ముంగిలి » నివేదిక » e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక

e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక

నివేదిక ముందుగానే వ్రాయాల్సి ఉన్నా ప్రయాణ బడలిక, పని ఒత్తిడి వలన కాస్త ఆలస్యమయ్యింది. అయినా ఎదురుచూపులో ఉన్న హాయి మీకు తెలియనిదా? అసలు ఈ రెండు రోజుల్లో మేము విజయవాడనుండి మోసుకొచ్చిన అనుభూతులని మీతో పంచుకొని మరింతగా ఆస్వాదించాలని ప్రతీక్షణం అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. అనుకున్న ప్రకారమే చదువరిగారు, చావా కిరణ్‌గారు కూకట్‌పల్లి నుండి ఇన్నోవా లో బయలుదేరారు. మార్గంలో శ్రీనివాసరాజు దాట్ల, నేను, సతీష్‌కుమార్ యనమండ్ర గారు, అరుణ పప్పు గారు వారిని కలిసాం. అందరం మంచి చాయ్ ఒకటి కొట్టి ప్రయాణం మొదలు పెట్టాం. మొదటి విడతలో ఆంధ్ర రాజకీయాలు, తెలుగు సినిమాల గురించి చర్చతో ప్రయాణం సాగించాం. అల్పాహారం తీసుకున్నాక చర్చని కాస్త మార్చి e-తెలుగు తదుపరి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మన మితృలలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా ఎలా వినియోగించుకోవాలి? గత కొద్దిరోజులలో తాబేలు నడకను వీడీ కుందేలులా దూకుతున్న మనప్రగతి నిర్లక్ష్యం లేదా నైరాశ్యంతో కుంటుపడకుండా ఈ స్పూర్తిని ఇదేస్థాయిలో కొనసాగించటానికి తీసుకోవాల్సిన నిర్ణయాల పై చర్చ జరిగింది. ఏకపక్షంగా కాక భిన్న వాదనల మధ్య కొనసాగిన చర్చ చివరికి ఏమార్గం లో నైనా అందరం కలిసే నడుద్దాం అన్న నిర్ణయం తో ముగిసింది. ఆ చర్చ వివరాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. చర్చ ముగిసేంతలోనే విజయవాడ దగ్గరగా వచ్చేసాం. శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఎక్కడకురావాలో వివరాలు తీసుకుని అక్కడకు చేరుకున్నాం. ఒక 5 నిమిషాల్లో శ్రీకాంత్‌గారు వచ్చేసారు. ఆయన రూపం బ్లాగులోని ఫోటోకి కాస్త భిన్నంగా ఉంది. ఫోటో చూసి యువకులేమో అనుకున్నాం కానీ మధ్యవయస్కులు (శ్రీకాంత్‌గారు మీకు కోపం రాదుకదా? 🙂 ). శ్రీకాంత్‌గారు తమ ఇంటికి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. అద్భుతమయిన పాతడాబా ఇల్లు, పెద్దగా ఎత్తుగా ఉన్న ద్వారాలు, చెక్కమంచం, బీరువా నిండా పుస్తకాలు, ఇంటివెనక విరగ కాసిన ఉసిరిచెట్టు భలే అనిపించింది. నేను,చావాగారు ఎంతో ప్రయత్నం మీద నాలుగో ఐదో ఉసిరికాయలు తెంపాం. శ్రీకాంత్‌గారి ఇద్దరి పిల్లలూ ఎంతో ఒద్దికతో మమ్మల్ని వచ్చి పలకరించారు. శ్రీకాంత్‌గారి సతీమణి అన్నపూర్ణ గారు మాకు చల్లని మంచినీళ్ళతో ఆహ్వానం పలికారు. కాసేపు శ్రీకాంత్‌గారితో ముచ్చటించి, అందరం కాస్త సేదతీరాక భోజనాలు అవికానిచ్చి విజయవాడ ఆకాశవాణి కి చేరుకున్నాం.  

