ముంగిలి » కథలు » స్నిగ్ధ

స్నిగ్ధ

ఒక్కగానొక్క బిడ్డని కన్నులెదుటే పోగొట్టుకున్న తల్లి దుఃఖంలా రెండురోజుల నుండీ అంతనేది లేకుండా వర్షం కురుస్తుంది. ఆకాశం తను పోగొట్టుకున్న బంధాలేవో నేల మీద ఆత్రంగా వెతుక్కోటానికా అన్నట్టు మెరుపులు పదే పదే మెరుస్తున్నాయి. గుండెల్లో వణుకు పుట్టిస్తూ మధ్య మధ్యలో ఉరుములు. ఈదురుగాలుల దాటికి ఎక్కడో కరెంటు తీగలు తెగిపోయాయేమో కరెంటుపోయింది. కిటికీలో నుండి వచ్చిన చల్లనిగాలి ఇల్లంతా ఆక్రమించి వణికిస్తుంది.

రెండ్రోజులుగా వాతావరణం ఇలానే ఉండటంతో మనసంతా ఏదో దిగులు కమ్మేసింది నాకు. దుప్పటి కప్పుకుని వాలు కుర్చీలో కూర్చుని కిటికీ నుండి బయట పడుతున్న వర్షాన్నే చూస్తున్నాను. చూస్తూ ఉండగానే బయటంతా చీకటి కమ్ముకుంది. గోడ మీద వేలాడుతున్న వాచ్ వైపు చూసాను. ఎనిమిది గంటలవుతుంది. టైము తెలియకుండానే గడిచిపోయింది.  గదిలో ఒక మూలగా వెలిగించిన కొవ్వొత్తి వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంది. సగం ఖాళీ అయిన స్కాచ్ బాటిల్ టీపాయ్ మీద కవ్విస్తున్నట్టుగా నిల్చుని ఉంది. కళ్ళు మూసుకుంటే కమ్మేస్తున్న ఒంటరితనం. కళ్ళు తెరిచి చూసినా అదే ఒంటరితనం. పదేళ్ళుగా ఎంత అలవాటు చేసుకోవాలని చూసినా ఇంకా ఈ ఒంటరితనానికి నేను అలవాటు పడలేదు.

చుస్ స్ స్ స్ మంటూ వెనుకనుండి వచ్చిన శబ్ఢానికి ఉలిక్కిపడ్డాను. గుండె ఒక్కసారిగా ఆగినట్టనిపించింది. తేరుకుని కిచెన్‌లోకి వెళ్ళి కుక్కర్ దించేసి వచ్చి మరలా కూర్చోబోతుంటే గేటు తీసిన చప్పుడయ్యింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గేటు వైపు చూసాను. ఎవరో ఒక మనిషి రావటం అస్పష్టంగా కనిపిస్తుంది. కరెంటు లేకపోవటంతో దారిలో లైట్స్ వెలగక ఎవరో తెలియటంలేదు. ఈ సమయంలో నా ఇంటికి వచ్చేదెవరో అర్ధంకాలేదు. ఊరికి కాస్త వెలుపలగా, ప్రధాన రహదారిని అనుకుని రెండెకరాల స్థలంలో ఉన్న ఇల్లు మాది. నాన్న డాక్టరుగా బాగా సంపాదిస్తున్న రోజుల్లో చుట్టూ తోట వేసి మధ్యలో ఈ బంగళా కట్టించారు. ఆయన ఉన్న కాలంలో ఇంటికి రాకపోకలు బాగానే ఉండేవి. అమ్మా,నాన్న పోయాక ఈ ఇంటిని, నన్ను పట్టించుకునే నాధుడే లేకపోయాడు. పగలు పని వాళ్ళు తప్ప సాయంత్రం దాటితే ఈ ఇంటిలో నేను ఏక్‌నిరంజన్. అలాంటిది ఈ సమయంలో ఎవరు వస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా.

