ఆటోబయోగ్రఫీ లో ఆఖరుపేజి

ఆ రోజు ఎందుకో ఉదయాన్నే గుండె బరువుగా ఉంటే మగతనిద్రలో నుండి మెలుకువ వచ్చి లేచి కూర్చున్నా. అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు, కిటికి వైపు చూస్తే పెద్దగా వెలుగేమీ లేదు. బయటగాలి వస్తుందని రాత్రి తెరిచి ఉంచిన బాల్కనీ తలుపు అలానే వదిలేసినట్టున్నా. లేచి వెళ్ళి బాల్కనీలో నిల్చుంటే వీధిలో సైకిళ్ళు మీద తిరుగుతున్న పాలబ్బాయి, పేపరువాడు కనిపించారు. రామభజన పక్కన ఉండే టీకొట్టు రవణ టీ కాయటం మొదలెట్టేసాడు. చల్లగాలికి శరీరం తేలికబడింది. ఇంక పడుకున్నా నిద్ర వచ్చేట్టు లేదు. ఏదైనా పుస్తకం తిరగేద్దామని లోపలికి నడిచాను. లైటు వేస్తే, మా ఆవిడ రజని లేస్తుందేమో అని మంచం వైపు చూసాను. రజని మంచి నిద్రలో ఉంది, పక్కనే నేను కూడా.

ఉలిక్కిపడి మరలా చూసాను నేనే. అప్పుడెప్పుడో చదివిన సూక్ష్మశరీరంతో సంచరించటం నాకొచ్చేసిందా అనిపించింది. కంగారు, గుండెదడ మొదలయ్యింది. కాసేపటికి ఆ స్థితి అలవాటుపడి నిశ్చలంగా ఉండిపోయాను. నేను చనిపోయాననే విషయం నాకే అర్ధంకావటం లేదు. మిగిలిన వారికెలా అర్ధమవుతుందో ఏంటో బొత్తిగా తెలియటం లేదు. నేను ఆత్మనో దెయ్యాన్నో, నాకిప్పుడేవైనా మానవాతీత శక్తులు వస్తాయా? వచ్చాయని నాకెలా తెలుస్తుంది? అని ఆలోచిస్తూ గోడలగుండా తలుపులగుండా నడుస్తూ ఆలోచిస్తున్నా.

వ్రాయాలనుకున్నవి వ్రాయలేకపోయానని, చేయాలనుకున్నవి చేయలేకపోయానని ఒక చిన్న బాధ ఏదో మూల. అంతా మిధ్య ఏది శాశ్వతం, ఇన్నేళ్ళు బ్రతికినందుకు ఏం మిగిలింది, చెయ్యలేకపోయినవి చేస్తే మాత్రం చచ్చిన నా శరీరం బంగారమవుతుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటున్నా. మంచం మీద పడి ఉన్న నా శరీరాన్ని చూస్తే ఇది నేనేనా అనిపిస్తుంది, ఇరవైయేళ్ళ కుర్రాడిగా ఉన్నప్పటి నా రూపం మాత్రమే నేనుగా గుర్తుండటంవల్లనుకుంటా. నా అందమైన ఉంగరాల జుత్తు, కళ్ళల్లో మెరుపు, శరీరంలో చురుకు ఎప్పుడుపోయాయో కూడా తెలియకుండా పోయాయి. అప్పుడప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం ఒక నిట్టూర్పు విడిచేవాడ్ని.

ఇప్పుడు మా ఆవిడ నేను పోయానని తెలియగానే ఏమవుతుంది? అమె ఎలా స్పందిస్తుందో అని కాస్త ఆసక్తి, అంతకంటే ఎక్కువ ఆందోళన. ఎవరైనా వచ్చి ఘంటసాలవారి భగవద్గీత వేస్తే బావుండు కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది.

కాస్త తెల్లారి, వెలుగు గదిలోకి వచ్చాక రజని లేచింది. లేచి నా వైపు ఒకసారి చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాస్త ఉత్కంఠత నాలో రేగి చల్లారింది. పెళ్ళిచూపుల్లో తనని చూసేందుకు వెళ్ళినప్పుడు కూడా నా పరిస్థితి ఇదే. మంచమ్మాయని వాళ్ళన్నారు, మంచబ్బాయి అని మావాళ్ళూ అన్నారు. మంచి మంచి రాసుకుంటే మంచే రాలుతుందని అందరూ అన్నారు. అయినా నాన్న చెప్పినమాట విన్నప్పుడు మంచోడ్ని, అమ్మ చేసిన కూర బాలేదని తినకపోతే చెడ్డోడ్ని. మంచి చెడు రెండూ నేనే. అందుకే మంచి అమ్మాయి కావాలని అనుకోలేదు. అలా అని ఎలాంటి అమ్మాయి కావాలో కూడా తెలియలేదు.

మూగకోయిలనై రోధిస్తున్నవేళ
ముంతమామిడి చివురు తెచ్చే నెచ్చెలి ఆమె

గుండెల నిండా చీకటి పీల్చిన అమావాస్యరాత్రి
నాకోసం క్షణమైనా వెలిగి రాలిపోయే తార ఆమె

హారివిల్లు విరిసి మెరిపోతున్న వేళ
మదిలో చీకటిచారను చూడగల కాటుక కన్నులు ఆమె

అలసినవేళ సాయంగా, తలచినవేళల హాయిగా
బాధల్లో ఛాయలా, బ్రతుకంతా ఓ మాయలా
వలచి వలపింపబడి సృజించి సృజించబడు
నా బ్రతుకు కావ్యం ఆమె

అమ్మాయిని తెచ్చి ఎదురుగా కూర్చండబెట్టారు. నిర్మలంగా వర్షంలో తడిచిన నందివర్ధనం పువ్వల్లే ఉంది. నచ్చిందనేందుకు నమ్మకం కుదరలేదు, కాదనేందుకు కారణం దొరకలేదు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను టీగ్లాసు పుచ్చుకున్ని వాకిట్లోకొచ్చి నిలబడ్డాను. రెండురూపాయలకి ఒకటి అని బోర్డు పెట్టి రంగు రంగుల కోడిపిల్లలు అమ్ముతున్నాడెవడో. కొన్ని కోడిపిల్లలు గంపదాటి పోతుంటే వాటిని లాగి లోపల పడేస్తున్నాడు.

