సంకురాతిరొచ్చింది మా పల్లెకి…

మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. పోస్ట్-మ్యాన్ రామయ్య తన పాత సైకిల్ పై చెమటలు కక్కుతూ వస్తున్నాడు. అసలే పండగ సమయం ఎవరయినా ఏవయినా మామూలు ఇస్తారేమో అని ఆలస్యం కాకుండా ఉత్తరాలన్నీ ఇచ్చేస్తున్నాడు. రామయ్య పదవీవిరమణ చేసినా సరే ఆ ఊరికి వేరే పోస్ట్-మ్యాన్ రాకపోవటంతో అతన్నే ప్రభుత్వం ఆ పనిలో కొనసాగిస్తోంది. రామయ్యకి కూడా ఆ ఉద్యోగం తప్పని సరి కాబట్టి చేస్తున్నాడు. రామయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆ విషయం రామయ్య చెబితే గాని మనబోటి వాళ్ళకి తెలియదు. మనకే కాదు రామయ్య ఇక్కడున్న సంగతి అసలు ఆ కొడుకుకే తెలియదు. ఎందుకంటే “ఇంజనీరింగ్ చదివించటానికే చాలా ఖర్చు ఆయ్యింది, ఇప్పుడు నిన్ను పై చదువులకోసం అమెరికా పంపించలేను, అసలే చెల్లి పెళ్ళి కూడా చేయాలి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకో” అన్నాడు రామయ్య. కానీ “నేను నిన్ను పంపిస్తా నాకూతుర్ని పెళ్ళి చేసుకుంటే” అన్నమాట తో రామయ్య కొడుకుని ఎగరేసుకుపోయాడు దగ్గర రా’బంధువొకడు ‘. పెరట్లో ప్రేమగా పెంచిన చెట్టు తుఫానుకి నేలకొరిగితే ఎలా ఉంటుందో గానీ, చెట్టంత ఎదిగిన కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతే. రామయ్య భార్య చాలా బాధపడింది, అలిగింది, ఏడ్చింది, శాపనార్ధాలు పెట్టింది కానీ అవేవి అమెరికా లో ఉన్న కొడుకుని చేరలేదు. అవును మరి అమెరికా చేరేంత ఖరీదయినవి కాదుగా మన ఏడుపులు. మనకే లేదు స్థోమత ఇంక మన తిట్లకి ఎలా వస్తుంది. అందరి సందేశాలు బట్వాడా చేసే పోస్ట్-మ్యాన్ బాధలు మాత్రం ఎవరూ అమెరికా లోనికొడుక్కి బట్వాడా చేయలేకపోయారు. రామయ్య మాత్రం “నేను తండ్రినయ్యా, వ్యాపారిని కాను పెట్టుబడి పెట్టి లాభం లేదనుకోటానికి. రెక్కలొచ్చిన పక్షులు తలో దిక్కు చూసుకుంటాయి, అంతే గాని ఇంకా ఈ దిక్కుమాలిన బ్రతుకుని కోరుకుంటాయా? రేపు పెళ్ళయ్యాక ఈ ఆడపిల్ల కూడా వెళ్ళిపోతుందే గాని ఈ చూరు పట్టుకుని వేలాడతుందా మన పిచ్చి గాని” అని నిర్వేదంగా నవ్వేస్తాడు. ఆ నవ్వుని భద్రపరిచే సాధనం లేదేమో మానవ మేధస్సులో. ఉంటే చాలా ఖరీదే చేస్తుంది. అతని గుండె నిబ్బరం అపోలో వాళ్ళు తెలుసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తల్లితండ్రుల గుండె నొప్పులకి మందు తయారు చెయ్యొచ్చు.

