వేణుతో నేను

2008 నాటికి తెలుగుబ్లాగుల్లో అడుగుపెట్టిన వారికి ఇక్కడ చాలా మంచి స్నేహాలు దొరికాయి. కాలక్రమంలో బ్లాగులు మూల పడినా ఆ స్నేహాలు అలాగే కొనసాగుతున్నాయి. వర్చువల్ స్నేహాలంటే భయపడే ఈ రోజుల్లో ఫలానా స్నేహితుడు నాకు ఆన్‌లైన్ ద్వారా పరిచయం అని చాలా నిశ్చింతగా చెప్పగలిగే అదృష్టం మనది.

బ్లాగుల్లో చాలా స్నేహాల్లానే వేణుతో ఎప్పుడు పరిచయం మొదలయ్యిందో చెప్పటం కష్టం. నేను వేణు పోస్ట్ చదవటంతోనో, నా పోస్ట్ వేణు చదవటంతోనో మొదలయ్యుండొచ్చు. కానీ బజ్జు నాటికి ఇద్దరం ఒకరికొకరం తెలుసు. బజ్జులో ఉండే ఇన్‌స్టంట్ రెస్పాన్స్ కారణంగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ, షేర్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడేంత చనువు వచ్చేసింది. అయినా కూడా తను నాకు మొదటిసారి మెయిల్ పెట్టినప్పుడు


“మురళిగారు,
చనువు తీసుకుని మెయిల్ చేస్తున్నందుకు అన్యధా భావించరని తలుస్తాను”

అని మొదలుపెట్టాడు. ప్రైవసీ విలువ తెలిసిన మనిషి. పైగా ఆ రోజు మెయిల్ పెట్టినది నా పోస్ట్‌లో వాడిన ఒక ఎక్స్‌ప్రెషన్ సరైనది కాదేమో అని తన అభిప్రాయం చెప్పటానికి. కామెంట్‌లోనే చెప్పుండొచ్చు. కానీ పబ్లిక్‌లో చెప్తే నేను నొచ్చుకుంటానేమో అని మెయిల్ ద్వారా పర్సనల్‌గా చెప్పాడు. అందుకే అతను వివాదరహితుడు, అజాతశత్రువు.

2011 బజ్ ఉదృతంగా నడుస్తున్న రోజులు. ఇప్పుడు వాట్సాప్ వాడుతున్నంత విరివిగా బ్లాగ్ ఫ్రెండ్స్ బజ్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఎంత అల్లరి చేసాం బజ్జుల్లో. పుట్టినరోజుల పోస్టులు, పెళ్ళి పోస్టులు, పేరడీలు, దెయ్యాల కథలు. ఆ దెయ్యాల కథలన్ని వేణు ఓపిగ్గా కలెక్ట్ చేసి ఒక పి.డి.ఎఫ్. చేసాడు. అది ఇప్పటికీ మా ఫ్రెండ్స్‌కి చదవమని పంపిస్తూ ఉంటా. నేను మనదేశంలో లేకపోవటం వల్ల టైమ్‌జోన్ ఇబ్బందులు ఉండేవి. వేణు ఇండియా టైమ్ తెల్లవారి 3 వరకూ పనిచేస్తూ ఆన్‌లైన్‌లో ఉండేవాడు. అందువల్ల ఆ టైమ్‌లో ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం మాకు దొరికింది. మొదటిసారి ఫోన్‌లో మాట్లాడుకున్నది కూడా అప్పుడే అనుకుంటా.

తనతో చాలా ఎక్కువసేపు, చాలా పర్సనల్‌గా మాట్లాడిన సందర్భం ఒక్కటే. ఆ రోజు తన బ్లాగులో వ్రాసిన అమ్మ పోస్టులు చదవమన్నాడు. అవి చదివాకా చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నాం. ఇద్దరి జీవితాల్లో మదర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసారో చెప్పుకుంటూ సమయం మర్చిపోయాం. అంతా అయ్యాక ఎప్పుడూ అమ్మ మనసు నొప్పించకు, ఏదైనా సందర్భంలో అమ్మ వద్దంటే మెల్లగా నచ్చజెప్పు తప్ప బాధపెట్టకు అని చెప్పాడు. అమ్మంటే తనకి అంత ఇష్టం, ప్రపంచంలో ఏ అమ్మా బాధపడకూడదనుకుంటాడు.

నేను జాబ్ రిజైన్ చేసి సినిమా ఫీల్డ్‌కి వెళ్తున్నా అని చెప్పినప్పుడు మెయిల్ చేసాడు.

వావ్ అవునా.. మంచి నిర్ణయం మురళీ ఆల్ ద వెరీ బెస్ట్.. అలా నచ్చిన పని చేయగలగడానికి చాలా అదృష్టం కావాలి. విష్ యూ లోడ్స్ ఆఫ్ గుడ్ లక్..

చాలా సిన్సియర్‌గా అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. తన కష్టాలు మాత్రం ఎవరికీ చెప్పేవాడు కాదు. గుంభనంగా ఉండే మనస్తత్వం. నేను మూవి తీసిన రోజు వేణూ ఒక మంచి రివ్యూ వ్రాస్తాడని ఎప్పుడూ అనుకునే వాడిని. బాలుగారి పాటలానే, వేణు రివ్యూ నాకింక అందని అదృష్టం.

తన విషయంలో నాకు చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఒక్కసారి కూడా తనని కలవలేకపోవటం. గుంటూరు వచ్చి కలుస్తా అని చాలాసార్లు తనకి చెప్పాను గానీ ఎప్పుడూ వెళ్ళలేకపోయాను. రాజ్‌కుమార్ పెళ్ళిలో మొదటిసారి వేణు అందరినీ కలిసిన సందర్భంలో నేను ఇండియాలో లేను. శంకర్‌గారి చివరి చూపులకి వేణు హైదరాబాద్ వచ్చేప్పటికి ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ రావటంతో నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. అలా కొద్దిలో మిస్ అయ్యాం.

రెండవది గతకొన్నేళ్ళలో ఎక్కువగా తనతో మాట్లాడలేకపోవటం.ఫేస్‌బుక్ పోస్టుల్లో కామెంట్స్ రూపంలోనే ఎక్కువగా పలకరింపులు. ఫోన్ చేసి మాట్లాడుకునే చనువుండి కూడా మాట్లాడుకోలేదు. ఎందుకూ అంటే ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్ఛర్యంగానూ, రిగ్రెట్‌ఫుల్‌గానూ ఉంది.

ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయినా అకాలమరణమనే అంటాం. కానీ నిజంగానే అకాలంగా, అకారణంగా వెళ్ళిపోయాడు. తను హాస్పిటల్‌లో చేరిన మరునాడు వాట్సాప్లో “వేణూ, ఎలా ఉంది?” అని మెసేజ్ పెట్టాను. అదే క్షణంలో నేను తనకి వాట్సాప్‌లో పెట్టిన మొదటి మెసేజ్ అదే అని రియలైజ్ అయ్యాను. తను ఆ మెసేజ్ చూడలేదు, రిప్లై చెయ్యలేదు. ఇంక ఎప్పటికీ రిప్లై రాదు కూడా.

ఎంతకీ రిప్లై రాకపోవటంతో కాస్త భయం వేసింది. పడుకునే ముందు నా మనసు ఏం చెబుతుంది అని నా కాన్షియస్‌ని క్వశ్ఛన్ చేసుకున్నా. ఎందుకో ఏం కాదనే అనిపించింది. దానితో ధైర్యంగా పడుకున్నా. కానీ నిజానికి అప్పటికే వేణు మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు. నిజానికి ఒకరి కాన్షియస్‌నెస్‌కి రెస్పాండ్ అయ్యే అవకాశం తనకి ఉన్నా నెగెటివ్ వైబ్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే తను వేణు కాబట్టి.

ఒక మనిషి జీవితంలో పన్నెండేళ్ళ పరిచయం అంటే తక్కువేం కాదు. అందులోనూ జీవితంలో అతి ముఖ్యమైన దశలో మొదలైన స్నేహం కాబట్టి ఇది జీవితకాల స్నేహం. అలాంటి స్నేహాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్ళిపోయావ్ వేణు. ఈ వాక్యూమ్ ఎప్పటికీ ఫిల్ కాదు. ఎన్నో ఏళ్ళ తర్వాతైనా సరే ఎవరికైనా బ్లాగు స్నేహాల గురించి చెప్పాల్సి వస్తే అప్పుడు కూడా నీ గురించి ఇలానే చెప్పుకుంటాం.

ఇన్నేళ్ళ మన పరిచయంలో నువ్వెప్పుడూ నన్ను నొప్పించలేదు. నేను ఎప్పుడైనా నొప్పించి ఉంటే మన్నించు వేణు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా, శాంతిగా ఉండాలి, నీ ముఖంపై ఎప్పుడూ నీ మార్కు చిరునవ్వు అలానే ఉండాలి. యు డిజర్వ్ ఆల్ ది పీస్

పోయిరా నేస్తమా, పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావు..

అల్విదా వేణూ.

సిన్నారావు గారు

పొద్దుటినిండి గేటు కాడే నిలబడిపోయేను నేను. సినమాయ్యొచ్చి పెద్దోళొస్తన్నారు బయటెవ్వరునేరు ఎళ్ళిసూడమంటె వచ్చుండిపోయాను. కాన్మెంటు నాని, మూర్తిమేష్టారాలొచ్చేరు. నన్ను చూసి “ఓరి నువ్వు అమ్రికాలోనున్నావన్నారు? నువ్వెప్పుడొచ్చేవు?” అని అడిగి లోపలికెళ్ళేరు. తెలిసినోళ్ళందరొస్తన్నారు.

బయటున్నాను కాని తెలిసిన ముఖాలొచ్చినప్పుడు వేణు చినాన్న ఏడుపు ఇనిపిస్తంది. “ఎలిపోయేడు నాయినా, మారాజు ఎలిపోయేడు, మా అక్కకి అన్యాయం సేసి ఎలిపోయేడు. సూడండి మళ్ళ కనిపిస్తాదేటి ముఖమూ సూడండి నాయినా” అని శోకాలు తీస్తన్నాడు వేణు చినాన్న. చినాన్న అంటావు కానీ అమ్మమ్మకి తమ్ముడు, తాతవుతాడు. పక్కనే కూర్సున్న పరిమిశెట్టోల పెద్దోడు “ఓరొల్లకోరా ఏణు, ఆడోల్లందరు ఇప్పుడే అగినారు నువ్వు మళ్ళీ మొదలెట్టిసేవు” అని ఆపినా ఆగలేదు. ఈధిలో ఏ ఇంటిలో ఏదొచ్చినా పరిమిశెట్టోల పెద్దోడొచ్చి సేతిలో పనిలాగీసుకుని నేసేత్తాలేరా అని దూరిపోతాడు. ఆనక సాయిం సేసేడు కదా అని ఒక యాభై ఇస్తే ఎళ్ళి నాలుగు సుక్కలేసుకొచ్చేత్తాడు. పెదమాయ్యొచ్చి “నువ్వింక ఆపుతావా లేదా? పిల్లలు బయపడిపోతన్నారు” అని వేణు చిన్నాన్నని కసిరీసేడు. “ఆపిస్తానులే నాయిన ఆపిస్తానులే. మళ్ళరేపీయాలకొచ్చి ఏడుస్తానా? ఆపిస్తానులే” అని మూలుగుతున్నాడు.

“ఏనాడయిన ఒక్క మాటన్నోరేనా? ఇళ్లల్లో ఇంతమంది పెళ్ళాలిని తిట్టీవోళ్ళని సూసాం కాని ఏనాడయిన మహానుభావుడు నోరు జారేరా? పోని జరుగుబాటుకి ఏదైన లోటు సేసేరా? చివర్లో నేనిసిగిపోయి అనీసేను కాని. ఇంటిలోన ఈ ఒంటేలేటి మనిషికి తెలివి లేకుండా. ఈ రొచ్చులో నన్నుండమన్నారా? చావమన్నారా? అనిస్తే నవ్వీసి పొనలాగే నీ అన్నదమ్ముల దగ్గిరికెళిపోతావేటి అనీవోరు కాని తగువేసుకునీవోరు కాదు” అని పంతులమ్మగోరితో అమ్మమ్మ సెబుతుంటే, పంతులమ్మగోరు అమ్మమ్మ సెయ్యి పట్టుకుని గుమ్మం దగ్గర కూర్సుండిపోయారు.

“నువ్వనీస్తవమ్మా. ఎందుకనీవు? నోరులేని మనిషిని పట్టుకుని అనీస్తవుగాని. నీ అన్నదమ్ముల్ని కాని, నీ పిల్లల్ని కాని అనీమను. ఏటున్నదని అనీటానికి? ఏలు పెట్టి సూపించే మనిషేటి? మాయమ్మ నొరు నీకొచ్చి నువ్వందరినీ అనీస్తవు.” అని వేణు చిన్నాన్న శోకాలు పెడుతూనే ఉన్నాడు.

ఊరిలో రాజికీయం సేసివోళ్ళొచ్చారు. నాన్న సప్లియర్సోలకి ఫోన్ చేసి తెప్పించేయించిన కుర్సీల్లో బడిపిల్లల్లాగ సేతులు కట్టీసుకుని కూర్సున్నారు. “నాగిస్సర్రావుగారూ, మీ మాయ్యగారని సెప్పుకోటమే కాని మనిషి ముఖం తెలియదండి. అదిగో ఆ రోడ్డంటెప్పుడయినా కోవటిపల్లెలుతుంటే పొలం దగ్గర నూర్పులు సేస్తుంటే సూసివోళ్లమంతే” అనీసి సెబుతున్నారు. నాన్న టీకొట్టు రవణని పిలిసి అందరికీ టీలిచ్చీమన్నారు. “బయిటికొచ్చీ మనిషి కాదండి. ఇంటికాడె కనిపెట్టుకునుండీవోరు. సిన్నపిల్లలందరికీ గొప్ప సేరిక. అదిగో మా పాప, మా బాబు దగ్గిరనుండి మా మరదలిగారి పిల్లలదాక అందరినీ ఆయినే ఆడించీవోరు.” అని సెబుతూ ఏదొ గుర్తొచ్చినట్టు “ఒరేయ్ భారతమ్మ పిల్లలు యాడదొకొచ్చేరు పోను కొట్టండి” అని కేకేసేరు. “పెద్దోడి కారులో వొస్తన్నారట కదా. రాజమండ్రి దాటీసేరంట” పెదనాన్న సెప్పేరు.

