“నాకు తెలుగు సంస్కృతియన్న ఇష్టము. తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగుభాషయందు మక్కువ ఎక్కువ.” అని చూపులు కలిసిన శుభవేళలో కోటా శ్రీనివాసరావు గారంటే మా సెడ్డ కామెడీ చేసాడ్రోయ్ అని నవ్వేసుకున్నాం కానీ ఆలోచించలేదు. మనం ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకొన్నాళ్ళకు హిస్టరీ చానెల్లో “పదికోట్లకు పైగా జనాభా కలిగిన ఒక భాష తన ఉనికిని కోల్పోయిందంటే, ఆ జాతి ఎంత నిర్లక్ష్యం చేసింది. అభివృద్దిలో ఎన్నో జాతులుకంటే ముందున్న తెలుగుజాతి ఎందుకు తన భాషను నిలుపుకోలేకపోయింది” అనే డాక్యుమెంటరీని ఆసక్తిగా చూసే పరిస్థితుల్లో మన భావి తరాలు ఉంటాయి. తెలుగుభాష ఎంత మధురమయినదో, ఎంత ఉన్నతమైనదో మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. చెప్పేటంతటి వాడిని కూడా కాదు. తెలుగు సాహిత్యం అమోఘం, అనంతం, అసామాన్యం. అంతటి గొప్ప భాష ఒక జీర్ణభాష కావల్సినదేనా?
మా తరానికి వచ్చేసరికే వాడుకభాష సృష్టిస్తున్న సునామీలో తెలుగు పదసంపద, పద్య సౌందర్యం కొట్టుకుపోయాయి. అంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విధ్యాసంస్థల్లో చదువుతున్న విధ్యార్ధులు తెలుగు చదవలేని, పలకలేని స్థితిలో ఉన్నారు. మరో దశాబ్ధానికి మనం ఏ స్థితికి చేరుకుంటామో ఊహించొచ్చు.
మనందరికీ భాష అంటే అభిమానముంది. మన తెలుగు సంస్కృతంటే మక్కువుంది. దానికి మన బ్లాగులు, మన అభిరుచులే సాక్ష్యం. తెలుగుభాష కనుమరుగవుతుందేమో అనే బాధ కూడా మనలో ఉంది. కానీ మన వృత్తి,వ్యక్తిగత ఒత్తిడుల వలన ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి అని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతున్న మన e-తెలుగు మిత్రులను అభినందించాల్సిందే. e-తెలుగు సభ్యులంతా మనలానే వృత్తిపరంగా అనేక ఒత్తిడులతో సతమతమవుతున్నా, సంస్థ కార్యక్రమాలకి మాత్రం సమయాన్ని కేటాయిస్తునే ఉన్నారు. ఈ సభ్యులందరివీ మనలాంటి మధ్య తరగతి జీవితాలే, మనలాంటి నిత్య జీవనమే. వీళ్ళకున్నవీ మనలాంటి ఆశలు,ఆశయాలు,అభిరుచులే. ఈ కార్యక్రమాలవలన వారిలో ఎవరికీ వ్యక్తిగతంగా ఒరిగేదేమీ లేదు. కానీ భాషకోసం వారు తపిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని సాకుతున్నంత ప్రేమగా భాషకు సేవ చేస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ధారపోస్తున్నారు.
e-తెలుగు ఇన్నేళ్ళ ప్రయాణంలో ఎందరో ప్రముఖులు భుజం తట్టారే కానీ తోడుగా వెన్నంటి రాలేదు. ఏ కార్యక్రమానికీ స్పాన్సర్లు కానీ, భూరి విరాళాలు కానీ లేవు. సభ్యులు తమ సొంత డబ్బు పెట్టుకుని కార్యక్రమాలు నడిపారు. కొందరు సభ్యులు అప్పుచేసి మరీ డబ్బులు పెట్టిన సందర్భాలున్నాయి. ఇంత చేస్తే కనీసం కార్యక్రమంలో పాలుపంచుకోవటానికి కూడా ఏ ఒక్కరూ తీరిక చేసుకోలేదు. ఖర్చుపెట్టిన ధనమంతా బూడిదలో పోసినా పన్నీరే అయ్యింది. అయినా ఎవరూ నిరుత్సాహపడలేదు. బిందువు,బిందువు కలిసి ఏదో ఒకనాడు సింధువవుతుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.
మన అమ్మ భాష కోసం కృషి చేస్తున్న వీళ్ళ శ్రమకు విలువ ఉందా? గౌరవం ఉందా? ఉండాలి. ఉండితీరాలి. ఆ గౌరవం మనమే కల్పించాలి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని ఒక మహాఉద్యమంగా మారుద్దాం.
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయ సంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో ఆందరికీ వీలుగా ఉండేందుకు వారంతంలో చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటల నుండి. తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువను ప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటాడానికి. మన అందరి రాక వారికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మునుముందు మరింత కృషి చేసే బలాన్నిస్తుంది. ఇది తెలుగువారిగా మన బాధ్యత.
రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.
తెలుగుబాట – ఆగష్టు 28న హైదరబాద్‌లో టపా కూడా చూడండి.
తెలుగుబాటకు ఆర్ధిక సహాయం చేయాలనుకునే వారు ఈ క్రింది ఖాతాలో జమచెయ్యొచ్చు.
Name: e-Telugu, Hyderabad
A/C No: 111910100029862
Bank: Andhra Bank
Branch: Kukatpally, Hyderabad
బ్రాంచి చిరునామా ఇది (కూకట్ పల్లిలో మూణ్ణాలుగు బ్లాంచీలు ఉన్నాయి. అందుకని అయోమయం రాకుండా.)
Address :
H NO.10-32-2,PLOT NO.3&4 , VIVEKANANDA NAGAR COLONY , KUKATPALLY,
City : KUKATPALLY, State : Andhra Pradesh, Pin : 500072
IFSC Code :ANDB0001119