ముంగిలి » కథలు » పునరపి

పునరపి

సాయంత్రం అయిదు గంటలవుతుంది. వేడి కాఫీ బాల్కనీ రెయిలింగ్ మీద పెట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నా. పైన నల్లని మేఘం ఆకాశం మొత్తం కమ్మేస్తుంది. ఆదివారం కావటంతో రోడ్డు మీద జనాలు పెద్దగా లేరు. ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. చిన్నగా జల్లు మొదలయ్యింది. పిల్లల అమ్మలనుకుంటా అందరినీ లోపలికి రమ్మని అరుస్తున్నారు. నేను కూడా లోపలికి వెళ్దామని వెనక్కి తిరిగా. కానీ ఒక దృశ్యం నన్ను ఆకర్షించి అక్కడే నిల్చుని చూస్తున్నాను.

పిల్లలంతా ఇంట్లోకి పారిపోతున్నా ఒక పాప మాత్రం ఆగిపోయింది. ఆకాశం వైపు చూస్తూ క్రింద పడుతున్న చినుకుల్ని తన చిట్టి చిట్టి చేతులతో కొడుతూ ఆడుతుంది. ఆ పాపని చూస్తూ ఒక బాబొచ్చాడు. పాప ఆనందంలో గెంతుతూ ఉంటే చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆ పాప గెంతటం ఆపి వాడి దగ్గరకి వెళ్ళి బుగ్గమీద ఒక ముద్దిచ్చింది. వాడి మొహంలో చెప్పలేని సంబరం. అక్కడున్న పిల్లలు, వాళ్ళ అమ్మలు అందరూ ఒకేసారి గట్టిగా నవ్వారు. ఇప్పుడు ఇద్దరూ చేతులు పట్టుకుని గెంతుతున్నారు. ఎంతో ఆనందం ఉత్సాహం ఉంది వారిలో. ఆ పాప వాళ్ళ అమ్మనుకుంటా వచ్చి పాపని, బాబు వాళ్ళమ్మ బాబుని తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా లోపలికి వచ్చేసా.

చల్లారిన కాఫీతో సహా కప్పుని సింక్‌లో పడేసా. వర్షంలో నిలబడటంతో బట్టలు తడిచాయి. మార్చుకుని వచ్చి తల తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నా. ఒంటరిగా ఆ నిశ్శబ్దంలో కూర్చోవటం చాలా బోర్‌గా ఉంది. టి.వి. చూసే అలవాటు లేకపోయినా ఒకసారి ఆన్ చేసా. చానెళ్ళన్నీ తిప్పినా ఏదీ నచ్చక ఆఫ్ చేసి పడేసా. కూర్చుని కిటికీలో నుండి వర్షం చూస్తుంటే ఇందాకటి పిల్లలు గుర్తొచ్చారు. వెంటనే ఎందుకో నాకు నా టైమ్‌మెషీన్ తియ్యాలనిపించింది. నా భార్య మధుకి మాత్రం అది టంకుపెట్టె. విలువైన సామాన్లు ఉండే ఇంటిలో ఏ విలువాలేని ఈ పెట్టెకి చోటులేదని మూలనెక్కడో అటక మీద పడేసింది.

పెట్టెని తీసే ప్రయత్నంలో అన్నీ చిందరవందర చేసాను. ఊరునుండి వచ్చాక ఇవన్నీ చూసిందంటే ఉరిమి ఉరిమి చూస్తుంది. కానీ ఆత్రం నన్ను ఆగనివ్వటంలేదు. మొత్తానికి పెట్టి పట్టుకుని హాలులోకి వచ్చి కింద కూర్చున్నాను. ఒక గుడ్డ పట్టుకుని శ్రద్ధగా బూజు మొత్తం దులిపాను. ఈసారి ఏ అనుభూతి దొరుకుతుందో అనే ఆత్రం నా కళ్ళలో, నాకే తెలుస్తుంది. మేజిక్ బాక్స్ వైపే ఆత్రంగా చూస్తున్న చిన్నపిల్లాడి బొమ్మ గోడ మీద. పెట్టె మూత సగం వరకూ తెరిచి కళ్ళు మూసుకుని చెయ్యి లోపలికి పెట్టాను. ఏదో కాగితంలా తగిలింది. ఏ స్పోర్ట్స్‌లోనో, వ్యాసరచనలోనో వచ్చిన సర్టిఫికేట్ అనుకుని ఆత్రంగా బయటకి తీసాను.

