నువ్వు నేను ఓ ప్రేమ కాని ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

నువ్వేంటో నాకు ఎప్పుడూ అర్ధం కావు
నేను నీకు కూడా.

అవునంటావ్ కాదంటావ్.
నువ్వు అవునన్నా నాకు అనుమానం
కాదంటే ఆవేదన.

నేను నిన్ను నమ్ముతాను కానీ కొన్నిసార్లే.
నిలదీస్తే వదిలేస్తావేమో అని భయంతో నమ్మకం
నిజమా కాదా అనే అనుమానం.

నువ్వు సీతాకోకచిలుకనంటావ్
గువ్వనంటావ్
పావురాయినంటావ్.
నేను మాత్రం నీటిలో కొంగని
ఒంటికాలి పై నిలబడి
దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ.

అడక్కుండానే మనసులోకి చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?

నీకు నేను కావాలి
కానీ నాతో ఉండవు.
నువ్వులేకపోయినా నేను ఉండగలను
కానీ వదలలేను.

ప్రియా పాహిమాం పాహిమాం పాహిమాం

ఇంటిలో ఉన్న పాత పుస్తకాలన్నీ దులుపుతుంటే నేను కవితలు వ్రాసుకునే పుస్తకం కనిపించింది. పదేళ్ళక్రితం ఇంటర్ లో వ్రాసుకున్న కవితలు చాలావరకూ ఇమ్మెట్యూర్ అనిపించాయి. నాకు కాస్త గమ్మత్తుగా అనిపించిన ప్రేయసి దండకం ఇది. కొత్త కొత్త ప్రయోగాలు,కనీవినీ ఎరుగని పదాలు కనిపిస్తే కంగారు పడకండి.

విశ్వసౌందర్యానికి దాసోహం

విశ్వసౌందర్యానికి దాసోహం

ఓ ప్రియా,

మందారముఖి కమలాక్షి
కరుణామయి దయార్ద్రహృదయి
మదీయమానసచోర కోమలాంగి
నాదు హృదయగర్వభంగి
పాహిమాం పాహిమాం పాహిమాం

ననుభందించు నీకురులనుండి
బుసలుకొట్టు నీదు భృకుటీద్వయం నుండి
చురకత్తుల చూపులనుండి
నిట్టూర్పుల వడగాల్పులనుండి
పాహిమాం పాహిమాం పాహిమాం

మైమరపించు చిరునవ్వుల నుండి
ఆకర్షించు చెక్కిళ్ళ నుండి
తేనెలూరు పలుకుల నుండి
నీదువయ్యారపు నడకల నుండి
మంచువంటి మనసు నుండి
పాహిమాం పాహిమాం పాహిమాం

నీసోయగంబు వర్ణించ నేనెంతవాడినే
నీగుణగణంబుల్నెంచ నాకేమితెలుయునే
నీదు దాసుడన్,నిను సేవించు భక్తుడన్
నాయందు కరుణించి చీత్కారముల్ విడచి
కటాక్షవీక్షణముల్ ప్రసరించు

నాపై నీప్రేమామృతము కురిపించు
దేవి కారుణ్య హృదయి
పాహిమాం పాహిమాం పాహిమాం

వాడిన గులాబీరేకులు

వాడిన గులాబీరేకులు

వాడిన గులాబీరేకులు

ఙ్ఞాపకాల పుస్తకాల్లో దాచుకున్న గులాబీలు

వాడిపోయాయి

పరిమళం పోయింది

తాకితే రెక్కలు రాలిపోయాయి

రెక్కల్ని తరచి తరచి తాకి చూస్తే

పరుచుకుంటున్న దృశ్యాలు

దృశ్యాల వెంట పరిగెడుతుంటే

ఎన్నో మలుపులు

ప్రతి మలుపులోనూ చిక్కుకున్న భావాలు

అప్పుడు దాచుకోలేక ఇప్పుడు ఏరుకుంటున్నా

ఎవరో తొంగి చూసారు

పుస్తకం మూసేసా భయంతోనో, అపరాధ భావంతోనో

ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.

Heart_Broken_by_Blackmago

She Broke My heart

ఆమె ఎప్పటిలానే నన్ను వదిలి వెళ్ళిపోయింది.

వీధి దీపాల్లో నేను వ్రాసే పిచ్చిరాతల్లో జీవితం లేదని వెళ్ళిపోయింది.

కళ్ళలో కోటి ఆశలు, ఏన్నో ఊహలు,కలలు

వీటిలో ప్రాక్టికాలిటీ లేదని వెళ్ళిపోయింది.

దూరంగా ఆకాశం, నేల కలిసిపోతుంటే

అనందంతో గంతులు వేస్తున్న నన్ను చూసి

వీడింతే లోకం తెలియని వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.

సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను

సంభ్రమంగా చూస్తున్న నన్ను చూసి

వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో అని తేల్చేసి వెళ్ళిపోయింది.

తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు

తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు

పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.

తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో.

నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో .

ఈ ఊరికి ఆ ఊరు,ఆ ఊరికి ఈ ఊరు ఒకే దూరంలో లేవెందుకో?

ఆమె,నేను,కొన్ని ఊహలు..

nuvvu nenu vennela

నువ్వు నేను వెన్నెల

1.నువ్వు లేకుండా ఒక్కసారయినా వెన్నెలలో గోదావరి ఒడ్డున నడవాలనుకున్నా. గోదారమ్మ పున్నమినంతా కలిపి నీలా మార్చేసింది.
నాకు కోపం వచ్చి “ఏం తనులేకుండా నేను బ్రతకలేనా? ఒక్కరోజు తను లేని ఏకాంతం కావలని అన్నా గా. ఎందుకిలా చేసావ్?” కోపంగానే అడిగా గోదారమ్మని.
గోదారమ్మ నవ్వి “ఏకాంతం అంటే తను నీ పక్కనలేకపోవటం కాదు. నీ మనసు నుండి పక్కన పెట్టి చూడు” అని వెళ్ళిపోయింది.

2.దేవుడు నాకు ఒక పరీక్షపెడతా అన్నాడు.
ఒక పెద్ద మైదానంలో కోటి తారలని,అప్సరసలని,ప్రపంచ సుందరీమణులని,రాకుమారిలని తెచ్చి కూర్చోబెట్టి.
ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు.నువ్వు ఎక్కడున్నావో కనుక్కోమని.
నేను కళ్ళు మూసుకుని “నువ్వు లేకుండా ఒక్క క్షణమయినా బ్రతకలేనని తెలుసు కదరా. ఎక్కడున్నావు?” అని మనసులో అనుకున్నా.
మైదానం మధ్యలో ఒక స్పందన కనిపించింది. నువ్వు లేచి నిలబడ్డావు
దేవుడు నవ్వి “తను నీతో ఉండగా నిన్ను ఓడించటం నా వల్ల కాదు” అని వెళ్ళిపోయాడు.

3.చిన్నప్పుడు అమ్మ చందమామ రావో జాబిల్లి రావో అని అందమయిన అబద్దం చెప్పింది. అది నిజంకాదని తెలిసాక చాలా ఏడుపొచ్చింది.
చాలాసేపు కూర్చుని ఏడ్చాను. దేవుడొచ్చి ఏడవకయ్యా. నీకోసం ఒక చందమామ ఉందిలేవయ్యా అని తన చేతిలో నిన్ను చూపించాడు. అప్పటినుండి వెతికితే ఇప్పటికి కనిపించావు.

4.నా కళ్ళు మూయాలని నా వెనుకగా నువ్వు వస్తూ ఉంటే నీ పాదాల కదలికలకి నీ మువ్వలు చేసే సవ్వడి, ఆ అలికిడికి నేను వెనుకకు తిరిగితే దొరికిపొయానని నువ్వుపెట్టే బుంగమూతి.అలా నిన్ను హత్తుకోబోతే సిగ్గుతో దాచుకునే నీ మోము. నా భుజం పైన తల వాల్చేప్పుడు నీ మౌనం. ఇవి చాలు వేల సంవత్సరాలు దాచుకోవటానికి.

5.ఓటమిలో ఓ ఓడిలో చేరి ఏడ్వాలని వాలిపోతున్న నా తలని నిమిరే చేయి, గెలుపులో నా అనందాన్ని పదింతలు చేసే నీ కౌగిలి, తెల్లవారే ఉత్సాహాన్నిచ్చే నీ తొలిముద్దు, సాయంత్రం అలసి ఇంటికి వస్తే నన్ను సేదతీర్చే నీ చిరుముద్దు ఇంతకంటే ఏం కావాలి నువ్వు నాకోసమే పుట్టావని నమ్మటానికి. బదులుగా నేనేమివ్వను రా? మోకాళ్ళ పై వంగి నా సమస్తాన్ని నీ పాదాక్రాంతం చేసి నీకు దాసోహం అంటున్నా.

మళ్ళీమొదలయ్యింది

beauty

 

ఎందుకిలా అన్నిచోట్లా నువ్వే కనిపిస్తావ్?
ఈ పిల్లకి అసలు కుదురులేదంటారు.

*** *** ***

గడిచిన నిమిషంలో
నిన్ను ఒక్కసారే తలుచుకున్నా.
ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా?

*** *** ***

ఈ ఒక్కరోజు నవ్వకుండా ఉండరాదూ?
ఒంటిమీద నగలన్ని వెలవెలబోతున్నాయి.

*** *** ***

దేవుడు నిన్ను ఆడిపోసుకుంటున్నాడు
ఏ మంత్రం వేసావో ఏ మాయ చేసావో అని
నేను గుడికి వెళ్ళి ఏడాది దాటిందిమరి.

