బ్లాగర్ల ఆత్మీయ సమావేశం

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో తెలుగు వ్రాయటం లేక చదవటం ఇప్పుడు అత్యంత సాదారణమైన విషయం. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వాడగలిగేంత సరళమైన ప్రక్రియ. కానీ 10 ఏళ్ళ క్రితం టెక్నాలజీలో పని చేసే వాళ్ళకు కూడా తెలుగుని ఇంత విరివిగా కంప్యూటర్‌లో వాడుకోవచ్చనే అవగాహన లేదు. అసలు ఇంత విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు.

కానీ ఈ మార్పులు ఒక్క రాత్రిలో వచ్చేయలేదు. తెలుగు టైపింగ్ అంటే డిటిపి చేసే వాళ్ళకి ఇవ్వాలి, సాఫ్ట్‌వేర్లు కొనుక్కోవాలి అనే రోజుల నుండి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో సునాయాసంగా తెలుగు టైప్ చేసే రోజులకు వచ్చేసాం. దీని వెనుక ఎందరో ఔత్సాహికుల కృషి ఉంది.

IMG_0113

గూగుల్‌లో వెతికితే తెలుగు సమాచారం ఏమీ దొరకని రోజుల్లో అందరినీ తెలుగు వాడేలా ప్రోత్సాహించి, అవగాహన సదస్సులు నిర్వహించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిన e-తెలుగు గూర్చి ఈ రోజున తెలుగు టైప్ చేస్తున్న వారిలో ఎందరికి తెలుసు?

IMG_1571

కంప్యూటర్‌లో తెలుగు ఉంది చూడండి అని ప్రచారం చేసి, చేయిపట్టి అక్షరాలు దిద్దించినట్టుగా యూనికోడ్‌లో తెలుగు టైపింగ్ నేర్పించి, అవసరమైన సాఫ్ట్‌వేర్లను సిడిల్లో ఎక్కించి ఉచితంగా పంచిపెట్టి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఎంతో కృషి చేసిన సంస్థ e-తెలుగు. సంస్థ సభ్యులు తమ సొంత డబ్బులు పెట్టుకుని ఏ లాభాపేక్షలేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. వీళ్ళందరీనీ నడిపించిన చైతన్యం ఒకటే భాష మీదున్న అభిమానం.

ప్రతి ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్‌ని నిర్వహించి తెలుగులో బ్లాగుల వ్యాప్తికి ప్రోత్సహించటమే కాకుండా మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే ఒక బ్లాగు క్రియేట్ చేసి, దాని నిర్వహణ మీద అవగహాన కల్పించేవారు. కేవలం బ్లాగులే కాదు, తెలుగు వికీపీడియా వ్యాసాల అభివృద్దిలో కూడా పాలుపంచుకోమని ప్రచారం చేసేవారు. ప్రొపరైటరీ ఫాంట్స్ వాడే తెలుగు వార్తాపత్రికలకు, వెబ్‌సైట్స్‌కి యూనీకోడ్ వల్ల లాభాలు వివరించి, యూనికోడ్‌కి మారేలా ప్రోత్సహించారు. ఈ స్టాల్ నిర్వహణ కోసం సభ్యులు ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ వచ్చేవారు. ఈ కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు పని చేసానని చెప్పడానికి గర్వపడతున్నా.

ఈ విషయాలన్నీ తెలుగు బ్లాగుల్లో పాతపోస్టుల్లో ఎక్కడో మరుగునపడిపోయాయి. ఒక సౌకర్యవంతమైన నేటి వెనుక ఎందరిదో ఎన్నో రోజుల కృషి ఉంటుంది. అప్పుడప్పు ఇలా గుర్తు చేసుకోకపోతే, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే లావైపోతాం.