వంటగదిలోకి వెళ్ళిన రజని టీగ్లాసు తో వచ్చింది. ” ఏవండీ లేస్తారా? టీ చల్లారిపోతుంది” రెండు మూడుసార్లు పిలిచింది. “సరే ఇక్కడ పెడుతున్నా లేచి త్రాగండి” అని అక్కడే టేబుల్ మీద వేడి వేడి టీ పెట్టి వెళ్ళిపోయింది. తట్టిలేపితేనేగా వచ్చిపడిన చల్లదనం తెలిసేది.

పెద్దవాళ్ళు పెళ్ళి నిశ్చయం చేసి ముహుర్తాలు పెట్టి కబురుపెట్టారు. పెళ్ళికి వారం రోజులు ముందుగా సెలవు పెట్టి వచ్చాను. “పిల్లను ఒకసారి కలిసి రాకూడదూ” అన్నారు నాన్న. ఆటపట్టించటానికో, నిజమో తెలియదు ఇంట్లో అందరూ అదేమాట. ఎదురింటి చంటి బండి మీద రజని ఇంటి దగ్గర దించి వెళ్ళాడు. ఇంట్లో పెళ్ళిసందడి కనిపిస్తుంది. చుట్టాలు అప్పటికే వచ్చారు. తన ఈడు ఆడపిల్లలు ఇలా నేను రావటం గూర్చి తనని ఆటపట్టిస్తున్నారు. పెరట్లో జామచెట్టు నీడన నాకు కూర్చీ వేసి, తినటానికి జంతికలు, పెళ్ళికని చేసిన లడ్డూలు పెట్టి వెళ్ళారు.

కాస్త ఆలస్యంగా రజని వచ్చి అక్కడే ఉన్న సిమెంటు గట్టు మీద కూర్చుంది. ముస్తాబయి రావటంవల్ల ఆలస్యమయ్యిందని అర్ధమయ్యింది. రెండురోజులుగా షాపింగ్‌కి, టైలర్ మెజర్మెంట్స్‌కి ఎండల్లో తిరుగుతున్నా కాస్త రంగు తగ్గాను అని చెప్పింది. నేను నవ్వి ఉరుకున్నా. నాకు ఆ తేడా తెలియలేదు. అయినా పెళ్ళి సమయానికి సమస్య లేదులెండి. మా పిన్ని కూతురు వస్తుంది పెళ్ళికి. తనకి ఊర్లో బ్యూటీపార్లర్ ఉంది. తనే నాకు పెళ్ళికూతురు ముస్తాబు చేస్తుంది అని గలగలా చెప్పింది. నేను ముభావంగా చూడటం గమనించి ఫోటోల్లో అందంగా పడాలిగా అని నా వైపు సమాధానం కోసం చూసింది. అవును అని చెప్పి ఊరుకున్నా.

మీరేమీ మాట్లాడటం లేదు అని అడిగింది. నేను నవ్వాను. ఆమె పక్కనే ఉన్న మొక్కలు చూస్తూ ఆ గులాబి బావుంది అన్నాను. అమె ఆ పువ్వును తెంపి తలలో పెట్టుకుని సిగ్గుపడింది. వర్షం వచ్చేలా ఉంది అని మేఘాలను తనకి చూపించి, చలిని స్వీకరిస్తూ చేతులు కట్టుకున్నాను. అవును నిజమే అని ఆమె పరుగున వెళ్ళి తీగ మీద ఆరేసిన బట్టలు ఇంటిలో పెట్టేసి వచ్చింది. నేను మౌనంగా ఉన్నాను. మీరు బొత్తిగా నెమ్మది. నేను వచ్చాక కుదరదు సుమా అని గట్టిగా నవ్వి తను పెళ్ళికి కొనుకున్న జూకాల గురించి చెప్పింది. అవి చూసి అసూయపడుతున్న తన స్నేహితుల గురించి, ఇంకా ఏవో చాలా చెప్పింది. వర్షం మొదలవక ముందే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి నేను వచ్చేసాను.

“నాన్న ఇంకా లేవలేదు. ఈ రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్ళినట్టు లేదు” రజని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మా అబ్బాయి ఉదయ్‌తో అనుకుంటా. చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చింది. దూరమైనా కెరీర్ బావుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడతాడు. ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే వాళ్ళమ్మ దగ్గర ఫోన్ తీసుకుని ఎలా ఉన్నావు అని అడుగుతాను. అంతకంటే ఏం మాట్లాడాలో ఎంత కూడబలుక్కున్నా నాకు మాటలు రావు. ఇదిగో అమ్మకిస్తున్నా అని తిరిగి ఫోన్ ఇచ్చేస్తాను. ఇప్పటికీ తెలియదు వాళ్ళిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకుంటారో. రజని ఫోను మాట్లాడూతూ పువ్వులు ఏరుకునేందుకు పెరట్లోకి వెళ్ళింది.

