(హెచ్చరిక: ధూమపానం ఆరోగ్యానికి హానికరం)
పండక్కి పుట్టింటికొచ్చిన కొత్త పెళ్ళికూతురికి కన్నతల్లి ఆప్యాయంగా తలంటు స్నానం చేస్తున్నట్టు ఆకాశం నుండి చినుకులు ఆగి ఆగి పడుతున్నాయి. స్కూల్ ఎగ్గొట్టి ఆడుకుంటున్న పిల్లల్లా చల్లగాలి వర్షంలో అల్లరిగా అటూ ఇటూ తిరుగుతూ ఒక్కసారి శరీరాన్ని తాకి ఝల్లుమనిపించి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద నిలిచిన నీరు మా కారు వేగానికి ఎగిరిపడుతుంది. రోడ్డుకి ఇరుపక్కల ఉన్న తోటల్లో చెట్లు వర్షానికి తడిచి భారంగా ఒంగి నిలబడ్డాయి. దూరంగా ఎక్కడి నుండో ఏదో తెలిసినపాటే గాల్లో తేలుకుంటూ వచ్చి తెరలు తెరలుగా వినిపిస్తుంది. మనసేదో ఆనందరాగం వింటున్నట్టుగా తన్మయత్వంలో మునిగిపోయింది. అప్పటి వరకూ గుప్పుమని వచ్చి గుండెలనిండా ఒదిగిపోయిన మట్టివాసనను ఒరుసుకుంటూ జొన్నపొత్తులు కాలుస్తున్న కమ్మని వాసన మెల్లగా జొరబడుతుంది.
అప్పటికే భీమిలీ రోడ్డు మీదుగా మా కారు వైజాగ్‌కి దగ్గరగా చేరుకోవటంతో ఎఫ్.ఎం.లో ఏవైనా పాటలు పెట్టుకుని విందామని మొబైల్ బయటకు తీసాను. బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో టికెట్ చూపించటానికి నా మొబైల్ బ్రతికే ఉండటం చాలా అవసరం. పైగా చార్జర్ కూడా తీసుకుని రాలేదు. తిట్టుకుంటూ మొబైల్ పక్కన పడేసా.
ఇప్పుడో కమ్మని చాయ్ తాగితే అని మనసులో అనుకుంటుండగానే..
“సార్.. ఇప్పుడో నాలుగు పీకులు దమ్ము పీకితే” అంటూ నా వైపు ఆశగా చూశాడు డ్రైవర్. సరే కానీ అన్నట్టు నవ్వాను. వెంటనే ఆనందంగా రోడ్డు పక్కనే కనిపిస్తున్న ఒక టీ దుకాణం దగ్గర కారాపాడు.
ఊరికి దూరంగా రహదారి మీదున్న దుకాణం కావటంతో పెద్దగా జనాలు లేరు. వర్షంలో వెళ్ళటానికి ఇబ్బందిపడుతున్న ఇద్దరో ముగ్గురో టూవీలర్ జనాలు మాత్రం ఉన్నారు. దుకాణం బయట ఉన్న నులకమంచం మీద కూర్చున్నాను. రోడ్డు మీద నిలిచిపోయిన నీటిలో ఆకాశంలో వేగంగా కదులుతున్న మేఘాల ప్రతిబింబం చూస్తూ ఉన్నాను. ఆగి ఆగి ఒక్కోటిగా ఆ నీటిలో పడుతున్న చినుకుల వల్ల పుడుతున్న అలల్ని చూస్తుంటే చిన్నప్పుడు చెరువుగట్టున కూర్చుని రాళ్ళేసిన బాల్యం గుర్తొస్తూ ఉంది.
డ్రైవర్ గోల్డ్ ఫ్లేక్ కింగ్ సిగరెట్ తీసుకుంటూ “సార్ మీకు?” అంటూ ఆగాడు. ఒక చిన్న పాజ్ తర్వాత ఆ మాట నాకు వినిపించినట్టుంది. కాస్త ఆలస్యంగా “ఒక స్పెషల్ టీ” అని చెప్పాను. నా ఆలస్యానికేమో డ్రైవర్ కాస్త వింతగా చూసాడు.
టీ తెచ్చి నాకందిస్తూ “మీరు చెప్పకపోయినా మీ గులాబీ రేకుల్లాంటి పెదాలు చూస్తే తెలిసిపోతుందిలెండి” అని నా వైపు చూసి నవ్వాడు. తనెమన్నాడో ఒక్క క్షణం అర్ధం కాలేదు. అతని పెదాల మధ్య గుప్పుమంటున్న సిగరెట్ చూసాక అతని మాటలు అర్ధమయ్యి నవ్వుకున్నా.