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

పద్మకళగారు వచ్చి అందర్ని ఆకాశవాణి లోకి తీసుకొని వెళ్ళారు. పేరు చూసి నడివయస్కులేమో అనుకున్నాం కానీ మళ్ళీ దెబ్బతిన్నాం. ఎన్నో ఏళ్ళ చరిత్రకలిగిన ఆకాశవాణిలో అడుగుపెడుతుంటే అందరిమనస్సుల్లో ఒక గొప్ప అనుభూతి కెరటంలా వెల్లువెత్తింది. “ఇప్పుడు సమయం 2 గంటలా 30 నిమిషాలు కావస్తుంది”, “మీరు వింటున్న ఈ పాట సాలూరు రాజేశ్వర్రావు స్వరసారధ్యంలో “,”ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ” ఇలా కొన్ని చిన్నప్పటి ఙ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. ఎందరో గొప్ప సాహితీ వేత్తలు, కవులు, గాయకులు, రంగస్థలనటులు, కళాకరులని మనకి అందించిన ఆకాశవాణిలో మేము మాట్లాడటం రవ్వంత గర్వాన్ని కలిగించింది. ఈ ఘనత e-తెలుగు చరిత్ర లో ఒక మైలురాయి. ముందుగా ప్రణాళిక లేక పోవటం చేత పద్మకళగారితో అప్పటికప్పుడు చర్చించి కార్యక్రమం మొదలు పెట్టాం. చదువరిగారు e-తెలుగు లక్ష్యాలు,సాదించిన విజయాల్ని గణాంకాలతో సహా వివరించారు. e-తెలుగు భవిష్యత్తు ప్రణాలికలు చెప్పారు. చావా కిరణ్‌గారు తెలుగు వికిపీడియా గురించి, బ్లాగుల గురించి చక్కగా వివరించారు. బ్లాగుల వలన గృహిణులకి,విధ్యార్దులకి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కావల్సిన ఎన్నో సలహాలు సూచనలిచ్చే బ్లాగులు తెలుగులో మనకు ఉన్నాయని,ముఖ్యంగా కనుమరుగయిపోతున్న ఆరోగ్యకరమయిన హాస్యాన్ని అందిచే బ్లాగులు ఎన్నో ఉన్నాయని చావాగారు వివరించారు. నేనుకూడా ఉడతసహాయంచేసాను. ఆవిధంగా అనుకున్నదానికంటే కూడా మంచిగా ఆ కార్యక్రమం ముగిసినది.  

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

అరుణ పప్పు, చావా కిరణ్

అరుణ పప్పు, చావా కిరణ్

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

పుస్తకప్రదర్శన ప్రాంగణం

పుస్తకప్రదర్శన ప్రాంగణం

ఆకాశవాణి లో చర్చ ముగిసినవెంటనే “వాక్ ఫర్ బుక్స్” ర్యాలీకి చేరుకొని, అప్పటికే మొదలయిన ర్యాలీ లో మధ్యలో దూరి e-తెలుగు బ్యానర్ ని ప్రదర్శిస్తూ నడక సాగించాం. అరుణగారు,చావాగారు ఒక జట్టుగా సతీష్‌గారు, శ్రీనివాస్ ఒక జట్టుగా బ్యానర్ పట్టుకొని కాస్త చొరవ తీసుకుని ర్యాలీ లో ముందుకు దూసుకుపోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాలీ పుస్తక ప్రదర్శనకి చేరుకున్నాక అరుణగారు మనకోసం ఒక చిన్న స్టాలులా బల్లలతో ఏర్పాటు చేసారు. బ్యానర్ కట్టినప్పటినుండి మన కార్యక్రమం మొదలు పెట్టేంతవరకు వచ్చిన జనమంతా అడిగిమరీ కరపత్రాలు తీసుకొని, తమ సందేహాలను సహితం తీర్చుకొని వెళ్ళారు. కార్యక్రమం సమయం కంటే కాస్త ముందుగానే స్టాలు ని ముగించి “ప్రతిభ వేదిక” వద్దకి చేరుకున్నాం. మన కార్యక్రమానికి తగ్గ పేరుగల వేదిక చూసారా? శ్రీకాంత్‌గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుర్చీలు వేయించటం, ప్రొజెక్టర్ ఏర్పాటులాంటివి చకచకా జరిగిపోయాయి. పద్మకళగారు మీడియా మితృలని పిలవటం, మన గురించి చెప్పటం, పరిచయం చేయటం వంటి పనులతో తీరికలేకుండా గడిపారు. కళగారి సహాయంతో 93.5 FM వారు, జీ న్యూస్ వారు మంచి కవరేజినిచ్చారు. ఉరుముల్లేని పిడుగులా జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్‌గారు వచ్చారు. వస్తూనే ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయిపోయారు. జీ న్యూస్ వారికి e-తెలుగు గురించి వివరించారు. చావా గారు, సతీష్ గారు 93.5 FM కి వివరాలు అందించారు.  