*** *** ***

దోసిలిలో చినుకుల్ని దాచుకొచ్చా
నీ పెదాలనో లేదా పాదాలనో చేరి
ముత్యాలవుతాయని.

నేను కవినా? కానా?

కోటి వెన్నెలల రాశి
కోటి వెన్నెలల రాశి

ఈ టైటిల్ కి సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళకి నా గత టపాల టైటిల్ గుర్తుందని నమ్ముతూ. ఇక చదవండి.

ఈ రోజు అమావాస్యంట
ఆకాశం వైపు చూసారేమో
ఓ సారి నువ్వు కనబడిరాకూడదూ.

    *****

నెలగంటు పెట్టారంట
సాయంత్రం బయటకిపోకు
చంద్రుడివసలే దిష్టికళ్ళు.

    *****

వేసవిలో వాకిట్లో మంచం
నిదురలో నీ అందం చూస్తూ
సూర్యుడు ఉదయించటం మరిచిపోయాడు.

    *****

ఓ వర్షాకాలం సాయంత్రం నవ్వుతూ నువ్వు
చినుకులు కోటి అద్దాలు
నా కళ్ళముందు ఇంద్రధనస్సు.

    *****

పాడు శీతాకాలం మల్లెలు లేని నీ జడ
ఆకాశానికి కోపం వచ్చిందేమో
మంచుపూలు నీ వాకిట్లో.

నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..

best friends

best friends

ఏటి ఒడ్డున ఇసుక మేటలు
ఓ నాలుగు చేతులు
గంటలో రాములోరి గుడి.

ఊరి మధ్యలో రాములోరి గుడి
గుప్పిట్లో కొబ్బరి ముక్క ప్రసాదం
కాకి ఎంగిలి.

ఊరి చివర జాతర
చేరో చేతిలో రూపాయి
పుల్ల ఐసు, రంగులరాట్నం.

లెక్కల మాష్టారి కోపం
ఒక చేతి పై వాత
నాలుగు కళ్ళలో నీళ్ళు.

పుట్టినరోజు పండగ
నాన్న ఇచ్చిన క్యాడ్బరీ చాక్లెట్
సగం సగం.

ఊరిలోకొచ్చిన కొత్తమ్మాయి.
బాబాయి హీరో సైకిల్
చెరో రౌండ్.

వాచీ పాతబడింది
పదవతరగతి పరీక్షలు
చేరో రైలు బెంగులూరు, హైదరాబాద్.

జుత్తు నెరిసింది
పిల్లల పెళ్ళి
రెండు మనసుల్లో తడారిపోని స్నేహం.

బిచ్చగాళ్ళు

బిచ్చగాళ్ళు వీళ్ళంతా బిచ్చగాళ్ళు
చితికిన బ్రతుకులు
చిరిగిన బట్టలు
ఇవే వారి జీవితాలు.

ప్రొద్దున్నే లేస్తారు
గుడి మెట్ల పై చేరతారు
భక్తులకై ఎదురు చూస్తారు.
వచ్చిన వారు కొందరు వీరిని చూడరు.
కొందరు చూసి చూడక పోతారు.
ఎవరో ఓ నాణెం వేస్తారు.
వారికోసమే ఈ ఎదురు చూపు.

ఎదురు చూపులు మలిసంధ్య ఆకాశం లా ఎరుపెక్కితే
చీకటి వేళ ఎప్పుడో ఇల్లు చేరతారు.
ఓట్లుతిన్న నాయకుల్లా కాక
ప్రతి నాణెనికి, దానానికి పుణ్యం ఇస్తారు.

ఎవరికి తెలుసు వీరి జీవితాలు
ఎవరికి కావాలి వీరి చిట్టాలు
ఙ్ఞాపకాల దొంతరలో

ప్రతి ఏడు పంటలేక
చేసిన అప్పులు తీర్చలేక
పొలం హలం అమ్మివేసి
జోలెపట్టిన రైతులు వీరు.

ఆడపిల్ల పెళ్ళి చేసి
అల్లుడు ముచ్చట తీర్చి
అప్పులపాలై అభిమానం చచ్చి
గత్యంతరం లేని మాజీ గుమస్తాలు వీరు.

తాతలనాటి పరువుకోసం
ఉన్నదంతా ఖర్చుచేసి
గొప్పల డబ్బాలు కొట్టి
దిగజారిన జమిందారులు వీరు.

దేవుడిచ్చిన అవిటితనం
తాతలిచ్చిన పేదరికం
వారసత్వంగా వచ్చి
పనులు చేయలేక
ఇంటివారికి భారం కాక
ఇటువచ్చిన వికలాంగులు వీరు.

బిచ్చగాళ్ళు వీళ్ళంతా బిచ్చగాళ్ళు
చితికిన బ్రతుకులు
చిరిగిన బట్టలు
ఇవే వారి జీవితాలు.