మెరుపు వెలుగులో తుళ్ళిపడి బయపడుతున్న ఒక అమ్మాయి, ఆమె పక్కనే నడుస్తూ ఒక చిన్న పాప కనిపించారు. పాపం ఇద్దరూ వర్షానికి బాగా తడిచిపోయి ముద్దయిపోయారు. నేను వెంటనే కొవ్వొత్తి పట్టుకుని తలుపు వరకూ వెళ్ళి తలుపుని సగం తెరిచి “ఎవరండీ మీరు? ఎవరు కావాలి” అని అడిగాను. ఇరవయ్యేళ్ళు ఉండొచ్చు ఆ అమ్మాయికి ఏదో చెప్పింది కానీ చలికి వణుకుతున్న మాటలు నాకు అర్ధం కాలేదు. పాపం ఆ చిన్న పాపయితే చలికి బిగుసుకుపోయింది.

“దీపం ఆరిపోతుందని తలుపు పూర్తిగా తెరవలేదు. మొదట మీరు లోపలికి రండి” అని వారికి దారిచ్చి నేను కొవ్వొత్తి తీసి మరలా బల్ల మీద పెట్టాను. గదిలోకి తొందరగా వెళ్ళి ఒక తువ్వాలు తెచ్చి ఇచ్చాను.

“ఇద్దరూ బాగా తడిచి ఉన్నారు. తుడుచుకోండి.”

ఆ అమ్మాయి కాస్త కూడా మొహమాట పడే పరిస్థితిలో లేదు. వెంటనే అందుకుని పాపని తువ్వాలుతో చుట్టేసి కాసేఫు వెచ్చదనం వచ్చేలా ఉంచి. తరువాత శుభ్రంగా తుడవటం మొదలుపెట్టింది. నేను ఒక కప్పుతో కాచిన పాలు తీసుకొచ్చి ఇచ్చాను. ఆ ఆమ్మాయి కాస్త తెరుకున్నట్టుంది. కప్పు అందుకుంటూ కృతఙ్ఞతగా నవ్వింది. పాలని తన నోటితో ఊదుతూ పాపకి మెల్లగా తాగిస్తుంది. పాప భయపడుతూ చుట్టూ అన్నింటినీ చూస్తూ మెల్లగా తాగుతుంది. నేను పక్కనే నిలబడి చూస్తున్నాను.

బూడిదరంగు షార్ట్ మోడల్ కుర్తాలో ఎంతో అందంగా ఉందా ఆ అమ్మాయి. పలకరింపుగా పెదాలపైన చేరిన ఆమె నవ్వు విచ్చుకున్న గులాబీలా ఉంది. తడిచిన కుర్తాలో నుండి కనిపిస్తున్న ఆమె వంటి రంగు చప్పున పాలరాతి శిల్పాన్ని గుర్తు చేస్తుంది. బాగా తల తడిచిపోవటం వలన ఆమె రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఏంటో తెలియకపోయినా చాలా ఆకర్షణీయంగా మాత్రం అనిపించింది. నేను తననే అలా చూస్తూ ఉండటం గమనించిందో ఏమో ఆమె నావైపు చూసింది.

నేను కాస్త తడబాటుతో చూపుని పాప వైపు మరల్చాను. పాపకి నుదిటి మీద గాయం కనిపించింది. “అరెరె ఏమయ్యింది పాపకి?” అని అరిచాను.

ఆమె కూడా అప్పుడే చూసినట్టుంది “అయ్యో” అంటూ కంగారుపడింది. నేను పరిగెట్టి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చాను. పాపని సోఫాలో కూర్చో బెట్టి చకచకా పాప గాయానికి కట్టు కట్టాను. పాప ఇంకా ఏదో భయంతో వణుకుతూనే ఉంది. ఒక్కమాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. నేను పాపకి కట్టు కడుతున్నంత సేపు తను నా పక్కనే నీళ్ళు నిండిన కళ్ళతో కంగారు పడుతూ నేను అడిగినవి అందిస్తూ నిలుచుంది. నేను నా పని చేస్తూనే ఓరకంట ఆమెను చూస్తూ ఉన్నాను. చందమామ లాంటి ఆమె ముఖంలో దిగులు కూడా అందంగానే ఉంది తప్ప కష్టంలా కనిపించటం లేదు. అడిగినవి అందిస్తున్నప్పుడు తన చేయి తగులుతుంటే ఏదో తెలియని అనుభూతి నన్ను ఆవహిస్తూ ఉంది. క్షణాల్లో సమ్మోహనం చేసే అందాన్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. కావాలనే ప్రతీది తనని అడిగి తన చేతి నుండి తీసుకుంటున్నాను. ఆ స్పర్శ కలిగిస్తున్న అనుభూతిని వదులుకోవాలనిపించటం లేదు. బాగా తడిచి ఉండటం వలనేమొ ఆమె శరీరం ఇంకా చల్లగానే ఉంది. తల నుండి ఇంకా బొట్లుగా నీరు జారుతూ ముత్యాల్లా మెరుస్తుంది. తను అలా నిల్చున్న తీరులోనే ఒక ముచ్చటైన ఒద్దిక స్పష్టంగా తెలుస్తూ ఉంది.

