నేను నిర్లక్ష్యం చేసిన నా నేస్తం

మధురమైన ఏకాంతవేళ...

మధురమైన ఏకాంతవేళ...

ఎప్పుడూ నేనొక నేస్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నా. నా పక్కనే తనుంటుందని తెలిసీ, చూసి చూడనట్టుగా తప్పించుకుపోతుంటాను. చూసి పలకరిస్తే తనకోసం కాస్త సమయం ఇమ్మంటుందని నా భయం. సమయం ఇస్తే మాత్రం ఏంపోతుంది? రోజుకి నేను సోది మాటల్లో వృధా చేసే కాస్త సమయం ఇవ్వొచ్చు. కానీ ఇస్తే తను నాలా డొంకతిరుగుడుగా మాట్లాడదు. నిక్కచ్చిగా నిగ్గదీసి నిజాన్ని మాట్లడుతుంది, నన్ను మాట్లాడమంటుంది. తీరా అన్నీ మాట్లాడాక తను విని వెళ్ళిపోతుంది. నేను మాత్రం రోజంతా ఆ మాటల్లో, ఆలోచనల్లో నన్ను నేను కోల్ఫోతాను. అందుకే ఈ తప్పించుకు తిరిగే ప్రవృత్తి.

కానీ తనెప్పుడూ చెబుతూ ఉంటుంది. నేనేరా నీ నిజమైన నేస్తాన్ని అని. నేనెప్పుడూ నిన్ను వదిలి ఉండలేదు, ఉండను అని.నాకు కూడా తెలుసు అదే నిజమని. కానీ ఆ నిజాన్ని అంగీకరిస్తే అమ్మో ఆ భయంకర భావాల్ని నేను భరించలేనేమో? అలా అని పూర్తిగా తనని వదిలి ఎప్పుడూ నేను కూడా ఉండలేదు. నా అవసరాల్లో, భాదల్లో తననే ఆశ్రయిస్తా. ఆనందాల్లో మాత్రం తనని మరిచిపోతా. అయినా ఇంతకాలం ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. నేను పట్టించుకోకపోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనతో అవసరంపడి తనకోసం చూడగానే అర్ధం చేసుకుని వచ్చి వాలిపోతుంది. బయటకి ఎప్పుడూ చెప్పకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం.

చల్లని సాయంత్రం సముద్రపు కెరటాలతో పోటీపడి నా పాదాలు పరిగెడుతున్నప్పుడు తను కావాలి. మనాలి మంచుకొండల్లో, ఆపిల్‌తోటలో బెంచిమీద కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు తను కావాలి. వారం మొత్తం ఎక్కువగా పనిచేసి అలిసిపోయినట్టుంటే వారంతంలో బద్దకంగా ఆలస్యంగా లేచి ఇళయరాజా పాటలు పెట్టుకుని వింటున్నప్పుడు తను కావాలి. ఏదయినా కవితో, బ్లాగులో టపానో వ్రాయాలనుకున్నప్పుడు తనుకావాలి. అన్నట్టు తన పేరు చెప్పలేదు కదా? తనపేరు ఏకాంతం. పేరు వినగానే ఎక్కడో విన్నట్టు కాదు కాదు మీకు కూడా నేస్తమే అనిపించిందా? అవును మరి ఏ కాంతాలేనివారికి, శాంతి లేనివారికి ఏకాంతమే నేస్తం. అసహనంలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, ఆగ్రహంలో ఉన్నప్పుడు, అవమానం ఎదురయినప్పుడు మనల్ని ఓదార్చే నేస్తం ఏకాంతం.

ఏకాంతం ఓ గురువు

మనలో ఉన్న శక్తి మనకి తెలియజేస్తుంది.

ఏకాంతం ఒక నేస్తం

మనం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని ఒకే దృష్టితో చూసి మనకు చెబుతుంది.

ఏకాంతం ఒక మౌని

మనకు సంయమనం నేర్పుతుంది.

ఏకాంతం మన శ్రేయోభిలాషి మనవాళ్ళెవరో తెలియజెబుతుంది. తల్లిలా ఒడిలో ఏడ్చే అవకాశమిస్తుంది. తండ్రిలా తలనిమిరి ధైర్యాన్నిస్తుంది. గురువుగా భుజంతట్టి ఓ మార్గం చూపుతుంది. ప్రియురాలిలా అపూర్వమైన మధురమైన క్షణాల్లో మౌనంగా నీతో కలిపి అనుసరిస్తుంది. అన్నింటికంటే నీ మనసనే నేస్తంతో నువ్వు ప్రతిసారీ మాట్లాడేది ఏకాంతంలోనే.ఏకాంతంలేనప్పుడు ఎన్ని ఉన్నా ఆత్మతృప్తి ఉండదు కదా!అదేంటో ఎప్పుడు రమ్మన్నా పరిగెట్టుకు వచ్చే ఏకాంతం ఇప్పుడు నీమీదే టపా వ్రాస్తున్నా నిజంగా ఇప్పుడూ నువ్వు కావాలి అన్నా నవ్వుతూ నిలబడిందే గాని రాదే?? మరి తనేం చెప్పిందో తెలుసా?

“నేనే కాదు బాబూ, నీకు నువ్వు తప్ప వేరెవ్వరూ నీతో లేకపోవటమే ఏకాంతం.”