ఎవులో వొచ్చి “బాబు నీకేటవుతారేటి సిన్నారావు గారు?” అని అడిగారు. “మా తాతగారండి” అని సెప్పేను. “శామలమ్మ కొడుకువా? నువ్వల్లకడెక్కడో అమ్రికాలో ఉన్నావన్నారు. అందవనీసేరు.వొచ్చీసేవా” అన్నారు. “అందరూ వొచ్చీసేరు నాయినా, అందరినీ రప్పించీసుకున్నాడు రాజు. అందరు మనవళ్ళు కొడుకులతోటి జరిపించీసుకుంటున్నాడు. భోగమంటే నీదే నాయినా” అని వేణు చిన్నాన్న మళ్ళీ అందుకున్నాడు.

గంగులీధి కావెస్సర్రావొచ్చాడు. కావెస్సర్రావుకి తాతగారంటే గొప్ప ఇది. “ఇంటిలో సిన్నోడని సిన్నరావనిస్తారు కాని రాజారావండి మా మాయ్య పేరు” అని ఎవురితోనో మాట కలిపేడు కామెస్సర్రావు. గంగులీధి నుండి శంకర్రావు కొడుకు కబురు తెచ్చాడు. గంగులీదావిడ వద్దావనుకుంటుందంట రిక్షా పంపిస్తే వస్తానని కబురెట్టింది. కానయితే ఆవిడకి సేసే తంతంతా నాకూ సెయ్యాలని కండీషనెట్టిందట. ఆవిడంటే మా అమ్మమ్మ అనీసి. శంకర్రావు మా తాతగారికి అన్నియ్య కొడుకు. మాకు పెదనాన్న వరస. శంకర్రావు కొడుకు ప్రెసాదంటే నాకంటె రెండేళ్లు సిన్నోడే కాని గంగులీధిలో మనిషి పెద్దతరహా అనీసి, సదువుకున్నోడు అనీసి ఇలాంటి కబుర్లు సక్కబెట్టడానికి ఆడికే సెప్తారట.

ప్రెసాదు మా పెదమాయ్యని, సినమాయ్యని పిలిసి “మనిషి పోయినకాడ పట్టింపేటి సిన్నాన్న రిక్షా పంపించిస్తే ఆవిడ కూడా సూస్తది కదా” అని కర్ర ఇరక్కుండ సెప్పాననుకున్నాడు. “ఓరెనువ్వు ఆ ఈత్తరుపునొచ్చేవా, తాతని సూడ్డానికొచ్చేవా? ఏటిరా ఆయమ్మ గొప్ప? మనిషి పోయి మేమేడుస్తుంటే రిక్షా అంపాలా?” అని అందరూ తగిలీసుకున్నారు. పెదమాయ్యకసలే సెడకోపం “ఏటి బుర్రగాని తిరుగుతున్నాదేటిరా ముసిల్దానికి? మా అమ్మకి సేసినట్టు దానికి సెయ్యాలా?” అని ఎగిరిపోతుంటే ప్రెసాదుగాడు బిక్కయిపోయాడు. సినమాయ్యొచ్చి ప్రెసాదుగాడిని పక్కకి తీసుకెళ్ళి “ఒరేయ్ అమ్మతో మాట్టాడినాను. ఆయమ్మొచ్చి సూస్తే మాకేటి అబ్బింతరం లేదు. మావేటి అడ్డు సెప్పం. కాని రిక్షాలంపడాలాటివేట్నేవు.” అని కరాఖండిగా సెప్పిసేడు. ప్రెసాదుగాడు సైకిల్ స్టేండు తీసి గమ్మునెళ్ళిపోయేడు.

“ఇంకేటి మిగిలిందావిడతోటి? మనిషికి సుస్తీ సేసిందని తెలిసిన్నాడు కూడా ఆస్థి ఎలాగమ్మీసుకుందామని సూసినావిడతోటి మాటలేటి? మీకు బుర్రలుగాని పోనాయ” అని వేణు చిన్నాన అందరిని కసిరిసేడు. గంగులీధినుండొచ్చిన కావెస్సర్రావు వీధావిడమీద నోరు జారితే వీధిలో ఏరయిపోతామని కామయిపోయేడు.

ఏటి జరుగుతుందో అర్ధంకాని ఎదురింటి రామరాజుగారొచ్చి “ఏటండి భోగట్టా? ఎవరాలు?” అని కామేశ్శర్రావునడిగాడు. దగ్గరలోని మా మావయ్యలు గానున్నారేమోనని సూసుకుని సిన్నగొంతుతో “ఏటినేదండి మా సిన్నారావు మాయ్య సంగతి మీకు తెలియందా, అసలే ఒకీధిలో ఉన్నోళ్ళు. మనిషి నిఖార్సయిన మనిషి. మప్పితం లేదు. టపీమని మొహమ్మీద సెపుతాడు కాని, ఇచ్ఛికాల కోసం బొంకడం తెలీదు. మరయితే మా మావయ్యకయితే ఆ రోజుల్లో ఒక పెళ్ళయిన మాట నిజం. ఎవురికీ తెలీదనుకోండి. ఇప్పుడయితే మీ ఈదిలో ఇల్లు కట్టీసుకున్నాడు కాని, మా గంగులీధిలో ఇప్పుడికీ మా మాయ్యకి ఇల్లుంది. మా ఈది పిల్లనే ఇచ్చి పెళ్ళి చేసిసేరు. కానయితే పెళ్ళయి నెల్లాళ్ళయిన పిల్ల కాపురానికొచ్చింది కాదు. సూసేరు సూసేరు ఇక వల్ల కాదనీసుకుని పెద్దోళ్లందరిని పిలిచీసి ఏటీ పేచి? పెళ్ళి చేసీసుకున్నాక కాపరానికి రాకపోడాలేటి. ఇక నాకీ పిల్లొద్దని సెప్పీసేడు మాయ్య.

ఈదంత ఒక్కటయిపోయి పిల్లనొగ్గీడవేటి? ఇదేవన్నా పెళ్ళనుకున్నావా? బొమ్మలాటనుకున్నావా? అని మా మాయ్య మీదకొచ్చీసేరు. గంగులీధంటే అందరూ సుట్టాలే. అన్నీ మా కుటుంబాలే. ఎవ్వరినీ వదులుకునే మనిషి కాదు మా సిన్నారావు మాయ్య. మనిషికి గొప్ప మమకారం, ఆపేక్ష. అలాంటి మనిషి మీదకి గొడవకొచ్చీసేరు. “సుట్టాలు సుట్టాలనుకుంటే ఈదంత ఒక్కటయిపోతారా? ఏం ఆ పిల్లే మీ రక్తమా? నేను మీ రక్తం కాదా? దాని బ్రతుకే గాని నాది బ్రతుకు కాదా?” అని అందరిని నిలేసి నేను ఈ ఈదిలోనే ఉండనని పంతం పట్టీసేడు. మనసిరిగిపోతె మా మాయ్య మనిషి కాడు.

ఈదిలో పెద్దలు మనిషి ఎళ్ళిపోత నన్నాడన్న బాధ కూడా నేకుండా, అమ్మాయి సంగతేటన్నారు. ఆ ముక్కతో ఆ ఈది మీద, ఆ మనుషుల మీదున్న ప్రేమ సచ్చిపోయి అప్పుడుకప్పుడు సిన్నారావు మాయ్య నోటరీ సభాపతిగోరిని పిలిసీసి మా నాన్న నాకిచ్చిన పొలాలు, ఇల్లు ఆవిడ బ్రతికున్నదాక అనుభవించాడినికిన్నీ, అవిడ తదనంతరవూ అవి నా వారసులకి సెందాలని వ్రాసీసిచ్చిమని సెప్పి ఆ పూటే కట్టుబట్టలతో వీధి వదిలీసి వచ్చీసేడు.” అని కావెస్సర్రావు సెబుతుంటే జనాలు గుమిగూడీసి ఇంటన్నారు. ఎనకాలె ఉన్న సువ్వాడ గోపాలం “మాకు తెలీకపోవడమేటి బాబు, సిన్నరావుగారి పొలాలన్నీ మేవే సూసివోళ్ళం. గంగులీదావిడకి బాబొదిలిసిన పొలాలు మావే సేత్తన్నాం.” అని అందుకున్నాడు.

సువ్వాడ గోపాలం పక్కనే సువ్వాడ కిష్ణ, గౌరునాయుడు నిలబడి సూత్తన్నారు. గౌరునాయుడొచ్చి “ఎప్పుడొచ్చేరు బాబు? నాన్నో” అని అడిగాడు. నేను నాన్నని సూపించేను. నన్ను దాటుకుని గుమ్మంలోకెళ్ళి నిమ్మళంగ పడుకున్న తాతగారిని సూసి కాసేపలాగ నిలబడిపోయేడు. మా పొలాలన్నీ గౌరునాయుడే సూసివోడు.

కాపోతే గౌరినాయుడికి సిన్న దొంగబుద్దుందని తాతగారు సివర్లో మానిపించీసేరు. గౌరినాయుడి పెళ్ళాం లష్మి కోతలప్పుడు, నూర్పులప్పుడు వొచ్చి మిగిలిపోయిన పరకలేరుకున్న నెపాన మోపులోని పరకలు లాగీడం తాతగారు సూసి గెట్టిగ కేకలేస్సేరు. “ఓసిదేటి బాబూ, మిగిలిపోయిన పరకలేరుకోరా” అనుకుంట ఆ అమ్మి ఎళ్ళిపోయింది. రాతిరి కాపలాకి పోయి ఇంత కునుకు తీస్తే మోపులు మాయం సేస్సీవోరు. సూసి సూసి ఇసిగిపోయి “ఏవోయ్ గౌరినాయుడు రైతన్నోడు సెయ్యాల్సిన పనేనా? నమ్మి పొలాలు సెయ్యమని పిలిస్తే మాకే మట్టి కొడతారా? ఇక మనకి కుదర్దు గాని సాయంకాలం ఇంటికొచ్చి నీకు రావాల్సినవి తీసీసుకో. ఇంక నా మడిలోకి రాకు” అనీసేరు. “ఒసేటి బాబు, ఏనాటి నుండి సేత్తన్నారు వ్యవసాయము, ఈమాతరం గింజలు తియ్యని రైతెవుడీవూర్లో? దీనికే మడిలోకి రావుద్దనిసేరు” అని అడిగేడు కాని మా తాతగారయితే మళ్ళ గౌరినాయుడిని పిలిసింది కాని, సూసింది కాని లేదు.

పిన్ని పిల్లలు ఇంకా రానేదు. ఆల్లొచ్చి సూసీదాక ఏం నేదని అందరికీ చెప్పిసిందమ్మమ్మ. వచ్చినోలు టీలు తాగుతా సప్లియర్స్ కుర్సీల్లో కూకుండిపోయారు. వేణు సిన్నాన్న ఎళ్లి కావేస్సర్రావు పక్కనే కూర్సొని “కావెస్సర్రావు ఆవిడ పద్దతేటి? మా బావకి బాలేదని తెలిసిన్నాటి నుండి సూత్తన్నాం. అనుభవించమని ఒగ్గీసిన ఆస్థిని పడీసుకుని అన్నదమ్ముల పిల్లలికిచ్చిద్దమని తాపత్రయిమేటి? మా బావ బాగున్న రోజుల్లోనే ఎంతమందో సెప్పారు, ఆవిడకి ఎంతోకొంతిచ్చీసి ఆ పొలాలు, ఇల్లు తీసీసుకోమని. మాబావ దేవుడు మాట తప్పుతాడా? ఆ పొలాల మీద ఎంతొస్తుందో, ఆ ఇళ్ళు ఏటవుతుందో ఒక్కనాడైనా అడిగాడా? అలాంటి మారాజు సొమ్ము పడీసుకోటానికి అప్పుడే మధ్యవర్తులతో మాట్టాడీసిందంట.

లోకంలో ధర్మమేటి లేదనుకుందేటాయమ్మ. కట్టుబట్టలతో అన్నీ వొగ్గీసి వచ్చీసేడుగావల. ఆ బాబు కష్టం సేసి టాటా, జెంషేడుపూరు అని ఊర్లు ఊర్లు తిరిగి వ్యాపారం సేసి ఏదో సంపాదించి కాణీ దాసేడు కనకగాని లేకపోతె ఈ పిల్లల్ని ఎలా పెంచీవోడు? పిల్లలకింత దాసిపెట్టాలని పొలంలోనూ, సామిల్లులోనూ పనోళ్ళతోటి పనోడిలాగ మూటలెత్తీసి ఒక కష్టం పడ్డాడా? అలాటి బాబు దగ్గరా లాగీసుకుందామని సూస్తన్నారు?” అని దులిపేత్తుంటే ఊ కొడతన్నాడే కాని మారు మాట్టాడలేదు కావెస్సర్రావు.

పిన్నికొడుకులు వచ్చీసేరు. తాతగారిని ఎరిగినోళ్ళంతా వచ్చి పోటీపడి భుజాలకి ఎత్తుకున్నారు. పుట్టినాటి నుండి మాతోటే ఉన్న తాతగారు కళ్ళ ముందే కలలాగా కరిగిపోయేరు. కాలుతున్న కట్టెలు సూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగేయి కాదు. కానీ మరలా రేపు సూస్తామా? ముట్టుకుంటామా? గోడమీద పటంలో సూసుకోటానికి ముక్కూమొహం తెలియని దేవుడా? మమ్మల్ని ఎత్తుకునాడించిన తాతగారు.