“ఈ పాడు వ్యసనం మానెయ్యి. ఆరోగ్యానికి మంచిది కాదని ఎందరు చెప్పినా మానలేకపోతున్నా సార్. నిజానికి నేను కాలుస్తున్నది అందరిలా ఏదో కిక్కు కోసం కాదు సార్. ఈ సిగరెట్‌ని పెదాల మధ్య పెట్టుకుని ఇలా బలంగా లోపలికి ఒక దమ్ములాగిన ప్రతిసారీ” అంటు కాసేపు కళ్ళు మూసుకున్నాడు. నేను అతను చెబుతున్న మాటలు ఆసక్తిగా వింటూ అతని వైపే చూస్తున్నా.
పీల్చిన పొగని బయటకి వదిలేసి కళ్ళు తెరిచి నన్ను చూసాడు. అతని కళ్ళల్లో ఏదో తన్మయత్వం కనిపించింది. సరిగ్గా కాసేపటి క్రితం నేను వర్షాన్ని చూసి పొందినలాంటి తన్మయత్వం.
నేను తననే గమనిస్తున్నా అన్న స్పృహతో ఈలోకంలోకి వచ్చి “లోపలికి దమ్ములాగిన ప్రతిసారీ ఏనాడో కోల్పోయిన ఒక గొప్ప అనుభవమేదో తిరిగి సొంతమయినట్టనిపిస్తుంది. ఆ అనుభూతేదో అమాంతం నన్ను చుట్టేసుకుని బలంగా తనలో కలిపేసుకున్నట్టనిపిస్తుంది. తిరిగి దమ్ము బయటకు వదిలేయగానే.. నా అనేవాళ్ళెవరో దూరమవుతున్నట్టు విరహం.” చెప్పటం ఆపి నా వైపు చూసాడు. నా చెవులను తాకుతున్న ఒక గొప్ప అలౌకికరాగం మధ్యలో ఆగిపోయినట్టు అసంతృప్తిగా అనిపించింది. మనసంతా ఎందుకో చేదుగా అయిపోయింది.
“తాగుబోతోడి మాటలు అనుకుంటున్నారా సార్? ప్రియురాలి మొదటి ముద్దు ఇచ్చే అనుభూతి జీవితాంతం పదిలంగా దాచుకునే సాధనం ఈ సిగరెట్టే సార్” అంటూ సిగరెట్ కింద పడేసి లేచాడు. ఆ సిగరెట్ చివర నిప్పు ఇంకా ఆగలేదు. ఇంకా మండుతూనే ఉంది. ప్రమాదం కదా ఆర్పేద్దామని లేపిన నా కాలు కిందకు దిగలేదు. ఎందుకో నా మనసు ఆ పని చెయ్యనివ్వలేదు. అలా మండుతున్న ఆ సిగరెట్‌నే చూస్తూ వచ్చి కారెక్కాను.
ఎయిర్పోర్ట్ వచ్చేంతవరకూ కారులో ఎందుకో నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఎయిర్పోర్ట్ కి వచ్చేపాటికి వర్షం కాస్త తెరిపిచ్చింది. డ్రైవర్ నా సామానంతా కారులో నుండి దింపి ట్రాలీ లో పెట్టాడు.
డ్రైవర్ వెళ్ళిపోయే ముందు మాత్రం “నువ్వేం చదువుకున్నావ్?” అని అడిగాను.
“ఉద్యోగాలొచ్చే చదువులు చదువుకోలేదు సార్. నా ఒంటరితనంలో నాకు నేనే తోడుండే పుస్తాకాలేవో చదువుకున్నా” అని నవ్వేసి వెళ్ళిపోయాడు.
ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి కూర్చున్నా. లాంగ్ వీకెండ్‌కి వచ్చిన జనాలనుకుంటా చాలా రద్దీగా ఉంది. ఎయిర్పోర్ట్ లో జనాల్ని చూస్తే ఎందుకో పరిచయం లేని లోకంలో ఉన్నట్టుంటుంది. ఏవో పుస్తకాలు చదువుకుంటూ లేదా ల్యాప్ టాప్‌లు, ఐపేడ్లు పట్టుకుని ఎవరిలోకంలో వాళ్ళుంటారు. పలకరింపుగా కూడా పక్కనున్నవాడ్ని చూసి నవ్వరు. నేను కాస్త అసహనంగా అటూ ఇటూ చూస్తుండగా నా ఫోన్ మోగింది.