ఈ రోజు సుబ్బయ్య మాష్టరికి ఉత్తరం వచ్చింది. సుబ్బయ్య నిజానికి ఏ స్కూల్ లోనూ పనిచేయలేదు. ట్యూషన్లూ చెప్పలేదు. ఆయన ఒక వంటమాష్టర్ ఊర్లో కధలకి, కార్యాలకి వంట చేస్తాడు. ఆయన బృందం వంటల్లో ఆ జిల్లాలోనే పేరు గడించింది. ఆయన చేతివంట చలవ వలన కార్యం జరిగిన ప్రతి ఇంట్లోనూ శుభమే. అలా ఆయన సుబ్బయ్యమాష్టారుగా స్థిరపడిపోయారు. రామయ్య సైకిల్ చప్పుడు వినగానే ఇంటి బయటకి పరుగున వచ్చినవి, కిటికీలు తీసి ఆశగా గమనించేవి చాలా చూపులు ఆయన్ని తాకాయి. ఆయన గుండె నిబ్బరం మనకి తెలియనిదా అందుకే ఆయన ఆ చూపులకి బేలగా అయిపోలేదు. ముందుకి సాగిపోయాడు. సుబ్బయ్య గారింటికి వచ్చి కూర్చున్నాడు. అంతే ఊరంతా సుబ్బయ్య ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలాంటి కవరు ఉత్తరాలు ఆ ఊరిలో మోతుబరి వీరయ్యకి, రామాలయం పంతులు శాస్త్రికి వారం రోజులు ముందే వచ్చాయి. సుబ్బయ్య మాష్టరి అర్ధాంగి సీతమ్మ రామయ్య ఉత్తరం తో ఇంటి ముందు అడుగుపెట్టేసరికే తొందరగా వంట గదిలోకి పోయి ఒక చేతిలో మజ్జిగ, మరో చేతిలో కజ్జికాయలు, జంతికలు పెట్టిన క్యారేజు తెచ్చి రామయ్యకి ఇచ్చింది. ఉత్తరం అందుకొని సుబ్బయ్య గారికోసం చూస్తే ఆయన కనబడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతుంది “వదినా! ఆయన గానీ అన్నయ్యగారి దగ్గరకి వచ్చారా?” “చెల్లాయ్! బావగారిని గాని చూసావా” అందరూ లేదన్న మాటే ఆమె మాత్రం ఆతృతతో వీధిలో అన్ని గుమ్మాలు తిరిగేస్తుంది.

రామయ్య పండగ మామూలు దొరక్కపోయినా తన భార్యకి పండగకి కజ్జికాయలు పెట్టొచ్చన్న ఆనందాన్ని మిగుల్చుకుని ఇంటికి బయలుదేరాడు. మరలా అవే చూపులు, సాయం సంధ్యలో చీకటిని తరిమే శక్తిలేక దాసోహం అన్న అరుణ సూర్యుని వంటి కళ్ళతో, తనని తాకి పరికిస్తున్నాయి. తాను మాత్రం చూపు మరల్చకుండా సూటిగా చూస్తూ తన ఇంటిదారిపట్టాడు. రామాలయం లో ఉన్న సుబ్బయ్య మాష్టారికి మొత్తానికి విషయం తెలిసి ఇంటికి బయలుదేరాడు. ఇందాక రామయ్యని తాకిన అవే చూపులు సుబ్బయ్యని కూడా వదిలిపెట్టలేదు. కానీ ఆ చూపుల్లో ఇప్పుడు ఆశలేదు. కాస్త అసూయ, కాస్త అభినందన. సుబ్బయ్య మొహంలో ఎప్పుడూ చూడని ఒక వింతకాంతి. పెదవుల్లో దాగని చిరునవ్వు. అంతకంటే అసూయపడటానికి ఇంకేం కావాలి? సుబ్బయ్య ఇంటికి వస్తూనే “ఏమేవ్! కవరు ఎక్కడపెట్టావ్?” అంటూ గుమ్మంలో అడుగు పెట్టారు. ఆయనకి ఉత్తరం అందించి సీతమ్మ తన పొరిగింటి లక్ష్మితో “చూసావా వదినా ఆ ముఖం ఎలా వెలిగిపోతుందో. మా పెళ్ళినాడు కూడా ఇంత ఆనందం నేను చూడలేదు.” అని ఆటపట్టించింది. సుబ్బయ్య సిగ్గుపడుతూ కవరు తో సహా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