e-తెలుగుస్టాలు

e-తెలుగుస్టాలు

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

img_0185

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

ఆకాశవాణి సంచాలకులు ఆదిత్య ప్రసాద్ గారి వ్యాఖ్యానం తో కార్యక్రమం మొదలయ్యింది. చదువరిగారు ఆహుతలకి అర్దమయ్యేలా అంతర్జాలంలో తెలుగుని ఉపయోగించవచ్చని ఇది సులువైనది ఖర్చులేనిదని వివరించారు. అంతర్జాలంలో తెలుగు ఉపయోగాన్ని పెంచటమే e-తెలుగు లక్ష్యమని చెప్పారు. శ్రీధర్‌గారు రాకున్నా ఆయన వ్యాఖ్యానంతో ఉన్న వీడీయోల సహాయంతో కార్యక్రమం కొనసాగింది. చదువరి గారి సారధ్యం లో నేను కంప్యూటర్లో తెలుగు ఎనెబుల్ చేసుకోవటం, లేఖినిలో తెలుగు వ్రాయటం గురించి వివరించాను. చావాగారు బ్లాగు గురించి, బ్లాగులు ఎలా తయారు చేసుకోవాలి, తెలుగు వికిపీడీయా గురించి ఆసక్తికరంగా వివరించారు. శ్రీధర్‌గారు ఎంతో శ్రమతో తయరుచేసిన వీడీయోలు ప్రేక్షకులు ఆసక్తిగా చూసారు. కొందరు నోట్స్ వ్రాసుకోవటం కూడా కనిపించింది. కార్యక్రమం ముగిసిన వెంటనే అందరూ మా వద్దకి వచ్చి కరపత్రాలు తీసుకొని, అనేక సందేహాలని నివృత్తి చేసుకొని, వారి ఈ-మెయిల్ వ్రాసిచ్చి వెళ్ళారు. కొందరు చావాగార్ని అసలు వదిలిపెట్టనే లేదు. కార్యక్రమం ముగిసిన ఎంతోసేపటి వరకు మాతో మాట్లాడుతునే గడిపారు. ఇది నిజంగా మేమంతా ఆనందించిన విషయం. హైదరాబాద్ లో కంటే ఇక్కడ లభించిన స్పందన మాకు తృప్తిని మిగిల్చింది. అంతదూరం ప్రయాణం చేసి వెళ్ళినందుకు చాలా తృప్తికలిగింది. అక్కడితో అయిపోలేదు అంతవరకు హడావుడిగా సాగిన కార్యక్రమం, బ్లాగు మితృల ముచ్చట్లతో తేలిక పడింది. పుస్తకప్రదర్శన తిలకించటనికి వచ్చిన ఒక వ్యక్తికి e-తెలుగు బ్యానర్ కనపడింది మా వద్దకి వచ్చి పలకరించి తనని తాను పరిచయం చేసుకున్నారు. అప్పుడు తెలిసింది ఆయన మనందరికి చిరపరిచితుడైన గీతాచార్య అని. అందరం పోటో తీసుకుందాం అనుకునేంతలో హలో నేను కూడా బ్లాగర్నే నా బ్లాగు పేరు యువకుడు అంటు ఒక నవయువకుడు వచ్చాడు. అసలు ఊహించ కుండానే అంత మంది బ్లాగర్లు ఒకేసారి కలుసుకోవటం గమ్మత్తుగా అనిపించింది. కార్యక్రమం సాఫీగా జరగటానికి సహాయ పడిన శ్రీనివాస కర గారికి, శివరామ ప్రసాద్‌గారికి ఎంతో ఋణపడి ఉన్నాం. పుస్తక ప్రదర్శనలో అడుగుపెట్టినప్పటినుండి అన్ని పనులు తమ భుజానవేసుకుని నడిపించారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించిన ఒక పెద్దాయన తన పేరు సుబ్బారావు అని తాను కొత్తపాళీ గరి మామ గారినని పరిచయం చేసుకున్నారు. అందరం ఆయన్ని ఆప్యాయంగా పలకరించాం. ఈ వయస్సులో ఇంత చలిలో మనకోసం వచ్చినందుకు ఆయనకి ఏవిధంగా మనం ధన్యవాదాలు చెప్పగలం? కళగారి మితృడు సాయి మన కార్యక్రమ వివరాలు తెలుసుకుని ఆసక్తి తో మనకి ఎంతో సహాయం చేసాడు. కరపత్రాలను పంచి ఓపికగా అందరివద్దకి వెళ్ళి ఈ-మెయిల్ తీసుకుని నింపి కార్యక్రమం ముగిసేవరకూ ఉండి వెళ్ళారు. ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు  

