రాము ఓ దేవుడు

Vodka with Varma

Vodka with Varma

టైటిల్ చూసాక హా ఏముందిలే రామూ భజనపరుడి వ్యాసం అని చాలామంది ఇగ్నోర్ చేసి పేజ్ మార్చేసుంటారు. క్షమించాలి నాకు భజన చేసే ఆసక్తి, ఓపిక రెండూ లేవు. కేవలం రాము పేరు చూసి నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ పుస్తకాలు కొని, చదివిన పాపానికి డబ్బు, టైం రెండూ నష్టపోయినవాడిగా, రామూని కసి తీరా తిట్టాలని వ్రాస్తున్నా. కానీ దెయ్యం, రాక్షసుడు, డెవిల్, రావణాసురుడూ, ధుర్యోధనుడు వంటి బిరుదుల్ని ఆనందంగా ఆభరణాలుగా ధరించేవాడిని ఏమని తిట్టాలి? అందుకే రామూ దేవుడు అని తిడుతున్నా. మా నాన్నగారు నాస్తికులు, నాశిష్యులు యమనాస్తికులు, నేను పుట్టు నాస్తికుడ్ని అని చెప్పుకునే రామూకి ఇంతకంటే పెద్దతిట్టు ఏముంటుంది. అందుకే కసితీరా తిడుతున్నా రామూ ఓ దేవుడు.

దేవుడు రాయి రూపంలో ఏ చెట్టు కిందో, పుట్టలోనో కనిపించి తన ఉనికిని చాటుకోగానే దేవుడి పని అయిపోతుంది. ఆపైన ఆయన కదలకుండా కూర్చుని ఉంటే మిగిలిన హడావుడంతా చేసేది భక్తులే. ఆలయాలు కట్టినా, ట్రస్టులు పెట్టినా దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇక్కడా అంతే రామూ తనకున్న సినీ పరిజ్ఞానంతో కొంత, తనకున్న తిక్కతో మరింత, మీడియాలో చేసే కాంట్రవర్సీలతో మరికొంత ఇమేజ్‌ని సంపాదించుకుని ఒక మూల మందు తాగుతూ ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నాడు. ఇప్పుడా ఇమేజ్‌ని వాడుకోవటంలో ఎవడి సత్తా వాడు చాటుకుంటున్నాడు.

నా ఇష్టం పుస్తకం రామూ ఐడియానో, లేక ఎమెస్కో వారి ఐడియోనో నాకు తెలియదు కానీ అది తెలుగు ప్రింట్ పుస్తకాల మార్కెట్లో అప్పటి వరకూ ఉన్న రికార్డులు మార్చేసింది. రామూ అనే పేరుకున్న మార్కెట్ డిమాండ్ బయటపడింది. ఆ డిమాండ్‌ని ఉపయోగించుకోవటం కోసం ఎమెస్కో వారు రాము పై మరిన్ని పుస్తకాలకు తెర తీసారనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్‌లో రెండువారాల పాటూ జరిగే పుస్తక ప్రదర్శనని ఉపయోగించుకుంటే తమ మార్కెట్‌కి సరైన కిక్ స్టార్ట్ లభిస్తుందని అర్ధం చేసుకుని గత ఏడాది నా ఇష్టం లానే ఈ ఏడాది వోడ్కా విత్ వర్మని పుస్తక ప్రదర్శనలో వదిలారు.

వోడ్కా విత్ వర్మ ట్రైలర్ రిలీజ్ కాక ముందు సిరాశ్రీ అనే పేరు ఎంతమందికి తెలుసు? కనీసం సినిమా రంగంలో ఆ వ్యక్తి ఎంతమందికి పరిచయం? కొద్దో గొప్పో తెలిసిన వారికి కూడా కేవలం గ్రేటాంధ్ర వ్యక్తిగా తెలిసుండొచ్చు. అది కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. కేవలం పుస్తకంలో రచయిత చెప్పిన విషయాల బట్టి ఆ మాత్రం తెలుసని అనుకుంటున్నా. ప్రముఖ వ్యక్తి కాదు, రచయితగా పూర్వానుభవంలేదు అలాంటి వ్యక్తి వ్రాస్తున్న మొదటి పుస్తకానికే లక్షల ప్రింట్లు వేయించటానికి ఎమెస్కో వారు సిద్దపడ్డారంటే అది రామూ ఆశీర్వాద చలవే. తన చుట్టూ చేరిన వారిలో చాలామందికి డైరెక్షన్ అవకాశాలిచ్చి రాత్రికి రాత్రే డైరెక్టర్లని చేసేసే అపర బోళాశంకరుడు రామూ, సిరాశ్రీకి ఇచ్చిన జీవితకాల సాఫల్యావకాశం ఈ పుస్తకం అని నా అభిప్రాయం.

ఇక పుస్తకం విషయానికి వస్తే టైటిల్, కవర్ పేజ్ ఈ పుస్తకానికి కొండంత అండగా నిలిచాయి. పుస్తకాల షాపులో తిరుగుతున్న ప్రతివాడు ఈ పుస్తకాన్ని ఒకసారి చేతుల్లోకి తీసి చూసాడంటే అది ఆ రెంటి చలవే. పబ్లిషర్ పుస్తకం గురించి అని చెప్పి వ్రాసిన మొదటి పేజీలో రామూ ఒక బ్రహ్మపధార్ధం, ఒక కొరుకుడు పడని గుండ్రాయి, అతడిని అర్ధం చేసుకునే చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం అనే భారీ పసలేని పంచ్ డైలాగులతో పుస్తకం మొదలయ్యింది. ముందుమాట ఏ మాత్రం అవసరం లేని పుస్తకానికి ముందుమాట వ్రాసి పూరీ జగన్నాధ్ తేలిపోయాడు. అందులోనూ అత్యుత్సాహంతో

“ఆయన మాటలు వింటుంటే మనకి ఇంత వయసొచ్చినా ఇన్ని విషయాలు ఎలా తెలీలేదు సుమీ అనిపిస్తుంది.”
“ఈయనున్నాడనే ధైర్యంతో అయాన్ రాండ్ ని చదవడం మానేశాను”
“ఆయన సినిమాని కిందేసుకోని, మీదేసుకోని, పక్కలో ఏసుకోని పడుకుంటాడు”

వంటి మాటలతో తన స్థాయిని చాటుకున్నాడు.

పెగ్గులని పేరు పెట్టుకుని రచయిత మొదలెట్టిన చాప్టర్లు రౌండ్లు రౌండ్లు ముగుస్తున్నా విషయం చిక్కపడదు, చెప్పాలనుకున్న విషయం తేలదు. ఈ పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకుని నిక్కరేసుకుని శివ పోస్టర్లు చూసిన కాలం నుండి రామూకి షేక్ హ్యాండిచ్చే దాకా సాగిన జీవితాన్ని పుస్తకాలుగా వ్రాయొచ్చు అని రాము ప్రత్యక్ష శిష్యులు, ఏకలవ్య శిష్యులంతా తీర్మానించేసుకుంటే పుస్తకాల షాపుల్లో ర్యాకులన్నీ “వోడ్కా విత్ వర్మ”ల తోనూ, “తడ్కా విత్ ఊర్మిళ” వంటి పుస్తకాలతోనూ నిండిపోతాయి.

నాకు రాముని అడగలేని కొన్ని ప్రశ్నలున్నాయి వాటికి సమాధానం చెప్పగలవారు వీళ్ళే అని ప్రతి చాప్టర్లో చెప్పే రచయిత రామూ సన్నిహితులందరినీ ఒకే రకమైన ప్రశ్నలు వేసాడెందుకో? అందులోనూ ఫిల్మ్ మేకర్‌గా ఆయన పై మీ అభిప్రాయం, ఆయన సినిమాల్లో మీకు నచ్చినవి వంటి ప్రశ్నలు రామూయిజం స్థాయికి ఏ మాత్రం సరిపోనివి. రచయిత ఎంతో కష్టపడి సంపాదించాను అని చెప్పుకున్న రామూ వైఫ్, రామూ కూతురి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు వార్తాపత్రికల్లో తామే ప్రశ్న,సమాధానం వ్రాసుకునే శీర్షికల పంథాలో సాగాయి. ఎప్పుడూ మీడియా ముందుకి రాని వీరి అభిప్రాయాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఊదరగొట్టినందుకు, ఏవో అంచనలు పెంచుకున్న రామూ అభిమానులు నిరాశపడక తప్పదు. ప్రముఖ దర్శకులైన హరీష్ శంకర్, శివ నాగేశ్వరరావు, మధుర శ్రీధర్, దేవ కట్టా,  బివిఎస్ రవి వంటి వారి వ్యాసాలు కేవలం పేజీలు నింపటానికి మాత్రం పనికొచ్చాయి. వర్మ పెద్ద మేనమామ ప్రసాద్ రాజు గారి మాటల్లో ముక్కుసూటిదనం, మీడియా జర్నలిస్ట్ స్వప్న లాంటి వాళ్ళు చెప్పిన మాటల్లో బిట్వీన్ ద లైన్స్ వెతుక్కుంటే తప్ప పుస్తకం పాఠకుడికి మిగిల్చేదేమీ లేదు.

రచయిత తనకున్న రచనాసక్తిని, ప్రతిభని బయటకు తెచ్చే ప్రయత్నం ఎక్కడా చేసినట్టు కనపడదు. వర్మ తనని పూనాడని, తనూ వర్మలానే ఆలోచిస్తున్నాడని, తనూ వర్మలానే మాట్లాడుతున్నాడని చెప్పే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా తను ఇతర ప్రముఖుల పట్ల చూపే నిర్లక్ష్యం, వాళ్ళని తేలికచేసే మాటలతో, కాంట్రవర్సరీలతో పేజీలు నింపేసాడు. వర్మ కిస్ థియరీ, ఒక వివాహిత రామూ గురించి చెప్పిన అభిప్రాయాలు వంటివి ఈ పుస్తకానికి ఏవిధంగా ఉపయోగపడతాయో నాకు అర్ధం కాలేదు. వర్మ అన్నాక కాస్త మసాలా లేకపోతే ఎలా అనుకుని వీటిని పెట్టారేమో.

ఒక స్నేహితునితో ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు, తాగినప్పుడు మనిషిలో ఉండే నిజమైన థియరీలు బయటకొస్తాయి, అందులోనూ తాగిన వ్యక్తి రామూ అయితే ఆ థియరీలు చాలా ఆసక్తిగా ఉంటాయి అలాంటి డ్రింక్స్ టైమ్ డిస్కషన్స్ ఇందులో ఉంటాయని ఆశించాను అని చెప్పాడు. తెలుగు పాఠకులు ఎగబడి కొనుక్కుని చదవాల్సిన పుస్తకాలు కరువైపోయిన ఈ కాలంలో సంచలనాత్మక పుస్తకాలకి కావాల్సినంత డిమాండ్ ఉంది. అందులోనూ వర్మలాంటి సంచలనాత్మక వ్యక్తి తోడయితే ఆ డిమాండ్ మరింత పెరుగుతుందని రుజువయిపోయింది. వర్మ బ్లాగు నుండి తెచ్చి పెట్టిన వ్యాసాలతో నింపిన నా ఇష్టం, ఇదివరకే జనాలందరికీ తెలిసిన విషయాలనే మరలా చెబుతూ వచ్చిన వోడ్కా విత్ వర్మ ఈ డిమాండ్‌ని వాడుకున్నాయే తప్ప ఎవరినీ సంతృప్తిపర్చలేదు. మరిన్ని పుస్తకాలు భవిష్యత్తులో రాబోతున్నాయనేది సుస్పష్టం. ఈసారి వ్రాసేవాడు మన డబ్బుకి న్యాయం చేసేవాడు కావాలని ఆశిద్దాం.

“తనని ఆకట్టుకోవాలంటే ఆడవాళ్ళయితే చాలా సెక్సీగా ఉండాలి, మగాళ్ళయితే మేధావులై ఉండాలి” అని చెప్పుకునే రామూ ఆ మాటకు కట్టుబడి ఉంటే ఈ పుస్తకంలో వ్యాసాలు వ్రాసిన చాలామంది ప్రముఖుల్ని జీవితంలో మరలా ఎప్పుడూ వోడ్కాకి పిలవడని, కలవడని నమ్ముతున్నా.

నోట్: కినిగె ఈ పుస్తకాన్ని 10% తగ్గింపు ధరకు అందిస్తుంది.

వోడ్కా విత్ వర్మ On Kinige

పెద్దమ్మాల ఇల్లు

ఆరు నెలల అమెరికా వాసం తర్వాత ఆరోజే ఇంటికొచ్చాను. అంతలోనే బావ పెళ్ళి అని వైజాగ్ బయలుదేరమని హడావుడి మొదలుపెట్టింది మమ్మీ. నాకింకా జెట్‌లాగ్ కూడా పోలేదు మొర్రో అన్నా వినిపించుకోలేదు. కావాలంటే కారులో పడుకో బయలుదేరు అని ఒకటే నస. అమ్మమ్మ, అత్తలు అందరూ నవ్వుకుంటున్నారు. మాతృవాక్యాపరిపాలనాబద్దుడిగా పాతికేళ్ళ ఇండస్ట్రీ మనది. ఈరోజున పుసుక్కున అందరి ముందు కాదంటే పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని తలాడించా.  జీన్సు, టీషర్టు వేసుకుంటుంటే “ఇదేంటి ఈ బట్టలతోనా పెళ్ళికి? మంచి బట్టలు వేసుకుని ఇన్‌షర్ట్ చేసుకునిరా” అంది. నాకేమీ అర్ధంకాక క్వశ్చన్ మార్క్ మొహంపెట్టాను.

