సెల్‌ఫోన్ మోతతో ఉదయం తొమ్మిది గంటలకి లేచాను. ఆఫీసు నుండి ఏదో పని గురించి ఫోన్ చేసారు. ఫోన్లో చెప్పాల్సినవి చెప్పేసి తిరిగి పడుకుందామనుకుని మంచం మీద వాలాను. కానీ తిరిగి నిద్ర పట్టలేదు. లేచి బెడ్రూం నుండి బయటకి వచ్చి చూసాను. అన్ని తలుపులూ మూసి ఉన్నాయి. “అంటే సాహిత్య ఆఫీసుకి వెళ్ళిపోయిందన్నమాట. కనీసం వెళ్ళేప్పుడు చెప్పొచ్చుగా” అనుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు చూసాను. టిఫిన్ వండి పెట్టేసి వెళ్ళిపోయింది. గిన్నెల్లో వండినదంతా వండి నట్టే ఉంది. తను మాత్రం తినకుండా వెళ్ళిపోయిందని అర్ధమయ్యింది.
నాకూ ఆఫీసుకి టైం అవ్వటంతో ఆలోచనలని పక్కనపెట్టి ఆఫీసుకి తొందరగా తయరయ్యాను. టిఫిన్ చెయ్యాలనిపించలేదు. ఒకటి తినేందుకు మనస్కరించలేదు, రెండు కష్టపడి చేసింది పోని తిందామనుకున్నా, తను తినలేదనే విషయం తెలిసి కూడా నేను తింటే, తనని నేను కేర్ చెయ్యటం లేదు అనే తన అనుమానానికి ఇది మరొక సాక్ష్యం అవుతుందేమో అని భయం వేసింది. డైనింగ్ టేబుల్ వైపే చూస్తూ బయటకి నడిచాను.
కారులో వెళ్తూ ఉంటే ఒకటే ఆలోచనలు. ఎందుకు మా మధ్య ఇంత దూరం పెరిగింది? టిఫిన్ తినలేదంటే నా మీద అలిగి కోపం చూపించాలనుకుంది. కానీ వెళ్ళేప్పుడు నన్ను నిద్ర లేపి చెప్పటానికి ఏమయ్యింది? ఆ మాత్రం కర్టసీ కూడా మిగల్లేదా? మా మధ్య రిలేషన్ చివరి దశలో ఉందా? అసలు ఇన్నాళ్ళలో మా మధ్య ఎటువంటి రిలేషన్ ఏర్ప్పడలేదా? మూడేళ్ళుగా ఒక అబద్దపు బ్రతుకు బ్రతుకుతున్నామా? అసలు సాహిత్య నన్న్ను ఇష్టపడే పెళ్ళి చేసుకుందా? లేక తన జీవితంలో కొత్తగా మరెవరయినా… సడెన్ బ్రేక్ వేసి కారు ఆపాను. బ్రేక్ వెయ్యటం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే ఎదురుగా వస్తున్న సైకిల్ని గుద్దేసేవాడ్ని. పాపం పదేళ్ళుంటాయెమో ఆ సైకిల్ మీదున్న పాపకి. భయం భయంగా నా వైపు చూస్తూ సైకిల్ దిగి నడుచుకుంటూ కారు దాటి వెళ్ళిపోయింది.
ఆఫీసులోకి వచ్చి నా కంప్యూటర్ ముందు కూర్చున్నా. మెయిల్స్ అవీ చూసుకున్నా పెద్దగా పనేం లేదు. ఏమీ తోచక మానిటర్నే చూస్తూ కూర్చున్నా. నా క్యూబికల్లోనే ఉండే రవి వచ్చి నా డెస్క్ ఎక్కి కూర్చుని నా బాటిల్లో నీళ్ళు తాగుతున్నాడు.
“రేయ్ శరత్‌గా నీకు తెలుసా? మన రాజు గాడు,శశి విడాకులకు అప్లై చేసారంట.” అనే ముక్క వాడు చెప్పే వరకూ వాడి వైపన్నా చూడలేదు నేను.
కాస్త ఆందోళనగా చూసిన నా చూపుని అడ్వాంటేజ్‌గా తీసుకుని కధని మరింత ఉత్కంఠగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు రవి. మధ్య మధ్యలో ఆగి నా వైపు దీర్ఘంగా చూసి మరలా కొనసాగిస్తున్నాడు. ఆ ఆపటం నాలో సస్పెన్స్ క్రియేట్ చెయ్యటానికి అనుకుంటా. కానీ వాడు చెప్పేది ఏదీ నేను వినటం లేదనే విషయం వాడికి తెలియదు. నా ఆలోచనల్లో పడి నేను కొట్టుకుపోతుంటే అదే నా ఇన్వాల్వ్‌మెంట్‌గా తీసుకుని సాగిపోతున్నాడు.