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

ప్రముఖ రచయిత కేశవరెడ్డిగారిని కలిసి నేను,అరుణగారు e-తెలుగు కార్యక్రమాలు వివరించాము. ఆయన మన కృషికి అభినందనలు తెలిపారు. అలాగే చదువరిగారు పలువురు ప్రముఖులను కలిసి e-తెలుగు కార్యక్రమాలు వివరించారు. పుస్తకప్రదర్శనలో కార్యక్రమం ముగించుకొని శ్రీకాంత్‌గారి ఇంటికి చేరుకుని బడలిక తీర్చుకున్నాం. ఆరోజు సంగతులన్నీ ఒక్కసారి స్మరించుకున్నాం. శ్రీకాంత్‌దంపతుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం. శ్రీకాంత్‌గారు మాకూడా బయటకు వచ్చి మేము అల్పాహారం తినే వరకు మాతోనే ఉన్నారు. ఆయనకి కళగారికి మనం ఋణపడిపోయాం. ఆ స్మృతలన్నీ మూటగట్టుకొని హైదరాబాద్ దారిపట్టాం.మొన్న ఎలా జరుగుతుందో అన్న ఊహ, నిన్న నమ్మలేని నిజంగా మాముందు ఆవిష్కరింపబడి నేటికి ఒక మధుర ఙ్ఞాపకంలా అనుభవాల పెట్టెలోకి చేరుకుంది. నివేదికకి చిత్రాలని అందించిన శ్రీనివాసరాజు దాట్లకి ధన్యవాదాలు. నేను మరిచిపోయిన వ్యక్తుల వివరాలు, సంఘటనలు ఏమయినా ఉంటే మితృలు వ్యాఖ్యలరూపంలో అందించండి.

17 thoughts on “e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక

  1. అన్ని వివరాలతో చక్కగా రాసారు.
    “హలో నేను కూడా బ్లాగర్నే నా బ్లాగు పేరు యువకుడు అంటు ఒక నవయువకుడు వచ్చాడు”
    ఆ వచ్చింది నేనేనని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.
    నేను కూడా ఈ సభ గురించే ఒక చిన్న టపా రాసాను.
    మురళి గారూ థాంక్సండీ.

  2. బాగా రాసారు. టీవీలో యాక్షన్ రీప్లే లాగా ఉంది.

    అప్పుడే పరిచయమై, చొరవగా కరపత్రాలు పంచి, ఈమెయిలైడీలు సేకరించిన కుర్రాడు సాయిసతీష్ అనుకుంటాగదా!!

  3. నివేదిక చాలా బావుందండీ.. మొన్న హైదరాబాదులో.. నిన్న విజయవాడలో.. మీ అందరి సమిష్టి కృషి చూస్తుంటే ఎంతో ఆనందంతోపాటు ‘అయ్యో, ఇంత మంచి కార్యక్రమంలో నా వంతుగా ఏమీ చేయలేకపోయానే’ అన్న బాధ కూడా కలుగుతోంది 😦

  4. నివేదిక అక్కడక్కడా కాస్త కవితాత్వకమైన మెరుపులతో బాగా రాశారు మురళీ. మీ ఫొటోలెందుకు నొక్కుడు పడట్లేదు?
    విజయవాడలో చొరవ తీసుకుని ఈ కార్యక్రమాని అవసరమైన వసత్లు కల్పించి విజయవంతం చేసిన, పద్మకళ, శ్రీకాంత్, కర శ్రీనివాస్, శివరామ ప్రసాద్, తదితర బ్లాగు మిత్రులందరికీ హృదయ పూర్వక అభినందనలు.

  5. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » జనవరి బ్లాగావరణం

  6. ఈ విషయం ఎంతో ఆలస్యంగా చూసినా ఎడారిలో మృగతృష్ణ వలె ఎంతో ఆనందాన్నిచ్చింది.
    వృత్తి రీత్యా ఆంగ్లోపాధ్యాయుడ్ణయినా ప్రవృత్తి రీత్యా ఆంధ్రారాధకుడ్ణి
    శుభం భూయాత్.

  7. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

  8. పింగుబ్యాకు: Poddu » జనవరి బ్లాగావరణం

వ్యాఖ్యానించండి