“ఈ పెళ్ళిలో నీ పెళ్ళి కుదిరిపోవాలనుకుంటుందిరా మీ అమ్మ. వెళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే కదా” అంది అమ్మమ్మ నవ్వుతూ.  “వీలయితే టై పెట్టుకుని సూటేసుకుని రారా” అంది మరింత నవ్వుతూ అక్క.

నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్నప్పుడు వీధిలో అందరూ మీ అబ్బాయి చాలా బుద్దిమంతుడు అంటుంటే మురిసిపోయి తలొగ్గిన పాపం ఇప్పటికీ వెంటాడుతుంది. ఇంక చేసేదేమీ లేక ఫార్మల్ డ్రెస్‌లో బయలుదేరాను. అరబాటిల్ సెంటు నా మీద జల్లింది.  అందరూ పెళ్ళిలో నా గురించి యోజనగంధుడని చెప్పుకోవటం ఖాయం.

అందరం పెళ్ళి జరుగుతున్న ఫంక్షన్‌హాల్ చేరుకున్నాం. చుట్టాలంతా పలకరిస్తున్నారు. నేను కూడా నవ్వుతూ బాగున్నారా అని అడిగేసి వెళ్ళి ఒక మూల కూర్చున్నా. పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా చేసారు. అబ్బాయి అమెరికాలో సాఫ్టువేర్ ఇంజనీర్. పెళ్ళికి అత్తవారు పెడుతున్న లాంఛనాలు అన్నీ కలిపి మూడుకోట్ల పైమాటే. అందుకే ఇంత ఘనమైన ఏర్పాట్లు. సాఫ్టువేర్ ఉద్యోగాలొచ్చాక మధ్యతరగతి బ్రతుకులెంత మారిపోయాయి అనిపించింది. మమ్మీ దూరం నుండే అందరితో మాట్లాడమని సైగచేస్తుంది. నేను రానుకాకరాను అని చెప్పి సెల్‌ఫోనులో స్నేహితులతో చాటింగ్ చేస్తూ కూర్చున్నా.

ఇంతలో మురళీ ఎవరొచ్చారో చూడు అని గట్టిగా పిలిచింది. అబ్బా మరలా మొదలుపెట్టింది అనుకుని చూసేసరికి శేఖరన్నయ్య. శేఖరన్నయ్య మా పెద్దమ్మ కొడుకు. అన్నయ్యని చూసి చాలా కాలమయ్యింది పరిగెట్టుకుంటూ వెళ్ళాను. కుశల ప్రశ్నలు,కబుర్లు,భోజనాలు కానిచ్చాం. భోజనాలయ్యాక చాలా రోజులయ్యింది కదరా ఇంటికి రావొచ్చుగా అనిపిలిచాడు అన్నయ్య. నువ్వు వెళ్ళన్నయ్యా నేను ఒక అరగంటలో వస్తా అని చెప్పాను. అన్నయ్య సరే చూస్తుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు.

అన్నయ్య వెళ్ళాక అక్కడే ఆలోచిస్తూ కూర్చున్నా. మనసులో పెద్దమ్మాల ఇల్లు కదులుతుంది. ఒకవైపు వెళ్ళాలనే ఉన్నా మరో వైపు వెళ్ళి నాకున్న మధుర జ్ఞాపకాలను శిధిలం చేసుకుంటానేమోనని భయం. నా పసితనంలో వేసవి సెలవులు గడిపింది పెద్దమ్మాలింట్లోనే. అందమైన పురిల్లు, ఇంటికి ముందు ఉసిరి చెట్టు, ఇంటి వెనుక మావిడిచెట్టు. ఇవికాక కనకాంభరాలు, మందారాలు, గులాబీలు ఇలా బోలేడన్ని పూలమొక్కలు ఉండేవి ఇంటి చుట్టూ.  పిల్లలం ఆడుకోవటానికి కావాల్సినంత స్థలం ఉండేది

మా పెద్దమ్మ పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టే పెద్ద బొట్టు పెట్టుకుని నిత్యం లక్ష్మీ కళతో ఉండేది. పెద్దమ్మకి ముగ్గురు పిల్లలు. వాళ్ళతో సమానంగానే నన్ను చూసేది. అందరికంటే చిన్నవాడినని నేనంటే కాస్త ముద్దు. నాకు అన్నం తనే కలిపి తినిపించేది. అంత పెద్ద సంసారాన్ని పెదనాన్న తెచ్చే జీతంతో గుట్టుగా నడిపేది. మేమెంత అల్లరి చేసి వీధిలో గొడవలు పెట్టుకుని వచ్చినా ఓపిగ్గా అందరికీ సర్ది చెప్పి పంపేసి మమ్మల్ని ముద్దుచేసేది. పెద్దమ్మ కల్మషంలేని నవ్వు ముందు పేదరికం,కష్టాలు నిలవలేకపోయేవి.

అందరి పిల్లల్లానే మాకూ మా అన్నయ్యంటే ఒక హీరో అనే ఫీలింగ్. ఎప్పుడూ అన్నయ్య వెంటే తోకల్లా తిరిగేవాళ్ళం. అన్నయ్య చప్పట్లు కొడితే వెలిగే లైట్లు తయారు చేసి చూపించేవాడు. బీచ్‌కి తీసుకెళ్ళేవాడు. బీచ్ నుండి ఏరుకొచ్చిన గవ్వల్ని ఫెవికాల్తో అతికించి శివలింగం చేసేవాడు. ఎన్నో కధలు చెప్పేవాడు, ఏవో మాజిక్కులు చేసేవాడు. అన్నయ్య ప్రాక్టికల్ జోక్స్ వెయ్యటంలో దిట్ట.

ఒకరోజు రాత్రి నల్లకోటు,నల్ల కళ్ళద్దాలు,మహాలాక్టో చాక్లెట్లకి ఇచ్చే బన్నీ పళ్ళు పెట్టుకుని చీకట్లో దాక్కున్నాడు. వీధిలో ఉండే ఒక ముసలావిడ చీకట్లో అటురాగానే ఆ బన్నీ పళ్ళు బయటకి కనిపించేలా పెట్టి “బామ్మా బాగున్నావా?” అని అడిగాడు.  పళ్ళు మాత్రమే కనిపించేసరికి ముసలావిడ బెంబేలెత్తిపోయి పెద్దగా అరుస్తూ పారిపోయింది. పెద్దమ్మకి విషయం తెలిసి వచ్చి మమ్మల్ని మందిలించే వరకూ మేమంతా పడీ పడీ నవ్వుకున్నాం.

అందుకే పెద్దమ్మాల ఇల్లంటే పుస్తకాల్లో దాచుకున్న నెమలీకలా ఒక పసితనపు వాసన. ఆ అమాయకపు చేష్టలు, ఆ అల్లరి తలుచుకుంటే అప్రయత్నంగా పెదాలపై చిరునవ్వు విచ్చుకుంటుంది. బ్రతకటం ఒక పరుగు పందెం అయిపోయిన నాకు మరలా ఏ మజిలీలోనూ అంత ఆనందం దొరకలేదు.

పెద్దవాడినయ్యి కాలేజీలో చేరాక సెలువులు లేక పెద్దమ్మ దగ్గరకి వెళ్ళటం తగ్గింది. ఒకరోజు పెదనాన్నకి పక్షవాతం వచ్చిందని పెద్దమ్మ ఆందోళనగా ఫోను చేసింది. పరీక్షలు ఉండటంతో నాకు వెళ్ళటం కుదరలేదు. డాడీ మాత్రం వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడి అందరికీ ధైర్యం చెప్పి వచ్చారు. డాడీ తిరిగి వచ్చాక అందరూ ఎలా ఉన్నారని అడిగాను.

“పెద్దోడు బాగా బెంగ పెట్టేసుకున్నాడురా. వాడికి  ఏడ్చి ఏడ్చి సైనెస్ ఎక్కువయ్యింది. జాబ్‌కి లీవు పెట్టేసాడు.  పెదనాన్నని రోజూ ఫిజియో దగ్గరకి తీసుకునివెళ్తున్నాడు. పెదనాన్న జీతం లేకపోవటంతో ఇల్లు గడపటం కష్టమవుతున్నట్టుంది. మీ పెద్దమ్మ సంగతి తెలిసిందే కదా ఇల్లు గుట్టుగా నడుపుకొస్తుంది” అని చెప్పేప్పుడు డాడీ గొంతులో అరుదుగా వినిపించే ఒక సన్నని జీర. ఎప్పుడూ గంభీరంగా ఉండే డాడీ అలా మాట్లాడేసరికి మనసులో నాకు కూడా దిగులు కమ్మేసింది.

అన్నయ్య మాత్రం పెదనాన్న ఆరోగ్యం బాగుపడే దాక వెంటే ఉండి అన్ని సేవలూ చేసాడు. అన్నయ్య చేసిన సేవకి కొద్దిరోజుల్లోనే పెదనాన్న తేరుకున్నారు. నాకంటూ ఒక వ్యక్తిత్వం నిర్మించుకుంటూ, మరొకరి గొప్పతనాన్ని ఒప్పుకునేందుకు తటపటాయించే ఆ వయసులో కూడా తల్లిదండ్రులంటే తనకున్న ఇష్టంతో అన్నయ్య ఎప్పటిలానే నా మనసులో తన హీరోయిజం నిలబెట్టుకున్నాడు. అన్నయ్య,  పెదనాన్న ఇద్దరూ లీవులో ఉండటంతో నాలుగు నెలలపాటూ జీతం లేదు. ఇంటి ఖర్చులకి, పెదనాన్న మందులకి తన బంగారాన్ని కుదవపెట్టి డబ్బులు సర్దింది పెద్దమ్మ. చుట్టాలకి ఆ ఇంటి కష్టాలు ఎప్పుడూ తెలియనిచ్చేది కాదు.

పెద్దమ్మకి ఒకే ఒక్క కూతురు సుధారాణి. సుధక్కకి పెళ్ళీడు వచ్చింది. పెద్ద పెద్ద కట్నాలిచ్చే పరిస్థితా లేదు. పెదనాన్నని చూస్తే లౌక్యం తెలియని మనిషి. అందుకే ఇల్లు చెదిరిపోకుండా, అక్క జీవితమూ బాగుండేలా పెద్దమ్మ సొంత తమ్ముడయిన శంకర్ మావయ్యకే ఇచ్చి చేసింది. అన్నయ్యకి కూడా దగ్గర భందువుల్లోనే ఒక అమ్మాయిని తెచ్చి చేసింది. అందరూ మనవాళ్ళే అయితే ఇల్లు ముక్కలు కాదని పెద్దమ్మ నమ్మకం. చాలారోజులకి ఆ పెళ్ళికి పెద్దమ్మవాళ్ళింటికి వెళ్ళాను. పెదనాన్న ఆరోగ్యంగా కనిపించారు. పెద్దమ్మ చాలా ఆనందంగా కనిపించింది. పెద్దమ్మ చేతులు మీదగా పెళ్ళంతా సందడి సందడిగా గడిచిపోయింది.

తర్వాత మరలా తీరికలేని నా కాలేజీ జీవితంలో పడిపోయాను. ఫోనులో మాట్లాడటం తప్ప నేరుగా వెళ్ళి ఎవరినీ చూసిందిలేదు. వదినకి, సుధక్కకి కొన్ని విషయాల్లో పడటంలేదని అట కబుర్లు వినేవాళ్ళం. ఏన్నో ఏళ్ళుగా ఆ ఇంటిలో ఎదురులేని సుధక్క కొత్తగా వచ్చిన వదినని అదుపులో పెట్టాలనుకుంది. కానీ సహజంగా గడుసుదైన వదిన ఇంటి కోడలిగా పెత్తనం తనకే దక్కాలనుకునేది. ఒకసారి కాస్త పెద్ద గొడవే అయితే రాజీ కోసం డాడీని పిలిచారు. డాడీ ఏదో సర్దిచెప్పి వచ్చారు. కానీ గొడవలు పూర్తిగా సమసిపోలేదు. ఏళ్ళుగా ఇంటిని నడిపిన పెద్దమ్మ ఈ పరిస్థితిని కూడా చేయి దాటకుండా దూరంగా ఉంటేనే ప్రేమలు మిగులుతాయని సుధక్కకి వేరే ఇల్లు చూసి అక్కడ కాపురం పెట్టించింది. ఎదురెదురుగా లేకపోవటంతో గొడవలు తగ్గాయి. పండగలకి పబ్బాలకి కలుసుకున్నా, ఉన్న ఆ ఒక్కరోజుకి ఎవరూ బయటపడకుండా కాస్త నవ్వుతూ గడిపేసేవారు.