పెళ్ళైన అయిదవరోజేమో అదే పెరట్లో మీరెందుకు అందరిలా ఉండరు అని అడిగింది రజని. ఆ ప్రశ్న లోతుగా తగిలింది. చిన్ననాటి నుండి అందరిలో పడిపోకుండా ఒక్కో అక్షరం చెక్కుతూ ఒక సంతకం దిద్దుకున్నా. అందరిలా ఉండకపోవటం నా గొప్పనుకున్నానే తప్ప అది తప్పని నాకు తెలియలేదు. నాలా ఉంటే ఏం సమస్యలు వస్తాయో తను చెప్పింది. చాలా నష్టాలు జరిగే అవకాశం ఉన్నట్టుంది. కానీ ఒక్కడినే ఉన్నప్పుడు నాలా ఉండటంలో కష్టాలేవి తెలియలేదేంటి అని ఆలోచించాను.

పెళ్ళి అంటే ఒక పెద్ద బాధ్యత అని చెప్పింది. నిజమే ఇది నేను ఎక్కడో చదివాను. పెళ్ళంటే మీరొక్కరే కాదు మీరు, నేను ఇద్దరం అని కూడా చెప్పింది. కానీ నేను పెళ్ళంటే ఒక్కరే అని చదివాను. తనకి అదే విషయం చెప్పాను. మరయితే ఇద్దరం ఒకేమాట మీద నడవాలి పదండి నాతో అంది. ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. పెరట్లో మొదలయిన వాదనలు మెల్లగా పడకింటికి, అటుపైన నట్టింటికి నడిచొచ్చాయి. అందరూ కూర్చొని ఆరాతీసారు, పంచాయితీ చేసారు. తర్వాత గొడవలే కాదు, మాటలు కూడా తగ్గిపోయాయి.

ఇంటిలోకి వస్తూ టైము చూసిన రజనికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. మంచం దగ్గరకొచ్చి తట్టి లేపబోయింది. శరీరంలో చల్లదనం, కరుకుదనం తెలిసిరాగానే గట్టిగా అరిచి స్థాణువులా నిలిచిపోయింది. నాకు ఎప్పుడు ప్రతిస్పందించటం అలవాటు లేదు, అందుకే తిరిగి పలకలేదు. రజని అరుపుకి పనమ్మాయి కంగారుగా గదిలోకి వచ్చి చూసి వీధిలోకి పరిగెట్టింది.

కాసేపట్లో ఇంట్లోనూ, వీధిలోనూ హడావుడి మొదలయ్యింది. ఎవరెవరో ఎవరెవరికో ఫోనుల్లో నా చావు వార్త గుసగుసగా చెబుతున్నారు. రజని ఫోనులో నంబరు చూసి ఎవరో ఉదయ్‌కి కూడా చెప్పారు. తెలిసినవాళ్ళు, స్నేహితులు వచ్చి వెళుతున్నారు. వచ్చినవాళ్ళు ఇంటి ముందు వేసిన శామియానా కింద కూర్చున్నారు. టీకొట్టు రవణ వచ్చి అందరికీ టీలు పోస్తూ, పోసిన గ్లాసులు లెక్కబెట్టుకుంటున్నాడు. “అబ్బాయి ఎప్పటికి వస్తాడో” అని గడియారాన్ని చూస్తూ కొందరు, “రానివ్వండి తొందరేముంది” అని రిటైర్ అయిన కొందరూ మాట్లాడుకుంటున్నారు.

ఆడవాళ్ళు కొందరు రజని దగ్గరకొచ్చి “అమ్మా అగరొత్తులెలిగించి, తల దగ్గర దీపం పెట్టాలి” అని చెప్పారు. “కుడి వైపా? ఎడమవైపా?” అని అడిగారు ఎవరో. రజని పెద్దవాళ్ళ వైపు చూసింది. “ఎవరేం చెప్పినా వినకు, మన ఇళ్ళల్లో ఇంతే. మీది మాది ఒకటే ఇంటిపేరు. మా ఆయనపోయినప్పుడు..” అని ఒక ముసలామె ఏదో చెబుతుంది. రజని ఆమె వైపు మౌనంగా చూస్తూ కూర్చుంది. “బంగారంలాంటి మనిషి ప్రకాషం, ఇలా చెప్పా పెట్టకుండా పోయాడు” అన్నారెవరో. “ఎక్కడికి మాత్రం చెప్పి వెళ్ళాడాయన” రజని మనసులోని మాటలు నాకు మాత్రమే వినిపించాయి.

అందిన విమానం పుచ్చుకుని ఆగమేఘాల మీద ఇంటికి చేరాడు ఉదయ్. ఘనీభవించిన మౌనం కరిగి ఉప్పెనగా మారి ఉదయ్ మీదపడింది. అందరూ వాడిని పట్టుకుని బావురుమంటున్నారు. తుఫానులో చేజారిన ఆసరా వెదుకుతూ వచ్చినట్టు, జనాల్ని తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు ఉదయ్. బయట మొదలయిన ఆందోళనకే ఉదయ్ వచ్చేసాడని గ్రహించిన రజని, పనమ్మాయికి గ్లాసు నీళ్ళు తెమ్మని చెప్పింది. ప్రయాణంలో తోటి ప్రయాణికుల మధ్య బయటపడలేక బిగదీసుకుపోయిన కొడుకుకి రాగానే నీళ్ళివ్వాలని ఆమె ఆరాటం. చిన్నప్పుడు వాడు గుక్కపెట్టి ఏడుస్తూ ఊపిరాడకపోతే అదే చేసేది.

