మహానగరం e-బుక్

 

బ్లాగులో వ్రాయటం మొదలుపెట్టిన మహానగరం కథను, అనేక కారాణాల వల్ల మధ్యలోనే ఆపేసాను. తర్వాత పార్ట్ ఎప్పుడు వస్తుంది అని కామెంట్స్‌లో మిత్రులు అడుగుతూనే ఉన్నారు. కానీ పనుల ఒత్తిడిలో కొనసాగించలేకపోయాను.
ఇప్పటికి సమయం చిక్కి ఈ మహానగరాన్ని పూర్తి చెయ్యగలిగాను. మంచిపుస్తకం పబ్లిషర్స్ ఈ కథను పుస్తకంగా విడుదల చేసారు. పుస్తకంగా పబ్లిష్ చేసిన కారణంగా బ్లాగులో కథను కొనసాగించలేకపోతున్నాను. ఈ విషయంలో ఎవరినైనా డిజప్పాయింట్ చేసుంటే క్షమించాలి. మహానగరాన్ని మొదటి నుండి ఫాలో అయ్యి ప్రోత్సహించిన అందరికీ నా కృతజ్ఞతలు.

ఆసక్తి కలిగినవారు మహానగరం ప్రింట్ పుస్తకాన్ని ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు.

కినిగె లో ఇప్పుడు e-బుక్‌గా అందుబాటులో ఉంది. e-బుక్ ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు.

తేట తేట తెలుగు

“నాకు తెలుగు సంస్కృతియన్న ఇష్టము. తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగుభాషయందు మక్కువ ఎక్కువ.” అని చూపులు కలిసిన శుభవేళలో కోటా శ్రీనివాసరావు గారంటే మా సెడ్డ కామెడీ చేసాడ్రోయ్ అని నవ్వేసుకున్నాం కానీ ఆలోచించలేదు. మనం ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకొన్నాళ్ళకు హిస్టరీ చానెల్లో “పదికోట్లకు పైగా జనాభా కలిగిన ఒక భాష తన ఉనికిని కోల్పోయిందంటే, ఆ జాతి ఎంత నిర్లక్ష్యం చేసింది. అభివృద్దిలో ఎన్నో జాతులుకంటే ముందున్న తెలుగుజాతి ఎందుకు తన భాషను నిలుపుకోలేకపోయింది” అనే డాక్యుమెంటరీని ఆసక్తిగా చూసే పరిస్థితుల్లో మన భావి తరాలు ఉంటాయి. తెలుగుభాష ఎంత మధురమయినదో, ఎంత ఉన్నతమైనదో మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. చెప్పేటంతటి వాడిని కూడా కాదు. తెలుగు సాహిత్యం అమోఘం, అనంతం, అసామాన్యం. అంతటి గొప్ప భాష ఒక జీర్ణభాష కావల్సినదేనా?

మా తరానికి వచ్చేసరికే వాడుకభాష సృష్టిస్తున్న సునామీలో తెలుగు పదసంపద, పద్య సౌందర్యం కొట్టుకుపోయాయి. అంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విధ్యాసంస్థల్లో చదువుతున్న విధ్యార్ధులు తెలుగు చదవలేని, పలకలేని స్థితిలో ఉన్నారు. మరో దశాబ్ధానికి మనం ఏ స్థితికి చేరుకుంటామో ఊహించొచ్చు.

మనందరికీ భాష అంటే అభిమానముంది. మన తెలుగు సంస్కృతంటే మక్కువుంది. దానికి మన బ్లాగులు, మన అభిరుచులే సాక్ష్యం. తెలుగుభాష కనుమరుగవుతుందేమో అనే బాధ కూడా మనలో ఉంది. కానీ మన వృత్తి,వ్యక్తిగత ఒత్తిడుల వలన ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి అని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతున్న మన e-తెలుగు మిత్రులను అభినందించాల్సిందే. e-తెలుగు సభ్యులంతా మనలానే వృత్తిపరంగా అనేక ఒత్తిడులతో సతమతమవుతున్నా, సంస్థ కార్యక్రమాలకి మాత్రం సమయాన్ని కేటాయిస్తునే ఉన్నారు. ఈ సభ్యులందరివీ మనలాంటి మధ్య తరగతి జీవితాలే, మనలాంటి నిత్య జీవనమే. వీళ్ళకున్నవీ మనలాంటి ఆశలు,ఆశయాలు,అభిరుచులే. ఈ కార్యక్రమాలవలన వారిలో ఎవరికీ వ్యక్తిగతంగా ఒరిగేదేమీ లేదు. కానీ భాషకోసం వారు తపిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని సాకుతున్నంత ప్రేమగా భాషకు సేవ చేస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ధారపోస్తున్నారు.

