ఆమె,నేను,కొన్ని ఊహలు..

nuvvu nenu vennela

నువ్వు నేను వెన్నెల

1.నువ్వు లేకుండా ఒక్కసారయినా వెన్నెలలో గోదావరి ఒడ్డున నడవాలనుకున్నా. గోదారమ్మ పున్నమినంతా కలిపి నీలా మార్చేసింది.
నాకు కోపం వచ్చి “ఏం తనులేకుండా నేను బ్రతకలేనా? ఒక్కరోజు తను లేని ఏకాంతం కావలని అన్నా గా. ఎందుకిలా చేసావ్?” కోపంగానే అడిగా గోదారమ్మని.
గోదారమ్మ నవ్వి “ఏకాంతం అంటే తను నీ పక్కనలేకపోవటం కాదు. నీ మనసు నుండి పక్కన పెట్టి చూడు” అని వెళ్ళిపోయింది.

2.దేవుడు నాకు ఒక పరీక్షపెడతా అన్నాడు.
ఒక పెద్ద మైదానంలో కోటి తారలని,అప్సరసలని,ప్రపంచ సుందరీమణులని,రాకుమారిలని తెచ్చి కూర్చోబెట్టి.
ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు.నువ్వు ఎక్కడున్నావో కనుక్కోమని.
నేను కళ్ళు మూసుకుని “నువ్వు లేకుండా ఒక్క క్షణమయినా బ్రతకలేనని తెలుసు కదరా. ఎక్కడున్నావు?” అని మనసులో అనుకున్నా.
మైదానం మధ్యలో ఒక స్పందన కనిపించింది. నువ్వు లేచి నిలబడ్డావు
దేవుడు నవ్వి “తను నీతో ఉండగా నిన్ను ఓడించటం నా వల్ల కాదు” అని వెళ్ళిపోయాడు.

3.చిన్నప్పుడు అమ్మ చందమామ రావో జాబిల్లి రావో అని అందమయిన అబద్దం చెప్పింది. అది నిజంకాదని తెలిసాక చాలా ఏడుపొచ్చింది.
చాలాసేపు కూర్చుని ఏడ్చాను. దేవుడొచ్చి ఏడవకయ్యా. నీకోసం ఒక చందమామ ఉందిలేవయ్యా అని తన చేతిలో నిన్ను చూపించాడు. అప్పటినుండి వెతికితే ఇప్పటికి కనిపించావు.

4.నా కళ్ళు మూయాలని నా వెనుకగా నువ్వు వస్తూ ఉంటే నీ పాదాల కదలికలకి నీ మువ్వలు చేసే సవ్వడి, ఆ అలికిడికి నేను వెనుకకు తిరిగితే దొరికిపొయానని నువ్వుపెట్టే బుంగమూతి.అలా నిన్ను హత్తుకోబోతే సిగ్గుతో దాచుకునే నీ మోము. నా భుజం పైన తల వాల్చేప్పుడు నీ మౌనం. ఇవి చాలు వేల సంవత్సరాలు దాచుకోవటానికి.

5.ఓటమిలో ఓ ఓడిలో చేరి ఏడ్వాలని వాలిపోతున్న నా తలని నిమిరే చేయి, గెలుపులో నా అనందాన్ని పదింతలు చేసే నీ కౌగిలి, తెల్లవారే ఉత్సాహాన్నిచ్చే నీ తొలిముద్దు, సాయంత్రం అలసి ఇంటికి వస్తే నన్ను సేదతీర్చే నీ చిరుముద్దు ఇంతకంటే ఏం కావాలి నువ్వు నాకోసమే పుట్టావని నమ్మటానికి. బదులుగా నేనేమివ్వను రా? మోకాళ్ళ పై వంగి నా సమస్తాన్ని నీ పాదాక్రాంతం చేసి నీకు దాసోహం అంటున్నా.

నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..

best friends

best friends

ఏటి ఒడ్డున ఇసుక మేటలు
ఓ నాలుగు చేతులు
గంటలో రాములోరి గుడి.

ఊరి మధ్యలో రాములోరి గుడి
గుప్పిట్లో కొబ్బరి ముక్క ప్రసాదం
కాకి ఎంగిలి.

