ఆ రోజేం ఆకాశం ఉరమ లేదు. జడివాన, తొలకరి లాంటివేం లేవు. వొంటిని తడిమేసే చిరుచలికి అదేం శీతాకాలం కాదు. ఏకాంతం ఆసరాగా చేసుకుని నా ఒంటరి తనాన్ని బాధించే పౌర్ణమి రాత్రులూ కావు. పక్కింటిలోనో, పొరుగింటిలోనో పరవశంలో ఉన్న జంటలని చూసి పనిగట్టుకుని పులకరింపులు వెతుక్కునే ఓపికా నాకు లేదు. కానీ తను గుర్తొచ్చింది. ఉదయాన్నే లేచి టీ తాగినంత అలవాటుగా. సిగరెట్, మందు కంటే బలమైన వ్యసనాలున్నాయి, మనసుకి.
తన ఆలోచన కదిలిందంటే ముందుగా గుర్తొచ్చేది తన కళ్ళే. హేజెల్ కళ్ళు. చిన్నప్పుడు బొమ్మల షాపుల్లో చూసిన బొమ్మకళ్ళవి. మొదటిసారి చూసినప్పుడు అవి నిజమైన కళ్ళని నమ్మలేక పోయాను. పదే పదే చూస్తుంటే ఆ కళ్ళల్లో తొంగిచూసిన చిరాకు, చెంప మీద చరిచినట్టుగా అనిపించింది. చూపు పక్కకి తిప్పుకున్నా. అలా దొంగలా దొరికిపోవటమేం మొదటిసారి కాకపోయినా, ఈ హేజెల్ కళ్ళకి అలా దొరికిపోవటం ఇబ్బందిగా అనిపించింది. తిరిగి చూద్దాం అంటే ఆ కళ్ళ దృష్టిలో మరింత దిగజారిపోతాననే భయం పట్టి ఆపింది.
ఆ రోజంతా ఆ కళ్ళ గురించే ఆలోచన. క్లాసులో కూర్చుని నోట్‌బుక్ వెనుక పేజ్‌లో ఎవేవో కళ్ళు పెన్‌తో గీస్తున్నా. క్లాస్ అయ్యేపాటికి ఆ పేజ్ అంతా కళ్ళే, కానీ ఏ కళ్ళలోనూ ఆ హేజెల్ కళ్ళు కనిపించలేదు. పుస్తకం ఊపుకుంటూ వచ్చి బస్‌స్టాప్‌లో నిలబడ్డాను. మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తే బావుండనిపించింది. కానీ ఎలా? ఇంత పెద్ద హైదరాబాద్ లో, నిత్యం వేల మంది ఇదే అమీర్‌పేట్ బస్‌స్టాప్‌లో దిగుతారు. బస్ ఎక్కడ ఎక్కిందో కూడా తెలియదు. లెన్స్ పెట్టుకుంటే ఏ రంగు కావాలంటే ఆ రంగు కళ్ళు దొరుకుతాయి అని పక్కనే అప్పట్లో ఉన్న ఫ్రెండ్ ఎవడో అన్నాడు.
“ప్లాస్టిక్ తో అందమైన పూలు చెయ్యగలవోయ్ పిల్లోడ, కానీ మకరందం?” అని ప్రశ్నించే తూనీగ వాడి చెవిలో ఝుమ్మని ఎప్పుడంటుందో.
మరుసటి రోజు కూకట్‌పల్లి బస్‌స్టాప్‌లో నాలుగు బస్‌లు వదిలేసా, హేజెల్ కళ్ళు లేవని. బస్‌లే కాదు, వారం రోజులు కూడా అలా సజెషన్‌లో నన్ను నిలబెట్టి పాస్ అవుతూ వెళ్ళిపోయాయి. ఇలాంటివేం కొత్త కాదు కదా అని నన్ను నేను సరిపెట్టుకున్నా.
నాకు పదేళ్ళు ఉన్నప్పుడు తిరుపతిలో ఒకసారి గుండు చేయించుకుంటూ, పక్కన ఏడుస్తున్న సాటి గుండును చూసాను. వాళ్ళ అమ్మ “ఏం కాదమ్మా, మళ్ళీ నీ జుత్తు నీకు వచ్చేస్తుందే” అని నవ్వుతూ బుజ్జగిస్తోంది. ఆ గుండు పిల్ల ఎంత ముద్దుగా ఉందో. దర్శనానికి వెళ్ళినప్పుడు పట్టు లంగా, జాకెట్టు వేసుకుని క్యూలో కనిపించింది. దేవుడిని చూడటానికి వస్తే, ఆయనే నాకు ఈ పిల్లని చూపించాడని బలంగా అనిపించింది. మా ఊరొచ్చేసాక, ఆ పిల్ల మా స్కూల్లో వచ్చి జాయిన్ అయినట్టు రోజూ కలలు కనే వాడిని. నా స్కూల్ అయిపోయింది కానీ ఆమె వచ్చి జాయిన్ కాలేదు. కాబట్టి ఇవన్నీ మామూలే. కొన్ని రోజుల్లో మరిచిపోయి ముందుకి వెళ్ళిపోతాం.