గదిలో మంచం మీద తీరుబడిగా కూర్చుని తన పాత కళ్ళద్దాలతో కాసేపు కుస్తీ పట్టి, కవరు చించి పదిసార్లు చూసుకుని, హాయిగా పడుకున్నాడు. మంచినీళ్ళ గ్లాసుతో లోనికి వచ్చిన సీతమ్మ సుబ్బయ్య పడుకోవటం చూసి, వంట గదిలోకి వచ్చేసింది. ఇంక తన ఏర్పాట్లు తాను చేసుకుంటుంది. కజ్జికాయలు, సున్నుండలు, అరిసెలు అన్నీ స్టీల్ క్యాన్లలో పెట్టింది. జంతికలు పెట్టడానికి సామాన్లు ఏవీ ఖాళీ లేవు. పక్కింటి వాళ్ళని అడిగి ఒక క్యాన్ తెచ్చి కట్టింది. రాత్రి వరకు ఇవే పనులతో సీతమ్మకి సరిపోయింది. సుబ్బయ్య సాయంత్రం ఊరిలోకి వెళ్ళి స్నేహితుల్ని కలిసి స్పేర్ తాళాలు పనోడు కిట్టిగాడికి ఇచ్చి వచ్చారు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరూ ఏవో ఆలోచనలతో గడిపారు. ఇద్దరికి నిద్దుర లేదు. సీతమ్మ పొద్దునే లేచి తయారయ్యింది. కాఫీ పెట్టి సుబ్బయ్యని లేపింది. నిద్ర లేకపోవటంతో నీరసంగా ఉన్న సుబ్బయ్య కష్టంగా లేచి కాఫీ అందుకున్నాడు. సీతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. గ్లాసు కిందపడేసిన చప్పుడుతో ఇవతలికి వచ్చిన సీతమ్మ సుబ్బయ్య కింద పడి ఉండటం చూసి గావుకేక పెట్టింది. వీధిలో అందరూ వచ్చారు. ఎవరో పోయి కంపౌండర్ శ్రీనుని తీసుకువచ్చారు. శ్రీను నాడిని చూసి, బి.పి. చూసి “అసలే ఈయన గుండె అంత గట్టిదేం కాదు ఈ సమయంలో ఎక్కడికీ కదిలించటం మంచిది కాదు” అని చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. సుబ్బయ్య నీరసంగా చూసి సీతమ్మతో “పోనీ నీవయినా” అని కవరు తీసి ఇచ్చాడు. అందులో హైదరాబాద్ కి టికెట్లు ఉన్నాయి. సీతమ్మ పరుగున కరణంగారి అబ్బాయి కోటి దగ్గరకి వెళ్ళి “బాబు నీ దగ్గర మా సత్తిపండు నంబరు ఉందికదా. వాళ్ళ నాన్నకి బాగుండలేదని వాళ్ళనే ఇక్కడకి రమ్మని చెప్పు” అని అడిగింది. సుబ్బయ్య కొడుకు సత్తిపండు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సత్తిపండు, కోటి చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. సత్తిపండుకి ఫోన్ చేసి మాట్లాడమని సీతమ్మకిచ్చాడు కోటి. సీతమ్మ జరిగినదంతా చెప్పింది అటువైపు నుండి చాలాసేపటి వరకు సమాధానం లేదు. ఫోన్ కట్టయ్యింది. ఒక 10 నిమిషాలలో మరల పోన్ వచ్చింది.

“సరే అమ్మ నాన్నకి ఇప్పుడు బాగానే ఉందిగా. మరీ అంత ఇంటి దగ్గర ఎవరయినా ఉండాలంటే పొరుగూరిలో ఉన్న అత్తయ్యకి కబురుపెట్టు. నువ్వు మాత్రం ఈ రోజు బయలుదేరి వచ్చేయ్. పిల్లలు, కోడలు నిన్ను చూడాలంటున్నారు. అసలే 1000 అయ్యింది టికెట్లకి. పండగ లో టికెట్ల ధర చాల ఎక్కువ. సరే నాకు ఆఫీస్ కి టైం అయ్యింది ఉంటా.” సీతమ్మ ఉన్నచోటే కూలిపోయింది. అందరూ జాలిగా చుస్తున్నారు. “ఉత్తరం రాగానే పాపం ఎంత సంబరపడ్డారో ” అనిమాటలాడుకుంటున్నారు.