ఊరి చివర జాతర
చేరో చేతిలో రూపాయి
పుల్ల ఐసు, రంగులరాట్నం.

లెక్కల మాష్టారి కోపం
ఒక చేతి పై వాత
నాలుగు కళ్ళలో నీళ్ళు.

పుట్టినరోజు పండగ
నాన్న ఇచ్చిన క్యాడ్బరీ చాక్లెట్
సగం సగం.

ఊరిలోకొచ్చిన కొత్తమ్మాయి.
బాబాయి హీరో సైకిల్
చెరో రౌండ్.

వాచీ పాతబడింది
పదవతరగతి పరీక్షలు
చేరో రైలు బెంగులూరు, హైదరాబాద్.

జుత్తు నెరిసింది
పిల్లల పెళ్ళి
రెండు మనసుల్లో తడారిపోని స్నేహం.

మనసున మనసై బ్రతుకున బ్రతుకై..

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు…

మహానుభావుడు ఎంత అద్భుతంగా వ్రాసాడండి. తోడు ఉంటే సరిపోదు నిన్ను నిన్నుగా అంగీకరించే తోడు. నిజం మనవాళ్ళు మనపక్కనే లేని జీవితం అన్నీ ఉన్నా ఏమీ తినలేని, నిద్రలేని ధనవంతుడి రోగంతో సమానం. ఒకతరం క్రితం ఎంత కష్టం వచ్చినా ఊరువదిలి వెళ్ళేవారు కాదు. ఎవరయినా ఉద్యోగరిత్యా వెళ్ళినా అందరూ భాదపడేవారు ఎంత కష్టం వచ్చింది ఊరువదిలిపోవాల్సి వస్తుందీ అని. పొట్టకూటికి ఎన్నిపాట్లు అని అందరూ జాలి పడేవారు. కానీ ఇప్పుడో మన నాయకులకు భాగ్యనగరం మీద ఉన్న ప్రేమ మనల్ని చచ్చినట్టు ఇక్కడికి రప్పిస్తుంది. తల్లిదండ్రులను, ప్రాణస్నేహితులను వదిలి రావటం. ఎంత కష్టం అండి. దూరాలు పెరిగి ప్రేమలు పెరిగే రోజులు పోయాయి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి వారి మధ్య ఒక తెలియని అగాధం ఎర్పడుతుంది. చాలాసార్లు నా చినప్పటి స్నేహితులు అనుకోకుండా కలిసినప్పుడు ఏమి మాట్లాడటానికి ఉండదు. ఎవో ఉద్యోగాల గురించి అడిగి ఊరుకుంటా. ప్రవర్తనలో కూడా చనువుపోవటం చూసాను.

నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, నా చాలామంది స్నేహితులు నా కూడా వచ్చారు. అందరం ఒకే దగ్గర ఉండటం కొంత బాగుండేది. ఇంటిలో వాళ్ళని దూరమయ్యా అనే భాద ఉన్నా స్నేహితుల మధ్యే ఉండటం వలన మా ఊరిలోనే ఉన్నానేమో అనేట్టు ఉండేది. అయినా మనం ఇష్టపడే మన సొంత ఊరు, మనల్ని మనంగా గుర్తించే మన ఊరివాళ్ళని వదిలి మన ఉనికి మనకే తెలియని, మన ఉనికికి ఏమాత్రం ప్రాముఖ్యత లేని చోటకి రావటం ఏంటండి మన పిచ్చిగానీ.