కానీ ఆ గుండుపిల్ల వదిలేసినంత తేలికగా ఈ హేజెల్ కళ్ళు నన్ను వదలలేదు. మళ్ళీ కనిపించింది బస్‌లో. నేనే కాదు తనూ గుర్తుపట్టింది. పక్కనే ఉన్న అద్దంలో నా మొహం నేను చూసుకున్నా. తన కళ్ళలా నాలో ఏముంది గుర్తుంచుకునేంతలా అని. ఈసారి బస్ దిగి ఆ పిచ్చి జావా క్లాస్‌కి పోలేదు. ఆమె వెంటే నడుచుకుంటూ వెళ్ళాను. మరో ఇద్దరమ్మాయిలతో కలిసి ఒక టెస్టింగ్ ఇనిస్టిట్యూట్‌లోకి వెళ్ళింది. ఆమె బయటకి వచ్చేంత వరకూ అక్కడే తిరుగుతూ గడిపాను. ఆమె బయటకి వస్తూనే నన్నే చూసింది. నవ్వింది. కళ్ళతోనే కాదు, ఆమె పెదాల పైన కూడా కనిపించేలా. బస్‌స్టాప్ వరకూ తన వెనుకే వెళ్ళాను. పక్కనున్న అమ్మాయిలతో మాట్లాడుతూ మధ్యలో చూస్తునే ఉంది. తను ఎక్కిన బస్సే ఎక్కాను. ఈసారి ఆమె చూసినప్పుడు, నా నోట్‌బుక్‌లో దాక్కున్న ఆ వేల కళ్ళకి ఆమెని చూపించాను, ఆమెకి వాటిని కూడా. ఆమెకి చప్పున అర్ధం కాక, అటూ ఇటూ చూస్తున్నట్టుగా రెండు మూడు సార్లు చూసింది. అర్ధమయ్యాక ఎవరికీ అర్ధంకాకుండా దాచుకుంటూ తనలో తనే నవ్వుకుంది.
నేను ఎప్పటిలా కూకట్‌పల్లిలో దిగిపోయాను. తను కిటికీలో నుండి చూసింది. నేను ఎక్కడ దిగానో తెలుసుకుంటూ, ఆ విషయాన్ని నాకు తెలియజేస్తూ.
తన ఇనిస్టిట్యూట్, క్లాస్ టైమింగ్స్ తెలిసాక ఏ బస్ లో ఉంటుందో వెతుక్కోవాల్సిన పని పడలేదు. ఆ రోజు నుండి క్లాస్ అయ్యాక తను నేరుగా వెళ్ళిపోకుండా, పక్కనే ఉన్న బేకరీలో కాసేపు ఫ్రెండ్స్‌తో గడిపేది. నాకు కాస్త సమయం ఇవ్వటానికే తప్ప బేకరీ మీద అభిమానం కాదు. ఒకరోజు ఆర్డర్ కోసం కౌంటర్ దగ్గరకి వెళ్తూ బ్యాగ్స్, బుక్స్ ఒక టేబుల్ మీద వదిలేసారు. ఆమె బుక్ తీసి తన పేరు చూద్దామని వెళ్ళాను. వెళ్తున్నంత సేపూ “సునేత్రి.. సునయన” అని ఏవో గెస్ చేస్తూ వెళ్ళాను. వాళ్ళ నాన్నకి అంత టేస్ట్ లేదనుకుంటా అక్కడ “వైశాలి” అని కనిపించింది. నేను ఆ బుక్ చూడటం ఆ హేజెల్ కళ్ళ వైశాలి గమనించింది. “బావుందా” అన్నట్టు సైగ చేసింది. “ఓకె ఓకె” అన్నట్టు రెస్పాన్స్ ఇచ్చాను. సీరియస్ లుక్కిచ్చింది. నాకు నవ్వొచ్చింది. ఆ రోజు బస్ దిగేంత వరకూ తన కళ్ళలో కోపం, నాకేమో తెరలు తెరలుగా నవ్వు.
