మనకి ఆ విద్య రాలేదు వదిలెయ్ ” అని చెబుతాయి. సమూహంలో తిరగటం, ఉత్సవాల్లో పాల్గొనటం ఇష్టం ఉన్నాసరే జాజు ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టంలేక చింకి, డుంబు కూడా వెళ్ళటం మానేసారు.

ఒక రోజు ఆ అడవికి ఒక కోకిల దారితప్పి వచ్చింది. దాని పేరు టింకు. టింకు ఒక చెట్టు మీద కూర్చుని మావిచిగురు తిని పాట పాడింది. దాని పాట విని అడవిలో కాకులన్నీ వచ్చి దాన్ని భందిచాయి.రాత్రి సమావేశం లో అన్నీ తప్ప తాగి ఉన్నాయి. సమూహం పెద్ద సాహి గంభీరంగా గద్దెమీద ఉన్నాడు. ఉత్సవాల్లో ఎప్పుడూ పాటలు పాడే కేతు ఆవేశంగా “టింకు జాతి వల్ల కాకి పాటలని అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆ జాతి మీద తరతరాలుగా మనం చేస్తున్న యుద్దం ఇంకా ఆగలేదు. కేవలం మన గుట్టు తెలుసుకోవటానికి వచ్చిన గూఢచారి టింకు. దాన్ని చంపెయ్యాలి ” అని అరిచిగోల చేసింది.సమూహంలో కాకులన్నీ “అవును అవును” అన్నాయి. చేసేదిలేక సాహి కూడా అంగీకరించాడు. కానీ జాజుకి టింకుని చంపాలన్న సమూహం నిర్ణయం నచ్చలేదు. కానీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సమూహం నుంచి వెలివేస్తారు లేదా కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు. అందుకే అందరిముందు ఏమి అనకుండా ఊరుకుంది. చింకి,డుంబులని పిలిచి ఎలాగైనా టింకు ని కాపాడాలని చెప్పింది. చింకి,డుంబు పెద్దలని కాదంటే ఏమవుతుందో అని మొదట భయపడ్డారు. కానీ ప్రాణస్నేహితుడి మాటను కాదనలేక ఒప్పుకున్నారు.

రాత్రి అందరూ తాగి మత్తుగా పడుకున్నారు. తెల్లవారితే టింకుని చంపేస్తారు. చీకటిలో ఎవరూ చూడకుండా జాజు మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న టింకు కట్లు విప్పి బయటకి తీసుకువచ్చింది. చింకి, డుంబు బయట కాపలాగా ఉన్నాయి. అందరూ రాత్రి ఎవరూ చూడకుండా తప్పించుకుని చాలా దూరం ఎగిరి వచ్చేసాయి. టింకు వాళ్ళకి తన ధన్యవాదాలు తెలిపింది. “ఇక సెలవు మిత్రమా, నీ వాళ్ళ దగ్గరకి నీవు హాయిగా వెళ్ళవచ్చు ” అని టింకుని వదిలి వెనక్కు రావాలని అనుకున్నారు స్నేహితులు. “నా వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు ఇక జన్మ లో నేను వాళ్ళని కలవలేనేమొ. ఇక్కడ దగ్గరలో ఏదో మామిడి తోపు చూపించండి అక్కడే ఉండిపోతా.” అంది టింకు. అప్పటికే తెల్లవారింది. తమ సమూహంలో అప్పటికే విషయం తెలిసిపోయుంటుంది ఇక వెనకకు వెళ్ళటం ఆపదకొనితెచ్చుకోవటమే అని మితృలు గ్రహించారు. ఇక అందరూ కలిసే ఉందామని నిర్ణయించుకున్నారు. మానవసంచారానికి దగ్గరలో ఉన్న ఒక చిట్టడవిలో నివాసం ఏర్పరుచుకొన్నారు.

అందరూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి తిండి సంపాదించుకొనేవారు. వచ్చే దారిలో ఒక విద్వాంసుడు తన శిష్యులకి సంగీతం నేర్పేవాడు. జాజు అక్కడే చెట్టుమీద కూర్చుని రోజూ ఆ పాటలు విని మనుషులు చాలా అదృష్టవంతులు అనుకునేది. అలాంటప్పుడు ఎప్పుడన్నా టింకు పాడితే గురువు ఆహా కోకిలది ఎంతకమ్మని గొంతు అనేవాడు. చాలా సార్లు అలావిన్న జాజు ఒక రాత్రి “మిత్రమా! నీకు ఇంత కమ్మని గొంతు ఎలా వచ్చింది” అని అడిగింది. “మావిచిగురు తినటంవలనే మా జాతికి ఇంత కమ్మని గొంతు వచ్చింది నేస్తం” అని టింకు చెప్పి పడుకుంది. ఆ రోజు రాత్రంతా జాజు కి నిద్రపట్టలేదు. తన తల్లి గుర్తు వచ్చింది.

మధ్య రాత్రి లో ఏదో శబ్దం వినిపించి టింకు లేచి చూసింది. జాజు మామిడి చెట్టు మీద కూర్చుని చిగురు తిని తిని పాడుతూ ఉంది. దానితో గొంతు కి మామిడి చిగురు అడ్డుపడి మూర్చపోయింది. చింకి, డుంబు వెంటనే లేచి వెళ్ళి పట్టుకున్నారు. టింకు ఒక చిన్న ఆకు తో నీరు తెచ్చింది. నీరు త్రాగిన జాజు కాసేపటికి మొత్తం మామిడి చిగురు కక్కేసింది. రాత్రంతా స్నేహితులంతా దానికి సేవలు చేస్తూ ఉన్నారు. తెల్లవారితే జాజుకి తెలివి వచ్చి అందరినీ చూసి తల దించుకొని ఏడుస్తుంది. “నాకు జన్మలో పాటలు రావు. నాకు చాలా సిగ్గుగా ఉంది” అని జాజు భాదపడింది. “నీకు కూడా మంచిగా పాటలు వస్తాయి బాదపడకు” అంటుంది టింకు.

“నా గొంతు బాగుండదు కదా మరి నేను ఎలా మంచిగా పాడగలను” అని అడిగింది జాజు. “పాడటానికి శ్రావ్యమైన గొంతు తప్పనిసరి కాదు గొంతులో మంచి శృతి,లయ ఉంటే చాలు” అంది టింకు. కానీ జాజు ఆ మాటలు నమ్మదు. ఒక రోజు వీళ్ళు ఉండె అడవికి కొంతమంది మనుషులు పిక్నిక్ వచ్చారు. వాళ్ళు పగలంతా నీట్లో ఆడుకొని రాత్రికి మంట పెట్టి దాని చుట్టూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ గొంతు ఊరిలోని విద్వాంసుడి గొంతులా గొప్పగా లేదు. బండ గా ఉంది. అయినా వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. టింకు వాళ్ళని చూపించి “చూసావా సంగీతానికి గొంతు కాదు శృతి లయ ముఖ్యం” అని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఒక వారం రోజులు పాటు దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి ప్రజలు వినేవి, పాడుకునేవి పాటలన్నీ విన్నారు. అందులో జాస్సిగిఫ్ట్ తో మొదలెట్టి హిమేష్ వరకు ఉన్నాయి. “అ అంటే అమలాపురం” నుండి “ఆకలేస్తే అన్నంపెడతా” వరకు ఉన్నాయి. అప్పుడు టింకు చెప్పింది నిజమే అని జాజు నమ్మింది. ఆ రోజు నుండి టింకునే జాజు కి సంగీత గురువు. జాజు కష్టపడి రాత్రి పగలు పాడుతూనే ఉంటుంది. చింకి, డుంబు జాజు తిండి అవసరాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సంగీతం మీద ఇష్టం పెరిగి జాజు పాడూతూ ఉంటే పక్కన ఎండిన ఆకులను తొక్కుతూ, ముక్కులతో కొమ్మలను కొడుతూ శబ్దం చేస్తూ ఉంటారు. ఒక రోజు చింకి కొన్ని చిన్న చిన్న గిన్నెలు చెంచాలు ఎత్తుకొచ్చి వాటిని కొట్టటం మొదలు పెట్టింది. డుంబు ఊరిలోకి పోయి ఒక బూరలమ్మే వాడి బుట్టలో ఉన్న ఏక్తారా ఎత్తుకొచ్చేసి ముక్కుతోను, గోళ్ళతోను వాయించటం మొదలు పెట్టింది. జాజు తెలివిగా తన బండ గొంతుని, టింకు మంచి గొంతుని సరైన పద్దతిలో కలిపి చక్కని బాణీలు కట్టి పాడింది. వాళ్ళు అలా పాడుతూ ఉంటే ఆ చిట్టడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి. ఇంకేముంది తాము “4 నోట్స్” అనే ఒక రాక్ బ్యాండ్ గా ప్రకటించుకున్నాయి.