ఆ ఊరిలో ఇలాంటి కధలు కొత్తేం కాదు. ఊరిలో చాలా గడపల కధ ఇంతే. అందరి పిల్లలు పట్నాలలో ఉన్నారు. పండగలొస్తే ఎవరూ ఇక్కడకి రారు. టికెట్లు వస్తాయి. పట్నాలలో ఇళ్ళు ఇరుకుగా ఉంటాయి. వంట కుదరదని వాళ్ళకి నచ్చిన వంటకాలు ఉత్తరంలో రాస్తే వండి తీసుకుని వెళతారు. రోజంతా మా అబ్బాయి ఫలానా కంపెనీ, ఇంతజీతం, మా మనవలు ఇంగ్లీష్ మీడియం తెలుగు అసలు రాదు అని గొప్పలు చెప్పుకోవటం. టి.వి. లో ప్రకటనలు వచ్చినప్పుడు మా అబ్బాయి కారు అదే, ఇది మా అబ్బాయి ఇంటిలో ఉంది అని చెప్పుకుంటారు. రామాలయం లోకూర్చుని ఈ సంవత్సరం మా అబ్బాయి స్థలం కొన్నాడు, ఫ్లాట్ కొన్నాడు అని రాత్రి అయ్యేవరకు మాట్లాడుకుని రాత్రికి ఇల్లు చేరుతారు. రోజులు అలా గడిచిపోతాయి. పిల్లలు వస్తారనే ఎదురు చూపులు ఎప్పుడో మానేసారు. అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం వస్తాయి. పండగలో మాత్రం టికెట్లు పంపేది తల్లి ఇంటిపనులకి, తండ్రి బయట పనులకి సాయం ఉంటారని. మనవలకి సెలవులు కాబట్టి అల్లరి చేయకుండా ఆడించేందుకు అంతే. పనివాళ్ళు పండగల్లో రారు వచ్చినా పని ఎక్కువయితే డబ్బులెక్కువడుగుతారు పైగా గొడవ చేస్తారు. 

సీతమ్మ ఇంకేం చేయగలదు లేచింది. ఇంటికి వెళ్తుంటే రామయ్యని, సుబ్బయ్యని తడిమిన చూపులు జాలితో అమెని స్పృశించాయి. వెళ్ళి ముందురోజు వచ్చిన కవరు అందుకుంది, సత్తిపండు చిన్నప్పటి ఫోటోలు, చిన్ననాటి బట్టలు, తన చేతులతో అల్లిన స్వెటర్ అన్నీ ఒక బ్యాగులో పెట్టింది. సుబ్బయ్య కనీసం భార్యయిన వెళ్తున్నందుకు ఆనందంగానే ఉన్నాడు. కానీ మనవడ్ని చూడలేకపోతున్నా అనే భాద. వెధవ రోగం ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటున్నాడు. వీధిలోకి వచ్చిన సీతమ్మ ఆ బ్యాగు విసిరి అగ్గిపుల్ల గీసి పడేసింది. లోపలికి ఆవేశంగా వెళ్ళి గది గది గాలించి ఏ ఒక్క ఙ్ఞాపకం మిగలకుండా అన్నీ ఏరుకొచ్చి ఆమంటలో పడేసింది. చివరగా రైల్ టికెట్లున్న కవరు కూడా. వీధి లో అందరూ సీతమ్మకి పిచ్చి పట్టిందనుకున్నారు. సుబ్బయ్య నోరు వెళ్ళబెట్టాడు. కాసేపట్లోనే ప్రతీ ఇంటినుండీ ఒక్కొక్కరుగా వచ్చి మంటల్లో ఇన్నేళ్ళ తమ నిరాశని బాధని కాల్చి బూడిద చేసారు. ఆ రోజే ఆ పల్లెకి భోగి వచ్చింది. మరుసటి రోజు సీతమ్మ తను వండిన వంటకాలు ఇంటింటికి తిరిగి పంచింది. ఆ రోజు నిజమయిన సంక్రాంతి పండగ చేసుకున్నారు ఆ ఊరిలో. రామాలయంలో పెద్ద ఎత్తున పూజలు చేసారు. రామయ్య మరలా ఎప్పుడూ అలాంటి కవర్లు ఎవరికీ ఇవ్వలేదు. వచ్చినవి వచ్చినట్టే తన ఇంటిలో పొయ్యలో పడేసాడు.