ఎన్నోరోజుల తర్వాత ఆనాటి బ్లాగర్లు, e-తెలుగు సభ్యులు ఈ ఆదివారం (05-01-2020) కృష్ణకాంత్ పార్కులో సమావేశమయ్యారు. మళ్ళీ e-తెలుగు ని చైతన్యవంతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరో ఉద్యమానికి ఇది నాంది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

blogmeet

ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…

 జీవితంలో మనం ఎప్పుటికీ మరచిపోలేని రోజులు, క్షణాలు అందరికీ ఉంటాయి, ఉండాలి. నిన్నటి రోజు నా జీవితం లో ఒక మధురమయిన రోజు. నా చెవులకి పరిచయమున్న ఒక పాటని నా కళ్ళకి పరిచయం చేద్దాం అని వెళ్ళి, ఆ మకరంద స్రవంతిని నా హృదయం నిండా నింపుకున్నా. కానీ తన్మయత్వంలో నా హృదయాన్ని అక్కడే వదిలేసి వచ్చా. మరలా వెళ్ళి తెచ్చుకుందామంటే ఈ సారి ఆత్మనో, అస్థిత్వాన్నో వదిలేసి వస్తానేమోనన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నా. మీలో ఎవరయినా గజల్ శ్రీనివాస్‌ని ఎరిగుంటే దయచేసి కాస్త నా హృదయాన్ని తెచ్చిపెట్టండి.

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

గజల్ శ్రీనివాస్ నిజానికి ఒక వేటగాడు. నిజం నమ్మరా? ఒక్కసారి అతన్ని కలిసి మాట్లాడండి మీకే తెలుస్తుంది. వెంటాడి, వెంటాడి భందిచేవాడ్ని వేటగాడు అనికాక పాటగాడని ఎలా అనుకోమంటారు? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో, గజల్‌తో వెంటాడుతారు. అందుకేనేమో ఆయనే అన్నారు “నా గజల్‌కి కత్తికున్నంత పదునుంది కాదంటారా” అని. ఎలా అంటామండీ ఆయన గజల్‌కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే. ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే. కాదు కాదు నాకు క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, పదే పదే మీ వద్దకు రాలేనుగా అన్నా. పదే పదే వెళ్ళలేకపోయినా కాశీ వెళ్తే మాత్రం గంగలో ఒక మునక వేస్తాం. అదే ఇంటిముందు పారితే గుడ్డలుతుకుతాం కాదంటారా అన్నారు. ఏమంటాం నవ్వాపుకోవటానికి, ఆ మాటల్లో లోతైన భావాలను అర్ధంచేసుకుని తేరుకోవటానికే చాలా టైం పట్టింది. ఆయన మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు. కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు. తన గజల్‌లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు. ఆపైన ఆరగించని వాడు, అరిగించుకోని వాడు శుద్ద వెధవాయి అని నే వేరేగా చెప్పాలా?

ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు ఏది మాటో ఏది పాటో తెలియలేదు. ఎందుకంటే ఆయన మాటలు, పాటలు మమేకమయిపోయి ఆ గాత్రం లో ఏంవిన్నా మాకు శ్రావ్యంగానే ఉంది. పైగా బొత్తిగా సంగీత ఙ్ఞానం లేదాయే. నావరకు చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే ఆయన మాటయినా, పాటయినా. పైగా పాట అంటే స్వరాలు, అనుస్వరాలు, సంగతులు కాదు. సాహిత్యాన్ని స్పష్టంగా శృతిలో శ్రావ్యంగా సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి అంటారాయన. ఆయన చెప్పేది ఒక్కటే తాన్‌సేన్‌లా రాగాలాపన చేయండి, లేదా వాగ్గేయకారుల్లా కీర్తనలు పాడండి. అంతేగానీ మహానుభావుల సంకీర్తనలను రాగాలతో కలిపి ముక్కలు చేసి, సాగదీసి హింసిచవద్దు. బొత్తిగా స్వర ఙ్ఞానం, సంగీత ఙ్ఞానంలేని నాకు కూడా ఆయన భావం అర్ధమయ్యింది, తిరిగి వ్రాయగలుగుతున్నా. అది ఆయన మాటల్లో వివరణలో ఉన్న శక్తి, సామాన్యుని హృదయానికి సహితం పట్టుకుంటుంది. అందుకేనేమో ఆయన అంటారు పిల్లల్ని ప్రతి తల్లిడండ్రులు బుర్రతో చదవమంటారు కానీ దయచేసి ఇకనుండి హృదయంతో చదవమని చెప్పండి అని. పిల్లలు అంటే ఆయనకి ఎంత ప్రేమో నిన్న ఆయన్ని చూసాక అర్ధమయ్యింది. మాతో మాట్లాడుతూనే, మధ్యలో వచ్చిన వాళ్ళ పాపని ముద్దు చేస్తున్నారు. తన వారసురాలింక ఆ పాపే, పేరు సంస్కృతి. నేటి ఆధునిక సమాజంలో పెద్దలు పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారో ఆలోచించుకోండి అని సూటిగా ప్రశ్నిస్తారాయన. రోజులో పిల్లలతో మాట్లాడేది కేవలం గంట సమయమే అయితే 16-20 ఏళ్ళల్లో ఎన్ని గంటలు గడపగలం? అటువంటప్పుడు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అంటారు. బయటకి వచ్చి మాకు వీడ్కోలు పలికి తిరిగి వెళ్తూ అక్కడ ఏడుస్తున్న ఎవరో చంటి పాపని బుజ్జగించి ఇంటిలోకి వెళ్ళరాయన. అదిచూసి అనిపించింది మాటల్లో ఏం చెబుతారో అది ఆచరించే వ్యక్తి అని.

మాటల్లోనే కాదు పాటల్లో ఏం చెబుతారో అదికూడా ఆచరిస్తారు. ఎప్పుడో జనాభా నియంత్రణ గురించి పాట పాడిన ఆయన అది తనజీవితంలో విధిగా ఆచరించి చూపించారు. అందుకే ఒక్క సంతానానికే పరిమితమయ్యారు. ఆయన అమ్మ గజల్‌తో, అమ్మ ని అమ్మగా ప్రతీ ఆంధృనికీ పరిచయం చేసేదాక నిదుర పోలేదు. నాన్న గజల్‌తో, తెలుగునాట ప్రతి తండ్రీ పూజింపబడేలా చేసారు. తెలుగు గడ్డని వదిలి వెళ్ళిన తెలుగు వాడ్ని “ఓనమాలు దిద్దిన బడి శిధిలమవుతూ, నిన్ను సెలవడిగింది” గజల్ తో పిలిచి, ఆ రాముని గుడి, నీవు నడిచిన వీధిరోడ్డు నీ క్షేమం అడిగాయని కలవరపరచి ప్రవాసాంధ్రులను ఇంటికి రప్పించారు. జీవనసమరంలో పట్టణాలకు వలసపోయిన నాలాంటి వారిని కూడా విడిచి పెట్టలేదు “ఒక్క సారి ఊరుపోయి రా” అన్న గజల్‌తో తెలియని అలజడి కలిగించారు. తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్లో,జీవన విధానంలో ఆయన గజల్ స్పందించని అంశాలు గానీ, స్పృశించని పార్శ్వాలు గానీ లేవేమో? ఎంత చిన్న విషయమైనా కూడా వదిలిపెట్టలేదు. ఎలా అంటే “ఇల్లు ఇల్లు లానే లేదు, తను ఊరినుండి ఇంకా రానేలేదు” అన్న గజల్లో భార్య ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేలా వినిపిస్తారు. తెలుగు సంకీర్తనల కోసమే వెంకన్న అన్నమయ్యని పుట్టిస్తే, తెలుగు సంగీత, సాహిత్యాలు సామాన్యుని ఆర్తిని,జీవన శైలిని పూర్తిగా తమలో ఇముడ్చుకోలేకపోతున్నాయని సాక్షాత్తు శారదాదేవే ఈ సరస్వతీపుతృన్ని మన తెలుగునాట పుట్టించిందేమో? పాట గొంతుతో కాదు ఆత్మతో పాడాలంటాడు ఆ గానగంధర్వుడు. సామాన్యుని జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆవిష్కరించలేకపోయానని ఆయన చెబుతున్నప్పుడు శూన్యంలోకి చూస్తున్న ఆయన కళ్ళలో ఒక నిరంతర శోధన కనిపిస్తుంది మనకి. సామాన్యుని ఆర్తి,భక్తి మన తిరుపతి వెంకన్నని కదిలించిందో లేదో గాని శ్రీనివాస్‌ని కరిగించింది. అందుకే ఆయన ఆర్తితో, ఆత్మనివేదనతో శ్రీ శ్రీనివాసం క్యాసెట్ రూపొందించారు. “పొడగంటి మయ్యా మిము పురుషోత్తమా..” అనలేని సామాన్యుని కోసం “ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి స్వామీ. వేడి వేడి అన్నంలో వెన్నపూస వేసిస్తా, ఆవకాయతో కలిపి గోరుముద్ద తినిపిస్తా” అని పాడి సామాన్యుడి ప్రార్ధన ఇలానే ఉంటుంది. కేవలం అన్నమయ్యదే ఆత్మనివేదనకాదు ఎందరో సామాన్యులదీ ఆత్మనివేదనే వారి భావాలు కూడా స్వామి వింటాడు అని చెబుతారు.