పాప అలానే భయపడుతూ సోఫాలో పడుకుంది. పాపం ఆ అమ్మాయి ఇంకా అలా చలికి ఇబ్బందిపడుతూ నిలబడే ఉంది.

“కూర్చోండి ఇప్పుడే వస్తాను” అని చెప్పి నేను కిచెన్‌లోకి నడిచాను.

వేడి వేడి కాఫీ కప్పులతో నేను బయటకి వచ్చేసరికి ఆ అమ్మాయి చుట్టూ పరిసరాలను పరికించి చూస్తు ఉంది. ఇంత వరకూ పాప పరిస్థితి, వర్షం, వణికిస్తున్న చలివలన మరుగునపడిన స్త్రీత్వం ఇప్పుడు తిరిగి మేల్కొన్నట్టుంది. అన్నింటినీ అనుమానంగా చూస్తూ ఉంది. తనని మరింత అనుమానానికి లోను చెయ్యాలని టేబుల్ మీద స్కాచ్ బాటిల్ అల్లరిచేస్తుంది. నవ్వుకుంటూ నేను దగ్గరగా వెళ్ళి “కాఫీ” అన్నాను.

“థాంక్యూ” అని నవ్వుతూ అందుకుంది. ఒక రెండు సిప్స్ చేసాక తనలో కాస్త రిలీఫ్ కనిపించింది. నేను తన గురించి అడగాలా వద్దా అని ఆలోచిస్తూ తన వైపే చూస్తున్నాను.

నా మనసులో ఎముందో చదివినట్టుగా “నా పేరు స్నిగ్ధ” అని తల ఎత్తకుండానే చెప్పింది. శ్రావ్యమైన తన గొంతు నా చెవులను తాకగానే నా శరీరం మొత్తం ఒక్కసారిగా అలర్టయ్యింది. కళ్ళు మరింత పెద్దవి చేసి తననే చూస్తూ ఉన్నాను. తను తల పైకెత్తి చెప్పటం కొనసాగించింది.

మాది విశాఖపట్నం. ఫ్యామిలీతో శ్రీకూర్మం చూడాలని వెళ్ళి వస్తుండగా కారు చెడిపోయింది. అక్కా, బావా పాపని నా దగ్గర ఉంచి మెకానిక్‌ని తీసుకు రావటానికి వెళ్ళారు. ఇంతలో పాప ఆకలి అంటే ఇలా వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం. అక్కా వాళ్ళు వచ్చేస్తే కంగారు పడతారేమో అని తల ఎత్తి నా వైపు చూసింది.

అప్పటికే తన్మయత్వంగా తనని చూస్తున్న నా కళ్ళు తన చూపుతో కలిసాయి. ఏమనుకుంటుందో అనే స్పృహ కూడా లేకుండా నేను అలా చూస్తూ ఉండిపోయాను. తనే కాస్త కంగారుగా చూపు మరల్చుకుని “మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా?” అని అడిగింది.

నా జీవితం గురించి ఒక మనిషి నాతో మాట్లాడి దాదాపు పదేళ్ళయ్యింది. నా గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న ఒంటరితనాన్ని ఒక మృదువైన చేతితో ఎవరో ఆప్యాయంగా స్పృశించినట్టనిపించింది. సన్నటి నీటితెర కళ్ళను కమ్మేస్తూ ఉంటే కదిలిపోయాను.

“అవును ఈ లంకంత కొంపలో ఒక్కడినే ఉంటాను. నా పేరు గిరీష్. మా నాన్న ఒకప్పుడు ఈ ఊరిలో పేరు మోసిన డాక్టర్. అప్పటిలో బాగా సంపాదించేవారు. మా అమ్మని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళి ఇష్టంలేని బంధువులు మా నాన్నకి దూరం అయ్యారు. మా నాన్న ఊరికి దూరంగా ఈ ఇల్లు కట్టుకుని ఇక్కడికి మారిపోయారు. పదేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో అమ్మా,నాన్న చనిపోయారు. అప్పటి నుండి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నా.” చెబుతుంటే నా గొంతు మెల్లగా పూడుకుపోయింది. నేల వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాను. తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. గది మొత్తం నిశ్శబ్దం అలముకుంది. పాప ప్రశాంతంగా పడుకుంది.