ఉదయ్ నీళ్ళ గ్లాసు అందుకోలేదు. పూలదండల మధ్య నా శరీరాన్ని వెతుక్కునేందుకు కూలబడ్డాడు. వంగి నా ముఖం వైపే చూస్తున్నాడు, ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నా మనసులో ముద్రపడని దాన్ని పరిశీలనగా చూస్తున్నట్టు. ఎప్పుడు చూసాడు గనక. కాలేజి ఫీజుకో, పుస్తకాలకో డబ్బులడిగినప్పుడు కూడా అటు తిరిగి మాట్లాడేవాడు లేదా వాళ్ళమ్మకు చెప్పేవాడు. ఊరిలో అందరూ వాళ్ళ పిల్లాడు పాసయ్యాడని ఆనందపడినప్పుడో, పరీక్షతప్పాడని బాధపడ్డప్పుడో నేనూ ఉదయ్ గురించి ఏదైనా చెప్పాలని తోచేది కాదు. ఎవరైనా అడిగితే మాత్రం చెప్పేవాడిని. పెళ్ళికి అత్తవారు పెట్టిన ఉంగరంలానే, వాడు కూడా నాకు సొంతమో కాదో ఎప్పుడూ అర్ధంకాలేదు.

రజని గురించో, నా గురించో, ఉదయ్ గురించో ఏదీ ఆగలేదు. “జరగాల్సిన పనులు” అని అందరూ చెప్పే పనులేవో జరుగుతూనే ఉన్నాయి. “అమ్మను లేవదీయాల్సిన వాడివి నువ్వేంట్రా ఇలా” అని ఉదయ్‌ని రెక్కపట్టుకుని లేవదీసారు. రజనికి,ఉదయ్‌కి, నాకు తెలియనివి అర్ధంకానివి సొంతంకానివి ఏవేవో పనులు, ఆచారాలు జనాలు భుజాలకెత్తుకుని జరిపించేస్తుంటే ఎలాగో శ్మశానానికి వచ్చేసాం. చిన్నప్పుడు అక్కడే క్రికెట్ ఆడేవాళ్ళం. దూరంగా శవాలు కాలుస్తుంటే భయంగా చూసేవాళ్ళం.

ఏడదాకోయ్ నీ నడక ఓ ఎర్రికొడుకా
ఏపాటి గొప్పదోయ్ ఇంతోటి పుటక
నీ ఏడి నెత్తురు నీ సోకు అత్తరు
ఎముక తెలియని సేయి ఎనకలెరుగని ఎన్ను
సూడు కాలి కాష్టమయ్యే ఏడుక

నన్ను తగలేసి వెనక్కి వెళ్ళిపోతున్న జనాల్ని చూస్తూ కాటికాపరి పసివాడైన తన కొడుక్కి తత్వాలు నేర్పిస్తున్నాడు.

యాత్ర వీధి దాటగానే ఇళ్ళు కడిగేయాలంటూ ఆడాళ్ళందరూ రజనిని పక్కకి లాగి బక్కెట్లతో ఇళ్ళంతా నీళ్ళు పోసేస్తున్నారు. రజని కళ్ళు మేఘాల్లేని వర్షంలా కురవటం మొదలెట్టాయి. కన్నీరుగా మొదలై, ఎక్కిళ్ళుగా మారి ఆమె ముసురుపట్టిన వేళ సముద్రపుఘోషలా ఏడుస్తుంది. ఏళ్ళుగా ఒకే చూరుక్రింద అపరచిత వ్యక్తితో సాగిస్తున్న కాపురమనే జీవితం ముగిసి, ఇన్నేళ్ళుగా కనబడకుండానే తన స్వేచ్ఛను మింగేసిన గాలిసంకెళ్ళు తెగిపోయి, ఏనాడో పోగొట్టుకున్న తను తనకి దొరికిన కంగారులో దారితప్పి కూడలిలో నిల్చున్న పసివాడిలా దిక్కుతోచక ఏడుస్తుంది. ఆ దుఖం ఆమెను తేలికపరుస్తుంది. అంతకంటే ఎక్కువగా ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇప్పుడు రజనమ్మ సంగతేంటి ఉదయ్‌బాబుతో వెళ్ళిపోతుందా ఎవరో అడిగారు. “లేదు ఇక్కడే ఉంటాను” అంత దుఃఖంలోనూ తనలో తను చెప్పుకుంది. అవును ఇన్నేళ్ళూ తన బ్రతుకు తను బ్రతకలేకపోయిందిగా. సముద్రం మధ్యలో కురిసి కరిగిపోయిన మేఘం గాలివాటానికి చివరిచుక్కలతో తీరం వైపుసాగింది.

కాటికాపరి కొడుకు వాడి కొత్త నోటుబుక్కులో నుండి రెండు తెల్లని అందమైన కాగితాలు చింపి ఏంటో వ్రాసాడు. బరబరా గీతలు గీసి కాసేపు ఆడుకుని అక్కడే నా చితిమంటల్లో వేసాడు. కాగితం కాలి దాని పైన అ పిల్లాడు గీసిన అక్షరాలు కాసేపు మెరిసాయి. గట్టిగా వీచిన సాయంత్రం గాలికి కాలిన ఆ కాగితం బూడిదై ఎగిరింది.

ఉన్నాయో లేదో తెలియని లోకాలను చూపి, జరిగాయో లేదో తెలియని జ్ఞాపకాలతో తడిపి, నన్ను నడిపిన ఆమెను కలవకుండానే అర్ధాంతరంగా ముగిసిన ఆత్మకథలా నేను ఆనంతంలో లీనమయ్యాను.