అందుకే ఆయన్ని డాక్టరేట్లే కాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వరించాయి. వీటి గురించి చెప్పటం నా వల్లకాదు. ఎందుకంటే ఆ చిట్టా ఆంజనేయుని తోకంత అవుతుంది. ఆయనకే ఇంటిలో పెట్టుకునే స్థలం లేక అటకెక్కించిన సత్కార, పురస్కార పత్రాలు, ఙ్ఞాపికలు ఎన్నో మాకు చూపించారు. భాదపడ్డారు, వీటికి మా ఇంటిలో అవమానం జరుగుతుందండీ అని. ప్రస్తుతం గాంధీ తత్వాన్ని ప్రపంచానికి పంచే పనిలో ఉన్నారు. ఇటీవలే 150 భాషల్లో పాడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగుని, తెలుగు సాంప్రదాయాన్ని ఆయన ఎంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే ఆయన ఇంటిని చూస్తే చాలు ఇట్టే తెలిసిపోతుంది. ముగ్గువేసి మధ్యలో రాగిపాత్రలో పువ్వులతో అతిధులని ఆహ్వానించే ముంగిలి. ఇంటినిండా తెలుగుదనాన్ని నింపుకున్న మట్టి బొమ్మలు, గోడలమీద ఏ చిత్రకారుడో తన కుంచెని తెలుగుదనంలో రంగరించి రంగుల్లో ఆవిష్కరించిన తైలవర్ణచిత్రాలు. ఆ ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. ఎ-తెలుగు కి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆయనకి భగవంతుడు చిరాయువునివ్వాలని, ఆయన సంకల్పించిన ప్రతి పనిలోని భగవంతుని దీవెన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను తమతో తీసుకు వెళ్ళిన సతీష్ యనమండ్ర గారికి, జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్ గారికి నా కృతఙ్ఞతలు.

ఒక మధుర ఙ్ఞాపకం

ఒక మధుర ఙ్ఞాపకం

జీవితంలో కొన్ని ఙ్ఞాపకాలు పాత పుస్తకాల్లోని గులాబీ రేకుల్లా, నెమలీకలా దాగి ఉంటాయి. కానీ ఈ ఙ్ఞాపకాలు వాటిలా జీవం కోల్పోవు. ఎప్పుడు తరచి చూసిన ఆ పరిమళం మన హృదయాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తునే ఉంటుంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ సెలవు….

