విజన్ 2040

2040 కార్తీకమాసం ఏదోరోజు ఉదయం 4 గంటలు, పూజగదిలో నుండి గంట వినబడుతుంది. నేను ఉలిక్కిపడి లేచాను. అమ్మా ఎంత భయంకరమైన పీడకల మా ఇంట్లో ఏంటి గంట వినిపించటం ఏంటి? మా అవిడ మ్యాడీకి(మధు మధుమతి) పెళ్ళయిన కొత్తలో ఒకసారి వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకుని వెళ్ళి గోవిందా అనమని గుసగుసగా చెప్పాను. అది పాపం దానికొచ్చిన భాషలో దేవుడ్ని పిలిచింది. గుడిలో అయ్యవారు నన్ను పక్కకు పిలిచి గుడిలో ఏమిటా మాటలు అని చీవాట్లేసారు. ఆ రోజు వదిలేసిన నీళ్ళే ఈ రోజుకి ఒక పూజలేదు, గుడికి తీసుకుని వెళ్ళనూలేదు.నాకు నిద్ర నుండిలేచినా మంత్రాలినిపిస్తున్నాయే. నా చెవిని జి.పి.ఎస్.గా వాడి మంత్రాలొచ్చిన వైపే చెవిని పెట్టి వెళ్ళాను. పురాతనకాలంలో మూసివేయబడ్డ ఒక గది తలుపులు తెరిచి కనబడ్డాయి. ఆ గదిని నేను 2011 కాలంలో దేవుడిగది అనిపిలిచేవాడ్ని. పరాకున నేను పూజ చెయ్యటం లేదని దేవుళ్ళు వచ్చి వాళ్ళ పూజలు వాళ్ళే చేసుకుంటున్నారా అని అనుమానం కలిగి తలుపుతోసి చూసాను.గుండె గుభేలుమని ఆ షాక్‌లో కిందపడ్డా.మా మ్యాడి, మా అబ్బాయి కవిష్యంత్(అంటే ఏమో?) పూజ చేస్తూ కనిపించారు.మంత్రాల కోసం యూట్యూబ్ తెరిచి, అందులో చెప్పే పూజా విధానంలో పూజ చేస్తున్నారు.నేను పరిగెట్టి వెళ్ళి మా ఫ్యామిలీ డాక్టర్, నా ఆప్తమితృడు గోపికి పోన్ చేసా. ఇంట్లో పనమ్మాయి ఫోను తీసి అయ్యగారు పూజలో ఉన్నారండి అంది.ఏమిటీ గోపి గాడు పూజా? 2012 లో అంతరాయం వచ్చి ఆగిపోయిన యుగాంతం ఇప్పుడు దాపురించిందా ఏమిటి? నేను రోజూ పేపరు చూస్తునే ఉన్నానే. పిచ్చితో నేను పిల్లి మొగ్గలు వెయ్యటం మొదలుపెట్టాను.

కాసేపటికి పూజ ముగించుకుని మా అబ్బాయి వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. నా పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ రోజే నా ఆఖరిరోజని తేలిపోయింది. నేను పరిగెట్టెళ్ళి బీరువాలో ఉన్నా వీలునామా తీసి వాడి చేతిలో పెట్టా. అందులో ఎప్పటికయినా కొనకపోతానా మా అబ్బాయికి ఇవ్వకపోతానా అని ముందుగానే చార్మినార్,తాజ్‌మహల్ కూడా రాసిపెట్టాను. పాపం పిచ్చి తండ్రి ఎలా బ్రతుకుతాడొ ఏంటో అని బెంగగా అనిపించింది.

“ఏంటో అందరూ లేచినా పడుకోవటం ఇలా లేచాక గెంతులు వెయ్యటం?” అని ఇంకా ఏదో అంటుంది మ్యాడి.
“ఎవర్నీ తిడుతున్నావ్?” అని అడిగా.
“పక్కింటాయన్ని”
“పాపమే వాళ్ళావిడ తిట్టేవి చాలదా? నువ్వు కూడా ఎందుకు?”
“జోకులాపండి ఈ రోజునుండే స్వయంవరాల సీజన్ మొదలన్న ఙ్ఞాపకం ఉందా? ఈ సీజన్లో కూడా అబ్బాయి రిజక్ట్ అయితే మా ఇంట్లో వాళ్ల ముందు నా పరువుపోతుంది. మా అక్కని చూడండి క్రితం సీజన్లోనే పెళ్ళి పర్మిట్ సంపాదించి వాళ్ళబ్బాయికి పెళ్ళి చేసేసింది.”
“క్రితం సీజన్లో మన అబ్బాయికి కూడా పర్మిట్ వచ్చేది నీకు ఇంటర్లో మార్కులు తక్కువ రావటం వలనే పోయింది. మర్చిపోయావా?”
“ఈసారి అలా జరగకూడదనే అబ్బాయి చేత కార్తీకమాసం నోము చేయిస్తున్నా. మా అమ్మే చెప్పింది ఇలా చేయించమని. మా అక్క కూడా చేయించిందట వాళ్ళ అబ్బాయి చేత. మీ గోపీ వాళ్ళు కూడా చేస్తున్నారట నోము.”
“సర్సరే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?”
“వెళ్ళి ఒక లక్ష పడేసి నా ఇంటర్ మార్కులు మార్పించి ఒక ఫేకు సర్టిఫికేటు పట్రండి. అలానే మార్కెట్లో స్వయంవరం కేటలాగ్ కూడా.”

నేను ఫేకు సర్టిఫికేటుకోసం వెళ్ళా. అక్కడ పెద్ద క్యూ ఉంది. గోపిగాడు కనిపించాడు.వాళ్ళావిడకి కూడా ఫేకు కావాలంట.ఒక బ్రోకర్ని పట్టుకున్నాడు. క్యూ లేకుండా పని జరిగేలా. కాకపోతే ఖర్చు ఎక్కువ రెండు లకారాలు. కాదూ కూడదని క్యూలో వెళితే వచ్చేసీజన్ దాకా ఫేకు రాదంట. చేసేదిలేక డబ్బులు కట్టి రసీదు తీసుకున్నా. పదిరోజుల్లో పోస్టులో వస్తుంది అని చెప్పాడు.రసీదు నెంబరుతో పోస్టు ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడ ఉందంట.స్వయంవరాల క్యాటలాగ్ కోసం వెళ్ళాం గోపిగాడు, నేనూ. అక్కడ నో స్టాకు బోర్డు. బ్లాకులో కొనుక్కుని ఇంటికి చేరాం.మా ఆవిడ పసుపురాసి,బొట్టు పెట్టి క్యాటలాగ్ తెరిచింది. ఇన్నాళ్ళకి మా మ్యాడీని ఇలా చూడగలిగినందుకు నాకు సంతోషం కలిగింది.

“మ్యాడి నిన్నొక్కసారి మధు అని పిలుస్తానే” అని ముద్దుగా అడిగా.
“మధునా? మీ బొందలా ఉంది. ఇప్పటికే ఒక స్టైలు పాడు లేని పేరు పెట్టారని మా అమ్మని,నాన్నని రోజూ తిట్టుకుంటున్నా.ఇంకా ఇదొకటా? మ్యాడి అనే అగోరించండి”

కేటలాగ్‌లో ఉన్న వివరాలు చదివింది.స్త్రీ,పురుషుల నిష్పత్తి గణనీయంగా పెరిగి 1000:800 కు చేరుకోవటం చేత అమ్మాయిల డిమాండు కాస్త తగ్గి ఈ సీజన్లో పరీక్షలు కాస్త సరళతరం చేసారంట. మా ఆవిడ మొహం వెలిగిపోవటం మొదలయ్యింది.మొత్తం పరీక్షలు ఇరవై. అందులో అయిదు అబ్బాయి తండ్రికి, అయిదు అబ్బాయి తల్లికి, పది అబ్బాయికి.ఒకే కులం ఒకే మతం అమ్మాయి కావలంటే పరీక్షల్లో ఎనభై శాతం రావాలంట. బాగాచదువుకున్న అమ్మాయి అయితే ఎనభై అయిదుశాతం, అందంగా ఉన్న అమ్మాయి అయితే తొంబై శాతం, జాతకాలు కలిసేలా కావాలంటే తొంబై అయిదు శాతం, ఉద్యోగం చేసే అమ్మాయి అయితే వందశాతం రావాలి.కేటలాగ్ చివర్లో కోచింగ్ సెంటర్ల వివరాలు కూడా ఉన్నాయి.అందులో మాకు దగ్గరగా ఉన్న కోచింగుసెంటరుకి అప్పుడే ఫోను చేసి సీట్లు రిజర్వు చేసుకున్నాం. మా ఇంటిల్లపాది అందరం ఆఫీసులకి నెలరోజులు సెలవులుపెట్టాం.మా ఆవిడ గోడకి ఒక టైం టేబుల్ అంటించింది. పొద్దునే నాలుగు గంటలకి పూజ, అయిదింటికి కోచింగ్ మెటీరియల్ చదవటం, ఏడింటికి కోచింగ్‌సెంటర్లో ఇచ్చిన హోమ్ వర్క్ చెయ్యటం అటుపైన కొచింగ్‌సెంటర్‌కి వెళ్ళి క్లాసులు.కోచింగ్‌సెంటర్ వాడికి ఈ రంగంలో ఎంతో అనుభవం ఉంది. అందులోనూ స్వయంవరాలు నిర్వహించే కమిటీలో భందువులు కూడా ఉన్నారు. మా కుటుంబ ఏకాగ్రతకి ముచ్చటపడిన కోచింగ్‌సెంటర్ వాడు మాకు అప్పాయింట్‌మెంట్ త్వరగా వచ్చేలా చేసాడు.