పరిమిశెట్టోల పెద్దోడొచ్చి “ఇక కదలండిరా మీరందరూ. ఇంటికాడ చెయ్యాల్సిన పనులుంటాయి ఎళ్ళి సూడండి. ఈ సాకలోడు కిరసనాయిలికి కక్కుర్తిపడి సరిగ్గా కాలుస్తాడో లేదో, నేనిక్కడే ఉంటాను” అని సెప్పి పెదమాయ్య వైపు సణుగుతూ సూసేడు. వేణు చినాన్న పెదమాయ్యతోటి ఒక వొందిప్పించేడు. సాకలి రాము కూడా “మీరెళ్ళండి బాబు నేను సూసుకుంటాను” అని చెప్పి అందరిని పంపీసేడు.

తిరిగొచ్చిస్తుంటే గౌరినాయుడు కనిపించాడు. కాస్త దూరంలో నిలుసుని ఎగిరిపడుతున్న మంటల్ని సూస్తన్నాడు. “ఏమిరా గౌరినాయుడు ఇక్కడ నిలబడిపోయేవేమి?” అని అడిగాడు పరిమిశెట్టోల పెద్దోడు. మనిషికి మాటలేదు. ఎన్నేళ్ళు పనిసేసేడు మరి. ఏ జ్ఞాపకాలు కదిలాయో ఏటో.

పరిమిశెట్టోల పెద్దోడు ఆ రావిచెట్టు కింద కూర్సుని “ఓరి గౌరినాయుడు మనిషి సచ్చిపోయినంత మాత్రాన పంతం సచ్చిపోద్దా? ఆ గంగులీదావిడ సూడు మనిషి సచ్చిపోయిన కాడ కూడా నాకు పిలుపు రావాలి, రిక్షా రావాలి అన్నాది. సిన్నరావు గారితోటి పంతమా? పేనంలేని ఆయన శరీరం కూడా ఆమెను సూడకుండానే వెళ్ళిపోయింది సూసావా?

మనిషి మిగులున్న నాడే కాస్త మంచి మిగుల్సుకోవాలిరా. మనిషి పోయేక ఎన్ననుకుని ఏటి నాభం. నీ తప్పులు నా తప్పులు లెక్కలెయ్యటానికి దేవుడొస్తాడనుకున్నావేటిరా. ఇదిగో ఇలాటి మహానుభావులే వొచ్చి ఒరేయ్ ఇది తప్పురా అని సెప్పీసెళ్ళిపోతారు” అని సణుక్కుంటూ సీసా మూత తీసేడు

శ్వేతకాష్టం

(హెచ్చరిక: ధూమపానం ఆరోగ్యానికి హానికరం)

పండక్కి పుట్టింటికొచ్చిన కొత్త పెళ్ళికూతురికి కన్నతల్లి ఆప్యాయంగా తలంటు స్నానం చేస్తున్నట్టు ఆకాశం నుండి చినుకులు ఆగి ఆగి పడుతున్నాయి. స్కూల్ ఎగ్గొట్టి ఆడుకుంటున్న పిల్లల్లా చల్లగాలి వర్షంలో అల్లరిగా అటూ ఇటూ తిరుగుతూ ఒక్కసారి శరీరాన్ని తాకి ఝల్లుమనిపించి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద నిలిచిన నీరు మా కారు వేగానికి ఎగిరిపడుతుంది. రోడ్డుకి ఇరుపక్కల ఉన్న తోటల్లో చెట్లు వర్షానికి తడిచి భారంగా ఒంగి నిలబడ్డాయి. దూరంగా ఎక్కడి నుండో ఏదో తెలిసినపాటే గాల్లో తేలుకుంటూ వచ్చి తెరలు తెరలుగా వినిపిస్తుంది. మనసేదో ఆనందరాగం వింటున్నట్టుగా తన్మయత్వంలో మునిగిపోయింది. అప్పటి వరకూ గుప్పుమని వచ్చి గుండెలనిండా ఒదిగిపోయిన మట్టివాసనను ఒరుసుకుంటూ జొన్నపొత్తులు కాలుస్తున్న కమ్మని వాసన మెల్లగా జొరబడుతుంది.

అప్పటికే భీమిలీ రోడ్డు మీదుగా మా కారు వైజాగ్‌కి దగ్గరగా చేరుకోవటంతో ఎఫ్.ఎం.లో ఏవైనా పాటలు పెట్టుకుని విందామని  మొబైల్ బయటకు తీసాను. బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లో టికెట్ చూపించటానికి నా మొబైల్ బ్రతికే ఉండటం చాలా అవసరం. పైగా చార్జర్ కూడా తీసుకుని రాలేదు. తిట్టుకుంటూ మొబైల్ పక్కన పడేసా.

ఇప్పుడో కమ్మని చాయ్ తాగితే అని మనసులో అనుకుంటుండగానే..

“సార్.. ఇప్పుడో నాలుగు పీకులు దమ్ము పీకితే” అంటూ నా వైపు ఆశగా చూశాడు డ్రైవర్. సరే కానీ అన్నట్టు నవ్వాను. వెంటనే ఆనందంగా రోడ్డు పక్కనే కనిపిస్తున్న ఒక టీ దుకాణం దగ్గర కారాపాడు.

ఊరికి దూరంగా రహదారి మీదున్న దుకాణం కావటంతో పెద్దగా జనాలు లేరు. వర్షంలో వెళ్ళటానికి ఇబ్బందిపడుతున్న ఇద్దరో ముగ్గురో టూవీలర్ జనాలు మాత్రం ఉన్నారు. దుకాణం బయట ఉన్న నులకమంచం మీద కూర్చున్నాను. రోడ్డు మీద నిలిచిపోయిన నీటిలో ఆకాశంలో వేగంగా కదులుతున్న మేఘాల ప్రతిబింబం చూస్తూ ఉన్నాను. ఆగి ఆగి ఒక్కోటిగా ఆ నీటిలో పడుతున్న చినుకుల వల్ల పుడుతున్న అలల్ని చూస్తుంటే చిన్నప్పుడు చెరువుగట్టున కూర్చుని రాళ్ళేసిన బాల్యం గుర్తొస్తూ ఉంది.

డ్రైవర్ గోల్డ్ ఫ్లేక్ కింగ్ సిగరెట్ తీసుకుంటూ “సార్ మీకు?” అంటూ ఆగాడు. ఒక చిన్న పాజ్ తర్వాత ఆ మాట నాకు వినిపించినట్టుంది. కాస్త ఆలస్యంగా “ఒక స్పెషల్ టీ” అని చెప్పాను. నా ఆలస్యానికేమో డ్రైవర్ కాస్త వింతగా చూసాడు.

టీ తెచ్చి నాకందిస్తూ “మీరు చెప్పకపోయినా మీ గులాబీ రేకుల్లాంటి పెదాలు చూస్తే తెలిసిపోతుందిలెండి” అని నా వైపు చూసి నవ్వాడు. తనెమన్నాడో ఒక్క క్షణం అర్ధం కాలేదు. అతని పెదాల మధ్య గుప్పుమంటున్న సిగరెట్ చూసాక అతని మాటలు అర్ధమయ్యి నవ్వుకున్నా.

“ఈ పాడు వ్యసనం మానెయ్యి. ఆరోగ్యానికి మంచిది కాదని ఎందరు చెప్పినా మానలేకపోతున్నా సార్. నిజానికి నేను కాలుస్తున్నది అందరిలా ఏదో కిక్కు కోసం కాదు సార్. ఈ సిగరెట్ని పెదాల మధ్య పెట్టుకుని ఇలా బలంగా లోపలికి ఒక దమ్ములాగిన ప్రతిసారీ” అంటు కాసేపు కళ్ళు మూసుకున్నాడు. నేను అతను చెబుతున్న మాటలు ఆసక్తిగా వింటూ అతని వైపే చూస్తున్నా.

పీల్చిన పొగని బయటకి వదిలేసి కళ్ళు తెరిచి నన్ను చూసాడు. అతని కళ్ళల్లో ఏదో తన్మయత్వం కనిపించింది. సరిగ్గా కాసేపటి క్రితం నేను వర్షాన్ని చూసి పొందినలాంటి తన్మయత్వం.

నేను తననే గమనిస్తున్నా అన్న స్పృహతో ఈలోకంలోకి వచ్చి “లోపలికి దమ్ములాగిన ప్రతిసారీ ఏనాడో కోల్పోయిన ఒక గొప్ప అనుభవమేదో తిరిగి సొంతమయినట్టనిపిస్తుంది. ఆ అనుభూతేదో అమాంతం నన్ను చుట్టేసుకుని బలంగా తనలో కలిపేసుకున్నట్టనిపిస్తుంది. తిరిగి దమ్ము బయటకు వదిలేయగానే.. నా అనేవాళ్ళెవరో దూరమవుతున్నట్టు విరహం.” చెప్పటం ఆపి నా వైపు చూసాడు. నా చెవులను తాకుతున్న ఒక గొప్ప అలౌకికరాగం మధ్యలో ఆగిపోయినట్టు అసంతృప్తిగా అనిపించింది. మనసంతా ఎందుకో చేదుగా అయిపోయింది.

“తాగుబోతోడి మాటలు అనుకుంటున్నారా సార్? ప్రియురాలి మొదటి ముద్దు ఇచ్చే అనుభూతి జీవితాంతం పదిలంగా దాచుకునే సాధనం ఈ సిగరెట్టే సార్” అంటూ సిగరెట్ కింద పడేసి లేచాడు. ఆ సిగరెట్ చివర నిప్పు ఇంకా ఆగలేదు. ఇంకా మండుతూనే ఉంది. ప్రమాదం కదా ఆర్పేద్దామని లేపిన నా కాలు కిందకు దిగలేదు. ఎందుకో నా మనసు ఆ పని చెయ్యనివ్వలేదు. అలా మండుతున్న ఆ సిగరెట్‌నే చూస్తూ వచ్చి కారెక్కాను.

ఎయిర్పోర్ట్ వచ్చేంతవరకూ కారులో ఎందుకో నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఎయిర్పోర్ట్ కి వచ్చేపాటికి వర్షం కాస్త తెరిపిచ్చింది. డ్రైవర్ నా సామానంతా కారులో నుండి దింపి ట్రాలీ లో పెట్టాడు.
డ్రైవర్ వెళ్ళిపోయే ముందు మాత్రం “నువ్వేం చదువుకున్నావ్?” అని అడిగాను.
“ఉద్యోగాలొచ్చే చదువులు చదువుకోలేదు సార్. నా ఒంటరితనంలో నాకు నేనే తోడుండే పుస్తాకాలేవో చదువుకున్నా” అని నవ్వేసి వెళ్ళిపోయాడు.

ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి కూర్చున్నా. లాంగ్ వీకెండ్‌కి వచ్చిన జనాలనుకుంటా చాలా రద్దీగా ఉంది. ఎయిర్పోర్ట్ లో జనాల్ని చూస్తే ఎందుకో పరిచయం లేని లోకంలో ఉన్నట్టుంటుంది. ఏవో పుస్తకాలు చదువుకుంటూ లేదా ల్యాప్ టాప్లు, ఐపేడ్లు పట్టుకుని ఎవరిలోకంలో వాళ్ళుంటారు. పలకరింపుగా కూడా పక్కనున్నవాడ్ని చూసి నవ్వరు. నేను కాస్త అసహనంగా అటూ ఇటూ చూస్తుండగా నా ఫోన్ మోగింది.

“హలో”

“హలో ఎవరూ?” జనాల గోలలో ఎవరో తెలియలేదు పైగా తెలియని నంబర్.

“హలో నాని. నాని నువ్వేనా?”

ఎవరో తెలిసిపోయింది. ఒక్కసారిగా నా చెవులు మొద్దుబారిపోయాయో లేక ఎవరైనా ఎయిర్‌పోర్ట్ లో మ్యూట్ పెట్టారో తెలియదు. నాకేం వినిపించటం లేదు. అంతవరకూ వినిపించిన టీవీల గోల, అనౌన్స్ మెంట్లు, టేకాఫ్ చప్పుళ్ళు ఏవీ వినిపించటంలేదు. గుండె కంగారుగా కొట్టుకుంటుంది. గొంతు తడారిపోయి మాట బయటకు రావటం లేదు. ఎంతో కష్టం మీద “ఎవరూ?” అడిగీ అడగలేనట్లుగా అడిగాను. తనతో మొట్ట మొదటిసారి కాలేజ్లో మాట్లాడినప్పుడు సరిగ్గా ఇలానే కంగారుగా అనిపించింది. నూనుగు మీసాల వయస్సులో పడిన ఆ కంగారు కంటే, ముప్పయ్యేళ్ళ వయస్సులో ఈ కంగారు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. గుండెల్లో ఏదో చిన్నగా పీకుతున్నట్టు నొప్పిగా ఉంది.

అటువైపు నుండి ఫోన్లో చిన్నగా కళ్ళల్లోనో, గొంతులోనో కాస్త తడి చప్పుడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. అత్యంత ఆర్టిఫీషియల్ వస్తువులనిపించే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకి కూడా మనసుందని ఆ క్షణమే నాకు తెలిసింది. ఎదురెదురుగా లేని ఇద్దరి మనుషుల మౌనంలోని వియోగాన్ని భారంగా మోసుకుంటూ ఏవో తరంగాలు కాసేపు అటూ ఇటూ తిరిగాయి. చెప్పుకోవాల్సిన భారమైన విషయాలేవో నిశ్శబ్ధంలోనే చెప్పేసుకున్నామేమో కాస్త మౌనం తర్వాత ఇద్దరం తెప్పరిల్లాం.

“మధు” అలవాటు తప్పి చాలా కాలమయ్యిందో ఏమో ఎప్పటిలా పిలవలేదు.
“హ్మ్” అని మాత్రం పలికింది.

“ఎలా ఉన్నావ్?”
“బాగున్నా. నువ్వెక్కడున్నావ్ నాని?”
“వైజాగ్‌లో ఉన్నాను. హైదరాబాద్ ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నా”
“వైజాగ్‌లోనా” నిరాశగా అనిపించింది తన గొంతు. “నాని ఏడు గంటల్లోపు హైదరాబాద్ రాగలవా?” కాస్తంత ఆశగా అడిగింది.

ఫోన్‌లో బీప్ మని చప్పుడు వినిపించింది. బ్యాటరీ లో అలర్ట్ వచ్చింది. నాకు కాస్త కంగారొచ్చింది. “మధు ఎక్కడున్నావ్? ఇది నీ నంబరేనా?”