“ఠంగ్ ఠంగ్ ఠంగ్” అంటూ వాల్ క్లాక్ గంటలు మొదలుపెట్టింది. తను ఉలిక్కిపడి అటువైపు చూసింది. పాప నిద్రలో నుండి లేచి భయంగా చుట్టూ చూస్తూ ఉంది. నేను కూడా గోడ మీద వేలాడుతున్న క్లాక్ చూసా. టైం తొమ్మిదవుతుంది.

 ఆమె లేచి పాపని ఎత్తుకుని “ఇక మేము వెళ్తాం. టైమయ్యింది అక్కా,బావా వచ్చేసుంటారు” అంది. అమె కళ్లలో ఏదో కంగారు, ఆందోళన కనిపిస్తుంది.

“వర్షం ఇంకా పడుతుంది. కాసేపు ఇక్కడే ఉంటే మంచిదేమో” అన్నాను తననే చూస్తూ.

“పర్లేదు” అంటూ ఆమె తలుపు వైపు దారితీసింది. ఇంకా అదే కంగారు.

“పోనీ నేనూ వస్తా మీ కారు వరకు. చీకట్లో ఒక్కరే కష్టం కదా” అని కదలబోయాను.

దానికి ఆమె “ప్లీజ్ వద్దు. ఏమీ అనుకోకండి” అని ముందుకు కదిలింది.

నేను మూలన ఉన్న గొడుగు అందించా “ప్లీజ్ ఇది కాదనకండి. వర్షం బాగా పెద్దదిగా ఉంది.”

ఆమె ఒక సెకెండ్ ఆలోచించి గొడుగు అందుకుని వేగంగా నడుచుకుంటూ చీకట్లో కలిసిపోయింది. నేను కిటికీలో నుండి చీకటిని చూస్తూ అలానే నిద్రపోయాను.

పొద్దున్నే నాన్న స్నేహితుడు రంగ మావయ్య తలుపులు బాదుతూ “గిరి గిరి” అని అరుస్తుంటే లేచాను. వర్షం వెలిసి సూర్యుడొచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తీసాను.

“ఏరా ఇప్పుడే లేచావా” అంటూ మావయ్య లోపలికి వచ్చి నా చేతిలో ఒక కవరుపెట్టి “ఉండు ఇద్దరికీ కాఫీ కలుపుతా” అంటూ కిచెన్‌లోకి వెళ్ళారు.

“ఈ కవరేంటి మావయ్య” అంటూ నేనూ వెనకే వెళ్ళాను.

“పెళ్ళి సంబంధంరా. మీ అత్తయ్య చూసింది. కవర్ తీసి ఫోటో చూడు” అని నవ్వారు మావయ్య.

ఆసక్తి లేకపోయినా మావయ్య కోసం తెరిచి చూసాను.

“స్నిగ్ధ. అవును స్నిగ్ధే” ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా నా మొహంలో తొంగి చూసాయి.

మావయ్య నాకు కాఫీ అందిస్తూ నా ఆనందం చూసి “ఓహో నచ్చిందన్నమాట” అని నవ్వాడు.

వీధిలో ఏదో గొడవగా ఉంటే బయటకి వచ్చాం నేనూ మావయ్య. ఆంబులెన్స్ వచ్చినట్టుంది. ఇద్దరం కంగారుగా రోడ్డు మీదకి వచ్చాం.

“గిరిబాబూ రాతిరి చూడనేదా? ఏడుగంటలేల పేద్ద యాక్సిడెంటయినాది. ఆయేల పోను చేస్తే ఇప్పుడుకొచ్చినారు ఈ ఆసుపత్రోలు.” అని చెప్పాడు పాలేరు కిట్టయ్య.