రాజు,శశి నాకు కాలేజ్ రోజుల నుండీ తెలుసు. ఇద్దరూ దాదాపుగా ఆరేళ్ళు ప్రేమించుకుని ఇంటిలో ఒప్పుకోకుంటే ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. ఈమధ్యే వాళ్ళ పెద్దలు రాజీకొచ్చారు. ఇంకేముంది అంతా సుఖమే అనుకుంటే ఇప్పుడు ఈ విడాకుల గొడవేంటో నాకు అర్ధం కాలేదు.
“శశి ఏడుస్తూ చెబుతుందిరా. రాజుగాడు పెళ్ళయ్యాక మారిపోయాడంట. ఇంటికొచ్చి తిని పడుకుంటాడంట. తనని అసలు పట్టించుకోడంట. పైగా నీ జీతం ఏం చేస్తున్నావ్? నాకు చెప్పకుండా ఖర్చుపెట్టకు అని రూల్స్ పెడుతున్నాడంట.” రవిగాడు చెబుతున్నాడు. ఇంతలో నా సెల్ రింగ్ అయ్యింది. “సౌమ్యా కాలింగ్” అని చూడగనే సెల్ తీసుకుని బయటకి నడిచాను. సౌమ్య అంటే సాహిత్య కొలీగ్. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అసలు సౌమ్య నాన్నగారే మా పెళ్ళి కుదిర్చింది. ఆయన మా రెండు కుటుంబాలకూ కామన్ ఫ్రెండ్.
“హా సౌమ్యా చెప్పు” రూమ్ నుండి బయటకి వచ్చి, కారిడార్‌లో ఒక మూల నా మాటలు ఎవరికీ వినపించని చోట నిలబడి మాట్లాడుతున్నాను.
“శరత్! ఈ మధ్య సాహి రోజూ ఆఫీసులో కూర్చుని ఏడుస్తుంది. లేదా ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. మీ ఇద్దరికీ ఏ సమస్యలున్నాయో నాకు తెలియదు. కానీ దానిని ఇలా చూడలేకపోతున్నాను. రోజు రోజుకి పిచ్చిదానిలా అయిపోతుంది. ప్లీజ్ తనని ఏదోలా కమ్ఫర్ట్ చెయ్యు. సరే అది ఇటే వస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తా” అని ఫోన్ పెట్టేసింది సౌమ్య.
సాయంత్రం వరకూ సౌమ్య మాటలే నా బుర్రలో తిరుగుతున్నాయి. చిరాకో, ఏమీ తోచకో చాలా ఇబ్బందిగా అనిపించి అయిదు గంటలకే ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాను. ఇంటికి రాగానే కాఫీ కలుపుకుని బాల్కనీలో కూర్చున్నాను. పగలంతా విపరీతమైన ఎండగా ఉన్న వాతావరణం ఉన్నట్టుండీ మారింది. ఆకాశంలో నల్లమబ్బులు కమ్ముకున్నాయి. పక్షులన్నీ గుంపులుగా కదిలిపోతున్నాయి. పెద్ద గాలి లేచి రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు వదిలేసిన దుమ్ముని పైకి లేపి జనాల కళ్ళలో కొడుతుంది. చిన్నగా చినుకులు మొదలయ్యాయి. మట్టివాసన గుప్పున ముక్కుపుటాలకు తగులుతుంది.
సాహిత్య బైక్ మీద రావాలి. ఈ వర్షానికి తడిచిపోతుందేమో అన్న ఆలోచన వచ్చి కాసేపాగి రమ్మని ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ ఎందుకో చెయ్యలేకపోయాను. సరిగ్గా ఇదే మా ఇద్దరి సమస్య.
