పొద్దున్నే అయ్యప్ప పూజ చేసుకొని కిటికి తలుపు తెరిచా పక్షులింకా అప్పుడే బ్రష్ చేసుకోవటం మొదలు పెట్టాయి. నేను స్నానం కూడా చేసాను అని వాటికి తెలియాలని బట్టలు శబ్దంవచ్చేలా పదిసార్లు దులిపి తీగమీద వేసి వచ్చా. లేకపోతే సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ప్రతి ఒక్కడికి లోకువే. “మా లంచ్ అయితే గాని పక్కమీదనుంచి లేవని సాఫ్ట్ వేర్ వాళ్ళు” అని పక్షులు ఒక సామెత కూడా పెట్టేసుకున్నాయి. ఈ రోజుకి వాటి తిక్కకుదిరింది.
పిచ్చుక 1: కిచకిచ కిచ్ కిచ్ కీచ్ కీచ్ (తెలుగులో: ఏంటే మనోడు ఈ రోజు పొద్దున్నే లేచాడు. ఏంటి సంగతి?)
పిచ్చుక 2: కిచో కిచ కిచోకిచ కిచకిచే కిచ కిచకిచే కిచ కిచ్చు కిచ్చు కిచ్చు కిచ్చు (తెలుగులో: నిద్రపట్టక. మాబావ స్వాలో అమెరికా లోని లీమన్ బ్రదర్స్ లో గూడు కట్టుకొని ఉన్నాడు తెలుసుగా వాడు నిన్నే మెయిల్ పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యమని. అమెరికాలోని ఆర్ధికమాంధ్యనికి ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎలాగు మూసుకోవాలి. ఇళ్ళులేని భారతీయ పక్షులన్నింటికీ హైటెక్ సిటీ లో గూళ్ళు కట్టి అమ్ముకో అని. అదీ వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని నిద్రపట్టక లేచుంటాడు.)
వెంటనే నేను కిటికి మూసేసి, కర్టేన్ వేసి లోపలికి వచ్చేసా.
కాసేపు అష్టాచెమ్మా,గుడుగుడు గుంచం ఆడుకున్నాం. కోతికొమ్మచ్చి, కబడ్డీ, కర్రాబిళ్ళ ఆడుకుందామంటే స్థలాభావం. అందుకే “ఎక్కడి సెల్లులు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డీ” ఆడుకున్నాం.(ఆట నియమావాళి: 1.అందరూ నిజాయితీగా ఆడాలి. 2.రూం లో ఉండే వారు, అమీర్ పేట హాస్టల్లో ఉండేవాళ్ళు బయట వారిని ఆడించకూడదు. 3.కొద్దిరోజులముందే సెల్లు పోగుట్టుకున్న నాలాంటి వారిని ఆడించేప్పుడు తగిన జాగర్తలు తీసుకోవాలి. 4.మీ సెల్లు గాని దొంగ సెల్లు అయితే సెల్లు యజమాని ఉన్నప్పుడు ఆడరాదు. ఆట విధానం: 1 .మొదటగా పంటలు వేసుకోవాలి. (పొలం లో వేసేవి కావు.) 2.దొంగ ఎవరో తెలిసాక వాడి సెల్లు తీసి పండిన వారు దాచేయాలి. 3.దొంగ పసిగట్టకుండా ఎప్పటికప్పుడు స్థలాలు మార్చాలి. 4.చివరగా ఎవరు దాచినప్పుడు దొంగ సెల్లు పట్టేసుకుంటాడో వాడు తర్వాతి ఆటకి దొంగ. ముఖ్య గమనిక: ఇక్కడ చెప్పబడిన ఆటలో జాగర్తవహించకుండా ఆడి సెల్లు పోగొట్టుకుంటే దానికి పూర్తి భాద్యత జానారెడ్డి గారిది. నైతికభాద్యత వహిస్తూ అమ్మ ఆదేశానుసారం ఆయన రాజీనామా చెయ్యాలి. జై ఉండవిల్లి)
గతంలో ఎప్పుడూ అంత పొద్దున్నే లేచిన అనుభవంలేదు. ఆ టైం లో ఏం చేస్తారో తెలియదు. పోని బయటకి వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారో చూద్దమంటే చలి. ఇక గత్యంతరం లేక టి.వి. పెట్టా.