హమ్మయ్య ఇల్లు కాస్త చక్కబడింది అనుకునేంతలో పెద్దమ్మకి పెద్ద ప్రేగులో క్యాన్సర్ ఉందని తెలిసింది. కడుపునొప్పని డాక్టరు దగ్గరకి వెళితే టెస్టుల్లో బయటపడింది. ఆపరేషన్ వీలైనంత త్వరగా చెయ్యాలన్నారు. డాడీ వెంటనే బయలుదేరి వెళ్ళారు. రెండు రోజులు ఆగి నేను వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికే ఆపరేషన్ పూర్తయ్యింది. మామూలుగానే సన్నగా ఉండే పెద్దమ్మ తిండి లేక కేవలం సెలైన్లా మీదనే ఉంటోంది. శరీరం మీద చర్మమే తప్ప కండనేది మచ్చుకి కూడా కనబడలేదు. నాకు అన్నం తినిపించిన ఆ చేతులను అలా నిస్తేజంగా నీరసంగా చూడటంతో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నన్ను చూడగానే రా రా అనిపిలుస్తూ చెయ్యి ఎత్తే ప్రయత్నం చేసి, నొప్పికి ఇంక ఎత్తకుండా ఆగిపోయింది. భగవంతుడి నిర్ధయ కళ్ళముందు కరుడుగట్టిన నిజంలా కనిపిస్తుంటే ఆయన్ని ఎంత తిట్టానో నాకే తెలియదు. కాసేపు మాట్లాడాక నిద్రపోయింది. “ఇంక అంతా పర్వాలేదు రేపు ఇంటికి తీసుకు వెళ్తాం” అని చెప్పాడు అన్నయ్య. అన్నయ్య కూడా బాగా చిక్కిపోయాడు. నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉండటంతో డాడీ,నేను ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసాం.

పరీక్షలకి చదువుకోవటంలో బిజీ అయిపోయాను నేను. ఆ సెమిస్టర్ పేపర్లు కొంచెం కష్టంగా ఉండటంతో భయం భయంగా చదువుతున్నాను. అర్ధరాత్రి ఫోను వచ్చింది పెద్దమ్మ ఇక లేదని.  ఆ కబురు వినగానే కళ్ళ ముందు చీకటి కమ్మేసింది. మరుసటిరోజు నాకు పరీక్ష. నేను వెళ్ళటం కుదరదు. చివరిసారి పెద్దమ్మని చూడలేకపోతున్నా అనే ఆలోచన మెదడులోకి రాగానే పుస్తకం మూసేసి అలానే మంచం మీద పడిపోయాను. చేతిలో పెట్టెతో వెళ్తున్న డాడీకి ఎదురొచ్చి “మురళిని తీసుకురాలేదా” అని నిరాశగా అడుగుతున్న పెద్దమ్మ కనిపించింది. నేను దిగ్గున లేచి చుట్టూ చూసాను. అది నిజం కాదు కల. అవును పెద్దమ్మ ఇకపైన ఒక కల మాత్రమే అని ఏడుస్తూ రాత్రంతా అలానే ఉండిపోయాను.

పరీక్షలయ్యాక పెద్ద కార్యానికి వెళ్ళాను. దిగులు ముఖంతో ఎదురుగా అన్నయ్య.

“పరీక్షలంట కదరా” అని అడిగాడు అన్నయ్య. అన్నయ్య మామూలుగానే అడిగినా, నాకు మాత్రం ఆ ప్రశ్న యాంత్రిక జీవితాల పైకి మానవ సంభందాలు సంధించిన బాణంలా అనిపించింది. నా దగ్గర సమాధానంలేదు. మౌనంగా అవునన్నట్టు తలూపాను.

“వెళ్ళిపోయే ముందు తృప్తిగా చూసుకుందామని అందరినీ పిలిచిందిరా. మురళి వచ్చాడా అని అడిగింది.” అని మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య. నేను అన్నయ్య పక్కనే మౌనంగా కూర్చున్నా. గడిచిపోయిన ప్రతీ క్షణం విలువైనదే, తిరిగి తీసుకురాలేము. అందులోనూ ఆ గడిచిపోయిన క్షణం పెద్దమ్మ చివరిచూపయితే దాని విలువెంతో నాకప్పుడే తెలిసింది. పెదనాన్నని చూస్తే బాధనిపించింది. ఇన్నేళ్ళుగా తన ఇంటిని,తనని నడిపిన తోడు ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆయన మొహం చూస్తే అర్ధమయ్యింది. సాయంత్రం వరకూ ఉండి వచ్చేసాను.

పెద్దమ్మ వెళ్ళిపోవటంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆస్థి గొడవలు మరలా బయటపడ్డాయి. పెద్దమ్మ లేకపోవటం వలన, జరుగుతున్న ఆస్థి గొడవల వలన ఆ ఇంటికి చుట్టాల రాకపోకలు తగ్గాయి. ఏడాది లోపు శుభకార్యం జరిపించాలని చిన్న అన్నయ్యకి సంభందం చూసారు. చిన్న అన్నయ్య పెళ్ళికి భందువులందరూ వచ్చినా పెద్దమ్మలేని లోటు తెలుస్తూ ఉంది. పెళ్ళిలో సందడిలేదు. అన్నింటినీ సంభాళించుకునే పెద్ద దిక్కులేదు. మంటపంలో పెళ్ళి తతంగం నడుస్తూ ఉంది. భోజనాల దగ్గర ఏదో గొడవ. చూస్తే ఆడపెళ్ళి వారు మావయ్యని,పెద్ద అన్నయ్యని ఏదో అంటున్నారు. ఆవేశంగా నేనూ వెళ్ళా గొడవలోకి. పెద్దలందరూ వచ్చి సర్ది చెప్పారు. చిన్నన్నయ్య మండపం లో నుండి కనీసం ఏంటా గొడవ అని కూడా అడగలేదు. పెళ్ళి తతంగం ముగిసిన వెంటనే కనీసం పెద్దన్నయ్యకి చెప్పకుండానే ఆడపెళ్ళివారితో అత్తవారింట మొదటిసారి గడప తొక్కటానికి కారెక్కి వెళ్ళిపోయాడు.

నేను పెద్దన్నయ్యని “వీడేంటి మనకి చెప్పకుండా కారెక్కాడు” అని అడిగా.

“నీకు తెలియదురా పెళ్ళి అనుకున్న నాటి నుండి ఆడపెళ్ళివారు చీటికి మాటికి వాడిని పండగ అని పిలిచి, అడ్డమైనవి చెప్పి చివరికి ఆస్థి గొడవల్లో కూడా దూరారు.ఇప్పుడు వాడు మనం చెప్పింది కాదు వాళ్ళు చెప్పిందే వింటాడు” అని చెప్పాడు పెద్దన్నయ్య. పెద్దమ్మాల ఇల్లు ముక్కలయిపోయింది అని అర్ధమవుతూ ఉంది.

“కనీసం పెదనాన్నకయినా చెప్పొచుగా” అన్నాను నేను.

“అసలు ఆ ముసలోడి వల్లే జరుగుతుంది ఇదంతా. వయసయిపోయింది కదా ఇక ఆయన పోతేనే మంచిది. ఈ సంభందం ఆయనే తెచ్చి మా నెత్తికి ఎక్కించాడు” అని కోపంగా అరుస్తూ అన్నాడు అన్నయ్య.

నాకు బుర్రతిరిగింది. అన్నయ్యేనా పెదనాన్నని ఇలా అంటుంది. పెదనాన్నకి ఆరోగ్యం బాగోకపోతే ఉద్యోగం వదిలేసి జీవితం నాశనం చేసుకోవటానికి సిద్దపడ్డ అన్నయ్యేనా ఇలా అన్నది. అప్పుడే మొదటిసారి తెలిసింది హీరోలు కూడా సాదారణ మనుషులే అని. భయం వేసింది నాకు. కాలపరీక్షలో ఎంతటివాడయినా రూపాన్ని మార్చుకోవాల్సిందేనా? రేపు నేనయినా ఇంతేనా? ఏ వ్యక్తుల స్పూర్తితో వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నానో వారే కాలానికి దాసోహమంటే నేను మాత్రం ఎదురొడ్డి నిలబడగలనా? ఇంకేం మాట్లాడలేదు నేను. పెళ్ళి పనులు పూర్తవ్వగానే ఇంటికి వచ్చేసా.

పెద్దమ్మాల ఇల్లు, ఆ మనుషులు నా మనసులో ఉన్న స్థానం నుండి పడిపోయారో లేక పడిపోతారన్న భయం చేతో మరలా ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్లలేదు. ఇన్నిరోజులకి అన్నయ్య వచ్చి అడగటంతో నాకు వెళ్ళాలని అనిపించింది. మమ్మీ అందరితో మాట్లాడుతూ హడావుడిగా ఉంది. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఏ పనిలేని వాడిని నేనే అందుకే కారు తీసుకుని బయలుదేరాను.

వీధంతా బాగా మారిపోయింది. పెద్దమ్మవాళ్ళ ఇల్లు కూడా చిన్న అన్నయ్య పెళ్ళినాటికే మొక్కలు చెట్లు తిసేసి డాబా ఇల్లుగా మార్చేసారు. ఇంతకు ముందులా మనుషులు బయట కూర్చుని కబుర్లు చెప్పుకోవటాలు లేవు. అందరూ టి.వి.ల ముందు కూర్చున్నట్టున్నారు. పెద్దమ్మ ఉండే రోజుల్లో వీధి చివర బ్యాగు పట్టుకుని కనిపించగానే ఎవరొస్తున్నారో చూడండి అని అందరినీ పిలిచి సందడి చేసేది. ఆ ఆప్యాయత కరువయ్యింది.

కారు దిగి వెళ్ళి తలుపుకొట్టా. పెద్ద వదిన వచ్చి తలుపు తీసింది. ఇంట్లో అడుగుపెడుతూ ఉంటే ఎదురుగా పెదనాన్న. కుశల ప్రశ్నలయ్యాక సోఫాలో కూర్చున్నా. చిన్న వదిన వచ్చి పలకరించి తాగటానికి మంచి నీళ్ళిచ్చింది. టీ పెడతా అని లోపలికి వెళ్ళింది. వదినలిద్దరితో కబుర్లు చెబుదామని వంట గదిలోకి వెళ్ళాను.

లోపలకి పోయి చూస్తే రెండు గ్యాస్ స్టవ్వుల మీద ఇద్దరు వదినలూ టీ పెడుతున్నారు. అయోమయంగా ఇంటిలోకొచ్చి చూద్దును కదా రెండు బీరువాలు చెరో బెడ్‌రూమ్‌లో. రెండు ఫ్రిజ్‌లు, రెండు టి.వి.లు అన్నీ రెండేసి చెరో బెడ్‌రూమ్‌లో. ఆశ్చర్యంగా పెదనాన్న వైపు చూసాను. ఆయన ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు.

సుధక్క ఎక్కడుంది అని అడిగా? అందరూ ఒక్కసారి నా వైపు అదోలా చూసారు. మరలా అడిగాను. ఎవరూ సమాధానం చెప్పలేదు.  అన్నయ్య మేడ మీద వాకింగు చేస్తున్నాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగా సుధక్క ఇప్పుడు ఎక్కడ ఉంటుందీ అని.

“దాని ఊసెత్తుకురా. డాడీ నువ్వు చిన్నోడివని నీకు చెప్పి ఉండర్రా. అది మన ఇంటి పరువు తీసే పని చేసింది. ఒకరోజు షాపింగుకని చెప్పి పిల్లాడిని మన ఇంట్లో ఉంచి ఎవడితోనో వెళ్ళిపోయిందిరా. రెండురోజులు వెతికి పోలీసు కంప్లైంటు కూడా ఇచ్చాము. తర్వాత వీధిలో వాళ్ళే అప్పుడప్పుడు ఒకడితో వీధిలో మాట్లాడేది మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్పారు. వాడెవడో తెలుసుకుని వాడికి తెలియకుండా వెంబడించి ఆచూకీ తెలుసుకున్నాము. ఆరా తీస్తే తెలిసింది వాడు కూటికి లేని దరిద్రుడు. పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు. దీనికి ఏవో మాటలు చెప్పి తీసుకుని వెళ్ళి వంటి మీద మొత్తం బంగారం అమ్మేసి ఒక ఇరుకు ఇంటిలో ఉంచాడు.

చూడగానే ఏడుపొచ్చింది. ఏంటే ఇదంతా అని అడిగితే మీరొద్దని వచ్చేస్తే మరలా ఎందుకొచ్చారు అంది. పసిపిల్లాడి మొహం చూసయినా నీకు ఇది తప్పనిపించలేదా అని అడిగాను. వాడు కూడా నాకు వద్దనుకున్నాకే వచ్చేసా అందిరా. పిల్లాడు అమ్మా అమ్మా అని పిలుస్తున్నా దాని మనసు కరగలేదు. నాకు కోపం వచ్చి గొడ్డును బాదినట్టు బాది ఇంటికి తీసుకొచ్చాను. మావయ్యకి దాని మొహం కూడా చూడాలని లేదు. కానీ పిల్లాడి కోసం ఇద్దర్నీ అమ్మమ్మ వాళ్ల ఊరు పంపేసి, పిల్లాడ్ని అక్కడ స్కూల్లో వేసారు. మన పరువు మొత్తం పోయిందిరా.” అని బాధగా నిట్టూరుస్తూ చెప్పాడు అన్నయ్య.