మూడేళ్ళ క్రితం మా పెళ్ళి జరిగింది. పెళ్ళి చూపులకి ముందే మా ఇద్దరినీ కలుసుకునే ఏర్పాటు చేసారు ఇరువైపుల పెద్దలు. ఆరోజు మొదట ఇద్దరం కొంచెం ఇబ్బంది పడినా, కాసేపటికి కలిసిపోయి చాలా మాట్లాడుకున్నాం. ఇద్దరి ఆలోచనలూ అచ్చం ఒకేలా అనిపించాయి. స్కూల్ కబుర్లు, ఆఫీస్ కబుర్లు చెప్పుకున్నాం. ఇద్దరం స్కూల్లో చేసిన అల్లరి, ఆఫీసులో మానేజర్తో పడే పాట్లూ అన్నీ షేర్ చేసుకున్నాం. మా ఇద్దరి మనసులూ కలిసాయి. మా ఇద్దరినీ చూసి మా పెద్దలు ఆనందపడ్డారు. మాకు పెళ్ళయింది. ఆఫీసు-ఇల్లు, జీవితం హాయిగా వెళ్ళిపోతుంది.
కానీ ఈ మధ్య సాహిత్య ప్రతి చిన్న కారణానికి అలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆరిచిగోల చేస్తుంది. ఏం మాట్లాడినా వెటకారమే. నాకసలు తన మీద ధ్యాసే లేదంటుంది. ఒకప్పటిలా కూర్చుని కబుర్లు చెప్పటం లేదంటుంది. ఒక్కోసారి చిరాకుగా అరిచి గోల చేసి ఏడుస్తూ ఉంటుంది. మొదట్లో కాసేఫు కూర్చోబెట్టి సర్దిచెప్పేవాడ్ని. కానీ ఏ ప్రయోజనం లేదు. ఈ అరుపులు, గొడవలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తనని కాస్త కదపాలన్నా నాకు లోపల కాస్త దడగా ఉంటుంది. ఇంటిలో పెద్దవాళ్ళకి ఈ విషయాలేవీ తెలియవు. ఈ వయసులో వాళ్ళ పిల్లల కాపురం ఇలా ఉందని తెలిసి, వాళ్ళు మనసు పాడుచేసుకోవటం ఎందుకని వాళ్ళకి తెలియనివ్వలేదు.
గొడవపడటం కంటే ఊరుకున్నంత ఉత్తమం లేదని కాస్త ముభావంగా ఉంటున్నాను. వీలయినంత వరకూ తనని కదపకుండా ఇంటిలో నా పని నేను చేసుకుంటూ వాదనలు రాకుండా చూసుకుంటున్నాను. తనతో ఏదయినా సరదాగా మాట్లాడాలనిపించినా ఇప్పుడు చెయ్యలేకపోతున్నాను. ఏ జోకో చదివితే ఒకప్పుడు తనతో షేర్ చేసుకునేవాడ్ని. కానీ ఇప్పుడు తనకి షేర్ చెయ్యలేకపోవటమే కాదు కనీసం తన ముందు నవ్వలేకపోతున్నా. నేనేదో నవ్వితే నన్ను మాత్రం క్షోభపెట్టి వీడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటుందేమో అని భయం. ఆఫీసులో ఉన్నా ఒకటి రెండు కాల్స్, మెసేజ్‌లు ఇచ్చేవాడ్ని. కానీ ఈ మధ్య కాలంలో తన నంబర్ నా మొబైల్లో చూసి చాలాకాలమయ్యింది. కొన్ని దూరాలు కళ్ళకు కనిపించవు.
చీకటి పడింది. వర్షం ఇంకా పెద్దదయ్యింది. కానీ సాహిత్య ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ తీసి చెయ్యబోయాను. తీరా చేసాక “ఆఫీసులో ఉన్నా వస్తాలే” అని చిరాగ్గా సమాధానం వస్తే. ఫోన్ తీసి చేతిలో పట్టుకున్నానే కానీ చెయ్యలేకపోతున్నాను.
కాసేపటికి కాలింగ్ బెల్ మ్రోగింది. కాస్త రిలీఫ్ అనిపించింది. వెళ్ళి తలుపు తీసాను. తన తో పాటూ సౌమ్య, సౌమ్య నాన్నగారు కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే నాకు కాస్త కంగారుగా అనిపించింది. ఏం జరగలేదు కదా సాహిత్యకి అని తనని చూసా. తను వెళ్ళి సోఫాలో అన్నీ పడేసి కళ్ళు మూసుకుని వెనక్కి చేరబడింది. నాకు ఆందోళన ఇంకాస్త పెరిగింది. సౌమ్య నాన్నగారు నా భుజం మీద చెయ్యి వేసి నన్ను నడిపించుకుని తీసుకుని వెళ్ళి సాహిత్య పక్కనే కూర్చోబెట్టారు.
