ముంగిలి » కథలు » వనవాసంలో ఒకనాడు

వనవాసంలో ఒకనాడు

పచ్చని వనంలో ఎర్ర మట్టితో అలికి, రంగవల్లులు తీర్చిన ఆ పర్ణశాల ప్రకృతిమాత మడికట్టుకుని వెలిగించిన కార్తీకదీపంలా వెలిగిపోతుంది. వాకిట్లో వృక్షాలన్నీ నిన్నటి ముచ్చట్లు నెమర వేసుకుంటూ, ఆకులతో, కొమ్మలతో పలకరించుకుంటున్నాయి. కొమ్మలపై వాలిన పక్షులన్నీ సందడి చేస్తూ ఆ ముచ్చట్లకు అడ్డు తగులుతున్నాయి. చెట్లకు చుట్టూ గుబురుగా పరుచుకున్న పూల మొక్కలన్నీ మౌనంగా రేపటి తమ కానుపుకై కలలు కంటున్నాయి. ముంగిట్లో చేరిన హరిణాలు పచ్చిక తింటూ మధ్య మధ్యలో ఎవరికోసమో మెడలు పైకెత్తి పెద్ద పెద్ద లోచనాలతో ఆత్రంగా చూస్తున్నాయి

ఉదయం ఉత్సాహంలో ఉన్న సూర్యుడు కొమ్మల సందుల్లోనుండి ఒడుపుగా తన కాంతిని వదులుతూ ఎండ ముగ్గులు వేస్తున్నాడు. తుంటరి కొమ్మలు అటూ ఇటూ ఊగుతూ ఆయన్ని అల్లరిపెడుతున్నాయి. పాపం ఉడుక్కుంటున్న ప్రత్యక్ష నారాయణుడు మరింత వేడెక్కిపోతున్నాడు. ఏకాగ్రత చెదిరిందేమో ఇక కుదరదని వదిలేసి తన అశ్వాలని ముందుకు అదిలించాడు

ఒక తుంటరి జింకపిల్ల చెంగు చెంగున దూకుతూ గుమ్మం దాకా వచ్చేసింది. కాస్త తడబడుతూ, బిత్తర చూపులతో మెల్లగా లోపలికి తొంగి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏ రూపం చూడాలని లోకంలో ఉన్న కన్నులన్నీ పరితపిస్తాయో, ఏ మూర్తిని నింపుకుని మందిరాలుగా మారాలనీ మనస్సులన్నీ కోరుకుంటాయో, ఏ స్వామి వాత్సల్యం కోసం సర్వ ప్రాణికోటి ఆరాటపడుతుందో ఆ సుందర మనోహర రాముడు నార వస్త్రాలు ధరించి ధ్యానంలో ఉన్నాడు. సృష్టిలో ఉన్న ఏ ఆభరణాలూ ఈ నార వస్త్రాల్లా స్వామి అందాన్ని చూపలేవేమో?

గుమ్మంలో అలికిడి విని కన్నులు తెరిచి చూసాడు. పాపం జింక పిల్ల స్వామి తనని చూసేసారని తత్తరపాటుకి లోనయ్యింది. కానీ చూపుని స్వామి నుండి మరల్చ లేకపోయింది. స్వామి నడుచుకుంటూ వచ్చి జింక పిల్లని చేరదిసి “పొద్దున్నే పలకరించాలని వచ్చావా? ఇక పోయి నీ నేస్తాలతో ఆడుకో” అని వదిలి గుమ్మంలోకి వచ్చారు. స్వామి తనని తాకినందుకు సంబరపడుతూ ఈ విషయం తన నేస్తాలకి చెప్పాలన్న ఉత్సాహంలో జింక పిల్ల వాకిట్లోకి పరుగుతీసింది. స్వామి దర్శనం కోసం ఉదయం నుండీ పడిగాపులు కాస్తున్న పక్షులు, జంతువులు అన్నీ గుమ్మం దగ్గరకి చేరిపోయి స్వామిని మరింత దగ్గరగా చూడాలని ఉత్సాహ పడసాగాయి. స్వామి అందరినీ తన చల్లని చూపులతో, చిరు మందహాసంతో పలకరిస్తున్నారు.

పర్ణశాల లోపల పనిలో ఉన్న సీతమ్మతల్లి “హ్మ్ స్వామివారికి తెల్లారిందా? ఆ ముచ్చట ముగిసాక కాస్త వంటలో లవణం వేస్తారా? నా చేయి వీలు లేదు” అంటూ పురమాయించింది.