“కాదు నాని. నేనిప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నాను. నీ నంబర్ ఇప్పుడే తెలిసింది. ఈ రోజు 7 గంటలకి ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండీ న్యూయార్క్ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎన్నింటికొస్తావ్?” తన మానసిక స్థితేంటో అర్ధమయ్యింది. కానీ నాకు పూర్తిగా నిరాశ ఆవహించింది.

“లేదు మధు. నేను వచ్చేపాటికి 9 గంటలవుతుంది”

ఇద్దరి మధ్య కాసేపు నిరాశతో కూడిన మౌనం చొరబడింది. కొన్ని క్షణాలు భారంగా గడిచాయి. ఎక్కడో ఇది మనకి మామూలేగా అన్న ఆలోచన ఇద్దరికీ ఒకేసారి తట్టిందేమో. కాస్త మామూలయ్యే ప్రయత్నంలో

“ఎలా ఉన్నావ్ నాని?”
“అందరిలానే బాగానే ఉన్నా. కొత్త కష్టాలేవీ రాలేదు. పాతవిపోలేదు.” కాసేపు మళ్ళీ మౌనం.

“మధు ఎప్పుడన్నా గుర్తొస్తానా?” తనూ ఇదే అడగాలనుకుందేమో అనిపించింది. గుర్తు రాకుంటే ఫోన్ చేసేది కాదుగా అనే సమాధానం నాకే తట్టింది. పెళ్ళయిన అమ్మాయిగా ఆ ప్రశ్న కి సమాధానం చెప్పటం తనకెంత కష్టమో కూడా తట్టింది.

అందుకే మాట మార్చాలని “ఎప్పుడొచ్చావ్ ఇండియాకి?” అని అడిగాను.
నా మనసులో ఉన్న నిజమైన ప్రశ్న అది కాదని తనకీ తెలుసు
“వెళ్ళే ముందు నిన్నొక్కసారి చూడాలనిపించింది నాని. నీ ఫోన్ నంబర్ దొరకగానే కాస్త ఆశపడ్డాను”

నా ఫోన్ మరలా బీప్‌మని శబ్ధంచేసింది. నేను తన మాటలు వింటూనే చార్జింగ్ పాయింట్ వరకూ పరిగెట్టాను. అక్కడ కొందరు ఫోన్ చార్జింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరిదీ నాలాంటి పిన్ కాదు. చుట్టూ చూసాను. అటూ ఇటూ పరిగెట్టాను. “ఇప్పుడెలా? ఛార్జింగ్ ఎలా? ఏదైనా ఛాన్సుందా?” బుర్రబద్దలుకొట్టుకుంటున్నా ఏమీ తట్టటంలేదు.

“మనమెందుకిలా ఉన్నాం, నానీ?” అంతవరకూ ఆగిన వర్షం ఒక్కసారిగా కుండపోతగా మొదలయ్యింది. నా ఫోన్‌కి బీప్‌మనే ఒపిక కూడా లేక చచ్చిపోయింది. ఉన్నవాడిని ఉన్నట్టుగా ఒక మూల కూలబడిపోయాను.

పెద్దమ్మాల ఇల్లు

ఆరు నెలల అమెరికా వాసం తర్వాత ఆరోజే ఇంటికొచ్చాను. అంతలోనే బావ పెళ్ళి అని వైజాగ్ బయలుదేరమని హడావుడి మొదలుపెట్టింది మమ్మీ. నాకింకా జెట్‌లాగ్ కూడా పోలేదు మొర్రో అన్నా వినిపించుకోలేదు. కావాలంటే కారులో పడుకో బయలుదేరు అని ఒకటే నస. అమ్మమ్మ, అత్తలు అందరూ నవ్వుకుంటున్నారు. మాతృవాక్యాపరిపాలనాబద్దుడిగా పాతికేళ్ళ ఇండస్ట్రీ మనది. ఈరోజున పుసుక్కున అందరి ముందు కాదంటే పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని తలాడించా.  జీన్సు, టీషర్టు వేసుకుంటుంటే “ఇదేంటి ఈ బట్టలతోనా పెళ్ళికి? మంచి బట్టలు వేసుకుని ఇన్‌షర్ట్ చేసుకునిరా” అంది. నాకేమీ అర్ధంకాక క్వశ్చన్ మార్క్ మొహంపెట్టాను.

“ఈ పెళ్ళిలో నీ పెళ్ళి కుదిరిపోవాలనుకుంటుందిరా మీ అమ్మ. వెళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా” అంది అమ్మమ్మ నవ్వుతూ.  “వీలయితే టై పెట్టుకుని సూటేసుకుని రారా” అంది మరింత నవ్వుతూ అక్క.

నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్నప్పుడు వీధిలో అందరూ మీ అబ్బాయి చాలా బుద్దిమంతుడు అంటుంటే మురిసిపోయి తలొగ్గిన పాపం ఇప్పటికీ వెంటాడుతుంది. ఇంక చేసేదేమీ లేక ఫార్మల్ డ్రెస్‌లో బయలుదేరాను. అరబాటిల్ సెంటు నా మీద జల్లింది.  అందరూ పెళ్ళిలో నా గురించి యోజనగంధుడని చెప్పుకోవటం ఖాయం.

అందరం పెళ్ళి జరుగుతున్న ఫంక్షన్‌హాల్ చేరుకున్నాం. చుట్టాలంతా పలకరిస్తున్నారు. నేను కూడా నవ్వుతూ బాగున్నారా అని అడిగేసి వెళ్ళి ఒక మూల కూర్చున్నా. పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా చేసారు. అబ్బాయి అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీర్. పెళ్ళికి అత్తవారు పెడుతున్న లాంఛనాలు అన్నీ కలిపి మూడుకోట్ల పైమాటే. అందుకే ఇంత ఘనమైన ఏర్పాట్లు. సాఫ్టువేర్ ఉద్యోగాలొచ్చాక మధ్యతరగతి బ్రతుకులెంత మారిపోయాయి అనిపించింది. మమ్మీ దూరం నుండే అందరితో మాట్లాడమని సైగచేస్తుంది. నేను రానుకాకరాను అని చెప్పి సెల్‌ఫోనులో స్నేహితులతో చాటింగ్ చేస్తూ కూర్చున్నా.

ఇంతలో మురళీ ఎవరొచ్చారో చూడు అని గట్టిగా పిలిచింది. అబ్బా మరలా మొదలుపెట్టింది అనుకుని చూసేసరికి శేఖరన్నయ్య. శేఖరన్నయ్య మా పెద్దమ్మ కొడుకు. అన్నయ్యని చూసి చాలా కాలమయ్యింది పరిగెట్టుకుంటూ వెళ్ళాను. కుశల ప్రశ్నలు,కబుర్లు,భోజనాలు కానిచ్చాం. భోజనాలయ్యాక చాలా రోజులయ్యింది కదరా ఇంటికి రావొచ్చుగా అనిపిలిచాడు అన్నయ్య. నువ్వు వెళ్ళన్నయ్యా నేను ఒక అరగంటలో వస్తా అని చెప్పాను. అన్నయ్య సరే చూస్తుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు.

అన్నయ్య వెళ్ళాక అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నా. మనసులో పెద్దమ్మాల ఇల్లు కదులుతుంది. ఒకవైపు వెళ్ళాలనే ఉన్నా మరో వైపు వెళ్ళి నాకున్న మధుర జ్ఞాపకాలను శిధిలం చేసుకుంటానేమోనని భయం. నా పసితనంలో వేసవి సెలవులు గడిపింది పెద్దమ్మాలింట్లోనే. అందమైన పురిల్లు, ఇంటికి ముందు ఉసిరి చెట్టు, ఇంటి వెనుక మావిడిచెట్టు. ఇవికాక కనకాంభరాలు, మందారాలు, గులాబీలు ఇలా బోలేడన్ని పూలమొక్కలు ఉండేవి ఇంటి చుట్టూ.  పిల్లలం ఆడుకోవటానికి కావాల్సినంత స్థలం ఉండేది

మా పెద్దమ్మ పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టే పెద్ద బొట్టు పెట్టుకుని నిత్యం లక్ష్మీ కళతో ఉండేది. పెద్దమ్మకి ముగ్గురు పిల్లలు. వాళ్ళతో సమానంగానే నన్ను చూసేది. అందరికంటే చిన్నవాడినని నేనంటే కాస్త ముద్దు. నాకు అన్నం తనే కలిపి తినిపించేది. అంత పెద్ద సంసారాన్ని పెదనాన్న తెచ్చే జీతంతో గుట్టుగా నడిపేది. మేమెంత అల్లరి చేసి వీధిలో గొడవలు పెట్టుకుని వచ్చినా ఓపిగ్గా అందరికీ సర్ది చెప్పి పంపేసి మమ్మల్ని ముద్దుచేసేది. పెద్దమ్మ కల్మషంలేని నవ్వు ముందు పేదరికం,కష్టాలు నిలవలేకపోయేవి.

అందరి పిల్లల్లానే మాకూ మా అన్నయ్యంటే ఒక హీరో అనే ఫీలింగ్. ఎప్పుడూ అన్నయ్య వెంటే తోకల్లా తిరిగేవాళ్ళం. అన్నయ్య చప్పట్లు కొడితే వెలిగే లైట్లు తయారు చేసి చూపించేవాడు. బీచ్‌కి తీసుకెళ్ళేవాడు. బీచ్ నుండి ఏరుకొచ్చిన గవ్వల్ని ఫెవికాల్తో అతికించి శివలింగం చేసేవాడు. ఎన్నో కధలు చెప్పేవాడు, ఏవో మాజిక్కులు చేసేవాడు. అన్నయ్య ప్రాక్టికల్ జోక్స్ వెయ్యటంలో దిట్ట.

ఒకరోజు రాత్రి నల్లకోటు,నల్ల కళ్ళద్దాలు,మహాలాక్టో చాక్లెట్లకి ఇచ్చే బన్నీ పళ్ళు పెట్టుకుని చీకట్లో దాక్కున్నాడు. వీధిలో ఉండే ఒక ముసలావిడ చీకట్లో అటురాగానే ఆ బన్నీ పళ్ళు బయటకి కనిపించేలా పెట్టి “బామ్మా బాగున్నావా?” అని అడిగాడు.  పళ్ళు మాత్రమే కనిపించేసరికి ముసలావిడ బెంబేలెత్తిపోయి పెద్దగా అరుస్తూ పారిపోయింది. పెద్దమ్మకి విషయం తెలిసి వచ్చి మమ్మల్ని మందిలించే వరకూ మేమంతా పడీ పడీ నవ్వుకున్నాం.

అందుకే పెద్దమ్మాల ఇల్లంటే పుస్తకాల్లో దాచుకున్న నెమలీకలా ఒక పసితనపు వాసన. ఆ అమాయకపు చేష్టలు, ఆ అల్లరి తలుచుకుంటే అప్రయత్నంగా పెదాలపై చిరునవ్వు విచ్చుకుంటుంది. బ్రతకటం ఒక పరుగు పందెం అయిపోయిన నాకు మరలా ఏ మజిలీలోనూ అంత ఆనందం దొరకలేదు.

పెద్దవాడినయ్యి కాలేజీలో చేరాక సెలువులు లేక పెద్దమ్మ దగ్గరకి వెళ్ళటం తగ్గింది. ఒకరోజు పెదనాన్నకి పక్షవాతం వచ్చిందని పెద్దమ్మ ఆందోళనగా ఫోను చేసింది. పరీక్షలు ఉండటంతో నాకు వెళ్ళటం కుదరలేదు. డాడీ మాత్రం వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడి అందరికీ ధైర్యం చెప్పి వచ్చారు. డాడీ తిరిగి వచ్చాక అందరూ ఎలా ఉన్నారని అడిగాను.

“పెద్దోడు బాగా బెంగ పెట్టేసుకున్నాడురా. వాడికి  ఏడ్చి ఏడ్చి సైనెస్ ఎక్కువయ్యింది. జాబ్‌కి లీవు పెట్టేసాడు.  పెదనాన్నని రోజూ ఫిజియో దగ్గరకి తీసుకునివెళ్తున్నాడు. పెదనాన్న జీతం లేకపోవటంతో ఇల్లు గడపటం కష్టమవుతున్నట్టుంది. మీ పెద్దమ్మ సంగతి తెలిసిందే కదా ఇల్లు గుట్టుగా నడుపుకొస్తుంది” అని చెప్పేప్పుడు డాడీ గొంతులో అరుదుగా వినిపించే ఒక సన్నని జీర. ఎప్పుడూ గంభీరంగా ఉండే డాడీ అలా మాట్లాడేసరికి మనసులో నాకు కూడా దిగులు కమ్మేసింది.

అన్నయ్య మాత్రం పెదనాన్న ఆరోగ్యం బాగుపడే దాక వెంటే ఉండి అన్ని సేవలూ చేసాడు. అన్నయ్య చేసిన సేవకి కొద్దిరోజుల్లోనే పెదనాన్న తేరుకున్నారు. నాకంటూ ఒక వ్యక్తిత్వం నిర్మించుకుంటూ, మరొకరి గొప్పతనాన్ని ఒప్పుకునేందుకు తటపటాయించే ఆ వయసులో కూడా తల్లిదండ్రులంటే తనకున్న ఇష్టంతో అన్నయ్య ఎప్పటిలానే నా మనసులో తన హీరోయిజం నిలబెట్టుకున్నాడు. అన్నయ్య,  పెదనాన్న ఇద్దరూ లీవులో ఉండటంతో నాలుగు నెలలపాటూ జీతం లేదు. ఇంటి ఖర్చులకి, పెదనాన్న మందులకి తన బంగారాన్ని కుదవపెట్టి డబ్బులు సర్దింది పెద్దమ్మ. చుట్టాలకి ఆ ఇంటి కష్టాలు ఎప్పుడూ తెలియనిచ్చేది కాదు.