“సీతా రాముల్లా ఉన్నారు. అందుకేనయ్యా ఈ ముసలాడు మీ ఇద్దరికీ పెళ్ళి కుదిర్చింది.” అని ముందున్న కుర్చీలో కూర్చున్నారు. “ఈ పిల్ల పిచ్చిదయ్యా ఒట్టి అమాయకురాలు. అందుకే దీన్ని నీ చేతిల్లో పెట్టింది. ఈరోజు ఏం చేసిందో తెలుసా? నిన్ను రోజూ బాధపెడుతుందంట, ఇల్లు నరకంలా మార్చేస్తుందంట తనకి గానీ హిస్టీరియా ఉందేమో అని డాక్టర్‌కి చూపించుకోటానికి వెళ్ళింది. మందులేసుకుని తగ్గించుకోటానికి కాదట. తనతో నీకు సంతోషం లేదు కాబట్టి విడాకులిచ్చేస్తుందంట. కనీసం అప్పుడన్నా నువ్వు సుఖపడతావంట.” ఆయన చెప్పటం ఆపి నా మొహంలో మారుతున్న రంగులు చూస్తున్నారు.
నేను సాహిత్య వైపు చూసాను. తను నా కళ్ళలో ఏవో ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతుంది. నా చూపుల్లో ఏం సమాధానాలు తను డిరైవ్ చేసుకుంటుందో అనే భయంలో కళ్ళు క్రిందకి దించేసాను. కానీ ఆ చర్యని తను తిరస్కారం అనుకుందేమో అక్కడ నుండి లేచి విసవిసా వెళ్ళిపోయింది. సౌమ్య వెంటనే కంగారుగా తన వెనుక వెళ్ళింది.
లోపల నుండి సాహిత్య ఏడుపు, సౌమ్య ఓదార్చటం వినిపిస్తుంది. “నీకర్ధం కాదే నా బాధ. సాయంత్రం నుండీ బోరున వర్షం పడుతుంది. కనీసం ఏమవుతానో ఒక్క ఫోన్ చేసి అడిగాడా? మీ ఇద్దరూ దగ్గరే ఉండి కూడా తీసుకుని వచ్చారు. ఏమయ్యింది అని ఆరా తీసాడా? నాన్నగారు ఇంత చెబుతున్నా నోరెత్తాడా? ఈ ఇంటిలో నేనెందుకు బ్రతుకుతున్నానో తెలియదు. ఉదయాన్నే వంట, తర్వాత ఆఫీసు, సాయంత్రం వచ్చి మరలా వంట తగలేసి తిని పడుకుంటాం. రోజూ ఇదే తంతు నా బ్రతుక్కి. ఛీ దీనికేనా బ్రతుకుతున్నది అసహ్యమేస్తుంది. కనీసం పిల్లలన్నా పుడితే వాళ్ళని చూసుకుని బ్రతికేదాన్ని. అప్పుడే వద్దంటాడు. ఈ ఇంటిలో ఒక ఫ్యామిలీ బ్రతుకుతుంది అని లోకం అనుకుంటుంది. కానీ నాకు మాత్రం ఇద్దరు మనుషులు ఎవరికి వారు బ్రతుకుతున్నట్టుగా ఉంది. ఇక ఈ ఇంటిలో బ్రతకటం నావల్ల కాదు. పోయి ఏ హాస్టల్లోనో ఉంటాను. నాకెవరూలేరని అనుకుని సుఖంగా బ్రతుకుతా” అని ఏడుస్తూ పెద్ద గొంతుతో చెబుతుంది సాహిత్య.
పెద్దాయన కుర్చీ నుండి లేచి కాస్త గట్టిగా ఇద్దరికీ వినిపించేలా చెబుతున్నారు. “చూడండి పిల్లలూ ఒకసారి ముడివేసాక తెంచేసుకునే బంధం కాదు పెళ్ళంటే. కష్ట సుఖాలు, కలిమిలేములు అన్నీ కలిసి భరించాలి. ఇన్నేళ్ళుగా కలిసి బ్రతుకుతున్న జంటలకు సమస్యలు లేక కాదు. వాటిని ఓర్పుతో అధిగమించి ఈ బంధాన్ని కాపాడుకుంటున్నారు. మీ అమ్మా నాన్నని అడిగి చూడండి వాళ్ళకి ఎప్పుడూ ఏ సమస్యలూ లేవా అని. మేనేజర్ తిట్టాడని, ఆఫీసులో పార్కింగ్ లేదని ఉద్యోగాలను మార్చేసే మీ తరానికి అరవైయేళ్ళు ఒకే కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేసి కళ్ళ నీళ్ళతో పదవీ విరమణ చేసిన మా జీవితాలు అర్ధం కావు. మీరు మాకంటే స్మార్ట్ జనరేషన్ కదా. ఆ తెలివేదో ఇద్దరూ కలిసి ఉండటం ఎలా అని ఆలోచించటానికి వాడండి. విడిపోవటానికెందుకూ తెలివితేటలు. లాయరుకి డబ్బిచ్చి కాగితాల మీద కసాబిసా సంతకం చేస్తే సరి. నాకు మందులు వేసుకునే టైమయ్యింది ఇక మీ బాధ మీరు పడండి” అని చెప్పి సౌమ్యని తీసుకుని వెళ్ళిపోయారు.