శంకరా’భరణం’

డిసెంబర్ 31, అర్ధరాత్రి. ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే నేను మాత్రం ఆఫీస్ లో కూర్చుని ప్రోజెక్ట్ రిలీజ్ కోసం కష్టపడుతున్నా. ఇంతలో అన్నయ్య ఫోన్ చేసాడు. ఏముందన్నయ్యా మా రాకెట్ ఎలా ఎగురుతుందా అని కౌంట్ డౌన్ చేస్తున్నా అన్నాను. మీ సాఫ్ట్ వేరోళ్ళు ఎప్పుడూ ఇంతే అది ఎగురుతూ ఉంటే మీరు కింద ఉండి చప్పట్లు కొడతారు. అలా కాదుగానీ నిన్నే ఎవరెస్ట్ ఎక్కించేస్తా అన్నాడు. అన్నయ్య మీద నమ్మకం ఉన్నా ప్రోజెక్ట్ మీద ఉన్న భయంతో ఈ రోజుకి వదిలెయ్ అన్నాను. కాసేపాగి నాకు అన్నయ్య నుండీ మరలా ఫోన్ వచ్చింది. కానీ మాట్లాడేది అన్నయ్య కాదు. చాలా పరిచయమున్న గొంతు. తెలుగు లోగిళ్ళలో ఏ ఇంటిలో వినిపించిన టక్కున గుర్తుపట్టే గొంతు. ఆర్ధ్రతను, ఆవేశాన్ని, వ్యంగ్యాన్ని, కర్కశత్వాన్ని ఇంకా ఎన్నింటినో అవలీలగా పలికించే గొంతు. కవిత్వాన్ని చదివేప్పుడు తన్మయత్వాన్ని, ఆద్యాత్మికతను ప్రబోదించేప్పుడు నిర్వికారంగా, అప్పుడప్పుడూ చిలిపిగా మనల్ని పలకరించే గొంతు. ఆ గొంతునుండీ వచ్చిన మాటలు “రెండు సంవత్సరాల సంధి కాలాన్ని కలిసి గడుపుదాం వీలయితే రండి” అంతే అంతవరకు నన్ను నేను ఎలా ఆపుకున్నానో తెలియదు. మరుక్షణంలో బయలుదేరేసా. పండితులకి,యోగులకి మాత్రమే అలా అన్యులను అమాంతం గొంతుతో శాసించి పాదాక్రాంతం చేసుకునే శక్తి ఉంటుంది. మరి ఆయన ఓ పండితుడు యోగి రెండూనూ. అయనే భరణి. తెలుగు లోగిళ్ళలో మనందరి తోటరాముడు.

శ్రీ భరణి

శ్రీ భరణి

మొత్తానికి వీలయినంత వేగంతో ఆయన ఇంటికి చేరుకున్నాను. ఇంటిలో అడుగుపెట్టేముందే మనసులో ఉత్కంటతోనో లేదా ఆయనని కలుస్తున్నానన్న ఆనందంలోనో తెలియదు కానీ కాస్త అలజడి. కానీ ఎదురుగా ఇంటిలోకి ఆహ్వానిస్తున్న చిత్రపటం చూడగానే అలజడి పోయి మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది. బాణాసురుని వంటి అసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఇంటికి కాపలా కాసాడని విన్నాను. కానీ భరణిగారింట ఆయన అభిమానానికి మెచ్చి, తరలి వచ్చి అతిధులను ఆహ్వానించే పని తీసుకున్నది నిలువెత్తు చిత్రపటంలో చిరునవ్వుతో ఒదిగిన మహానటి సావిత్రి. శివుని వెంట నంది ఉండాలిగా మరి అని నవ్వుకుంటూ వెళ్తున్నంతలో మరో చిత్రపటంలో నవ్వుల నెలరాజు రేలంగి. ఆయన ఏడ్చినా జనం మాత్రం నవ్వుతారట. తెలుగుజాతికి దేవుడిచ్చిన గొప్పవరాలు వీరిద్దరు. ఆ మహానటులను స్మరిస్తూ లోపలకి అడుగుపెట్టాం.

లోపలకి అడుగు పెట్టగానే వైకుంఠంలో పరమశివుడు కొలువు తీరినట్టుగా ఒక సాహిత్యగోష్ఠి. గరళకంఠునిలా ఆయన సభ మధ్యలో కూర్చుంటే చెరో పక్క వేణుగారు, వీణాపాణిగారు కూర్చున్నారు. వాళ్ళని పరిచయం చేస్తూ నా శంఖుచక్రాలు అని చెప్పారు. వేణుగారు వెంటనే శివునిచేతి శంఖుచక్రాలం అని చమత్కరించారు. ఇక ఆయన చుట్టూ ప్రమదగణాల్లా మేము కూర్చున్నాం. కాసేపు ముచ్చట్లు సాగాయి. ముచ్చట్లను ముగిస్తూ భరణిగారు తను వ్రాసిన పరికిణీ కవితను వేణుగారి కంజీర సహాయంతో రాగయుక్తంగా మొదలుపెట్టారు.

“దండెంమీద

ఇంద్రధనస్సుని

పిండి ఆరేసినట్టుంటుంది”

ఆ పదాలవెంట పరిగెడుతూ భావాల్ని గమనించటం మరిచిపోయాం, అయ్యో అనుకుంటూ భావాల్ని ఏరుకోవటానికి వెనక్కి వస్తే పదాల్లో గమ్మత్తుని అందుకోలేకపోతున్నాం. అటూఇటూ పరిగెడుతూ అలసిపోయి చివరికి వేరే దారిలేక వన్స్‌మోర్ అన్నాము. ఇప్పుడు పరికిణీ పుస్తకం పెట్టుకుని చదువుకుంటూ మరలా గుర్తు చేసుకుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది.

“కుర్రకారు గుండెల్ని

‘పిండి’ వడియాలు పెట్టేసిన

జాణ – ఓణీ!!

ఓణీ… పరికిణీ…

తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసాలంకారాలు

అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి…

ఓణీయే ఓంకారం!!

పరికిణీయే పరమార్ధం!!”

ఆ పదాల్లో ఒక చిలిపితనం, చిన్న చిన్న పదాల్లో ఒదిగిపోయే భావుకత ఎవ్వరికో తప్ప సాధ్యం కాదు సుమా! కవితల్లో కేవలం ఆ చిలిపితనానికే దాసోహమయిపోయారా అని మీరు గయ్యమనిలేస్తారేమో? అయితే కన్యాకుమారి మీకు వినిపించాల్సిందే.

“ఎక్కడ పెళ్ళి భజంత్రీలు మోగినా

గుండెలో ముగ్గేసినట్టుంటుంది

ఎసట్లో పోసే బియ్యం తలంబ్రాలు అవుతాయి

ఓణీ మాటి మాటికి జారుతుంది

ఎవరన్నా చూస్తారేమో అన్న భయం

చూస్తే బావుణ్ణు అన్న కోరికా!”

సాదారణంగా ఇలాంటి కవితలో కవి కన్నెపిల్లలో పరకాయప్రవేశం చేస్తాడు ఇక్కడ గమ్మత్తుగా భరణిగారు వింటున్న మాకు కూడా పరకాయప్రవేశ మంత్రం ఉపదేశించారు.