జాజు – ఒక కాకి కధ

భద్రాచలం కొండల మధ్యలో ఓ కాకులు దూరే కారడవి. జాజు అనే ఒక కాకి పిల్ల మరి కొన్ని కాకులతో కలిసి ఆ అడవిలో ఉంటుంది. కొన్నేళ్ళ క్రితం ఈ కాకులన్నీ గోదావరి నది ఒడ్డున మైదాన ప్రాంతంలో ఉండేవి. ఒకసారి వచ్చిన పెనుతుఫానులో అన్ని చెల్లాచెదురయ్యి ఇక్కడకి వచ్చి తలదాచుకొన్నాయి. సమూహంలో చాలా కాకులు తమ ఆప్తులని కోల్పోయాయి. జాజు కూడా తన వాళ్ళందరినీ కోల్పోయి ఇక్కడ తలదాచుకుంది. సమూహం లోని కాకులన్నీ రొజూ పగలంతా తిండి వేటలో కష్టపడి చీకటి పడే వేళకి సమావేశమై తాగి,తిని సందడి చేస్తాయి

జాజు ఎప్పుడూ సమూహానికి దూరంగా ఒంటరిగా గడిపేది. ఎప్పుడూ తనవాళ్ళగురించి ఆలోచిస్తూ ఉండేది. జాజు కి చిన్నప్పటి నుండీ పాటలు అంటే చాలా ఇష్టం. జాజు తల్లి మంచిగా పాటలు పాడేది. సమూహంలో అందరూ తనపాట విని మెచ్చుకొనేవారు. ఎప్పుడన్నా ఏదన్నా ఉత్సవం జరిగితే జాజు తల్లి పాట ఉండాల్సిందే. జాజు ఎప్పుడూ తన తల్లి జోలపాడీతే గాని పడుకునేది కాదు. తన తల్లిని ఎప్పుడూ అడిగేది “నేను కూడా పెద్దయ్యాక నీ అంత బాగా పాడగలనా?” అని.కాని జాజు గొంతు శ్రావ్యంగా ఉండదు, కాస్త బండగా ఉంటుంది. కాని జాజు బాధపడకూడదని “నాకంటే బాగా పాడగలవు” అని చెప్పేది జాజు తల్లి. జాజు బాల్యం గుర్తుచేసుకుని ఎప్పుడూ భాదపడుతూ ఉండేది. సమూహంలో అందరూ ఉన్నప్పుడు జాజు పాడితే ఎవరూ వినేవారు కాదు. మంచిపాటలు పాడే తల్లి కి నువ్వెలా పుట్టేవ్ అంతేలే పండితపుత్ర పరమ శుంఠః అని ఏడిపించేవారు. ఒక ఉత్సవంలో పాటల పోటీలో పాడబొతే అందరూ గోల చేసి ఆపేసారు. అప్పటి నుండీ జాజు ఉత్సవాలకి వెళ్ళటం మానేసింది. జాజు కి సమూహంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.వాళ్ళే చింకి,డుంబు. వాళ్ళు జాజు తో ” సంగీతమనేది పుట్టకతో రావాలి మనకి ఆ విద్య రాలేదు వదిలెయ్ ” అని చెబుతాయి. సమూహంలో తిరగటం, ఉత్సవాల్లో పాల్గొనటం ఇష్టం ఉన్నాసరే జాజు ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టంలేక చింకి, డుంబు కూడా వెళ్ళటం మానేసారు.