ఎక్సైట్‌మెంట్‌తో కళ్ళు తెరిచి చూసాను. అది చాలా పాత ఉత్తరం. ఎవరు రాసిందా అనుకుని వెనక్కి తిప్పి చూసా. గుండె ఒక్కసారి ఆగి రెండు మూడు బీట్స్ మిస్సయ్యాక తిరిగి కొట్టుకోవటం మొదలయ్యింది. ఇది.. లహరి రాసిన ఉత్తరం. లహరి రాసిన ఒకే ఒక ఉత్తరం. గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఉత్తరం అందుకున్నప్పుడు అచ్చంగా ఇలానే కొట్టుకున్నట్టు గుర్తు. లహరి.. లహరి.. నా కలల కవితలపై చెరిగిపోని సంతకం, నా మస్తిష్కంలో ఏదో మూలపడి కనుమరుగైపోయిన జ్ఞాపకం. నిజమే కదా లహరి నాతో లేదనే సత్యాన్ని ఈ కాలం ఎంత లౌక్యంగా నాచేత ఒప్పించేసిందీ! కొన్ని కోట్లమంది నిత్యం పుట్టి చనిపోతున్న ఈ భూమి మీద ఎన్ని కోట్ల ప్రేమకధలు పుట్టాయో ఎన్నింటిని కాలం తన కాళనాలుకతో మింగేసిందో?

బయట గాలికనుకుంటా ఉత్తరం చెయ్యి జారి ఎగిరి నా గుండెని హత్తుకుంది. నేను కావాలని అక్కున చేర్చుకోలేదు, గాలికే చెయ్యి జారింది. గాలి వేగం పెరుగుతుంటే మరింత గట్టిగా హత్తుకుంటూ, నా హృదయంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం. తిరిగి చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఒక దీర్ఘనిట్టూర్పు తర్వాత ఉత్తరం తెరిచాను. విచిత్రం అక్షరాల ఆనవాలు కళ్ళు పసిగట్టగానే నా శ్వాస తన శరీర సుగంధాన్ని ఫీలవుతుంది. అవును అదే సువాసన కొన్నేళ్ళ క్రితం రోజూ నన్ను పలకరించి, తను వస్తోందన్న రాయభారాన్ని మోసిన సువాసన. ప్రేయసి సహజ పరిమళాన్ని మించిన సుగంధాలు లేవని నాకు నిరూపించిన సువాసన.నా పెదాలు వణుకుతున్నాయి. తను నా దగ్గరకి వస్తుందంటే ఎప్పుడూ నాలో కలిగే భావస్పందన. కళ్ళు మూసుకుని గుండెల నిండా ఆ సువాసనని పీల్చుకున్నా, తనని తాకాలనే ఆవేశాన్ని సంతృప్తి పరిచటానికి నేను వెతుక్కున్న మార్గం ఇదే.