ఆనంద్‌వర్మ

రంగు రంగుల పానీయాలు అందమైన గాజు గ్లాసుల్లో హొయలొలికిస్తున్న ఆ పార్టీలో రంగు రంగుల మనస్తత్వాలను గమనిస్తూ కూర్చుంది తన్మయ. ఆ ఆనందాల వెనక, కేరింతల వెనక, చిందుల వెనక మరుగునపడిన మర్మాలేవో చదువుతున్నట్టుగా శ్రద్ధగా తన పని తాను చేసుకుపోతుంది. చాలా చిన్న వయసులో తనకి అలవడిన ఈ పరిశీలన చివరికి తనని సైకియాట్రీ చదివేదాక ఒదిలిపెట్టలేదు. సిటీలో కొత్తగా ప్రాక్టిస్ కూడా మొదలుపెట్టినా తనకి పెద్దగా జాబ్ సాటిసిఫేక్షన్ లేదు. తన దగ్గరకొచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా కార్పొరేట్ అఫీసుల్లో ఒత్తిడులు తట్టుకోలేక వచ్చేవాళ్ళును. అప్పటికీ కార్పొరేట్ స్కూల్స్‌లో, కాలేజుల్లో అవగాహన సదస్సుల పేరిట సంతృప్తి వెదుక్కుంటున్నా ఇంకా ఏదో వెలితి. మనుషుల ఆలోచనలకు మూలమైన మనసులను చదవాలని, వ్యక్తిత్వాల పుట్టుక రహస్యాలు తెలుసుకోవాలని తపన.

పార్టీలో చిన్న అలజడి మొదలయ్యేసరికి ఏమిటన్నట్టు ఆసక్తిగా చూసింది. ఒక కొత్త వ్యక్తిని తీసుకుని రాజేష్ పార్టీలో అడుగుపెట్టాడు. ఆ కొత్త వ్యక్తికి ముప్పై రెండేళ్ళు ఉంటాయేమో. బంగారు రంగు చాయతో, ఎత్తుగా బలంగా ఉన్నాడు. కళ్ళు మత్రం బేలగా ఫిష్ ట్యాంకులో గోల్డ్‌ఫిష్‌లా పదే పడే అటు ఇటూ కదులుతున్నాయి. రూపానికి తగ్గ ఆత్మ విశ్వాసం లేదు అనుకుంది తన్మయ. అతని బట్టలు, అలంకరణలు చూసి ఒంటరిగా ఉండే తత్వం అని పసిగట్టింది. తల ఎత్తి ఎవరిని చూడకుండా రాజేష్‌నే అనుసరిస్తున్న పద్దతిని గమనించి ఆత్మన్యూనత కూడా ఉంది అనుకుంది. ఒకే కమ్యూనిటీలో చిన్నప్పటి నుండి ఆటలాడుకుంటూ, చదువుకుంటూ వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులంతా ఏడాదికోమారు ఇలా కలిసి పార్టీ చేసుకోవటం అలవాటు. ఈ పార్టీల్లో ఒక్కోసారి కొందరు తమ పరిచయస్థులని తీసుకుని వస్తూ ఉంటారు. అందుకే తన్మయ పెద్ద ఆసక్తి కనబరచ లేదు.

రాజేష్ ఆ మనిషిని కాస్త దూరంలో కూర్చుండబెట్టి తన్మయ దగ్గరకి వచ్చాడు. ఆ వ్యక్తిని చూపించి తన పేరు ఆనంద్ వర్మ అని తన స్నేహితుడని చెప్పాడు. తన్మయ సహజంగా పరిచయం చేస్తున్నాడేమో అన్నట్టు చూసి ఊరుకుంది. “తనని ఇక్కడికి తీసుకు వచ్చింది నీకు పరిచయం చేద్దామనే” అన్నాడు రాజేష్.

“చిన్నప్పటి నుండి చాలా తెలివైన వాడు. కాలేజ్ చదువు చదవకపోయినా. చాలా చదివాడు. ఇంటిలో పేద్ద లైబ్రరీ ఉంది. ప్రపంచంలోని రాచరికాలు, ప్రపంచ విప్లవాలు, సాహిత్యం దేని గురించైనా అనర్ఘలంగా మాట్లాడగలడు. ఇంత నాలెడ్జ్ ఉండీ దానిని వినియోగించుకోడు” అని తన్మయ వైపు చూసాడు.
“ఉపయోగించకపోవటం అంటే?” అని అడిగింది తన్మయ. ఇది సాదారణ సమస్యే అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలు ప్రతి మనిషి పరిగెట్టేది ఏదో నేర్చుకోవాలని లేదా ఏదో సాధించెయ్యాలని. నిజమైన జ్ఞానాన్ని సంపాదించిన మనిషికి కొత్తగా నేర్చుకోవటానికి ఏమీ ఉండదు, ఏదో సాధించేద్దామనే ఆసక్తి ఉండదు.

రాజేష్ చెప్పటం కొనసాగించాడు. “సరిగ్గా తనకి పదేళ్ళున్నప్పుడు తన తల్లిదండ్రులు కారుప్రమాదంలో చనిపోయారు. బంధువులు ఆనంద్‌ని హాస్టల్‌లో జాయిన్ చెయ్యాలనుకున్నారు. కానీ ఆనంద్ అందుకు ఒప్పుకోలేదు. ఆ వయస్సు నుండి తను ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. తనే వంట చేసుకునేవాడు. తనే ఇంటి పనులన్నీ చేసుకునేవాడు. బంధువులు మొదట్లో కంగారుపడినా తర్వాత అలవాటు పడిపోయారు. తోటివారితో పెద్దగా కలిసేవాడు కాదు. నాతో బానే ఉంటాడు, కానీ కొత్తవారితో తొందరగా కలవడు. ఇల్లు దాటి బయటకు రావటానికి ఇష్టపడడు. తన ఇంటికి ఎవరిని ఆహ్వానించడు. కాస్త స్థితిమంతుడవ్వటంతో ఇంతవరకూ ఏ ఇబ్బంది కలగలేదు. ఇకనైనా మారకపోతే ముందు ముందు బ్రతుకు గడవటం కష్టం. అది వాడికి తెలియటం లేదు. ఏదో మానసిక సమస్యే అయ్యుంటుందని నా అనుమానం. డాక్టర్ అంటే రాడని ఇలా పార్టీకి తీసుకు వచ్చాను.”