తమ సమూహం లో తన పాటల ప్రతిభ చూపించాలని తన తల్లి పేరు నిలబెట్టాలని జాజు స్నేహితులతో తిరిగి పాత అడవికి బయలుదేరింది. వీరిని చూడగానే కేతు తన బృందంతో దాడి చేసి భందించింది. సాహి ముందు హాజరు పరిచింది. వాళ్ళు చేసిన దాడి లో జాజుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. సాహి మీరు సమూహం నిర్ణయాన్ని ఎదిరించారు మీకు మరణశిక్ష తప్పదు. కానీ పారిపోయిన మీరు ఎందుకు తిరిగి వచ్చారు చెప్పండి అని అడిగింది. జరిగిన విషయం మొత్తం జాజు చెప్పింది. అంతా విన్న సాహి ఆలోచనలో పడింది. కేతు గర్వంతో పాటలో నన్ను ఓడిస్తే నీకు శిక్ష లేకుండా వదిలేస్తాం అని అంది. అందరూ ఒప్పుకున్నారు. చావు ఎలాగు తప్పదు కాబట్టి చివరి అవకాశంగా జాజు కూడా ఒప్పుకుంది. కానీ పోటిలో ఓడితే తనని మాత్రమే చంపాలని మిగిలిన వాళ్ళని క్షమించాలని ఇదే తన చివరికోరికని చెప్పింది. కేతు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎక్కడివి? దొంగతనం గా ఎత్తుకు వచ్చినవిలా ఉన్నాయి వీటిని వాడటానికి వీళ్ళేదంది. కేతూ బృందం మాత్రం పాట మొదలు పెట్టి అద్బుతంగా పాడారు. కాకులన్నీ ఆనందంతో చిత్తుగా తాగి ఊగి రెచ్చిపోయి గెంతాయి. ఇప్పుడిక జాజు బృందం పాడాలి. వాద్యాలు లేవు. జాజు దిగులుగా వేదిక మధ్యలో నిలబడింది. డుంబు కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తనతోకలో ఒక ఈక పీకి బాణంలా వంచి దానికి చిన్న చిన్న తీగలు కట్టింది. “ట్రంగ్” మని గట్టిగా శబ్దం చేసింది. చింకి కొన్ని కొబ్బరి చిప్పలు తెచ్చి తిరగేసి వాటి మీద ముక్కు తో కాంగో కొట్టటం మొదలుపెట్టింది. టింకు “హే హే లలల లా హే హే లలల లా” అని చిన్న ఆలాపన చేసింది. అప్పుడు జాజు కి ఉత్సాహం వచ్చింది. మితృలందరూ చావుకి సిద్దపడే ఉన్నారు. జీవితంలో చివరిసారి పాడుతున్నాము అనే స్పృహలో ఉన్నారు. తమకిష్టమైన సంగీతం కోసం చావుకి సిద్దపడ్డారు. సంగీతంలో మునిగి చనిపోవాలన్న కాంక్షతో తన్మయత్వం లో ఉన్నారు. వారి ఆత్మలీనమైన ఆ పాట అద్బుతంగా ఉంది. జాజుకి తగిలిన దెబ్బలనుండి రక్తం కారుతూనే ఉంది. కేతు కూడా పాటలో లీనమైపోయాడు.

“నా తల్లి లాలిపాటలో,

నామితృలు పంచిన ప్రేమలో,

కమ్మదనమే నా పాట.

ఈ వరాలన్నీ నాతో ఉంటాయి ప్రతిపూట.