ఆ అచేతనావస్థలో ఉండగా తేరుకున్న మెదడు శరీరానికి ఒక షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వళ్ళంతా ఒక్కసారిగా జలదరించి స్పృహలోకి వచ్చాను. ఒక్క క్షణం అయోమయం ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ తన ఉనికి ఎలా? ఏదో అర్ధమయ్యింది. గతకాలపు దృశ్యాల్లో మనం వదిలేసి వెళ్ళిపోయే అస్థిత్వాలు ఆ జ్ఞాపకాలను అంటిపెట్టుకునే అలానే ఉంటాయేమొ. అదే నిజమయితే ఆ నాడు తను వదిలిన తన ప్రెజెన్స్ ఇప్పుడు ఇక్కడే నాతో ఉంది. చుట్టూ పరికించి చూసాను. బయట హోరు గాలి, ఎడతెరిపిలేని వర్షం, చీకటిపడిపోయింది. లేవటానికి బద్దకంగా అనిపించినా ఉత్తరం అక్కడే పెట్టి లేచి వెళ్ళి లైట్ వేసాను. గది మొత్తం పరుచుకున్న వెలుగులో గాలికి కదులుతూ క్రింద ఉత్తరం.

ఉత్తరం తీసి సోఫాలో కూలబడ్డాను. ఎందుకో అక్షరాల మీద చేతులతో తాకుతూ ఉంటే తన స్పర్శ, నా పక్కనే తను కూర్చున్నప్పుడు అనుకోకుండా కదిలినప్పుడు అలా తాకి తిరిగి దూరమవుతున్న స్పర్శ. ఎప్పుడూ తను వ్రాసే ముత్యాల అక్షరాలు కావవి. రాయాల వద్దా అని క్షణానికో లక్షసార్లు (సూపర్ కంప్యూటర్లకి కూడా అందనంత వేగమేమో) ఆలోచిస్తూ, వ్రాస్తూ వద్దని ఆపేస్తూ, ఎన్నో విరామలతో సాగిన ఆత్మసంఘర్షణ. అందుకేనేమో చేతితో అక్షరాలను తాకుతూ ఉంటే చెయ్యి మెత్తగా జారిపోలేదు, ప్రతి లైనుకి ఎన్నోసార్లు చెయ్యి కదలలేదు. అక్కడ అక్కడ అక్షరాలు నీరు పడి చెరిగినట్టుగా తెలుస్తుంది. కన్నీళ్ళ గుర్తులు భద్రంగా దాచే మార్గం నాకిప్పుడే తెలిసింది. వ్రాసేప్పుడు తీవ్ర ప్రకంపానికి లోను చేసిన పదాల దగ్గరనుకుంటా అక్షరాల్లో వణుకు కనిపిస్తుంది.

అనుభూతులతో కడుపు నిండక అక్షరాలను ఏరుకోవటం మొదలుపెట్టాయి కళ్ళు. “కన్నయ్యా!” ఆ పిలుపు నేను చదివానా? లేక తనే పిలిచిందా? తన ప్రేమ మొత్తాన్ని తెలిపేందుకా అన్నట్టు శ్రావ్యమైన తన గొంతులో సహజంగా ఒదిగిపోయిన లాలిత్యంతో పిలిచే ఆ పిలుపు నా చెవులను తాకుతోంది. ఆ పిలుపుకున్న శక్తి తనకి తెలియదేమో కానీ. నాకు తెలుసు. యుగాలనాడు పోగొట్టుకున్న ఒక రాగం హృదయాన్ని పట్టి లాగినట్టుగా ఉంటుంది. ఆవలి తీరంలో ఎవరో నన్ను ఆశగా,ఆర్తిగా పిలిచినట్టుంటుంది. మనసులో ఓర్చుకోలేని బాధని పంటి బిగువున అణుచుకుంటున్నట్టుగా ఒక అలజడి మొదలయ్యింది. కళ్ళను కమ్మేస్తూ ఒక్క సన్నని నీటి పొర.