ఇప్పుడు నా పరిస్థితి మరీ దారుణం. పెనంలో నుండి పొయ్యలో పడ్డట్టు అయ్యింది. ఆఫీసు పని మీద చద్దికూడూ తినే ఈ అమెరికాకి పొట్టకూటికి వచ్చా(ఈ వ్యాఖ్య ఎవరినయినా భాదిస్తే క్షమించండి). కనీసం నా పక్కనే ఉండే నా స్నేహితులు కూడా లేకపోయేసరికి నా మీద నాకే జాలి కలుగుతుంది. ఎంత పనికిమాలిన పసలేని జీవంలేని జీవితం గడుపుతున్నాను అని. మన ఇంటిలో ఇరుగు పొరుగు స్నేహితులతో తినే పచ్చడిమెతుకుల్లో ఉండే ఆనందం ఇక్కడ డాలర్లు పెట్టి కొనుక్కుతినే చద్దికూడు లో ఉంటుందా? పోనీ నా జీవితం లో వయస్సు 50 వచ్చేవరకు ఇలాగే కష్టపడి కడుపుకట్టుకుని, అందరికి దూరంగా నేను ఇష్టపడే నా ఊరికి దూరంగా ఉంటా, ఉండి 50 ఏళ్ళకి నేను దాచుకున్నదానితో ఏమి చెయ్యాలి? హాస్పిటల్కి కట్టాలి. ఎందుకంటే అప్పటికి ఖచ్చితంగా అన్ని రోగాలు వచ్చేస్తాయిగా.

నా స్నేహితులని, కుటుంబాన్ని ఎంతగా మిస్సవుతున్నానో నిన్న ఒక గంట ఏకాంతంలో కూర్చున్నప్పుడు తెలిసింది. అవును మనస్సుకి మొహమాటం ఎక్కువ అందరూ ఉన్నప్పుడు సందడిగా ఉన్నప్పుడు మాట్లాడదు. ఏకాంతంలో మాత్రమే మాట్లాడుతుంది.
అవును ఏకాంతం నీతో చాలా ఊసులాడుతుంది.
ఏకాంతం నీలో ఉన్న నిన్ను నీకు చూపిస్తుంది.
ఏకాంతం నీ వాళ్ళని నీకు పరిచయం చేస్తుంది.
ఏకాంతం నీ గత స్మృతులను మోసుకొస్తుంది.
ఏకాంతం నిన్ను ఏడిపిస్తుంది, ఓదారుస్తుంది.

పైన చెప్పినవన్నీ నిజాలు. నేను అనుభూతికి లోనవుతున్న భావాలు. లేకపొతే అక్కడ మనదేశంలో నా వాళ్ళందరూ ఘాడ నిద్రలో ఉంటే నేనెందుకు వారిగురించి ఆలోచిస్తున్నా. ఏకాంతంలో కూర్చుని నా ఫస్ట్ క్రష్ నుండి ప్రతీ ఒక్కరిని తలచుకుని ఎందుకు భదపడుతున్నా. నన్ను వదిలివెళ్ళిపోయిన వాళ్ళని సహితం ఒక్కసారి చూడాలని ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరితనం. మనకి మనమే తవ్వుకున్న గొయ్యలాంటి ఒంటరితనం. నేను అమెరికా వస్తే మా మురళీ అమెరికా వెళ్ళాడు అని నా స్నేహితులు కుటుంబ సభ్యులు గర్వంగా చెప్పుకుంటుంటే. నేను వాళ్ళకి “ఐ మిస్ యు” అని చాలా కృతకంగా. కృత్రిమంగా చెప్పాలా? చెబితే నన్నో చవటాయి లేదా కెరీర్ ఆబ్జెక్టివ్ లేని వెదవాయి అనుకుంటారు. అవకాశాలు చేతిలో ఉంచుకుని చంటిపిల్లాడిలా ఏంటిది అనుకుంటారు. అనుకోనివ్వండి ఇంతకు మించి నటించటం నావల్ల కాదు. ఇప్పటికే నేను మిమ్మల్నందరిని వదిలి ఉండలేకపోతున్నా అని చెప్పలేక ఇగోతో ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చా. ఇక నావల్ల కాదు. గట్టిగా అరవాలని ఉంది నాకు డబ్బు అధికారం దర్పం కంటే మీరు కావాలి. మీ అభిమానం కావాలి.

నే ఇసుకతో ఇల్లు కడితేనే మురిసిపోయి నన్ను ఊరేగించిన భుజాల తోడుకావాలి.
అ ఆ లు రాస్తేనే సంబరపడి హత్తుకున్న చేతులు కావాలి.
గల్లీ క్రికెట్లో సిక్సర్ కొడితే అబ్బురపడి ప్రోత్సహించిన చప్పట్లుకావాలి.
ఏంచేసినా సై అని నావెంటే ఉండే అడుగులు కావాలి.
చింపిరి జుట్టుతో నే స్టైల్ కొట్టినా నా అమాయకపు ప్రేమని గుర్తించిన ఆ చిరునవ్వు కావలి.
ఇవన్నీ మనజీవితంలో రోజూ మరలా మరలా జరగటానికి తగినంత సమయం కావాలి.