e-తెలుగు ఇన్నేళ్ళ ప్రయాణంలో ఎందరో ప్రముఖులు భుజం తట్టారే కానీ తోడుగా వెన్నంటి రాలేదు. ఏ కార్యక్రమానికీ స్పాన్సర్లు కానీ, భూరి విరాళాలు కానీ లేవు. సభ్యులు తమ సొంత డబ్బు పెట్టుకుని కార్యక్రమాలు నడిపారు. కొందరు సభ్యులు అప్పుచేసి మరీ డబ్బులు పెట్టిన సందర్భాలున్నాయి. ఇంత చేస్తే కనీసం కార్యక్రమంలో పాలుపంచుకోవటానికి కూడా ఏ ఒక్కరూ తీరిక చేసుకోలేదు. ఖర్చుపెట్టిన ధనమంతా బూడిదలో పోసినా పన్నీరే అయ్యింది. అయినా ఎవరూ నిరుత్సాహపడలేదు. బిందువు,బిందువు కలిసి ఏదో ఒకనాడు సింధువవుతుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

మన అమ్మ భాష కోసం కృషి చేస్తున్న వీళ్ళ శ్రమకు విలువ ఉందా? గౌరవం ఉందా? ఉండాలి. ఉండితీరాలి. ఆ గౌరవం మనమే కల్పించాలి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని ఒక మహాఉద్యమంగా మారుద్దాం.

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయ సంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో ఆందరికీ వీలుగా ఉండేందుకు వారంతంలో చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటల నుండి. తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువను ప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటాడానికి. మన అందరి రాక వారికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మునుముందు మరింత కృషి చేసే బలాన్నిస్తుంది. ఇది తెలుగువారిగా మన బాధ్యత.

రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.
తెలుగుబాట – ఆగష్టు 28న హైదరబాద్‌లో టపా కూడా చూడండి.

తెలుగుబాటకు ఆర్ధిక సహాయం చేయాలనుకునే వారు ఈ క్రింది ఖాతాలో జమచెయ్యొచ్చు.
Name: e-Telugu, Hyderabad
A/C No: 111910100029862
Bank: Andhra Bank
Branch: Kukatpally, Hyderabad

బ్రాంచి చిరునామా ఇది (కూకట్ పల్లిలో మూణ్ణాలుగు బ్లాంచీలు ఉన్నాయి. అందుకని అయోమయం రాకుండా.)
Address :
H NO.10-32-2,PLOT NO.3&4 , VIVEKANANDA NAGAR COLONY , KUKATPALLY,
City : KUKATPALLY, State : Andhra Pradesh, Pin : 500072
IFSC Code :ANDB0001119

తెలుగుబాట – ఆగష్టు 28న హైదరబాద్‌లో

తెలుగుబాట

తెలుగుబాట

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి… అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.

తెలుగుబాట – ఆగష్టు 29న హైదరబాద్‌లో

తెలుగుబాట

తెలుగుబాట

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి… అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.


ఈ ఉగాదికి ఏంచేద్దాం?

ఈ ఉగాదికి ఏంచేద్దాం? ఎప్పటిలాగా ఉగాది పచ్చడి తిని, పంచాంగం విని పడుకుందామా? లేదా కొత్తసంవత్సరం ఏదయినా కొత్త పనితో మొదలు పెడదామా? నేను నా కొత్తసంవత్సరాన్ని ఖచ్చితంగా కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నా. ఒక సమావేశంలో కత్తి మహేష్ గారు చెప్పారు “తెలుగును కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పి అందర్ని ఒప్పించాలి. అప్పటికీ తెలుగుని బ్రతికించుకోగలమా అంటే ఎమో చెప్పలేం. తెలుగుతనాన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తెలుగు ఖచ్చితంగా బ్రతుకుతుంది”. అక్షరలక్షలు చేసేమాట. కానీ ఎలా? ప్లేకార్డ్లు పట్టుకుని రోడ్డు మీద తిరగాలి, ఫ్లెక్స్ పెట్టాలి విస్తృత ప్రచారం చెయ్యాలి. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ చేయనక్కరలేదు.

