ఆరు నెలల అమెరికా వాసం తర్వాత ఆరోజే ఇంటికొచ్చాను. అంతలోనే బావ పెళ్ళి అని వైజాగ్ బయలుదేరమని హడావుడి మొదలుపెట్టింది మమ్మీ. నాకింకా జెట్‌లాగ్ కూడా పోలేదు మొర్రో అన్నా వినిపించుకోలేదు. కావాలంటే కారులో పడుకో బయలుదేరు అని ఒకటే నస. అమ్మమ్మ, అత్తలు అందరూ నవ్వుకుంటున్నారు. మాతృవాక్యాపరిపాలనాబద్దుడిగా పాతికేళ్ళ ఇండస్ట్రీ మనది. ఈరోజున పుసుక్కున అందరి ముందు కాదంటే పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని తలాడించా. జీన్సు, టీషర్టు వేసుకుంటుంటే “ఇదేంటి ఈ బట్టలతోనా పెళ్ళికి? మంచి బట్టలు వేసుకుని ఇన్‌షర్ట్ చేసుకునిరా” అంది. నాకేమీ అర్ధంకాక క్వశ్చన్ మార్క్ మొహంపెట్టాను.
“ఈ పెళ్ళిలో నీ పెళ్ళి కుదిరిపోవాలనుకుంటుందిరా మీ అమ్మ. వెళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా” అంది అమ్మమ్మ నవ్వుతూ. “వీలయితే టై పెట్టుకుని సూటేసుకుని రారా” అంది మరింత నవ్వుతూ అక్క.
నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్నప్పుడు వీధిలో అందరూ మీ అబ్బాయి చాలా బుద్దిమంతుడు అంటుంటే మురిసిపోయి తలొగ్గిన పాపం ఇప్పటికీ వెంటాడుతుంది. ఇంక చేసేదేమీ లేక ఫార్మల్ డ్రెస్‌లో బయలుదేరాను. అరబాటిల్ సెంటు నా మీద జల్లింది. అందరూ పెళ్ళిలో నా గురించి యోజనగంధుడని చెప్పుకోవటం ఖాయం.
అందరం పెళ్ళి జరుగుతున్న ఫంక్షన్‌హాల్ చేరుకున్నాం. చుట్టాలంతా పలకరిస్తున్నారు. నేను కూడా నవ్వుతూ బాగున్నారా అని అడిగేసి వెళ్ళి ఒక మూల కూర్చున్నా. పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా చేసారు. అబ్బాయి అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీర్. పెళ్ళికి అత్తవారు పెడుతున్న లాంఛనాలు అన్నీ కలిపి మూడుకోట్ల పైమాటే. అందుకే ఇంత ఘనమైన ఏర్పాట్లు. సాఫ్టువేర్ ఉద్యోగాలొచ్చాక మధ్యతరగతి బ్రతుకులెంత మారిపోయాయి అనిపించింది. మమ్మీ దూరం నుండే అందరితో మాట్లాడమని సైగచేస్తుంది. నేను రానుకాకరాను అని చెప్పి సెల్‌ఫోనులో స్నేహితులతో చాటింగ్ చేస్తూ కూర్చున్నా.
ఇంతలో మురళీ ఎవరొచ్చారో చూడు అని గట్టిగా పిలిచింది. అబ్బా మరలా మొదలుపెట్టింది అనుకుని చూసేసరికి శేఖరన్నయ్య. శేఖరన్నయ్య మా పెద్దమ్మ కొడుకు. అన్నయ్యని చూసి చాలా కాలమయ్యింది పరిగెట్టుకుంటూ వెళ్ళాను. కుశల ప్రశ్నలు,కబుర్లు,భోజనాలు కానిచ్చాం. భోజనాలయ్యాక చాలా రోజులయ్యింది కదరా ఇంటికి రావొచ్చుగా అనిపిలిచాడు అన్నయ్య. నువ్వు వెళ్ళన్నయ్యా నేను ఒక అరగంటలో వస్తా అని చెప్పాను. అన్నయ్య సరే చూస్తుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు.