ఒక రోజు ఆ అడవికి ఒక కోకిల దారితప్పి వచ్చింది. దాని పేరు టింకు. టింకు ఒక చెట్టు మీద కూర్చుని మావిచిగురు తిని పాట పాడింది. దాని పాట విని అడవిలో కాకులన్నీ వచ్చి దాన్ని భందిచాయి.రాత్రి సమావేశం లో అన్నీ తప్ప తాగి ఉన్నాయి. సమూహం పెద్ద సాహి గంభీరంగా గద్దెమీద ఉన్నాడు. ఉత్సవాల్లో ఎప్పుడూ పాటలు పాడే కేతు ఆవేశంగా “టింకు జాతి వల్ల కాకి పాటలని అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆ జాతి మీద తరతరాలుగా మనం చేస్తున్న యుద్దం ఇంకా ఆగలేదు. కేవలం మన గుట్టు తెలుసుకోవటానికి వచ్చిన గూఢచారి టింకు. దాన్ని చంపెయ్యాలి ” అని అరిచిగోల చేసింది.సమూహంలో కాకులన్నీ “అవును అవును” అన్నాయి. చేసేదిలేక సాహి కూడా అంగీకరించాడు. కానీ జాజుకి టింకుని చంపాలన్న సమూహం నిర్ణయం నచ్చలేదు. కానీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సమూహం నుంచి వెలివేస్తారు లేదా కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు. అందుకే అందరిముందు ఏమి అనకుండా ఊరుకుంది. చింకి,డుంబులని పిలిచి ఎలాగైనా టింకు ని కాపాడాలని చెప్పింది. చింకి,డుంబు పెద్దలని కాదంటే ఏమవుతుందో అని మొదట భయపడ్డారు. కానీ ప్రాణస్నేహితుడి మాటను కాదనలేక ఒప్పుకున్నారు.

రాత్రి అందరూ తాగి మత్తుగా పడుకున్నారు. తెల్లవారితే టింకుని చంపేస్తారు. చీకటిలో ఎవరూ చూడకుండా జాజు మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న టింకు కట్లు విప్పి బయటకి తీసుకువచ్చింది. చింకి, డుంబు బయట కాపలాగా ఉన్నాయి. అందరూ రాత్రి ఎవరూ చూడకుండా తప్పించుకుని చాలా దూరం ఎగిరి వచ్చేసాయి. టింకు వాళ్ళకి తన ధన్యవాదాలు తెలిపింది. “ఇక సెలవు మిత్రమా, నీ వాళ్ళ దగ్గరకి నీవు హాయిగా వెళ్ళవచ్చు ” అని టింకుని వదిలి వెనక్కు రావాలని అనుకున్నారు స్నేహితులు. “నా వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు ఇక జన్మ లో నేను వాళ్ళని కలవలేనేమొ. ఇక్కడ దగ్గరలో ఏదో మామిడి తోపు చూపించండి అక్కడే ఉండిపోతా.” అంది టింకు. అప్పటికే తెల్లవారింది. తమ సమూహంలో అప్పటికే విషయం తెలిసిపోయుంటుంది ఇక వెనకకు వెళ్ళటం ఆపదకొనితెచ్చుకోవటమే అని మితృలు గ్రహించారు. ఇక అందరూ కలిసే ఉందామని నిర్ణయించుకున్నారు. మానవసంచారానికి దగ్గరలో ఉన్న ఒక చిట్టడవిలో నివాసం ఏర్పరుచుకొన్నారు.

అందరూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి తిండి సంపాదించుకొనేవారు. వచ్చే దారిలో ఒక విద్వాంసుడు తన శిష్యులకి సంగీతం నేర్పేవాడు. జాజు అక్కడే చెట్టుమీద కూర్చుని రోజూ ఆ పాటలు విని మనుషులు చాలా అదృష్టవంతులు అనుకునేది. అలాంటప్పుడు ఎప్పుడన్నా టింకు పాడితే గురువు ఆహా కోకిలది ఎంతకమ్మని గొంతు అనేవాడు. చాలా సార్లు అలావిన్న జాజు ఒక రాత్రి “మిత్రమా! నీకు ఇంత కమ్మని గొంతు ఎలా వచ్చింది” అని అడిగింది. “మావిచిగురు తినటంవలనే మా జాతికి ఇంత కమ్మని గొంతు వచ్చింది నేస్తం” అని టింకు చెప్పి పడుకుంది. ఆ రోజు రాత్రంతా జాజు కి నిద్రపట్టలేదు. తన తల్లి గుర్తు వచ్చింది.