కన్నయ్యా,
జీవితంలో మరలా నిన్ను చూస్తానో లేదో తెలియదు. చివరగా నీతో చెప్పాలనుకున్న మాటలు చెబుతున్నారా. హడావుడిగా ఇప్పటికిప్పుడు వ్రాస్తున్నా. మరో పదిరోజులు దాటాక నేను వ్రాసినా మరొకరి భార్య వ్రాసిన ఉత్తరమయిపోతుంది. అప్పుడు నువ్వు కనీసం తెరవకుండానే చించేస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటావా? వర్షంలో తడుచుకుంటూ వెళ్దామని ఎన్నోసార్లు నన్ను అడిగిన నువ్వు, నా పెళ్ళి కుదిరిన రోజు సాయంత్రం నీ పక్కనే వర్షంలో తడుస్తుంటే కనీసం నా మొహం కూడా చూడలేదు. చూడకూడదనే సంస్కారాన్ని నీ కళ్ళు ప్రదర్శించిన క్షణమే నీకెంత దూరమయ్యానో అర్ధమయిపోయింది. ఆ క్షణం రోడ్డు మీదున్నా అనే స్పృహేలేకుంటే అక్కడే కూలబడి చచ్చేదాక ఏడ్చేదాన్ని. నాన్నగారు నువ్వు ఎందుకు వద్దో నాకు చెప్పాలని, నిన్ను వంద రకాలుగా తక్కువ చేస్తుంటే, నీ వ్యక్తిత్వంతో నువ్వు లక్షరెట్లు ఎదిగి నువ్వు మాత్రమే కరెక్టని నిరూపించుకున్నావురా. కానీ ఏం చెయ్యనురా ఆడపిల్లను. చేతకాని సమాధానం కదా. అవును చేతకానీ నాకు ఇంకేమీ చెప్పే అర్హత లేదు. కానీ ఒక్కటి అడగాలనుకుంటున్నారా.

నువ్వెప్పుడూ వచ్చే జన్మ వద్దంటుంటావ్. నువ్వు కోరుకున్నట్టుగా వచ్చే జన్మలేకుంటే ఏమో కానీ, అలా కాకుండా మరలా పుడితే, మరలా నాకు ఈ అవకాశం ఇవ్వరా ప్లీజ్. ఈసారి ప్రాణాలైనా వదులుకుంటా, నిన్ను మాత్రం వదులుకోను. జీవితగమ్యాన్ని కోల్పోతున్న దురదృష్టవంతురాలినిరా వీలయితే నా మీద జాలిపడు, కోపగించకు….

…బై కన్నయ్య.

ఈ చివరి ముక్క బై కన్నయ్య వ్రాసేప్పుడు భూకంపంగానీ వచ్చిందా అని అనుమానం కలిగించేంతలా అక్షరాల్లో వణుకు. ఉత్తరం చదవటం పూర్తవ్వగానే కరెంటుపోయింది. కరెంటువాడికి నా మీద ఇంత జాలి ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. తన జీవితంలో చివరిసారిగా చెబుతున్న బై అని తెలిసినప్పుడు తను ఎంత క్షోభ పడి ఉంటుందో, వ్రాసాక మూర్చ వచ్చేలా క్రింద పడి ఎంత ఏడ్చి ఉంటుందో నాకు తెలియజెప్పటానికేమో నా కళ్ళు ధారలు కడుతున్నాయి. నా కడుపులో నుండి మొదలయ్యిన దుఃఖం వెక్కిళ్ళుగా మారింది. ఆ చీకట్లో సోఫాలో అలానే పడి ఏడుస్తూ ఉన్నాను.

ఎంత సేఫు ఏడ్చానో నాకే గుర్తులేదు. కరెంటు వచ్చి మొహం పైన ఒక్కసారిగా కాంతి పడటంతో కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యి లేచాను. సెల్‌ఫోన్ చూస్తే మధు మిస్డ్‌కాల్స్ నాలుగున్నాయి. ఉత్తరం మూసి పెట్టెలో పెట్టేసాను. ఆ గదిలో అంతవరకూ ఉన్నా ఆ సువాసన లేదు, నా మనసుకి అంత వరకు తెలుస్తున్న లహరి ప్రెజెన్స్ అక్కడ లేదు. లహరి మరోసారి మరోసారి నన్నొదిలి వెళ్ళిపోయింది. మధు భర్త సంస్కారం ఆపేయాలనుకుంటున్న మనసు మాటలు నా చెవులను తాకాయి “ఇలా ఎన్నిసార్లు లహరి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవటం?”