“హలో”
“హలో ఎవరూ?” జనాల గోలలో ఎవరో తెలియలేదు పైగా తెలియని నంబర్.
“హలో నాని. నాని నువ్వేనా?”
ఎవరో తెలిసిపోయింది. ఒక్కసారిగా నా చెవులు మొద్దుబారిపోయాయో లేక ఎవరైనా ఎయిర్పోర్ట్ లో మ్యూట్ పెట్టారో తెలియదు. నాకేం వినిపించటం లేదు. అంతవరకూ వినిపించిన టీవీల గోల, అనౌన్స్ మెంట్లు, టేకాఫ్ చప్పుళ్ళు ఏవీ వినిపించటంలేదు. గుండె కంగారుగా కొట్టుకుంటుంది. గొంతు తడారిపోయి మాట బయటకు రావటం లేదు. ఎంతో కష్టం మీద “ఎవరూ?” అడిగీ అడగలేనట్లుగా అడిగాను. తనతో మొట్ట మొదటిసారి కాలేజ్‌లో మాట్లాడినప్పుడు సరిగ్గా ఇలానే కంగారుగా అనిపించింది. నూనుగు మీసాల వయస్సులో పడిన ఆ కంగారు కంటే, ముప్పయ్యేళ్ళ వయస్సులో ఈ కంగారు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. గుండెల్లో ఏదో చిన్నగా పీకుతున్నట్టు నొప్పిగా ఉంది.
అటువైపు నుండి ఫోన్లో చిన్నగా కళ్ళల్లోనో, గొంతులోనో కాస్త తడి చప్పుడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. అత్యంత ఆర్టిఫీషియల్ వస్తువులనిపించే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకి కూడా మనసుందని ఆ క్షణమే నాకు తెలిసింది. ఎదురెదురుగా లేని ఇద్దరి మనుషుల మౌనంలోని వియోగాన్ని భారంగా మోసుకుంటూ ఏవో తరంగాలు కాసేపు అటూ ఇటూ తిరిగాయి. చెప్పుకోవాల్సిన భారమైన విషయాలేవో నిశ్శబ్ధంలోనే చెప్పేసుకున్నామేమో కాస్త మౌనం తర్వాత ఇద్దరం తెప్పరిల్లాం.
“మధు” అలవాటు తప్పి చాలా కాలమయ్యిందో ఏమో ఎప్పటిలా పిలవలేదు.
“హ్మ్” అని మాత్రం పలికింది.
“ఎలా ఉన్నావ్?”
“బాగున్నా. నువ్వెక్కడున్నావ్ నాని?”
“వైజాగ్‌లో ఉన్నాను. హైదరాబాద్ ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నా”
“వైజాగ్‌లోనా” నిరాశగా అనిపించింది తన గొంతు. “నాని ఏడు గంటల్లోపు హైదరాబాద్ రాగలవా?” కాస్తంత ఆశగా అడిగింది.
ఫోన్లో బీప్ మని చప్పుడు వినిపించింది. బ్యాటరీ లో అలర్ట్ వచ్చింది. నాకు కాస్త కంగారొచ్చింది. “మధు ఎక్కడున్నావ్? ఇది నీ నంబరేనా?”
“కాదు నాని. నేనిప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నాను. నీ నంబర్ ఇప్పుడే తెలిసింది. ఈ రోజు 7 గంటలకి ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండీ న్యూయార్క్ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎన్నింటికొస్తావ్?” తన మానసిక స్థితేంటో అర్ధమయ్యింది. కానీ నాకు పూర్తిగా నిరాశ ఆవహించింది.
“లేదు మధు. నేను వచ్చేపాటికి 9 గంటలవుతుంది”
ఇద్దరి మధ్య కాసేపు నిరాశతో కూడిన మౌనం చొరబడింది. కొన్ని క్షణాలు భారంగా గడిచాయి. ఎక్కడో ఇది మనకి మామూలేగా అన్న ఆలోచన ఇద్దరికీ ఒకేసారి తట్టిందేమో. కాస్త మామూలయ్యే ప్రయత్నంలో
“ఎలా ఉన్నావ్ నాని?”
“అందరిలానే బాగానే ఉన్నా. కొత్త కష్టాలేవీ రాలేదు. పాతవిపోలేదు.” కాసేపు మళ్ళీ మౌనం.
“మధు ఎప్పుడన్నా గుర్తొస్తానా?” తనూ ఇదే అడగాలనుకుందేమో అనిపించింది. గుర్తు రాకుంటే ఫోన్ చేసేది కాదుగా అనే సమాధానం నాకే తట్టింది. పెళ్ళయిన అమ్మాయిగా ఆ ప్రశ్న కి సమాధానం చెప్పటం తనకెంత కష్టమో కూడా తట్టింది.
అందుకే మాట మార్చాలని “ఎప్పుడొచ్చావ్ ఇండియాకి?” అని అడిగాను.
నా మనసులో ఉన్న నిజమైన ప్రశ్న అది కాదని తనకీ తెలుసు
“వెళ్ళే ముందు నిన్నొక్కసారి చూడాలనిపించింది నాని. నీ ఫోన్ నంబర్ దొరకగానే కాస్త ఆశపడ్డాను”
నా ఫోన్ మరలా బీప్‌మని శబ్ధంచేసింది. నేను తన మాటలు వింటూనే చార్జింగ్ పాయింట్ వరకూ పరిగెట్టాను. అక్కడ కొందరు ఫోన్ చార్జింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరిదీ నాలాంటి పిన్ కాదు. చుట్టూ చూసాను. అటూ ఇటూ పరిగెట్టాను. “ఇప్పుడెలా? ఛార్జింగ్ ఎలా? ఏదైనా ఛాన్సుందా?” బుర్రబద్దలుకొట్టుకుంటున్నా ఏమీ తట్టటంలేదు.
“మనమెందుకిలా ఉన్నాం, నానీ?” అంతవరకూ ఆగిన వర్షం ఒక్కసారిగా కుండపోతగా మొదలయ్యింది. నా ఫోన్‌కి బీప్‌మనే ఒపిక కూడా లేక చచ్చిపోయింది. ఉన్నవాడిని ఉన్నట్టుగా ఒక మూల కూలబడిపోయాను.
🙂
🙂
interesting
Thank you sir
నేనింక మీ కథలు చదవను
కొత్తపాళీ గారూ,
నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా?
తప్పేమీ లేదండి. ప్రతీ కథతోనూ గొంతు చిక్కపట్టేస్తుంటే ఎలా?
hmm…
🙂
“అందరిలానే బాగానే ఉన్నా. కొత్త కష్టాలేవీ రాలేదు. పాతవిపోలేదు.” nice one Murali.:)
Thanks Kranthi
నీ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తోంది 🙂
🙂
చాలా బాగుంది మురళి గారు!
Thanks Harsha
So much pain boss!
నా ఫోన్‌కి బీప్‌మనే ఒపిక కూడా లేక చచ్చిపోయింది. Best line.
Thank you 🙂
Very Nice Murali..
అందరిలానే బాగానే ఉన్నా. కొత్త కష్టాలేవీ రాలేదు. పాతవిపోలేదు….Best one..
Thanks Srikala
chala bagundi Murali…
Thank you Syam
చలా బాగుందండీ మురళీ గారు. కాని “శ్వేతకాష్టం” అంటే నాకు అర్దం కాలేదు. కాస్త వివరించగలరు. ధన్యవాదాలు
థాంక్యూ. శ్వేతకాష్టం అంటే సిగరెట్ అండి.
చాలా బావుంది మురళీ
ముఖ్యంగా డ్రైవర్ తో సంభాషణను వాడుకున్న తీరు బావుంది .
శ్వేతకాష్టం అని పెట్టడానికి అదే కారణం అనుకుంటున్నా ..
ఆత్రేయ అన్న “సిగరెట్ ఆఖరి దమ్ము ప్రేయసి తొలి ముద్దు అతి తియ్యన” గుర్తొచ్చింది .
మీ కథలు చదువుతున్న కొద్దీ మీ శైలి, స్టైల్ , సిగ్నేచర్ స్పష్టంగా .కనిపిస్తోంది . ఇంకొన్నాళ్ళు అయితే ఇది మురళి రాసిందేమో అని .చెప్పగలుగుతానేమో
Why don’t you send your stories to online magazines like koumudi. Your stories are on par with the ones published there. You will have more audience there.
Also, it would be good if you can send it to some competitions.
Thanks Vasu garu
My dear writer,
While I was started reading it I thought it’s gonna be a very heart touching and lengthy,but I don’t think that you did a justice.
Please try to make it as long as
Thanks for the feed back.