పరీక్షరోజు రానే వచ్చేసింది. ఉదయం ఎనిమిదింటికి మా అప్పాయింట్మెంట్. అరగంట ముందు రిపోర్టింగ్ చెయ్యాలి.పొద్దున్నే నాలుగింటికి పూజ చేసుకుని అందరం బయల్దేరి వచ్చి లైన్లో నిలబడ్డాం. మాకంటే ముందుగా ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి. అమ్మయ్య త్వరగా రావటం మంచిదయ్యింది అనుకున్నాం. అక్కడ పరీక్షలు జరిగే ప్రాంగణంలో క్యూలైనంతా నీడ ఉండేలా పైకప్పులేసి ఉంచారు. మధ్య మధ్యలో ఏదో స్వచ్చంధ సంస్థవారు మంచినీళ్ళపొట్లాలు పంచుతున్నారు. మొత్తానికి క్యూలైను కదిలి మా వంతు వచ్చింది.అఫ్లికేషన్ నింపి ఇచ్చాము. అప్లికేషన్ పుచ్చుకునేవాడు అప్లికేషన్ చూసి ఏదొ అనుమానం వచ్చి పక్కనే ఉన్న మరో సభ్యుడిని ఏదో అడిగాడు.వాడు కూడా అనుమానంగా మొహం పెట్టి నా దగ్గరకి వచ్చి “మీ పేరెంటి?” అని అడిగాడు.
“మురళీధర్” అన్నాను.
“సార్ మీ మంచికోసమే చెబుతున్నా. ఇలాంటి ముతక పేర్లని కమిటీ తిరస్కరిస్తుంది. కనీసం ముద్దు పేరు ఏదైనా కొత్తగా ఉండేది ఉంటే అది వ్రాయండి” అని చెప్పాడు. మా ఆవిడ డొక్కలో ఒక్కపోటు పొడిచి, నా అప్లికేషన్ లాక్కుని పేరు దగ్గర “మూర్” అని వ్రాసింది.అప్లికేషన్ పుచ్చుకునేవాడు అప్లికేషన్ వెనుకున్న మా మార్కుల జెరాక్సులు చూసి మా ఆవిడ ఫేకు మార్కులు మెచ్చుకుని, నన్ను ఈసడించుకున్నాడు.”ఈ రోజుల్లో ఎనబైలేంటి సార్? మేడమ్‌లాగా తొంబైలుదాటి ఉండాలి.మీ రోజుల్లో స్వయంవరాలు లేవు కాబట్టి ఇలాంటి మేడమ్ దొరికారు” అని పిచ్చి తిట్లు తిట్టాడు.కోచింగు సెంటరులో మొదటిపాఠం పరీక్ష సమయంలో ఎవరిమీద అరిచినా, కోపగించుకున్నా అప్లికేషన్ డిస్క్వాలిఫై అవుతుంది. అందుకే నవ్వుతూ తలదించుకున్నా. వాడి తిట్లపురాణం అయ్యాక లోపలికి పంపారు. మొదట పరీక్ష నాకే. మా ఆవిడ నాకు బొట్టుపెట్టి పంపింది.మొదటిది వ్రాతపరీక్ష. పేపరు ఇచ్చారు. ముప్పై నిమిషాల్లో ముప్పై ప్రశ్నలు వ్రాయాలి.

మొదటిప్రశ్న: మీ భార్యకి, మీ కోడలికి ఏ సీరియల్ చూడాలో అనే విషయంలో గొడవ జరిగినప్పుడు ఏం చేస్తావ్?
ఎ)మీ భార్యని తిట్టి రిమోట్ కోడలికి ఇస్తావ్
బి)మీ భార్యని కొట్టీ రిమోట్ కోడలికి ఇస్తావ్
సి)మీ భార్యని,అబ్బాయిని తిట్టి కొట్టి రిమోట్ కోడలికి ఇస్తావ్
డి)కొత్త టీ.వి. కొని రిమోట్ కోడలికి ఇస్తావ్
రెండవప్రశ్న: మీ అబ్బాయికి, మీ కోడలికి కారు ఎవరు తీసుకుని వెళ్ళాలి అనే విషయంలో గొడవ జరిగినప్పుడు ఏం చేస్తావ్?
ఎ)మీ అబ్బాయిని తిట్టి కారు తాళాలు కోడలికి ఇస్తావ్
బి)మీ అబ్బాయిని కొట్టీ కారు తాళాలు కోడలికి ఇస్తావ్
సి)మీ అబ్బాయిని,భార్యని తిట్టి కొట్టి కారు తాళాలు కోడలికి ఇస్తావ్
డి)కొత్త కారు కొని కారు తాళాలు కోడలికి ఇస్తావ్
ఈ సీజన్లోనే అత్యంత కఠినమైన పేపర్ ఇదే అంట. నాకు భయంతో చేతులు వణుకుతున్నాయి. నేను కొన్నింటికి ఏ అని కొన్నింటికి డి అని పెట్టాను. ఇంతలో “ఏ ఊరయ్యా నీది మా సెంటర్ పరువు తీసేలా ఉన్నావ్” అని ఎవరో అన్నారు. చూస్తే మా కోచింగ్‌సెంటర్ ట్యూటర్. ఆయన డబ్బులిచ్చి మేనేజ్ చేసి ఇన్విజిలేషన్‌కి వచ్చాడంట. అన్నింటికీ సి అని పెట్టమని చెప్పాడు. పెట్టేసి పేపరు ఇచ్చి వచ్చేసా.తర్వాత 100 మీటర్ల పరుగుపందెం. నేను ఫ్యాంటు తీసి గోచీ బిగించి చిన్నప్పుడు స్కూలొదిలేసాక ఇంటికి పరిగెట్టినట్టు పరిగెట్టా. అయినా పరిగెట్టినవారిలో అయిదవస్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.తర్వాత వెయిట్‌లిఫ్టింగ్ దీని సిగతరగా 300 కేజీలు ఎత్తేసా. ఈలోగా ఎవడో బక్కపీనుగ వచ్చి 400 కేజీలు ఎత్తేసాడు. ఒరిడి అమ్మకడుపుకాలా బక్కోడిలా ఉన్నాడు ఎలా ఎత్తాడు అని వెళ్ళి వివరాలడిగా. మాకిది నాలుగో సీజన్ సార్ అని ఏడుపుమొహంపెట్టుకుని వెళ్ళిపోయాడు. తర్వాత 100 కేజీల మూటనెత్తుకుని 100 మీటర్లు పరిగెట్టాలి. తర్వాత లాంగు జంపు, హై జంపు. అన్నీ పుర్తయ్యాయి.
నా పరీక్షల తర్వాత ఫలితాలిచ్చారు. ఫలితాల ప్రకారం తొంబైశాతం కేటాయించారు. మా అబ్బాయి ఆనందంతో ఎగిరి గంతేసి నన్ను గాలిలో ఎత్తి గిరగిరా తిప్పి ముద్దులుపెట్టేసాడు. నేను మాత్రం వ్రాతపరీక్షలో సహాయం చేసిన ట్యూటర్ కి థ్యాంక్స్ చెప్పుకున్నా. మా ఆవిడ పరీక్షకి వెళ్ళింది. మొదటగా కాళ్ళు పట్టడం, తర్వాత జడ వెయ్యటం,నైల్‌పాలిష్ పెట్టడం ఇలా అమ్మాయిలని ముస్తాబు చేసే అయిదుపోటీలు పెట్టారు. బాగా ప్రాక్టీసు చేసి ఉందేమో మా ఆవిడ కొంగు నడుముకి దోపి బెబ్బులి మీద పడ్డట్టు కనిపించిన వారి మీదపడి పరీక్షలు ఉన్నవాళ్ళకి, ఇన్విజిలేటర్లకి ఇలా జుత్తున్న ప్రతీ ఒక్కడికి జడలు వేసింది. కనిపించిన ప్రతివాడి కాల్ళు పట్టుకుని లాగి పడేసి కళ్ళూ నొక్కటం చూపించింది. ఇలా తనకొచ్చిన విద్యలన్నింటిలోనూ పాండిత్యం ప్రదర్శించింది.పాపం మా ఆవిడ ఎంత రమ్ము తాగిన రామబంటులా గెంతినా, ఫలితాలు ఎనబై అయిదుకు పడిపోయాయి. మా ఆవిడ దిగాలుపడిపోయింది. మా అబ్బాయి నేను చూసుకుంటా అని ధైర్యంగా ముందుకి వెళ్ళాడు.

అబ్బాయికి మొదట రంగు టెస్టు, తర్వాత ఎత్తు,బరువు టెస్టు జరిగాయి. ఫలితాలు నిరాశా జనకంగా ఉన్నాయి. తర్వాత “పెళ్ళాం బెల్లం-అమ్మ అల్లం” అనే టాపిక్ మీద గ్రూపు డిస్కషన్ అయ్యింది. మా వాడు తిడుతున్నది వాళ్ళమ్మనే అనే సంగతి మరిచిపోయి కోచింగు సెంటర్లో నేర్పినవన్నీ తిట్టాడు. మా ఆవిడ కన్నీరు. నేను వెళ్ళి ఓదార్చి “భాదపడకు మ్యాడీ ఇదంతా ఉత్తుత్తినే” అన్నాను. “ఇవి కన్నీరు కాదండీ ఆనందభాష్పాలు. కొడుకు పరీక్షలో నెగ్గాడని ఆనంద కన్నీరు”అని చెప్పి కొడుకుకి హారతి ఇచ్చింది.

తర్వాత అన్నింటికంటే పెద్ద పరీక్ష వంట చెయ్యటం. మావాడు తలకి కండువా చుట్టి, పంచె కట్టుకుని అప్పడాలు, వడియాలు పెట్టేసాడు. ఆవకాయ,మాగాయ,ఊరగాయ, నిమ్మకాయ,ఉసిరికాయ,టమాట పచ్చడ్లు పెట్టేసాడు.చల్ల మిరపకాయలు వేయించేసాడు. చారు, మజ్జిగచారు, పచ్చిపులుసు,సాంబారు వండేసాడు.అన్నం,పులిహోర,పలావు,చికెన్ బిర్యానీ,ఫ్రైడ్ రైస్ చేసేసాడు.ఈలోగా కిచెన్‌లో నుండి అరుపులు పెడబొబ్బలు వినిపించాయి. పరిగెట్టి వెళ్ళి చూసా. అక్కడున్న సభ్యులు ఆపండి బాబోయ్ ఈ కుర్రాడ్ని ఆపండి అని ఒకటే అరుపులు. “ఏమయ్యింది బాబు మావాడు బాగా చెయ్యలేదా” అని అడిగా.
“బాగా వండలేదా అని అడిగారా? కిందటి జన్మలో నలుడా భీముడా ఇప్పటికే నాలుగు లారీల రేషన్ వాడేసాడు. లారీడు సిలండర్లు అవ్వగొట్టేసాడు. మీవాడు వండింది తినటం కాదు అమ్ముకోవాలన్న హైదరాబాద్‌లో ఉన్న అన్నీ రెస్టారెంట్లు కలిపి వారం పాటు అమ్మాలి.తీసుకెళ్ళండి బాబోయ్ తీసుకెళ్ళండి” అని ఇంకా కూరలో మసాల వెయ్యటానికి ఉరుకుతున్నా మా అబ్బాయిని పట్టుకుని గోనె సంచిలో కుక్కి బయటపడేసారు.మా వాడు అదే ఆవేశంలో బట్టలుతికి, ఇస్త్రీ చేసే పరీక్షలో వాడికిచ్చిన బట్టలు పదినిమిషాల్లో ఉతికేసి, కనిపించిన జనాలందరికి వంటి మీదే వారి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసాడు. అలా పది పరీక్షలు పూర్తి చేసాడు. పదిరోజుల్లో ఫలితాలు మొత్తం ప్రకటిస్తాం ఇంటికి వెళ్ళమన్నారు.