అన్నయ్య వెళ్ళాక అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నా. మనసులో పెద్దమ్మాల ఇల్లు కదులుతుంది. ఒకవైపు వెళ్ళాలనే ఉన్నా మరో వైపు వెళ్ళి నాకున్న మధుర జ్ఞాపకాలను శిధిలం చేసుకుంటానేమోనని భయం. నా పసితనంలో వేసవి సెలవులు గడిపింది పెద్దమ్మాలింట్లోనే. అందమైన పురిల్లు, ఇంటికి ముందు ఉసిరి చెట్టు, ఇంటి వెనుక మావిడిచెట్టు. ఇవికాక కనకాంభరాలు, మందారాలు, గులాబీలు ఇలా బోలేడన్ని పూలమొక్కలు ఉండేవి ఇంటి చుట్టూ. పిల్లలం ఆడుకోవటానికి కావాల్సినంత స్థలం ఉండేది
మా పెద్దమ్మ పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టే పెద్ద బొట్టు పెట్టుకుని నిత్యం లక్ష్మీ కళతో ఉండేది. పెద్దమ్మకి ముగ్గురు పిల్లలు. వాళ్ళతో సమానంగానే నన్ను చూసేది. అందరికంటే చిన్నవాడినని నేనంటే కాస్త ముద్దు. నాకు అన్నం తనే కలిపి తినిపించేది. అంత పెద్ద సంసారాన్ని పెదనాన్న తెచ్చే జీతంతో గుట్టుగా నడిపేది. మేమెంత అల్లరి చేసి వీధిలో గొడవలు పెట్టుకుని వచ్చినా ఓపిగ్గా అందరికీ సర్ది చెప్పి పంపేసి మమ్మల్ని ముద్దుచేసేది. పెద్దమ్మ కల్మషంలేని నవ్వు ముందు పేదరికం,కష్టాలు నిలవలేకపోయేవి.
అందరి పిల్లల్లానే మాకూ మా అన్నయ్యంటే ఒక హీరో అనే ఫీలింగ్. ఎప్పుడూ అన్నయ్య వెంటే తోకల్లా తిరిగేవాళ్ళం. అన్నయ్య చప్పట్లు కొడితే వెలిగే లైట్లు తయారు చేసి చూపించేవాడు. బీచ్‌కి తీసుకెళ్ళేవాడు. బీచ్ నుండి ఏరుకొచ్చిన గవ్వల్ని ఫెవికాల్తో అతికించి శివలింగం చేసేవాడు. ఎన్నో కధలు చెప్పేవాడు, ఏవో మాజిక్కులు చేసేవాడు. అన్నయ్య ప్రాక్టికల్ జోక్స్ వెయ్యటంలో దిట్ట.
ఒకరోజు రాత్రి నల్లకోటు,నల్ల కళ్ళద్దాలు,మహాలాక్టో చాక్లెట్లకి ఇచ్చే బన్నీ పళ్ళు పెట్టుకుని చీకట్లో దాక్కున్నాడు. వీధిలో ఉండే ఒక ముసలావిడ చీకట్లో అటురాగానే ఆ బన్నీ పళ్ళు బయటకి కనిపించేలా పెట్టి “బామ్మా బాగున్నావా?” అని అడిగాడు. పళ్ళు మాత్రమే కనిపించేసరికి ముసలావిడ బెంబేలెత్తిపోయి పెద్దగా అరుస్తూ పారిపోయింది. పెద్దమ్మకి విషయం తెలిసి వచ్చి మమ్మల్ని మందిలించే వరకూ మేమంతా పడీ పడీ నవ్వుకున్నాం.
అందుకే పెద్దమ్మాల ఇల్లంటే పుస్తకాల్లో దాచుకున్న నెమలీకలా ఒక పసితనపు వాసన. ఆ అమాయకపు చేష్టలు, ఆ అల్లరి తలుచుకుంటే అప్రయత్నంగా పెదాలపై చిరునవ్వు విచ్చుకుంటుంది. బ్రతకటం ఒక పరుగు పందెం అయిపోయిన నాకు మరలా ఏ మజిలీలోనూ అంత ఆనందం దొరకలేదు.
పెద్దవాడినయ్యి కాలేజీలో చేరాక సెలువులు లేక పెద్దమ్మ దగ్గరకి వెళ్ళటం తగ్గింది. ఒకరోజు పెదనాన్నకి పక్షవాతం వచ్చిందని పెద్దమ్మ ఆందోళనగా ఫోను చేసింది. పరీక్షలు ఉండటంతో నాకు వెళ్ళటం కుదరలేదు. డాడీ మాత్రం వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడి అందరికీ ధైర్యం చెప్పి వచ్చారు. డాడీ తిరిగి వచ్చాక అందరూ ఎలా ఉన్నారని అడిగాను.
“పెద్దోడు బాగా బెంగ పెట్టేసుకున్నాడురా. వాడికి ఏడ్చి ఏడ్చి సైనెస్ ఎక్కువయ్యింది. జాబ్‌కి లీవు పెట్టేసాడు. పెదనాన్నని రోజూ ఫిజియో దగ్గరకి తీసుకునివెళ్తున్నాడు. పెదనాన్న జీతం లేకపోవటంతో ఇల్లు గడపటం కష్టమవుతున్నట్టుంది. మీ పెద్దమ్మ సంగతి తెలిసిందే కదా ఇల్లు గుట్టుగా నడుపుకొస్తుంది” అని చెప్పేప్పుడు డాడీ గొంతులో అరుదుగా వినిపించే ఒక సన్నని జీర. ఎప్పుడూ గంభీరంగా ఉండే డాడీ అలా మాట్లాడేసరికి మనసులో నాకు కూడా దిగులు కమ్మేసింది.