పెద్దమ్మకి ఒకే ఒక్క కూతురు సుధారాణి. సుధక్కకి పెళ్ళీడు వచ్చింది. పెద్ద పెద్ద కట్నాలిచ్చే పరిస్థితా లేదు. పెదనాన్నని చూస్తే లౌక్యం తెలియని మనిషి. అందుకే ఇల్లు చెదిరిపోకుండా, అక్క జీవితమూ బాగుండేలా పెద్దమ్మ సొంత తమ్ముడయిన శంకర్ మావయ్యకే ఇచ్చి చేసింది. అన్నయ్యకి కూడా దగ్గర భందువుల్లోనే ఒక అమ్మాయిని తెచ్చి చేసింది. అందరూ మనవాళ్ళే అయితే ఇల్లు ముక్కలు కాదని పెద్దమ్మ నమ్మకం. చాలారోజులకి ఆ పెళ్ళికి పెద్దమ్మవాళ్ళింటికి వెళ్ళాను. పెదనాన్న ఆరోగ్యంగా కనిపించారు. పెద్దమ్మ చాలా ఆనందంగా కనిపించింది. పెద్దమ్మ చేతులు మీదగా పెళ్ళంతా సందడి సందడిగా గడిచిపోయింది.

తర్వాత మరలా తీరికలేని నా కాలేజీ జీవితంలో పడిపోయాను. ఫోనులో మాట్లాడటం తప్ప నేరుగా వెళ్ళి ఎవరినీ చూసిందిలేదు. వదినకి, సుధక్కకి కొన్ని విషయాల్లో పడటంలేదని అట కబుర్లు వినేవాళ్ళం. ఏన్నో ఏళ్ళుగా ఆ ఇంటిలో ఎదురులేని సుధక్క కొత్తగా వచ్చిన వదినని అదుపులో పెట్టాలనుకుంది. కానీ సహజంగా గడుసుదైన వదిన ఇంటి కోడలిగా పెత్తనం తనకే దక్కాలనుకునేది. ఒకసారి కాస్త పెద్ద గొడవే అయితే రాజీ కోసం డాడీని పిలిచారు. డాడీ ఏదో సర్దిచెప్పి వచ్చారు. కానీ గొడవలు పూర్తిగా సమసిపోలేదు. ఏళ్ళుగా ఇంటిని నడిపిన పెద్దమ్మ ఈ పరిస్థితిని కూడా చేయి దాటకుండా దూరంగా ఉంటేనే ప్రేమలు మిగులుతాయని సుధక్కకి వేరే ఇల్లు చూసి అక్కడ కాపురం పెట్టించింది. ఎదురెదురుగా లేకపోవటంతో గొడవలు తగ్గాయి. పండగలకి పబ్బాలకి కలుసుకున్నా, ఉన్న ఆ ఒక్కరోజుకి ఎవరూ బయటపడకుండా కాస్త నవ్వుతూ గడిపేసేవారు.

హమ్మయ్య ఇల్లు కాస్త చక్కబడింది అనుకునేంతలో పెద్దమ్మకి పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఉందని తెలిసింది. కడుపునొప్పని డాక్టరు దగ్గరకి వెళితే టెస్టుల్లో బయటపడింది. ఆపరేషన్ వీలైనంత త్వరగా చెయ్యాలన్నారు. డాడీ వెంటనే బయలుదేరి వెళ్ళారు. రెండు రోజులు ఆగి నేను వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికే ఆపరేషన్ పూర్తయ్యింది. మామూలుగానే సన్నగా ఉండే పెద్దమ్మ తిండి లేక కేవలం సెలైన్లా మీదనే ఉంటోంది. శరీరం మీద చర్మమే తప్ప కండనేది మచ్చుకి కూడా కనబడలేదు. నాకు అన్నం తినిపించిన ఆ చేతులను అలా నిస్తేజంగా నీరసంగా చూడటంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నన్ను చూడగానే రా రా అనిపిలుస్తూ చెయ్యి ఎత్తే ప్రయత్నం చేసి, నొప్పికి ఇంక ఎత్తకుండా ఆగిపోయింది. భగవంతుడి నిర్ధయ కళ్ళముందు కరుడుగట్టిన నిజంలా కనిపిస్తుంటే ఆయన్ని ఎంత తిట్టానో నాకే తెలియదు. కాసేపు మాట్లాడాక నిద్రపోయింది. “ఇంక అంతా పర్వాలేదు రేపు ఇంటికి తీసుకు వెళ్తాం” అని చెప్పాడు అన్నయ్య. అన్నయ్య కూడా బాగా చిక్కిపోయాడు. నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉండటంతో డాడీ,నేను ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసాం.

పరీక్షలకి చదువుకోవటంలో బిజీ అయిపోయాను నేను. ఆ సెమిస్టర్ పేపర్లు కొంచెం కష్టంగా ఉండటంతో భయం భయంగా చదువుతున్నాను. అర్ధరాత్రి ఫోను వచ్చింది పెద్దమ్మ ఇక లేదని.  ఆ కబురు వినగానే కళ్ళ ముందు చీకటి కమ్మేసింది. మరుసటిరోజు నాకు పరీక్ష. నేను వెళ్ళటం కుదరదు. చివరిసారి పెద్దమ్మని చూడలేకపోతున్నా అనే ఆలోచన మెదడులోకి రాగానే పుస్తకం మూసేసి అలానే మంచం మీద పడిపోయాను. చేతిలో పెట్టెతో వెళ్తున్న డాడీకి ఎదురొచ్చి “మురళిని తీసుకురాలేదా” అని నిరాశగా అడుగుతున్న పెద్దమ్మ కనిపించింది. నేను దిగ్గున లేచి చుట్టూ చూసాను. అది నిజం కాదు కల. అవును పెద్దమ్మ ఇకపైన ఒక కల మాత్రమే అని ఏడుస్తూ రాత్రంతా అలానే ఉండిపోయాను.

పరీక్షలయ్యాక పెద్ద కార్యానికి వెళ్ళాను. దిగులు ముఖంతో ఎదురుగా అన్నయ్య.

“పరీక్షలంట కదరా” అని అడిగాడు అన్నయ్య. అన్నయ్య మామూలుగానే అడిగినా, నాకు మాత్రం ఆ ప్రశ్న యాంత్రిక జీవితాల పైకి మానవ సంభందాలు సంధించిన బాణంలా అనిపించింది. నా దగ్గర సమాధానంలేదు. మౌనంగా అవునన్నట్టు తలూపాను.

“వెళ్ళిపోయే ముందు తృప్తిగా చూసుకుందామని అందరినీ పిలిచిందిరా. మురళి వచ్చాడా అని అడిగింది.” అని మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య. నేను అన్నయ్య పక్కనే మౌనంగా కూర్చున్నా. గడిచిపోయిన ప్రతీ క్షణం విలువైనదే, తిరిగి తీసుకురాలేము. అందులోనూ ఆ గడిచిపోయిన క్షణం పెద్దమ్మ చివరిచూపయితే దాని విలువెంతో నాకప్పుడే తెలిసింది. పెదనాన్నని చూస్తే బాధనిపించింది. ఇన్నేళ్ళుగా తన ఇంటిని,తనని నడిపిన తోడు ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆయన మొహం చూస్తే అర్ధమయ్యింది. సాయంత్రం వరకూ ఉండి వచ్చేసాను.

పెద్దమ్మ వెళ్ళిపోవటంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆస్థి గొడవలు మరలా బయటపడ్డాయి. పెద్దమ్మ లేకపోవటం వలన, జరుగుతున్న ఆస్థి గొడవల వలన ఆ ఇంటికి చుట్టాల రాకపోకలు తగ్గాయి. ఏడాది లోపు శుభకార్యం జరిపించాలని చిన్న అన్నయ్యకి సంభందం చూసారు. చిన్న అన్నయ్య పెళ్ళికి భందువులందరూ వచ్చినా పెద్దమ్మలేని లోటు తెలుస్తూ ఉంది. పెళ్ళిలో సందడిలేదు. అన్నింటినీ సంభాళించుకునే పెద్ద దిక్కులేదు. మంటపంలో పెళ్ళి తతంగం నడుస్తూ ఉంది. భోజనాల దగ్గర ఏదో గొడవ. చూస్తే ఆడపెళ్ళి వారు మావయ్యని,పెద్ద అన్నయ్యని ఏదో అంటున్నారు. ఆవేశంగా నేనూ వెళ్ళా గొడవలోకి. పెద్దలందరూ వచ్చి సర్ది చెప్పారు. చిన్నన్నయ్య మండపం లో నుండి కనీసం ఏంటా గొడవ అని కూడా అడగలేదు. పెళ్ళి తతంగం ముగిసిన వెంటనే కనీసం పెద్దన్నయ్యకి చెప్పకుండానే ఆడపెళ్ళివారితో అత్తవారింట మొదటిసారి గడప తొక్కటానికి కారెక్కి వెళ్ళిపోయాడు.

నేను పెద్దన్నయ్యని “వీడేంటి మనకి చెప్పకుండా కారెక్కాడు” అని అడిగా.

“నీకు తెలియదురా పెళ్ళి అనుకున్న నాటి నుండి ఆడపెళ్ళివారు చీటికి మాటికి వాడిని పండగ అని పిలిచి, అడ్డమైనవి చెప్పి చివరికి ఆస్థి గొడవల్లో కూడా దూరారు.ఇప్పుడు వాడు మనం చెప్పింది కాదు వాళ్ళు చెప్పిందే వింటాడు” అని చెప్పాడు పెద్దన్నయ్య. పెద్దమ్మాల ఇల్లు ముక్కలయిపోయింది అని అర్ధమవుతూ ఉంది.

“కనీసం పెదనాన్నకయినా చెప్పొచుగా” అన్నాను నేను.

“అసలు ఆ ముసలోడి వల్లే జరుగుతుంది ఇదంతా. వయసయిపోయింది కదా ఇక ఆయన పోతేనే మంచిది. ఈ సంభందం ఆయనే తెచ్చి మా నెత్తికి ఎక్కించాడు” అని కోపంగా అరుస్తూ అన్నాడు అన్నయ్య.

నాకు బుర్రతిరిగింది. అన్నయ్యేనా పెదనాన్నని ఇలా అంటుంది. పెదనాన్నకి ఆరోగ్యం బాగోకపోతే ఉద్యోగం వదిలేసి జీవితం నాశనం చేసుకోవటానికి సిద్దపడ్డ అన్నయ్యేనా ఇలా అన్నది. అప్పుడే మొదటిసారి తెలిసింది హీరోలు కూడా సాదారణ మనుషులే అని. భయం వేసింది నాకు. కాలపరీక్షలో ఎంతటివాడయినా రూపాన్ని మార్చుకోవాల్సిందేనా? రేపు నేనయినా ఇంతేనా? ఏ వ్యక్తుల స్పూర్తితో వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నానో వారే కాలానికి దాసోహమంటే నేను మాత్రం ఎదురొడ్డి నిలబడగలనా? ఇంకేం మాట్లాడలేదు నేను. పెళ్ళి పనులు పూర్తవ్వగానే ఇంటికి వచ్చేసా.

పెద్దమ్మాల ఇల్లు, ఆ మనుషులు నా మనసులో ఉన్న స్థానం నుండి పడిపోయారో లేక పడిపోతారన్న భయం చేతో మరలా ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్లలేదు. ఇన్నిరోజులకి అన్నయ్య వచ్చి అడగటంతో నాకు వెళ్ళాలని అనిపించింది. మమ్మీ అందరితో మాట్లాడుతూ హడావుడిగా ఉంది. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఏ పనిలేని వాడిని నేనే అందుకే కారు తీసుకుని బయలుదేరాను.

వీధంతా బాగా మారిపోయింది. పెద్దమ్మవాళ్ళ ఇల్లు కూడా చిన్న అన్నయ్య పెళ్ళినాటికే మొక్కలు చెట్లు తిసేసి డాబా ఇల్లుగా మార్చేసారు. ఇంతకు ముందులా మనుషులు బయట కూర్చుని కబుర్లు చెప్పుకోవటాలు లేవు. అందరూ టి.వి.ల ముందు కూర్చున్నట్టున్నారు. పెద్దమ్మ ఉండే రోజుల్లో వీధి చివర బ్యాగు పట్టుకుని కనిపించగానే ఎవరొస్తున్నారో చూడండి అని అందరినీ పిలిచి సందడి చేసేది. ఆ ఆప్యాయత కరువయ్యింది.

కారు దిగి వెళ్ళి తలుపుకొట్టా. పెద్ద వదిన వచ్చి తలుపు తీసింది. ఇంట్లో అడుగుపెడుతూ ఉంటే ఎదురుగా పెదనాన్న. కుశల ప్రశ్నలయ్యాక సోఫాలో కూర్చున్నా. చిన్న వదిన వచ్చి పలకరించి తాగటానికి మంచి నీళ్ళిచ్చింది. టీ పెడతా అని లోపలికి వెళ్ళింది. వదినలిద్దరితో కబుర్లు చెబుదామని వంట గదిలోకి వెళ్ళాను.

లోపలకి పోయి చూస్తే రెండు గ్యాస్ స్టవ్వుల మీద ఇద్దరు వదినలూ టీ పెడుతున్నారు. అయోమయంగా ఇంటిలోకొచ్చి చూద్దును కదా రెండు బీరువాలు చెరో బెడ్‌రూమ్‌లో. రెండు ఫ్రిజ్‌లు, రెండు టి.వి.లు అన్నీ రెండేసి చెరో బెడ్‌రూమ్‌లో. ఆశ్చర్యంగా పెదనాన్న వైపు చూసాను. ఆయన ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు.

సుధక్క ఎక్కడుంది అని అడిగా? అందరూ ఒక్కసారి నా వైపు అదోలా చూసారు. మరలా అడిగాను. ఎవరూ సమాధానం చెప్పలేదు.  అన్నయ్య మేడ మీద వాకింగు చేస్తున్నాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగా సుధక్క ఇప్పుడు ఎక్కడ ఉంటుందీ అని.