ఈ పదిరోజులూ మా ఆవిడ మాచేత పూజలు చేయిస్తూనే ఉంది. పరీక్ష రిజల్టు వచ్చేరోజున మా ఇంట్లో గణపతి హోమం, రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్యారాధన, లలితా సహస్రనామ పారాయణం చేసాము. రిజల్టు కవరు పోస్టులో వచ్చింది. మా ఆవిడ కవరుకి హారతిచ్చి, బొట్టుపెట్టి నా చేతిలో పెట్టింది. నేను వణుకుతున్న చేతులతో కవరు ఓపెన్ చేసా. మా అబ్బాయి టెన్షన్‌తో గోళ్ళు,చేతులు కొరికేసుకుంటున్నాడు. మొత్తానికి ఎలానో తెరిచి చూసా.

“మీ కుటుంబం చూపిన చొరవకి, ఉత్సాహానికి ఎంతో సంతోషిస్తున్నాం. కానీ కొన్ని నెగటివ్ మార్కుల కారణంగా మీ అబ్బాయిని రిజెక్టు చేస్తున్నాం” అని ఉంది. మా అబ్బాయి పరిగెట్టి వెళ్ళి వాడి గదిలో తలుపేసుకున్నాడు. ఏ అఘాయిత్యం చేసుకుంటాడో అని భయపడ్డా. కానీ వెళ్ళి మంచం మీద పడి తలగడలో మొహం దాచుకుని ఏడుస్తున్నాడు. గోపి వచ్చాడు. వాడికి ఇలానే జరిగిందంట. కొడుకుని ఈ పరిస్థితులలో చూసి కడుపు రగిలిపోయి రిజల్ట్సు మీద కోర్టుకు వెళ్ళాలని నిశ్చయించాం. మా ఆవిడ హారతిచ్చి,బొట్టుపెట్టి పంపింది. హైకోర్టుకు వెళ్ళి రిజల్ట్సు మీద స్టే తీసుకుని వచ్చాము. సిట్టింగ్ జడ్జ్ చేత రిజల్ట్సులోని పారదర్శకతను పరిశిలించే వరకు పెళ్ళులన్నీ ఆగిపోయాయి.

మంచివార్త వినాలని మేమింకా ఎదురుచూస్తూనే ఉన్నాం. మీరుకూడా మా అబ్బాయి కవిష్యంత్‌కి రిజల్ట్స్ అనుకూలంగా రావాలని ప్రార్ధించండి.

ప్రియా పాహిమాం పాహిమాం పాహిమాం

ఇంటిలో ఉన్న పాత పుస్తకాలన్నీ దులుపుతుంటే నేను కవితలు వ్రాసుకునే పుస్తకం కనిపించింది. పదేళ్ళక్రితం ఇంటర్ లో వ్రాసుకున్న కవితలు చాలావరకూ ఇమ్మెట్యూర్ అనిపించాయి. నాకు కాస్త గమ్మత్తుగా అనిపించిన ప్రేయసి దండకం ఇది. కొత్త కొత్త ప్రయోగాలు,కనీవినీ ఎరుగని పదాలు కనిపిస్తే కంగారు పడకండి.

విశ్వసౌందర్యానికి దాసోహం

విశ్వసౌందర్యానికి దాసోహం

ఓ ప్రియా,

మందారముఖి కమలాక్షి
కరుణామయి దయార్ద్రహృదయి
మదీయమానసచోర కోమలాంగి
నాదు హృదయగర్వభంగి
పాహిమాం పాహిమాం పాహిమాం

ననుభందించు నీకురులనుండి
బుసలుకొట్టు నీదు భృకుటీద్వయం నుండి
చురకత్తుల చూపులనుండి
నిట్టూర్పుల వడగాల్పులనుండి
పాహిమాం పాహిమాం పాహిమాం

మైమరపించు చిరునవ్వుల నుండి
ఆకర్షించు చెక్కిళ్ళ నుండి
తేనెలూరు పలుకుల నుండి
నీదువయ్యారపు నడకల నుండి
మంచువంటి మనసు నుండి
పాహిమాం పాహిమాం పాహిమాం

నీసోయగంబు వర్ణించ నేనెంతవాడినే
నీగుణగణంబుల్నెంచ నాకేమితెలుయునే
నీదు దాసుడన్,నిను సేవించు భక్తుడన్
నాయందు కరుణించి చీత్కారముల్ విడచి
కటాక్షవీక్షణముల్ ప్రసరించు

నాపై నీప్రేమామృతము కురిపించు
దేవి కారుణ్య హృదయి
పాహిమాం పాహిమాం పాహిమాం

కాకి దిద్దిన కాఫురం (!?!)

“అకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఈ రోజు అదివారం సమయం మధ్యాహ్నం 9 గంటలు దాటి 9 గంటల 5 నిమిషాలు కావస్తుంది. ఈ రోజు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని విశాఖపట్నం వాతావరణశాఖ తెలిపింది. తీరప్రాంతంలో వేటకి వెళ్ళటం ప్రమాదమని మత్సకారులకు తెలిపింది.” ఎదురింటిలో పాతకాలం నాటి రేడియోలో గర గరలాడుతూ వినిపించింది. వెంటనే అదేదో టి.వి. లో “దంచవే మేనత్త కూతురా!” సీరియల్ లో అత్త కోడల్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ రెండు ఎపిసోడ్లుగా సాంబారు వండుతున్న ఉత్కంట భరితమైన సన్నివేశంలో మునిగిపోయిన మా అమ్మ తొందరగా వెళ్ళి బట్టలు ఉతకటం ప్రారంభించింది. ఒక మూల మడత మంచం మీద ముసుగుతన్ని ముడుచుకు పడుకున్న మా బామ్మ ఎగిరి నేలమీద దూకి మూడు మొగ్గలేసి వంటగదిలో నుండి ఒకపాత్ర తీసుకుని  పాత సినిమాల్లో కృష్ణలాగ వెనుకనుండి డింగుమంటూ ఒక గెంతులో మా మేడ మీదకి ఎగిరి గుమ్మడి ఒడియాలు పెట్టడం మొదలుపెట్టింది. నాకు దగ్గర్లో పరీక్షలు కూడా ఉండటంతో బాలు బ్యాటు పట్టుకుని మా బ్యాచ్ కోసం ఎదురూచూస్తూ ఇంటి బయట నిలబడ్డా.

ఇంతలో మా బామ్మ కదనకుతూహలరాగంలో “ముక్కాల ముక్కాబులా..” పాట పాడుకుంటూ కిందకు వచ్చి నా చేతిలో బ్యాటును చూసి ఆగింది.

“ఏరా బ్యాటుతో కాకులను కొడతారట కదా! కాసేపు మేడ మీదకు వెళ్ళి కాకులను కొట్టకూడదూ” అంది. (మా బామ్మకి మా తాతయ్య కాకి రూపంలో ఉన్నాడని అనుమానం.)

“అబ్బా బామ్మ ఆ కాకులు ఈ కాకులు కాదే. అసలు ఆ బ్యాటు ఈ బ్యాటు కాదే.” అన్నాను చిరాగ్గా.

అప్పటికే కళ్యాణిరాగంలో “చికుబుకు చికుబుకు రైలే” పాటకి శృతి చేసుకుంటున్న బామ్మ “ఆ కాకులు ఈ కాకులు కానప్పుడు, ఈ బ్యాటు ఆ బ్యాటు కానప్పుడు, ఈ బ్యాటుతో ఈ కాకులను కొట్టచ్చుకదా” అంది.

నా ప్రేమకి “నో” చెప్పిన పక్కింటి పద్మ మీద ఒట్టేసి చెబుతున్నా. మా బామ్మ లాజిక్కేంటో ఇంకా నాకు అర్ధంకాలేదు. కానీ మరలా అడిగితే అసలే సూపర్ స్టార్ కృష్ణ అభిమాని గాల్లోకి ఎగిరి గంట వరకు నేల మీదకి దిగకుండా తంతుందేమో అని భయపడి కాసేపు మా తాత మిత్ర బృందంతో ఆడుకుందామని మేడమీదకి వెళ్ళాను. అప్పటి వరకూ మా మేడ వైపు కనీసం కన్నెత్తి ఛూడకుండా బాగా కునుకుతీస్తున్న కాకులన్నీ కాపలాగా నేను రావటం చూసి దాగుడు మూతలు, చెడుగుడు, కోతికొమ్మచ్చి, టెంకి మీద జెల్ల జాతీయ కాకి జట్టుల్ని పిలుచుకుని మరి నా మీదకి దండయాత్రకి వచ్చాయి.

కాకుల దండయాత్రకి కొంత భయం వేసి “తాత నా తప్పేం లేదు. బామ్మ పంపించింది.” అని ఏడుస్తూ అటూ ఇటూ చూస్తున్నా. మా ఇంటికి కాస్త దూరంలో వేరే మేడ మీద ఒక కొత్తమ్మాయి కనిపించింది. వెంటనే వండే సిరీస్ ఫైనల్ లో 57 బంతులాడి 7 పరుగులు చేసి పిచ్ మద్యలో గర్వంగా నిలబడ్డ ద్రావిడ్ లా ఫోజిచ్చా. నా వైపు అదోలా చూసి “కా కా” అని అరవటం మొదలుపెట్టింది. గిన్నెలో తీసుకు వచ్చిన అన్నం గోడమీద పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ చక్రిలా శ్రావ్యంగా “కా కా” అని అరవటం కంటిన్యూ చేసింది. పాపం వాళ్ళింట్లో ఎవరుపోయారో కాస్త సాయం చేద్దామని నేను కూడా “కా కా” అన్నాను. కాకులన్నీ నా వైపు వెటకారంగా చూసి “ఓర్ని లసాకా బరాబర్” అని నవ్వుకుంటూ, అన్నంలో నంచుకోటానికి వడియాలు తీసుకుని పక్కింటికి వెళ్ళిపోయాయి. (తల్లి తోడు లసాకా బరాబర్ అంటే బూతు కాదు. 50 వేల సార్లు “కా కా” కి బరాబర్ అంటే సమానం. ఇందులో ఒక చిన్న పజిల్ ఉంది అదేంటో చెప్పుకోండి చూద్దాం.)

ఆ అమ్మాయి నిజంగా అన్నం కాకులు కు పెడుతుందా లేక దొంగముండ (ఫెమినిజం జిందాబాద్. ప్రపంచ స్త్రీలంతా నాకు అమ్మ,అక్క మరియు చెల్లెల్లు వారి వారి వయసుని బట్టి. ఆఫీస్ లో నా పక్కన కూర్చునే ఆశ తప్ప కుంజరహ) నా ముందు ఫోజు కొడుతుందా అని తన నోటి వైపు చూసా. ఏమనుకుందో ఏమో నా వైపు అసహ్యంగా చూసి “ఇది నిన్న పాచెక్కిన అన్నం మా నాన్న ఊరిలో లేడని కాకులకి పెడుతున్నా” అంది. నా చూపు అంత అందంగా ఉందని అర్దమయ్యి వెంటనే చూపు మార్చాను. ఆ అమ్మాయి అలా కాకులకి అన్నం పెడుతూ “చందమామ రావే జాబిల్లి రావే” పాట పాడుతుంటే నా మనసు పై ఫ్లోర్ నుండి స్విమ్మింగ్ పూల్ లోకి పడ్డ స్పీడులో ప్రేమలో పడింది. వెంటనే ఎ.అర్.రెహమాన్ మూటముళ్ళూ సద్దుకుని వచ్చి నా ముందు గిటార్ బూజు దులపటం మొదలుపెట్టాడు. ఎలాగో ఒకలా మాటకలపాలని “రేపు మెనూ ఏంటో” అన్నా. “నాదా కాకిదా” అని ఆడిగింది.
“అనంతపురం అడవిలో ఆరు రోజులుగా నీరులేక ఏడుస్తున్న అనాధ కాకి మొహం దానా” అని తిట్టాలని అనిపించినా కరీనా కపూర్ ని కత్రినా కైఫ్ ని కైమా కొడీతే వచ్చిన కన్నడ హీరోయిన్ లా ఉంది అనవసరంగా ఫీల్ అవుతుందేమో అని “కాకి దే” అన్నా.
“మటన్ బిరియాని” అని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
“బామ్మా రైతా వండటం ఎలానో చెప్పవే” అనుకుంటూ నేనూ కిందకి వెళ్ళిపోయా.