రాజేష్ మాటలు వింటే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన షాక్‌లో తనకి ఇలాంటి సమస్య వచ్చుంటుందని అనుకుంది తన్మయ. రాజేష్ వెంట నడిచింది.రాజేష్ స్నేహితులని పరిచయం చేస్తున్నట్టుగా తన్మయను పరిచయం చేసాడు. అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. మాటల మధ్యలో చరిత్ర, జ్యోతిష్యం తనకిష్టమైన విషయాలని చెప్పాడుఆనంద్. జ్యోతిష్యం ఒక ట్రాష్ అని మనుషుల నమ్మకాలు, బలహీనతల్ని సొమ్ము చేసుకునే వ్యాపారమని తన్మయ కొట్టి పారేసింది.

“బౌతికంగా చూపించలేని ఒక మనస్సనే వస్తువును సృష్టించి, శాస్త్రీయంగా నిరూపించలేని సమస్యలని దానికి ఆపాదించి, కేవలం అంచనాలతో, స్వంత అవగాహనలతో మీరు చేసే వైద్యం శాస్త్రీయమని మీరు నమ్ముతున్నప్పుడు, ఖచ్చితమైన లెక్కలతో గణించే శాస్త్రాన్ని నేను నమ్మటం లో తప్పేంటి” అని సూటిగా తన్మయను చుస్తూ అడిగాడు ఆనంద్. తను అతని కళ్ళలోకి చూసేసరికి అతని కళ్ళు తిరిగి మీనాలయ్యాయి. ఇంత బేలగా కనిపిస్తున్న వ్యక్తి మాటల్లో అంత పరిశీలన అని ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది తన్మయ. తన ఆశ్చర్యాన్ని గమనిస్తూ “వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కేవలం అంచనాలు. ఆలోచనలు మాత్రమే నిర్దుష్టమైనవి, ఎవరూ తెలుసుకోలేనివి” అని నవ్వాడు. ఈసారి తన్మయకు కళ్ళు బైర్లు కమ్మాయి. అతను తన మనస్సు చదివేసాడు. తన్మయకొక క్షణం భయం, ఆందోళన కలిగాయి. ఇన్నేళ్ళ తన చదువుకి లొంగని దృడమైన ఆలోచనలేవో అతని వద్దున్నాయి అనిపించింది. తన్మయ స్నేహితులు కొందరు అటుగా వచ్చేసరికి ఆనంద్ తిరిగి బేలగా మారాడు. పార్టీ ముగిసి ఆందరూ వెళ్ళిపోయారు. తన్మయ రాజేష్‌తో తర్వాత మాత్లాడతా అని చెప్పి వచ్చేసింది.

ఇంటికొచ్చినా తన్మయ ఆలోచనలు ఆనంద్ చుట్టూనే తిరుగుతున్నాయి. మర్నాడు క్లినిక్ వెళ్ళకుండా రాజేష్‌ని అడిగి ఆనంద్ అడ్రస్ తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది. చుట్టూ పెద్ద తోట మధ్యలో రాజ్‌మహల్లా ఉంది ఆ ఇల్లు. పనివాళ్ళు ఎవరూ లేనట్టున్నారు. ఇంత పెద్ద బంగళాని పనివాళ్ళు లేకుండా ఒంటరిగా నెట్టుకొస్తున్నాడా అని ఆశ్చర్యపడింది తన్మయ. తోట దాటి బంగళా లోకి వచ్చి తలుపుకొట్టింది. తలుపుకొట్టిన చాలాసేపటికి ఆనంద్ వచ్చి తలుపుతీసాడు. ఒకింత ఆశ్చర్యంగా తనవైపు చూసాడు.
“ఈరోజు క్లినిక్‌కి వెళ్ళాలనిపించలేదు. కాసేపు మీతో మాట్లాడదామని వచ్చాను. మీకభ్యంతరం లేకపోతేనే” అని అడిగుతూ అతని కళ్ళల్లోకి చూసింది తన్మయ. అతను కళ్ళు పక్కకు తిప్పుకుని దారి వదిలాడు. తన్మయ లోపల అడుగుపెట్టి అతడిని అనుసరించింది.

ఇల్లంతా పురాతన రాజప్రసాదంలా ఉంది. చెక్కతో చేసిన సోఫాలు, కుర్చీలు, పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్‌లు అంతా ఏదో మ్యూజియంలా ఉంది. నా ఆలోచనలు పసిగట్టిన ఆనంద్ తమది రాజవంశమని, తమ వంశ పెద్దలు విజయనగర ప్రభువుల దగ్గర దివానులుగా పని చేసేవారని చెప్పాడు. ఆశ్చర్యంగా ఇల్లంతా కలియతిరిగింది తన్మయ. పెద్ద పేద్ద  డైనింగ్ టేబుల్లు, పెద్ద లైబ్రరీ అన్నింటిని చిన్నపిల్లలా సంబ్రమంగా చూస్తున్న తన్మయను చూసి ఆనంద్ నవ్వుకున్నాడు. అతనికి తన్మయ దగ్గర బెరుకుపోయింది. అలా చూస్తూ పూజగది దగ్గరకు వెళ్ళిన తన్మయను ఆపేసి వెనక్కు తీసుకు వచ్చేసాడు ఆనంద్.

ఆరోజు నుండీ రోజూ తన్మయ ఏదో ఒక సమయంలో ఆనంద్ ఇంటికి వెళ్ళేది అతడితో కబుర్లు చెప్పేది. ఒకరోజు లైబ్రరీలో ఝాన్సీ లక్ష్మీభాయ్ చరిత్ర పుస్తకాన్ని చూసి “ధీరవనిత, తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు కదా” అంది తన్మయ. ఆనంద్ ఏటో చూస్తూ “ఆరోజు జరిగిన విప్లవానికి ప్రధాన కారణం మత విశ్వాసాలు, రాజ్య సింహాసన రక్షణ. కానీ విచిత్రంగా చరిత్రలో మొదటి స్వాతంత్ర్యసమరంగా వక్రీకరించబడింది. ప్రజాస్వామయయుత స్వాతంత్ర్యాన్ని నిజానికి ఏ రాచరికం కోరుకోలేదు” అని చెప్పాడు.

అతనితో జరిపే సంభాషణలు ఆమెకు కొత్త పాఠాలు నేర్పేవి. చరిత్రను పుస్తకాల్లో వ్రాయబడ్డ కథల్లా కాక వాస్తవిక దృష్టితో చూడటం నేర్పేవి. అందుకే తన్మయ వీలు చిక్కినప్పుడల్లా ఆనంద్‌ని కలిసేది. అంత చనువులోనూ ఆనంద్ తన ఇంటిలో కొన్ని గదుల్లోనికి తన్మయను రానిచ్చేవాడు కాదు. ఏదో రహస్యం దాస్తున్నాడని ఆమెకు అనిపించేది. ఒకరోజు ఆనంద్ తోటపనిలో ఉండగా తన్మయ నేరుగా ఇంటిలోకి వచ్చింది. లైబ్రరీలో పుస్తకాల కోసం చూస్తున్న తన్మయకు ఒక పాత డైరీ కనిపించింది. లోపల చూస్తే చిన్నపిల్లల చేతివ్రాతతో డైరీ వ్రాయబడి ఉంది. తన్మయ ఆ డైరీని తన బ్యాగ్‌లో వేసుకుని ఆనంద్ కంటపడకుండా వచ్చేసింది.

ఆ డైరీ ఆనంద్ తల్లిదండ్రులు చనిపోక ముందు వ్రాసుకున్నది. పుట్టినరోజుకి తండ్రి తనకు డైరీ బహుమతిగా ఇచ్చాడని, ప్రతిరోజు వ్రాయమని చెప్పాడని అందులో వ్రాసుకున్నాడు ఆనంద్. పేజీలు తిప్పుతూ ఉంటే ఆనంద్‌కి తనతండ్రి చెప్పిన రాజులకధలు ఉన్నాయి. కోట నుండీ రహస్య మార్గాలు, సొరంగ మార్గాల్లో నిధినిక్షేపాలు, కోట ముట్టడి జరిగినప్పుడు వారసులని రహస్యంగా కోటదాటవేయడాలు ఇలాంటి విషయాలు తన తండ్రి దగ్గర విని ఎంతో ఆసక్తిగా వ్రాసుకున్నట్టు తన్మయకు అర్ధమయ్యింది. విజయనగర ప్రభువులు దగ్గర ఆనంద్ వంశ పెద్దలు దీవానులుగా చూపిన తెగువ, యుద్ధంలో ప్రభువు రక్షణ కోసం ప్రాణాలర్పించిన త్యాగాలు, శత్రువుల చేత చిక్కినప్పుడు రహస్యాలు బయటపెట్టకుండా చేసిన ఆత్మత్యాగాలు ఎంతో గర్వంగా వ్రాసుకున్నాడు.

అన్నీ ఆసక్తిగా చదువుతున్న తన్మయకు ఒక పేజి ఎర్ర సిరాతో కనిపించింది. “నాన్న ఈరోజు నాకొక రహస్యం చెప్పారు. విజయనగర ప్రభువుల రహస్యమొకటి మా దేవుడిగదిలో భద్రంగా దాచబడిందని, దాని రక్షణ మా కుటుంబ కర్తవ్యమని చెప్పారు. ఆ రహస్యం తెలుసుకోవటానికి గూఢచారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మా ఇంటి పనివాళ్ళలో కూడా శతృ గూఢచారులుండొచ్చని నాన్న అనుమానం. నాన్న తరువాత ఆ బాధ్యత నాదేనంట” అని వ్రాసి ఉంది.

తన్మయకు ఒకింత ఆశ్చర్యం, ఆసక్తి కలిగాయి. అందుకే ఆనంద్ నన్నెప్పుడూ దేవుడి గది వైపు వెళ్ళనీయలేదు అనుకుంది. తరువత పేజి తిప్పి చూసింది “ఈ రోజు నాన్న, అమ్మ వెళ్తున్న కారుని శత్రువులు లారీతో గుద్దేసారు. ప్రభువుల కోసం ప్రాణత్యాగం చేసిన నాన్న మా వంశకీర్తిని కాపాడాడు. ఇక పైన భాద్యతలన్నీ నావే” అని వ్రాసుకున్నాడు ఆనంద్. అదే చివరిపేజి.

తన్మయ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. తనకు పరిచయం లేని ఏదో వింతలోకంలోకి వచ్చిపడ్డట్టుగా అనిపించింది ఆమెకు. వెంటనే రాజేష్‌కి ఫోన్ చేసి “ఆనంద్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారని” అడిగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పాడు రాజేష్. “ఆ రోడ్డు ప్రమాదం వెనుక మిస్టరీ ఉంది” అని చెప్పింది తన్మయ. “నీకెలా తెలుసు” అని అడిగాడు రాజేష్. తన్మయ తను చదివిన విషయాలన్నీ చెప్పింది రాజేష్‌కి. రాజేష్ నమ్మలేనట్టుగా మాట్లాడేసరికి ఫోన్ పెట్టేసింది.