“అమ్మాయికేం

చదువుల్లో సరస్వతి

పనిపాటల్లో పార్వతీదేవి

లక్ష్మీకళే బొత్తిగా లేదు!

సర్లెండి వెళ్ళి ఉత్తరం రాస్తాం!

సూర్యుడు ముప్పైసార్లు అస్తమిస్తాడు

చంద్రుడికి రెండుసార్లు పక్షవాతం వొస్తుంది!

ఉత్తరం మాత్రం రాదు!

ఎన్నిసార్లు తలొంచుకున్నా

ఉత్తరాలు రావు!”

భావుకతకి దాసోహమంటూనే భావం ఒంటబట్టి కరిగిన మంచుముద్దల్లా అయిపోయమంతా. ముగింపు వినలేదుగా ఇంకా మీరు కళ్ళ చివర ఆగిపోయిన నీళ్ళు మెత్తగా జారిపోయే ముగింపు.

“ఎక్కడ మంగళ వాయిద్యం

వినిపించినా

గుండెల్లో నిప్పులు పోసినట్టుంటుంది!”

తన ఊహా ప్రపంచంలో పుష్పకవిమానం మీద విహరింపచేసినట్టే చేసి చివరికి వాస్తవజీవిత సత్యాల్లో అమాంతం పడేసారు. మధ్యతరగతి మిధ్యా ప్రపంచాన్ని చాపచుట్టి 30-ఫస్ట్‌నైట్ అంటారు.

“రేపన్నా ‘క్రికెట్’ బాట్ కొంటారా డాడీ – పుత్రుడు

క్రికెట్ లేజీగేమ్.. కబడ్డీ ఆడూ వెధవా..

కండలైనా వొస్తాయ్!!

పండక్కి జడగంటలు కొంటానన్నారు – నాన్నారూ – అమ్మడు

గంటలకన్నా బ్యాండు సౌండెక్కువ!

రబ్బరు బ్యాండ్లు కొనుక్కోతల్లీ!

… … …

… … …

… … …

ఆ… రాత్రి… నులక మంచం మీద!

రెండు మూరల మల్లెపూలెందుకండీ!!

ఏ పాలకూరో – కొత్తిమీరో వచ్చేది గద!..?

యాడాదికి ఓ పూటైనా మొగుణ్ణి

అనిపించుకుందావనీ!

ఈ కవితలు చదివేప్పుడు వచ్చే భావానికంటే ఆర్ధ్రత నిండిన ఆయన గొంతులో విన్నఫ్ఫుడు కలిగే భావావేశం చాలా ఎక్కువ. మరి అది ఆ గొంతుకి దేవుడిచ్చిన వరమో లేదా జీవితాన్ని చదివిన అనుభవ సారమో? వాస్తవాన్ని జీర్ణించుకున్న జీవితానికి నిర్వికారం సాదారణమే కదా! నిర్వికారం తలకెక్కాలంటే భోదించే గురువు కావాలి. భోదించే తత్వం నాలాంటి ఆమ్ జనతా (మేంగో మేన్) కి అర్ధమయ్యే సరళ భాషలో ఉండాలి. నిర్వికార రూపుడైన శివుని గురించి చెప్పేందుకు అలా ఏమైనా ఉందా? ఈ విషయంలో విష్ణువు తెలివైనవాడు. తన తత్వసారాన్నంతా భగవద్గీతగా తానే చెప్పేసుకుని మన ఘంటసాల మాష్టారి చేత పాడించేసుకున్నాడు. మాష్టారి గొంతు మహిమో లేక సహజంగానే విష్ణుమూర్తి కున్న చరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగో కానీ ఊరూర గీత మారుమోగిపోతుంది. చిన్నబుచ్చుకున్న శివుడు ఏ కళనో ఉన్న భరణిగారిని గిచ్చి ఊరుకున్నాడు. ఉప్పొంగిన భావావేశం నుండి పదాలు జారుకుంటూ వచ్చి జలపాతంలా మా మీద వచ్చి పడ్డాయి. అవే శివతత్వాలు. శివకేశవుల భిన్నత్వాన్నో ఏకత్వాన్నో ద్వైతాన్నో అద్వైతాన్నో ఆటలా చెప్పేసారు.

ఆటగదరా శివా!

ఆటగద కేశవా!

ఆటగదరా !

నీకు అమ్మతోడు!!

ఆటగద గణపతిని

తిరిగి బతికించేవు

కళ్ళుమూయుట

మొదటి ఆట నీకు.

ఆటగద జననాలు

ఆటగద మరణాలు

మద్యలో ప్రణయాలు

ఆటనీకు.

ఇలా చెప్పుకుంటూపోతే శివతత్వాల్లో మొత్తం పుస్తకంలో ఉన్నవన్నీ వ్రాయాలిక్కడ. పండితపామర భేధంలేకుండా అందరికీ అర్ధమయ్యి మనలో శివున్ని దర్శించేలా చేసే అద్భుతమైన తత్వాలు అక్కడితో శివుని పైన అధ్యయనం ఆగిపోలేదు.

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేల గలడు,

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేలగలడు,

కోరితే శోకమ్ము బాప గలడు.

… … …

… … …

… … …

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడగలడు.

నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడగలడు.

తెర దించి మూట కట్టెయ గలడు.

మేము మాత్రం ఇంకా తెరదించలేదు. తర్వాత వెంటనే ఎంతా మోసగాడివయ్యా శివా అంటు శివునితో చమత్కారమాడారు. బోయవానిభక్తిని పాటగట్టి వినిపించారు. ఆయన తన సాహిత్యంతో శివున్ని ఆడించారు, చమత్కరించారు, దెప్పిపొడిచారు, మొత్తానికి మెప్పించారు. ఇంతగొప్ప భక్తునికి ఆయన ఏ వరం ఇవ్వగలడు. అమ్మకిచ్చుండకపోతే అర్ధభాగాన్నిచ్చేవాడేమో? అయినా అర్ధభాగమివ్వకపోతేనేం? పరమేశ్వరుడు భరణిగారి ఆత్మలో కొలువై ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంపూర్ణీశ్వరుడే!