మరుసటి రోజు పొద్దున్నే తలకి స్నానం చేసి కొత్త బట్టలేసుకుని రైతా పట్టుకుని మేడ మీద కూర్చున్నా. అ అమ్మాయి వచ్చింది. వస్తూనే “మా ఇంట్లో పులిహోర చేస్తారని నీకెలా తెలుసు రైతా తెచ్చావ్” అని అడిగి నా చేతిలో రైతా లాగేసుకుని పులిహోరలో కలిపేసుకుని తినటం మొదలు పెట్టింది. పులిహోరలో రైతా ఏంటే నీ …. డైలీ సీరియల్ అంత తిట్టు మనసులో తిట్టుకున్నా. అంతా తినేసిందనుకునేరు, మధ్య మధ్యలో కాకులకి కూడా పెట్టింది. నేను కూడా ప్రేమగా కాకులకి పెట్టడం మొదలుపెట్టా. “మీకు కూడా కాకులంటే ఇష్టమా?” అని అడిగింది. “ఎంతమాటన్నారండి కాకి మాత్రం జీవి కాదా? అసలు మన జాతీయ పక్షిగా కాకిని పెట్టాలని నేను నా స్నేహితులతో కలిసి ఉద్యం చేద్దామనుకుంటున్నా. మా బామ్మకయితే మరీను. కాకుల్ని మా తాతతో సమానంగా చూస్తుంది.” అని చెప్పాను. కాకులన్నీ “కా కా” గోల చేసాయి. ఆ అమ్మాయి నా వైపు అనుమానంగా చూసింది. “మీరు నమ్మటం లేదు కదా కావాలంటే చిన్నప్పుడు నేను ఎంత అడిగినా ఇవ్వకుండా ఊరించుకుని కొబ్బరుండ తిన్న ఎదురింటి శీను గాడి మీద ఒట్టు” అన్నాను. పనిలో పనిగా “మీకెందుకండీ కాకులంటే అంత ఇష్టం” అని అడిగా. “ఇష్టమా? గుడ్డా? అదో స్టోరీ” అంది. “మూడున్నర ముక్కల్లో చెప్పటం కుదరదా” అడిగేసా.

“సరిగ్గా మూడేళ్ళ క్రితం నేను ఎంతో కష్టపడి “మీ పక్క ఊరి పెంట సారీ వంట” అనే కార్యక్రమం చూసి బంగాలదుంప,అరిటికాయ,క్యాబేజీ కలిపి కొత్తిమీర కారం పెట్టడం ఎలాగో నేర్చుకున్నా. మా ఇంట్లో బంగాలదుంపలు లేకపోవటంతో దాని బదులు బీరకాయ వేసి కూర వండాను. అదికాస్త రుచి చూపిద్దామంటే మా ఇంట్లో ఎవరూ లేరు. మా కుక్క జిమ్మీకి పెట్టాను. అది వాసన చూసి పెరుగు వెయ్యలేదన్న కోపం తో అనుకుంటా పక్కింటి టామీ తో లేచిపోయింది. చేసేదిలేక ఆకలిగా ఎదురుచూస్తున్న ఒక కాకి కి పెట్టాను. అది తిన్న కాకి ఆనందం తట్టుకోలేక గెంతులు వేస్తూ పాపం అదే అనందంలో గిన్నె (మనుషుల బాషలొ బాల్చీ) తన్నేసింది. అప్పటి నుండి కాకులంటే నాకు వల్లమాలిన అభిమానం” అని ముగించింది. “నీ యంకమ్మ.. అన్ని తెలుగు చానెల్స్ లో సీరియల్లు కలిపినంత పొడుగు తిట్టు మనసులో తిట్టుకుని. ఆ కాకి ఎలా ఉండేదండీ” అని అడిగా.
“నల్ల మొహం, నల్లని ముక్కు, నల్లని రెక్కలు” అని చెప్పటం మొదలుపెట్టింది.
“ఓహో ఆ కాక” అన్నాను.
“మీకు తెలుసా?” ఆత్రంగా అడిగింది.
“నీ.. తెలుగు వికీపీడియా అంత తిట్టూ”
“ఓ చాలా బాగా తెలుసు ఎంత అందంగా ఉండేదో” అన్నాను. కానీ ఆ కాకి చనిపోయిన విషయం మా బామ్మకి చెప్పాలని మనసులో అనుకున్నా. “రేపు మెనూ ఏంటో” మరలా అడిగా.
“నాదా కాకిదా” మరలా అదే ప్రశ్న.
“పెద్ద తేడా ఏముందిలే” అని మన్సులో అనుకుని “మీదే” అన్నాను.
“దద్దోజనం” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇది దద్దోజనం అందంటే ఖచ్చితంగా బిరియానీ తో వస్తుంది. దీనికి బిరియానీలో కొబ్బరి పచ్చడే నచ్చుతుంది అనుకుని కొబ్బరికాయ కొనటానికి బజారుకి బయలుదేరాను.

మరుసటి రోజు ఆ అమ్మాయి టేస్టుకి నచ్చినట్టు గులాబీరంగు ఫ్యాంటు మీద పసుపు పచ్చని షర్టు వేసుకుని కొబ్బరిచట్నీతో మేడ మీద రాత్రి వరకు ఎదురుచూసా. ఆ అమ్మాయి రాలేదు. విషయం కనుక్కుందామని వాళ్ళింటికి వెళితే ఇల్లు తాళం వేసి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వ్రాసిన అకౌంట్స్ అర్ధంకాక మేనేజర్ కి పిచ్చేక్కి వాళ్ళావిడా చెవికొరికాడంట. దానితో మేనేజర్ బందువులంతా దీనికి కారణమయిన వాళ్ళ కుటుంబలో ఎవరయినా దొరికితే ముక్కు కొరుకుతామని ప్రతిఙ్ఞ్ చేసారంట. అందుకే రాత్రికి రాత్రే వాళ్ళ కుటుంబమంతా పారిపోయారు.

అప్పటి నుండి ఆ అమ్మాయికోసం వెతకని కాకి గూడులేదు. ఆ రోజు వండిన కొబ్బరి చట్నీ అలానే పట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నా. పేరు కూడా తెలియక “కా కా” అంటూ అరుస్తూ తిరుగుతున్నా. అదిగోండి అక్కడెవరో కాకులకి అన్నం పెడుతున్నట్టు ఉన్నారు. కాకి గోల వినిపిస్తుంది. మరలా కలుస్తా.. కా.. కా…హెలో కా..కా..

జావా జావా కన్నీరు

పొద్దున్నే అయ్యప్ప పూజ చేసుకొని కిటికి తలుపు తెరిచా పక్షులింకా అప్పుడే బ్రష్ చేసుకోవటం మొదలు పెట్టాయి. నేను స్నానం కూడా చేసాను అని వాటికి తెలియాలని బట్టలు శబ్దంవచ్చేలా పదిసార్లు దులిపి తీగమీద వేసి వచ్చా. లేకపోతే సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ప్రతి ఒక్కడికి లోకువే. “మా లంచ్ అయితే గాని పక్కమీదనుంచి లేవని సాఫ్ట్ వేర్ వాళ్ళు” అని పక్షులు ఒక సామెత కూడా పెట్టేసుకున్నాయి. ఈ రోజుకి వాటి తిక్కకుదిరింది.

పిచ్చుక 1: కిచకిచ కిచ్ కిచ్ కీచ్ కీచ్  (తెలుగులో: ఏంటే మనోడు ఈ రోజు పొద్దున్నే లేచాడు. ఏంటి సంగతి?)

పిచ్చుక 2: కిచో కిచ కిచోకిచ కిచకిచే కిచ కిచకిచే కిచ కిచ్చు కిచ్చు కిచ్చు కిచ్చు   (తెలుగులో: నిద్రపట్టక. మాబావ స్వాలో అమెరికా లోని లీమన్ బ్రదర్స్ లో గూడు కట్టుకొని ఉన్నాడు తెలుసుగా వాడు నిన్నే మెయిల్ పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యమని. అమెరికాలోని ఆర్ధికమాంధ్యనికి ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎలాగు మూసుకోవాలి. ఇళ్ళులేని భారతీయ పక్షులన్నింటికీ హైటెక్ సిటీ లో గూళ్ళు కట్టి అమ్ముకో అని. అదీ వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని నిద్రపట్టక లేచుంటాడు.)

వెంటనే నేను కిటికి మూసేసి, కర్టేన్ వేసి లోపలికి వచ్చేసా.

కాసేపు అష్టాచెమ్మా,గుడుగుడు గుంచం ఆడుకున్నాం. కోతికొమ్మచ్చి, కబడ్డీ, కర్రాబిళ్ళ ఆడుకుందామంటే స్థలాభావం. అందుకే “ఎక్కడి సెల్లులు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డీ” ఆడుకున్నాం.(ఆట నియమావాళి: 1.అందరూ నిజాయితీగా ఆడాలి. 2.రూం లో ఉండే వారు, అమీర్ పేట హాస్టల్లో ఉండేవాళ్ళు బయట వారిని ఆడించకూడదు. 3.కొద్దిరోజులముందే సెల్లు పోగుట్టుకున్న నాలాంటి వారిని ఆడించేప్పుడు తగిన జాగర్తలు తీసుకోవాలి. 4.మీ సెల్లు గాని దొంగ సెల్లు అయితే సెల్లు యజమాని ఉన్నప్పుడు ఆడరాదు. ఆట విధానం: 1 .మొదటగా పంటలు వేసుకోవాలి. (పొలం లో వేసేవి కావు.) 2.దొంగ ఎవరో తెలిసాక వాడి సెల్లు తీసి పండిన వారు దాచేయాలి. 3.దొంగ పసిగట్టకుండా ఎప్పటికప్పుడు స్థలాలు మార్చాలి. 4.చివరగా ఎవరు దాచినప్పుడు దొంగ సెల్లు పట్టేసుకుంటాడో వాడు తర్వాతి ఆటకి దొంగ. ముఖ్య గమనిక: ఇక్కడ చెప్పబడిన ఆటలో జాగర్తవహించకుండా ఆడి సెల్లు పోగొట్టుకుంటే దానికి పూర్తి భాద్యత జానారెడ్డి గారిది. నైతికభాద్యత వహిస్తూ అమ్మ ఆదేశానుసారం ఆయన రాజీనామా చెయ్యాలి. జై ఉండవిల్లి)

గతంలో ఎప్పుడూ అంత పొద్దున్నే లేచిన అనుభవంలేదు. ఆ టైం లో ఏం చేస్తారో తెలియదు. పోని బయటకి వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారో చూద్దమంటే చలి. ఇక గత్యంతరం లేక టి.వి. పెట్టా.