స్వాతంత్ర్యం ఎలా అయినా సంపాదించుకోవాలి అని ఆవేశంలో ఊగిపోతున్న భరతజాతికి ఆయుధంలా మారి అందరిని ఒక్కతాటి పైన నడిపించింది ఒకచిన్నమాట కాదు ఒక మహామంత్రం “వందేమాతరం”. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని ఒక్కటి చేసేది, చూడగానే తెలుగువాడిగా గుర్తింపునిచ్చేది ఏదయినా ఉందా? ఉంది మన కట్టూ,బొట్టూ. మన కట్టూ,బొట్టూ కార్పొరేట్ కంపేనీల్లో సాంప్రదాయ వస్త్రధారణ ఉత్సవాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచం మందిగా గుర్తించిన, గౌరవిస్తున్న మన వస్త్రధారణతోనే తెలుగుతనాన్ని చాటిచెబుదాం. ఆంధ్రులు ఆరంభశూరులని ఉన్న అపవాదుని చెరిపేసుకుందాం. మన కార్యక్రమాలకి ఇది కొనసాగింపేకానీ అదనపు భారంకాదని భావిస్తున్నా.

చేయాలనుకుంటున్న కార్యక్రమాలు :

1.ఉగాది రోజు అందరం తెలుగు సంప్రదాయ వస్త్రధారణని పాటిద్దాం. 10కె రన్, బత్తీబంద్‌లకి మద్దతునిచ్చిన ప్రసార మాధ్యమాలు, కార్పొరేట్ కంపెనీలు దీనికి కూడా మద్దతునిస్తాయని బలంగా నమ్ముతున్నా. ఇప్పట్నుండీ మీ కంపేనీల్లో సంభందిత వ్యక్తుల్ని సంప్రదించండి. ప్రతి ఉగాదికి చేసేదే కదా ఇందులో ఎముంది గొప్ప అనుకుంటున్నారా? ఇలానే ప్రతినెలలో ఒకరోజు పాటిద్దాం. శ్రీలంకలో ప్రతీ పౌర్ణమికి మా కంపెనీ సెలవిస్తుంది. కారణం ఆ రోజు వారికి సంప్రదాయదినం. గుడికి వెళ్ళటం ప్రార్ధనలు చెయ్యటం వంటివి చేస్తారంట. మనం అలానే ప్రతీనెలలో ఒకరోజు సంప్రదాయ దుస్తులని ధరిద్దాం. రాష్ట్రం మొత్తం ఒక్కరోజు మన సంప్రదాయ దుస్తుల్లో, లంగావోణీల్లో అమ్మాయిలు, పంచె కట్టులోనో లేదా కుర్తాల్లో అబ్బాయిలు అహా చూడాటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో

2.దీనికోసం మనం ప్రముఖ ప్రసారమాధ్యమాల మద్దతు లభిస్తుందేమో ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని భావిస్తున్నా.

3.”నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.” అనే బ్యాడ్జి ధరిద్దాం. ఇవన్నీ తెలుగువారి జీవితంలో ఒకభాగం అయ్యేంతవరకు మనం ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత తెలుగే మనల్ని నడిపిస్తుంది.

నేను పైన చెప్పిన పనులు చాలా చిన్నవి, సులువైనవి అని భావిస్తున్నా. నేను గతంలో గాని ఇప్పుడూ గాని ప్రతిపాదించినవి ఆచరణ సాధ్యమైనవి. మనకి మరింత బలాన్నిచ్చేవి. బ్లాగర్స్ డే చేసుకుంటే ఒక కొత్త ఉత్సాహం ఉంటుందని నా బ్లాగులో రాసినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈ రోజున ఈ-తెలుగు కార్యక్రమాలకి ఉత్సాహం మొదలయినది అక్కడే అని అందరికి తెలుసు. చివరిగా వీవెన్ గారు చెప్పినట్టు, “ఎవరికోసం ఎదురు చూడకు నువ్వు చేయాలనుకున్నది చేసెయ్”. అవును అందుకే నేను ఇది చెయ్యబోతున్నా. సోదరుడు సతీష్‌కుమార్ యనమండ్ర నాతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. ఆయన తన కంపెనీ లోని ఉద్యోగస్తులకి ఆచరించమని కోరుతానన్నారు. ఇంక మీ సమాధానం మిగిలుంది. రండి కలిసి నడుద్దాం. తెలుగు విప్లవంలో పాలుపంచుకుందాం.