నేను మౌనంగా ఉండిపోయాను. ప్రస్తుత సమాజంతోనూ, నేను చదివిన కధల్లో స్త్రీల సంఘర్షణలతోనూ పోల్చి చూస్తే సుధక్క చేసిన పనికి కూడా, తన సొంత కారణాలుంటాయి అని నా మనస్సుకి అనిపించేది. కానీ కుటుంబం, పరువు, ప్రతిష్ట అనే పదాలు చుట్టూ వినబడుతున్న ఆ క్షణంలో అదొక దుర్మార్గంలానే అనిపించింది.

“ఏరా బాధపడుతున్నావా?” అని అడిగాడు అన్నయ్య. నేను మాట్లాడలేదు. మాట్లాడటానికి ఎంతవెతికినా మాటలు దొరకలేదు. అన్నయ్య వచ్చి అనునయిస్తూ నా భుజం మీద చెయ్యివేసాడు.

“పెద్దమ్మ తోనే ఈ ఇంటికున్న లక్ష్మీకళ పోయిందన్నయ్యా.” అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కారెక్కాను.

వదినలిద్దరూ చేరో టీ కప్పు పట్టుకుని పిలుస్తూనే ఉన్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేసాడు.

మాకు మరోసారి పెళ్ళయింది

సెల్‌ఫోన్ మోతతో ఉదయం తొమ్మిది గంటలకి లేచాను. ఆఫీసు నుండి ఏదో పని గురించి ఫోన్ చేసారు. ఫోన్‌లో చెప్పాల్సినవి చెప్పేసి తిరిగి పడుకుందామనుకుని మంచం మీద వాలాను. కానీ తిరిగి నిద్ర పట్టలేదు. లేచి బెడ్‌రూం నుండి బయటకి వచ్చి చూసాను. అన్ని తలుపులూ మూసి ఉన్నాయి. “అంటే సాహిత్య ఆఫీసుకి వెళ్ళిపోయిందన్నమాట. కనీసం వెళ్ళేప్పుడు చెప్పొచ్చుగా” అనుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు చూసాను. టిఫిన్ వండి పెట్టేసి వెళ్ళిపోయింది. గిన్నెల్లో వండినదంతా వండి నట్టే ఉంది. తను మాత్రం తినకుండా వెళ్ళిపోయిందని అర్ధమయ్యింది.

నాకూ ఆఫీసుకి టైం అవ్వటంతో ఆలోచనలని పక్కనపెట్టి ఆఫీసుకి తొందరగా తయరయ్యాను. టిఫిన్ చెయ్యాలనిపించలేదు. ఒకటి తినేందుకు మనస్కరించలేదు, రెండు కష్టపడి చేసింది పోని తిందామనుకున్నా, తను తినలేదనే విషయం తెలిసి కూడా నేను తింటే, తనని నేను కేర్ చెయ్యటం లేదు అనే తన అనుమానానికి ఇది మరొక సాక్ష్యం అవుతుందేమో అని భయం వేసింది. డైనింగ్ టేబుల్ వైపే చూస్తూ బయటకి నడిచాను.

కారులో వెళ్తూ ఉంటే ఒకటే ఆలోచనలు. ఎందుకు మా మధ్య ఇంత దూరం పెరిగింది? టిఫిన్ తినలేదంటే నా మీద అలిగి కోపం చూపించాలనుకుంది. కానీ వెళ్ళేప్పుడు నన్ను నిద్ర లేపి చెప్పటానికి ఏమయ్యింది? ఆ మాత్రం కర్టసీ కూడా మిగల్లేదా? మా మధ్య రిలేషన్ చివరి దశలో ఉందా? అసలు ఇన్నాళ్ళలో మా మధ్య ఎటువంటి రిలేషన్ ఏర్ప్పడలేదా? మూడేళ్ళుగా ఒక అబద్దపు బ్రతుకు బ్రతుకుతున్నామా? అసలు సాహిత్య నన్న్ను ఇష్టపడే పెళ్ళి చేసుకుందా? లేక తన జీవితంలో కొత్తగా మరెవరయినా… సడెన్ బ్రేక్ వేసి కారు ఆపాను. బ్రేక్ వెయ్యటం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే ఎదురుగా వస్తున్న సైకిల్ని గుద్దేసేవాడ్ని. పాపం పదేళ్ళుంటాయెమో ఆ సైకిల్ మీదున్న పాపకి. భయం భయంగా నా వైపు చూస్తూ సైకిల్ దిగి నడుచుకుంటూ కారు దాటి వెళ్ళిపోయింది.

ఆఫీసులోకి వచ్చి నా కంప్యూటర్ ముందు కూర్చున్నా. మెయిల్స్ అవీ చూసుకున్నా పెద్దగా పనేం లేదు. ఏమీ తోచక మానిటర్నే చూస్తూ కూర్చున్నా. నా క్యూబికల్‌లోనే ఉండే రవి వచ్చి నా డెస్క్ ఎక్కి కూర్చుని నా బాటిల్‌లో నీళ్ళు తాగుతున్నాడు.

“రేయ్ శరత్‌గా నీకు తెలుసా? మన రాజు గాడు,శశి విడాకులకు అప్లై చేసారంట.” అనే ముక్క వాడు చెప్పే వరకూ వాడి వైపన్నా చూడలేదు నేను.

కాస్త ఆందోళనగా చూసిన నా చూపుని అడ్వాంటేజ్‌గా తీసుకుని కధని మరింత ఉత్కంఠగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు రవి. మధ్య మధ్యలో ఆగి నా వైపు దీర్ఘంగా చూసి మరలా కొనసాగిస్తున్నాడు. ఆ ఆపటం నాలో సస్పెన్స్ క్రియేట్ చెయ్యటానికి అనుకుంటా. కానీ వాడు చెప్పేది ఏదీ నేను వినటం లేదనే విషయం వాడికి తెలియదు. నా ఆలోచనల్లో పడి నేను కొట్టుకుపోతుంటే అదే నా ఇన్వాల్వ్‌మెంట్‌గా తీసుకుని సాగిపోతున్నాడు.

రాజు,శశి నాకు కాలేజ్ రోజుల నుండీ తెలుసు. ఇద్దరూ దాదాపుగా ఆరేళ్ళు ప్రేమించుకుని ఇంటిలో ఒప్పుకోకుంటే ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. ఈమధ్యే వాళ్ళ పెద్దలు రాజీకొచ్చారు. ఇంకేముంది అంతా సుఖమే అనుకుంటే ఇప్పుడు ఈ విడాకుల గొడవేంటో నాకు అర్ధం కాలేదు.

“శశి ఏడుస్తూ చెబుతుందిరా. రాజుగాడు పెళ్ళయ్యాక మారిపోయాడంట. ఇంటికొచ్చి తిని పడుకుంటాడంట. తనని అసలు పట్టించుకోడంట. పైగా నీ జీతం ఏం చేస్తున్నావ్? నాకు చెప్పకుండా ఖర్చుపెట్టకు అని రూల్స్ పెడుతున్నాడంట.” రవిగాడు చెబుతున్నాడు. ఇంతలో నా సెల్ రింగ్ అయ్యింది. “సౌమ్యా కాలింగ్” అని చూడగనే సెల్ తీసుకుని బయటకి నడిచాను. సౌమ్య అంటే సాహిత్య కొలీగ్. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అసలు సౌమ్య నాన్నగారే మా పెళ్ళి కుదిర్చింది. ఆయన మా రెండు కుటుంబాలకూ కామన్ ఫ్రెండ్.

“హా సౌమ్యా చెప్పు” రూమ్ నుండి బయటకి వచ్చి, కారిడార్లో ఒక మూల నా మాటలు ఎవరికీ వినపించని చోట నిలబడి మాట్లాడుతున్నాను.

“శరత్! ఈ మధ్య సాహి రోజూ ఆఫీసులో కూర్చుని ఏడుస్తుంది. లేదా ఎటో చూస్తూ ఆలోచిస్తుంది. మీ ఇద్దరికీ ఏ సమస్యలున్నాయో నాకు తెలియదు. కానీ దానిని ఇలా చూడలేకపోతున్నాను. రోజు రోజుకి పిచ్చిదానిలా అయిపోతుంది. ప్లీజ్ తనని ఏదోలా కమ్‌ఫర్ట్ చెయ్యు. సరే అది ఇటే వస్తుంది. నేను తర్వాత కాల్ చేస్తా” అని ఫోన్ పెట్టేసింది సౌమ్య.

సాయంత్రం వరకూ సౌమ్య మాటలే నా బుర్రలో తిరుగుతున్నాయి. చిరాకో, ఏమీ తోచకో చాలా ఇబ్బందిగా అనిపించి అయిదు గంటలకే ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాను. ఇంటికి రాగానే కాఫీ కలుపుకుని బాల్కనీలో కూర్చున్నాను. పగలంతా విపరీతమైన ఎండగా ఉన్న వాతావరణం ఉన్నట్టుండీ మారింది. ఆకాశంలో నల్లమబ్బులు కమ్ముకున్నాయి. పక్షులన్నీ గుంపులుగా కదిలిపోతున్నాయి. పెద్ద గాలి లేచి రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు వదిలేసిన దుమ్ముని పైకి లేపి జనాల కళ్ళలో కొడుతుంది. చిన్నగా చినుకులు మొదలయ్యాయి. మట్టివాసన గుప్పున ముక్కుపుటాలకు తగులుతుంది.

సాహిత్య బైక్ మీద రావాలి. ఈ వర్షానికి తడిచిపోతుందేమో అన్న ఆలోచన వచ్చి కాసేపాగి రమ్మని ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ ఎందుకో చెయ్యలేకపోయాను. సరిగ్గా ఇదే మా ఇద్దరి సమస్య.

మూడేళ్ళ క్రితం మా పెళ్ళి జరిగింది. పెళ్ళి చూపులకి ముందే మా ఇద్దరినీ కలుసుకునే ఏర్పాటు చేసారు ఇరువైపుల పెద్దలు. ఆరోజు మొదట ఇద్దరం కొంచెం ఇబ్బంది పడినా, కాసేపటికి కలిసిపోయి చాలా మాట్లాడుకున్నాం. ఇద్దరి ఆలోచనలూ అచ్చం ఒకేలా అనిపించాయి. స్కూల్ కబుర్లు, ఆఫీస్ కబుర్లు చెప్పుకున్నాం. ఇద్దరం స్కూల్లో చేసిన అల్లరి, ఆఫీసులో మానేజర్తో పడే పాట్లూ అన్నీ షేర్ చేసుకున్నాం. మా ఇద్దరి మనసులూ కలిసాయి. మా ఇద్దరినీ చూసి మా పెద్దలు ఆనందపడ్డారు. మాకు పెళ్ళయింది. ఆఫీసు-ఇల్లు, జీవితం హాయిగా వెళ్ళిపోతుంది.

కానీ ఈ మధ్య సాహిత్య ప్రతి చిన్న కారణానికి అలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆరిచిగోల చేస్తుంది. ఏం మాట్లాడినా వెటకారమే. నాకసలు తన మీద ధ్యాసే లేదంటుంది. ఒకప్పటిలా కూర్చుని కబుర్లు చెప్పటం లేదంటుంది. ఒక్కోసారి చిరాకుగా అరిచి గోల చేసి ఏడుస్తూ ఉంటుంది. మొదట్లో కాసేఫు కూర్చోబెట్టి సర్దిచెప్పేవాడ్ని. కానీ ఏ ప్రయోజనం లేదు. ఈ అరుపులు, గొడవలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తనని కాస్త కదపాలన్నా నాకు లోపల కాస్త దడగా ఉంటుంది. ఇంటిలో పెద్దవాళ్ళకి ఈ విషయాలేవీ తెలియవు. ఈ వయసులో వాళ్ళ పిల్లల కాపురం ఇలా ఉందని తెలిసి, వాళ్ళు మనసు పాడుచేసుకోవటం ఎందుకని వాళ్ళకి తెలియనివ్వలేదు.

గొడవపడటం కంటే ఊరుకున్నంత ఉత్తమం లేదని కాస్త ముభావంగా ఉంటున్నాను. వీలయినంత వరకూ తనని కదపకుండా ఇంటిలో నా పని నేను చేసుకుంటూ వాదనలు రాకుండా చూసుకుంటున్నాను. తనతో ఏదయినా సరదాగా మాట్లాడాలనిపించినా ఇప్పుడు చెయ్యలేకపోతున్నాను. ఏ జోకో చదివితే ఒకప్పుడు తనతో షేర్ చేసుకునేవాడ్ని. కానీ ఇప్పుడు తనకి షేర్ చెయ్యలేకపోవటమే కాదు కనీసం తన ముందు నవ్వలేకపోతున్నా. నేనేదో నవ్వితే నన్ను మాత్రం క్షోభపెట్టి వీడు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటుందేమో అని భయం. ఆఫీసులో ఉన్నా ఒకటి రెండు కాల్స్, మెసేజ్లు ఇచ్చేవాడ్ని. కానీ ఈ మధ్య కాలంలో తన నంబర్ నా మొబైల్‌లో చూసి చాలాకాలమయ్యింది. కొన్ని దూరాలు కళ్ళకు కనిపించవు.