అన్నయ్య మాత్రం పెదనాన్న ఆరోగ్యం బాగుపడే దాక వెంటే ఉండి అన్ని సేవలూ చేసాడు. అన్నయ్య చేసిన సేవకి కొద్దిరోజుల్లోనే పెదనాన్న తేరుకున్నారు. నాకంటూ ఒక వ్యక్తిత్వం నిర్మించుకుంటూ, మరొకరి గొప్పతనాన్ని ఒప్పుకునేందుకు తటపటాయించే ఆ వయసులో కూడా తల్లిదండ్రులంటే తనకున్న ఇష్టంతో అన్నయ్య ఎప్పటిలానే నా మనసులో తన హీరోయిజం నిలబెట్టుకున్నాడు. అన్నయ్య, పెదనాన్న ఇద్దరూ లీవులో ఉండటంతో నాలుగు నెలలపాటూ జీతం లేదు. ఇంటి ఖర్చులకి, పెదనాన్న మందులకి తన బంగారాన్ని కుదవపెట్టి డబ్బులు సర్దింది పెద్దమ్మ. చుట్టాలకి ఆ ఇంటి కష్టాలు ఎప్పుడూ తెలియనిచ్చేది కాదు.
పెద్దమ్మకి ఒకే ఒక్క కూతురు సుధారాణి. సుధక్కకి పెళ్ళీడు వచ్చింది. పెద్ద పెద్ద కట్నాలిచ్చే పరిస్థితా లేదు. పెదనాన్నని చూస్తే లౌక్యం తెలియని మనిషి. అందుకే ఇల్లు చెదిరిపోకుండా, అక్క జీవితమూ బాగుండేలా పెద్దమ్మ సొంత తమ్ముడయిన శంకర్ మావయ్యకే ఇచ్చి చేసింది. అన్నయ్యకి కూడా దగ్గర భందువుల్లోనే ఒక అమ్మాయిని తెచ్చి చేసింది. అందరూ మనవాళ్ళే అయితే ఇల్లు ముక్కలు కాదని పెద్దమ్మ నమ్మకం. చాలారోజులకి ఆ పెళ్ళికి పెద్దమ్మవాళ్ళింటికి వెళ్ళాను. పెదనాన్న ఆరోగ్యంగా కనిపించారు. పెద్దమ్మ చాలా ఆనందంగా కనిపించింది. పెద్దమ్మ చేతులు మీదగా పెళ్ళంతా సందడి సందడిగా గడిచిపోయింది.
తర్వాత మరలా తీరికలేని నా కాలేజీ జీవితంలో పడిపోయాను. ఫోనులో మాట్లాడటం తప్ప నేరుగా వెళ్ళి ఎవరినీ చూసిందిలేదు. వదినకి, సుధక్కకి కొన్ని విషయాల్లో పడటంలేదని అట కబుర్లు వినేవాళ్ళం. ఏన్నో ఏళ్ళుగా ఆ ఇంటిలో ఎదురులేని సుధక్క కొత్తగా వచ్చిన వదినని అదుపులో పెట్టాలనుకుంది. కానీ సహజంగా గడుసుదైన వదిన ఇంటి కోడలిగా పెత్తనం తనకే దక్కాలనుకునేది. ఒకసారి కాస్త పెద్ద గొడవే అయితే రాజీ కోసం డాడీని పిలిచారు. డాడీ ఏదో సర్దిచెప్పి వచ్చారు. కానీ గొడవలు పూర్తిగా సమసిపోలేదు. ఏళ్ళుగా ఇంటిని నడిపిన పెద్దమ్మ ఈ పరిస్థితిని కూడా చేయి దాటకుండా దూరంగా ఉంటేనే ప్రేమలు మిగులుతాయని సుధక్కకి వేరే ఇల్లు చూసి అక్కడ కాపురం పెట్టించింది. ఎదురెదురుగా లేకపోవటంతో గొడవలు తగ్గాయి. పండగలకి పబ్బాలకి కలుసుకున్నా, ఉన్న ఆ ఒక్కరోజుకి ఎవరూ బయటపడకుండా కాస్త నవ్వుతూ గడిపేసేవారు.
హమ్మయ్య ఇల్లు కాస్త చక్కబడింది అనుకునేంతలో పెద్దమ్మకి పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఉందని తెలిసింది. కడుపునొప్పని డాక్టరు దగ్గరకి వెళితే టెస్టుల్లో బయటపడింది. ఆపరేషన్ వీలైనంత త్వరగా చెయ్యాలన్నారు. డాడీ వెంటనే బయలుదేరి వెళ్ళారు. రెండు రోజులు ఆగి నేను వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికే ఆపరేషన్ పూర్తయ్యింది. మామూలుగానే సన్నగా ఉండే పెద్దమ్మ తిండి లేక కేవలం సెలైన్లా మీదనే ఉంటోంది. శరీరం మీద చర్మమే తప్ప కండనేది మచ్చుకి కూడా కనబడలేదు. నాకు అన్నం తినిపించిన ఆ చేతులను అలా నిస్తేజంగా నీరసంగా చూడటంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నన్ను చూడగానే రా రా అనిపిలుస్తూ చెయ్యి ఎత్తే ప్రయత్నం చేసి, నొప్పికి ఇంక ఎత్తకుండా ఆగిపోయింది. భగవంతుడి నిర్ధయ కళ్ళముందు కరుడుగట్టిన నిజంలా కనిపిస్తుంటే ఆయన్ని ఎంత తిట్టానో నాకే తెలియదు. కాసేపు మాట్లాడాక నిద్రపోయింది. “ఇంక అంతా పర్వాలేదు రేపు ఇంటికి తీసుకు వెళ్తాం” అని చెప్పాడు అన్నయ్య. అన్నయ్య కూడా బాగా చిక్కిపోయాడు. నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉండటంతో డాడీ,నేను ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసాం.