స్వామి చిరునవ్వుతో అందరిని పంపించి ఇంటిలోకి వచ్చారు. పాపం ఆయన వరదహస్తం కాస్త పెద్దదాయె, చేతివాటాన వంటలో కాస్త లవణం ఎక్కువే వేసారు. సీతమ్మ ఏమంటుందో అని కాస్త బెరుకు గొంతుతో “జానకీ! కాస్త ఉప్పు ఎక్కువయ్యిందేమో” అంటూ నసిగారు.

అమ్మవారు చేస్తున్న పని ఆపి నిట్టూరుస్తూ గెడ్డం కింద చెయ్యిపెట్టుకుని “హ్మ్ బాగుంది. నేను మీకే చెప్పానూ. ఏది ఎంత వెయ్యాలో తెలిసిన వారైతే లోకం ఇట్లా ఎందుకుంటుంది?” అని లేచి వంట దగ్గరకి వచ్చింది.

ఫలాలకోసం వనంలోకి వెళ్ళి అప్పుడే వచ్చిన లక్ష్మణస్వామి ముసి ముసిగా నవ్వుకుంటూ “లోకాలనేలే దేవదేవుడైనా ఇంటిలో ఉప్పుగడ్డకు లోకువ” అని మనసులోనే అనుకున్నారు.

సీతమ్మ వంట కాస్త రుచి చూద్దామని నోటిలో వేసుకుంది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. స్వామి అమ్మవారి కళ్ళలో నీళ్ళు చూసి భీతిల్లి “అయ్యో జానకీ ఏమయ్యింది? ఎందుకు రుచి చూసావు? మధుర ఫలములు తప్ప వేరు రుచి తెలియని నీ నోటికి లవణం బాధకలిగించిందా? ఏమరపాటున ఎంత పని చేసాను” అంటూ తల్లడిల్లారు.

అమ్మవారు స్వామి చేతులను కళ్ళకు అద్దుకుని “స్వామి మీ చేత జారిన లవణమయినా వృధాపోదని విస్మరించి తూలనాడాను. నన్ను క్షమించరూ. అమృతము తప్ప వేరు రుచి దీనికి సాటి రాగలదా? ” అని తన్మయత్వంతో పలికింది. స్వామి ఒక దీర్ఘ నిట్టూర్పు విడచి, చిరునవ్వుతో ఊరడిల్లారు. ఇదంతా చూసిన ఒక ఉలికిపిట్ట వనమంతా తిరిగి గోల చేసి అందరికీ ఈ వార్త చేరవేసింది. కాసిన్ని మెతుకులు మాకు దొరకకపోతాయా అని పక్షులన్నీ ముంగిట్లో చేరి చూడసాగాయి.

వంట ముగిసే సరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. స్వామిని భోజనానికి పిలిచి అమ్మవారు పూజ చేస్తున్నంత శ్రద్ధగా వడ్డన చేస్తుంది. “జానకి! ప్రతిరోజు ఇంతే ఓర్పుగా, శ్రద్ధగా వడ్డింపు చేస్తావు. నీ వడ్డనలో భక్తికి ముచ్చట వేస్తుంది సుమా” అన్నారు.

“నా బాధ మీకెప్పుడు తెలిసింది కనుక. ఇప్పుడేగా దక్కింది నాకీ భాగ్యం. అయోధ్యలో ఉండగా అత్తలు నాకీ అదృష్టం దక్కనిస్తేనా. ఒకరికి తెలియకుండా ఒకరు చొప్పున ముగ్గురత్తలూ మూడుపూటలా ఈ బాలాకుమారునికి కొసరి కొసరి ముద్దలు తినిపించటం చూడటానికే సరిపోయేది” అని బుగ్గలు నొక్కుకుంది సీతమ్మ.

“లోకమాత అని అందరూ పిలిచే నీకు అమ్మ ప్రేమ తెలియనిదా?” అని స్వామి నవ్వుకున్నారు.

“బాగుంది సంబరం. నేనిప్పుడు ఏమన్నా అని? మీ మాటలు వింటే నేనేదో అత్తలని ఆడిపోసుకున్నా అనుకుంటుంది లోకం” అని విసుక్కుంది సీతమ్మ.