బుక్ అనే ఒక కమ్యూనికేషన్ డివైజ్ దొరికాక, ఆ బేకరీ సెషన్స్ మరింత ఎక్సైటింగ్‌గా అనిపించేవి. “నీ గొప్ప పేరేంటో ఇంతకీ?” అని వ్రాసి ఆర్డర్ చెయ్యటానికి కౌంటర్ దగ్గరకి వెళ్ళింది. “నీ గొప్ప ఫోన్ నంబర్ చెబితే, ఒక గొప్ప మెసేజ్‌లో పంపిస్తా” అని వ్రాసి వచ్చేసా. తను ఏదో వ్రాసి వాటర్ తెచ్చుకునే వంకతో పక్కకి వెళ్ళింది. నేను ఆశగా మొబైల్ ఓపెన్ చేసి నంబర్ డయల్ చేసేందుకు సిద్దపడుతూ వెళ్ళాను. “స్పీడ్ థ్రిల్స్. బట్ కిల్స్ – కొండాపూర్ ఆర్.టి.ఏ” అని వ్రాసి ఉంది. ఈసారి బస్‌లో నా మోహంలో కోపం, తనకేమో ఆగని నవ్వు. ఐరనీ ఏంటంటే నా పేరు చెప్పలేదు ఇప్పటి వరకూ, ఆమె తన ఫోన్ నంబర్ కూడా.
“ఐ బిలీవ్ ఇన్ క్లాక్. నాట్ ది టైమ్” అన్న మాటలు పలకరించాయి ఆ రోజు ఆమె బుక్‌లో. నన్ను రోజూ కవ్వించే కొంటెపిల్ల కాదు ఆమె ఆ రోజు. ఇంత స్పష్టమైన షార్ప్ మాటలు తను వ్రాసిందా అంటే, ఆమెకి తెలిసిన భాషలో ఇంతే సూటిగా. “నీ ఫోన్ నంబర్ వద్దు. నా ఆఫర్ లెటర్‌లో నీకు నా పేరు చూపిస్తా” అని వ్రాసాను. ఆ రోజు బస్‌లో ఇద్దరి మొహాల్లో భారంగా దిగులు. ఆ కాస్త ప్రయాణానికి ఎన్ని యుగాలు పట్టిందో. ఇప్పుడు ఆ క్షణాలని థర్డ్ పర్సన్ వ్యూలో మాత్రమే చూడగలనని తెలుసు. అయినా ఎక్కడో చిన్న బాధ తెలుస్తూనే ఉంది. కాసేపు ఆరనిస్తే బట్టలు ఆరిపోతాయి, కానీ తడిగా ఉన్నప్పటి వాటి భారం, మోసిన ఆ తాడుకి ఎంతో కొంత గుర్తుంటుంది.
కోర్స్ మధ్యలో సంక్రాంతికి బ్రేక్ వచ్చింది. ఊరు వెళ్ళే ముందే తనని కలవాలనుకున్నా. కానీ ఆ రోజు ఎందుకో తను క్లాస్‌కి రాలేదు. ఊరు వెళ్ళాక అనుకోకుండా బంధువుల్లో ఒకరు చనిపోవటంతో రెండు వారాల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాను. వైశాలి కనిపించలేదు. బస్‌స్టాపులో, బేకరీలో, ఆ ఇనిస్టిట్యూట్ ముందు ఎన్ని రోజులు పడిగాపులు పడినా ఆ హేజెల్ కళ్ళ వైశాలి కనిపించలేదు.
నాకు ఆఫర్ లెటరే కాదు, దాని తర్వాత ఒక నాలుగైదు హైక్ లెటర్స్ కూడా వచ్చాయి. కొన్ని జతల కళ్ళు నా జీవితంలోకి వచ్చి వెళ్ళాయి కూడా. కానీ ఇప్పటికీ మీటింగ్ రూమ్స్‌లో, కాన్ఫరెన్స్ కాల్స్‌లో నా చేతిలోని పెన్ను ఫేషియల్ టిష్యూ మీద, స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ మీద ఆ హేజెల్ కళ్ళనే వెతుకుతోంది.