గతంలో కొందరు కమర్షియల్ కళాకారులకు మీరెందుకు మీ బ్లాగుల్లో అంత అందలమెక్కిస్తారు అని అడిగారు. ఇప్పుడు కూడా అడగాలనుకునేవారూ ఉంటారు. గ్రహణం,సిరా సినిమాలు చూసాక ఈయన బృతికోసమే తప్ప మతిలో కమర్షియల్ కాదని తెలిసిపోతుంది. అయినా అప్పుడే సినీ నటుడు భరణిని కలవటానికి వెళ్ళనన్న భావన మనస్సులో నుండి పూర్తిగా తొలగిపోయింది. ఒక కవిని చూసాను, అతిధిని గౌరవించే గృహస్థుని చూసాను. కవి పండి పండితుడైన వైనాన్ని చూసాను. చివరగా పండితుడు పరమేశ్వరుడైన అద్భుతాన్ని చూసాను.

తెలుగుబాట – ఆగష్టు 29న హైదరబాద్‌లో

తెలుగుబాట

తెలుగుబాట

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి… అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.


నా గూగుల్ బజ్‌లు-2

నేస్తమా.. నేస్తమా..

నేస్తమా.. నేస్తమా..

నేస్తమా!
ఎందుకలా దూరంగా నన్నొదిలి వెళ్ళి పోతావ్?
నీ వెంట నడవలేక కాదు గాని,
నీకది ఇష్టమో కాదో తెలియక
ఎం చేయాలో తోచక ఆగిపోయా.

ఓ క్షణం ఆగి చూస్తే
నీకూ నాకూ మధ్య యుగాల దూరం.
నీకూ నాకూ మధ్య మాటలు కరువయ్యి,
మనుషులు చొరబడ్డరు.

ఈ దూరాలు చెరిపే అయుధం నీ వద్దే ఉంది.
అందుకే నీ వైపే ఆశగా చూస్తున్నా.
ఒక్క అడుగు ఇటు నా వైపు వెయ్యు.
ఒక్క క్షణం గడువియ్యు.

అనుక్షణం నిరీక్షణం

అనుక్షణం నిరీక్షణం

నేస్తమా నువ్వెళ్ళిపోతావ్
నిన్న మనం సేదతీరిన చెట్టునే కాదు
నన్నుకూడా వదిలి.

నువ్వెళ్ళిపోతావ్
చిటారుకొమ్మన ఙ్ఞాపకాల ముడుపుకట్టి
సుడులు తిరిగే నా కన్నీళ్ళని జాలిగా చూస్తూ

నువ్వెళ్ళిపోతావ్
నేను మాత్రం ఉంటా చెట్టు నీడనే
పురుగులేరుకుతినే కోడిపుంజులా

సందెలు వాలిపోతాయి
నీడలు చీకట్లో కలిసిపోతాయి
ఎదురుచూస్తూ ఉంటా
ఎనాడైనా ఈ కొమ్మలపై మరలా వాలతావని.

నా గూగుల్ బజ్‌లు


మేఘాల పళ్ళెంలో పాల బువ్వ

మేఘాల పళ్ళెంలో పాల బువ్వ

వెన్నెల వెళ్ళిపోయింది
తెల్లగా చల్లగా నిన్నంతా వెలిగిన వెన్నెల
కలత నిద్రలో ఉండగా వెళ్ళిపోయింది

నల్లని చీకట్లో ఊరంతా మరకకట్టిన వెన్నెల
తన గుర్తులు చెరిపేసి
చెప్పకుండానే వెళ్ళిపోయింది

మేఘాల పళ్ళెంలో పాల బువ్వ కలిపినట్టు
నోరూరించిన తీపి వెన్నెల
ఎక్కడికో జారుకుంటూ వెళ్ళిపోయింది

అవునులే తనకివి చిలిపి దాగుడుమూతలు
నాకేమో చీకటి రాత్రులు
అమావాస్యకు తిరిగి అలవాటు పడాలేమో?

కన్నీటి ముత్యం

కన్నీటి ముత్యం

వజ్రం లా కిరీటం లో ఒదిగే కంటే,
పచ్చని పొలం లో మట్టి నవుతా.
నగల నయగారల లో బంగారాన్ని కాను,
కొలిమి లొ మంటనవుతా.
ఖరీదైన అందాల చిరునవ్వు కాను,
పసిపాప చెక్కిలి పై కన్నీటి చుక్కనవుతా.
గొప్పింటి పరమాన్నం కాదు,
పేదవాని ఆకలి తీర్చే గంజినవుతా.

నేనే

నేనే

తను ప్రేమతోనో అభిమానంతోనో చూస్తుందని,
మంచోడి వేషం వేసాను;
నిర్లక్ష్యంగా చూసింది.

ఈర్ష్యతోనైనా అసూయతోనైనా చిరాకుగానైనా నన్నే చూడాలని,
రాక్షసుడి అవతారం ఎత్తాను;
తను చూసింది రహస్యంగా..ప్రేమగా..

వెలుగు - చీకటి

వెలుగు - చీకటి

తెల్లని కాగితాన్ని నాశనం చేసే
నలుపు సిరా ఉంది.

తెల్లని వెలుగును మింగేసే
నల్లని చీకటి ఉంది.

తెల్లని నిజాన్ని దాచేసే
నల్లని అఙ్ఞానపు ముసుగులున్నాయి.

దేవుడా! ఈ నలుపును జయించే
తెల్లని ఓ చిరునవ్వు నాకివ్వు.

సరికొత్తచీర ఊహించినాను..

త్రేతాయుగంలోనిదో,ద్వాపరంలోనిదో ఈ కధ. రాముడో,కృష్ణుడో గోళీలు ఆడుకుంటూ ఉండిఉండొచ్చు. ఆ కాలంలో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఇంటి నిండా డబ్బు, ఇంటిలో ఉన్నవారి వంటి నిండా బంగారం. గారంగా పెరుగుతున్న ఒక్కగానొక్క కూతురు. చంద్రుడే వచ్చి ఆమె చెక్కిళ్ళలో తన నీడని చూసి మురిసిపోయేంత అందం.