“మీ సోదరి ఊర్మిళకి ఆ భాగ్యం కూడా లేకపోయింది” అని బయట మొక్కలకి నీరు పెడుతున్న రామానుజుని  చూసి రాముడు విచారపడ్డాడు.

“హ్మ్ మీ తమ్మునికి అన్న తప్ప అన్యులక్కరలేదాయె. ఏం చేస్తాం పాపం” అని నిట్టూర్చింది సీతమ్మ.

“సుకుమారవతియైన సతిని సుఖవాసాన ఉండనిచ్చి మేటిభర్త అనిపించుకున్నాడు. అడవులకు నడిపిన నింద నాకేగా. భావి తరాలు నాపై ఇంకెన్ని నిందలు మోపనున్నారో” అని నిట్టూరుస్తూ భోజనం ముగించారు స్వామి.

మెల్లగా సంధ్యవాలి పున్నమి చంద్రుడు కలువలతో ముచ్చటలాడటానికి ఉత్సహంగా వచ్చాడు. పున్నమి చంద్రుని పూర్ణకళలు చుసి వనమంతా మురిసింది. అడవంతా ఆ తెల్లని వెలుగులో పాలసంద్రపు తరకలా ఉంది. పర్ణశాల బయట ఆదిశేషునిలా విస్తరించిన చెట్టు నీడన నిదురిస్తున్న స్వామిని చూసిన చంద్రుడు, తాను వెలవెలపోతానని భయపడి చటుక్కున మబ్బుల చాటుకి పోయాడు. నింగి నున్న తారకలన్నీ మిణుకుమిణుకుమని నవ్వుకున్నాయి. స్వామి పాదాలు ఒత్తుతున్న సీతమ్మ స్వామివారి కోదండం చూస్తూ ఏదో అలోచనలోపడింది.

“ఏమిటి జానకి, ఏదో అలోచనలో ఉన్నావు?” అని మూసిన కళ్ళు తెరవకుండానే అడిగారు స్వామి.

“అంతా గమనించేసారా?” అని నవ్వుకుంటూ “శివధనస్సు సహితం నిలువలేని మీ చేతిలో ఈ సాదారణ విల్లు ఎలా నిలువ గలిగిందా అని ఆలోచిస్తున్నా” అంది సీతమ్మ.

స్వామి లేచి తన చేతిపైకి ఒత్తిగిలి అమ్మవారిని చూస్తూ “నువ్వూ అదే అన్నావ్. నేను శివధనస్సును విరచలేదని ఎంత చెప్పినా వినరే. అది అనుకోకుండా జరిగింది సుమా” అని అలుక అభినయించారు స్వామి.

“శివధనస్సు ఎక్కుపెట్టే ముందు తామెదో తలుచుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదేమిటో చెప్పరే” అని బుంగమూతి పెట్టింది సీతమ్మ.

“ఈనాడు చెప్పక్క తప్పేట్లు లేదు. లేకుంటే శివధనస్సు విరిచా అనే అపకీర్తి నాకు శాశ్వతమవుతుంది.” అని లేచి కూర్చుని నాటి సన్నివేశాన్ని అభినయించసాగారు స్వామి. అమ్మవారు ముసిముసిగా నవ్వుకుంటూ ఆసక్తిగా చూస్తుంది.

స్వామి ధనస్సుకి నమస్కరించినట్టుగా, రహస్యం చెప్పినట్టుగా అభినయిస్తూ “ఓ శివధనువా, నీవు సీతాసఖివని విని ఉన్నాను. చిన్ననాటి నుండి తను ఆటలాడగా చూసుంటావు. ఊసులాడగా విని ఉంటావు. తన మనసెరిగిన దానివి నీవని నా నమ్మకం. ఆడపిల్లలతో ఏనాడు ఆడి,మాటలాడి ఎరుగని నాకు ఆమె మనసు తెలుసుకొనటం సాధ్యం కాదు. మనసారా అంగీకరించని కన్యను చేపట్టటం మా రఘువంశము మెచ్చదు. అందుకే ఈ రాముడు నీ సహాయం కోరుతున్నాడు. నీ సఖి మనసున ఊహలకి రూపాన్ని నేను కాగలనని అనుకుంటే నా చేత ఒదిగిపోవుమా” అని పలికి సీతమ్మ వంక చూసి “ఇది మాత్రమే అన్నా జానకి. ఉలుకు తప్ప పలుకెరుగని నీ మనస్సు ఎట్లా తెలుసుకుందో నీ నెచ్చెలి ఉత్సాహం ఉరకలెత్తగా, అమాంతం తనువంతా విరుచుకు ముక్కలయ్యింది” అని అమాయకంగా చెప్పారు స్వామి.