“దాని ఊసెత్తుకురా. డాడీ నువ్వు చిన్నోడివని నీకు చెప్పి ఉండర్రా. అది మన ఇంటి పరువు తీసే పని చేసింది. ఒకరోజు షాపింగుకని చెప్పి పిల్లాడిని మన ఇంట్లో ఉంచి ఎవడితోనో వెళ్ళిపోయిందిరా. రెండురోజులు వెతికి పోలీసు కంప్లైంటు కూడా ఇచ్చాము. తర్వాత వీధిలో వాళ్ళే అప్పుడప్పుడు ఒకడితో వీధిలో మాట్లాడేది మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పారు. వాడెవడో తెలుసుకుని వాడికి తెలియకుండా వెంబడించి ఆచూకీ తెలుసుకున్నాము. ఆరా తీస్తే తెలిసింది వాడు కూటికి లేని దరిద్రుడు. పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు. దీనికి ఏవో మాటలు చెప్పి తీసుకుని వెళ్ళి వంటి మీద మొత్తం బంగారం అమ్మేసి ఒక ఇరుకు ఇంటిలో ఉంచాడు.

చూడగానే ఏడుపొచ్చింది. ఏంటే ఇదంతా అని అడిగితే మీరొద్దని వచ్చేస్తే మరలా ఎందుకొచ్చారు అంది. పసిపిల్లాడి మొహం చూసయినా నీకు ఇది తప్పనిపించలేదా అని అడిగాను. వాడు కూడా నాకు వద్దనుకున్నాకే వచ్చేసా అందిరా. పిల్లాడు అమ్మా అమ్మా అని పిలుస్తున్నా దాని మనసు కరగలేదు. నాకు కోపం వచ్చి గొడ్డును బాదినట్టు బాది ఇంటికి తీసుకొచ్చాను. మావయ్యకి దాని మొహం కూడా చూడాలని లేదు. కానీ పిల్లాడి కోసం ఇద్దర్నీ అమ్మమ్మ వాళ్ల ఊరు పంపేసి, పిల్లాడ్ని అక్కడ స్కూల్లో వేసారు. మన పరువు మొత్తం పోయిందిరా.” అని బాధగా నిట్టూరుస్తూ చెప్పాడు అన్నయ్య.

నేను మౌనంగా ఉండిపోయాను. ప్రస్తుత సమాజంతోనూ, నేను చదివిన కధల్లో స్త్రీల సంఘర్షణలతోనూ పోల్చి చూస్తే సుధక్క చేసిన పనికి కూడా, తన సొంత కారణాలుంటాయి అని నా మనస్సుకి అనిపించేది. కానీ కుటుంబం, పరువు, ప్రతిష్ట అనే పదాలు చుట్టూ వినబడుతున్న ఆ క్షణంలో అదొక దుర్మార్గంలానే అనిపించింది.

“ఏరా బాధపడుతున్నావా?” అని అడిగాడు అన్నయ్య. నేను మాట్లాడలేదు. మాట్లాడటానికి ఎంతవెతికినా మాటలు దొరకలేదు. అన్నయ్య వచ్చి అనునయిస్తూ నా భుజం మీద చెయ్యివేసాడు.

“పెద్దమ్మ తోనే ఈ ఇంటికున్న లక్ష్మీకళ పోయిందన్నయ్యా.” అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కారెక్కాను.

వదినలిద్దరూ చేరో టీ కప్పు పట్టుకుని పిలుస్తూనే ఉన్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేసాడు.

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు
సక్కగా తిక్క శంకరయ్య పక్కజేరినవ్ లే.

ముగ్గురమ్మల పుణ్యమంటవ్
మూడు కళ్ళోడి పూజలంటవ్
కయిత్వాల్ రాస్తవ్
తత్వాల్ పాడతవ్

ఎండికొండోడు ఏమిచ్చిండొ ఏమో
కవులకు కనకాభిషేకాలన్నవ్
నీ కతల్, కయితల్ సల్లగుండ
నీ ఇస్టోరీ నే డిసైడ్‌జేసినా సూడు

రైలుబండోలింట పుట్టినవ్
ఏడు బోగిలతో చుకుచుకాడినవ్
తరగతిలా నాటకాలాడినవ్
మధ్యతరగతిలా బ్రతుకుల్ సదివినవ్

కధల్లేవ్ తెరదించాలంటే
సిరాలో కాయితాల్ ముంచినవ్
జంతువులచేత అండాలు పెట్టించినవ్
జనాలచేత దండాలు పెట్టించినవ్

ఏదికలెక్కుడు ఇసుగుపుట్టింద ఎమో
ఎండితెర ఎంటపడ్డవ్
ఆడోళ్ళకి కుట్టేటోడికి కధల్ కట్టినవ్
రాములోరి శివునికి వంతపాడినవ్

తోటరాముడూ అని కృష్ణుడు పిలిస్తే
పాన్ తీసి పెన్ మూసినవ్
ఆమె అన్నవ్ అతడన్నవ్
తిట్టించుకున్నవ్ భుజాల్ తట్టించుకున్నవ్

పాతికేళ్ళు నిండిపోయినయ్
కొత్త కళలు పుట్టుకొచ్చినయ్
నాడు గోగ్రహాణాల్ నేడు గ్రహణాల్
ఎండితెర మీద జర ఇంకుజల్లినవ్

ఆడ యాడో కొండ ఇరిగితే
ఈడ నీ గుండె పగిలినాది
కండ్లల్లా నీళ్ళు కురిసినయ్
కాయితాల్లా  తత్వాల్ ఎలిసినయ్

అన్నిట్లా ఉండేటోడ్ని
అందరికీ సూపినవ్
నువ్వు ఆయన గుడులెంటపడితే
ఆయన నీ గుండెల్లో పండిండు

బాంచెన్ నీ కాల్మొక్కతా శంకరయ్య
యాడున్న మా భరణిని సక్కగా డిసైడ్ జెయ్.

అందరికీ మొదటి అమ్మ

అమ్మమ్మ

అనురాగలోకంలో అందరికంటే పెద్ద ఆమె.

అమ్మకి పసివాళ్ళ లాలన నేర్పేది ఆమె.

అడ్డాలలో వేసి అందరికీ మొదట లాలపోసేది ఆమె.

నిజానికి అందరికీ మొదటి అమ్మ ఆమె.

ఆమె మన అమ్మనే కన్న అమ్మమ్మ.

ఎలా మరిచిపోయాం మనం. మనకి జన్మనిచ్చిన అమ్మని కీర్తించి మన గుండెల్లో కొలువుంచాం. మరి అమ్మమ్మని ఎలా మరిచిపోయాం మనం. మన అభివృద్ధిలో, కీర్తిలో ఏనాడూ తనవాటా ఏంటో చూసుకోని నిస్వార్ధం, మన ఎదుగుదలని వెనుక ఉండి చూస్తూ ఆనందపడే ప్రేమతత్వం ఆమెకు మాత్రమే సొంతం.
తన కూతురి ప్రసవవేదన చూసి కడుపులో ప్రేగు కదిలి ఒక కంట కన్నీరు, తనవారంటూ ఎవరూలేని ఏదో మిధ్యాలోకం నుండి ఏడుస్తూ ఇక్కడకి వచ్చి పడ్డ తన కూతురి బిడ్డకు అన్నీ తానై అక్కున చేర్చుకుని మరో కంట ఆనందాశృవులు. ఆ పసిబిడ్డని, ఆ పసిబిడ్డని కన్న తన బిడ్డని చంటిపాపల్లానే చూసుకుంటూ తన కనుపాపల్లో పెట్టి కాపాడుకుంటుంది. కూతురిని బిడ్డతో సహా అత్తవారింటికి పంపేదాకా చేసే గొడ్డుచాకిరి మనకి కనిపించినా, తనకి మాత్రం కేవలం కూతురి మీద ఆపేక్షగానే కనిపిస్తుంది. ఆణువంత పుట్టిన మనవడ్ని అల్లరిగడుగ్గాయిలా కేరింతలు కొట్టేదాకా సాకి ఆ పైన కూతురితో పాటు అప్పగింతలు చేయాల్సిందే. ఆడపిల్లని కన్న పాపానికి జీవితంలో అడుగడుగునా అప్పగింతలు తప్పవేమో?

రోజూ స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మమ్మ ఆపేక్ష, కళ్ళల్లో ఆనందం ఒక అందమైన దృశ్యం. పండంటి పసివాడ్ని మెరిసిపోయేలా చేయటమే కాదు నూనె పెట్టేప్పుడు కాళ్ళు చేతులు సాగతీస్తూ ఒక ఆజానుబాహుడ్ని చెయ్యాలని పరితపిస్తుంది. స్నానం చేయించి తుడుస్తున్నప్పుడు జలుబుకి తుమ్మితే చిరంజీవ చిరంజీవ అంటూ చిరాయువునిస్తుంది. తలకి పెట్టే సాంబ్రాణీ, నుదుటిమీద పెట్టే కాటుక బొట్టూ ఇలా అడుగడుగునా అమ్మమ్మ ప్రేమని పొందటం ఒక వరం. చీకటి పడుతూనే పాడు కళ్ళు దిష్టి పెట్టాయేమొ అని ఎన్ని రకాలుగా దిష్టి తీస్తుంది.

మనవలు ఎంతమంది ఉన్నా కొడుకు బిడ్డలకంటే కూతురి బిడ్డలంటేనే ఎందుకో ఆపేక్ష. పండగ అనగానే కూతురు,అల్లుడు తన మనవలతో వస్తారని ఎంత సంబరపడుతుందో. మనవలకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి వాళ్ళు వచ్చేలోగా ఎవరినీ తిననివ్వకుండా “హన్నా” అనటం చూడని తెలుగు లోగిలి ఉండదేమో కదా! చదువులో ఎదుగుతూ ఉంటే ఊరంతా చెప్పే గొప్పలు, ఉద్యోగం వచ్చింది అని తెలియగానే ఆంజనేయస్వామికి చేసే అప్పాలదండ ఇలా అమ్మమ్మకి మనవలపైన ఉన్న ప్రేమకి అంతేలేదు. ఇంత చేసినా అడబిడ్డ పిల్లలుగా మనం పెట్టేవి ఏ రోజూ తీసుకోదు. మరి మననుండి తను ఆశించేది ఏంటి? “అమ్మమ్మా” అనే ఒక పిలుపు, ఆప్యాయంగా మనం చిన్నప్పుడు ఇచ్చే బుల్లి బుల్లి ముద్దులు. అమ్మమ్మ ఇల్లంటే అందుకే మనవలందరికీ ఎంతో ఇష్టం. పండగ వచ్చిన, వేసవి సెలవులు వచ్చిన “నాన్న అమ్మమ్మ వాళ్ళింటికి ఎప్పుడు వెళ్తాం?” అనే అడుగుతాం.

లోకం తెలియని నీవు మాకు ఈ లోకం చుపావు.

నువ్వెంత అమాయకురాలివైన మాకు మాత్రం లౌక్యం నేర్పావు.

ముక్కోటి దేవతలకు మొక్కి మాకుచిరాయువునిచ్చావు.

అసలు నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మని నువ్వే ఇచ్చావు.

దేవతలకి దేవుడైనవాడు దేవదేవుడయితే అమ్మకే అమ్మవైన నువ్వు అమ్మమ్మవైనావు.

మా అభివృద్ది వెనుక కష్టం నువ్వు. ఆ దేవుడికి సహితంలేని అదృష్టం నువ్వు.

(గమనిక: గూగుల్లో దొరికిన చిత్రాన్ని ఇక్కడ వాడుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు అనే నమ్మకంతో.)

నేను నిర్లక్ష్యం చేసిన నా నేస్తం

మధురమైన ఏకాంతవేళ...

మధురమైన ఏకాంతవేళ...

ఎప్పుడూ నేనొక నేస్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నా. నా పక్కనే తనుంటుందని తెలిసీ, చూసి చూడనట్టుగా తప్పించుకుపోతుంటాను. చూసి పలకరిస్తే తనకోసం కాస్త సమయం ఇమ్మంటుందని నా భయం. సమయం ఇస్తే మాత్రం ఏంపోతుంది? రోజుకి నేను సోది మాటల్లో వృధా చేసే కాస్త సమయం ఇవ్వొచ్చు. కానీ ఇస్తే తను నాలా డొంకతిరుగుడుగా మాట్లాడదు. నిక్కచ్చిగా నిగ్గదీసి నిజాన్ని మాట్లడుతుంది, నన్ను మాట్లాడమంటుంది. తీరా అన్నీ మాట్లాడాక తను విని వెళ్ళిపోతుంది. నేను మాత్రం రోజంతా ఆ మాటల్లో, ఆలోచనల్లో నన్ను నేను కోల్ఫోతాను. అందుకే ఈ తప్పించుకు తిరిగే ప్రవృత్తి.

కానీ తనెప్పుడూ చెబుతూ ఉంటుంది. నేనేరా నీ నిజమైన నేస్తాన్ని అని. నేనెప్పుడూ నిన్ను వదిలి ఉండలేదు, ఉండను అని.నాకు కూడా తెలుసు అదే నిజమని. కానీ ఆ నిజాన్ని అంగీకరిస్తే అమ్మో ఆ భయంకర భావాల్ని నేను భరించలేనేమో? అలా అని పూర్తిగా తనని వదిలి ఎప్పుడూ నేను కూడా ఉండలేదు. నా అవసరాల్లో, భాదల్లో తననే ఆశ్రయిస్తా. ఆనందాల్లో మాత్రం తనని మరిచిపోతా. అయినా ఇంతకాలం ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. నేను పట్టించుకోకపోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనతో అవసరంపడి తనకోసం చూడగానే అర్ధం చేసుకుని వచ్చి వాలిపోతుంది. బయటకి ఎప్పుడూ చెప్పకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం.

చల్లని సాయంత్రం సముద్రపు కెరటాలతో పోటీపడి నా పాదాలు పరిగెడుతున్నప్పుడు తను కావాలి. మనాలి మంచుకొండల్లో, ఆపిల్‌తోటలో బెంచిమీద కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు తను కావాలి. వారం మొత్తం ఎక్కువగా పనిచేసి అలిసిపోయినట్టుంటే వారంతంలో బద్దకంగా ఆలస్యంగా లేచి ఇళయరాజా పాటలు పెట్టుకుని వింటున్నప్పుడు తను కావాలి. ఏదయినా కవితో, బ్లాగులో టపానో వ్రాయాలనుకున్నప్పుడు తనుకావాలి. అన్నట్టు తన పేరు చెప్పలేదు కదా? తనపేరు ఏకాంతం. పేరు వినగానే ఎక్కడో విన్నట్టు కాదు కాదు మీకు కూడా నేస్తమే అనిపించిందా? అవును మరి ఏ కాంతాలేనివారికి, శాంతి లేనివారికి ఏకాంతమే నేస్తం. అసహనంలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, ఆగ్రహంలో ఉన్నప్పుడు, అవమానం ఎదురయినప్పుడు మనల్ని ఓదార్చే నేస్తం ఏకాంతం.