టి.వి.99: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి పిల్లనివ్వటానికి మీరు సిద్దమా? (మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.) మీ సమాధానం అవును అయితే ఎఱ్ఱగడ్డ పిచ్చి ఆసుపత్రి కి ఫోన్ చెయ్యండి. కాదు అయితే మీ పక్కింట్లో అద్దెకుండే సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు మీ అమ్మాయి మీద కన్నేసారు జాగర్త.

టి.వి.55: ఆర్ధికమాంధ్యంతో చివరికంటా పోరాడి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కుటుంబాలకి మీ సానుభూతి తెలియజేయాలనుకుంటే హైటెక్ సిటీ ముందు కొవ్వొత్తులని వెలిగించండి.

టి.వి. 100: @$!^*!*!)(*%%!$$

టి.వి. 1000000000000001: !@!^$%!!)*!*(!

టి.వి. ఆపేసి ఆఫీస్ కి బయలుదేరాను.

నేను: ఆటో లైఫ్ స్తైల్ కి వస్తావా?

ఆటోవాడు: 100 అవుతుంది.

నేను నా ట్యాగ్ తీసి మెడలో వేసుకున్నా.

ఆటోవాడు: సాఫ్ట్ వేరా?(సంతోషం సినిమా లో బ్రహ్మానందం డబ్బాపాలా అని అడిగినట్టు)

నేను: అవును. (దీనంగా మొహం పెట్టి)

ఆటోవాడు: ఊరుకోండి సార్. కష్టాలు సాఫ్ట్ వేర్ వాళ్ళకి కాకపోతే మనుషులకి వస్తాయా? ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు చేదోడు గా ఉండాలి. 30 ఇవ్వండి చాలు.

కట్ చేస్తే మొత్తానికి ఆఫీస్ కి వచ్చిపడ్డా. డబ్బుల్లేక ఆటోవాడికి సొడెక్సో ఇచ్చా. ఆఫీస్ లో అడుగు పెట్టగానే పవన్ గాడు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్నాడు.

నేను: “ఏమయ్యింది రా?”

పవన్: నాకు లీవ్ కావాలి రా. ఆర్.ఆర్.బి., బ్యాంక్ పుస్తకాలు కొనడానికి కోఠికి వెళ్ళాలి. సరోజ తెలుసు గా?

నేను: ఎవరు నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్న 20 లక్షలతో షాపింగ్ చేసిన అమ్మాయే గా ఎలా మరిచిపోతా?

పవన్: అవునవును. గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోకపోతే, నన్ను పెళ్ళి చేసుకోను అంది. పోని మరో అమ్మాయిని చుసుకుందామంటే అప్పులివ్వటానికి బ్యాంకులన్నీ ఎత్తేస్తున్నారుగా.

అని హడావుడి గా మా పి.ఎం. ని కలిసాడు. మా పి.ఎం. “ఏంటయ్యా నీ గోల? రోలొచ్చి మద్దెలకి మొరపెట్టుకోవటం అంటే ఇదే. ఇటు ఉద్యోగం సవ్యంగా లేక అటు స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బులుపోయి నేను ఏడుస్తుంటే? వెళ్ళి ఏదో ఒకలా తగలడు” అని పవన్ గాడిని పంపేసాడు. నేను వెళ్ళి నా క్యూబ్ లో కూర్చున్నా. హాసిని ప్రమోషన్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు తీసేసే కాలంలో ప్రమోషన్ ఏంటబ్బా నాకర్ధం కాలేదు. వాళ్ళ టీం లో ఉండే రాజేష్ ని అడుగుదామని కాల్ చేసా.

నేను: హలో

రాజేష్: అవును నేనే తాజ్ హోటల్లో చనిపొయింది. నా పేరు ఇమ్రాన్. మాది పాకిస్థాన్.

నేను వెంటనే బయపడి ఫొన్ పెట్టేసా. కాసేపట్లో కొందరు వైట్ డ్రెస్ లో వచ్చి రాజేష్ తో పాటు మరికొందర్ని గొలుసులు కట్టి తీసుకుపోయారు. జీవితంలో ఇచ్చిన ఒకేఒక్క సెమినార్ తో 10 మందిని మతిస్థిమితం లేకుండా చేసి హెడ్ కౌంట్ తగ్గించినందుకు హాసిని కి ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా మరిన్ని సెమినార్లు చెప్పించాలని మేనేజ్మెంట్ అనుకుంది. ఏదో మెయిల్ చూసుకుంటున్నా.

ఫోన్ వచ్చింది. “సర్! నేను హెచ్.ఎస్.బి.సి. నుంచి మాట్లాడుతున్నా క్రెడిట్ కార్డ్”

నేను: నాకొద్దు.

“ఏడ్చావ్. అదే మేమూ చెప్పేది మీ కార్డ్ క్యాన్సిల్ చేసా పో” ఫొన్ పెట్టేసింది.

నా ఖర్మకి ఏడ్చి కాఫీ త్రాగుదామని వెళ్తుంటే (ఆఫీస్ లో కాదు బాబు. ఆఫీసుల్లో ఎప్పుడో ఎత్తేసారు) మా పి.ఎం. వచ్చి హాసిని ఏదో సెమినార్ అంటా నువ్వుకూడా వెళ్ళు అన్నాడు. విషయం అర్దమయ్యింది “సార్ పొద్దున్నే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అప్పటి నుండి కడుపులో నొప్పిగా ఉంది ఈ రోజు కి ఇంటికి వెళ్ళిపోతా” అని చెప్పి ఆయన ఏం చెబుతున్నాడో కూడా వినకుండా వచ్చేసా.

బయట ఒక కుర్రాడు ఏవో కరపత్రాలు పంచుతున్నాడు. మెడలో ట్యాగ్ వేసుకొని ఉన్నవాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. నన్ను చూసి “గురూ తీసుకో పనికొస్తుంది” అని ఇచ్చాడు.

అందులో వివరాలు.. ప్రత్యమ్నాయ ఆదాయం కోసం కోచింగ్ సెంటర్. కోర్సులు

1. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా పల్లీలు, భఠాణీలు అమ్ముకోవటం ఎలా?

2. మిర్చి బజ్జీ తయారీ విధానాలు.

3. దర్జాగా వచ్చి సెల్లు,ల్యాప్పీ పట్టుకొని పారిపోవటం ఎలా?

4…….

5…….

అదిచదువుతూ ఆటోని పిలిస్తే ఆటో వాళ్ళు అదోలా నా వైపు చూసి వెళ్ళిపోతున్నారు. ఒక ముసలి ఆటోడ్రైవర్ వచ్చాడు. “రా బాబు. భాదపడకు. ఆ భాద నాకు తెలుసు నాకూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన కొడుకు,అల్లుడూ ఉన్నారు” అని కన్నీళ్ళతో ఆటోలో తీసుకు వచ్చి డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నాకేమి అర్ధం కాలేదు. నేను రావటం చూసిన నా శతృవులైన పిచ్చుకలు తినటం మానేసి వచ్చి అన్ని గుమిగూడి ఒకదాని రెక్కలు ఒకటి పట్టుకొని నా వైపు చూసి ఆనందంగా నవ్వుతూ అరకులోయలో గిరిజన యువతులు చేసే థింసా నృత్యం చేయటం మొదలు పెట్టాయి. “కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో” ఏరోజూ బియ్యం ఏరినప్పుడు కూడా ఒక్క గింజ వేసిన పాపాన పోలేదు నన్ను చూసి ఇంతలా పండగ చేసుకుంటున్నాయేంటి ఏం అర్ధం కాలేదు. బెల్ల్ కొడితే తలుపు తీసిన మా సన్నీ గాడు నన్ను చూసి భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.

నేను: “ఏమయ్యింది రా?”

సన్నీ: “నా ఉద్యోగం ఎలాగూ పోయింది. నీ ఉద్యోగం ఉందన్న ధైర్యం తో ఉన్నడబ్బులన్నీ పెట్టి బియ్యం కూరగాయలు తెచ్చేసా. గ్యాస్ ఆర్డర్ చేసా. లాండ్రీ కి బట్టలు కూడా ఇచ్చా. వా……ఆ డబ్బులే ఉంటే బస్సెక్కి అమలాపురం పోయి పాలవ్యాపారం చేసుకునేవాడిని.. వా….”

నేను: సరే ఇప్పుడేమయ్యింది?

సన్నీ: నీ చేతి లో ఆ పింక్ స్లిప్ ఏంటీ?

నేను: ఓర్ని చంపేసారు పో. అదా అందరు అలా అనుకోవటానికి కారణం.అది కరపత్రమ రా..బాబు.

హాసిని కి పెళ్ళి చూపులోచ్…

(గమనిక: హాసిని పాత్ర పూర్వాపరాలు తెలుసుకోవాలనుకుంటే హ హా హాసిని చదవండి. చదవకపోయినా ఈ టపాని చదవటానికి ఇబ్బందిలేదు. )

“ఏంటి మురళీ ఏం చేస్తున్నావ్ ? అలా బయటకి పోయివద్దాం రాకూడదూ” అంటూ వచ్చారు శ్రీ శని గారు. అసలే ఆయన నా చిరకాల మితృడు, తరతరాలుగా మా కుటుంబానికి ఆప్తుడు.
“అయ్యా! తమకేంటి ఇంత ప్రొద్దునే నా మీద ఇంత అభిమానం” అన్నాను.
“ఎన్ని సార్లు చెప్పానయ్యా నిద్రలేస్తూనే అద్దంలో ముఖం చూసుకోవద్దని. వింటావా? వినవు. నేను రాక తప్పింది కాదు” అన్నారు శనిగారు.
“ఏంటో ఎన్నిసార్లు మానుకుందామన్నా ఈ వెధవ అలవాటు మారటం లేదు. ప్రొద్దునే లేస్తూనే ముఖం ఎలావుంది, జుత్తి రేగిందా అని చూసుకోవటం అలవాటయ్యింది” అంటూ మనసులో కాదు బయటకే తిట్టుకున్నా. మనసులో అనుకున్నా ఆయనకి ఎలాగు తెలిసిపోతుందిగా.
“ఎంతవరకూ?” అన్నాను.
“భూమి మీద ఇంకా నీ నూకలు చెల్లిపోలేదులే. అదుగో నీకోసం అన్నపూర్ణా వాడు ఆట్టా, మైసూర్ సేండిల్ వాడు సబ్బులు, రోగాలకి రాన్ బ్యాక్సీ వాడు మందులు …. అన్ని ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి లే. బయపడకు పదా” అన్నారు శనిగారు శూన్యంలోకి చూస్తూ.
”ఆమాత్రం హామీ ఇచ్చారు చాలు. పదండి. గురువుగారు నాకో మంచి స్నేహితురాలుంది తనని మీకు పరిచయం చేస్తా నన్నొదిలి తనతో దోస్తీ చెయ్యకూడదూ ?” అడిగాను ఆశగా.
“మొదట పరిచయం చెయ్యు తర్వాత ఆలోచిస్తాను.” ఆయన నవ్వులో ఏదో చిద్విలాసం. ”హమ్మయ్యా ఇది బాగుంది పదండి” మానవడు ఆశాజీవి.