ఏదో ఒకటి చేస్తాను ఇవన్నీ తెచ్చి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను…….

ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…

 జీవితంలో మనం ఎప్పుటికీ మరచిపోలేని రోజులు, క్షణాలు అందరికీ ఉంటాయి, ఉండాలి. నిన్నటి రోజు నా జీవితం లో ఒక మధురమయిన రోజు. నా చెవులకి పరిచయమున్న ఒక పాటని నా కళ్ళకి పరిచయం చేద్దాం అని వెళ్ళి, ఆ మకరంద స్రవంతిని నా హృదయం నిండా నింపుకున్నా. కానీ తన్మయత్వంలో నా హృదయాన్ని అక్కడే వదిలేసి వచ్చా. మరలా వెళ్ళి తెచ్చుకుందామంటే ఈ సారి ఆత్మనో, అస్థిత్వాన్నో వదిలేసి వస్తానేమోనన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నా. మీలో ఎవరయినా గజల్ శ్రీనివాస్‌ని ఎరిగుంటే దయచేసి కాస్త నా హృదయాన్ని తెచ్చిపెట్టండి.

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

గజల్ శ్రీనివాస్ నిజానికి ఒక వేటగాడు. నిజం నమ్మరా? ఒక్కసారి అతన్ని కలిసి మాట్లాడండి మీకే తెలుస్తుంది. వెంటాడి, వెంటాడి భందిచేవాడ్ని వేటగాడు అనికాక పాటగాడని ఎలా అనుకోమంటారు? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో, గజల్‌తో వెంటాడుతారు. అందుకేనేమో ఆయనే అన్నారు “నా గజల్‌కి కత్తికున్నంత పదునుంది కాదంటారా” అని. ఎలా అంటామండీ ఆయన గజల్‌కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే. ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే. కాదు కాదు నాకు క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, పదే పదే మీ వద్దకు రాలేనుగా అన్నా. పదే పదే వెళ్ళలేకపోయినా కాశీ వెళ్తే మాత్రం గంగలో ఒక మునక వేస్తాం. అదే ఇంటిముందు పారితే గుడ్డలుతుకుతాం కాదంటారా అన్నారు. ఏమంటాం నవ్వాపుకోవటానికి, ఆ మాటల్లో లోతైన భావాలను అర్ధంచేసుకుని తేరుకోవటానికే చాలా టైం పట్టింది. ఆయన మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు. కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు. తన గజల్‌లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు. ఆపైన ఆరగించని వాడు, అరిగించుకోని వాడు శుద్ద వెధవాయి అని నే వేరేగా చెప్పాలా?

ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు ఏది మాటో ఏది పాటో తెలియలేదు. ఎందుకంటే ఆయన మాటలు, పాటలు మమేకమయిపోయి ఆ గాత్రం లో ఏంవిన్నా మాకు శ్రావ్యంగానే ఉంది. పైగా బొత్తిగా సంగీత ఙ్ఞానం లేదాయే. నావరకు చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే ఆయన మాటయినా, పాటయినా. పైగా పాట అంటే స్వరాలు, అనుస్వరాలు, సంగతులు కాదు. సాహిత్యాన్ని స్పష్టంగా శృతిలో శ్రావ్యంగా సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి అంటారాయన. ఆయన చెప్పేది ఒక్కటే తాన్‌సేన్‌లా రాగాలాపన చేయండి, లేదా వాగ్గేయకారుల్లా కీర్తనలు పాడండి. అంతేగానీ మహానుభావుల సంకీర్తనలను రాగాలతో కలిపి ముక్కలు చేసి, సాగదీసి హింసిచవద్దు. బొత్తిగా స్వర ఙ్ఞానం, సంగీత ఙ్ఞానంలేని నాకు కూడా ఆయన భావం అర్ధమయ్యింది, తిరిగి వ్రాయగలుగుతున్నా. అది ఆయన మాటల్లో వివరణలో ఉన్న శక్తి, సామాన్యుని హృదయానికి సహితం పట్టుకుంటుంది. అందుకేనేమో ఆయన అంటారు పిల్లల్ని ప్రతి తల్లిడండ్రులు బుర్రతో చదవమంటారు కానీ దయచేసి ఇకనుండి హృదయంతో చదవమని చెప్పండి అని. పిల్లలు అంటే ఆయనకి ఎంత ప్రేమో నిన్న ఆయన్ని చూసాక అర్ధమయ్యింది. మాతో మాట్లాడుతూనే, మధ్యలో వచ్చిన వాళ్ళ పాపని ముద్దు చేస్తున్నారు. తన వారసురాలింక ఆ పాపే, పేరు సంస్కృతి. నేటి ఆధునిక సమాజంలో పెద్దలు పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారో ఆలోచించుకోండి అని సూటిగా ప్రశ్నిస్తారాయన. రోజులో పిల్లలతో మాట్లాడేది కేవలం గంట సమయమే అయితే 16-20 ఏళ్ళల్లో ఎన్ని గంటలు గడపగలం? అటువంటప్పుడు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అంటారు. బయటకి వచ్చి మాకు వీడ్కోలు పలికి తిరిగి వెళ్తూ అక్కడ ఏడుస్తున్న ఎవరో చంటి పాపని బుజ్జగించి ఇంటిలోకి వెళ్ళరాయన. అదిచూసి అనిపించింది మాటల్లో ఏం చెబుతారో అది ఆచరించే వ్యక్తి అని.

మాటల్లోనే కాదు పాటల్లో ఏం చెబుతారో అదికూడా ఆచరిస్తారు. ఎప్పుడో జనాభా నియంత్రణ గురించి పాట పాడిన ఆయన అది తనజీవితంలో విధిగా ఆచరించి చూపించారు. అందుకే ఒక్క సంతానానికే పరిమితమయ్యారు. ఆయన అమ్మ గజల్‌తో, అమ్మ ని అమ్మగా ప్రతీ ఆంధృనికీ పరిచయం చేసేదాక నిదుర పోలేదు. నాన్న గజల్‌తో, తెలుగునాట ప్రతి తండ్రీ పూజింపబడేలా చేసారు. తెలుగు గడ్డని వదిలి వెళ్ళిన తెలుగు వాడ్ని “ఓనమాలు దిద్దిన బడి శిధిలమవుతూ, నిన్ను సెలవడిగింది” గజల్ తో పిలిచి, ఆ రాముని గుడి, నీవు నడిచిన వీధిరోడ్డు నీ క్షేమం అడిగాయని కలవరపరచి ప్రవాసాంధ్రులను ఇంటికి రప్పించారు. జీవనసమరంలో పట్టణాలకు వలసపోయిన నాలాంటి వారిని కూడా విడిచి పెట్టలేదు “ఒక్క సారి ఊరుపోయి రా” అన్న గజల్‌తో తెలియని అలజడి కలిగించారు. తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్లో,జీవన విధానంలో ఆయన గజల్ స్పందించని అంశాలు గానీ, స్పృశించని పార్శ్వాలు గానీ లేవేమో? ఎంత చిన్న విషయమైనా కూడా వదిలిపెట్టలేదు. ఎలా అంటే “ఇల్లు ఇల్లు లానే లేదు, తను ఊరినుండి ఇంకా రానేలేదు” అన్న గజల్లో భార్య ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేలా వినిపిస్తారు. తెలుగు సంకీర్తనల కోసమే వెంకన్న అన్నమయ్యని పుట్టిస్తే, తెలుగు సంగీత, సాహిత్యాలు సామాన్యుని ఆర్తిని,జీవన శైలిని పూర్తిగా తమలో ఇముడ్చుకోలేకపోతున్నాయని సాక్షాత్తు శారదాదేవే ఈ సరస్వతీపుతృన్ని మన తెలుగునాట పుట్టించిందేమో? పాట గొంతుతో కాదు ఆత్మతో పాడాలంటాడు ఆ గానగంధర్వుడు. సామాన్యుని జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆవిష్కరించలేకపోయానని ఆయన చెబుతున్నప్పుడు శూన్యంలోకి చూస్తున్న ఆయన కళ్ళలో ఒక నిరంతర శోధన కనిపిస్తుంది మనకి. సామాన్యుని ఆర్తి,భక్తి మన తిరుపతి వెంకన్నని కదిలించిందో లేదో గాని శ్రీనివాస్‌ని కరిగించింది. అందుకే ఆయన ఆర్తితో, ఆత్మనివేదనతో శ్రీ శ్రీనివాసం క్యాసెట్ రూపొందించారు. “పొడగంటి మయ్యా మిము పురుషోత్తమా..” అనలేని సామాన్యుని కోసం “ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి స్వామీ. వేడి వేడి అన్నంలో వెన్నపూస వేసిస్తా, ఆవకాయతో కలిపి గోరుముద్ద తినిపిస్తా” అని పాడి సామాన్యుడి ప్రార్ధన ఇలానే ఉంటుంది. కేవలం అన్నమయ్యదే ఆత్మనివేదనకాదు ఎందరో సామాన్యులదీ ఆత్మనివేదనే వారి భావాలు కూడా స్వామి వింటాడు అని చెబుతారు.