ఏకాంతం ఓ గురువు

మనలో ఉన్న శక్తి మనకి తెలియజేస్తుంది.

ఏకాంతం ఒక నేస్తం

మనం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని ఒకే దృష్టితో చూసి మనకు చెబుతుంది.

ఏకాంతం ఒక మౌని

మనకు సంయమనం నేర్పుతుంది.

ఏకాంతం మన శ్రేయోభిలాషి మనవాళ్ళెవరో తెలియజెబుతుంది. తల్లిలా ఒడిలో ఏడ్చే అవకాశమిస్తుంది. తండ్రిలా తలనిమిరి ధైర్యాన్నిస్తుంది. గురువుగా భుజంతట్టి ఓ మార్గం చూపుతుంది. ప్రియురాలిలా అపూర్వమైన మధురమైన క్షణాల్లో మౌనంగా నీతో కలిపి అనుసరిస్తుంది. అన్నింటికంటే నీ మనసనే నేస్తంతో నువ్వు ప్రతిసారీ మాట్లాడేది ఏకాంతంలోనే.ఏకాంతంలేనప్పుడు ఎన్ని ఉన్నా ఆత్మతృప్తి ఉండదు కదా!అదేంటో ఎప్పుడు రమ్మన్నా పరిగెట్టుకు వచ్చే ఏకాంతం ఇప్పుడు నీమీదే టపా వ్రాస్తున్నా నిజంగా ఇప్పుడూ నువ్వు కావాలి అన్నా నవ్వుతూ నిలబడిందే గాని రాదే?? మరి తనేం చెప్పిందో తెలుసా?

“నేనే కాదు బాబూ, నీకు నువ్వు తప్ప వేరెవ్వరూ నీతో లేకపోవటమే ఏకాంతం.”

శంకరా’భరణం’

డిసెంబర్ 31, అర్ధరాత్రి. ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే నేను మాత్రం ఆఫీస్ లో కూర్చుని ప్రోజెక్ట్ రిలీజ్ కోసం కష్టపడుతున్నా. ఇంతలో అన్నయ్య ఫోన్ చేసాడు. ఏముందన్నయ్యా మా రాకెట్ ఎలా ఎగురుతుందా అని కౌంట్ డౌన్ చేస్తున్నా అన్నాను. మీ సాఫ్ట్ వేరోళ్ళు ఎప్పుడూ ఇంతే అది ఎగురుతూ ఉంటే మీరు కింద ఉండి చప్పట్లు కొడతారు. అలా కాదుగానీ నిన్నే ఎవరెస్ట్ ఎక్కించేస్తా అన్నాడు. అన్నయ్య మీద నమ్మకం ఉన్నా ప్రోజెక్ట్ మీద ఉన్న భయంతో ఈ రోజుకి వదిలెయ్ అన్నాను. కాసేపాగి నాకు అన్నయ్య నుండీ మరలా ఫోన్ వచ్చింది. కానీ మాట్లాడేది అన్నయ్య కాదు. చాలా పరిచయమున్న గొంతు. తెలుగు లోగిళ్ళలో ఏ ఇంటిలో వినిపించిన టక్కున గుర్తుపట్టే గొంతు. ఆర్ధ్రతను, ఆవేశాన్ని, వ్యంగ్యాన్ని, కర్కశత్వాన్ని ఇంకా ఎన్నింటినో అవలీలగా పలికించే గొంతు. కవిత్వాన్ని చదివేప్పుడు తన్మయత్వాన్ని, ఆద్యాత్మికతను ప్రబోదించేప్పుడు నిర్వికారంగా, అప్పుడప్పుడూ చిలిపిగా మనల్ని పలకరించే గొంతు. ఆ గొంతునుండీ వచ్చిన మాటలు “రెండు సంవత్సరాల సంధి కాలాన్ని కలిసి గడుపుదాం వీలయితే రండి” అంతే అంతవరకు నన్ను నేను ఎలా ఆపుకున్నానో తెలియదు. మరుక్షణంలో బయలుదేరేసా. పండితులకి,యోగులకి మాత్రమే అలా అన్యులను అమాంతం గొంతుతో శాసించి పాదాక్రాంతం చేసుకునే శక్తి ఉంటుంది. మరి ఆయన ఓ పండితుడు యోగి రెండూనూ. అయనే భరణి. తెలుగు లోగిళ్ళలో మనందరి తోటరాముడు.

శ్రీ భరణి

శ్రీ భరణి

మొత్తానికి వీలయినంత వేగంతో ఆయన ఇంటికి చేరుకున్నాను. ఇంటిలో అడుగుపెట్టేముందే మనసులో ఉత్కంటతోనో లేదా ఆయనని కలుస్తున్నానన్న ఆనందంలోనో తెలియదు కానీ కాస్త అలజడి. కానీ ఎదురుగా ఇంటిలోకి ఆహ్వానిస్తున్న చిత్రపటం చూడగానే అలజడి పోయి మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది. బాణాసురుని వంటి అసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఇంటికి కాపలా కాసాడని విన్నాను. కానీ భరణిగారింట ఆయన అభిమానానికి మెచ్చి, తరలి వచ్చి అతిధులను ఆహ్వానించే పని తీసుకున్నది నిలువెత్తు చిత్రపటంలో చిరునవ్వుతో ఒదిగిన మహానటి సావిత్రి. శివుని వెంట నంది ఉండాలిగా మరి అని నవ్వుకుంటూ వెళ్తున్నంతలో మరో చిత్రపటంలో నవ్వుల నెలరాజు రేలంగి. ఆయన ఏడ్చినా జనం మాత్రం నవ్వుతారట. తెలుగుజాతికి దేవుడిచ్చిన గొప్పవరాలు వీరిద్దరు. ఆ మహానటులను స్మరిస్తూ లోపలకి అడుగుపెట్టాం.

లోపలకి అడుగు పెట్టగానే వైకుంఠంలో పరమశివుడు కొలువు తీరినట్టుగా ఒక సాహిత్యగోష్ఠి. గరళకంఠునిలా ఆయన సభ మధ్యలో కూర్చుంటే చెరో పక్క వేణుగారు, వీణాపాణిగారు కూర్చున్నారు. వాళ్ళని పరిచయం చేస్తూ నా శంఖుచక్రాలు అని చెప్పారు. వేణుగారు వెంటనే శివునిచేతి శంఖుచక్రాలం అని చమత్కరించారు. ఇక ఆయన చుట్టూ ప్రమదగణాల్లా మేము కూర్చున్నాం. కాసేపు ముచ్చట్లు సాగాయి. ముచ్చట్లను ముగిస్తూ భరణిగారు తను వ్రాసిన పరికిణీ కవితను వేణుగారి కంజీర సహాయంతో రాగయుక్తంగా మొదలుపెట్టారు.

“దండెంమీద

ఇంద్రధనస్సుని

పిండి ఆరేసినట్టుంటుంది”

ఆ పదాలవెంట పరిగెడుతూ భావాల్ని గమనించటం మరిచిపోయాం, అయ్యో అనుకుంటూ భావాల్ని ఏరుకోవటానికి వెనక్కి వస్తే పదాల్లో గమ్మత్తుని అందుకోలేకపోతున్నాం. అటూఇటూ పరిగెడుతూ అలసిపోయి చివరికి వేరే దారిలేక వన్స్‌మోర్ అన్నాము. ఇప్పుడు పరికిణీ పుస్తకం పెట్టుకుని చదువుకుంటూ మరలా గుర్తు చేసుకుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది.

“కుర్రకారు గుండెల్ని

‘పిండి’ వడియాలు పెట్టేసిన

జాణ – ఓణీ!!

ఓణీ… పరికిణీ…

తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసాలంకారాలు

అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి…

ఓణీయే ఓంకారం!!

పరికిణీయే పరమార్ధం!!”

ఆ పదాల్లో ఒక చిలిపితనం, చిన్న చిన్న పదాల్లో ఒదిగిపోయే భావుకత ఎవ్వరికో తప్ప సాధ్యం కాదు సుమా! కవితల్లో కేవలం ఆ చిలిపితనానికే దాసోహమయిపోయారా అని మీరు గయ్యమనిలేస్తారేమో? అయితే కన్యాకుమారి మీకు వినిపించాల్సిందే.

“ఎక్కడ పెళ్ళి భజంత్రీలు మోగినా

గుండెలో ముగ్గేసినట్టుంటుంది

ఎసట్లో పోసే బియ్యం తలంబ్రాలు అవుతాయి

ఓణీ మాటి మాటికి జారుతుంది

ఎవరన్నా చూస్తారేమో అన్న భయం

చూస్తే బావుణ్ణు అన్న కోరికా!”

సాదారణంగా ఇలాంటి కవితలో కవి కన్నెపిల్లలో పరకాయప్రవేశం చేస్తాడు ఇక్కడ గమ్మత్తుగా భరణిగారు వింటున్న మాకు కూడా పరకాయప్రవేశ మంత్రం ఉపదేశించారు.

“అమ్మాయికేం

చదువుల్లో సరస్వతి

పనిపాటల్లో పార్వతీదేవి

లక్ష్మీకళే బొత్తిగా లేదు!

సర్లెండి వెళ్ళి ఉత్తరం రాస్తాం!

సూర్యుడు ముప్పైసార్లు అస్తమిస్తాడు

చంద్రుడికి రెండుసార్లు పక్షవాతం వొస్తుంది!

ఉత్తరం మాత్రం రాదు!

ఎన్నిసార్లు తలొంచుకున్నా

ఉత్తరాలు రావు!”

భావుకతకి దాసోహమంటూనే భావం ఒంటబట్టి కరిగిన మంచుముద్దల్లా అయిపోయమంతా. ముగింపు వినలేదుగా ఇంకా మీరు కళ్ళ చివర ఆగిపోయిన నీళ్ళు మెత్తగా జారిపోయే ముగింపు.

“ఎక్కడ మంగళ వాయిద్యం

వినిపించినా

గుండెల్లో నిప్పులు పోసినట్టుంటుంది!”

తన ఊహా ప్రపంచంలో పుష్పకవిమానం మీద విహరింపచేసినట్టే చేసి చివరికి వాస్తవజీవిత సత్యాల్లో అమాంతం పడేసారు. మధ్యతరగతి మిధ్యా ప్రపంచాన్ని చాపచుట్టి 30-ఫస్ట్‌నైట్ అంటారు.

“రేపన్నా ‘క్రికెట్’ బాట్ కొంటారా డాడీ – పుత్రుడు

క్రికెట్ లేజీగేమ్.. కబడ్డీ ఆడూ వెధవా..

కండలైనా వొస్తాయ్!!

పండక్కి జడగంటలు కొంటానన్నారు – నాన్నారూ – అమ్మడు

గంటలకన్నా బ్యాండు సౌండెక్కువ!

రబ్బరు బ్యాండ్లు కొనుక్కోతల్లీ!

… … …

… … …

… … …

ఆ… రాత్రి… నులక మంచం మీద!

రెండు మూరల మల్లెపూలెందుకండీ!!

ఏ పాలకూరో – కొత్తిమీరో వచ్చేది గద!..?

యాడాదికి ఓ పూటైనా మొగుణ్ణి

అనిపించుకుందావనీ!

ఈ కవితలు చదివేప్పుడు వచ్చే భావానికంటే ఆర్ధ్రత నిండిన ఆయన గొంతులో విన్నఫ్ఫుడు కలిగే భావావేశం చాలా ఎక్కువ. మరి అది ఆ గొంతుకి దేవుడిచ్చిన వరమో లేదా జీవితాన్ని చదివిన అనుభవ సారమో? వాస్తవాన్ని జీర్ణించుకున్న జీవితానికి నిర్వికారం సాదారణమే కదా! నిర్వికారం తలకెక్కాలంటే భోదించే గురువు కావాలి. భోదించే తత్వం నాలాంటి ఆమ్ జనతా (మేంగో మేన్) కి అర్ధమయ్యే సరళ భాషలో ఉండాలి. నిర్వికార రూపుడైన శివుని గురించి చెప్పేందుకు అలా ఏమైనా ఉందా? ఈ విషయంలో విష్ణువు తెలివైనవాడు. తన తత్వసారాన్నంతా భగవద్గీతగా తానే చెప్పేసుకుని మన ఘంటసాల మాష్టారి చేత పాడించేసుకున్నాడు. మాష్టారి గొంతు మహిమో లేక సహజంగానే విష్ణుమూర్తి కున్న చరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగో కానీ ఊరూర గీత మారుమోగిపోతుంది. చిన్నబుచ్చుకున్న శివుడు ఏ కళనో ఉన్న భరణిగారిని గిచ్చి ఊరుకున్నాడు. ఉప్పొంగిన భావావేశం నుండి పదాలు జారుకుంటూ వచ్చి జలపాతంలా మా మీద వచ్చి పడ్డాయి. అవే శివతత్వాలు. శివకేశవుల భిన్నత్వాన్నో ఏకత్వాన్నో ద్వైతాన్నో అద్వైతాన్నో ఆటలా చెప్పేసారు.

ఆటగదరా శివా!

ఆటగద కేశవా!

ఆటగదరా !

నీకు అమ్మతోడు!!

ఆటగద గణపతిని

తిరిగి బతికించేవు

కళ్ళుమూయుట

మొదటి ఆట నీకు.

ఆటగద జననాలు

ఆటగద మరణాలు

మద్యలో ప్రణయాలు

ఆటనీకు.

ఇలా చెప్పుకుంటూపోతే శివతత్వాల్లో మొత్తం పుస్తకంలో ఉన్నవన్నీ వ్రాయాలిక్కడ. పండితపామర భేధంలేకుండా అందరికీ అర్ధమయ్యి మనలో శివున్ని దర్శించేలా చేసే అద్భుతమైన తత్వాలు అక్కడితో శివుని పైన అధ్యయనం ఆగిపోలేదు.