32 thoughts on “పునరపి

  1. తొలివలపులో ఉన్న మాధుర్యం అలాంటిది. ఎన్నిసార్లు తలుచుకున్నా ఎప్పటికప్పుడు నిత్యనూతనం. అదలా ఉంచండి…ఈ కథ మీ ఆవిడ చదవటానికి ముందే మీ ఇంట్లో కుదిరితే మీ ఇంటికి అటు నాలుగిళ్ళు, ఇటు నాలుగిళ్ళ వరకు అప్పడాల కర్రలాంటి స్త్రీ ఆయుధాల్లేకుండా జాగ్రత్తపడండి!

  2. చాలా అనుభూతులకి అందమైన అక్షరాల ముసుగు తొడగడం అందరికీ తెలిసే విద్య కాదు. మీరు అందులో సిద్ధహస్తులని మీరు రాసిన ప్రతి వాక్యం చెబుతుంది. నిజంగా అద్భుతంగా రాశారు మురళి గారు. ఒక్కసారితో ఆగాలనిపించలేదు. మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది. మీ టైం మెషిన్ మీకు ప్రతిసారి ఎలా ఒక కొత్త అనుభూతినో, పాత ఙ్ఞాపకాన్నో ఎలా తిరిగి ఇస్తుందో, మీ కథ కూడా చదివిన ప్రతి సారీ నాకు అలాగే కొత్త ఫీలింగ్ ని చూపిప్స్తుంది. అద్భుతం అంతే..

  3. చాల బాగా రాసారు. మూడేళ్ళు వెనక్కి వెళ్లి వచ్చనోసారి.

    ఈ భూమి మీద ఎన్ని కోట్ల ప్రేమకధలు పుట్టాయో ఎన్నింటిని కాలం తన కాళనాలుకతో మింగేసిందో? చాల మటుకు ప్రతి ఒకరికి ఈ పరిస్థితి తప్పదేమో.

  4. మొదలుపెట్టిన తీరు బాగుంది. కథలో ఏ అంశం నచ్చింది, ఏ పదప్రయోగం నచ్చింది అనడిగితే కథంతా కామెంట్లో కట్-పేస్ట్ చెయ్యాలేమో 🙂 వలపు – అదంతే!

    //గుండె ఒక్కసారి ఆగి రెండు మూడు బీట్స్ మిస్సయ్యాక తిరిగి కొట్టుకోవటం మొదలయ్యింది// హ్మ్… ఆ పారవశ్యం ఇహ-పరంలో ఎక్కడా లభించదు!

    //కొన్ని కోట్లమంది నిత్యం పుట్టి చనిపోతున్న ఈ భూమి మీద ఎన్ని కోట్ల ప్రేమకధలు పుట్టాయో ఎన్నింటిని కాలం తన కాళనాలుకతో మింగేసిందో?//
    Great Expression 🙂

    //విచిత్రం అక్షరాల ఆనవాలు కళ్ళు పసిగట్టగానే నా శ్వాస తన శరీర సుగంధాన్ని ఫీలవుతుంది. అవును అదే సువాసన కొన్నేళ్ళ క్రితం రోజూ నన్ను పలకరించి, తను వస్తోందన్న రాయభారాన్ని మోసిన సువాసన. ప్రేయసి సహజ పరిమళాన్ని మించిన సుగంధాలు లేవని నాకు నిరూపించిన సువాసన.//
    🙂

    //వీలయితే నా మీద జాలిపడు, కోపగించకు…. //
    కొపమా? అదెలాంటిది?