స్వామి అభినయానికి నవ్వుకుంటూ, తన మనసు తెలుసుకోవాలనుకున్న ఆయన వాత్సల్యానికి కరిగిపోతూ స్వామి వారి పాదాల వద్ద ఒదిగిపోయింది సీతమ్మ. అనంత ఆనందాన్నిచ్చే ఈ దృశ్యాలను తనలో కలుపుకుంటూ కాలం మరో అందమైన రోజుకోసం సాగిపోయింది.

(నా పిచ్చి ఊహలకు క్షమార్పణలతో స్వామివారి పాదాలకు)

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

47 thoughts on “వనవాసంలో ఒకనాడు

 1. సూపర్ గా ఉంది మురళీ.. నాకయితే చాలా నచ్చింది..
  (నా పిచ్చి ఊహలకు క్షమార్పణలతో స్వామివారి పాదాలకు) ఇది చదివే వరకూ నిజం గా జరిగిందేమో అనుకున్నాను 😉

 2. అద్భుతం… కళ్ళకి కట్టించారు. భేష్.. భేష్ నామునా గారూ!

  ప్రకృతి వెలిగించిన కార్తీక దీపం, ఎండముగ్గులేస్తున్న సూరీడు.. వర్ణన ఎంత చక్కగా ఉందో! సన్నివేశం అంత కంటే అందంగా ఉంది! 🙂

 3. ఆహా! ఎంత అద్భుతమయిన వర్ణన! కొంతసేపు నేను ఆ పర్ణశాల చుట్టూ విహరిస్తూనే ఉన్నాను సీతా సమేత శ్రీ రామ చంద్రుని దర్శనం అవుతుందని! మీ మనసుతో చూసి రాసిన ఈ టపా వలన నాకు మాత్రం కళ్ళ ముందు ఆ దృశ్యాలన్నీ కదిలాయి. పిచ్చి ఊహా కానే కాదు సీతారాములు ఇది చదివితే నిజంగానే ఇలా ముచ్చటించుకుంటారేమో కూడా! అంత బాగుంది!

 4. మీ ఊహా లోకం అద్భుతం మురళి గారు. నేను చాలా రోజుల నుండి కూడలి లో బ్లాగ్స్ చదువుతున్నానండి కాకపోతే ఎప్పుడు కామెంట్స్ రాయలేదు. కాని ఇప్పుడు మీ రామాయణం చాలా రోజుల తరువాత ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. Thanks for that…

 5. చాలా బావుందనటం చిన్నబుచ్చటమే అవుతుందేమో. పదాలు దొరకట్లేదండి. సారీ.

  ” చెట్లకు చుట్టూ గుబురుగా పరుచుకున్న పూల మొక్కలన్నీ మౌనంగా రేపటి తమ కానుపుకై కలలు కంటున్నాయి. ” – పూవు విచ్చుకోవటాన్ని ఇంత అందంగా చెప్పటం నేనెక్కడా చదవలేదు.
  ” సూర్యుడు కొమ్మల మధ్య నించి ఒడుపుగా కాంతిని వదులుతూ ముగ్గులెయ్యటం ” – ఇప్పుడాలోచిస్తుంటే ఉదయసంధ్యలో గుమ్మంలో సూర్యుడు ముగ్గులేస్తున్నట్టే అనిపిస్తోంది.

  వర్ణన బావుందే అనుకుంటూ చివరి దాకా వచ్చాక చివరి శివధనుస్సు సన్నివేశం చాలా బావుంది. అసలా ఆలోచన, ఆ ఊహ అత్యద్భుతం, నిజంగా. ఆ ఊహ మీకు రాముడే కలిగించి ఉంటాడు. ఆయన పురుషోత్తముడనటానికి ప్రపంచానికి ఇంకో ఋజువుగా మీ ద్వారా ఆ ఊహ మాకు తెలిసేలా చేశాడేమో. ఊహూ మీరు ఆయనకి క్షమాపణ చెప్పనక్కరలేదు. 🙂

 6. మురళీ,
  ఇంతకు ముందు రెండు విడి విడి బజ్‌లుగా రాసిన వాటి వెనక ఇంత స్క్రీన్ ప్లే ఉందా?! నువ్వంత మడి కట్టుకుని రాశావ్ కాబట్టి కెవ్వ్లు, కేక లు వెయ్యట్లేదు. నీ ఊహ చాలా బావుంది. దాన్ని మలచడం ఇంకా బావుంది.
  ఒక కానీ: మొదట్లోనూ, చివర్లోనూ స్క్రీన్ ప్లే లో కనిపించిన పట్టు మధ్యలో అనిపించలేదు.