ఆమె అందం ఆనోట ఈనోట పాకి దేశదేశాల రాజులే ఆమెను పెళ్ళి చేసుకోవటానికి పోటీపడేవారు. అదే ఊరిలో ఉంటున్న ఒక పేదరైతు కొడుకు కూడా ఆమె అందం గురించి విని తనని ప్రేమించాడు. కేవలం తాను విన్న గుర్తులను బట్టి ఒక చిత్రం గీసి రోజూ దానిని చూస్తూ గడిపేవాడు. ఆమె తండ్రి ఈ పెళ్ళికొడుకుల తాకిడి తట్టుకోలేక స్వయంవరం ప్రకటించాడు. తన కూతురికి అత్యంత విలువైన బహుమానం తెచ్చినవాడికి తన కూతురినిచ్చి వివాహం చేస్తా అని ప్రకటించాడు. రాజులంతా మేనాలతో, ఏనుగులతో, ఒంటెలతో బహుమానాలు మోసుకొచ్చారు. పేదరైతు కొడుకు ఏంచెయ్యాలో పాలుపోక గుడికి వెళ్ళి లక్ష్మిదేవిని పూజించి వేడుకున్నాడు. దేవి వచ్చి అంతవిలువకానిది ఒక పొడవైన వస్త్రం ఇచ్చింది. ఆమెని తన నగలన్నీ తీసి ఈ వస్త్రం వేసుకోమని చెప్పు అని దేవి మాయమైంది. 

రైతుకొడుకు స్వయంవరం కి వెళ్ళాడు. రాజుల బహుమానాలన్నీ ఆమె తృణీకరించింది. చివరగా రైతు కొడుకు ఇబ్బంది పడుతూ దేవి ఇచ్చిన వస్త్రాన్ని, దానిని ఎలా ధరించాలో ఒక చిత్రాన్ని ఆమెకిచ్చాడు. వింతగా ఉందే అనుకుని ఆమె తన నగలన్నీ తీసి ఆ వస్త్రాన్ని రైతుకొడుకు చెప్పిన విదంగా ధరించి అద్దం ముందు నిలబడింది. ఆశ్చర్యం!! నగల వెలుగుల్లో ఇన్నాళ్ళూ గుర్తింపు నోచుకోని ఆమె ముఖ సౌందర్యం, మేని ఛాయ స్పష్టంగా కనిపించాయి. ఆమె తన సౌందర్యానికి తానే ముగ్దురాలయ్యింది. ఆమె తండ్రి కూడా తన కూతురి సహజ సౌందర్యాన్ని తెలియచెప్పిన రైతుకొడుకుకి ఆమె నిచ్చి వివాహం చేసాడు. వారు పది కాలలపాటు హాయిగా జీవించారు.ఆ రోజు దేవి ఇచ్చిన ఆ ఆరుగజాల వస్త్రమే స్త్రీలంతా ఇష్టపడే చీరయ్యింది. 

జెస్సీ చీరకట్టు చూసి ఊగిపోతున్న యువతను చూసి చీరలో ఏముందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే కలిగిన ఊహలతో అల్లుకున్న టపా ఇది.

ఆమ్మ చీరలో ఊయలూగిన పసితనం

అమ్మ చెంగుతో నడక నేర్చుకున్న బాల్యం

అమ్మ చీర చించి కట్టు కట్టిన గాయం

మధ్య తరగతి మగువలే కాదు, మధ్యతరగతి జీవితాలన్నీ తమని తాము చీరలో చుట్టేసుకున్నాయి. గొప్పవారింట పోతపోసిన బంగారాలు, మణులు, మాణిక్యాలు, సుగంధాలు ఇన్ని కావాలి అందాన్నివ్వటానికి. ఇన్ని కలిపి వంటింటిలో పనుల మధ్య అల్లిబిల్లిగా అల్లుకున్న ముతకచీర అందాన్ని తేగలవా? మధ్యతరగతి సామ్రాజ్యాల్లో మహరాణులకు మకుటాల్లేవు కానీ మెరిసిపోయే చీరలున్నాయి. మరి మగమహారాజులకయితే అలిగిన దేవేరికి ఇవ్వటానికి అగ్రహారాల్లేవు కానీ బోనస్ జీతంతో ఓ కొత్త చీర దొరుకుతుందిగా. చీర అనగానే ఆడవాళ్ళ కళ్ళలో మెరుపులు, ఊహల్లో అంగడిలో రాశులుగా పోసిన చీరలు, మగాళ్ళకు మాత్రం బడ్జెట్టు, కరువు భత్యం. ఎంత ఖర్చయినా మన కుచేలమహరాజులంగారు మాట్లాడలేరు “నేను కొత్త చీర కట్టుకుని అందంగా ఉండేది మీ కోసం కాదూ!” అనే ముద్దుమాటలకి “కాదూ” అని చెప్పగలిగే ధీశాలి భూమ్మీద ఇంతవరకు పుట్టలేదు. 

చీర ముత్తాతలనాటి ముక్కిపోయిన సంప్రదాయం కాదు అది మన సంపద. కొన్ని సంపదల విలువ కాలం గడిచిన కొద్దీ పెరుగుతునే ఉంటుంది. మన జీవితాల్లో భందాలు అనుభందాలు చీరతో పెనవేసుకుపోయాయి. మగ్గాలలో పుట్టి మన ముంగిళ్ళలో మెట్టిన చీరని కేవలం ఒక చిన్న వస్తువుగా మాత్రం తీసిపారేయలేం. పట్టు చీర, సిల్కు చీర, కాటన్ చీర అని ఎంతమంది చెప్పుకుంటారో నాకు తెలియదుగానీ అన్నయ్య పెట్టిన చీర, మరదలి పెళ్ళికి పెట్టిన చీర, పెళ్ళిరోజుకి శ్రీవారు కొన్నచీర అని గుర్తుపెట్టుకునేవాళ్ళే అందరూ. అందుకే చీర ఒక వస్తువు కాదు మధుర ఙ్ఞాపకం. అమ్మ పెళ్ళికి కట్టుకున్న చీర నాకు కావాలి, గుడిలో అమ్మవారి చీర కావాల్ని పోటిపడే అడపిల్లలు ఎందరో. అందుకే చీర ఒక వస్తువు కాదు ఒక ఆశీర్వాదం. 