గమనిక: గజల్ శ్రీనివాస్‌ని ఆయన,గారు అని సంభోదించలేదు కారణం “ప్రతి తెలుగువాడి గుండె గడపలో ముగ్గులేసి తెలుగు మీద ప్రేమని నింపుతా. ఏం చేయలేమంటారా? ” అన్నారు. ఆ మాటతోనే మాకు ఆప్తుడయిపోయాడు, మా ఇంటిలో ఒకడు అయిపోయాడు. ఇంక ఆయన్ని దూరం చేసుకోవటం నాకిష్టం లేదు.

e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక

నివేదిక ముందుగానే వ్రాయాల్సి ఉన్నా ప్రయాణ బడలిక, పని ఒత్తిడి వలన కాస్త ఆలస్యమయ్యింది. అయినా ఎదురుచూపులో ఉన్న హాయి మీకు తెలియనిదా? అసలు ఈ రెండు రోజుల్లో మేము విజయవాడనుండి మోసుకొచ్చిన అనుభూతులని మీతో పంచుకొని మరింతగా ఆస్వాదించాలని ప్రతీక్షణం అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. అనుకున్న ప్రకారమే చదువరిగారు, చావా కిరణ్‌గారు కూకట్‌పల్లి నుండి ఇన్నోవా లో బయలుదేరారు. మార్గంలో శ్రీనివాసరాజు దాట్ల, నేను, సతీష్‌కుమార్ యనమండ్ర గారు, అరుణ పప్పు గారు వారిని కలిసాం. అందరం మంచి చాయ్ ఒకటి కొట్టి ప్రయాణం మొదలు పెట్టాం. మొదటి విడతలో ఆంధ్ర రాజకీయాలు, తెలుగు సినిమాల గురించి చర్చతో ప్రయాణం సాగించాం. అల్పాహారం తీసుకున్నాక చర్చని కాస్త మార్చి e-తెలుగు తదుపరి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మన మితృలలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా ఎలా వినియోగించుకోవాలి? గత కొద్దిరోజులలో తాబేలు నడకను వీడీ కుందేలులా దూకుతున్న మనప్రగతి నిర్లక్ష్యం లేదా నైరాశ్యంతో కుంటుపడకుండా ఈ స్పూర్తిని ఇదేస్థాయిలో కొనసాగించటానికి తీసుకోవాల్సిన నిర్ణయాల పై చర్చ జరిగింది. ఏకపక్షంగా కాక భిన్న వాదనల మధ్య కొనసాగిన చర్చ చివరికి ఏమార్గం లో నైనా అందరం కలిసే నడుద్దాం అన్న నిర్ణయం తో ముగిసింది. ఆ చర్చ వివరాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. చర్చ ముగిసేంతలోనే విజయవాడ దగ్గరగా వచ్చేసాం. శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఎక్కడకురావాలో వివరాలు తీసుకుని అక్కడకు చేరుకున్నాం. ఒక 5 నిమిషాల్లో శ్రీకాంత్‌గారు వచ్చేసారు. ఆయన రూపం బ్లాగులోని ఫోటోకి కాస్త భిన్నంగా ఉంది. ఫోటో చూసి యువకులేమో అనుకున్నాం కానీ మధ్యవయస్కులు (శ్రీకాంత్‌గారు మీకు కోపం రాదుకదా? 🙂 ). శ్రీకాంత్‌గారు తమ ఇంటికి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. అద్భుతమయిన పాతడాబా ఇల్లు, పెద్దగా ఎత్తుగా ఉన్న ద్వారాలు, చెక్కమంచం, బీరువా నిండా పుస్తకాలు, ఇంటివెనక విరగ కాసిన ఉసిరిచెట్టు భలే అనిపించింది. నేను,చావాగారు ఎంతో ప్రయత్నం మీద నాలుగో ఐదో ఉసిరికాయలు తెంపాం. శ్రీకాంత్‌గారి ఇద్దరి పిల్లలూ ఎంతో ఒద్దికతో మమ్మల్ని వచ్చి పలకరించారు. శ్రీకాంత్‌గారి సతీమణి అన్నపూర్ణ గారు మాకు చల్లని మంచినీళ్ళతో ఆహ్వానం పలికారు. కాసేపు శ్రీకాంత్‌గారితో ముచ్చటించి, అందరం కాస్త సేదతీరాక భోజనాలు అవికానిచ్చి విజయవాడ ఆకాశవాణి కి చేరుకున్నాం.  