 7. మీరు భావుకత్వంతో రాసిన ప్రతి సన్నివేశం, అందమైన బాపు బొమ్మలా కళ్ల ముందు కదులుతూ ఉంది. నిజంగా ఈ కథని తీస్కెళ్లి బాపు గారిని చూపించి, ఆయన వేసే బొమ్మల్ని చూడాలని ఉంది నాకు. ముఖ్యంగా “స్వామి అభినయానికి నవ్వుకుంటూ, తన మనసు తెలుసుకోవాలనుకున్న ఆయన వాత్సల్యానికి కరిగిపోతూ స్వామి వారి పాదాల వద్ద ఒదిగిపోయింది సీతమ్మ.” ఈ సన్నివేశాన్ని ఊహించుకుంటుంటే మనసు పులకరించిపోతుంది, అందులోనూ పాల సముద్రాన్ని , ఆదిశేషువుని తలపించే నేపథ్యంలో..

 8. అద్భుతమైన వర్ణన!

  నీవి పిచ్చి ఊహలు కావు; గొప్ప ఊహలు. ఎంత అద్భుతంగా రాశావు! ఒక్కో మాటా, వాక్యమూ చదివుతుంటే పులకింపజేశాయి… వాల్మీకీ, కంబన్ లు ఇది చదివితే వాళ్ళు రాసిన రామాయణాలు తెచ్చి నిదగ్గర సమర్పించేసి; కొత్త రామాయణం నువ్వే రాసేయ అని చెప్పుండేవారేమో!

  రాముడు చదివితే ఎంత ఆనందపడతాడో…

 9. పోతన భాగవతంలో చాలా చోట్ల ఇలా లైవ్ కవరేజ్ ఇచ్చారు. అలా, ఈ కాలానికి మీరు మఱో పోతన గారులా వ్రాస్తున్నారు. ఇలాంటి విషయాన్ని ఇంతకు ముందు అరిపిరాల సత్య ప్రసాద్ గారి నుంచి చదివాను, ఇదిగో ఇప్పుడు మీనుంచి చదువుతున్నాను.

  భావాన్ని అనుభవించాలి అని ఎవ్వరో చెప్పనక్కర్లేదు. జింకపిల్ల చాలు, జింక పిల్ల భావనలో మీరు వర్ణించిన తీరు చాలు.. ఏది ఏమైనా, భేషుగా వ్రాసారు. ఇకపై ఇలాగే అనుభవిస్తూ వ్రాయండి. మమ్ములను తరింప చేయ్యండి.

 10. ఆహా మురళీ ఏమి కల్పనా చాతుర్యము,ఏమి భావరసస్పోరకం,ఏమి లీలావినోదమూ,ఏమి తన్మయత్వమూ,ఏమి రచనా చమత్కృతీ….అద్భుతం,అనిర్వచనీయం,ఆహ్లాదకరం (అంతా రామ మయం,ఈ జగమంతా రామమయం)

 11. నేను చేసిన చిన్న ప్రయత్నాన్ని పెద్దమనసుతో అభినందించిన అందరికీ నా ధన్యవాదాలు. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలీదు. ఆ రాముడే ఒక మంచి ఊహ కలిగించి నా చేత రాయించాడేమో. ఈ అభినందనలన్నీ ఆయనకే. శ్రీ రామార్పణం.

 12. రామావతారంలో వనవాస ఘట్టంలో ఇలాంటి అద్భుతమైన క్షణాలు(సంఘటనలు) ఇంకొన్ని ఉంటే కైకమ్మ 14 సంవత్సరాలే వనవాసం ఎందుకడిగిందా అని బాధపడిఉండేవాడేమో మురళీ.చాలా అద్భుతంగా ఉన్నాయి నీ వర్ణన, ఆలోచన. 🙂

 13. ఆలస్యంగా వచ్చి, పోస్టంతా చదివి, నోరు మూసుకుని ఊరుకోక ఈ బొక్కలు వెదికే కార్యక్రమం ఏమిటీ… అని మీరు తిట్టుకున్నా… అందమైన కథనంలో పలుకురాళ్ళు ఉండడం సరి కాదని… ఈ చిన్న సూచనలు. సహృదయులూ, రసజ్ఞులూ కాబట్టి భరిస్తారని….!