అలా ఆయన్ని ఒక కాఫీషాపు కి తీసుకొని వెళ్ళా. ఎదురుగా ద గ్రేట్ హాసిని. ఇక ఈ రోజుతో దీని పని కట్టు. శనిగారు దీని తో స్నేహం చేస్తే దీని నోరు పడిపోతుంది. మాట్లాడకుండా ఇది ఎలాగూ బ్రతకలేదు కాబట్టి నరసింహా లో రమ్యకృష్ణలా ఒక చీకటి గదిలోకి పోతుంది.నన్ను ట్రైనులో పెట్టిన హింసకి ఇదే సరైన ప్రతీకారం. ఒక వేళ కర్మకాలి శనిగారి ప్రభావం చూపించలేకపోతే  ఈ వాగుడుకాయ ఎలాగూ ఈయన టెంకి పీకి  లోపలున్న గుజ్జంతా నంజుకుతినేస్తది. ఆయన జన్మలో ఎవరి జోలికి రాడు, రాలేడు. కాబట్టీ ఏవిధంగా చూసిన నాకే లాభం అనుకుని సంబరపడుతున్నా.
“హాయ్ శనిగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య అసలు కనిపించటం మానేసారు?” అని 32 పళ్ళలో 30 కనబడేలా నవ్వుతూ అడిగింది హాసిని. నాకు కళ్ళు బైర్లుకమ్మి ఆ మెరుపులో మా జేజమ్మవాళ్ళ అమ్మమ్మ కనిపించింది. పాపం బాగా చిక్కిపోయింది 😦

“ఏం లేదు రా కన్నా ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ మెదడుకి మేత పనులేగా. శుభకార్యాలేవీ చేయటం లేదు నాకు మరి పనిపడటం లేదు” ఈయనగారు చెబుతున్నారు ఎక్కడలేని ప్రేమా ఒలకపోస్తూ. (గమనిక: మెదడుకి మేత అనగా మేకలాగ మెదడు మేసేయ్యటం.)
నేను ఏడుపులాంటి నవ్వు తో అక్కడ నిలబడ్డాను. నా ఏడుపు మునుపు డోలు శబ్ధంలా ఉండేది, ఇప్పుడు మద్దెల లా ఉంది ఎందుకో మరి.

ఇంతలో హాసిని ఎవరికో మెదడువాపు తెప్పించాటనికి (తగ్గించటానికి కాదు కేవలం తెప్పించటానికి) పక్కకి వెళ్ళింది. మంచి తరుణం మించిన దొరకదు అని పిచ్చికుక్క తరిమినట్టు పరిగెడుతూ వచ్చి ఇంటి దగ్గర పడ్డాను. నా వెనుకే శనిగారు దారిలో ఉన్న పనులు పూర్తి చేసుకోని వచ్చారు. “ఈవిడ మీకెలా తెలుసు స్వామీ?” అన్నాను.
“అసలు ఆవిడ నీకు పరిచయం  కావటమే నా ప్రభావం వలన. నీకో విషయం చెప్పనా” అని ఒక చిన్న పిట్టకధ చెప్పారు. అదే హాసిని పెళ్ళి చూపుల కధ.

హాసిని ఎప్పటిలాగే ఆఫీస్ కి టైముకి వచ్చేసి సిన్సియర్ గా చాటింగు చేసుకుంటూ ఉంది. ఇంతలో తనని పెళ్ళి చూపులు చూసిన 18 వ పెళ్ళికొడుకు ఉదయ్ కిరణ్ పింగ్ చేసాడు. వాడి బాసుగారి కూతురి స్నేహితురాలయిన రమ్య లేచిపోయి పెళ్ళిచేసుకున్న విషయం చర్చించాక, ఆఫీస్ ప్యూన్ సుబ్బారావు పట్టబుర్ర మీద ఈకలు మొలవక పోవటనికి కారణాం గురించి గొడవ పడుతున్నారు. ఇంతలో 19 వ పెళ్ళికొడుకు రాంచరణ్ “నాకిష్టమయిన పాట మౌనమే నా భాష ఓ మూగ మనసా ” అని మెసేజ్ పెట్టాడు. అప్పుడే రాబోయే పెళ్ళికొడుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు. రింగ్ టోన్ లోనే “మే..మే..” అని మేక అరుపు వినిపించింది. బకరా వాసన కొత్త బకరా వాసన అని హాసిని లోని వాగుడు దెయ్యం ఫోన్ ఎత్తింది.  “ఈ పాటికి మీ ఇంట్లో వాళ్ళు నా గురించి చెప్పే ఉంటారు. రేపు శనివారం సెలవు కదా కలుద్దామా?” అని అడిగాడు.  ఆ విషయం మీద ఒకగంట మాట్లాడిన తరువాత “సరే రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

శనివారం ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు నేను బయలుదేరాను మీరు రెడీ అవ్వండి అని. ఇక తప్పదని హాసిని 9 గంటలకే లేచి తయారవ్వటం మొదలు పెట్టింది. పవన్ మేఘాల్లో తేలిపోతూ,పాట పాడుకుంటూ వస్తున్నాడు. “హహ హా హహ హా హాసిని నీ నవ్వుల్లో ఎవరునట్టూ…. మేరి సఝనా.. మేరి సఝనా..  ధడేల్ ధడేల్ డమాల్”  శనిగారు ఎంట్రీ వలన వచ్చిన శబ్ధం. పవన్ ఆగి ఉన్న ఆటో ని అరవై కిలోమీటర్ల వేగం తో గుద్ది ఎగిరి, అంబులెన్స్ టాపు మీద పడ్డారు. ఆయన బైకు జారుతూ పోయి 108 క్రిందకి దూరింది. హాసిని కాసేపు ఆయన కోసం చూసింది రాలేదు. ఫోన్ చేసింది ఎత్తలేదు. సర్లే అని అన్నపూర్ణా మెస్ కి వెళ్ళి ఆంధ్రా తాలి తెప్పించుకొని దానిలోకి సర్వర్ ని నంజుకొని తినేసింది.

ఇది జరిగిన నెల రోజులకి పవన్ కోలుకుని పట్టు వదలని పప్పూ మరలా పరీక్షలు రాసినట్టుగా పెళ్ళిచూపులకి మరోసారి సిద్దపడ్డాడు. శనివారం కలిసి రాలేదని ఆదివారం ఫోన్ చేసి బయలుదేరాడు. కూకట్ పల్లి నుండి ఎర్రగడ్డ వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. పిడుగులతో కూడిన వర్షం. వరదగా వచ్చిన నీటిలో పవన్ బైకు కొట్టుకుపోయి ఒక మేన్ హోల్ లొ ఇరుక్కుంది. ఈతరాని పవన్ ని భద్రతాదళాలు కాపాడాయన్న వార్తని బావర్చి లో ఇస్మాయిల్ తో  మాటాడుతూ బిరియాని తింటూ ఉన్న హాసిని కి టి.వి. చూస్తే గాని తెలియలేదు.(అమ్మతోడు సదరు ఇస్మాయిల్ ఎవరో నాకే కాదు హాసినికి కూడా అప్పటి వరకు తెలియదు)

అయినా పవన్ మరలా ఆదివారం రాగానే నేను రెడీ అని పోన్ చేసాడు. ఈ సారి హాసిని హృదయం చలించింది. పెళ్ళిభోజనాల్లో లో ఎంగిలి ఆకు కోసం ఎదురు చూస్తున్న మున్సిపాలిటి కుక్కలా తనకోసం ఎదురు చూస్తున్న పవన్ మీద మంచి అభిప్రాయం కలిగింది.వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి, జేబులో నిమ్మకాయలు పెట్టుకుని బయలుదేరిన పవన్ ఏ ఆటంకాలు లేకుండా వచ్చేసాడు. మేడమీదనుంచి దిగి పవన్ ని చూసిన హాసిని కెవ్వుమన్న కేకతో పడిపోయింది. తుమ్మ మొద్దుకి, తారుడబ్బా కి పుట్టిన సింగరేణి బొగ్గులా ఉన్నాడు. ఐరన్ లెగ్ శాస్త్రిని తలపై సుత్తి దెబ్బలేసి ఎత్తు తగ్గిస్తే  ఎలా ఉంటాడో అదే ఆకారం లో (నిరాకారమేమో?) గుండ్రంగా ఉన్నాడు. కరెంట్ పోతే ఎక్కడున్నాడో పోల్చుకోవటానికి కళ్ళే ఆధారం, ఎందుకంటే పళ్ళు కూడా తెల్లగా లేవు.

పవన్ హాసిని ని ఐ-మాక్స్ కి తీసుకెళ్ళాడు. పవన్ ఉత్సాహం కోసం కాఫీ తాగితే, హాసిని షాక్ నుంచి తేరుకోవటానికి ఐస్ క్రీం తీసుకుంది. అయినా తనకోసం కష్టపడ్డ పవన్ మీద ఏదోమూల మంచి అభిప్రాయం. మొదటిసారిగా హాసిని నోటికి తాళం వేసిన మొనగాడు పవన్ (మాటలు ఆపినవాడే మొనగాడు). ఇద్దరుకాసేపు మాట్లాడాక ఇక వెళ్దాం అనిలేచింది. సరే హాసిని హాస్టల్ దగ్గరలో ఉందనగా ఒక స్నేహితురాలు స్వప్న కనిపించింది. హాసిని గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇతను ఎవరంటే ఏం చెప్పాలి? ఏమని చెప్పగలదు, ఎలా చెప్పగలదు. హమ్మో తన పరువు ప్రతిష్టలు. స్వప్న బాగా దగ్గిరకి వచ్చేసింది. చేయి చాపింది. హాసిని కూడ చేయి చాపింది. కానీ స్వప్న చేయిని పవన్ ముందు అందుకున్నాడు. అయిపోయాను మొత్తం చెప్పేస్తాడు అనుకుంది హాసిని.
“మీరేంటి ఇక్కడ” అని అడిగింది స్వప్న.

“హాసిని ని కలవటానికి వచ్చా అని ” చెప్పాడు పవన్.