    //మధు భర్త సంస్కారం ఆపేయాలనుకుంటున్న మనసు మాటలు నా చెవులను తాకాయి “ఇలా ఎన్నిసార్లు లహరి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవటం?”//

    కంఠంలో ప్రాణమున్నంతమున్నంత కాలం 🙂

  5. మురళీ సూపర్!
    నాకు నచ్చిన వరుసలు :
    >> అక్షరాల ఆనవాలు కళ్ళు పసిగట్టగానే నా శ్వాస తన శరీర సుగంధాన్ని ఫీలవుతుంది
    >>అక్కడ అక్కడ అక్షరాలు నీరు పడి చెరిగినట్టుగా తెలుస్తుంది. కన్నీళ్ళ గుర్తులు భద్రంగా దాచే మార్గం నాకిప్పుడే తెలిసింది.

  6. మా రోజులు వచ్చేసరికి ఇలా లేఖలు లేవు మళ్ళీ మళ్ళీ బాధపడటానికి ఫోన్లో ఎస్సెమ్మెస్లు మాత్రమే. అవి చెరిగిపోయినట్టే మనసులోని భావాలు కూడా!

  7. jony గారూ, థాంక్సండి. ఇది నిజంగా జరిగింది కాదు కల్పితమే.

    మానసగారూ, థాంక్యూ. తప్పకుండా మరిన్ని మంచి కధలు వ్రాయటానికి ప్రయత్నిస్తాను.

    గురూజీ, మీకు నచ్చిన పోస్టు ఇదే అని ప్రకటించేసారు బజ్జులో కూడా. థాంక్యూ.

    నాగార్జునగారూ, మరిన్ని మంచి కధలు వ్రాయటానికి ప్రయత్నిస్తాను. థాంక్యూ.

  8. అరుణ్ చంద్రగారూ, ఆ ప్రమాదం లేదు. ఇది కల్పితమే. నేనింకా సంసార సాగరంలో దిగలేదు. థాంక్యూ.

    మనసు పలికే గారూ, మీ కామెంటు చాలా ఆనందాన్నిచ్చింది. థాంక్యూ.

    వంశీగారూ, నిజమే చాలామందికి ఇది నిత్యసత్యమనుకుంటా. థాంక్యూ.

    శ్రావ్యగారూ, థాంక్యూ.

  9. కిరణ్, అంత పెద్ద మాటలు వద్దు. నీకు అర్హత లేకపోవటమేంటి? నీ పోస్టులు మాత్రం తక్కువా?

    అవినేని అన్నయ్యా, నీకు బోల్డు బోల్డు థ్యాంక్స్.

    మధుర, నేను కూడా ఇలానే అనుకుంటున్నా. ఇంత వరకూ పార్టింగ్‌నోట్ అన్నింటికంటే బెస్ట్ అనుకునేవాడ్ని. ఇప్పుడు ఇదే నా ఫేవరెట్.

    హర్షా, థాంక్యూ.

  10. Bagundira.. nee blog mitrulala laga telugu lipi lo raddam anukunna kani, lekhini alavatu ledu.. baddhakam ga undi 😉

    konta mandiki jarigipoyina kadhalani malli malli “gurtu” chesukuntoo Punarapi.. inkontamandiki patavi vadilesi kotta vyaktulato alanti anubhootulani vetukutoo Punarapi.. mottaniki manava jeevitam lo prema bhavam matram Punarapi Punarapi…

  11. నిజ్జం గా చెబుతున్నాను, భావ కవిత్వం, రచన అంటే నాకు మంచి అభిప్రాయం లేదు. మీ రచన గొప్పది అనో, అనుభవం ఒకటి ఉన్నంత మాత్రాన దాన్ని హృదయంతో పునరపి అనుకోవడం మంచిదో కాదో, నాకు తెలీదు. నాకు నిజం గా అటువంటివి appreciate చెయ్యడం రాదేమో. ఒక అమ్మాయిని అంత మనఃస్ఫూర్తి గా ప్రేమించి, ఇంకో అమ్మాయిని ఎందుకు అతను పెళ్లి చేసుకున్నాడో చెప్పలేదు? నిజమైన ప్రేమికుడు/ప్రేమిక జన్మ జన్మ లకూ wait చెయ్యాలి కదా? లేకపోతె అదేమి ప్రేమండి? బ్రతుకులో కలిపేది ప్రేమ, చావులోనూ విడదీయనిది ప్రేమ, చనిపోయినా నమ్మనిది ప్రేమ, కాదంటారా. ఆమెతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని, అదే ఊహా ప్రపంచంలో జీవించకుండా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని, లేదా ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుని, ఇంకొకరితో బ్రతికే వాళ్ళది ప్రేమని ఎలా అంటారండి? మరొక్క సారి చెబుతున్నాను, నాకిలాంటివి appreciate చెయ్యడం రాదేమో.