పరీక్షలకి చదువుకోవటంలో బిజీ అయిపోయాను నేను. ఆ సెమిస్టర్ పేపర్లు కొంచెం కష్టంగా ఉండటంతో భయం భయంగా చదువుతున్నాను. అర్ధరాత్రి ఫోను వచ్చింది పెద్దమ్మ ఇక లేదని. ఆ కబురు వినగానే కళ్ళ ముందు చీకటి కమ్మేసింది. మరుసటిరోజు నాకు పరీక్ష. నేను వెళ్ళటం కుదరదు. చివరిసారి పెద్దమ్మని చూడలేకపోతున్నా అనే ఆలోచన మెదడులోకి రాగానే పుస్తకం మూసేసి అలానే మంచం మీద పడిపోయాను. చేతిలో పెట్టెతో వెళ్తున్న డాడీకి ఎదురొచ్చి “మురళిని తీసుకురాలేదా” అని నిరాశగా అడుగుతున్న పెద్దమ్మ కనిపించింది. నేను దిగ్గున లేచి చుట్టూ చూసాను. అది నిజం కాదు కల. అవును పెద్దమ్మ ఇకపైన ఒక కల మాత్రమే అని ఏడుస్తూ రాత్రంతా అలానే ఉండిపోయాను.
పరీక్షలయ్యాక పెద్ద కార్యానికి వెళ్ళాను. దిగులు ముఖంతో ఎదురుగా అన్నయ్య.
“పరీక్షలంట కదరా” అని అడిగాడు అన్నయ్య. అన్నయ్య మామూలుగానే అడిగినా, నాకు మాత్రం ఆ ప్రశ్న యాంత్రిక జీవితాల పైకి మానవ సంభందాలు సంధించిన బాణంలా అనిపించింది. నా దగ్గర సమాధానంలేదు. మౌనంగా అవునన్నట్టు తలూపాను.
“వెళ్ళిపోయే ముందు తృప్తిగా చూసుకుందామని అందరినీ పిలిచిందిరా. మురళి వచ్చాడా అని అడిగింది.” అని మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య. నేను అన్నయ్య పక్కనే మౌనంగా కూర్చున్నా. గడిచిపోయిన ప్రతీ క్షణం విలువైనదే, తిరిగి తీసుకురాలేము. అందులోనూ ఆ గడిచిపోయిన క్షణం పెద్దమ్మ చివరిచూపయితే దాని విలువెంతో నాకప్పుడే తెలిసింది. పెదనాన్నని చూస్తే బాధనిపించింది. ఇన్నేళ్ళుగా తన ఇంటిని,తనని నడిపిన తోడు ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆయన మొహం చూస్తే అర్ధమయ్యింది. సాయంత్రం వరకూ ఉండి వచ్చేసాను.
పెద్దమ్మ వెళ్ళిపోవటంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆస్థి గొడవలు మరలా బయటపడ్డాయి. పెద్దమ్మ లేకపోవటం వలన, జరుగుతున్న ఆస్థి గొడవల వలన ఆ ఇంటికి చుట్టాల రాకపోకలు తగ్గాయి. ఏడాది లోపు శుభకార్యం జరిపించాలని చిన్న అన్నయ్యకి సంభందం చూసారు. చిన్న అన్నయ్య పెళ్ళికి భందువులందరూ వచ్చినా పెద్దమ్మలేని లోటు తెలుస్తూ ఉంది. పెళ్ళిలో సందడిలేదు. అన్నింటినీ సంభాళించుకునే పెద్ద దిక్కులేదు. మంటపంలో పెళ్ళి తతంగం నడుస్తూ ఉంది. భోజనాల దగ్గర ఏదో గొడవ. చూస్తే ఆడపెళ్ళి వారు మావయ్యని,పెద్ద అన్నయ్యని ఏదో అంటున్నారు. ఆవేశంగా నేనూ వెళ్ళా గొడవలోకి. పెద్దలందరూ వచ్చి సర్ది చెప్పారు. చిన్నన్నయ్య మండపం లో నుండి కనీసం ఏంటా గొడవ అని కూడా అడగలేదు. పెళ్ళి తతంగం ముగిసిన వెంటనే కనీసం పెద్దన్నయ్యకి చెప్పకుండానే ఆడపెళ్ళివారితో అత్తవారింట మొదటిసారి గడప తొక్కటానికి కారెక్కి వెళ్ళిపోయాడు.