టి.వి.99: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి పిల్లనివ్వటానికి మీరు సిద్దమా? (మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.) మీ సమాధానం అవును అయితే ఎఱ్ఱగడ్డ పిచ్చి ఆసుపత్రి కి ఫోన్ చెయ్యండి. కాదు అయితే మీ పక్కింట్లో అద్దెకుండే సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు మీ అమ్మాయి మీద కన్నేసారు జాగర్త.
టి.వి.55: ఆర్ధికమాంధ్యంతో చివరికంటా పోరాడి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కుటుంబాలకి మీ సానుభూతి తెలియజేయాలనుకుంటే హైటెక్ సిటీ ముందు కొవ్వొత్తులని వెలిగించండి.
టి.వి. 100: @$!^*!*!)(*%%!$$
టి.వి. 1000000000000001: !@!^$%!!)*!*(!
టి.వి. ఆపేసి ఆఫీస్ కి బయలుదేరాను.
నేను: ఆటో లైఫ్ స్తైల్ కి వస్తావా?
ఆటోవాడు: 100 అవుతుంది.
నేను నా ట్యాగ్ తీసి మెడలో వేసుకున్నా.
ఆటోవాడు: సాఫ్ట్ వేరా?(సంతోషం సినిమా లో బ్రహ్మానందం డబ్బాపాలా అని అడిగినట్టు)
నేను: అవును. (దీనంగా మొహం పెట్టి)
ఆటోవాడు: ఊరుకోండి సార్. కష్టాలు సాఫ్ట్ వేర్ వాళ్ళకి కాకపోతే మనుషులకి వస్తాయా? ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు చేదోడు గా ఉండాలి. 30 ఇవ్వండి చాలు.
కట్ చేస్తే మొత్తానికి ఆఫీస్ కి వచ్చిపడ్డా. డబ్బుల్లేక ఆటోవాడికి సొడెక్సో ఇచ్చా. ఆఫీస్ లో అడుగు పెట్టగానే పవన్ గాడు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్నాడు.
నేను: “ఏమయ్యింది రా?”
పవన్: నాకు లీవ్ కావాలి రా. ఆర్.ఆర్.బి., బ్యాంక్ పుస్తకాలు కొనడానికి కోఠికి వెళ్ళాలి. సరోజ తెలుసు గా?
నేను: ఎవరు నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్న 20 లక్షలతో షాపింగ్ చేసిన అమ్మాయే గా ఎలా మరిచిపోతా?
పవన్: అవునవును. గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోకపోతే, నన్ను పెళ్ళి చేసుకోను అంది. పోని మరో అమ్మాయిని చుసుకుందామంటే అప్పులివ్వటానికి బ్యాంకులన్నీ ఎత్తేస్తున్నారుగా.
అని హడావుడి గా మా పి.ఎం. ని కలిసాడు. మా పి.ఎం. “ఏంటయ్యా నీ గోల? రోలొచ్చి మద్దెలకి మొరపెట్టుకోవటం అంటే ఇదే. ఇటు ఉద్యోగం సవ్యంగా లేక అటు స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బులుపోయి నేను ఏడుస్తుంటే? వెళ్ళి ఏదో ఒకలా తగలడు” అని పవన్ గాడిని పంపేసాడు. నేను వెళ్ళి నా క్యూబ్ లో కూర్చున్నా. హాసిని ప్రమోషన్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు తీసేసే కాలంలో ప్రమోషన్ ఏంటబ్బా నాకర్ధం కాలేదు. వాళ్ళ టీం లో ఉండే రాజేష్ ని అడుగుదామని కాల్ చేసా.
నేను: హలో
రాజేష్: అవును నేనే తాజ్ హోటల్లో చనిపొయింది. నా పేరు ఇమ్రాన్. మాది పాకిస్థాన్.
నేను వెంటనే బయపడి ఫొన్ పెట్టేసా. కాసేపట్లో కొందరు వైట్ డ్రెస్ లో వచ్చి రాజేష్ తో పాటు మరికొందర్ని గొలుసులు కట్టి తీసుకుపోయారు. జీవితంలో ఇచ్చిన ఒకేఒక్క సెమినార్ తో 10 మందిని మతిస్థిమితం లేకుండా చేసి హెడ్ కౌంట్ తగ్గించినందుకు హాసిని కి ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా మరిన్ని సెమినార్లు చెప్పించాలని మేనేజ్మెంట్ అనుకుంది. ఏదో మెయిల్ చూసుకుంటున్నా.