అందుకే ఆయన్ని డాక్టరేట్లే కాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వరించాయి. వీటి గురించి చెప్పటం నా వల్లకాదు. ఎందుకంటే ఆ చిట్టా ఆంజనేయుని తోకంత అవుతుంది. ఆయనకే ఇంటిలో పెట్టుకునే స్థలం లేక అటకెక్కించిన సత్కార, పురస్కార పత్రాలు, ఙ్ఞాపికలు ఎన్నో మాకు చూపించారు. భాదపడ్డారు, వీటికి మా ఇంటిలో అవమానం జరుగుతుందండీ అని. ప్రస్తుతం గాంధీ తత్వాన్ని ప్రపంచానికి పంచే పనిలో ఉన్నారు. ఇటీవలే 150 భాషల్లో పాడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగుని, తెలుగు సాంప్రదాయాన్ని ఆయన ఎంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే ఆయన ఇంటిని చూస్తే చాలు ఇట్టే తెలిసిపోతుంది. ముగ్గువేసి మధ్యలో రాగిపాత్రలో పువ్వులతో అతిధులని ఆహ్వానించే ముంగిలి. ఇంటినిండా తెలుగుదనాన్ని నింపుకున్న మట్టి బొమ్మలు, గోడలమీద ఏ చిత్రకారుడో తన కుంచెని తెలుగుదనంలో రంగరించి రంగుల్లో ఆవిష్కరించిన తైలవర్ణచిత్రాలు. ఆ ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. ఎ-తెలుగు కి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆయనకి భగవంతుడు చిరాయువునివ్వాలని, ఆయన సంకల్పించిన ప్రతి పనిలోని భగవంతుని దీవెన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను తమతో తీసుకు వెళ్ళిన సతీష్ యనమండ్ర గారికి, జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్ గారికి నా కృతఙ్ఞతలు.

ఒక మధుర ఙ్ఞాపకం

ఒక మధుర ఙ్ఞాపకం

జీవితంలో కొన్ని ఙ్ఞాపకాలు పాత పుస్తకాల్లోని గులాబీ రేకుల్లా, నెమలీకలా దాగి ఉంటాయి. కానీ ఈ ఙ్ఞాపకాలు వాటిలా జీవం కోల్పోవు. ఎప్పుడు తరచి చూసిన ఆ పరిమళం మన హృదయాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తునే ఉంటుంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ సెలవు….

గమనిక: గజల్ శ్రీనివాస్‌ని ఆయన,గారు అని సంభోదించలేదు కారణం “ప్రతి తెలుగువాడి గుండె గడపలో ముగ్గులేసి తెలుగు మీద ప్రేమని నింపుతా. ఏం చేయలేమంటారా? ” అన్నారు. ఆ మాటతోనే మాకు ఆప్తుడయిపోయాడు, మా ఇంటిలో ఒకడు అయిపోయాడు. ఇంక ఆయన్ని దూరం చేసుకోవటం నాకిష్టం లేదు.