మన ఇంటి మహాలక్ష్మికి పెళ్ళిలో ఎన్ని నగలుకొన్నా మనం పెట్టిన పట్టుచీరే అన్నింటికంటే గొప్పది.అత్తవారింట అడుగుపెట్టే కొత్త పెళ్ళికూతురికిచ్చే ముచ్చటైన కానుక చీరే. అత్తమనసు, కోడలి కొత్త కాపురం ఆ చీరతోనే తెలిసిపోతుంది. అన్నయ్యలు అభిమానంగా నిజానికి ఆలికి కూడా తెలియకుండా చెల్లెలికి మురిపెంగా ఇచ్చే బహుమతి చీర. చీర ధర ఇంట్లో తగ్గించి చెప్పే అన్నయ్యలు తెలుసు మరి నాకు. మన ఇంటి శుభాలకి ముత్తైదువులకిచ్చే కానుక చీర. చీర ఒక చిన్న వస్తువు కాదు మన ఇంటి సంప్రదాయం, గౌరవం.

 అమ్మ కొంగుపట్టుకు తిరిగే పసితనం పోయి అమ్మాయి కొంగు పట్టుకోవాలని ఆరాటపడే కొంటెతనం లో అబ్బాయిలకి చీర ఊహల్లో రెపరెపలాడే ఒక ఇంధ్రధనస్సు. చుడీదార్లు, పట్టు పరికిణీలే కాకుండా అడపదడపా చీరకట్టులో మెరిసిపోయే కన్నెపిల్లలకి చీర ఒక మంత్రదండం. ఎంత మాయగాడైనా ఆ మాయలో పడకుండా ఉండలేడు. తన ప్రేయసి మొదటిసారిగా చీర కట్టుకుని ఏ గుడికో వెళ్ళింది అని తెలిసిన వెంటనే ఆత్రంగా,ఆశగా పరిగెట్టుకుని వెళ్ళి పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపులో పెట్టుకుంటూ చూసే నూనూగు మీసాల కుర్రాడ్నే అడగాలి చీరలోని అందం. “సరికొత్త చీర ఊహించినాను.. సరదాల సరిగంచు నేయించినాను” అయినా చూస్తే చీరంతే ఉంటుందిగానీ చెప్పుకుంటూ పోతే ఊరంతవుతుంది. 

కావ్యాలు వ్రాయటానికి కవితలల్లటానికి కవులే కానక్కర్లేదు, మనసైన మగువ చీరచెంగు చెప్పే మౌనసందేశాలు తెలుసుకునే తెలివి ఉంటే చాలు. నడుమొంపున చేరిన చెంగు, చెదిరిన చీర పనిలో తల మునకలయినా అందాన్ని చెబితే, పెద్ద పట్టు అంచుతో నిలువెల్లా మెరిసిపోతున్న పట్టు చీర దర్పాన్ని చెబుతుంది. అలసి ఇంటికొచ్చిన శ్రీవారి ముఖాన్ని తుడిచే వేల ప్రేమని చెప్పే అదే చీర చెంగు, అల్లరివేళ గాలిలో గిరికీలు కొడుతూ ఊరిస్తుంది. సిగ్గుపడుతుండగా చూపుడువేలుకి చుట్టుకుపోతూ ప్రేయసి అందాన్ని చూపించే అదే చీరచెంగు, నడుమొంపునుండి తీసి విసిరి కొట్టి విసవిసా నడిచి వెళ్ళిపోతుంటే సునామీ హెచ్చరికే.ఈ చివరిది ఇంట్లో రామయ్యలకి నిత్య పేరంటం, పెళ్ళి కలలు కంటున్న బ్రహ్మచారులకు ముందున్న ముచ్చట్ల (ముసళ్ళ?) పండగ. అసలు మనసైన ప్రేయసి చీర కట్టులో వైభవం చెప్పాలంటే, నడకలో వయ్యారానికి అటూ ఇటూ ఊగే చీర కొంగులో మనసు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇది చాలదన్నట్టు గాజుల గలగలలు, జడగంటలు, మువ్వలు పక్కవాయిద్యాలుగా చేరి అబ్బాయిల మనసులు దోచి కళ్ళని తరింపజేస్తాయి.

చీరలోన దిగివచ్చిన కాంతలకోసం కావ్యాలు వ్రాయలేమేమో గానీ,

కళ్ళలో మీరు రచించిన దృశ్యకావ్యాలు పదిలంగా దాచుకుంటాం. 

ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే మా మమ్మీ నాకు అర్జెంటుగా పెళ్ళి చేసేస్తుందనే భయంతో ఇక్కడికి ముగిస్తున్నా….

నా ప్రియ నేస్తం

An intimate friend

An intimate friend

ప్రియ నేస్తమా!

ఎన్ని జన్మల అనుభంధమో కదా మనది. ప్రతి జన్మలో పుట్టిన మరుక్షణంలోనే నేస్తమై, కడ దాకా నాతోనే ఉన్నావుగా. అలసట లేని అనుభంధం మనది. నువ్వు అవసరమైన ప్రతిసారీ అడగకుండానే వస్తావ్ నా వెంటే ఉంటావ్. ఇన్ని చేసిన నీకు నేను ఏ రోజు ఏమీ చెయ్యలేకపోయాను.

చిన్నప్పటి నుండి ఆకలేసినప్పుడు, ఆటల్లో ఓడినప్పుడు, నాన్న తిట్టినప్పుడు, టీచర్ కొట్టినప్పుడు ప్రతీ క్షణం నాతోనే ఉన్నావ్.

చేరువైన నేస్తం ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే నువ్వే,

ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు నువ్వే,

ఆప్తుడ్ని కోల్పోయినప్పుడూ నువ్వే,

ఏకాంతంలో కూడా ఓదార్పుగా నువ్వే,

అంతులేని అనందంలోనూ నువ్వే,

నువ్వు లేని ఏ క్షణం నా ఙ్ఞాపకాల్లో లేవు.

నాతో నా జీవితంతో ఇంతగా అల్లుకుపోయిన నిన్ను అంతా కన్నీరనే పిలుస్తారు. నిజానికి నువ్వు పన్నీరువేనేమో!