చీకటి పడింది. వర్షం ఇంకా పెద్దదయ్యింది. కానీ సాహిత్య ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ తీసి చెయ్యబోయాను. తీరా చేసాక “ఆఫీసులో ఉన్నా వస్తాలే” అని చిరాగ్గా సమాధానం వస్తే. ఫోన్ తీసి చేతిలో పట్టుకున్నానే కానీ చెయ్యలేకపోతున్నాను.

కాసేపటికి కాలింగ్ బెల్ మ్రోగింది. కాస్త రిలీఫ్ అనిపించింది. వెళ్ళి తలుపు తీసాను. తన తో పాటూ సౌమ్య, సౌమ్య నాన్నగారు కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే నాకు కాస్త కంగారుగా అనిపించింది. ఏం జరగలేదు కదా సాహిత్యకి అని తనని చూసా. తను వెళ్ళి సోఫాలో అన్నీ పడేసి కళ్ళు మూసుకుని వెనక్కి చేరబడింది. నాకు ఆందోళన ఇంకాస్త పెరిగింది. సౌమ్య నాన్నగారు నా భుజం మీద చెయ్యి వేసి నన్ను నడిపించుకుని తీసుకుని వెళ్ళి సాహిత్య పక్కనే కూర్చోబెట్టారు.

“సీతా రాముల్లా ఉన్నారు. అందుకేనయ్యా ఈ ముసలాడు మీ ఇద్దరికీ పెళ్ళి కుదిర్చింది.” అని ముందున్న కుర్చీలో కూర్చున్నారు.  “ఈ పిల్ల పిచ్చిదయ్యా ఒట్టి అమాయకురాలు. అందుకే దీన్ని నీ చేతిల్లో పెట్టింది. ఈరోజు ఏం చేసిందో తెలుసా? నిన్ను రోజూ బాధపెడుతుందంట, ఇల్లు నరకంలా మార్చేస్తుందంట తనకి గానీ హిస్టీరియా ఉందేమో అని డాక్టర్‌కి చూపించుకోటానికి వెళ్ళింది. మందులేసుకుని తగ్గించుకోటానికి కాదట. తనతో నీకు సంతోషం లేదు కాబట్టి విడాకులిచ్చేస్తుందంట. కనీసం అప్పుడన్నా నువ్వు సుఖపడతావంట.” ఆయన చెప్పటం ఆపి నా మొహంలో మారుతున్న రంగులు చూస్తున్నారు.

నేను సాహిత్య వైపు చూసాను. తను నా కళ్ళలో ఏవో ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతుంది. నా చూపుల్లో ఏం సమాధానాలు తను డిరైవ్ చేసుకుంటుందో అనే భయంలో కళ్ళు క్రిందకి దించేసాను. కానీ ఆ చర్యని తను తిరస్కారం అనుకుందేమో అక్కడ నుండి లేచి విసవిసా వెళ్ళిపోయింది. సౌమ్య వెంటనే కంగారుగా తన వెనుక వెళ్ళింది.

లోపల నుండి సాహిత్య ఏడుపు, సౌమ్య ఓదార్చటం వినిపిస్తుంది. “నీకర్ధం కాదే నా బాధ. సాయంత్రం నుండీ బోరున వర్షం పడుతుంది. కనీసం ఏమవుతానో ఒక్క ఫోన్ చేసి అడిగాడా? మీ ఇద్దరూ దగ్గరే ఉండి కూడా తీసుకుని వచ్చారు. ఏమయ్యింది అని ఆరా తీసాడా? నాన్నగారు ఇంత చెబుతున్నా నోరెత్తాడా? ఈ ఇంటిలో నేనెందుకు బ్రతుకుతున్నానో తెలియదు. ఉదయాన్నే వంట, తర్వాత ఆఫీసు, సాయంత్రం వచ్చి మరలా వంట తగలేసి తిని పడుకుంటాం. రోజూ ఇదే తంతు నా బ్రతుక్కి. ఛీ దీనికేనా బ్రతుకుతున్నది అసహ్యమేస్తుంది. కనీసం పిల్లలన్నా పుడితే వాళ్ళని చూసుకుని బ్రతికేదాన్ని. అప్పుడే వద్దంటాడు. ఈ ఇంటిలో ఒక ఫ్యామిలీ బ్రతుకుతుంది అని లోకం అనుకుంటుంది. కానీ నాకు మాత్రం ఇద్దరు మనుషులు ఎవరికి వారు బ్రతుకుతున్నట్టుగా ఉంది. ఇక ఈ ఇంటిలో బ్రతకటం నావల్ల కాదు. పోయి ఏ హాస్టల్లోనో ఉంటాను. నాకెవరూలేరని అనుకుని సుఖంగా బ్రతుకుతా” అని ఏడుస్తూ పెద్ద గొంతుతో చెబుతుంది సాహిత్య.

పెద్దాయన కుర్చీ నుండి లేచి కాస్త గట్టిగా ఇద్దరికీ వినిపించేలా చెబుతున్నారు. “చూడండి పిల్లలూ ఒకసారి ముడివేసాక తెంచేసుకునే బంధం కాదు పెళ్ళంటే. కష్ట సుఖాలు, కలిమిలేములు అన్నీ కలిసి భరించాలి. ఇన్నేళ్ళుగా కలిసి బ్రతుకుతున్న జంటలకు సమస్యలు లేక కాదు. వాటిని ఓర్పుతో అధిగమించి ఈ బంధాన్ని కాపాడుకుంటున్నారు. మీ అమ్మా నాన్నని అడిగి చూడండి వాళ్ళకి ఎప్పుడూ ఏ సమస్యలూ లేవా అని. మేనేజర్ తిట్టాడని, ఆఫీసులో పార్కింగ్ లేదని ఉద్యోగాలను మార్చేసే మీ తరానికి అరవైయేళ్ళు ఒకే కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేసి కళ్ళ నీళ్ళతో పదవీ విరమణ చేసిన మా జీవితాలు అర్ధం కావు. మీరు మాకంటే స్మార్ట్ జనరేషన్ కదా. ఆ తెలివేదో ఇద్దరూ కలిసి ఉండటం ఎలా అని ఆలోచించటానికి వాడండి. విడిపోవటానికెందుకూ తెలివితేటలు. లాయరుకి డబ్బిచ్చి కాగితాల మీద కసాబిసా సంతకం చేస్తే సరి. నాకు మందులు వేసుకునే టైమయ్యింది ఇక మీ బాధ మీరు పడండి” అని చెప్పి సౌమ్యని తీసుకుని వెళ్ళిపోయారు.

నేను లోపలికి వెళ్ళి చూసాను. తలగడలో మొహంపెట్టి ఏడుస్తూ ఉంది. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెద్దాయన చెప్పిన పెళ్ళి, దాని ప్రాముఖ్యత వినటం వల్ల కాదు, నేను చేస్తున్న తప్పేంటో తెలిసి.

వెళ్ళి తన తలపైన చెయ్యి వేసి “చిన్నూ” అనిపిలిచాను. చురుగ్గా చూసి దూరంగా జరిగింది.

“చిన్నూ సారీరా. అలా చూడకురా ప్లీజ్. రోజూ నువ్వు అరుస్తుంటే చిరాకు పడ్డానే కానీ నిన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు. రోజూ గొడవలు జరుగుతుంటే మౌనంగా ఉంటే అవే తీరిపోతాయిలే అనుకున్నాను. కానీ ఆ మౌనం మనిద్దరి మధ్య తెలియని ఆగాధాన్ని సృష్టిస్తుంది అని తెలుసుకోలేకపోయాను. నువ్వంటే శ్రద్ధలేక కాదు. వర్షం మొదలయినప్పటి నుండీ నీకు ఫోన్ చేద్దామనుకుని చెయ్యలేదు. చీకటి పడింది నువ్వు రాలేదని కంగారు పడుతూనే ఉన్నాను. కానీ ఫోన్ చేస్తే నాకు తెలియదా అంటావేమో అని భయం.

ఆఫీసులో ఉన్నప్పుడు నీకు ఫోన్ చెయ్యాలనే అనుకుంటా. ఏదో పని వస్తుంది. సరిగ్గా అప్పుడే నువ్వు కూడా కాల్ చేస్తావ్. ఫోన్ కట్ చేసి కాసేపాగి చేద్దాంలే అనుకుంటా. పనయ్యాక కాస్త ఎక్కువసేపు మాట్లాడేంత టైం ఉన్నప్పుడు చేద్దాంలే అనుకుంటా. సాయంత్రం కాగానే ఎలాగూ ఇంటికి వచ్చేస్తాగా అప్పుడు మాట్లాడొచ్చులే అనుకుంటా. ఇంటికొచ్చేసరికి ఫోను చెయ్యలేదు అనే కోపంలో నువ్వుంటావ్. నీ మూడ్ బాలేదని నేను మౌనంగా ఉంటాను.

నేను నిన్ను పట్టించుకోవటం లేదు అనుకునే ప్రతి సంఘటన వెనుక ఉన్నవి ఇలాంటి చిన్న కారణాలే రా. అంతే కానీ నీ మీద ప్రేమ తగ్గి కాదు.  Now I understand that these small things mean a lot. డ్రమాటిగ్గా ఐ లవ్ యూ అని చెప్పను. కానీ you mean a lot to me”

తను తల ఎత్తి నా కళ్ళలోకే సూటిగా చూస్తూ ఉంది. బయట నెమ్మదిగా వానవెలిసింది.

“నీకు ఎంత కోపం ఉన్నా డివోర్స్ అనే మాట అనకుండా ఉండాల్సిందిరా” కాస్త నొచ్చుకుంటూ అన్నాను.

తను కళ్ళు తుడుచుకుని ఏడుపు ఆపుకుంటూ “సారీ” అని ముద్దుగా చెప్పి నా వొడిలో తలపెట్టుకుని నా చెయ్యి పట్టుకుని అలానే పడుకుండిపోయింది. మా ఇద్దరి మనసులూ మరోసారి కలిసాయి. మాకు మరోసారి పెళ్ళయింది.

కావ్య

1998 లో మాట

కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లో ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతూ ఉంది. అమ్మ వంటకి ఏదో కావలంటే నేను మార్కెట్ కి బయలు దేరాను. కరెంట్ పోవటంతో ఊరంతా చీకటిగా ఉంది. అప్పటికే చాలా సేపటి నుండీ వర్షం పడుతూ ఉండటంతో రోడ్డంతా బురదగా ఉంది. నేను జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్తున్నా. ఎదురుగా ఎవరో అమ్మాయి సైకిల్ మీద వస్తూ కనిపించింది. సైకిల్ కాస్త దగ్గరగా వచ్చినప్పుడే ఒక మెరుపు మెరిసింది దాని వెంటే పెద్ద శబ్దంతో దూరంగా ఎక్కడో పిడుగు పడింది. తల క్రిందకు దించుకుని సైకిల్ తొక్కుతున్న ఆ అమ్మాయి మెరుపుల శబ్దం విని ఆకాశం వైపు బెదురుగా చూసింది. బెదురుచూపులు చూస్తున్న ఆ అమ్మాయి కళ్ళు, వర్షంలో తడిచి చలికి వణుకుతున్న పెదవులు. నలుపు,ఎరుపు రంగుల్లో ఉండి లైట్ లో మెరుస్తున్న చుడిదార్, ఆ దృశ్యం అలా ఫ్రీజయిపోయింది.

పరిగెడుతున్న కాలం ఒక్క క్షణం అలా ఆగి నిలిచిపోయి మరలా సాగినట్టనిపించింది. రోడ్డు మీద అలానే నిల్చుని ఆ క్షణాన్ని మరలా మరలా గుర్తు చేసుకుంటు తన్మయత్వంలో ఉండిపోయాను. ఒక్కసారిగా నాకు ఎదో జరిగిన అనుభూతి, మనసులో ఒక తెలియని ఉద్వేగం. తేరుకుని తిరిగి చూసేసరికి తను దూరంగా వెళ్ళిపోయింది. సమయానికి వెనుక వెళ్ళటానికి నా చేతిలో సైకిల్ లేనందుకు చాలా కోపం వచ్చింది. ఆ అద్భుత క్షణాన్ని అలా తలుచుకుంటూ చాలారోజులు గడిపేసాను. తనెవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. తనని చూసిన అదే సమయానికి రోజూ వెళ్ళి ఎదురు చూసేవాడ్ని. కానీ తను మరలా కనిపించలేదు.