    ఇప్పుడితను పెళ్లి చేసుకుని, సరిగ్గా తన భార్యకు ప్రేమని పంచలేక, తన ప్రియురాలిని మరువలేక, తన జీవితాన్ని పరమార్ధం వైపు మల్చుకోలేదు సరి కదా, ఇంకొక జీవి (భార్య) మనోక్షోభ కి కారణం అయ్యాడు, ఆ అమ్మాయి కూడా అంతే. నిజమైన భావుకుడైతే, తను చేసిన ఈ పాపానికి ఉరేసుకుని చచ్చేవాడెమో!

    నేనేదైనా తప్పు చేసి ఉంటె మన్నించండి Sir. నాకు మనసులో అనిపించినా భావాన్ని చెప్పను, తప్పులేమైన ఉంటె మీ శిష్యునిగా భావించి clarify చేస్తారని ఆసిస్తూ,

  12. “భావ కవిత్వం, రచన అంటే నాకు మంచి అభిప్రాయం లేదు” మీరు ఈ అభిప్రాయంలో ఉన్నప్పుడు కధలు,కవితలు మీకు నచ్చకపోవచ్చు. మీకు అసక్తిలేని ఈ విషయం గురించి నేను ఎంత చెప్పినా మీరు appreciate చెయ్యలేరేమో.
    భావుకత దేవాలయంలో మూలవిరాట్టులాంటిది. నమ్మకం, భక్తి ఉన్నవాడు అందులో దైవాన్ని చూస్తాడు. అవిలేని వాడు కేవలం మనిషి అకృతిలో చెక్కబడిన శిల్పాన్ని చూస్తాడు.

    “నిజమైన ప్రేమికుడు/ప్రేమిక జన్మ జన్మ లకూ వైత్ చెయ్యాలి కదా? లేకపోతె అదేమి ప్రేమండి? బ్రతుకులో కలిపేది ప్రేమ, చావులోనూ విడదీయనిది ప్రేమ, చనిపోయినా నమ్మనిది ప్రేమ”
    “ఆమెతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని, అదే ఊహా ప్రపంచంలో జీవించకుండా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని, లేదా ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుని, ఇంకొకరితో బ్రతికే వాళ్ళది ప్రేమని ఎలా అంటారండి?”

    మీరు అన్న ఈ మాటలు కూడా తరచి చూస్తే భావుకతే. కానీ తర్కంలా కనిపించే వాస్తవదూరమైన భావుకత.

    ప్రేమించే ప్రతివాడు ప్రేమించిన వాళ్ళనే పెళ్ళి చేసుకోవాలని కలలుకంటాడు. కాని అన్నీ అలా జరిగిపోతాయా? విడిపోవటానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఆ కారణాలు బయట నుండి చూసేవాడికి అసంబద్దంగా, సిల్లీగా, చిన్నవిగా అనిపిస్తాయి. అందులో ఉన్నవాడికే తెలుస్తుంది ఆ బాధ.

