ఎప్పుడూ నేనొక నేస్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నా. నా పక్కనే తనుంటుందని తెలిసీ, చూసి చూడనట్టుగా తప్పించుకుపోతుంటాను. చూసి పలకరిస్తే తనకోసం కాస్త సమయం ఇమ్మంటుందని నా భయం. సమయం ఇస్తే మాత్రం ఏంపోతుంది? రోజుకి నేను సోది మాటల్లో వృధా చేసే కాస్త సమయం ఇవ్వొచ్చు. కానీ ఇస్తే తను నాలా డొంకతిరుగుడుగా మాట్లాడదు. నిక్కచ్చిగా నిగ్గదీసి నిజాన్ని మాట్లడుతుంది, నన్ను మాట్లాడమంటుంది. తీరా అన్నీ మాట్లాడాక తను విని వెళ్ళిపోతుంది. నేను మాత్రం రోజంతా ఆ మాటల్లో, ఆలోచనల్లో నన్ను నేను కోల్ఫోతాను. అందుకే ఈ తప్పించుకు తిరిగే ప్రవృత్తి.
కానీ తనెప్పుడూ చెబుతూ ఉంటుంది. నేనేరా నీ నిజమైన నేస్తాన్ని అని. నేనెప్పుడూ నిన్ను వదిలి ఉండలేదు, ఉండను అని.నాకు కూడా తెలుసు అదే నిజమని. కానీ ఆ నిజాన్ని అంగీకరిస్తే అమ్మో ఆ భయంకర భావాల్ని నేను భరించలేనేమో? అలా అని పూర్తిగా తనని వదిలి ఎప్పుడూ నేను కూడా ఉండలేదు. నా అవసరాల్లో, భాదల్లో తననే ఆశ్రయిస్తా. ఆనందాల్లో మాత్రం తనని మరిచిపోతా. అయినా ఇంతకాలం ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. నేను పట్టించుకోకపోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనతో అవసరంపడి తనకోసం చూడగానే అర్ధం చేసుకుని వచ్చి వాలిపోతుంది. బయటకి ఎప్పుడూ చెప్పకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం.
చల్లని సాయంత్రం సముద్రపు కెరటాలతో పోటీపడి నా పాదాలు పరిగెడుతున్నప్పుడు తను కావాలి. మనాలి మంచుకొండల్లో, ఆపిల్‌తోటలో బెంచిమీద కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు తను కావాలి. వారం మొత్తం ఎక్కువగా పనిచేసి అలిసిపోయినట్టుంటే వారంతంలో బద్దకంగా ఆలస్యంగా లేచి ఇళయరాజా పాటలు పెట్టుకుని వింటున్నప్పుడు తను కావాలి. ఏదయినా కవితో, బ్లాగులో టపానో వ్రాయాలనుకున్నప్పుడు తనుకావాలి. అన్నట్టు తన పేరు చెప్పలేదు కదా? తనపేరు ఏకాంతం. పేరు వినగానే ఎక్కడో విన్నట్టు కాదు కాదు మీకు కూడా నేస్తమే అనిపించిందా? అవును మరి ఏ కాంతాలేనివారికి, శాంతి లేనివారికి ఏకాంతమే నేస్తం. అసహనంలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, ఆగ్రహంలో ఉన్నప్పుడు, అవమానం ఎదురయినప్పుడు మనల్ని ఓదార్చే నేస్తం ఏకాంతం.
ఏకాంతం ఓ గురువు
మనలో ఉన్న శక్తి మనకి తెలియజేస్తుంది.
ఏకాంతం ఒక నేస్తం
మనం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని ఒకే దృష్టితో చూసి మనకు చెబుతుంది.
ఏకాంతం ఒక మౌని
మనకు సంయమనం నేర్పుతుంది.
ఏకాంతం మన శ్రేయోభిలాషి మనవాళ్ళెవరో తెలియజెబుతుంది. తల్లిలా ఒడిలో ఏడ్చే అవకాశమిస్తుంది. తండ్రిలా తలనిమిరి ధైర్యాన్నిస్తుంది. గురువుగా భుజంతట్టి ఓ మార్గం చూపుతుంది. ప్రియురాలిలా అపూర్వమైన మధురమైన క్షణాల్లో మౌనంగా నీతో కలిపి అనుసరిస్తుంది. అన్నింటికంటే నీ మనసనే నేస్తంతో నువ్వు ప్రతిసారీ మాట్లాడేది ఏకాంతంలోనే.ఏకాంతంలేనప్పుడు ఎన్ని ఉన్నా ఆత్మతృప్తి ఉండదు కదా!అదేంటో ఎప్పుడు రమ్మన్నా పరిగెట్టుకు వచ్చే ఏకాంతం ఇప్పుడు నీమీదే టపా వ్రాస్తున్నా నిజంగా ఇప్పుడూ నువ్వు కావాలి అన్నా నవ్వుతూ నిలబడిందే గాని రాదే?? మరి తనేం చెప్పిందో తెలుసా?
“నేనే కాదు బాబూ, నీకు నువ్వు తప్ప వేరెవ్వరూ నీతో లేకపోవటమే ఏకాంతం.”
నిజమండి…ఏకాంతంగా ఉన్నవేళ తోడుండే ఏకైక నేస్తం ఏకాంతం!
bagundi
very true. the post makes the readers observe themselves and check the quality of time spent just for themselves.
ఏదో ఇవ్వాలి కదా అని ఇచ్చేదా సమయం ఇవ్వటమంటే?
ఏకాంతం గా ఉండాలి కాసేపైనా అంటే దక్కేదా ఏకాంతం అంటే?
నాకు తెలిసిన నా ఏకాంతం తనక్కావాల్సినప్పుడు వచ్చి నన్ను తనతో లాక్కుపోతుంది. అప్పుడిక సమయం మమ్మల్ని అనుసరిమ్చాల్సిందే!!
Happy Ekaantam 🙂
Ekaantam nijamgaa guruve. well said sir..
మాష్టారూ అభినదనలు…నూతక్కి
ఏకాంతాన
ప్రియ కాంత
సన్నిధిన అందే
ఆనందాన్ని మించి
అందించేది
ఏకాంతం
భావ విన్యాసాల
ఊరేగింపులు
ఆకళింపు చేసుకొంటూ
అదే
ఏకాంతాన ,
కావ్య కన్నియల
నృత్య విన్యాసాలు
వీక్షిస్తూ కాలం
గడిపేదీ
ఏకాంతాన.
బాధల వ్యధలనుండి
ఊరట పొందేదీ
ఏకాంతాన
ఊహల లోకంలో
తేలియాడి
స్వప్నాల ‘భావిలో’
ఈడులాది
యువత
సాంత్వన పొందేదీ
ఏకాంతాన.
సృజనకు జీవ స్థలి
ఏకాంతం
ఆశకు జన్మస్థలి
ఏకాంతం
కాని
నిరాశకు
నీరుపోసి
వివేచనను
విస్చ్చిన్న పరచి
అదే ఏకాంతం
అనాలోచిత
ఉద్రేకంలో
ఉద్వేగంలో
తమ ప్రాణాలు
తామే
త్రుంచుకొనే
అమాయకులకు
ఆసరా గా
అదే ఏకాంతం…………నూతక్కి
ekantam story baagundi.elaantivi mari enno raayaalani koorukuntu mi…………………………byyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy!
నిజమే మీ పోస్ట్లు అన్నీ అందం గా ఉన్నాయి..ఈ ఏకాంతం ఫొటో చాలా బాగుంది