2000 లో

డిగ్రీ కాలేజీలో నా మొదటిరోజు. నాతో పాటూ ఇంటర్ చదివిన నేస్తాలతో వచ్చి చివరి బెంచ్లో కూర్చున్నా. కొత్త అనే దానికుండే సహజ లక్షణం వలన కాస్తంత భయంగా, కాస్తంత ఎక్సైటింగ్గా ఉంది. క్లాసులో అందరి మొహాలూ చూస్తూ నాలో నేనే వారి మీద ఒక అభిప్రాయాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నా. ముగ్గురు అమ్మాయిలు క్లాసులోకి వస్తూ కనిపించారు. నేను అప్పటికే చేస్తున్న పనిలో భాగంగా వారి వైపు చూసాను. మధ్యలో అమ్మాయిని చూసేసరికి ఒక మెరుపు మెరిసింది. ఆరోజు రాత్రి వర్షంలో నేను చూసింది ఆ అమ్మాయినే. ఆ రోజు నుండీ క్లాసు నాకు మరింత ఆసక్తిగా ఎక్సైటింగ్గా మారిపోయింది. తన పేరు కావ్య. చాలా చలాకీగా అందరితోనూ కలిసిపోయే అమ్మాయి. అందరికీ సహాయం చేస్తూ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా బాధపడి కళ్ళ నీళ్ళు పెట్టుకునేది.

కంప్యూటర్ ల్యాబ్‌లో ఇద్దరికీ ఒకటే సిస్టమ్ షేరింగ్‌కి ఇచ్చారు. అప్పటి నుండీ మా మధ్య పరిచయం, సాన్నిహిత్యం పెరిగి మంచి స్నేహితులమయిపోయాం. ఊరిలో మా ఇద్దరినీ ఎవరు చూసినా కాబోయే మొగుడూ,పెళ్ళాలు అనేవారు. నేను కంగారుగా తన వైపు చూసేవాడ్ని. తను మాత్రం నవ్వి ఊరుకొనేది. అలాంటి సందర్భాల్లో నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అది తన అంగీకారమో లేక వాదన అనవసరమనే భావనో తెలిసేది కాదు. తన అంతరంగం ఎప్పుడూ నాకు అర్ధమయ్యేది కాదు. కాలేజ్‌లో అమ్మాయిల్ని ఏడిపించేవారిని చూస్తే నేను కోపంతో ఊగిపోయి తెగ తిట్టేవాడ్ని. తను మాత్రం నిర్లిప్తంగా, మౌనంగా ఉండేది.

రోజులు గడుస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి నాకు కావ్య ఇంటి నుండి వాళ్ళమ్మగారు ఫోన్ చేసారు. కావ్యా వాళ్ళ నాన్నగారికి గుండె నొప్పి వచ్చి పడిపోయారని. నేను వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి ఫోన్ చేసి ఆంబులెన్స్‌ని పంపించి, వేగంగా వాళ్ళింటికి చేరుకున్నా. అంబులెన్స్ వచ్చేపాటికే ఆయన చనిపోయారు. ఇంటిలో అందరూ ఒకటే ఏడుపు. బయట వాళ్ళకి కష్టం వస్తేనే తట్టుకోలేని కావ్య బ్రతుకుతుందా అని భయం వేసింది నాకు. ఇంటిలో జరగాల్సిన పనులు చూసే మనుషులు లేరు. నేనే నా క్లాస్‌మేట్స్ అందరినీ పిలిచి తలా ఒకపని అప్పగించాను. అన్ని పనులూ చూస్తూనే కావ్యని గమనిస్తూ ఉన్నా. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. పరిగెట్టి వెళ్ళి తనకి నీళ్ళుపట్టాను. అక్కడ శవం దగ్గర అందరూ జనాలే తనకి గాలి తగిలే అవకాశం లేదు. కాసేపు బలవంతంగా వేరే గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాను. ఏడ్చి ఏడ్చి తలనొప్పి వచ్చి ఉంటుంది అని తలపట్టాను. తన కళ్ళు వర్షించటం ఆపలేదు.

సాయంత్రానికి అంతా అయిపోయింది. అక్కడ మరో మనిషి ఉండేవాడు అనే గుర్తులు జ్ఞాపకాలుగా మారిపోతున్నాయి. అందరూ సెలవు తీసుకుంటున్నారు. నేను కావ్య అమ్మాగారి పక్కనే ఉండి ఆమె చేత బలవంతంగా టీ తాగించే పనిలో ఉన్నాను. కావ్య కోసం చుట్టూ చూశాను. తను మా క్లాస్‌మేట్స్‌తో మాట్లాడుతూ కనిపించింది. పోనిలే కాస్త ఊరటగా ఉంటుంది అనుకున్నాను. తను అందరి సహాయానికి థ్యాంక్స్ చెప్పి అందరితో కాసేపు మాట్లాడి లోపలికి వచ్చింది. నేను సాయంత్రానికి ఇక ఇంటికి వెళ్ళటానికి లేచాను. కావ్య లోపల పడుకుని ఉంది. వాళ్ళమ్మగారు “కావ్యా, అబ్బాయి వెళ్తున్నాడే ఒకసరి ఇలా బయటకి రా” అని పిలిచారు. తనకి వినిపించలేదేమో రాలేదు. లోపలికి వెళ్ళి చూసాను. అలానే పడుకుని నిర్లిప్తంగా చూసింది నా వైపు. “వెళ్తున్నా. రేపు ఉదయం వస్తా” అని చెప్పాను.

తను స్పందించకుండా నా కళ్ళల్లోకే చూస్తూ ఉంది. నా కళ్ళలో ఏదో వెతుకుతున్నట్టుగా అనిపించింది. తను ఏదో చెప్పాలనుకుంటుందేమో అనిపించింది. అలానే తనని చూస్తూ నిల్చున్నా. కాసేపు అలానే చూసి సరే అన్నట్టుగా తల ఊపి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం నేను “ఇంతేనా తను ఏం చెప్పాలనుకోలేదా? లేక తనిప్పుడు ఏం చేప్పే పరిస్థితిలో లేదా?” అని ఆలోచిస్తూ అక్కడే నిల్చుండిపోయాను. తను మరలా కళ్ళు తెరిచి చూసింది. నేను కాస్త కంగారుగా “సరే అయితే” అని అక్కడ నుండి కదిలాను.

మరుసటిరోజు నుండీ తనని మామూలు మనిషిని చెయ్యటానికి చాలా ప్రయత్నాలు చేసాను. క్లాసులో అందరికీ అదేమాట చెప్పాను. క్లాసులో మా బ్యాచ్‌గా ఎప్పుడూ తిరిగే రమ్య, జగతి, వాణి, రమేష్, క్రిష్ణ అందరూ నాకోసం తనని జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు చాలా ఆనందంగా అనిపించేది.

ఒకరోజు అందరం క్యాంటీన్‌లో కూర్చుని ఉండగా మా దగ్గరకి చందు అనే క్లాస్‌మేట్ వచ్చాడు. కాలేజిలో ఉండే పోకిరి గ్యాంగ్ మెంబర్ వాడు. మందు, సిగరెట్లు, అమ్మాయిలని ఏడిపించటం ఇలా వాళ్ళు చెయ్యని వెదవపని లేదు. వీడిక్కడకి ఎందుకొచ్చాడు అని చిరాకు పడుతుంటే “నేను మంచిగా మారాలనుకుంటున్నా. అన్నీ వదిలేస్తున్నా. మీ బ్యాచ్‌ని చూసాక నాలో మార్పు వచ్చింది” అన్నాడు. వాళ్ళ బ్యాచ్ మొత్తానికీ వీడు కాస్త మంచోడు అనే ఆలోచన అందరిలో ఉంది. అందుకే వెంటనే నవ్వుతూ సరే అన్నారు.

రోజులు సరదాగా గడిచిపోయాయి. పరీక్షలు దగ్గర పడటంతో ప్రిపరేషన్ కోసం సెలవులిచ్చారు. రోజూ సాయంత్రం అందరం ఒకచోట కలిసి చదివింది ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళం. ఒకరోజు నేను రోజంతా కూర్చుని మంచి మెటీరియల్ ప్రిపేర్ చేసాను. దానిని జెరాక్స్ తీసి అందరికీ ఇవ్వటానికి బయలుదేరాను. అప్పుడే బాగా వర్షంపడి ఆగింది. ఆ చల్లని వాతవరణం, ఇంటి చూరు నుండీ జారిపడుతున్న నీళ్ళ శబ్ధాలని ఆస్వాదిస్తూ చందుగాడి రూమ్‌కి వెళ్ళాను. తలుపు కొడితే ఎంతకీ తెరవడు. పడుకున్నాడేమో అని ఇంకా గట్టిగా కొట్టాను. వాడు కిటికీ దగ్గరకి వచ్చి తలుపుతీసి నన్ను చూసి “ఈ రోజు నేను రానురా. నిద్రగా ఉంది. నువ్వెళ్ళు” అని వెంటనే తలుపేసేసాడు.

ఆ క్షణకాలంలో వాడు దాచాలనుకున్న నిజం దాగలేదు. కిటికీలో నుండి వాడి రూమ్‌లో ఉన్న కావ్య సైకిల్, సైకిల్‌కి తగిలించి ఉన్న తన బ్యాగ్ కనిపించింది. నా చేతిలోని మెటీరియల్స్ క్రిందపడి వాననీటిలో కొట్టుకుపోయాయి.

2006 లో

ఒక పేరున్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నేను ఆ రోజు ఆఫీసులో ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నాను. మా మేనేజర్ నా డెస్క్‌ఫోన్‌కి కాల్ చేసి తన దగ్గరకి రమ్మని పిలిచారు. పని మధ్యలో ఆపి హడావుడిగా వెళ్ళి ఆయన చాంబర్ తలుపుతీసి లోపలికి చూసాను. ఆయన ఎవరితోనో మీటింగ్‌లో ఉన్నారు. నన్ను చూసి “హా రావోయ్. ఇదిగో ఈమె కొత్తగా జాయిన్ అయ్యింది. పేరు కావ్య. నీ ప్రాజెక్ట్‌లో వేస్తున్నా. అలవాటయ్యేదాకా చూస్కో” అన్నారు. ఆమె వెనక్కి నవ్వుతూ తిరిగి నా వైపు చూసింది. కావ్య, ఎన్నో సంవత్సరాల క్రితం నేను వదిలి వచ్చేసిన ఒక చేదు జ్ఞాపకం. తను కూడా నన్ను ఆశ్చర్యంగా చూస్తూ పలకరించింది.

ఇద్దరం క్యాంటీన్‌కి వెళ్ళి కూర్చున్నాం. ఇద్దరిలో ఇంతకు ముందున్న సాన్నిహిత్యం లేదు కానీ అది ఇంకా అలానే ఉంది అనే భ్రమ కలిగించే ప్రయత్నం ఇద్దరం చేస్తున్నాం. తను ఇంతకు ముందు ఎక్కడ పని చేసింది ఈ కంపెనీకి ఎలా వచ్చిందిలాంటి వివరాలు చెప్పింది. నేను కూడా నా కెరీర్ ఎలా సాగుతుందో క్లుప్తంగా చెప్పాను. మధ్యలో కాలేజీ విషయాలు దొర్లాయి. మాటల మధ్యలో చందు పేరు వచ్చినప్పుడు తను ఇబ్బందిపడుతూ ఉండటం గమనించాను. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా తనకిష్టం లేదు అనే విషయం అర్ధమయ్యి ఊరుకున్నా.

సాయంత్రం తనని నా కారులో ఇంటి వరకూ దించాను. ఇంటి బయటే ఉన్న కావ్య అమ్మగారు నన్ను చూసి లోపలికి రమ్మని బలవంతపెట్టారు. కాఫీ చేసి ఇచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడారు. కావ్య నాన్నగారు చనిపోయినప్పుడు నేను చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ నా చేతిని పట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఇన్నేళ్ళు కనీసం కబురైనా లేకుండా దూరంగా ఉన్నందుకు మందలించారు. ఆమెకు మేము ఎందుకు దూరమయ్యామొ తెలియదు అని అర్ధమయ్యింది.  కావ్య మాత్రం నిర్లిప్తంగా ఎటో చూస్తూ కూర్చుంది. మౌనంగా భారమైన గుండెతో ఇంటికి వచ్చేసాను.

కావ్య ఆఫీసులో చురుగ్గా ఉండేది. తనకి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉండేవాడిని. త్వరగానే ఆఫీసులో మంచి పేరు తెచ్చుకుంది. ఒకరోజు కావ్య అర్జెంటుగా చెయ్యాల్సిన పని ఒకటి వచ్చింది. కావ్య రాగానే తనకి చెప్పాలి అని ఎదురు చూస్తున్నా. సమయం దాటిపోతుంది తను రాలేదు. ఇంటికి ఫోన్ చేస్తే కావ్య అమ్మగారు “దానికి విపరీతమైన జ్వరం. ఒంటి మీద తెలివి లేదు. వళ్ళంతా కాలిపోతుంది బాబూ” అని బెంగపడుతూ చెప్పారు.