హాసిని ని ప్రక్కకి తోసేసి ఇద్దరూ ఆపకుండా పలకరింపులు, కష్టసుఖాలు కొనసాగించేస్తున్నారు. జీవితం లో వాగుడు తో తనకే చెక్ పెట్టిన జంటని మొదటసారి చూస్తుంది హాసిని.
హాసిని షాకు తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం  నడిరోడ్డుమీద కళ్ళు తిరిగి పడబోయింది. ఆకలి వల్లనేమో అని స్వప్న,పవన్ హాసిని ని అన్నపూర్ణా రెస్టారెంటులోకి తీసుకెళ్లారు.
చికెన్ బిరియాని తెప్పించుకొని దుమ్ములురిచుకుంటూ,జోకులేసుకుంటూ హాసిని తింటుందో లేదో కూడా పట్టించుకోకుండా మాట్లాడేసుకుంటున్నారు స్వప్న,పవన్.వారి తిండి చూసిన హాసిని పక్షి జాతి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో అనుకుంది. వాళ్ళు మాత్రం పరుశరాముడు క్షత్రియ జాతిని నిర్మూలించినట్టు, ఆంధ్రప్రదేశ్ లో కోడీజాతిని నిర్మూలించటమే లక్ష్యంగా తింటూనే ఉన్నారు. అప్పటికే అటూ ఇటూ తిరిగిన సర్వరుకి ఆయాసం వచ్చింది. వండుతున్న వంటవాడికి గుండె నొఫ్ఫి వచ్చింది. ఇక ఆగలేక “మా దగ్గర కోళ్ళు లేవు. మేకలు,గొఱ్ఱెలు మీ దాటికి తట్టుకోలేక పారిపోయాయి. ఇక నేనే మిగిలాను నన్ను తినండి” అని టేబులెక్కి ప్లేటులో కూర్చున్నాడు సర్వరు. వాళ్ళకి ఎంత జాలేసిందంటే అంతజాలేసింది. “పచ్చిమాసం ఎలా తింటాం” అంటూ లేచారు.
ఒకగంట తరువాత పవన్ ఇద్దరికి చెప్పి బయల్దేరాడు. హాసిని స్వప్న ని బర బరా ఈడ్చుకొని లాక్కేల్లి అసలు వాడు నీకెలా తెలుసే అని ఆడిగింది. “ఏముందే మొన్న కుటుంబమంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. పైగా పెళ్ళిచూపుల్లో మూడు రోజులు మా మూడు గేదెలు కష్టపడి ఇచ్చిన జున్నుపాలని జున్ను చేస్తే ముప్పై నిమిషాల్లో ముక్క మిగల్చకుండా మింగేసి నాకు జున్నంటే చాలా ఇష్టం. మీరే చేసారా. బాగుంది. అని ఒక పొగడ్త నా మొహాన పారేసి ఏ విషయం ఇంటికి వెళ్ళాక తెలియజేస్తాం అన్నారు. ఆ రోజు వాడి తిండికి జడుసు కున్న మా అక్క కొడుక్కి జ్వరం పట్టుకొని 10 నిమిషాల్లో 13 విరేచనాలయ్యాయి. ఇంకా గ్లూకోజు బాటిల్లు ఎక్కిస్తూనే ఉన్నారు. ఈ రోజు బిల్లు ఎలాగూ వాడిదే కదా అని ఒకపట్టు పట్టా  ” అని చెప్పింది స్వప్న.హమ్మయ్య పొరపాటున తను బిల్లు కట్టడానికి కమిటవ్వలేదు అనుకుంది హాసిని.

పదిరోజుల తరువాత పవన్ కి స్వప్న కి పెళ్ళయిపోయింది. హాసిని తనని చూడటానికి వస్తా అన్న  21 వ పెళ్ళికొడుకు  మహేష్ బాబు ని రావొద్దని చెప్పింది

బందరు మామయ్య – బంగారు బాతు

అర్దరాత్రి ఎనిమిది గంటలయ్యింది. అందులోనూ ఆదివారమో ఏమో నేను మంచి శవాసనం లో ఉన్నా. సెల్లుఫోను నిద్రలేచి గోల చేస్తుంది. మా ఇంటిలో వాళ్ళు నిశాచరుల్లా అప్పుడే 6 గంటలకి లేచి పనులు చేసుకుంటున్నారు. సెల్లుగోల నా చెవిన పడితే నా నిద్ర పోతుందని మా మమ్మీ వంట చేస్తున్నది కాస్త పరుగున వచ్చి అందుకుంది. ఫోను ఎత్తిన 2 నిమిషాలకి కెవ్వుమని కేక వేసి అమ్మా ఇలా రా అంటూ మా అమ్మమ్మ ని పిలిచింది. ఆ దెబ్బకి నేనే కాదు ప్రక్కవీధిలో అప్పుడే పోయిన పంతులుగారు కూడా ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు. ఎమయ్యిందో అర్దమయ్యేలోపే మరో కెవ్వు. మా అమ్మమ్మ ఈ సారి నాకు గూబలు అదిరిపోయి దిండు తో చెవులు మూసుకున్నా. పంతులు గారు ఈ సారి జడుసుకొని పడి ‘పోయారు ‘. ఇంకో కెవ్వు పంతులు గారి కుటుంబ సభ్యులు. ఇన్ని కెవ్వులతో లేచాను ఈ రోజు ఎదో మూడింది అనుకున్నా. తాపీగా కాఫీ త్రాగుతూ అడిగా ఈ కెవ్వులకి మూలం ఏంటని. మరలా మా అమ్మమ్మ ఎదో అరిచేదానిలా హావభావాలు పెట్టింది. నేను దడుచుకొని మూల దాక్కున్నా. మా మమ్మీ కాస్త స్థిమిత పరిచి విషయం చెప్పింది బందరు మామయ్య వస్తున్నాడు రా. అమ్మమ్మ చేసే బందరు లడ్డూ తప్ప బందరు మామయ్య ఎవరో తెలియదు నాకు. మా మమ్మీ ప్రోద్భలంతో నా కళ్ళ ముందు రింగులు తిరుగుతున్నాయి, సీలింగు మీద ఫ్యానులా.

నేను పుట్టక మునుపు 30 ఏళ్ళ క్రితం, అంటే బ్లాక్ & వైట్ కాలం రింగులు తిప్పుకుంటున్నారా? అలా అనుకున్న వాళ్ళంతా పప్పులో కాలేసినట్టే. అప్పుడు కూడా చెట్లు పచ్చరంగులోనే ఉండేవిట, మనుషులు రంగుల బట్టలే వేసుకుండే వారు ‘ట ‘ .  కాబట్టి మీకు పూర్తి రంగుల ప్రపంచం ఊహించే అవకాశం ఉంది రెచ్చిపొండి. మా అమ్మకి పెద్దన్నయ్య ప్రకాశం మంచి చురుకైన కుర్రాడు. ఊరిలో అందరి సమస్య లని పట్టించుకొనేవాడు (దూరేవాడు.). అందుకే తనని అందరూ అభిమానం తో బలదూర్ అని పిలిచేవారు. అప్పటిలోనే అభ్యుదయ భావాలతో పక్కవారి పొలం లో చెరుకులు, తోటల్లో మామిడి కాయలు కోసుకొచ్చి తన బ్యాచ్ కి ఇచ్చేవాడంట. ఒకసారి బెల్లం చేస్తుంటే తేవటానికి వెల్లి కంగారు లో ఏదో తన్నేస్తే గుడిసె మొత్తం తగలబడిపోయిందంట. దానితో అటునించటే ఊరొదిలి పారిపోయాడంట. పోయి బందరులో ఉన్న ఇద్దరుపెళ్ళాల షావుకారు దగ్గర పనికి కుదిరాడు. అలా బందరులోనే ఉండిపోయి బందరు మామయ్య అయ్యాడు. మామయ్య చేరిన కొన్ని రోజులకే షావుకారు గారి మొదటి పెళ్ళం పోయింది అవిడే వండిన ఉప్మా తిని. రెండో పెళ్ళాం తప్పిపోయింది (పాలవాడితోనో? పూలకొట్టు వాడితోనో?) ఇద్దరికీ పిల్లలు లేరు షావుకారు గారుకూడా మూడో పెళ్ళి కోసం పెళ్ళి చూపులకి వెళ్తూ కారు కి అడ్డంగా గేదెలు రావటంతో రోడ్డు ప్రక్కన చెట్టుని గుద్ది పోయారు.వారసులు లేని ఇంటికి వాసాలుపట్టుకొని వేలాడినందుకు మా మామ్మయ్య పంట పిచ్చిగడ్డి పండినట్టు పండింది. అయినా ఇంకా బందరు చూరు పట్టుకొనే వేలాడుతున్నాడు. మధ్య లో ఒకటి రెండుసార్లు పెళ్ళిలకి,పేరంటాలకి వచ్చేవాడంట. ఒక్కగానొక్క కూతురున్న తిక్కశంకరయ్య కూతుర్ని పెళ్ళి చేసుకొని తన అంతస్థు పెంచుకున్నాడు. పెళ్ళి తరువాత పూర్తిగా రావటమే మానేసిన మామయ్య ఇన్నాళ్ళకి వస్తున్నాడు. అది కెవ్వుల కధ.

మామయ్య కి ఒక్కగానొక్క కూతురు తన పెళ్ళి విషయం మాట్లడటానికి వస్తున్నాడంట.
“మనూర్లో ఎవరున్నారే “అన్నా.
“నువ్వేరా బడుద్దాయి” అంది అమ్మమ్మ.
అంత డబ్బున్నవాడు నాకెందుకు పిల్లనిస్తాడు అని నాకు అనుమానం. తెగిన బంధుత్వం కలుపుకోటానికి అని వచ్చింది సమాధానం.
నాకు ఇప్పుడు కొంచెం సిగ్గు మొదలయ్యింది. “పేరేమిటో?” నేను సిగ్గుపడుతుంటే నాకే ఏదోలా ఉంది.
“గజాల” చెప్పింది అమ్మమ్మ.
హ.. పేరు గజాలాన. సూపర్. ఆ రోజు రాత్రి కలలో “నన్ను ప్రేమించే మగవాడి వి నువ్వే అని, చేయి కలిపే ఆ మొనగాడివి నువ్వే అని”
మంచం మీద డిస్కోడాన్స్ చేయటం మొదలుపెట్టా. గజాల ఐస్ క్రీం తిందువు రా అంటే తీసుకోబోయా. దబ్ కళ్ళు బైర్లు కమ్మాయి మంచం క్రింద అమ్మమ్మ మీద పడ్డా. అమ్మమ్మ ఒక మొట్టికాయ వేసింది. లేచి మంచం మీద పడుకున్నా.
మరలా గజాల “అప్పుడే ఏం పడుకుంటావ్ లే మరో పాట వేసుకుందాం అని పిలిచింది.”
“నేను ఊహూ..అమ్మమ్మ” అన్నా. తనుమాత్రం “నో. అని ఆకాశం తనరెక్కలతో నను నిద్దురలేపి..”‘ అని నాకు నిద్ర లేకుండా చేసింది.