నేను పెద్దన్నయ్యని “వీడేంటి మనకి చెప్పకుండా కారెక్కాడు” అని అడిగా.
“నీకు తెలియదురా పెళ్ళి అనుకున్న నాటి నుండి ఆడపెళ్ళివారు చీటికి మాటికి వాడిని పండగ అని పిలిచి, అడ్డమైనవి చెప్పి చివరికి ఆస్థి గొడవల్లో కూడా దూరారు.ఇప్పుడు వాడు మనం చెప్పింది కాదు వాళ్ళు చెప్పిందే వింటాడు” అని చెప్పాడు పెద్దన్నయ్య. పెద్దమ్మాల ఇల్లు ముక్కలయిపోయింది అని అర్ధమవుతూ ఉంది.
“కనీసం పెదనాన్నకయినా చెప్పొచుగా” అన్నాను నేను.
“అసలు ఆ ముసలోడి వల్లే జరుగుతుంది ఇదంతా. వయసయిపోయింది కదా ఇక ఆయన పోతేనే మంచిది. ఈ సంభందం ఆయనే తెచ్చి మా నెత్తికి ఎక్కించాడు” అని కోపంగా అరుస్తూ అన్నాడు అన్నయ్య.
నాకు బుర్రతిరిగింది. అన్నయ్యేనా పెదనాన్నని ఇలా అంటుంది. పెదనాన్నకి ఆరోగ్యం బాగోకపోతే ఉద్యోగం వదిలేసి జీవితం నాశనం చేసుకోవటానికి సిద్దపడ్డ అన్నయ్యేనా ఇలా అన్నది. అప్పుడే మొదటిసారి తెలిసింది హీరోలు కూడా సాదారణ మనుషులే అని. భయం వేసింది నాకు. కాలపరీక్షలో ఎంతటివాడయినా రూపాన్ని మార్చుకోవాల్సిందేనా? రేపు నేనయినా ఇంతేనా? ఏ వ్యక్తుల స్పూర్తితో వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నానో వారే కాలానికి దాసోహమంటే నేను మాత్రం ఎదురొడ్డి నిలబడగలనా? ఇంకేం మాట్లాడలేదు నేను. పెళ్ళి పనులు పూర్తవ్వగానే ఇంటికి వచ్చేసా.
పెద్దమ్మాల ఇల్లు, ఆ మనుషులు నా మనసులో ఉన్న స్థానం నుండి పడిపోయారో లేక పడిపోతారన్న భయం చేతో మరలా ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్లలేదు. ఇన్నిరోజులకి అన్నయ్య వచ్చి అడగటంతో నాకు వెళ్ళాలని అనిపించింది. మమ్మీ అందరితో మాట్లాడుతూ హడావుడిగా ఉంది. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఏ పనిలేని వాడిని నేనే అందుకే కారు తీసుకుని బయలుదేరాను.
వీధంతా బాగా మారిపోయింది. పెద్దమ్మవాళ్ళ ఇల్లు కూడా చిన్న అన్నయ్య పెళ్ళినాటికే మొక్కలు చెట్లు తిసేసి డాబా ఇల్లుగా మార్చేసారు. ఇంతకు ముందులా మనుషులు బయట కూర్చుని కబుర్లు చెప్పుకోవటాలు లేవు. అందరూ టి.వి.ల ముందు కూర్చున్నట్టున్నారు. పెద్దమ్మ ఉండే రోజుల్లో వీధి చివర బ్యాగు పట్టుకుని కనిపించగానే ఎవరొస్తున్నారో చూడండి అని అందరినీ పిలిచి సందడి చేసేది. ఆ ఆప్యాయత కరువయ్యింది.
కారు దిగి వెళ్ళి తలుపుకొట్టా. పెద్ద వదిన వచ్చి తలుపు తీసింది. ఇంట్లో అడుగుపెడుతూ ఉంటే ఎదురుగా పెదనాన్న. కుశల ప్రశ్నలయ్యాక సోఫాలో కూర్చున్నా. చిన్న వదిన వచ్చి పలకరించి తాగటానికి మంచి నీళ్ళిచ్చింది. టీ పెడతా అని లోపలికి వెళ్ళింది. వదినలిద్దరితో కబుర్లు చెబుదామని వంట గదిలోకి వెళ్ళాను.
లోపలకి పోయి చూస్తే రెండు గ్యాస్ స్టవ్వుల మీద ఇద్దరు వదినలూ టీ పెడుతున్నారు. అయోమయంగా ఇంటిలోకొచ్చి చూద్దును కదా రెండు బీరువాలు చెరో బెడ్‌రూమ్‌లో. రెండు ఫ్రిజ్‌లు, రెండు టి.వి.లు అన్నీ రెండేసి చెరో బెడ్‌రూమ్‌లో. ఆశ్చర్యంగా పెదనాన్న వైపు చూసాను. ఆయన ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు.
