ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో


తోడురాని పయనం

తోడురాని పయనం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా

ఏడుస్తూ వస్తాం
ఏడిపిస్తూ పోతాం
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

కూడంటాం గూడంటాం
గుడ్డంటాం దుడ్డాంటాం
ఈడంటాం జోడంటాం
తాడంటాం బిడ్డంటాం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

నాదంటాం నీదంటాం
జాతంటాం మతమంటాం
పదవంటాం మదువంటాం
స్థాయంటాం స్థోమతంటాం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

ఎదురుబొంగు పాడె మీద
కట్టెల మంటలోకి
ఆరడుగుల గొయ్యిలోకి
ఖాలీ చెయ్యితోటి

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

నీది లేదు నాది లేదు
గుప్పెడు బూడిద
మందిలేదు మతం లేదు
ఒంటరి బాట

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

ఉసురు పోయాక ఒట్టి ఊసే నువ్వు
మడుసుల మతిలో మిగిలే కతే నువ్వు

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా

నువ్వు నేను ఓ ప్రేమ కాని ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

నువ్వేంటో నాకు ఎప్పుడూ అర్ధం కావు
నేను నీకు కూడా.

అవునంటావ్ కాదంటావ్.
నువ్వు అవునన్నా నాకు అనుమానం
కాదంటే ఆవేదన.

నేను నిన్ను నమ్ముతాను కానీ కొన్నిసార్లే.
నిలదీస్తే వదిలేస్తావేమో అని భయంతో నమ్మకం
నిజమా కాదా అనే అనుమానం.

నువ్వు సీతాకోకచిలుకనంటావ్
గువ్వనంటావ్
పావురాయినంటావ్.
నేను మాత్రం నీటిలో కొంగని
ఒంటికాలి పై నిలబడి
దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ.

అడక్కుండానే మనసులోకి చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?

నీకు నేను కావాలి
కానీ నాతో ఉండవు.
నువ్వులేకపోయినా నేను ఉండగలను
కానీ వదలలేను.

నేను పాటలు రాసానోచ్…

స్నేహమా రాధిక గారి పాట చదివిన తరువాత నేను కూడా పాటల టపా పెట్టాలని అనుకున్నా. మా కాలేజి లో కొంత మంది స్నేహితులతో కలిసి నేను కొన్ని పాటలు వ్రాసి రికార్డింగ్ కూడా చేసాం. కానీ ఆడియో ఫైలు అట్టాచ్ చెయ్యలేకపోతున్నా. లిరిక్స్ మాత్రం ఇక్కడ ఇస్తున్నా. బ్లాగుమితృలెవరైనా పాటలు అట్టాచ్ చెయ్యటం ఎలాగో చెబితే ఆడియో ఫైల్స్ కూడా అందిస్తా. స్వర మైత్రి, సంగీత ఙ్ఞానం ఉన్నవాళ్ళు దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఇవి గాలిపాటలు, అచ్చంగా మన జానపదాలలా. ఎందుకంటే ఇవి అందమయిన ఊహలలోంచి వచ్చినవే తప్ప, మాకు స్వర ఙ్ఞానం లేదు. అలానే శృతులు,యతులు తెలియవు

సందర్భం:

ఒకమ్మాయి ఒక అబ్బాయి కి కనిపించకుండా, అతని నే అనుసరిస్తూ చిన్న చిన్న బహుమతులు పంపిస్తూ ఉంటుంది. ప్రతిసరీ బహుమతిలో ఒక ఉత్తరం పెడుతుంది. ఆ ఉత్తరాలు చదివి ఇష్టపడి ఆమె ఎవరో తెలుసుకోవాలనే తపన పడే అబ్బాయి ఊహలు.

నీడల్లె నా వెంట ఉన్నా
నిను పోల్చుకోలేదు ప్రతి సారి
నువ్విప్పుడేచోట ఉన్నా
కనిపించవా నాకు ఓ సారి
  ||నీడల్లె||
||2|| నవ్వుతూ కవ్విస్తావు ఉత్తరం పంపిస్తావు
మెల్లగా మాయ చేసి ఇంతలో మిస్సవుతావు ||2||
ఆణువణువు నే వెతుకుతున్నా
నె చేరలేనా నీ దారి
   ||నీడల్లె||
||2|| హంసల్ని రప్పిస్తాను వెతికెందుకొప్పిస్తాను
నిన్ను చేరె దాక ఊరూరు పంపిస్తాను ||2||
నువ్వెంత తప్పించుకున్నా
నను దాటి పోలేవు ఈ సారి

సంధర్భం: ఎవరో తెలియని ఓ అబ్బాయి అల్లరి పనులు, ఇతరులకి చేసే సహాయాలు చూసి ప్రేమించిన అమ్మాయి ఊహలు.

కోయిలమ్మా కోయిలమ్మా
ఇంతలోనే ఎంత ప్రేమ
ఎవరో తెలియకుండా మనసే అడగకుండా
తననే వలచెనంట ఇది చెప్పలేని వింత
||కోయిలమ్మా||
తనతో చెప్పాలి మనసే విప్పాలి.
ఇకపై బిడియాన్ని ఆపాలి.
కలలే ఆగాలి నిజమై రావాలి.
జతగా అతగాడే కావాలి.
||కోయిలమ్మా||
మల్లెలనే తెచ్చి వెన్నెల లో పరిచి
తనకై నే ఎదురుచూస్తున్నా.
ఎక్కడ నే ఉన్నా ఏ పని చేస్తున్నా
తనధ్యాస లోనే బ్రతుకుతున్నా.
||కోయిలమ్మా||
సంధర్భం: ఇది షరామాములే ప్రేమలో ఓడిపోయిన ఓ అబ్బాయి కంటతడి..

ప్రేమనే ప్రేమిస్తే ఓటమే ప్రతిసారి
ప్రేమగా మనసిస్తే భాధలే మిగిలేవి
మనసుకోరే గమ్యం చేరనీడే దైవం
చెలిమి కోరే హృదయం అందుకోదే విజయం
||ప్రేమనే||
చీకట్లు కమ్ముకున్నా నిదుర నను చేరరాదు
కనులెంత మూసి ఉన్నా నీ రూపు మాసిపోదు
వెంటపడి వేదిస్తూనే జంట నే రానంటుంది
కంటతడి పెడుతూ ఉంటే కొంటేగా నవ్వుతుంది.
||ప్రేమనే||

ఏంటి ఈ బోడి పాటలు మేము చదవాలా అనుకొన్నవారికి శతకోటి క్షమాపణలు. సర్లే చావు పో అనుకున్న వారికి నెనర్లు.