  మూడో పేరా : తెలుగు పలుకుబడి అది కాదేమో… అలాంటి పలుకుబడికి సంస్కృతం, ఆంగ్లాల్లో వచ్చిన అందం తెలుగులో రాదని అనిపిస్తుంది నాకు.

  దీర్ఘ నిట్టూర్పు … దుష్ట సమాసం కదా.

  భావి తరాలు… మోపనున్నారో కాదు, “మోపనున్నాయో”

  సాధారణ విల్లు … ఇదీ దుష్ట సమాసమే 😦

  విరచలేదని …. తప్పు తప్పు … “విరవలేదని” అని కదా ఉండాలి.

  ఎవరో ఒక మీ మిత్రుడన్నట్టు మధ్యలో కథనం కొంచెం బలహీనమయినా.. మొత్తంగా చాలా అందంగా ఉంది. తనువతా విరుచుకు ముక్కలవడం … అద్భుతమైన ఊహ.

  • ఫణీంద్ర గారూ,
   ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు మన్నించండి. మార్కులకోసమే నేర్చుకున్న మొక్కుబడి చదువు కావటం చేత నా వ్రాతల్లో దుష్టసమాసాలు, అచ్చుతప్పులు దొర్లుతుంటాయి. మీలాంటి వారు మందలించినప్పుడు నేర్చుకుంటూ ఉంటాను. చేసిన తప్పుల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.

 14. నేను ఈ కామెంట్ రాసే సమయానికి కథ మొత్తం చదవలేదు కానీ కామెంట్ రాయకుండా ఉండలేక రాస్తున్నాను … నేను ఇవ్వాళే మీ కథలు చదవడం మొదలెట్టాను .. “కావ్య”, “స్నిగ్ద” , “మాకు మళ్ళీ పెళ్లి అయింది ” కన్నా ఈ కథ narration అమోఘము ,అద్బుతం,
  “సీతారామయ్య గారి మనవరాలు ” సినిమా లో “వెలుగు రేఖల వారు ” పాట లో వేటూరి మహాశయులు ” ఎండ ముగ్గులు పెట్టంగా” అని రాస్తే మురిసిపోయాను… అబ్బబ్బ ఏమి రాశారు అనుకున్నాను … ఇపుడు మీ కథ లో మొదటి రెండు paragraphs చదివాక అంతా కన్నా మురిసిపోయాను … అసలు మన తెలుగు కి ఇంత power ఉందా అనీ ఆలోచిస్తుంటే ఛాతీ ఒక్ రెండు అంగుళాలు గర్వం తో పెరిగిపోతుందండి. 😀
  అసలు ఆ వర్ణన ఎలా వచ్చిందండి బాబు . నాకు మిమ్మల్ని చూస్తే ఈర్ష్య గా ఉంది .

 15. “ఓ శివధనువా, నీవు సీతాసఖివని విని ఉన్నాను. చిన్ననాటి నుండి తను ఆటలాడగా చూసుంటావు. ఊసులాడగా విని ఉంటావు. తన మనసెరిగిన దానివి నీవని నా నమ్మకం. ఆడపిల్లలతో ఏనాడు ఆడి,మాటలాడి ఎరుగని నాకు ఆమె మనసు తెలుసుకొనటం సాధ్యం కాదు. మనసారా అంగీకరించని కన్యను చేపట్టటం మా రఘువంశము మెచ్చదు. అందుకే ఈ రాముడు నీ సహాయం కోరుతున్నాడు. నీ సఖి మనసున ఊహలకి రూపాన్ని నేను కాగలనని అనుకుంటే నా చేత ఒదిగిపోవుమా” అని పలికి సీతమ్మ వంక చూసి “ఇది మాత్రమే అన్నా జానకి. ఉలుకు తప్ప పలుకెరుగని నీ మనస్సు ఎట్లా తెలుసుకుందో నీ నెచ్చెలి ఉత్సాహం ఉరకలెత్తగా, అమాంతం తనువంతా విరుచుకు ముక్కలయ్యింది” …chaalaa chaala chaaaaaaala bavundhi,,,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s