భయంగా ఉంది నాన్న…

 
11 డిసెంబర్ 2008 :

“రాణి, నీ పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బట్టలు,నగలు కొనటానికి రేపే అమ్మ,నేను విశాఖపట్నం వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పమ్మా?”

“నాన్న, నీ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఘనంగా చేస్తావుగా మరి. నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి. నువ్వు అడిగిన విధంగా ఖర్చులన్నింటినీ వ్రాసిపెట్టా. 20 లక్షలకి దగ్గరగా వచ్చింది.”

“అంతా నీకు నచ్చినట్టే చేద్దాం. మేము పొద్దున్నే బయలుదేరి రాత్రికి వచ్చేస్తాం. నువ్వు నిదానంగా లేచినా పర్వాలేదు. వచ్చేంతవరకు జాగర్త తల్లి.”

“సరే నాన్న.”

12 డిసెంబర్ 2008:

“రాణీ! తల్లి ఎక్కడున్నావు రా. ఇదిగో చూడు నువ్వు అడిగిన దానికంటే అందంగా ఉన్న చీరలు, నగలు. నా చిట్టితల్లి దగదగా మెరిసిపోతుంది ఇవి వేసుకుంటే. ఎక్కడున్నావమ్మా?”

“అమ్మాయి గది తలుపు వేసి ఉంది. పడుకుందేమోనండి? రేపు చూస్తుంది లెండి.”

“ఒక్కసారి ఇవన్నీ చూపించి నా చిట్టి తల్లి కళ్ళలో అనందం చూడకుండా పడుకున్నా నాకు నిద్రపట్టదు. వెళ్ళి కిటికీ లోంచి పిలువు వినిపిస్తుంది.”

“అలాగే. చెబితే వినరుగా….. ఏవండీ! త్వరగా రండీ. అయ్యో చిట్టి తల్లీ ఎంత పని చేసావమ్మా. నీకే కష్టం వచిందమ్మా. మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా తల్లీ….”

“అమ్మా…..” 

రాణి తనగదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది ఆ తల్లిదండ్రులకి. వాళ్ళ రోదన అలా కొనసాగుతూనే ఉంది. బందువులు, మితృలు, పోలీసులు అందరూ వచ్చివెళ్ళారు. తలా ఒకమాట అన్నారు. ఆ తల్లిదండ్రుల అజాగ్రత్తకు, అతిజాగ్రత్తకు మందలించారు, తోచిన సలహాలిచ్చారు. కొందరు కూపీలాగారు. కానీ ఈ సంఘటనలో వారు పోగొట్టుకున్నది ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. రాణి కూడా ఒక ఉత్తరమైనా వ్రాసిపెట్టలేదు. తను ఉత్తరం వ్రాయలనుకుని ఉంటే ఏమని వ్రాసేది…….

 

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ప్రియమైన నాన్నగారికి,

నాన్న నీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా కానీ నీ పెద్దరికానికి, పెద్ద పెద్ద ఆలోచనలకి నావి ఆకతాయి అల్లరి చేష్టల్లా ఉంటాయని కొట్టి పారేస్తావ్. ఈ ఒక్కసారికి విను నాన్న. ఎందుకంటే ఇకముందు ఇలా చెప్పే అవకాశం ఉండదేమో? నాన్న నువ్వెంత గొప్పవాడివో తెలుసా. బయటవాళ్ళకి నువ్వెవరో తెలియదు గాని నాకు మాత్రం నువ్వు దేవుడివి. నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని నాన్న. జీవరాశుల్లోనే ఉత్తమమైన మానవ జన్మనిచ్చావ్, అడిగింది కాదనక అల్లారు ముద్దుగా పెంచావ్, చదువు చెప్పించావ్. ఇప్పుడు నా పెళ్ళికోసం కూడా ఎంత కష్టపడుతున్నావ్.

అసలు ప్రతీ మనిషి ఇంతేనేమో, పెళ్ళి కానంతవరకు తనకోసం బ్రతికి, తనకోసం సంపాదించేవాడు పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచే పిల్లలే జీవితంగా బ్రతుకుతారు. నువ్వు పొద్దున్న లేస్తూనే కష్టపడేది, సంపాదించేది, ఆదా చెసేది ప్రతీది నా కోసమేగా. నీ జీవితం లో నీకోసం పావువంతు బ్రతికి మిగిలిన జీవితమంతా నా కోసమే బ్రతికావు కదా!