మధ్య రాత్రి లో ఏదో శబ్దం వినిపించి టింకు లేచి చూసింది. జాజు మామిడి చెట్టు మీద కూర్చుని చిగురు తిని తిని పాడుతూ ఉంది. దానితో గొంతు కి మామిడి చిగురు అడ్డుపడి మూర్చపోయింది. చింకి, డుంబు వెంటనే లేచి వెళ్ళి పట్టుకున్నారు. టింకు ఒక చిన్న ఆకు తో నీరు తెచ్చింది. నీరు త్రాగిన జాజు కాసేపటికి మొత్తం మామిడి చిగురు కక్కేసింది. రాత్రంతా స్నేహితులంతా దానికి సేవలు చేస్తూ ఉన్నారు. తెల్లవారితే జాజుకి తెలివి వచ్చి అందరినీ చూసి తల దించుకొని ఏడుస్తుంది. “నాకు జన్మలో పాటలు రావు. నాకు చాలా సిగ్గుగా ఉంది” అని జాజు భాదపడింది. “నీకు కూడా మంచిగా పాటలు వస్తాయి బాదపడకు” అంటుంది టింకు.

“నా గొంతు బాగుండదు కదా మరి నేను ఎలా మంచిగా పాడగలను” అని అడిగింది జాజు. “పాడటానికి శ్రావ్యమైన గొంతు తప్పనిసరి కాదు గొంతులో మంచి శృతి,లయ ఉంటే చాలు” అంది టింకు. కానీ జాజు ఆ మాటలు నమ్మదు. ఒక రోజు వీళ్ళు ఉండె అడవికి కొంతమంది మనుషులు పిక్నిక్ వచ్చారు. వాళ్ళు పగలంతా నీట్లో ఆడుకొని రాత్రికి మంట పెట్టి దాని చుట్టూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ గొంతు ఊరిలోని విద్వాంసుడి గొంతులా గొప్పగా లేదు. బండ గా ఉంది. అయినా వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. టింకు వాళ్ళని చూపించి “చూసావా సంగీతానికి గొంతు కాదు శృతి లయ ముఖ్యం” అని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఒక వారం రోజులు పాటు దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి ప్రజలు వినేవి, పాడుకునేవి పాటలన్నీ విన్నారు. అందులో జాస్సిగిఫ్ట్ తో మొదలెట్టి హిమేష్ వరకు ఉన్నాయి. “అ అంటే అమలాపురం” నుండి “ఆకలేస్తే అన్నంపెడతా” వరకు ఉన్నాయి. అప్పుడు టింకు చెప్పింది నిజమే అని జాజు నమ్మింది. ఆ రోజు నుండి టింకునే జాజు కి సంగీత గురువు. జాజు కష్టపడి రాత్రి పగలు పాడుతూనే ఉంటుంది. చింకి, డుంబు జాజు తిండి అవసరాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సంగీతం మీద ఇష్టం పెరిగి జాజు పాడూతూ ఉంటే పక్కన ఎండిన ఆకులను తొక్కుతూ, ముక్కులతో కొమ్మలను కొడుతూ శబ్దం చేస్తూ ఉంటారు. ఒక రోజు చింకి కొన్ని చిన్న చిన్న గిన్నెలు చెంచాలు ఎత్తుకొచ్చి వాటిని కొట్టటం మొదలు పెట్టింది. డుంబు ఊరిలోకి పోయి ఒక బూరలమ్మే వాడి బుట్టలో ఉన్న ఏక్తారా ఎత్తుకొచ్చేసి ముక్కుతోను, గోళ్ళతోను వాయించటం మొదలు పెట్టింది. జాజు తెలివిగా తన బండ గొంతుని, టింకు మంచి గొంతుని సరైన పద్దతిలో కలిపి చక్కని బాణీలు కట్టి పాడింది. వాళ్ళు అలా పాడుతూ ఉంటే ఆ చిట్టడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి. ఇంకేముంది తాము “4 నోట్స్” అనే ఒక రాక్ బ్యాండ్ గా ప్రకటించుకున్నాయి.