నాది పిచ్చి అనని వాళ్ళెవరూ నా సర్కిల్స్‌లో, వాట్సాప్ గ్రూపుల్లోనూ, నాజీవితంలోనూ లేరు. అయినా ఆ అందమైన హేజెల్ కళ్ళు వీడు నావాడు అని ప్రకటించి, నా గుండెలపై వాలితే వచ్చే గర్వం, ఆనందం వీళ్ళకి ఎలా అర్ధమవుతుంది. పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి, పిల్లలు పుడితే అన్నీ అవీ సర్దుకుంటాయి అనే థియరీకీ వ్రేలాడే కొమ్మలే అన్నీ. ఏదో కావాలని వెతకటం, ఇదే కావాలని పరితపించటం చేస్తే ఈ లోకం నీ పిచ్చితనానికి, చేతకానితనానికి, అమాయకత్వానికి, తెలివితక్కువతనానికి ఎంత జాలిపడుతుందో తెలుసా?
ఆకలి తొందరపెడుతూ ఉంటే ఆ హేజెల్ కళ్ళ జ్ఞాపకాల స్క్రోలింగ్ ఆపి, స్విగ్గీ స్క్రోలింగ్ మొదలుపెట్టా. “ఈ బస్‌స్టాపులో ప్రేమలు, పుస్తకాల్లో రాయబారాలు అయితే మీ అమ్మకి కూడా ఉన్నాయి తెలుసా” అంటూ ఫోన్‌లో అమ్మ పలకరించింది. పక్కనే నాన్న ఉన్నారా? ఉంటే కోపంగా చూస్తారా అని ఆలోచిస్తున్నా నేను.
“మొన్నెప్పుడో వైజాగ్ షాపింగ్ మాల్‌లో ఒకాయన కనిపించాడురా. నన్ను చూసి పలకరించాడు. పేరు రాంబాబో, రామకృష్ణో చెప్పాడు. కాలేజ్ రోజుల్లో మేముండే వీధిలో గది తీసుకుని ఉండే వాడంట. నన్ను ఫాలో అయ్యే వాడంట. నా ఊహకి అందలేదు. ఎందుకంటే నాకు సరిగా గుర్తులేదో లేక తప్పుగా గుర్తు పెట్టుకున్నానో. తెల్లగా ఆరడుగుల మనిషి మంచి మీసకట్టు, తలకట్టు రూపంలా మసక మసకగా గుర్తు. ఈయనేమో ఆ రూపానికి సరితూగేలా లేడు.” అమ్మ కథలల్లుతుందో లేక నిజం చెబుతుందో తెలియదు. కానీ నాకెందుకు చెబుతుందో మాత్రం అర్ధమయ్యింది. రెండురోజుల్లో పెళ్ళి చూపుల కోసం ఊరెళ్ళాలి.
అమ్మాయితో మాట్లాడమని నాకు బాల్కనీలో కుర్చీ వేసారు. పెద్దవాళ్లంతా హాల్‌లో కూర్చుని ఉన్నారు. నేను కాఫీ తాగుతూ ఉంటే అమ్మాయి వచ్చింది. హేజెల్ కళ్ళు. ఆశ్చర్యం నాకే కాదు తనకి కూడా.
“హాయ్ నా పేరు శ్రావణి.” అంది. హేజెల్ కళ్ళ శ్రావణి, హేజెల్ కళ్ళ వైశాలి కాదు.
“నా పేరు..” అని చెప్పబోతుంటే “నాకు తెలుసు. గౌతమ్ కదా మీ పేరు. ఈ మ్యాచ్‌కి ముందే నాకు మీరు తెలుసు” అంది. నేను “ఎలా?” అన్నట్టు చూసా.
“మా ఆఫీస్ వాట్సాప్ గ్రూపులో ఒక కవిత ట్రెండ్ అయ్యింది. వ్రాసింది ఎవరు అని అడిగితే మీ ఫేస్‌బుక్ లింక్ ఇచ్చారెవరో. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టలేదు కానీ మీ పబ్లిక్ పోస్టులన్నీ చదువుతూ ఉంటా. ఐ రియల్లీ లవ్ దెమ్.” అని తన ఫోన్‌లో స్క్రీన్‌షాట్స్ తీసి ఉన్న నా పోస్ట్స్ చూపించింది.
నా అక్షరాల వెనుక తను వెతుక్కున్న అర్ధాలు చెప్పింది. తనకి మూడ్ బాలేనప్పుడు గుర్తుచేసుకునే లైన్స్ గురించి చెబుతూ, ఆ స్క్రీన్ షాట్స్‌లో ఆత్రంగా వెదుకుతూ వాటిని నాకు చూపించింది. నా అక్షరాలను నా అంతలా ప్రేమించే మనిషి ఇన్నాళ్ళకి ఎదురయ్యింది. పెద్దవాళ్ళు వచ్చి పిలిచే వరకూ మాట్లాడుతూనే ఉంది ఆ హేజెల్ కళ్ళ శ్రావణి.