మరి నాకోసమే ఇంతలా బ్రతికే నువ్వు, నాకు ఏమి కావాలన్నా ఇచ్చే నువ్వు, నా భవిష్యత్తుని నా వందేళ్ళ జీవితాన్ని నిర్ణయించే పెళ్ళి దగ్గర మాత్రం నా ఇష్టాలతో, ఆశలతొ, ఆశయాలతో, నా భవిష్యత్తు నిర్ణయాలతో పనిలేకుండా పరువు, ప్రతిష్ట అంటావేంటి నాన్న. ఈ పరువు, కుటుంబ ప్రతిష్ట అంటే ఏంటి నాన్న? ఆడపిల్ల పద్దతిగా లేకపోతే కుటుంబ పరువు పోతుందని రోజూ అమ్మకి చెబుతావ్, సమాజం లో తలదించుకొనే పరిస్థితి రాకూడదని రోజూ అంటావ్. అమ్మ సంగతి తెలుసుగా 5వ తరగతి చదువుతో ఆడదానికి కుటుంబమే సర్వస్వం, భర్తే దైవం అని తప్ప వేరే ఏది ఆలోచించలేదు. వ్రతాలు, గాజులు, చీరలు, ఆవకాయ, అప్పడాలు ఇవి తప్ప తన దగ్గర ఇంకేదన్నా చర్చిస్తే తనకి అర్ధం కాదు. అందుకే నీ పరువు కోసం నన్ను గడప దాటనివ్వదు. సమాజం లో నీ గౌరవం కోసం నన్ను ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వదు. నీ బాగు చూసి ఓర్వలేకపోతున్నారు బందువులు అని బలంగా నమ్మి ఎవరితోనూ మాట్లాడనివ్వదు.

నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే, మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి. నా వయస్సులోనే ఉన్న అక్కలు,అన్నయ్యలు,బావలు,వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు. ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు. వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే, నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను. విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న.

ఒకరోజున హఠాత్తుగా పెళ్ళిచూపులన్నారు, పెళ్ళన్నారు. వచ్చినవాడికి నేనంటే ఇష్టమా? మీరు ఇస్తానన్న కట్నం ఇష్టమా? నా ఆశలని,ఆలోచనలని అర్ధంచేసుకుంటాడా? లేక వండివార్చితే చాలనుకుంటాడో? ఏమీ తెలియదు. ఇవన్నీ పోని మిమ్మల్ని అడుగుదామంటే ఆడది చదివి చెడిందంటారు. అంతేగా? ఇంకెవర్ని అడగాలి? ఎవరితో పంచుకోవాలి. నాకు ఎవర్ని అందిచారు? ఎవర్ని మిగిల్చారు మీరు? నాకు నేను తప్ప ఎవరూ మిగలలేదు.

అసలు లోకులు,బందువులు ఎవరు నాన్న మన జీవితాల్ని శాసించటానికి? ఇప్పుడు రమ్మను వాళ్ళని కళ్ళు చల్లబడతాయి. ఇప్పుడూ నేను లేని లోటుని తీర్చగలరా వాళ్ళు. పశ్చాత్తాప పడి నేను కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా. నీ మనసులో గూడు కట్టుకు ఉన్న పరువుని, ప్రతిష్టని అడిగి సమాధానం చెప్పు.. ఇకచాలు నాన్నఇంత పెద్ద ప్రపంచంలో నాకు,నా ఆలోచనలకి స్వేచ్చని,స్థానన్ని ఇవ్వలేని సంకుచిత సమాజాన్ని ద్వేషిస్తూ వెళ్ళిపోతున్నా. నీ రూపం లో నా మెడని వంచి విజయాన్ని అందుకుందామన్నా విధిని పరిహసిస్తూ వెళ్ళిపోతున్నా. నా ఇష్టమయిన ఉయ్యాలని చివరిసారిగా ఊగాలని ఉరివేసుకుని ఊగి వెళుతున్నా.