నేను లోపలికి వెళ్ళి చూసాను. తలగడలో మొహంపెట్టి ఏడుస్తూ ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెద్దాయన చెప్పిన పెళ్ళి, దాని ప్రాముఖ్యత వినటం వల్ల కాదు, నేను చేస్తున్న తప్పేంటో తెలిసి.
వెళ్ళి తన తలపైన చెయ్యి వేసి “చిన్నూ” అనిపిలిచాను. చురుగ్గా చూసి దూరంగా జరిగింది.
“చిన్నూ సారీరా. అలా చూడకురా ప్లీజ్. రోజూ నువ్వు అరుస్తుంటే చిరాకు పడ్డానే కానీ నిన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. రోజూ గొడవలు జరుగుతుంటే మౌనంగా ఉంటే అవే తీరిపోతాయిలే అనుకున్నాను. కానీ ఆ మౌనం మనిద్దరి మధ్య తెలియని ఆగాధాన్ని సృష్టిస్తుంది అని తెలుసుకోలేకపోయాను. నువ్వంటే శ్రద్ధలేక కాదు. వర్షం మొదలయినప్పటి నుండీ నీకు ఫోన్ చేద్దామనుకుని చెయ్యలేదు. చీకటి పడింది నువ్వు రాలేదని కంగారు పడుతూనే ఉన్నాను. కానీ ఫోన్ చేస్తే నాకు తెలియదా అంటావేమో అని భయం.
ఆఫీసులో ఉన్నప్పుడు నీకు ఫోన్ చెయ్యాలనే అనుకుంటా. ఏదో పని వస్తుంది. సరిగ్గా అప్పుడే నువ్వు కూడా కాల్ చేస్తావ్. ఫోన్ కట్ చేసి కాసేపాగి చేద్దాంలే అనుకుంటా. పనయ్యాక కాస్త ఎక్కువసేపు మాట్లాడేంత టైం ఉన్నప్పుడు చేద్దాంలే అనుకుంటా. సాయంత్రం కాగానే ఎలాగూ ఇంటికి వచ్చేస్తాగా అప్పుడు మాట్లాడొచ్చులే అనుకుంటా. ఇంటికొచ్చేసరికి ఫోను చెయ్యలేదు అనే కోపంలో నువ్వుంటావ్. నీ మూడ్ బాలేదని నేను మౌనంగా ఉంటాను.
నేను నిన్ను పట్టించుకోవటం లేదు అనుకునే ప్రతి సంఘటన వెనుక ఉన్నవి ఇలాంటి చిన్న కారణాలే రా. అంతే కానీ నీ మీద ప్రేమ తగ్గి కాదు. Now I understand that these small things mean a lot. డ్రమాటిగ్గా ఐ లవ్ యూ అని చెప్పను. కానీ you mean a lot to me”
తను తల ఎత్తి నా కళ్ళలోకే సూటిగా చూస్తూ ఉంది. బయట నెమ్మదిగా వానవెలిసింది.
“నీకు ఎంత కోపం ఉన్నా డివోర్స్ అనే మాట అనకుండా ఉండాల్సిందిరా” కాస్త నొచ్చుకుంటూ అన్నాను.
తను కళ్ళు తుడుచుకుని ఏడుపు ఆపుకుంటూ “సారీ” అని ముద్దుగా చెప్పి నా వొడిలో తలపెట్టుకుని నా చెయ్యి పట్టుకుని అలానే పడుకుండిపోయింది. మా ఇద్దరి మనసులూ మరోసారి కలిసాయి. మాకు మరోసారి పెళ్ళయింది.