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

పద్మకళగారు వచ్చి అందర్ని ఆకాశవాణి లోకి తీసుకొని వెళ్ళారు. పేరు చూసి నడివయస్కులేమో అనుకున్నాం కానీ మళ్ళీ దెబ్బతిన్నాం. ఎన్నో ఏళ్ళ చరిత్రకలిగిన ఆకాశవాణిలో అడుగుపెడుతుంటే అందరిమనస్సుల్లో ఒక గొప్ప అనుభూతి కెరటంలా వెల్లువెత్తింది. “ఇప్పుడు సమయం 2 గంటలా 30 నిమిషాలు కావస్తుంది”, “మీరు వింటున్న ఈ పాట సాలూరు రాజేశ్వర్రావు స్వరసారధ్యంలో “,”ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ” ఇలా కొన్ని చిన్నప్పటి ఙ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. ఎందరో గొప్ప సాహితీ వేత్తలు, కవులు, గాయకులు, రంగస్థలనటులు, కళాకరులని మనకి అందించిన ఆకాశవాణిలో మేము మాట్లాడటం రవ్వంత గర్వాన్ని కలిగించింది. ఈ ఘనత e-తెలుగు చరిత్ర లో ఒక మైలురాయి. ముందుగా ప్రణాళిక లేక పోవటం చేత పద్మకళగారితో అప్పటికప్పుడు చర్చించి కార్యక్రమం మొదలు పెట్టాం. చదువరిగారు e-తెలుగు లక్ష్యాలు,సాదించిన విజయాల్ని గణాంకాలతో సహా వివరించారు. e-తెలుగు భవిష్యత్తు ప్రణాలికలు చెప్పారు. చావా కిరణ్‌గారు తెలుగు వికిపీడియా గురించి, బ్లాగుల గురించి చక్కగా వివరించారు. బ్లాగుల వలన గృహిణులకి,విధ్యార్దులకి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కావల్సిన ఎన్నో సలహాలు సూచనలిచ్చే బ్లాగులు తెలుగులో మనకు ఉన్నాయని,ముఖ్యంగా కనుమరుగయిపోతున్న ఆరోగ్యకరమయిన హాస్యాన్ని అందిచే బ్లాగులు ఎన్నో ఉన్నాయని చావాగారు వివరించారు. నేనుకూడా ఉడతసహాయంచేసాను. ఆవిధంగా అనుకున్నదానికంటే కూడా మంచిగా ఆ కార్యక్రమం ముగిసినది.  