అంతులేని భాధ నన్ను అల్లుకుని, ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో అనిపించినప్పుడు, ఎంత త్యాగం చేస్తావ్ నువ్వు. నా కంటి నుండి కాదు కాదు, నీ ఇంటి నుండి జారి ఆవిరై నీ ఉనికిని కోల్పోయి నా భాదని కరిగిస్తావ్. ఆవేదనలో దారి కనబడని అయోమయంలో కంటిని కడిగేసి ఓ దారిని చూపిస్తావ్. నువ్వే లేకపోతే నా హృదయం ఈ భాదల్ని తట్టుకోలేక ఏనాడో పగిలిపోయేది కదా!

అంతులేని అనందంలో మాటలు కరువైనప్పుడు మాటల కందని భావాల్ని మోసుకుని జారిపోతావ్. నేను కొత్త పాఠం నేర్చుకున్న నీ స్నేహంలో. కన్నీరంటే రెండు చుక్కల ఉప్పని నీరు కాదు. కన్నీరు ఒక ఎక్స్‌ప్రెషన్, ఒక భాష, ఒక కమ్యూనికేషన్ చానెల్. అందరూ అంటారు అంతులేని ఆనందాన్ని, ప్రేమని, భాదని చెప్పగలిగే భాష లేదు భూమి పైన అని. కానీ ఉంది ఎంత సంక్లిష్టమైన భావాన్నయినా చెప్పగలిగే భాష కన్నీరు. నీ గురించి వ్రాస్తున్న ఈ క్షణంలో కూడా కళ్లలో నువ్వే. ఎందుకంటే కన్నీరంటే ఏంటొ చెప్పటానికి నేను నేర్చుకున్న తెలుగు భాష సరిపోవటం లేదు. అందుకే మరలా కన్నీటి భాషే నా ఎక్స్‌ప్రెషన్.

నన్ను నేను నీతోనే కొలుచుకుంటాను తెలుసా? ఎక్కడో చదివా. నీ వలన ఇతరుల కళ్ళల్లో కన్నీటితో నీ పతనాన్ని, నీ కోసం నీ వాళ్ళ కళ్ళలో కన్నీటితో నీ విజయాన్ని కొలుచుకో అని.

అయినా నువ్వు నాకే కాదు అమ్మని, అక్కని, నా స్నేహితుల్ని అందర్ని ఆదుకుంటావ్, అందరితోనూ ఉంటావ్. నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్. కాదులే యూనివర్సల్ ఫ్రెండ్.ఇంత మేలు చేసినా నిన్ను ఎవ్వరికీ కనబడనివ్వరు ఎవరూ. కాస్త అహం దెబ్బతింటుందని. నువ్వు కావలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే వాళ్ళంతా నువ్వు భాదల్లో ఉన్నప్పుడు వస్తావను కుంటారే గాని, భాదని పంచుకోవటానికి, నీతో మోసుకుపోవటానికి వచ్చావని అర్ధం చేసుకోరు. సారీ దోస్త్.

ఈ జన్మలో కూడా కడ దాక నా తోడై ఉంటావు కదూ?

పూర్తిగా మన అనుభందం వ్రాయలేకపోయిన భాదలో కన్నీళ్ళతో

నీ మితృడు

మురళీ.

నేను, నా ప్రయాణం..

నాలో ఉన్న నీకై అన్వేషణ..

నాలో ఉన్న నీకై అన్వేషణ..

ఆకాశం వైపే నిశ్చలంగా చూస్తున్నా
ఆశతో కాదు
ఆవేదనతో.

కాలంతో సమాంతరంగా పరిగెడుతూనే ఉన్నా
జీవితాన్నో, ప్రపంచాన్నో
ఇంకాదేన్నో తెలుసుకోవాలని.

తీరం తెలియని ప్రయాణం
అలసట తీరని మజిలీలు
దప్పికతో దహించుకుపోయా.

కనుచూపుమేరా సాంద్రంగా పేరుకున్న ఇసుక
అయినా ఆగలేని నిస్సాహయత
సాగలేని నిరాసక్తత.

ఇంకెన్ని అవంతరాలు అవరోదాలు
చాలు భగవాన్ ఈ పరీక్షలు
ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్?

ఐ హేట్ యు రా

 ద్వేషించే శక్తి నాకివ్వు భగవాన్!!

ద్వేషించే శక్తి నాకివ్వు భగవాన్!!

ప్రియమైన నీకు,

ఇప్పుడిలా పిలవటం నీకు నచ్చదేమో? కానీ అప్రియమైన అనేంత సంస్కారం నాకులేదుగా. అయినా ఇదేగా చివరిసారి నేను పిలవటానికైనా, నువ్వు వినటానికైనా. నీకొక విషయం చెప్పాలి. కానీ ఎదుటపడి చెప్పే దైర్యంలేక ఇలా వ్రాస్తున్నా.కొన్ని భావాలు దాచుకోలేనివి.నీకు వినే ఆసక్తి లేదని తెలుసు కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నా.నిన్ను ఇబ్బందిపెట్టే ఇలాంటి పని చెయ్యకూడదు అనుకున్నా కానీ చేయకుండా ఉండలేకపోతున్నా.

“ఐ హేట్ యు రా!” అవును మనస్పూర్తిగా చెబుతున్నా.

ప్రపంచంలో ఎక్కడున్నా నా నోటి వెంట ఈ మాట ఏదో ఒకరోజు వింటే చాలన్నావుగా. నిన్ను ద్వేషిస్తూ అయినా నేను ఆనందంగా ఉండటమే కావలన్నావుగా. అందుకేనేమో ఇప్పుడు నిన్ను ద్వేషించటంలో ఆనందం పొందుతున్నా. ఆమాత్రానికి ఉత్తరం అవసరమా అనకు. ప్రేమయినా,ద్వేషమయినా నా మనసులో కలిగిన అనుభూతులే. ప్రేమించినప్పుడు ఎంత అందంగా చెప్పానో ద్వేషించినప్పుడు అంతే బలంగా చెప్పాలిగా. అయినా చెప్పకపోతే నీకుమాత్రం తెలిసేదెలా? ఎంత నువ్వే కాదనుకుని వెళ్ళినా ” ఐ హేట్ యు” అంటే మనసులో కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా! అయినా వదిలివెళ్ళిపోయేప్పుడు మనుషులు రాక్షసుల్లా ఉండాలంటావుగా, అలానే ఉండి ఉంటావులే. అందుకే ఈ మాట పెద్దగా నీకు ఇబ్బంది పెట్టదు.