ఫోన్ వచ్చింది. “సర్! నేను హెచ్.ఎస్.బి.సి. నుంచి మాట్లాడుతున్నా క్రెడిట్ కార్డ్”
నేను: నాకొద్దు.
“ఏడ్చావ్. అదే మేమూ చెప్పేది మీ కార్డ్ క్యాన్సిల్ చేసా పో” ఫొన్ పెట్టేసింది.
నా ఖర్మకి ఏడ్చి కాఫీ త్రాగుదామని వెళ్తుంటే (ఆఫీస్ లో కాదు బాబు. ఆఫీసుల్లో ఎప్పుడో ఎత్తేసారు) మా పి.ఎం. వచ్చి హాసిని ఏదో సెమినార్ అంటా నువ్వుకూడా వెళ్ళు అన్నాడు. విషయం అర్దమయ్యింది “సార్ పొద్దున్నే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అప్పటి నుండి కడుపులో నొప్పిగా ఉంది ఈ రోజు కి ఇంటికి వెళ్ళిపోతా” అని చెప్పి ఆయన ఏం చెబుతున్నాడో కూడా వినకుండా వచ్చేసా.
బయట ఒక కుర్రాడు ఏవో కరపత్రాలు పంచుతున్నాడు. మెడలో ట్యాగ్ వేసుకొని ఉన్నవాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. నన్ను చూసి “గురూ తీసుకో పనికొస్తుంది” అని ఇచ్చాడు.
అందులో వివరాలు.. ప్రత్యమ్నాయ ఆదాయం కోసం కోచింగ్ సెంటర్. కోర్సులు
1. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా పల్లీలు, భఠాణీలు అమ్ముకోవటం ఎలా?
2. మిర్చి బజ్జీ తయారీ విధానాలు.
3. దర్జాగా వచ్చి సెల్లు,ల్యాప్పీ పట్టుకొని పారిపోవటం ఎలా?
4…….
5…….
అదిచదువుతూ ఆటోని పిలిస్తే ఆటో వాళ్ళు అదోలా నా వైపు చూసి వెళ్ళిపోతున్నారు. ఒక ముసలి ఆటోడ్రైవర్ వచ్చాడు. “రా బాబు. భాదపడకు. ఆ భాద నాకు తెలుసు నాకూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన కొడుకు,అల్లుడూ ఉన్నారు” అని కన్నీళ్ళతో ఆటోలో తీసుకు వచ్చి డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నాకేమి అర్ధం కాలేదు. నేను రావటం చూసిన నా శతృవులైన పిచ్చుకలు తినటం మానేసి వచ్చి అన్ని గుమిగూడి ఒకదాని రెక్కలు ఒకటి పట్టుకొని నా వైపు చూసి ఆనందంగా నవ్వుతూ అరకులోయలో గిరిజన యువతులు చేసే థింసా నృత్యం చేయటం మొదలు పెట్టాయి. “కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో” ఏరోజూ బియ్యం ఏరినప్పుడు కూడా ఒక్క గింజ వేసిన పాపాన పోలేదు నన్ను చూసి ఇంతలా పండగ చేసుకుంటున్నాయేంటి ఏం అర్ధం కాలేదు. బెల్ల్ కొడితే తలుపు తీసిన మా సన్నీ గాడు నన్ను చూసి భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.
నేను: “ఏమయ్యింది రా?”
సన్నీ: “నా ఉద్యోగం ఎలాగూ పోయింది. నీ ఉద్యోగం ఉందన్న ధైర్యం తో ఉన్నడబ్బులన్నీ పెట్టి బియ్యం కూరగాయలు తెచ్చేసా. గ్యాస్ ఆర్డర్ చేసా. లాండ్రీ కి బట్టలు కూడా ఇచ్చా. వా……ఆ డబ్బులే ఉంటే బస్సెక్కి అమలాపురం పోయి పాలవ్యాపారం చేసుకునేవాడిని.. వా….”
నేను: సరే ఇప్పుడేమయ్యింది?
సన్నీ: నీ చేతి లో ఆ పింక్ స్లిప్ ఏంటీ?
నేను: ఓర్ని చంపేసారు పో. అదా అందరు అలా అనుకోవటానికి కారణం.అది కరపత్రమ రా..బాబు.