అంతే నాన్న..  నేను చెప్పాలనుకున్నది అంతే…   ఇంకా చాలా చెప్పగలనేమో..  కానీ ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది..  ఇంకా ఏవో చెప్పి ప్రయోజనం లేదు…

ఇన్ని మాటలు చెప్పాను కానీ నాన్న, భయంగా ఉంది నాన్న. చావాలంటే భయంగా ఉంది నాన్న. ఉరితాడు నా మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరాడక నొప్పిగా ఉంటుదేమో? నాన్న భయంగా ఉంది. చనిపోయాక ఎమవుతా నాన్న, అక్కడ ఆలోకంలో ఆకలయితే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారా? ఒంటరిగా అందర్ని వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందినాన్న. నన్ను మరిచిపోకండి నాన్న… ప్లీజ్

మీ నిర్భాగ్యురాలయిన కూతురు,

రాణి.  

(ఇది ఈమధ్య మా బందువుల్లోనే జరిగిన ఒక సంఘటన. కారణం ఎవరికీ తెలియదు. బందువుల్లో ఎవరితోనూ కలివిడిగా ఉండే అవకాశంలేదు. ఒక చిన్న పల్లెటూరిలోనే తన నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తన చివరి క్షణాల్లో పడ్డ సంఘర్షణ ఆవిష్కరించాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ తన ఆలోచనలు, నడవడిక, వ్యక్తిత్వం , గతం, భవిష్యత్తుకై తన ఆలోచనలు ఏమీ తెలియని నేను వ్రాసినవి కేవలం నా ఊహలేగాని వాస్తవాలు కావు. వాస్తవాలు తన మనస్సు అనే రహస్యపు పెట్టెలో శాశ్వతంగా దాచేసి తనతో తీసుకుపోయింది. నావాళ్ళకే నాతో కష్టాలు పంచుకునే చనువు ఇవ్వలేకపోయాను. అందుకేనేమొ ఈ సంఘటన నన్ను పదే పదే వెంటాడుతుంది. నాకిప్పుడు కొన్ని నిజాలు తెలియాలి. తను చనిపోవాల్సిన అవసరం ఏంవచ్చింది? తన  చావుకి నిజమయిన కారకులు ఎవరు? చనిపోయినప్పుడు తన ఆత్మసంఘర్షణ  ఏంటి? చావు తర్వాత ఏమవుతుందో ఇప్పటికీ మానవమేధస్సుకి తెలియదు. తను అసలు ఆవిషయం ఆలోచించిందా? ఉరివేసుకోవటానికి భయపడలేదా? బ్రతకటానికి ఏవయినా అవకాశాలు ఉన్నాయేమొ ఆలోచించలేదా? రేపటినుండి తాను ఏమవుతుంది, తనగది ఏమవుతుంది, తన బట్టలు, పుస్తకాలు, తనకిష్టమయిన వస్తువులు అన్నీ ఏమవుతాయి? ఇంకా కొన్ని వేల ప్రశ్నలు నా మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు తనకి కలగలేదా? మరి ఏం సమాధానం చెప్పుకుంది. తనని తాను చావుకి మానసికంగా ఎలాసిద్దంచేసుకుంది. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు………………….)


జెమిని మ్యూజిక్ లో తెలుగు బ్లాగులు

ఈ రోజు మద్యాహ్నం 1:30 కి జెమిని మ్యూజిక్ లో బ్లాగులగురించి ఒక కార్యక్రమం లో వివరించారు. తెలుగు బ్లాగుల గురించి ప్రస్తావించారు. నాకు ఎక్కువసేపు చూసే అవకాశం దొరకలేదు. ఎవరయినా చూసి ఉంటే గనక కార్యక్రమ వివరాల్ని తెలపండి. కానీ యాంకర్ కి తెలుగు బ్లాగుల గురించిన సమాచారం ఎక్కువగా లేక పోవటం వలన అనుకుంటా మాటలు వెతుక్కుని చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారు. ప్రసారమాధ్యమాల మద్దతు మనకి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. ఇలాంటి సమయం లో బ్లాగుల గురించి తగిన సమాచారం వారికి అందేలా చూడటం మన కనీస భాద్యత.

ఒక టపాలో తెలుగు బ్లాగర్ల వివరాలు, బ్లాగు వయస్సు, ప్రత్యేకతలు పొందుపరిస్తే సులువుగా ఉంటుందని నా అభిప్రాయం. బ్లాగర్ గా నా వయస్సు కేవలం ఆరునెలలు మాత్రమే. అందువలన అందరి బ్లాగుల వివరాలు, వాటి పైన నా అవగాహన పరిమితం. అందువలన ఈ భాద్యతని నేను తీసుకోలేకపోతున్నా. లేదా మితృలు వ్యాఖ్యల రూపంలో మీకు తెలిసిన బ్లాగులని క్లుప్తంగా అందిస్తే ఒక టపాగా పొందుపరుస్తా.