యాక్సిడెంట్ అయిన కారు నుండి శవాలు బయటకి తీసారు. “స్నిగ్ధ. అవును స్నిగ్ధే” నా గుండె క్షణ కాలంపాటూ అత్యంత వేగంగా కొట్టుకుని పగిలిపోయింది. కళ్ళు తెరుచుకుని ఆ భయంకర వాస్తవాన్ని చూస్తూ నిలుచుండిపోయాను. స్నిగ్ధతో పాటే పాప, ఇంకా ఎవరో ఇద్దరు భార్యా,భర్తల శవాలు.

“అయ్యో భగవంతుడా” రంగ మావయ్య షాక్‌లో ఉన్నారు.

నేను తేరుకుని “కిట్టయ్య యాక్సిడెంట్ ఎన్నింటికయ్యింది” అని అడిగాను.

“ఏడు గంటలప్పుడు బాబూ”

“కాదు తప్పు టైమ్ తప్పు. నిన్న తొమ్మిదికి మా ఇంటికి వచ్చారు వీళ్ళు” పిచ్చోడిలా అరుస్తున్నాను నేను. రంగ మావయ్య మరింత షాకయ్యి నా వైపు చూస్తున్నారు.

“లేదు సార్. సరిగ్గా ఏడు గంటలకే జరిగింది. నేనే ఫోన్ చేసాను హాస్పిటల్‌కి. అప్పుడే హాస్పిటల్ వాళ్ళకి టైమ్ కూడా చెప్పాను” అని ఖచ్చితంగా చెప్పాడు కిట్టయ్య కొడుకు.

నాకంతా అయోమయంగా ఉంది. కళ్ళు తిరిగి పడబోయాను. కిట్టయ్య, రంగ మావయ్య నన్ను జాగ్రత్తగా పట్టుకుని గోడకు చేర్పుగా కూర్చోబెట్టరు. చుట్టూ కంగారుగా చూస్తున్నాను. అస్పష్టంగా ఏదో గేటు దగ్గర కనిపించి అటు చూసాను. గేటుకు వేలాడుతూ నిన్న నేను స్నిగ్ధకిచ్చిన గొడుగు.

ప్రకటనలు

29 thoughts on “స్నిగ్ధ

  1. మొదటి

    ఏం మురళీ ..ఏంటి ఇంకా దెయ్యాల కథలు వదల్లేదా

    కారు ప్రమాదం అనగానే ..ఇంక అదే అనుకున్నా ..:)

    ఇది అరుపు ..
    “ఒక్కగానొక్క బిడ్డని కన్నులెదుటే పోగొట్టుకున్న తల్లి దుఃఖంలా రెండురోజుల నుండీ అంతనేది లేకుండా వర్షం కురుస్తుంది. ఆకాశం తను పోగొట్టుకున్న బంధాలేవో నేల మీద ఆత్రంగా వెతుక్కోటానికా అన్నట్టు మెరుపులు పదే పదే మెరుస్తున్నాయి. గుండెల్లో వణుకు పుట్టిస్తూ మధ్య మధ్యలో ఉరుములు. ఈదురుగాలుల దాటికి ఎక్కడో కరెంటు తీగలు తెగిపోయాయేమో కరెంటుపోయింది. కిటికీలో నుండి వచ్చిన చల్లనిగాలి ఇల్లంతా ఆక్రమించి వణికిస్తుంది.”

    ఇంగిల్పీసు పదాలు ఎక్కువైపోయాయి అనిపించింది.. తేలిక తెలుగు ప్రత్యామ్నాయాలు ఉన్న చోట కూడా ..

    లైట్స్ , కిచెన్ , వాల్ క్లాక్ , సెకండ్ ఇలా

    డాక్టర్ , ఆక్సిడెంట్ ఇవి పర్లేదు అనుకో ..

  2. నీ కథల్లో నాకు బాగా నచ్చే అంశాలు

    1> కథ మొదలు పెట్టే విధానం. మంచి భావుకతతో మొదలు పెడతావు ఏ కథనైనా.
    2> కథ ముగించే విధానం. ఒక ట్విస్టో, ఒక మంచి మెరుపో, గుండె మెలిపెట్టే విషాదమో లేకుండా కథని ముగించవు.

    మొత్తంగా నాకు స్నిగ్ధ చాలా నచ్చింది.

  3. ఆ మొదటి రెండు paragraphs సూపర్ …. narration అదిరింది …
    ఇంతకీ మీకు ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయండి బాబు ? నాకు ఇలా కథలు గాని కవితలు గాని రాయాలి అని పిచ్చి కోరిక కానీ … pchhhhh …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s