తమ సమూహం లో తన పాటల ప్రతిభ చూపించాలని తన తల్లి పేరు నిలబెట్టాలని జాజు స్నేహితులతో తిరిగి పాత అడవికి బయలుదేరింది. వీరిని చూడగానే కేతు తన బృందంతో దాడి చేసి భందించింది. సాహి ముందు హాజరు పరిచింది. వాళ్ళు చేసిన దాడి లో జాజుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. సాహి మీరు సమూహం నిర్ణయాన్ని ఎదిరించారు మీకు మరణశిక్ష తప్పదు. కానీ పారిపోయిన మీరు ఎందుకు తిరిగి వచ్చారు చెప్పండి అని అడిగింది. జరిగిన విషయం మొత్తం జాజు చెప్పింది. అంతా విన్న సాహి ఆలోచనలో పడింది. కేతు గర్వంతో పాటలో నన్ను ఓడిస్తే నీకు శిక్ష లేకుండా వదిలేస్తాం అని అంది. అందరూ ఒప్పుకున్నారు. చావు ఎలాగు తప్పదు కాబట్టి చివరి అవకాశంగా జాజు కూడా ఒప్పుకుంది. కానీ పోటిలో ఓడితే తనని మాత్రమే చంపాలని మిగిలిన వాళ్ళని క్షమించాలని ఇదే తన చివరికోరికని చెప్పింది. కేతు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎక్కడివి? దొంగతనం గా ఎత్తుకు వచ్చినవిలా ఉన్నాయి వీటిని వాడటానికి వీళ్ళేదంది. కేతూ బృందం మాత్రం పాట మొదలు పెట్టి అద్బుతంగా పాడారు. కాకులన్నీ ఆనందంతో చిత్తుగా తాగి ఊగి రెచ్చిపోయి గెంతాయి. ఇప్పుడిక జాజు బృందం పాడాలి. వాద్యాలు లేవు. జాజు దిగులుగా వేదిక మధ్యలో నిలబడింది. డుంబు కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తనతోకలో ఒక ఈక పీకి బాణంలా వంచి దానికి చిన్న చిన్న తీగలు కట్టింది. “ట్రంగ్” మని గట్టిగా శబ్దం చేసింది. చింకి కొన్ని కొబ్బరి చిప్పలు తెచ్చి తిరగేసి వాటి మీద ముక్కు తో కాంగో కొట్టటం మొదలుపెట్టింది. టింకు “హే హే లలల లా హే హే లలల లా” అని చిన్న ఆలాపన చేసింది. అప్పుడు జాజు కి ఉత్సాహం వచ్చింది. మితృలందరూ చావుకి సిద్దపడే ఉన్నారు. జీవితంలో చివరిసారి పాడుతున్నాము అనే స్పృహలో ఉన్నారు. తమకిష్టమైన సంగీతం కోసం చావుకి సిద్దపడ్డారు. సంగీతంలో మునిగి చనిపోవాలన్న కాంక్షతో తన్మయత్వం లో ఉన్నారు. వారి ఆత్మలీనమైన ఆ పాట అద్బుతంగా ఉంది. జాజుకి తగిలిన దెబ్బలనుండి రక్తం కారుతూనే ఉంది. కేతు కూడా పాటలో లీనమైపోయాడు.

“నా తల్లి లాలిపాటలో,

నామితృలు పంచిన ప్రేమలో,

కమ్మదనమే నా పాట.

ఈ వరాలన్నీ నాతో ఉంటాయి ప్రతిపూట.

ఈ పూట తో నా ఊపిరి పోయినా,

ఓ పాటగా నే బ్రతికే ఉంటా.

ఆ కొండలో ఆ కోనలో, ఈ చెట్టులో ఈ పుట్టలో,

ప్రతి సవ్వడిలో ఓ పాటగా నే బ్రతికే ఉంటా.”

ఆత్మ ని మిలితంచేసి పాటలోనే కలిసిపోయి పాడూతూ జాజు వేదికపైన ఒక్కసారి కుప్పకూలి పడిపోయింది.   

మరి జాజు తిరిగిలేచిందా? సమూహం వారి గొప్పతనాన్ని ఒప్పుకుందా? వాళ్ళ పాటకి అడవితల్లి జేజేలు పలికిందా? లేక సమాజం ఎప్పటిలానే తన కాఠిన్యం చాటుకుందా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి నాది అనే ఒక ముగింపు ఇవ్వటం నాకిష్టంలేదు. “విఙ్ఞులయిన పాఠకులారా మీకు నచ్చిన ముగింపుతో మీరే కధని చదవటం పూర్తిచేయండి.”