ఉందిలే మంచికాలం ముందు ముందున …

ఇది చిరు పార్టీ ప్రచారం కోసం అనుకునేరు. నేను చెప్పేది మన తెలుగు బ్లాగుల గురించే. మీకు గుర్తుంటే నేను 1000 మంది సందర్శకులు వచ్చారని టపా రాసినప్పుడు చెప్పాను నా బ్లాగు నేనే బలవంతంగా చదివిస్తున్నా అని. కానీ ఇప్పుడు రోజులు మారాయి. నేను మంచి బ్లాగులని మా స్నేహితులకి, ఆఫీసులో వాళ్ళకి మెయిల్ ద్వారా పంపటం మొదలుపెట్టా. మొదట్లో ఇంత పెద్ద మెయిల్స్ ఏం చదువుతాం అని విసుక్కున్నారు. ఖాళీ గా ఉన్నప్పుడు కొంచెం గా చూసేవారు. ఇప్పుడు మా వాళ్ళకి పనిలో ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇదో మార్గం అయ్యింది. ఇప్పుడు వారాంతం లో ఇంటి దగ్గర చదువుకోవటానికి,  పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా బెంచి మీద ఉన్నవాళ్ళు ఏవన్నా మంచి బ్లాగులు సూచించమని అడుగుతున్నారు. రెండు నెలల్లో గణనీయమైన మార్పు. నాకు చాల ఆనందం గా వుంది. నిజానికి అసలు చాలా మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళకి కూడా బ్లాగులంటే ఏమిటో తెలియదు. ఖాళీ సమయం లో మెయిల్ చూసుకుంటారంతే. తెలిసిన కొద్ది మందికి ఇంగ్లీష్ బ్లాగులు, టెక్నికల్ బ్లాగులు మాత్రమే తెలుసు. కనుక తెలియజేసే పని మనం తలకెత్తుకుంటే సువర్ణాధ్యాయం ముందుంది. కొంతమంది మేము ఫ్యాన్స్ ఫలానా బ్లాగరు ఈ-మెయిల్ ఇవ్వమని గొడవ చేస్తున్నారు. ఒక హాస్యబ్లాగుకి అభిమాన సంఘం పెడతా అని అడిగాడొక మితృడు. త్వరలో ఆర్కూట్ కమ్యూనిటి పెట్టినా పెడతాడు. కాబట్టి ఉందిలే మంచి కాలం ముందు ముందున. చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తున్నాయి ప్రక్కన పెట్టి ఒక మంచి ప్రయోజనం కోసం పని చేద్దాం. భిన్నాభిప్రాయాలు ఉండి కూడా ఒక మంచి ప్రయోజనం కోసం కలిసి పని చెయ్యొచ్చు గా. అందరం కలిసి కొత్త అధ్యాయాన్ని రచిద్దాం. కొన్ని రోజులకి ఒక ఈనాడు, స్వాతి తెలుగు వారికి ఎంత సుపరిచయమో బ్లాగులు కూడా అలా కావాలని ఆశిస్తూ..

మీ
మురళీ.

బ్లాగుదినోత్సవం

అయ్యా,బాబూ,అమ్మా ఒక చిన్నమాట విని వ్యాఖ్యానించాల్సినది గా నా విన్నపం.

తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం అనే టపా మితృలు గుర్తించినట్టు లేరు. ఆంధ్రదేశం లో బ్లాగు అంటే ఏంటో తెలియని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు (నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి). తెలుగు బ్లాగులకి ఆంగ్లబ్లాగులంత విశేష ఆదరణ కావాలని మనం భావిస్తే జనాలకి అవగాహన కలిగే లా ఏదన్నా కార్యక్రమం చేయాలి. మనం రాష్ట్రం లో ఉన్న కాలేజి విధ్యార్ధులకి కూడా అవగాహన కలిగే లా చెయ్యగలిగితే ఇది మరో ఉద్యమమే అవుతుంది. దీనికి కాస్త సామాజిక భాద్యతని జోడించ గలిగితే మన భాష ని ఉద్దరించిన వాళ్ళం కాకపోయినా ఉడతా భక్తి ఏదో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇది మనకి మనమే చేసుకునే గొప్పసేవ ఆలోచించి వ్యాఖ్యానిస్తారని ఆశిస్తూ.

మురళీ.