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

అరుణ పప్పు, చావా కిరణ్

అరుణ పప్పు, చావా కిరణ్

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

పుస్తకప్రదర్శన ప్రాంగణం

పుస్తకప్రదర్శన ప్రాంగణం

ఆకాశవాణి లో చర్చ ముగిసినవెంటనే “వాక్ ఫర్ బుక్స్” ర్యాలీకి చేరుకొని, అప్పటికే మొదలయిన ర్యాలీ లో మధ్యలో దూరి e-తెలుగు బ్యానర్ ని ప్రదర్శిస్తూ నడక సాగించాం. అరుణగారు,చావాగారు ఒక జట్టుగా సతీష్‌గారు, శ్రీనివాస్ ఒక జట్టుగా బ్యానర్ పట్టుకొని కాస్త చొరవ తీసుకుని ర్యాలీ లో ముందుకు దూసుకుపోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాలీ పుస్తక ప్రదర్శనకి చేరుకున్నాక అరుణగారు మనకోసం ఒక చిన్న స్టాలులా బల్లలతో ఏర్పాటు చేసారు. బ్యానర్ కట్టినప్పటినుండి మన కార్యక్రమం మొదలు పెట్టేంతవరకు వచ్చిన జనమంతా అడిగిమరీ కరపత్రాలు తీసుకొని, తమ సందేహాలను సహితం తీర్చుకొని వెళ్ళారు. కార్యక్రమం సమయం కంటే కాస్త ముందుగానే స్టాలు ని ముగించి “ప్రతిభ వేదిక” వద్దకి చేరుకున్నాం. మన కార్యక్రమానికి తగ్గ పేరుగల వేదిక చూసారా? శ్రీకాంత్‌గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుర్చీలు వేయించటం, ప్రొజెక్టర్ ఏర్పాటులాంటివి చకచకా జరిగిపోయాయి. పద్మకళగారు మీడియా మితృలని పిలవటం, మన గురించి చెప్పటం, పరిచయం చేయటం వంటి పనులతో తీరికలేకుండా గడిపారు. కళగారి సహాయంతో 93.5 FM వారు, జీ న్యూస్ వారు మంచి కవరేజినిచ్చారు. ఉరుముల్లేని పిడుగులా జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్‌గారు వచ్చారు. వస్తూనే ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయిపోయారు. జీ న్యూస్ వారికి e-తెలుగు గురించి వివరించారు. చావా గారు, సతీష్ గారు 93.5 FM కి వివరాలు అందించారు.  

e-తెలుగుస్టాలు

e-తెలుగుస్టాలు

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

img_0185

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

ఆకాశవాణి సంచాలకులు ఆదిత్య ప్రసాద్ గారి వ్యాఖ్యానం తో కార్యక్రమం మొదలయ్యింది. చదువరిగారు ఆహుతలకి అర్దమయ్యేలా అంతర్జాలంలో తెలుగుని ఉపయోగించవచ్చని ఇది సులువైనది ఖర్చులేనిదని వివరించారు. అంతర్జాలంలో తెలుగు ఉపయోగాన్ని పెంచటమే e-తెలుగు లక్ష్యమని చెప్పారు. శ్రీధర్‌గారు రాకున్నా ఆయన వ్యాఖ్యానంతో ఉన్న వీడీయోల సహాయంతో కార్యక్రమం కొనసాగింది. చదువరి గారి సారధ్యం లో నేను కంప్యూటర్లో తెలుగు ఎనెబుల్ చేసుకోవటం, లేఖినిలో తెలుగు వ్రాయటం గురించి వివరించాను. చావాగారు బ్లాగు గురించి, బ్లాగులు ఎలా తయారు చేసుకోవాలి, తెలుగు వికిపీడీయా గురించి ఆసక్తికరంగా వివరించారు. శ్రీధర్‌గారు ఎంతో శ్రమతో తయరుచేసిన వీడీయోలు ప్రేక్షకులు ఆసక్తిగా చూసారు. కొందరు నోట్స్ వ్రాసుకోవటం కూడా కనిపించింది. కార్యక్రమం ముగిసిన వెంటనే అందరూ మా వద్దకి వచ్చి కరపత్రాలు తీసుకొని, అనేక సందేహాలని నివృత్తి చేసుకొని, వారి ఈ-మెయిల్ వ్రాసిచ్చి వెళ్ళారు. కొందరు చావాగార్ని అసలు వదిలిపెట్టనే లేదు. కార్యక్రమం ముగిసిన ఎంతోసేపటి వరకు మాతో మాట్లాడుతునే గడిపారు. ఇది నిజంగా మేమంతా ఆనందించిన విషయం. హైదరాబాద్ లో కంటే ఇక్కడ లభించిన స్పందన మాకు తృప్తిని మిగిల్చింది. అంతదూరం ప్రయాణం చేసి వెళ్ళినందుకు చాలా తృప్తికలిగింది. అక్కడితో అయిపోలేదు అంతవరకు హడావుడిగా సాగిన కార్యక్రమం, బ్లాగు మితృల ముచ్చట్లతో తేలిక పడింది. పుస్తకప్రదర్శన తిలకించటనికి వచ్చిన ఒక వ్యక్తికి e-తెలుగు బ్యానర్ కనపడింది మా వద్దకి వచ్చి పలకరించి తనని తాను పరిచయం చేసుకున్నారు. అప్పుడు తెలిసింది ఆయన మనందరికి చిరపరిచితుడైన గీతాచార్య అని. అందరం పోటో తీసుకుందాం అనుకునేంతలో హలో నేను కూడా బ్లాగర్నే నా బ్లాగు పేరు యువకుడు అంటు ఒక నవయువకుడు వచ్చాడు. అసలు ఊహించ కుండానే అంత మంది బ్లాగర్లు ఒకేసారి కలుసుకోవటం గమ్మత్తుగా అనిపించింది. కార్యక్రమం సాఫీగా జరగటానికి సహాయ పడిన శ్రీనివాస కర గారికి, శివరామ ప్రసాద్‌గారికి ఎంతో ఋణపడి ఉన్నాం. పుస్తక ప్రదర్శనలో అడుగుపెట్టినప్పటినుండి అన్ని పనులు తమ భుజానవేసుకుని నడిపించారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించిన ఒక పెద్దాయన తన పేరు సుబ్బారావు అని తాను కొత్తపాళీ గరి మామ గారినని పరిచయం చేసుకున్నారు. అందరం ఆయన్ని ఆప్యాయంగా పలకరించాం. ఈ వయస్సులో ఇంత చలిలో మనకోసం వచ్చినందుకు ఆయనకి ఏవిధంగా మనం ధన్యవాదాలు చెప్పగలం? కళగారి మితృడు సాయి మన కార్యక్రమ వివరాలు తెలుసుకుని ఆసక్తి తో మనకి ఎంతో సహాయం చేసాడు. కరపత్రాలను పంచి ఓపికగా అందరివద్దకి వెళ్ళి ఈ-మెయిల్ తీసుకుని నింపి కార్యక్రమం ముగిసేవరకూ ఉండి వెళ్ళారు. ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు  