సుధక్క ఎక్కడుంది అని అడిగా? అందరూ ఒక్కసారి నా వైపు అదోలా చూసారు. మరలా అడిగాను. ఎవరూ సమాధానం చెప్పలేదు. అన్నయ్య మేడ మీద వాకింగు చేస్తున్నాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగా సుధక్క ఇప్పుడు ఎక్కడ ఉంటుందీ అని.
“దాని ఊసెత్తుకురా. డాడీ నువ్వు చిన్నోడివని నీకు చెప్పి ఉండర్రా. అది మన ఇంటి పరువు తీసే పని చేసింది. ఒకరోజు షాపింగుకని చెప్పి పిల్లాడిని మన ఇంట్లో ఉంచి ఎవడితోనో వెళ్ళిపోయిందిరా. రెండురోజులు వెతికి పోలీసు కంప్లైంటు కూడా ఇచ్చాము. తర్వాత వీధిలో వాళ్ళే అప్పుడప్పుడు ఒకడితో వీధిలో మాట్లాడేది మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పారు. వాడెవడో తెలుసుకుని వాడికి తెలియకుండా వెంబడించి ఆచూకీ తెలుసుకున్నాము. ఆరా తీస్తే తెలిసింది వాడు కూటికి లేని దరిద్రుడు. పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు. దీనికి ఏవో మాటలు చెప్పి తీసుకుని వెళ్ళి వంటి మీద మొత్తం బంగారం అమ్మేసి ఒక ఇరుకు ఇంటిలో ఉంచాడు.
చూడగానే ఏడుపొచ్చింది. ఏంటే ఇదంతా అని అడిగితే మీరొద్దని వచ్చేస్తే మరలా ఎందుకొచ్చారు అంది. పసిపిల్లాడి మొహం చూసయినా నీకు ఇది తప్పనిపించలేదా అని అడిగాను. వాడు కూడా నాకు వద్దనుకున్నాకే వచ్చేసా అందిరా. పిల్లాడు అమ్మా అమ్మా అని పిలుస్తున్నా దాని మనసు కరగలేదు. నాకు కోపం వచ్చి గొడ్డును బాదినట్టు బాది ఇంటికి తీసుకొచ్చాను. మావయ్యకి దాని మొహం కూడా చూడాలని లేదు. కానీ పిల్లాడి కోసం ఇద్దర్నీ అమ్మమ్మ వాళ్ల ఊరు పంపేసి, పిల్లాడ్ని అక్కడ స్కూల్లో వేసారు. మన పరువు మొత్తం పోయిందిరా.” అని బాధగా నిట్టూరుస్తూ చెప్పాడు అన్నయ్య.
నేను మౌనంగా ఉండిపోయాను. ప్రస్తుత సమాజంతోనూ, నేను చదివిన కధల్లో స్త్రీల సంఘర్షణలతోనూ పోల్చి చూస్తే సుధక్క చేసిన పనికి కూడా, తన సొంత కారణాలుంటాయి అని నా మనస్సుకి అనిపించేది. కానీ కుటుంబం, పరువు, ప్రతిష్ట అనే పదాలు చుట్టూ వినబడుతున్న ఆ క్షణంలో అదొక దుర్మార్గంలానే అనిపించింది.
“ఏరా బాధపడుతున్నావా?” అని అడిగాడు అన్నయ్య. నేను మాట్లాడలేదు. మాట్లాడటానికి ఎంతవెతికినా మాటలు దొరకలేదు. అన్నయ్య వచ్చి అనునయిస్తూ నా భుజం మీద చెయ్యివేసాడు.
“పెద్దమ్మ తోనే ఈ ఇంటికున్న లక్ష్మీకళ పోయిందన్నయ్యా.” అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కారెక్కాను.
వదినలిద్దరూ చేరో టీ కప్పు పట్టుకుని పిలుస్తూనే ఉన్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేసాడు.
ఏది మాట్లాడినా చిన్న పదమే అవుతుంది.
కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించిన ఇప్పటి స్థితి ని చూసి బాధ పడాలో,ఇంత మంచి గ రాసినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలో అర్ధం కావటం లేదు.
నాకు ఇది కథ లాగ అనిపించలేదు నిజం లాగ ఉంది.
మనసు బాధపడుతుంది మురళి
Thanks Sekhar
Heart touching story Murali ….
Thanks Srikanth
padala allika entho andam ga vundi. thanks.
Thank you
“పెద్దమ్మ కల్మషంలేని నవ్వు ముందు పేదరికం,కష్టాలు నిలవలేకపోయేవి”
“పుస్తకాల్లో దాచుకున్న నెమలీకలా ఒక పసితనపు వాసన”
“ఒక వ్యక్తిత్వం నిర్మించుకుంటూ, మరొకరి గొప్పతనాన్ని ఒప్పుకునేందుకు తటపటాయించే ఆ వయసులో కూడా ”
“ఆ ప్రశ్న యాంత్రిక జీవితాల పైకి మానవ సంభందాలు సంధించిన బాణంలా అనిపించింది”
“కాలపరీక్షలో ఎంతటివాడయినా రూపాన్ని మార్చుకోవాల్సిందేనా?”