హమ్మయ్య మనసులో మాట చెప్పేసాగా ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. ఎప్పటికయినా నేను ఇలా ఆనందంగా ఉండాలని మనసులో కోరుకుంటున్నా అన్నావుగా. దేవుడు నీ మాట విన్నాడేమో. నా గురించి ఇంతలా ఆలోచించే నీకు ఏమి చెప్పాలి. థాంక్యూ. అయినా నీ పిచ్చిగానీ ద్వేషించకుండా ఎలా ఉండగలను?

అభిమానంతో చాచిన చేతులు అఘాదంలోకి తోసేసావు

భావలను మోసుకొచ్చిన లేఖల్ని చింపి గాలిపటాలుగా ఎగరేసావు

పంచుకుని పెంచుకున్న కలల్ని కలలే అని తేల్చేసావు

కింద పడి ముక్కలుగా మిగిలిన బహుమానాలు, గాజు బొమ్మలు ఇంకా ఎవేవో

మధ్యలో ఎక్కడో నా మనస్సు కూడా

అయినా ఎదురుగా ఉన్న మనిషినే కాదనుకున్నాక, కనబడని మనసుకు మాత్రం విలువిస్తావా? రాజులకు వేట నీకు ఈ ఆట వినోదమనుకుంటా.

గుండెలవిసేల భాదతో నేలమీద కొట్టుకుంటున్న ప్రాణం నాది కాదు అన్నప్పుడు ఆమాత్రం వినోదముంటుందిలే. అయినా ఇన్నిమాటలెందుకులే అందలేదన్న దుగ్దతో చేసిన ఆరోపణలకు లోకం ఏమాత్రం విలువిస్తుందో నాకు తెలుసు. ఒక్కమాట చెప్పటం మరిచాను,నేను కూడా నిన్ను ద్వేషించనా అని అడుగుతావేమో? ఆ హక్కు నీకు లేదు. ఎవరినయినా ప్రేమించటానికి,అభిమానించటానికి హక్కుందే గానీ, ద్వేషించటానికి లేదు. అంతః శుద్దిగా ప్రేమించినవారికి మాత్రమే కోపాన్ని గాని, ద్వేషాన్ని గాని చూపించే హక్కు ఉంటుంది. దేవుడికి, అమ్మకి, ఓ ప్రేమికుడికి.

నాకు తెలుసు నువ్విప్పుడు నవ్వుకుంటావ్

నన్ను నువ్వు గెలిచావనో?

నేను నిన్ను గెలవలేదనో?

ఇద్దరుగా మొదలయిన ప్రయాణంలో నువ్వు మాత్రం ఒడ్డుకు చేరుకున్నావన్న సంతోషంతో

తప్పయినా సరే తప్పక చేస్తున్నా అని చెప్పి, తప్పించుకున్న ఆనందంతో

నాకై నేనే పేర్చుకున్న చితిలో తగలబడిపోతున్న నా వెర్రితనాన్ని చూసి

నవ్వుకుంటావ్ నవ్వుకుంటావ్ నేనెవరో మర్చిపోతావ్.

ఒకర్ని భాదపెడుతున్నాం అనే స్పృహలేకుండా నవ్వటం కూడా ఒక వరమే కాదా.

ఆ నవ్వుని జయించలేనేమో అని భయంవేసింది, భాదనిపించింది.

ముఖం చాటేసి తప్పుకుతిరిగా

అనందాన్నిచ్చే ప్రతిది ఆశ్రయించా

అప్పుడూ కూడా అదే నవ్వు

నన్ను నేనే ఈ లోకం నుండి వెలివేసుకున్నా

ఒంటరి తనాన్ని కావలించుకుని చీకట్లో పడుకున్నా

అక్కడ కూడా అదే నవ్వు. కలలో కూడా అదే నవ్వు.

ఆ నవ్వే మెల్ల మెల్లగా నన్ను కమ్మేసింది

ఆ నవ్వే నాలో ఆవేశాన్నో కసినో పెంచింది

చివరకి అదే నిన్ను ద్వేషించేలా చేసింది.

కానీ ఇప్పుడు నన్ను నిర్వీర్యం చేయలేకపోయిన నీ నవ్వుని చూసి నేను నవ్వుకుంటున్నా. మానసికంగా బలంగా మారుతున్న ప్రతి నిమిషం నవ్వుకుంటున్నా

నాలో ఆత్మవిశ్వాసం పెరిగేంతలా,

నాలో పరిణతి కలిగేంతలా,

నన్ను నేను తిరిగి కనుగొంటూ నవ్వుకుంటున్నా.

ఇప్పుడు మరలా నేను నేనయ్యాను.

హమ్మయ్య నన్ను నేను ఎవరికీ కోల్పో లేదు.

ఇప్పుడు మరింత గర్వంగా,నమ్మకంగా,బలంగా చెబుతున్నా “ఐ హేట్ యు అండ్ ఐ మీన్ ఇట్”

నీకు అప్రియమైన

నేను.

నువ్వు నేను ఓ ప్రేమ కాని ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ

నువ్వేంటో నాకు ఎప్పుడూ అర్ధం కావు
నేను నీకు కూడా.

అవునంటావ్ కాదంటావ్.
నువ్వు అవునన్నా నాకు అనుమానం
కాదంటే ఆవేదన.

నేను నిన్ను నమ్ముతాను కానీ కొన్నిసార్లే.
నిలదీస్తే వదిలేస్తావేమో అని భయంతో నమ్మకం
నిజమా కాదా అనే అనుమానం.

నువ్వు సీతాకోకచిలుకనంటావ్
గువ్వనంటావ్
పావురాయినంటావ్.
నేను మాత్రం నీటిలో కొంగని
ఒంటికాలి పై నిలబడి
దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ.

అడక్కుండానే మనసులోకి చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?

నీకు నేను కావాలి
కానీ నాతో ఉండవు.
నువ్వులేకపోయినా నేను ఉండగలను
కానీ వదలలేను.