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

ప్రముఖ రచయిత కేశవరెడ్డిగారిని కలిసి నేను,అరుణగారు e-తెలుగు కార్యక్రమాలు వివరించాము. ఆయన మన కృషికి అభినందనలు తెలిపారు. అలాగే చదువరిగారు పలువురు ప్రముఖులను కలిసి e-తెలుగు కార్యక్రమాలు వివరించారు. పుస్తకప్రదర్శనలో కార్యక్రమం ముగించుకొని శ్రీకాంత్‌గారి ఇంటికి చేరుకుని బడలిక తీర్చుకున్నాం. ఆరోజు సంగతులన్నీ ఒక్కసారి స్మరించుకున్నాం. శ్రీకాంత్‌దంపతుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం. శ్రీకాంత్‌గారు మాకూడా బయటకు వచ్చి మేము అల్పాహారం తినే వరకు మాతోనే ఉన్నారు. ఆయనకి కళగారికి మనం ఋణపడిపోయాం. ఆ స్మృతలన్నీ మూటగట్టుకొని హైదరాబాద్ దారిపట్టాం.మొన్న ఎలా జరుగుతుందో అన్న ఊహ, నిన్న నమ్మలేని నిజంగా మాముందు ఆవిష్కరింపబడి నేటికి ఒక మధుర ఙ్ఞాపకంలా అనుభవాల పెట్టెలోకి చేరుకుంది. నివేదికకి చిత్రాలని అందించిన శ్రీనివాసరాజు దాట్లకి ధన్యవాదాలు. నేను మరిచిపోయిన వ్యక్తుల వివరాలు, సంఘటనలు ఏమయినా ఉంటే మితృలు వ్యాఖ్యలరూపంలో అందించండి.