ఈ పూట తో నా ఊపిరి పోయినా,

ఓ పాటగా నే బ్రతికే ఉంటా.

ఆ కొండలో ఆ కోనలో, ఈ చెట్టులో ఈ పుట్టలో,

ప్రతి సవ్వడిలో ఓ పాటగా నే బ్రతికే ఉంటా.”

ఆత్మ ని మిలితంచేసి పాటలోనే కలిసిపోయి పాడూతూ జాజు వేదికపైన ఒక్కసారి కుప్పకూలి పడిపోయింది.   

మరి జాజు తిరిగిలేచిందా? సమూహం వారి గొప్పతనాన్ని ఒప్పుకుందా? వాళ్ళ పాటకి అడవితల్లి జేజేలు పలికిందా? లేక సమాజం ఎప్పటిలానే తన కాఠిన్యం చాటుకుందా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి నాది అనే ఒక ముగింపు ఇవ్వటం నాకిష్టంలేదు. “విఙ్ఞులయిన పాఠకులారా మీకు నచ్చిన ముగింపుతో మీరే కధని చదవటం పూర్తిచేయండి.”

24 thoughts on “జాజు – ఒక కాకి కధ

 1. మహేష్ గారన్నట్టు తరువాత సినిమాలో కధ అన్న పేరు కింద మన మురళి గారుంటారేమో.

  అదిరింది. పైనన్నట్టు మీరిలాంటిబి కూడా రాస్తారా, పాటాలు, కవితలు,

  నాకో డవుట్ కాకి పేరు జాజు అని ఎందుకు పెట్టారో తెలుసుకోవాలని.

 2. వంశీ గారు,ప్రతాప్ గారు, రమ్య గారు, శ్రీదేవి గారు, కొత్తపాళీ గారు

  ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం, వ్యాఖ్యలు నాకు బలాన్నిస్తున్నాయి. మరిన్ని టపాలు రాయటానికి ప్రోత్సాహాన్నిస్తున్నాయి.

 3. సుబ్బు, అశ్విన్
  నేను ఇలాంటివి రాస్తా అని రాసేదాక నాకూ తెలియదు. జాజు అని పేరు పెట్టటానికి ప్రత్యేక కారణం ఏమీలేదు. కాస్త ముద్దుపేరులా ఉండాలి, కొత్తగా ఉండాలి అనుకుని ఆ పేరుపెట్టా.

 4. మహేష్ గారు, సత్య గారు,
  మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నా కధ నిజానికి అంత గొప్పది కాకపోవచ్చు. కానీ దానిని ప్రశంసించే వారి స్థాయిని బట్టి దానికి ఆ గొప్పతనం అపాదించబడుతుంది. మీ వ్యాఖ్యలు నా టపాకి గొప్పతనాన్ని తెచ్చిపెట్టాయి.

 5. నమస్కారం..
  నేను ఒక పోస్ట్ రాసాను..
  ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్

  ధన్యవాదాలు..

  లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

  http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html

 6. కథలో ఫీల్ చాలా ఉందండీ… అని చెప్పాలని ఉంది.. కానీ నేను అంత పెద్దవాణ్ని కాదండి. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు చావైనా.. బ్రతుకైనా దానికోసం వెనుకడుగు వేయకూడదు. అలాగే మిత్రుల సహకారం ఎలా ఉండాలి అనే దానిపై బాగా రాశారు. ఇలాంటివి సినిమాల్లో ఇప్పటికే వచ్చినా.. వస్తున్నా.. మీ కథలో కథనంలో కొత్తదనం బాగుంది. చివరలో మీరు రాసిన కవితతో కూడిన సాహిత్యపు ఒరవడి నన్ను ఆనందాశృవులతో నింపింది. కృతజ్ఞతలతో…

 7. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

 8. చివరి లైన్లలో తప్ప నేరేటర్ ఎక్కడా కనపడకుండా బావుంది. నీదైన కథ కాబట్టి నా మటుకు నేను నీదైన క్లైమాక్స్ నే కోరుకుంటున్నా.. మొదటి పేరా చదవగానే ఏనిమేషన్ చేస్తే అనుకున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s