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేల గలడు,

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేలగలడు,

కోరితే శోకమ్ము బాప గలడు.

… … …

… … …

… … …

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడగలడు.

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడగలడు.

తెర దించి మూట కట్టెయ గలడు.

మేము మాత్రం ఇంకా తెరదించలేదు. తర్వాత వెంటనే ఎంతా మోసగాడివయ్యా శివా అంటు శివునితో చమత్కారమాడారు. బోయవానిభక్తిని పాటగట్టి వినిపించారు. ఆయన తన సాహిత్యంతో శివున్ని ఆడించారు, చమత్కరించారు, దెప్పిపొడిచారు, మొత్తానికి మెప్పించారు. ఇంతగొప్ప భక్తునికి ఆయన ఏ వరం ఇవ్వగలడు. అమ్మకిచ్చుండకపోతే అర్ధభాగాన్నిచ్చేవాడేమో? అయినా అర్ధభాగమివ్వకపోతేనేం? పరమేశ్వరుడు భరణిగారి ఆత్మలో కొలువై ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంపూర్ణీశ్వరుడే!

గతంలో కొందరు కమర్షియల్ కళాకారులకు మీరెందుకు మీ బ్లాగుల్లో అంత అందలమెక్కిస్తారు అని అడిగారు. ఇప్పుడు కూడా అడగాలనుకునేవారూ ఉంటారు. గ్రహణం,సిరా సినిమాలు చూసాక ఈయన బృతికోసమే తప్ప మతిలో కమర్షియల్ కాదని తెలిసిపోతుంది. అయినా అప్పుడే సినీ నటుడు భరణిని కలవటానికి వెళ్ళనన్న భావన మనస్సులో నుండి పూర్తిగా తొలగిపోయింది. ఒక కవిని చూసాను, అతిధిని గౌరవించే గృహస్థుని చూసాను. కవి పండి పండితుడైన వైనాన్ని చూసాను. చివరగా పండితుడు పరమేశ్వరుడైన అద్భుతాన్ని చూసాను.

పార్టింగ్ నోట్

వీడుకోలు..

వీడుకోలు..

నేనొక పార్టింగ్ నోట్ వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా పార్టింగ్ నోట్ వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ప్రేమ అనే పదానికి.. సారీ భావానికి అర్ధాన్ని వివరించాలని చరిత్రలో మొదటి పేజీ నుండి ఎందరో ప్రయత్నించారు. ఆ మహాయఙ్ఞానికి నేను సయితం సమిధనిచ్చా. అయినా ఆ మహాశక్తి విశ్వరూపం ఆవిష్కరింపబడలేదు. నిజమే అదే జరుగుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా ఏమిటి? అయినా పదాలని వివరించగలంగానీ భావాల్ని అందులోనూ ప్రేమని నిర్వచించాలనుకోవటం ఏంటి నా వెర్రి కానీ.

సరే ప్రేమని నిర్వచించలేను మరి పార్టింగ్ మాటేమిటి? పెద్ద కవిసామ్రాట్ లా ఫోజుకొట్టేవాడినాయే మరీ పార్టింగ్ రోజు అందరిలా బేలగా ఉంటే ఎలా? నాకేంటనో, నీ దురదృష్టం అనో అర్ధంవచ్చే కవిత ఒకటి అలవోకగా అలా అలా ఆశువుగా వదిలి, దర్పంగా కళ్ళు ఎగరేయాల్సిందే. అమ్మో అలా అయితే అందరూ వీడికి పొగరు అందుకే ఇలా జరిగింది అనుకుంటారేమో? గెలిచినా, ఓడినా సింపథీ ఎప్పుడూ మనవైపే ఉండేలా చూసుకోవాలి మరదే మానవనైజం. మరలా అయితే విధి ఆడే వికృత క్రీడ అనో, కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం బ్రహ్మ అనో అర్ధమొచ్చేలా వేదాంతంలోకి పోతే ఎలా ఉంటుంది? ఇందులో కుడా ఇబ్బంది ఉంది మరి. చూసేవాళ్ళు వయస్సేమో పాతిక, వ్రాసేది మోసేది పాత చింతకాయ పచ్చడి అంటారు. పోనీ “వదిలిపోకు నేస్తమా, నా జీవిత ప్రయాణపు చివరి మజిలీలో.” “ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు. నా తోడు రావు. నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..” ఇలా రాస్తే. ఖచ్చితంగా కొందరు జాలి చూపిస్తారు. కొందరు పైశాచిక ఆనందం పొందుతారు. ఇంకొందరు ప్రాక్టికాలిటీ లేదని తేల్చేస్తారు. అయినా నేను ఏం వ్రాస్తున్నా? ఎవరికి వ్రాస్తున్నా? పార్టింగ్ నోట్ ఏమయినా శ్వేత పత్రమా? బహిరంగలేఖా? మరి ఎవరెవరో దీనికి ఎందుకు స్పందిస్తారు? పక్కవాడి వ్యక్తిగత విషయాలు అందులోనూ, ప్రేమ విషయాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో కదా!

మొత్తానికి ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నా. ఏం వ్రాయాలో తేలక. పార్టింగ్ అంటే ఏంటీ ఒక దృశ్యమా? ఒక ఙ్ఞాపకమా? ఒక సంఘటనా? అసలు పార్టింగ్ నోట్ అంటే ప్రేమ లేఖ కాదా? “నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..” “నిన్ను ప్రేమించే నేను నీ మనసుని భాందిచలేక మౌనంగా రోదిస్తూ వెళ్ళిపోతున్నా..” “నా మనసులో అపురూప కావ్యంలా ఒక గేయంలా నిలుస్తావనుకున్నా, కానీ ఒక మరుపురాని గాయంలా నిలిచిపోయావు” ఇవన్నీ మనలోని ప్రేమని చెప్పేవేగా మరలాంటప్పుడు ఇవి ప్రేమలేఖలు కావా? కాకపోతే మరి ప్రేమలేఖ అంటే ఏంటి? నాకు ఇప్పుడు మెల్లగా అర్ధమవుతుంది ప్రపంచమంతా ప్రేమనే భావంలో కాదు భ్రమలో మునిగితేలుతున్నారని. మనమంతా పువ్వుయొక్క సువాసనని అనుభూతి చెందుతున్నాం తప్పా, నిజమైన పువ్వుని, దానిలో నిఘూడమైన అందాలని,రహస్యాలని కనుగొనలేకపోయాం అని. కేవలం అనుభూతుల అలలే ఇంత ఆవేశాన్ని,ఉన్మాదాన్ని కలిగిస్తే, నిజంగా ప్రేమసాగరంలో ఆకేంద్రంలో లోతుల్లో ఇంకెంత విలయం ఉందో, అది ప్రపంచాన్ని ఇంకెంత కుదిపేస్తుందో కదా! కాదు కాదు నిజంగా ఆ ఉన్నత భావం విశ్వరూపం సందర్శనమయితే, నిజరూపం ఆవిష్కరింపబడితే మన మానవ మేధస్సు అర్ధం చేసుకోగలిగితే…. అరరే నేను ఏమి వ్రాస్తున్నా? నాకేమయింది? నేను వ్రాయాల్సింది పార్టింగ్ నోటే కదా?

నా ముందిప్పుడు రెండు మార్గాలున్నాయి. ఒకటి నా మనస్సు మీద కమ్ముకున్న ముసుగులను,ఇగోలను,అపోహలను,అందరూ ఏమంటారో అనే స్పృహను ప్రక్కనపెట్టాలి. అప్పుడే నాతో నేనే నటిస్తూ, నన్ను నేనే మోసంచేసుకునే పరిస్థితిని దాటగలను. లేదా పార్టింగ్‌నోట్ అనే ఆలోచనను పూర్తిగా వదిలేయాలి. మొదటిదే చేస్తా ఎందుకంటే అందరిముందు మంచి ఇంప్రెషన్ సంపాదించటం నాకు ముఖ్యం కాదేమో ఇప్పుడు. అన్ని ముసుగులను ఆభిజాత్యాలను వదిలేసా. నేను నేనుగా ఉన్నా. కాదు కాదు, నా మనస్సు కేవలం ఒక మనస్సుగా మిగిలింది. నేను అనే ప్రభావం, నా ఆలోచనలు దాని పైన లేవు. మకిలిపట్టిన ముత్యపు చిప్పలో అపురూపంగా దాచబడ్డ ముత్యంలా ఉన్న మనస్సు. ఇప్పుడు వ్రాయాలనే స్పృహ నాకు లేదు. నా మనస్సు నడిపిస్తుంది.

” ఎప్పుడూ నా జీవితంలో సంభోదన శూన్యమేనేమో. సరే కానీ..
ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోయినా, మొదలుపెట్టక తప్పదుగా. వీడుకోలు తప్పదని తేల్చేసావుగా. అందుకే ఎవరికీ అన్యాయం జరగకుండా పెంచుకున్న భందాన్ని, పంచుకున్న అనుభూతుల్ని చెరిసగం వాటా వేసేద్దామని ఈ లేఖ. వచ్చిన చిక్కంతా ఈ ప్రేమ కేవలం ప్రస్తుతంతో కాక గతంతోనూ, భవిష్యత్తుతోనూ ముడిపడిపోయింది. చిన్నప్పుడు మీ తాతగారు కొనిచ్చిన బంగారు పట్టీలదగ్గరనుండి, నిన్నకాక మొన్న నీ పుట్టిన రోజున వేసుకున్న పట్టుపరికిణీ వరకు పరచుకున్న ఙ్ఞాపకాలను నా గుండెలో కుడ్యచిత్రాలుగా చిత్రించి, ఆ దృశ్యాల్లో నన్ను నేను లిఖించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇన్నివేల క్షణాలకి శ్రోతను కాగలిగానే కానీ ప్రత్యక్ష సాక్షిని కాలేని నా దురదృష్టాన్ని నిందిచుకుంటున్నా. ఏరోజుకైనా శాశ్వతంగా నా వద్దకు వచ్చేస్తావుగా అనుకున్నా. కానీ ఈరోజున ఇలా వదిలివెళ్ళిపోతావని చిన్ననాడే తెలుసుంటే ఇన్నివేల క్షణాలను వదిలి అమ్మఒడిలో ఆదమరిచి నిదురపోయేవాడ్నా ఏమిటి?

అయినా నువ్వు మాత్రం 10 ఏళ్ళ వయస్సులో జ్వరంతో చావుదాక వెళ్ళివచ్చా అని చెప్పినప్పుడు, కళ్ళనీళ్ళు పెట్టుకోలేదూ? కాలేజీలో ఎవరో అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది అని చెప్పినప్పుడు ఉడుక్కోలేదూ? ఆక్షణంలో నువ్వు నా గతంపై చేసిన సంతకాన్ని తూచ్ అంటూ ఇప్పుడు తుడిచెయ్యాలా? నాగతంలో ముద్రిచుకుపోయిన నిన్ను, నీ భవిష్యత్తులో పెనవెసుకున్న నన్ను వేరు చేయాలా? సరే అలానే చేస్తా. ఙ్ఞాపకాలను చెరిపెయ్యటం సాధ్యమో కాదో మరి. అయినా జీవితం పెట్టించే పరుగుపందెంలో ఏదయినా సాధ్యమే. కానీ అలసిపోయి బాట పక్కగా సేదతిరే సమయంలో ఙ్ఞాపకాలు తేనిటీగల్లా ముసురుకుంటాయేమొ. అయినా నీకోసం స్మృతుల్ని చెరిపేస్తా నువ్వొకమాటిస్తానంటే.

ఎప్పుడయినా నువ్వు కిచెన్ లో ఒంటరిగా వంటచేస్తున్నప్పుడు, అల్లరిగా నాచేతులు నిన్ను అల్లుకుంటాయన్న ఆలోచన నీకెప్పుడు రాదని మాటిస్తే ఖచ్చితంగా చెరిపేస్తా. భవిష్యత్తులో నీసొంతవాళ్లయినా “ఐ లవ్ యూ” అని చెప్పినప్పుడు. వాడు పదే పదే చెప్పే ఈమాటలో ఉండే ఫీల్ వీళ్ళు మొదటిసారి చెప్పినప్పుడు కూడా లేదేంటి? అనే అనుమానం ఎప్పటికీ కలగదని మాటివ్వు. నువ్వడిగినట్టే ఙ్ఞాపకాల్ని అతకలేని ముక్కలు చేసేద్దాం.”

అక్కడితో మనస్సు ఆగిపోయింది. ఇప్పుడు నేను నా మనస్సుని పూర్తిగా ఆక్రమిచుకున్నా. నా ఆలోచనలే ఆక్రమించుకున్నాయి. తను విడిపోదాం అనుకున్నప్పుడే ఙ్ఞాపకలని ముక్కలు చేసి తొక్కుకునిపోయింది. ఇప్పుడు ఈ లేఖ చేసేదేమిటి? బీడుబారిన గుండెల్లో చివురలకై నిర్జీవమైన ఆశ.

పార్టింగ్‌నోట్ తేలిపోయింది. ఒక్క ఎస్.ఎమ్.ఎస్. “ఆల్ ది బెస్ట్”

వాడిన గులాబీరేకులు

వాడిన గులాబీరేకులు

వాడిన గులాబీరేకులు

ఙ్ఞాపకాల పుస్తకాల్లో దాచుకున్న గులాబీలు

వాడిపోయాయి

పరిమళం పోయింది

తాకితే రెక్కలు రాలిపోయాయి

రెక్కల్ని తరచి తరచి తాకి చూస్తే

పరుచుకుంటున్న దృశ్యాలు

దృశ్యాల వెంట పరిగెడుతుంటే

ఎన్నో మలుపులు

ప్రతి మలుపులోనూ చిక్కుకున్న భావాలు

అప్పుడు దాచుకోలేక ఇప్పుడు ఏరుకుంటున్నా

ఎవరో తొంగి చూసారు

పుస్తకం మూసేసా భయంతోనో, అపరాధ భావంతోనో