మీ అబ్బాయి చాలా మంచోడు

ఇదేదో ఎర్రబస్సెక్కిన వెర్రి ప్రొడ్యూసర్, సినిమా దురద తీర్చుకోవటానికి తీసిన దురదగుండాకు సినిమా టైటిల్ అనుకొనేరు. అబ్బే కాదండీ. నా గురించి మా మమ్మీ(ఈ పదానికి మితృలు నన్ను క్షమించాలి, చిన్నప్పటి నుండి అమ్మమ్మ ని అమ్మ అనటం మా అమ్మగారిని మమ్మీ అనటం అలవాటు. ఇది కాకుండా డాడీ కూడా చిన్నప్పుడే అలవాటు. అభిమానం పిలుపులో కంటే మనసులో ఉంటుందని నమ్ముతాను నేను. కొందరి మితృలని ఏరా రారా పోరా అన్నా సరే వారి మీద మనసులో చాల గౌరవం ఉంటుంది అంతేగా..) స్నేహితులు నా కిచ్చే కితాబు. ఇంక డాడీ స్నేహితులంతా మీ కేంటి రత్నాల్లాంటి పిల్లలు అంటారు. ఇలాంటి మాటలు విని అల్లరి చెయ్యాలనే మన ఆశ ఆవిరయిపోతుంది. కానీ మనసు మరీ మన కంట్రోల్లో లేక పోతే ఏం చేస్తాం ఏదో ఇలా చిన్న చిన్న పనులు చేస్తాం.

ఇంటర్ లో కిషోర్ అని ఒక క్లాస్ మేట్ ఉండేవాడు. వాడు కోవై సరళ లా కొంచెం అతి చేస్తాడు. వాడికి వినబడేలా శ్రీహరి క్లాస్ లో కిటికి అద్దం పగలగొట్టాడు అని చెప్పాం. మనోడు ప్రిన్సిపల్ దగ్గర మంచి కోసం వెంటనే వెల్లి ఈ విషయం చెప్పేసాడు. ప్రిన్సిపల్ క్లాస్ లో అందర్ని పిలిచి అందరి ముందు శ్రీహరిగాడిని తిట్టడం మొదలు పెట్టారు. వాడు నాకే పాపం తెలియదు మొర్రోమనిగోల. సరే ప్రిన్సిపల్ కిషోర్ గాడ్ని పిలిచి అసలు నువ్వు చూసావా అని అడిగారు. లేదండి మురళీ వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా అన్నాడు. మేమా మేమెప్పుడు మాట్లాడుకున్నాం అన్నాడు మా అనిల్ గాడు. నేనయితే చేతులు కట్టేసుకొని, అమాయకంగా ముఖం పెట్టి అది మొదటి నుంచి అలానే ఉంది కదా సార్ అని అన్నాను. అంతే మరుక్షణం లో కిషోర్ గాడి చెంప ఎర్రగా కందిపోయింది. అయినా మావోడు అతి చేయటం మానలేదు. మనోడికి పద్మ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. స్టడీ అవర్ లో పద్మ క్లాస్ పక్కనే ఉన్న ఖాళీస్థలం లో ఎవరూ ఉండరు అక్కడ చదువుకునేది. మనోడు కొంచెం దూరం లో ఆ అమ్మాయి కనపడేలా కూర్చొనేవాడు.రోజూ ఇదేతంతు. ఒకరోజు అక్కడ ఉన్న మావిడి ఆకు తో ఆ అమ్మాయి ఆడుకుంటూ పెన్నుతో గీతలు పెడుతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే కిషోర్ కి కనిపించకుండా నేను వెళ్ళి ఆ ఆకు మీద “ఐ లవ్ యు” అని రాసి వచ్చేసా.