నేను వెంటనే మా మేనేజర్‌కి చెప్పి కావ్య ఇంటికి వెళ్ళాను. మందుల కోసం బయటకి వెళ్తు కావ్య అమ్మగారు కనిపించారు. ఆమెను ఉండమని చెప్పి నేను ఆ చీటీ పట్టుకుని వెళ్ళి మందులు తెచ్చాను. ఇద్దరం కలిపి కావ్యకి కాస్త వేడిపాలు తాగించి మందులు వేయించాము. నేను కావ్య పక్కనే కూర్చుని తనని అడిగి తను పూర్తి చెయ్యాల్సిన పని పూర్తి చేసాను. పని పూర్తయ్యిందని మేనేజర్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఇంతలో మా ప్రాజెక్ట్ టీమ్ అందరూ కావ్య ఇంటికి వచ్చారు. కావ్యని పలకరించి అక్కడే కూర్చున్నారు. కావ్య అమ్మగారు వచ్చినవారితో చిన్నప్పటి నుండీ మా స్నేహం గురించి, మా కాలేజిరోజుల గురించి చెబుతున్నారు. కావ్య వెళ్ళి వాకిట్లో నిల్చుంది. నేను తనకి వెయ్యాల్సిన మాత్రలు పట్టుకుని బయటకి వెళ్ళాను.

బయట కావ్య తో టీమ్ లీడర్ శశాంక్ మాట్లాడుతూ కనిపించాడు. “కావ్యా, వచ్చే నెలలో నేను ప్రోజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నా. నాకు సహాయంగా ఎవరో ఒకరు రావాలి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీకు కూడా కాస్త జీతం పెరుగుతుంది. ఇందులో నా స్వార్ధం కూడా ఉంది. మీ మీద మొదటి నుండీ నాకొక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇలా ఇద్దరం కలిసి పని చేయటం వలన ఒకర్ని ఒకరం అర్ధం చేసుకోవచ్చు. ఏమంటారు?” అని అంటూ కావ్య చెయ్యి పట్టుకున్నాడు శశాంక్.

మరుసటిరోజు మా మేనేజర్ పిలిచి శశాంక్‌తో పాటూ అమెరికా వెళ్ళమని అడిగారు. నాకు వీలు కాదని కావ్యని పంపమని చెప్పి వచ్చేసాను.

2012 లో

కొంతమంది స్నేహితులతో కలిసి వైజాగ్‌లో సొంత కంపెనీ మొదలుపెట్టాం. ఉదయమంతా ప్రారంభోత్సవ పనుల్లో అలిసిపోయిన నేను సాయంత్రానికి కాస్త తీరిక దొరికి సోఫాలో కూలబడ్డాను. ఎవరిదో తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తి మాట్లాడే ఓపిక లేకపోయినా ఎవరో ఏమవసరమో అనుకుని ఎత్తాను. “నేను కావ్యని. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. అమ్మకి  సీరియస్‌గా ఉంది. నిన్ను చూడాలంటుంది” అని చెప్పి ఏడుస్తూ పెట్టేసింది.

నేను వెంటనే అందుబాటులో ఉన్న ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాను. ఐ.సి.యు.లోకి నేను వెళ్ళేసరికి కావ్య అమ్మగారు చాలా నీరసంగా ఉన్నారు. సెలైన్స్ ఎక్కిస్తున్నారు. నేను వెళ్ళి ఆమె చేతిని తాకేసరికి కాస్తంత ఓపిక తెచ్చుకుని కళ్ళెత్తి చూసారు. నన్ను చూడగానే ఆమె ముఖంలో ఒక వెలుగు కనిపించింది. కావ్య మంచానికి ఒక వైపు కూర్చుని ఏడుస్తూ ఉంది. కావ్యని దగ్గరికి రమ్మని చేతితో పిలిచారు. కావ్య చేతిని నా చేతిలో పెట్టి “నీకు దీన్ని అప్పగిద్దామనే ఎదురు చూస్తున్నా. ఎప్పుడో పోయే ప్రాణం నీరాక కోసమే కొట్టుకుంటూ మిగిలుంది. దీని సంగతి నీకు తెలియంది కాదు. ఒంటరిగా బ్రతకలేదు. పిచ్చిది ఇక దీని భారం నీది” అని చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. డాక్టర్ వచ్చి కావ్యని, నన్ను బయటకి పంపించారు. నేను డాక్టర్‌తో మాట్లాడటానికి ఆయన గదికి వెళ్ళాను. డాక్టర్ నాకు ఆమె పరిస్థితి చెబుతూ ఉండగా నర్స్ పరిగెట్టుకుంటూ వచ్చింది. వెళ్ళి చూసేసరికి కావ్య అమ్మ మీద పడి ఏడుస్తూ ఉంది.

రెండురోజులు గడించింది. నాకు వైజాగ్ నుండి కాల్స్ వస్తున్నాయి. ఆ విషయం చెప్పటానికి కావ్య గదికి వెళ్ళాను. కావ్య కిటికీ నుండి శూన్యంలోకి చూస్తూ నిల్చుంది. నేను వచ్చిన అలికిడి తనకి తెలిసింది. ఇంకా కిటికీ వైపే చూస్తూ ఉంది.  తనకంటి నుండి రెండు బొట్లు జారాయి. ఏం మాట్లాడాలో తెలియక నేను తనని చూస్తూ నిలుచున్నాను.

“అలిసిపోయాను రా. పరిగెట్టి పరిగెట్టి అలిసిపోయాను. నా అంచనాలు, నమ్మకాలే నిజమనే భ్రమతో పరిగెట్టి అలిసిపోయాను. నిజాలు చెబితే నీకు కోపం వస్తుందేమో. నన్ను క్షమించలేవేమో కానీ గుండెల్లో నుండి తోసుకొస్తున్న కన్నీళ్ళు ఈ నిజాల్ని ఇక దాగనీయవు. చిన్నప్పటి నుండీ అహంకారమో పిచ్చితనమో కానీ, చేతకాని తనాన్ని దాచిపెట్టే ముసుగే మంచితనమనే నటన అనుకునేదాన్ని. నీ మంచితనాన్ని నీ వ్యక్తిత్వాన్ని నా నమ్మకాలు ఒప్పుకోనిచ్చేవి కావు. అమ్మ నీ వ్యక్తిత్వాన్ని అభిమానిస్తుంటే ఎంత పిచ్చిదో అనుకునేదాన్ని. అలా అని నువ్వు చెడ్డవాడివని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను దక్కించుకోటానికి నువ్వేసుకున్న ముసుగే ఈ మంచితనం అనుకున్నా.

అమ్మాయిల్ని కామెంట్ చేసేవారిని, ఫ్లర్ట్ చేసేవారిని, నేరుగా వచ్చి చేయి పట్టుకుని ప్రేమిస్తున్నా అని చెప్పేవారిని చూసి స్ట్రైట్ ఫార్వర్డ్, డేరింగ్, హానెస్ట్ అనుకునేదాన్ని. వీళ్లంతా నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, నటించటం లేదు అనుకునేదాన్ని. వాళ్ళలో కనిపించే మ్యాన్లీ లుక్ సెన్సిటివ్‌గా ప్రేమిస్తూ అమ్మాయిల్ని కేరింగ్‌గా చూసుకునేవాళ్ళలో నాకు కనిపించేది కాదు.” ఇంకా ఏదో చెప్పబోతూ దుఃఖం గొంతుకి అడ్డుపడటంతో ఆగిపోయి నిస్సహాయంగా నా గుండెల మీద వాలిపోయింది.

కావ్య ముఖానికి, ఆషాడానికని వెళ్తూ తనని పదే పదే గుర్తు చేసుకోవాలని నా మెడలో నా భార్య వేసిన లాకెట్ గుచ్చుకుని దూరంగా జరిగింది.

స్నిగ్ధ

ఒక్కగానొక్క బిడ్డని కన్నులెదుటే పోగొట్టుకున్న తల్లి దుఃఖంలా రెండురోజుల నుండీ అంతనేది లేకుండా వర్షం కురుస్తోంది. ఆకాశం తను పోగొట్టుకున్న బంధాలేవో నేల మీద ఆత్రంగా వెతుక్కోటానికా అన్నట్టు మెరుపులు పదే పదే మెరుస్తున్నాయి. గుండెల్లో వణుకు పుట్టిస్తూ మధ్య మధ్యలో ఉరుములు. ఈదురుగాలుల దాటికి ఎక్కడో కరెంటు తీగలు తెగిపోయాయేమో కరెంటుపోయింది. కిటికీలో నుండి వచ్చిన చల్లనిగాలి ఇల్లంతా ఆక్రమించి వణికిస్తోంది.

రెండ్రోజులుగా వాతావరణం ఇలానే ఉండటంతో మనసంతా ఏదో దిగులు కమ్మేసింది నాకు. దుప్పటి కప్పుకుని వాలు కుర్చీలో కూర్చుని కిటికీ నుండి బయట పడుతున్న వర్షాన్నే చూస్తున్నాను. చూస్తూ ఉండగానే బయటంతా చీకటి కమ్ముకుంది. గోడ మీద వేలాడుతున్న వాచ్ వైపు చూసాను. ఎనిమిది గంటలవుతుంది. టైము తెలియకుండానే గడిచిపోయింది.  గదిలో ఒక మూలగా వెలిగించిన కొవ్వొత్తి వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంది. సగం ఖాళీ అయిన స్కాచ్ బాటిల్ టీపాయ్ మీద కవ్విస్తున్నట్టుగా నిల్చుని ఉంది. కళ్ళు మూసుకుంటే కమ్మేస్తున్న ఒంటరితనం. కళ్ళు తెరిచి చూసినా అదే ఒంటరితనం. పదేళ్ళుగా ఎంత అలవాటు చేసుకోవాలని చూసినా ఇంకా ఈ ఒంటరితనానికి నేను అలవాటు పడలేదు.

చుస్ స్ స్ స్ మంటూ వెనుకనుండి వచ్చిన శబ్ఢానికి ఉలిక్కిపడ్డాను. గుండె ఒక్కసారిగా ఆగినట్టనిపించింది. తేరుకుని కిచెన్‌లోకి వెళ్ళి కుక్కర్ దించేసి వచ్చి మరలా కూర్చోబోతుంటే గేటు తీసిన చప్పుడయ్యింది. కిటికీ దగ్గరగా వెళ్ళి గేటు వైపు చూసాను. ఎవరో ఒక మనిషి రావటం అస్పష్టంగా కనిపిస్తోంది. కరెంటు లేకపోవటంతో దారిలో లైట్స్ వెలగక ఎవరో తెలియటంలేదు. ఈ సమయంలో నా ఇంటికి వచ్చేదెవరో అర్ధంకాలేదు. ఊరికి కాస్త వెలుపలగా, ప్రధాన రహదారిని అనుకుని రెండెకరాల స్థలంలో ఉన్న ఇల్లు మాది. నాన్న డాక్టరుగా బాగా సంపాదిస్తున్న రోజుల్లో చుట్టూ తోట వేసి మధ్యలో ఈ బంగళా కట్టించారు. ఆయన ఉన్న కాలంలో ఇంటికి రాకపోకలు బాగానే ఉండేవి. అమ్మా,నాన్న పోయాక ఈ ఇంటిని, నన్ను పట్టించుకునే నాధుడే లేకపోయాడు. పగలు పని వాళ్ళు తప్ప సాయంత్రం దాటితే ఈ ఇంటిలో నేను ఏక్‌నిరంజన్. అలాంటిది ఈ సమయంలో ఎవరు వస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా.

మెరుపు వెలుగులో తుళ్ళిపడి బయపడుతున్న ఒక అమ్మాయి, ఆమె పక్కనే నడుస్తూ ఒక చిన్న పాప కనిపించారు. పాపం ఇద్దరూ వర్షానికి బాగా తడిచిపోయి ముద్దయిపోయారు. నేను వెంటనే కొవ్వొత్తి పట్టుకుని తలుపు వరకూ వెళ్ళి తలుపుని సగం తెరిచి “ఎవరండీ మీరు? ఎవరు కావాలి” అని అడిగాను. ఇరవయ్యేళ్ళు ఉండొచ్చు ఆ అమ్మాయికి ఏదో చెప్పింది కానీ చలికి వణుకుతున్న మాటలు నాకు అర్ధం కాలేదు. పాపం ఆ చిన్న పాపయితే చలికి బిగుసుకుపోయింది.

“దీపం ఆరిపోతుందని తలుపు పూర్తిగా తెరవలేదు. మొదట మీరు లోపలికి రండి” అని వారికి దారిచ్చి నేను కొవ్వొత్తి తీసి మరలా బల్ల మీద పెట్టాను. గదిలోకి తొందరగా వెళ్ళి ఒక తువ్వాలు తెచ్చి ఇచ్చాను.

“ఇద్దరూ బాగా తడిచి ఉన్నారు. తుడుచుకోండి.”

ఆ అమ్మాయి కాస్త కూడా మొహమాట పడే పరిస్థితిలో లేదు. వెంటనే అందుకుని పాపని తువ్వాలుతో చుట్టేసి కాసేఫు వెచ్చదనం వచ్చేలా ఉంచి. తరువాత శుభ్రంగా తుడవటం మొదలుపెట్టింది. నేను ఒక కప్పుతో కాచిన పాలు తీసుకొచ్చి ఇచ్చాను. ఆ ఆమ్మాయి కాస్త తెరుకున్నట్టుంది. కప్పు అందుకుంటూ కృతఙ్ఞతగా నవ్వింది. పాలని తన నోటితో ఊదుతూ పాపకి మెల్లగా తాగిస్తుంది. పాప భయపడుతూ చుట్టూ అన్నింటినీ చూస్తూ మెల్లగా తాగుతుంది. నేను పక్కనే నిలబడి చూస్తున్నాను.