పవర్‌ఫుల్ గా ఉన్నాయి ఈ పదాలు
పెద్ద మాటల్లేవు మురళీ,ఎందుకంటే మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కాకపోవచ్చు,అలాగని అబద్ధమూ కాకపోవచ్చు.
విధి బలీయం అంటారే అంతే దాన్ని మించినది ఏమీలేదు మనం ఎంత గొప్పగా ఊహించుకున్నా.
థాంక్స్ పప్పూసార్
good one murali…roju chadhuvuthunnaa nee stories …chaala bagunnayi..
Thanks Sankar babu
Very well written.
Thank you
chaala baga rasaru!!!!!!!!!
mi katha chadivaka bagunndi bagarasaru anna chalathakkuve aouthundi anduku ante ami cheppalenu naku matalu ravadammledu
Thank you
హం ! మీరు రాసినది చదువుతుంటే సజీవం గా పాత్రలు కళ్ళ ముందు కదలాడినట్లే ఉంటాయండి . బావుంది అనేది చిన్న మాట !
థాంక్స్ శ్రావ్య
“బ్రతకటం ఒక పరుగు పందెం అయిపోయిన నాకు మరలా ఏ మజిలీలోనూ అంత ఆనందం దొరకలేదు.”
ఈ మాట అద్భుతం. మీదేనా? లేక ఎక్కడనుంచైనా సేకరించారా?
కథ చాలా బాగుంది. కాని ‘పెద్దమ్మాల’ అన్న పదం అర్థం కాలేదు. ఎప్పుడూ వినలేదు.
“పెద్దమ్మ వాళ్ళ ఇల్లు” అనేది అసలు పదం. విజయనగరం యాసలో మేము పెద్దమ్మాల ఇల్లు అనే వాళ్ళం. అదే టైటిల్‌గా పెట్టాను.
సింపుల్ గా చెప్పాలంటే “చాలా బాగుంది” మురళీ.
Thanks Raj
ఈ పొస్ట్ గురించి చెప్పాల్సినవన్నీ పైన అందరూ చెప్పారు.అందుకే సింపుల్ గా ఒక విషయాన్ని చెప్పాలనుకొంటున్నాను .కథ చాలా బావుంది.
Thank you 🙂
అంతా కళ్ళముందు చూస్తున్నట్టుగా ఉంది.చాలా చాలా బాగుంది మురళీ
Thanks Kranthi
ఇది కేవలం కథే అవ్వాలని నిజం కాకూడదని కోరుకుంటున్నాను. మొత్తం ఒకసారి చదవలేక ఆపి, ఆపి చదివాను అంత బాధగా అనిపించింది చదువుతుంటే. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. ఎంత బాగుందని చెప్పినా అల్పోక్తే అవుతుంది.
Thank you 🙂
చాలా మంచి పోస్ట్.ఒక మంచి లీడర్ లేక పోతే ఒక దేశం ఏమవుతుందో, అలాగే ఒక మంచి ఇల్లాలు ( మీ పెద్దమ్మ)లేక పోతే ఆ సంసారాలు ఎలా తయారవుతాయో తెలుస్తోంది కదా? కాని ఇలాంటి పోస్టులు మీకు బంధు వర్గంలో కలిగించ బోయే ఇబ్బందుల్ని కూడా చూసుకుంటూ ఉండండి.
Thank you 🙂
చాలా టచింగ్ పోస్ట్.
>> హీరోలు కూడా సాదారణ మనుషులే
నిజం.
Thank you
మురళి, చాల బాగా రాశారు …! మీకు పెద్దమ్మ విషయంలో జరిగిందే నాకు పెద్దనాన్న విషయంలో జరిగింది, పెద్దమ్మ నాకు పెద్దనాన్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు నన్ను చుడాలంటున్నారని ఫోను చేసింది, ఏదో పనిలో ఉండి ఉదయాన్నే వస్తాను అని చెప్పాను, నేననుకున్న ఆ ఉదయం రానే రాలేదు. నేను జీవితంలో మిస్ అవ్వకుండా వెళుతూ ఉండేవి రెండే రెండు కార్యాలు, అవి పెళ్లి, చావు, కనీసం మన దేశంలో అవి ఒకేఒక సరి జరుగుతాయి గనుక, చావు ఒకసారే అనుకోండి .. 🙂
నా జీవితంలో నేను ఆదివారం చర్చిలో ప్రార్ధన మిస్ అవుతుందని వరసగా రెండు సంవత్సరాలు ఎంసెట్ పరీక్షను వదిలేసిన వారిని చూశాను, మతం చాందసం అయినా కుడా ఆదివారం చర్చిలో ప్రార్ధన వదల కూడదని…దానికి వారిచ్చే ప్రాముఖ్యత నాకు నచ్చుతుంది… మనుషలమైన మనము దీనికి ఇచ్చిన ప్రాముఖ్యత కుడా చిన్నప్పటి నుండి మనల్ని సాకిన పెద్దమ్మ, పెద్దనాన్న లకు ఇవ్వలేకపోతున్నాము అంటే, ఒక మనిషిగా మనం ఫెయిలు అయినట్లే…! మానవ సంభందాలు అంత బలహీనమైనవా అనిపిస్తుంది. ( అప్రస్తుతం అయినా కుడా చెప్పాల్సింది ఏమిటంటే, వారి మతాన్ని అంతమంది అనుసరించడానికి గల కారణం కుడా అదే, ఆ నిబద్దత)
Thank you
THIS TYPE OF MESSAGES…ARE VERY MUCH REQUIRED FOR SOCIETY…TO BUILD HUMANITY…RELATION…KIND…LOVE ..EXCELLENT MURALI SIR…EXCELLENT.