అనిల్ గాడు వెళ్ళి ఇంతవరకు ఆ అమ్మాయి ఆడుకున్న ఆకు తీసి దాచుకో రేపు పెళ్ళయ్యాక తనకి చూపిస్తే ఎంత ఆనందపడుతుంది అని చెప్పాడు. చెప్పాగా మనోడు అసలే అతి రెచ్చిపోయి వెళ్ళి ఆకు తెచ్చేసుకొన్నాడు. దానిమీద వున్నది చదివి మనోడి ఆనందానికి అవధులు లేవు. కాలేజి అయిపోగానే అందర్ని పిలిచి పండగ చేసి పార్టీ ఇచ్చేసాడు. “నన్నే చూస్తూ రాసింది.” అనే గుడ్డి నమ్మకం వాడిది. మరసటి రోజు పద్మ ఒంటరి గా కాలేజి నుంచి ఇంటికి వెళ్ళే దారి లో కలిసి, “నువ్వు మన జీవితం గురించి అస్సలు టెన్షన్లు  పెట్టుకోకు. మా నాన్నగారు త్వరలో వాలంటరీ రిటైర్ అయిపోతారు జాబ్ నాకు వచ్చేస్తుంది. మనం హాయిగా ఉండొచ్చు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా నేనే మాట్లాడతా” అని చెప్పేసి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాడు. పాపం పద్మకి జార్జిబుష్ తెలంగాణా యాస లో తెలుగుపాట పాడినట్టు ఏమీ అర్ధం కాలేదు. అర్ధమయ్యేటప్పటికి న్యూటన్ కి చెట్టు ఎక్కకుండానే ఆపిల్ దొరికినట్టు, పద్మకి మంచి అవకాశం “రాఖీ పౌర్ణమి” రూపం లో దొరికింది. రాఖీ పౌర్ణమి రోజున పద్మ రాఖీ తొ రక్తసంభందం లో సావిత్రి లా వచ్చేసింది. సునామీ విషయం ముందేతెలిసిన వాతావరణ కేంద్రం డైరెక్టర్ అనౌన్స్ కూడా చేయకుండా వాడే ముందు పారిపోయినట్టు, విషయం ముందే పసిగట్టిన కిషోర్ గాడు చెప్పాపెట్టకుండా పారిపోయాడు. మేము వదులుతామా వెళ్ళి ప్రిన్సిపల్ ని ఆడిగితే M.P.C నుంచి Bi.P.C కి మారిపోయాడు అని చెఫ్ఫారు. అంతే వాడి వెనక మేము, మా వెనక పద్మ సినిమాల్లో చూపించిన రేంజ్ లో చేజింగు. వాడి ఖర్మకి వాడు మేడపైకి పరిగెట్టాడు. పైకి వెళ్ళిన తరువాత పారిపోవటనికి లేదు. అప్పుడు వాడికి ఉన్నవి రెండు అవకాశాలు ఒకటి దిగివచ్చి రాఖీ కట్టించుకోవాలి లేదా దూకి చావాలి. మొదటి దే బెటర్ అని వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. ఎలాగు రాఖీ కట్టేసింది కదా నేను మరలా MPC కి వెళ్ళిపోతా అని ప్రిన్సిపల్ అని అడిగాడు. ఈ సారి చెంపలు బొబ్బట్లయ్యాయి. ఆవిధంగా కిషోర్ గాడు మా చేతిలో ఎన్నోసార్లు బకరా అయ్యాడు. అన్నట్టు చెప్పటం మరిచాను మా మాట విని ఒకసారి పద్మ దగ్గరకి వెళ్ళి “పద్మావతి పద్మావతి నీ ఎర్రనిమూతి చూడగానే పోయింది నా మతి నామనస్సు అయ్యింది కోతి” “క్లాసులో నువ్వంటే అందరికీ మంట ఎందుకు వారి తో తంటా నేనుంటాగా నీ వెంట.”(ఈ కట్టింగు అక్షరాలా మందే) ఇలాంటి కవితలు చెప్పి అడ్డమైన తిట్లు తిన్నాడు.

గమనిక: నా గత టపా “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” ఫీడ్ లో ఉన్న సమస్య వలన కూడలిలో సరిగా రాలేదు.మితృలు ఇప్పుడు ఆ టపా చూసి మీ ఆలోచనలు కూడా తెలియజేస్తే మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు.