లాలీ జో.. లాలీ జో..

నిన్న రాతిరి కలలో ఓ మల్లెపువ్వు,
కాదు అందాల చందమామ,
కానే కాదు, నాకు పుట్టబోయే చంటిపాప.
నా చెంప పై తన గులాబిరేకుల పెదాల తడి
ఇదిగో ఇంకా అలానే వుంది.

బదులుగా నేనేమివ్వాలి? ఏదైనా చేస్తా.
నా దగ్గరున్న కరెన్సీ పావురాల్ని పంపి
తను ఏమి కావాలన్నా తెస్తా.
ఇంతకీ తనకేం కావాలో?
ఆశగా తన కళ్ళ లోకి చూసా.
చిన్ని చిన్ని తేనె కళ్ళలో
కోటి చందమామల వెలుగు.

ముద్దు ముద్దు మాటల్లో ముత్యాల మూటలు
జారితే ఏరుకోడానికి సిద్దపడ్డా.
“నాకు ఏం కావాలంటే?..
గున్నమావితోపులో కోయిలమ్మ పాట,
సన్నజాజి పందిరిపై వెన్నెలమ్మ,
కనకాంభరం పూలలోని తేనె,
పేదరాశి పెద్దమ్మ కధలు,
గుడుగుడు గుంచం ఆటలు,
పెరటి లోన పెంచుకున్న జామకాయ,
ఊరి చివర తోపులోని చింతకాయ,

సాయిబుతాత గుఱ్ఱపు సవారి,
చిట్టి పొట్టి పట్టు పరికిణీ.
బంగారు చింత చిగురు పట్టీలు,
రాజ్యం పిన్ని జడగంటలు,
బామ్మ చేతి రవ్వలడ్డు,
తాతయ్య ఏనుగు అంబారీ
ఒక్కటైనా తెచ్చివ్వు” అంది గోముగా.

నిస్సార జీవితం లో నిస్సహాయతండ్రి.
“పిచ్చితల్లీ, ఈ కాంక్రీటు వనాల్లో ఉండేవి
ప్లాస్టిక్ ముఖాలు, ఫైబర్ మనసులు…”
వెంటనే ఆ చిన్ని కళ్ళలో నీటి తడి.

అమ్మో! ఏడవకు తల్లీ.
నా వద్ద ఉన్నదంతా ఇచ్చి,
ఒక్కటైనా తెచ్చిస్తా చిట్టితల్లీ.
బజ్జోనాన్న కన్నా లాలీ జో.