బూడిదరంగు షార్ట్ మోడల్ కుర్తాలో ఎంతో అందంగా ఉందా ఆ అమ్మాయి. పలకరింపుగా పెదాలపైన చేరిన ఆమె నవ్వు విచ్చుకున్న గులాబీలా ఉంది. తడిచిన కుర్తాలో నుండి కనిపిస్తున్న ఆమె వంటి రంగు చప్పున పాలరాతి శిల్పాన్ని గుర్తు చేస్తుంది. బాగా తల తడిచిపోవటం వలన ఆమె రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఏంటో తెలియకపోయినా చాలా ఆకర్షణీయంగా మాత్రం అనిపించింది. నేను తననే అలా చూస్తూ ఉండటం గమనించిందో ఏమో ఆమె నావైపు చూసింది.

నేను కాస్త తడబాటుతో చూపుని పాప వైపు మరల్చాను. పాపకి నుదిటి మీద గాయం కనిపించింది. “అరెరె ఏమయ్యింది పాపకి?” అని అరిచాను.

ఆమె కూడా అప్పుడే చూసినట్టుంది “అయ్యో” అంటూ కంగారుపడింది. నేను పరిగెట్టి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చాను. పాపని సోఫాలో కూర్చో బెట్టి చకచకా పాప గాయానికి కట్టు కట్టాను. పాప ఇంకా ఏదో భయంతో వణుకుతూనే ఉంది. ఒక్కమాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. నేను పాపకి కట్టు కడుతున్నంత సేపు తను నా పక్కనే నీళ్ళు నిండిన కళ్ళతో కంగారు పడుతూ నేను అడిగినవి అందిస్తూ నిలుచుంది. నేను నా పని చేస్తూనే ఓరకంట ఆమెను చూస్తూ ఉన్నాను. చందమామ లాంటి ఆమె ముఖంలో దిగులు కూడా అందంగానే ఉంది తప్ప కష్టంలా కనిపించటం లేదు. అడిగినవి అందిస్తున్నప్పుడు తన చేయి తగులుతుంటే ఏదో తెలియని అనుభూతి నన్ను ఆవహిస్తూ ఉంది. క్షణాల్లో సమ్మోహనం చేసే అందాన్ని జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. కావాలనే ప్రతీది తనని అడిగి తన చేతి నుండి తీసుకుంటున్నాను. ఆ స్పర్శ కలిగిస్తున్న అనుభూతిని వదులుకోవాలనిపించటం లేదు. బాగా తడిచి ఉండటం వలనేమొ ఆమె శరీరం ఇంకా చల్లగానే ఉంది. తల నుండి ఇంకా బొట్లుగా నీరు జారుతూ ముత్యాల్లా మెరుస్తుంది. తను అలా నిల్చున్న తీరులోనే ఒక ముచ్చటైన ఒద్దిక స్పష్టంగా తెలుస్తూ ఉంది.

పాప అలానే భయపడుతూ సోఫాలో పడుకుంది. పాపం ఆ అమ్మాయి ఇంకా అలా చలికి ఇబ్బందిపడుతూ నిలబడే ఉంది.

“కూర్చోండి ఇప్పుడే వస్తాను” అని చెప్పి నేను కిచెన్‌లోకి నడిచాను.

వేడి వేడి కాఫీ కప్పులతో నేను బయటకి వచ్చేసరికి ఆ అమ్మాయి చుట్టూ పరిసరాలను పరికించి చూస్తు ఉంది. ఇంత వరకూ పాప పరిస్థితి, వర్షం, వణికిస్తున్న చలివలన మరుగునపడిన స్త్రీత్వం ఇప్పుడు తిరిగి మేల్కొన్నట్టుంది. అన్నింటినీ అనుమానంగా చూస్తూ ఉంది. తనని మరింత అనుమానానికి లోను చెయ్యాలని టేబుల్ మీద స్కాచ్ బాటిల్ అల్లరిచేస్తుంది. నవ్వుకుంటూ నేను దగ్గరగా వెళ్ళి “కాఫీ” అన్నాను.

“థాంక్యూ” అని నవ్వుతూ అందుకుంది. ఒక రెండు సిప్స్ చేసాక తనలో కాస్త రిలీఫ్ కనిపించింది. నేను తన గురించి అడగాలా వద్దా అని ఆలోచిస్తూ తన వైపే చూస్తున్నాను.

నా మనసులో ఎముందో చదివినట్టుగా “నా పేరు స్నిగ్ధ” అని తల ఎత్తకుండానే చెప్పింది. శ్రావ్యమైన తన గొంతు నా చెవులను తాకగానే నా శరీరం మొత్తం ఒక్కసారిగా అలర్టయ్యింది. కళ్ళు మరింత పెద్దవి చేసి తననే చూస్తూ ఉన్నాను. తను తల పైకెత్తి చెప్పటం కొనసాగించింది.

మాది విశాఖపట్నం. ఫ్యామిలీతో శ్రీకూర్మం చూడాలని వెళ్ళి వస్తుండగా కారు చెడిపోయింది. అక్కా, బావా పాపని నా దగ్గర ఉంచి మెకానిక్‌ని తీసుకు రావటానికి వెళ్ళారు. ఇంతలో పాప ఆకలి అంటే ఇలా వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాం. అక్కా వాళ్ళు వచ్చేస్తే కంగారు పడతారేమో అని తల ఎత్తి నా వైపు చూసింది.

అప్పటికే తన్మయత్వంగా తనని చూస్తున్న నా కళ్ళు తన చూపుతో కలిసాయి. ఏమనుకుంటుందో అనే స్పృహ కూడా లేకుండా నేను అలా చూస్తూ ఉండిపోయాను. తనే కాస్త కంగారుగా చూపు మరల్చుకుని “మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా?” అని అడిగింది.

నా జీవితం గురించి ఒక మనిషి నాతో మాట్లాడి దాదాపు పదేళ్ళయ్యింది. నా గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న ఒంటరితనాన్ని ఒక మృదువైన చేతితో ఎవరో ఆప్యాయంగా స్పృశించినట్టనిపించింది. సన్నటి నీటితెర కళ్ళను కమ్మేస్తూ ఉంటే కదిలిపోయాను.

“అవును ఈ లంకంత కొంపలో ఒక్కడినే ఉంటాను. నా పేరు గిరీష్. మా నాన్న ఒకప్పుడు ఈ ఊరిలో పేరు మోసిన డాక్టర్. అప్పటిలో బాగా సంపాదించేవారు. మా అమ్మని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళి ఇష్టంలేని బంధువులు మా నాన్నకి దూరం అయ్యారు. మా నాన్న ఊరికి దూరంగా ఈ ఇల్లు కట్టుకుని ఇక్కడికి మారిపోయారు. పదేళ్ళ క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో అమ్మా,నాన్న చనిపోయారు. అప్పటి నుండి ఒంటరిగా ఇక్కడే ఉంటున్నా.” చెబుతుంటే నా గొంతు మెల్లగా పూడుకుపోయింది. నేల వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాను. తను కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. గది మొత్తం నిశ్శబ్దం అలముకుంది. పాప ప్రశాంతంగా పడుకుంది.

“ఠంగ్ ఠంగ్ ఠంగ్” అంటూ వాల్ క్లాక్ గంటలు మొదలుపెట్టింది. తను ఉలిక్కిపడి అటువైపు చూసింది. పాప నిద్రలో నుండి లేచి భయంగా చుట్టూ చూస్తూ ఉంది. నేను కూడా గోడ మీద వేలాడుతున్న క్లాక్ చూసా. టైం తొమ్మిదవుతుంది.

ఆమె లేచి పాపని ఎత్తుకుని “ఇక మేము వెళ్తాం. టైమయ్యింది అక్కా, బావా వచ్చేసుంటారు” అంది. అమె కళ్లలో ఏదో కంగారు, ఆందోళన కనిపిస్తుంది.

“వర్షం ఇంకా పడుతుంది. కాసేపు ఇక్కడే ఉంటే మంచిదేమో” అన్నాను తననే చూస్తూ.

“పర్లేదు” అంటూ ఆమె తలుపు వైపు దారితీసింది. ఇంకా అదే కంగారు.

“పోనీ నేనూ వస్తా మీ కారు వరకు. చీకట్లో ఒక్కరే కష్టం కదా” అని కదలబోయాను.

దానికి ఆమె “ప్లీజ్ వద్దు. ఏమీ అనుకోకండి” అని ముందుకు కదిలింది.

నేను మూలన ఉన్న గొడుగు అందించా “ప్లీజ్ ఇది కాదనకండి. వర్షం బాగా పెద్దదిగా ఉంది.”

ఆమె ఒక సెకెండ్ ఆలోచించి గొడుగు అందుకుని వేగంగా నడుచుకుంటూ చీకట్లో కలిసిపోయింది. నేను కిటికీలో నుండి చీకటిని చూస్తూ అలానే నిద్రపోయాను.

పొద్దున్నే నాన్న స్నేహితుడు రంగ మావయ్య తలుపులు బాదుతూ “గిరి గిరి” అని అరుస్తుంటే లేచాను. వర్షం వెలిసి సూర్యుడొచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తీసాను.

“ఏరా ఇప్పుడే లేచావా” అంటూ మావయ్య లోపలికి వచ్చి నా చేతిలో ఒక కవరుపెట్టి “ఉండు ఇద్దరికీ కాఫీ కలుపుతా” అంటూ కిచెన్‌లోకి వెళ్ళారు.

“ఈ కవరేంటి మావయ్యా” అంటూ నేనూ వెనకే వెళ్ళాను.

“పెళ్ళి సంబంధంరా. మీ అత్తయ్య చూసింది. కవర్ తీసి ఫోటో చూడు” అని నవ్వారు మావయ్య.

ఆసక్తి లేకపోయినా మావయ్య కోసం తెరిచి చూసాను.

“స్నిగ్ధ. అవును స్నిగ్ధే” ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా నా మొహంలో తొంగి చూసాయి.

మావయ్య నాకు కాఫీ అందిస్తూ నా ఆనందం చూసి “ఓహో నచ్చిందన్నమాట” అని నవ్వాడు.

వీధిలో ఏదో గొడవగా ఉంటే బయటకి వచ్చాం నేనూ మావయ్య. ఆంబులెన్స్ వచ్చినట్టుంది. ఇద్దరం కంగారుగా రోడ్డు మీదకి వచ్చాం.

“గిరిబాబూ రాతిరి చూడనేదా? ఏడుగంటలేల పేద్ద యాక్సిడెంటయినాది. ఆయేల పోను చేస్తే ఇప్పుడుకొచ్చినారు ఈ ఆసుపత్రోలు.” అని చెప్పాడు పాలేరు కిట్టయ్య.

యాక్సిడెంట్ అయిన కారు నుండి శవాలు బయటకి తీసారు. “స్నిగ్ధ. అవును స్నిగ్ధే” నా గుండె క్షణ కాలంపాటూ అత్యంత వేగంగా కొట్టుకుని పగిలిపోయింది. కళ్ళు తెరుచుకుని ఆ భయంకర వాస్తవాన్ని చూస్తూ నిలుచుండిపోయాను. స్నిగ్ధతో పాటే పాప, ఇంకా ఎవరో ఇద్దరు భార్యా,భర్తల శవాలు.

“అయ్యో భగవంతుడా” రంగ మావయ్య షాక్‌లో ఉన్నారు.

నేను తేరుకుని “కిట్టయ్య యాక్సిడెంట్ ఎన్నింటికయ్యింది” అని అడిగాను.

“ఏడు గంటలప్పుడు బాబూ”

“కాదు తప్పు 7 గంటలకి అయ్యుండదు. నిన్న తొమ్మిదికి మా ఇంటికి వచ్చారు వీళ్ళు” పిచ్చోడిలా అరుస్తున్నాను నేను. రంగ మావయ్య మరింత షాకయ్యి నా వైపు చూస్తున్నారు.

“లేదు సార్. సరిగ్గా ఏడు గంటలకే జరిగింది. నేనే ఫోన్ చేసాను హాస్పిటల్‌కి. అప్పుడే హాస్పిటల్ వాళ్ళకి టైమ్ కూడా చెప్పాను” అని ఖచ్చితంగా చెప్పాడు కిట్టయ్య కొడుకు.

నాకంతా అయోమయంగా ఉంది. కళ్ళు తిరిగి పడబోయాను. కిట్టయ్య, రంగ మావయ్య నన్ను జాగ్రత్తగా పట్టుకుని గోడకు చేర్పుగా కూర్చోబెట్టరు. చుట్టూ కంగారుగా చూస్తున్నాను. అస్పష్టంగా ఏదో గేటు దగ్గర కనిపించి అటు చూసాను. గేటుకు వేలాడుతూ నిన్న నేను స్నిగ్ధకిచ్చిన గొడుగు.