ఇంటికి వచ్చేసాక కూడా ఎవరూ నన్నేం అడగలేదు. నాకు భయంగా అనిపించింది.
కాసేపటికి నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. “ధైర్యం చేసి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. యెస్ అయితే యాక్సెప్ట్ చెయ్యండి. నో అయితే ఇకపైన కూడా మీ పోస్ట్స్ పబ్లిక్ లోనే ఉంచండి.” నా గుండె వేగం పెరిగింది.
హైదరాబాద్ వెళ్ళటానికి వైజాగ్ రైల్వే స్టేషన్‌కి వచ్చాను. పదే పదే ఫోన్‌నే చూస్తున్నాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మరో మెసేజ్ కూడా.
“పగలు, రాత్రి, నేను
వాచ్ చుట్టూనే తిరుగుతున్నాం.
టైమ్ ని ఎక్కడో పోగొట్టుకున్నాం”
ఇది నేనే ఎప్పుడో ఫేస్‌బుక్‌లో వ్రాసినట్టు గుర్తు. ఎందుకు పంపించిందో అర్ధం కాలేదు. మళ్ళీ మెసేజ్.
“పగలు, రాత్రి, వాచ్ టైమ్‌ని కొలవటానికే
నువ్వూ, నేనూ కాలాన్ని బంధిద్దామా?”
సచిన్ 99 రన్స్ దగ్గర ఉన్నప్పుడు టివి ముందు నుండి లేచి పక్క గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పటి నా గుండెదడ స్పష్టంగా గుర్తుకొస్తోంది. ఈ హేజెల్ కళ్ళ అమ్మాయిలంతే అంత తేలిగ్గా వదలరు. బ్యాగ్ పడేసి ఫ్లాట్‌ఫామ్ మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అవతలి ఫ్లాట్‌ఫామ్ పైన మళ్ళీ హేజెల్ కళ్ళు.
శ్రావణి కాదు. హేజెల్ కళ్ళ వైశాలి.
ఒక్కసారిగా పరుగు తీసాను. ఆ వేగంలో ఆ ఇనుప ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద పడితే ఆనవాలుకి కూడా ముక్కూ, మొహం మిగలవు. అయినా పిచ్చి పట్టినవాడికి ఆ స్పృహ ఎలా ఉంటుంది. పరిగెట్టుకుంటూ వెళ్తున్నా.
వైశాలి చేతిలో స్టిక్‌తో ఎవరో సాయంతో నడుస్తూ ట్రైన్ ఎక్కుతోంది.
“కుందనపుబొమ్మలా ఉందమ్మా కళ్ళు లేవా పాపం” అని ఎవరో అడిగారు.
“రెండేళ్ళ క్రితం షిర్డీ వెళ్తుంటే బస్‌కి యాక్సిడెంట్ అయ్యింది. చాలామంది పోయారు. మా అదృష్టం కళ్ళుపోయినా పిల్ల దక్కింది” అని చెప్పింది ఆమె. నా పరుగు ఆగిపోయింది, కాసేపు కాలం కూడా.
ఎవరూ గమనించకుండా కాస్త దూరంలో తనకి ఎదురుగా నిల్చున్నా. నావైపే చూస్తున్నట్టున్నాయి ఆ వైశాలి హేజెల్ కళ్ళు. కానీ ఏ శూన్యాన్ని చూస్తున్నాయో. తనకి నేను గుర్తున్నానా? లేకపోతే ఏమని గుర్తుచెయ్యాలి. ఈమె కూడా రాంబాబుని చూసిన అమ్మలా ప్రవర్తిస్తే?
అమ్మ ఫోన్ చేసింది. “అమ్మాయికి నువ్వూ, వాళ్ళ ఫ్యామిలికీ మేమూ నచ్చేసాం. ఇంక నువ్వే చెప్పాలి” అంది.
నన్ను చూడలేని, గుర్తించలేని హేజెల్ కళ్ళ వైశాలి ఒకవైపు. నన్ను సంపూర్ణం చెయ్యటానికి సిద్ధంగా ఉన్న హేజెల్ కళ్ళ శ్రావణి ఒకవైపు. చెప్పానుగా ఆ హేజెల్ కళ్ళు అంత తేలిగ్గా వదలవు.
“నాకు కొంచెం టైమ్ కావాలమ్మా.” అని చెప్పి ఫోన్ కట్ చేసాను.