    కొన్నాళ్ళకి అందరూ గతాన్ని మరిచి ముందుకుసాగిపోతారు. ఎప్పుడన్నా ఙ్ఞాపకాలు తట్టిలేపినప్పుడు కాసేపు బాధపడతారు. అంతమాత్రానికే పెళ్ళి చేసుకున్నవారిని కష్టపెట్టేస్తున్నారు అనుకోకండి. ప్రేమించే లక్షణం ఉన్నవాడు అందరినీ ఆనందంగా ఉంచాలనే అనుకుంటాడు. లేకుంటే ఈ లోకంలో సగానికి పైగా కాపురాలు ఎప్పుడో కూలిపోయేవి.

  13. “విడిపోవటానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఆ కారణాలు బయట నుండి చూసేవాడికి అసంబద్దంగా, సిల్లీగా, చిన్నవిగా అనిపిస్తాయి. అందులో ఉన్నవాడికే తెలుస్తుంది ఆ బాధ.”

    ప్రేమించి విడిపోయిన వారిది ఏమి బాదండి? ఆ చుట్టుపక్కల వాళ్ళది కదా బాధంతా? Already ప్రేమించి విడిపోయాడు అంటే, వాడికి/తనకి ప్రేమ ఎందుకు అనేకదా అర్ధం? నిజమైన ప్రేమ, పొందగలిగిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు విడిపోతారా? విడిపోయిన వారి ప్రేమ లోతు ఎంత? లోతు లేని ప్రేమ ప్రేమేనా అసలు? నిజమైన ప్రేమికులు, విడిపోరండి. మనమో, ఈ ప్రపంచమో విడదీసాము అనుకుంటాము, కాని ఒకరి మనసులో మరొకరు నిలిచే ఉంటారు, ఎంతా అంటే, ఈ ప్రపంచమే తప్పు, వాళ్ళ జ్ఞాపకమే కరక్టు అన్నంత deep గా. అంత deep connection లేకుండా విడిపోయి రాజీపడినవాళ్లకి ప్రేమించే లేదా, ఆ ప్రేమని తలచుకునే హక్కు ఎలా ఉంటుందండి?

    భగ్న ప్రేమికులు చాలామందే ఉంటారు Sir. వాళ్ళ ప్రేమలు fail అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండవు, ఒక్క ఈ deep connection లేకపోవడం అనే కారణం ఒక్కటే ఉంటుంది. లేదంటే, అసలు వాళ్ళు విడిపోనే విడిపోరు. బాహ్య ప్రపంచానికి కనిపించే ప్రాణి కాదు ప్రేమంటే, ఆ ప్రాణి శరీరం కానే కాదు, ఒక deep connection. ప్రేమంటే శరీరం కాదు, ఇది మీరూ ఒప్పుకుంటారు. నేననేదేంటంటే, అది మనసు కూడా కాదు, ఆత్మ అని. ఒక రకమైన spiritual co-existence, ప్రేమంటే. కలిసి బ్రతకక పోవచ్చు, కనీసం ఒకే రకం గా ఉండకపోవచ్చు కూడా. నేను extreme చెప్తున్నాను అనుకుంటారేమో మీరు, కాని ఇదే ప్రేమంటే. మిగిలినవన్నీ తలుచుకోవడానికి, మాట్లాడుకోవడానికి అందంగా ఉంటాయి, కాని ప్రేమ మాత్రం కాదు.

    ఇంకో మాట, సామాన్య మానవుడు ప్రేమించగలడా అంటే లేదండి, ఇలా ప్రేమించేందుకు చాలామంది సరిపోరు. కొందరు అనుకుంటున్నట్టు cupidity is not love, it is nowhere near Love. ప్రేమని common చెయ్యడం వల్ల మంచి జరగదు Sir, తప్పే జరుగుతుంది.

  14. మరొక్క మాట, నేను ఇప్పటి వరకూ ఇలా ఎవరినీ ప్రేమించలేదు. Just బుర్ర తో analyze చేసి రాస్తున్నా అంతే. ఏమైనా తప్పు ఉంటె rectify చేస్తారని భావిస్తున్నాను. Thanks

వ్యాఖ్యానించండి