ఆ రోడ్డు ప్రమాదం రహస్యాలు తెలుసుకోవాలని బలంగా అనుకుంది తన్మయ. వృత్తి రిత్యా కొన్ని సందర్భాల్లో పోలీసు కేసుల్లో తన్మయ సహాయం చేసింది. అప్పటి నుండి పోలీస్ కమీషనర్ తన్మయని ఎంతో ఆదరంగా చూస్తాడు. ఆ కమీషనర్ సహాయం తీసుకుంటే రోడ్డుప్రమాదం కేసు తిరిగి తోడచ్చని అనుకుంది. మరుసటిరోజు ఉదయం కమీషనర్ దగ్గరకి వెళ్ళి తను వచ్చిన పని చెప్పింది తన్మయ. కమీషనర్ నవ్వి “నువ్వు చెప్పేదంతా ఏదో చందమామ కథలా ఉందమ్మా” అంటుండగా అతనికి ఫోన్ వచ్చింది. అతను షాక్ గురయినట్టు మొహం పెట్టి “ఎంత యాధృచ్చికమో చూసావా తన్మయ? ఆ ఆనంద్ ఇంటిలో దొంగలుపడ్డారంట, అతనికి కత్తి గాయాలయ్యాయంట. అదే ఫోన్. పదా” అంటూ తన్మయను తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరాడు కమీషనర్. తన్మయ కూడా షాక్‌లో ఉంది ఇన్నేళ్ళుగా ఆనంద్ ఒంటరిగా ఉన్నా ఎప్పుడూ జరగని దొంగలదాడి ఈరోజే ఎందుకు జరిగింది? తను ఈ రహస్యం బయటపెట్టడం వలన ఈ ప్రమాదం జరిగిందా? అవును రాజేష్. రాజేష్ శత్రువుల గూఢచారా? ఆలొచనలతో తన్మయ బుర్ర పగిలిపోతుండగానే హాస్పిటల్ వచ్చింది.

కమీషనర్‌ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చిన పోలీసులు “దొంగలుపడి ఇల్లంతా గాలించినట్టు తెలుస్తుంది సార్. ఏదీ దొరక్క ఆనంద్‌ని గద్దించేసరికి, ఆనంద్ బయపడి తన మెడ తనే కోసుకున్నాడు. పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని” చెప్పారు. తన్మయ పెదాలు ఆప్రయత్నంగా కదిలాయి “ప్రభువులకోసం ఆత్మత్యాగం”

ఐ.సి.యు.లో ఉన్నా అనంద్‌ని చూస్తే తన్మయకు దుఃఖం ఆగటంలేదు. కమీషనర్ తనని సముదాయించి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇంటికి కారులో బయల్దేరిన తన్మయ ఒక్కసారిగా కారు వెనక్కి తిప్పి ఆనంద్ ఇంటికిపోనిచ్చింది. ఇంతమంది ప్రాణాలు తీసిన ఆ రహస్యం ఈరోజు బయటపడాల్సిందే అని పిచ్చికోపంతో ఊగిపోతూ సరాసరి ఆనంద్ పూజగదిలోకి వెళ్ళింది. ఎన్నో రోజులుగా పూజ లేక బూజుపట్టిన ఆ గదిని చిందర వందర చేస్తూ వెతకసాగింది. ఆఖరికి దేవీపీఠం క్రింద ఒక చిన్న పెట్టె దొరికింది. దాని చుట్టూ ఒక తెల్ల గుడ్డ చుట్టి ఉంది. దాని మీద రహస్యం అని వ్రాసి ఉంది. పిచ్చి పట్టినదానిలా ఆ తెల్ల గుడ్డని పీకి పారేసింది తన్మయ. పెట్టె తీయగానే అందులో ఒక వజ్రపుటుంగరం, ఒక ఉత్తరంకనిపించాయి. ఉత్తరం తెరిచింది.

“ఆనంద్ బాబూ, నీకు ఇరవయ్యవ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇన్నేళ్ళుగా రహస్యం అని నీకు చెబుతున్నది ఈ ఉంగరం గురించే. కాకపోతే ఇది విజయనగర ప్రభువుల రహస్యం కాదు. మన ఇంటి రహస్యమే. ఈ ఉంగరం నేను మీ అమ్మకు చదువుకునే రోజుల్లో ఇచ్చిన మొదటి బహుమతి. తరువాత మీ అమ్మ నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం.  అందుకే ఇది మన ఇంటి లక్కీ చార్మ్. ఈరోజుతో నీకు ఇరవై నిండాయి కాబట్టి ఇకపై నీ స్వంత ఆలోచనలు నీకు ఉంటాయి. నీ మనసులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఉంగరం బహుమతిగా ఇవ్వు. ఆ అమ్మాయి తప్పక నిన్ను పెళ్ళి చేసుకుంటుంది. ఈ ఉంగరం మన ఇల్లు దాటి వెళ్ళదు. కేవలం నిన్ను థ్రిల్ చేద్దామనే ఇన్నేళ్ళుగా ప్రభువుల రహస్యం అని కథ చెప్పి నిన్ను నమ్మించా. ఎలా ఉంది ఈ సర్‌ప్రైజ్? వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే”

తన్మయకు తల తిరిగింది, మాటలు ఆలోచనలు ముందుకు సాగటం లేదు. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఆమె సెల్‌కి మెసేజ్ వచ్చింది. నంబర్ చూస్తే పోలీస్ కమీషనర్. మెసేజ్ ఒపెన్ చేసింది

“ఆనంద్ ఈజ్ నో మోర్”