తెల్లారే సరికి అమ్మమ్మ 10 కేజిల సున్నిపిండి తెప్పించింది. ఏవన్నా పిండి వంటలు చేస్తున్నారేమొ మామయ్యకోసం అనుకున్నా. కానీ నా కాళ్ళు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి మమ్మీ,అమ్మమ్మ, మా పనోడు అందరు కలిసి ఉదయాన్నెప్పుడో మొదలుపెట్టి లంచ్ టైం లో వాళ్ళకి ఆకలివేసే దాక తోలూడీపోయినా ఆపకుండా తోమారు. నేను అప్పటికి చాలా సేపటి క్రితమే అపస్మారక స్థితిలోకి పోయా. వాళ్ళు వదిలేసాక హమ్మయ్య అనుకున్నా. నా కట్లు విప్పితే ఒక్కొక్కర్ని కండలూడేలా కరిసి చంపేద్దామని సిద్దంగా ఉన్నా. వాళ్ళకి అనుమానం రాకుండా పడుకున్నట్టే నటించా. అయినా వైయస్ ముందా ఇందిరమ్మ భజన. మా అమ్మమ్మ నా కుతంత్రం పోల్చేసి, కట్లు విప్పకుండా రకరకాల ఆయుర్వేదిక మూలికలు కలిపి చేసిన ఏదో పధార్దాన్ని భోజనం పేరు తొ నా నోట్లో కుక్కేరు. అప్పటికి నీరసంగా ఉన్నా వద్దంటే పోతా అని కళ్ళు మూసుకొని మింగేసా. అలా కట్లతోనే పడుకున్నా. కాసేపయ్యాక కళ్ళు తెరిస్తే రాంగోపాల్ వర్మ సినిమా లో కెమెరా ముందే ముఖాలు పెట్టుకు కూర్చున్నా దెయ్యాల్లా ముగ్గురూ మరో 5 కేజీల సున్నిపిండి తో. రాత్రికి క్షురకర్మ కూడా పూర్తిచేసాక నా కట్లు విప్పారు. అంతే శివపుత్రుడు లో విక్రం లా మీదపడ్డా. అమ్మమ్మ గజాలా వద్దా నీకు అని బెదిరించింది. “ఒకే ఒక క్షణం చాలుగా .. ప్రతీ కలా నిజం చేయగా” అంటూ గజాల నా ఊహల్లో. చేసేది లేక అరవటానికి ఓపిక లేక మూలపడుకున్నా. అటూఇటూ కదలినా నొప్పి గా వుంది అందుకే ముడుచుకొని మంచం మీదకాకుండా ఓ మూల పడుకున్నా.

తెల్లవారగానే కొత్తబట్టలు కొనుక్కోమని ఒకటేగోల మొదలుపెట్టారు. సరే అని ఏ.టి.ఎం కి వెళ్తే అది పనిచేయటం లేదు. మా ఊరిలో క్రెడిట్ కార్డ్ కి పేకముక్క కి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు. ప్రక్క ఊరిలో ఉన్న ఏ.టి.ఎం కి వెళ్దామని నా పంచకల్యాణి రెండేళ్ళ క్రితం కొన్న బైక్ తీసి “మేరా సప్నోంకి రాణీ కబ్ ఆయోగి తు..” అని పాడుకుంటూ బయలుదేరాను. నేను బైక్ మీద వెళ్తున్న సంగతి ముందే తెలిసిన నా పాత స్నేహితుడు నా కన్నా ముందే కారు లో వెళ్ళి దారిలో నాకోసం చూస్తూ కూర్చున్నాడు. వాడి పేరు శనిగాడు. సరిగ్గా రెండు ఊరులకి మధ్యన అంటే ఎటువైపు బండి నడుపించుకుని పోవాలన్న మా తాతమ్మగారో జేజమ్మగారో పైలోకం నించి వచ్చి నన్ను పలకరించి ప్రోత్సహించాలి అని పూర్తిదా రూఢి చేసుకున్నాక పరిగెడుతున్న నా పంచకల్యాణి పెద్దగా సకిలించి ఆగిచచ్చింది. నా పాట్లు చూసి త్రివిక్రం సినిమా చూసినంత హాయిగా నవ్వుకొని నా మితృడు నా లాంటి మరొ దరిదృడిని కలవాటనికనుకుంటా ప్రత్యేకమైనా విమానం లో బయలుదేరి వెళ్ళిపోయాడు. షరా మాములే నేను బండిని తోసుకుంటూ “కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని” అని పాడుకుంటూ వెళ్ళిపోయా. వెళ్ళి నా కార్డులో డబ్బులుకాక, క్రెడిట్ కార్డులో డబ్బులు కూడా మొత్తం గీకేసి తెస్తే బట్టలు, జోళ్ళు, కళ్ళ జోళ్ళు, నిశ్చితార్ధానికి ఉంగరం, స్వీట్లు,మన్ను,మషానం అన్ని కొనిపించారు.

మామయ్య వచ్చేరోజు వచ్చింది. అప్పటికే ఆఫీసుకి సెలవుపెట్టి వారం రోజులు పూర్తయ్యింది. మా వాళ్ళు తోమిన తోముడికి గేదె కూడా ఆవులా అవ్వాల్సిందే. ఇక ఆయుర్వేదిక మందులతో కూడిన తిండి, ఆకు కూరలు, పళ్ళు తినిపించి ఉపవాసం మహాయోగం అనిపించేలా తయారు చేసారు. ఇదికాక రోజు రాత్రి పడుకొనే ముందు మామయ్య కూతురు నిన్నుగాని చేసుకుంటే నీ జీవితం పుల్లరెడ్డి నేతిమిఠాయి గంపలో పడ్డట్టే అని చెవిలో అపార్ట్ మెంట్లు కట్టుకొని మరీ పోరారు. ఇప్పటికి నాకు అర్ధమయ్యింది మాత్రం గజాల నా బంగారు బాతు. మామయ్య వస్తాడని ముందే లేచి వెంకటేశ్వరస్వామి కోవెలకి వెళ్ళి పూజచేసి, చెవిలో పువ్వు పెట్టుకొని వచ్చా. మమ్మీ,అమ్మమ్మ అయితే ఆ రోజంతా ఉపవాసం ముందే అనుకున్నారు. ఇవికాక పెళ్ళి కుదిరితే మా ఇంటిల్లపాది సాముహికంగా గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నారు. నా గుండెళ్ళో రైళ్ళు పరిగెట్టడం మొదలయ్యింది. ఈపాటికి గోదావరి వైజాగ్ వచ్చే ఉంటది అనుకున్నా. ఇంతలో ఫోను వైజాగ్ లో దిగాం టాక్సీ లో వస్తున్నాం అని. టాక్సీ మా ఊరికి రావటానికి 3 గంటలు పడుతుంది. కృతయుగం, త్రేతాయుగం,ద్వాపరయుగం అన్నమాట సరే. టి.వి. పెడితే దానిమీద మనసుపోవటం లేదు. పల్నాటి బ్రహ్మన్నాయుడు సినిమా చూస్తున్నా నాకు కామెడీగా లేదు. పేపరు చదువుతున్నాసరే గోడమీద వాచీనే కనబడుతుంది. అలా ఇంటిల్లా పాది ఒకేసారి అమ్మవారి గుడి ముందు నిప్పులు తొక్కినట్టు అటూఇటూ తిరుగుతూ కారుకోసం చూస్తున్నాం. నా జీవితంలో జాబ్ కోసం కూడా ఇంతలా ఎదురుచూడలేదు.

బయట హారన్ వినిపిస్తే పరిగెట్టి వెళ్ళి చూసా ఎదురింటికి ఎవరో వచ్చారు. అలా రెండుసార్లు హారన్లు వెక్కిరించాక ఇకబయటకి పోవటం మానేసా. ఇంకో హారన్ వినిపిస్తే మెల్లగా వంగుని చూసా ఎదురుగా కారు పరిగెట్టి వెళ్ళా “సుబ్బారావు ఇల్లేక్కడండీ ” అని అడిగాడు డ్రైవర్. “వాడు ఇల్లెక్కడు తాటిచెట్లెక్కుతాడు తాగుబోతు వెదవ” అని తిట్టిపంపించేసా. ఇక నాకు ఓపిక లేక వాకిట్లోనే కూలబడ్డా. పెద్ద శబ్దం చూస్తే పూలకుండి పగిలిపోయింది ఎవరిదో కారు గుద్ది. అమ్మమ్మ తిట్లు మొదలెట్టి పరుగున బయటకి వచ్చింది. కారు లోంచి సూటేసుకొని గుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొన్న ఎలుగుబంటి దిగింది.
“ఏరా పెద్దోడా వచ్చేసావా?” అన్న అమ్మమ్మ పొలికేకకి ఇంటిల్లపాది రోడ్డున పడ్డారు అనగా బయటకి వచ్చారు. నా దృష్టంతా వెనుక డోరు వైపే ఉంది. ఇంతలో పరాయిదేశం లో పని ముగించుకొని విమానం లో సరాసరి ఇక్కడే ల్యాండయిపోతున్నాడు నా మితృడు. ఈ ఒక్కసారికి వదిలెయిరా కావాలంటే మరలా రేపు బైక్ మీద వెళ్ళేప్పుడు కలుసుకుందాం అని ప్రాదేయపడుతున్నా. ఇంతలో తలుపు తీసుకొని కాలు కిందపెట్టింది. మా వాడు పైనుంచి నవ్వాడు. జన్మ లో ఎప్పుడూ లేనిది జపాన్ లో వచ్చినట్టు భూకంపం. రేయ్ ఈ రోజు నా చేతిలో నువ్వయిపోతవ్ రోయ్ అన్నా. వాడు మాత్రం నవ్వటం ఆపలేదు. ఇంతలో కారులోంచి ఎవరొ దిగి కారు తలుపువేసిన శబ్దం చూస్తే ఎదురుగా చీకటి కారుమాత్రం కనిపించటం లేదు. తలుపేసిన చప్పుడుకో ఏమిటో మా మమ్మీ, అమ్మమ్మ కిందపడిపోయారు. కళ్ళు తడుముకుని చూసా  ఎదురుగా 70 ఎం ఎం లో నల్ల డ్రెస్సువేసుకున్న గున్న ఏనుగుపిల్ల. కెవ్వుమని అరిచి ఎగిరిపడ్డా. బావా ఐ లవ్ యూ అంది గజలక్ష్మి (ముద్దుగా గజాల).ఈ దెబ్బకి ఏకంగా మూర్ఛపోయాను.  పక్కింటోల్ల బాతు దారిలో అడ్డంగా ఉన్న నా నెత్తి మీద దూకి ఒకటి,రెండు చేసి “క్వాక్..క్వాక్..” అని వెక్కిరించి వెల్లిపోయింది. పైన విమానం లో ఆ వెధవ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.