Thank you
మురళీ చాలా బాగ రాసావురా ఇంత కన్నా నేను ఏమీ చెప్పలేను, నా కళ్ళకి కట్టినట్టుగ ఉందిరా, చాల బయం కుద వేస్తుంది.
Thanks ra 🙂
too good.
Thank you
చాలా బాగా రాసారు… చాలా బాగా రాసారు…
థాంక్స్ తృష్ణగారూ
మురళిగారూ, ఎంతో తూచి, అనుభవించి వ్రాసిన జాడలు కనపడుతున్నాయి. మీరు ఇప్పటివరకూ వ్రాసినవాటిలో ఇది అత్యుత్తమం. ఇంకా ఇలాంటివెన్నో రాయగలరు. వెనక్కెళ్ళి మళ్ళీ చదివించిన లైన్లు –
“నాకు మాత్రం ఆ ప్రశ్న యాంత్రిక జీవితాల పైకి మానవ సంభందాలు సంధించిన బాణంలా అనిపించింది.”
“అప్పుడే మొదటిసారి తెలిసింది హీరోలు కూడా సాదారణ మనుషులే అని.”
“సుధక్క చేసిన పనికి కూడా, తన సొంత కారణాలుంటాయి అని నా మనస్సుకి అనిపించేది. కానీ కుటుంబం, పరువు, ప్రతిష్ట అనే పదాలు చుట్టూ వినబడుతున్న ఆ క్షణంలో అదొక దుర్మార్గంలానే అనిపించింది.”
Thank you
ఏం రాయాలి. ఎలా చెప్పాలి. గుండె బరువు ఎక్కినప్పుడు మాటలు రావు.
మౌనం తప్ప మరో మాట ఉండదు. థాంక్స్ గురూజీ
నాకెందుకో ఇది కథ కాదు…. మీదో మరొకరిదో జీవితానుభవాన్ని ఇలా అన్వయించారు అనిపిస్తుందండీ….. నిజమేనా….??
కొంత వాస్తవం, కొంత కల్పితం 🙂
Oka movie choosina tharuvahta frnds ko leka relatives ko manamm movie viseshalu chepputhamm, alantide me Story antha chadivena tharuvatha ela respond kavaloo arthamm kavadamm ledu, nijjamm ga matalatho cheppalentha bagundee me story. Madhi kuda mingled family, natho kaleepi total 19 members vunntamm. Me story chaduvuthunnte maa vallu gurthuku vastunnaru. Realy nice story Murali garu.
“Me story chaduvuthunnte maa vallu gurthuku vastunnaru.” ఇలా నా కథ గుర్తుచేసిందంటే అంతకంటే ఆనందం ఏముంది? Thank you for your lovely words
ఈ మధ్యకాలంలో ఇంతగా ఆలోచింపజేసిన కథ (?) లేదు. చాలా బాగా రాశారు. మీకు అభినందనలు.మిమ్మల్ని ఫాలో అవ్వడం తప్పదు 🙂
Thank you 🙂
painful
true
2 sarlu chadivani chala chala bagunadi
Thank you
వినాయకచవితి శుభాకాంక్షలండి,
chala bagundi, specially peddamma…keepit up
Thank you
చాలా బాగుంది. ఎవరినీ సమర్ధించ లేము, ఎవరినీ ఖండించ లేము. జీవితం ఇది. ఆ సమయంలో మనం అక్కడ ఉండి ఉంటె కొంతవరకు చక్కదిద్దగలం అనుకుంటాము. కాని, ఈ పరుగు పందెం లో మనకు సాధ్యం కానిదే.
అంతేనండి పరిస్థితులను అర్థంచేసుకుని ముందుకు వెళ్ళటం తప్ప ఏమీ చెయ్యలేం
intaku munde ee post pai comment raasa…….,mallee jeevani loa mee pelli vaartha chusi ikkadiki vaccha wish cheddaam ani”HAPPY MARRIED LIFE ” MURALI…..
———-Narsimha Kammadanam
Chala chaala baagundi
Thank you
Chala Chala Chala Chala bagundhi ……modhatlo…peddaamma valla illu antha….
Thanks Gopi garu